పెళ్లి పిలుపు – 13 by S Sridevi

  1. పెళ్లి పిలుపు – 1 by S Sridevi
  2. పెళ్లి పిలుపు – 2 by S Sridevi
  3. పెళ్లి పిలుపు – 3 by S Sridevi
  4. పెళ్లి పిలుపు – 4 by S Sridevi
  5. పెళ్లి పిలుపు – 5 by S Sridevi
  6. పెళ్లి పిలుపు – 6 by S Sridevi
  7. పెళ్లి పిలుపు – 7 by S Sridevi
  8. పెళ్లి పిలుపు – 8 by S Sridevi
  9. పెళ్లి పిలుపు – 9 by S Sridevi
  10. పెళ్లి పిలుపు – 10 by S Sridevi
  11. పెళ్లి పిలుపు – 11 by S Sridevi
  12. పెళ్లి పిలుపు – 12 by S Sridevi
  13. పెళ్లి పిలుపు – 13 by S Sridevi
  14. పెళ్లి పిలుపు 14 by S Sridevi“
  15. పెళ్లి పిలుపు – 15 by S Sridevi

చాలా విషాదకరమైన విషయం ఏమంటే “మగవారికి ఏం కావాలో ఆడవాళ్ళే చూసుకుంటారు. పిల్లల్ని కని పెంచి సమాజానికి అందిస్తారు. వాళ్లకేం కావాలో ఇవ్వాలని ఎవరూ అనుకోరు. నీకేం తక్కువ చేసాను అని నిలదీస్తారుగానీ నీకేం కావాలని అడగరు. తమకి నచ్చి, తమకి వుపయోగపడేదే వారికి ఇస్తారు. ఈ పెళ్లి వద్దనిగానీ, ఈ భర్తని భరించలేననిగానీ ఆమె చెప్తే వినరు. అలాంటప్పుడు మనం పోరాడి సాధించుకోవడంలో తప్పు లేదు. మనది స్వార్థమననీ, అనైతికమననీ… ఈవేళ నాకు నువ్వెందుకో మరీమరీ నచ్చుతున్నావు” అని,
“తలుపు తీయచ్చును ఇంక” చెప్పింది.
సంయుక్త వెళ్లి తలుపులు బార్లా తెరిచింది. అంతా గది అవతలే వున్నారు. ఆవిడ పెద్దకోడలుకూడా వచ్చింది.
“ఏమిటండీ, అత్తయ్యగారూ! అంతసేపు మాట్లాడేసారు? మీ ఓపికకూడా చూసుకోవద్దా?” అడిగింది నిర్మల తల్లి కాత్యాయని. ఒకళ్ళు మంచినీళ్ళు ఇచ్చారు, ఇంకొకరు వేడిగా కాఫీ పట్టుకొచ్చారు. తననేమైనా తప్పు పడతారేమోనని బెరుగ్గా పక్కకి నిలబడింది సంయుక్త.
“అంతసేపు ఏం మాట్లాడుకున్నారు నానమ్మా? సంయుక్తైతే ఏమీ మాట్లాడదు. నీచేతే మాట్లాడించి వుంటుంది. అందుకే కంగారుపడుతున్నాం ” అన్నాడు శ్రీధర్. అతని ముఖంలో అల్లరి.
“ఒరేయ్, నీ భార్య మంచిపిల్లని సర్టిఫికెట్ ఇస్తాను, ఓ కొడుకునో కూతుర్నో కని, కాంతమ్మనో , కాంతయ్యనో నా పేరు పెట్టుకోండి ” అంది ఆవిడ నవ్వుతూ.
శ్రీధర్ పెద్దగా నవ్వేసాడు ” కాంతమ్మా, కాంతయ్యానా? పెద్దయ్యాక వురికించి వురికించి కొడతారు మమ్మల్ని ” అన్నాడు. సంయుక్తకి ఆవిడ మాటలకి ఇబ్బంది కలిగింది . అతని మాటలకి నవ్వూ వచ్చింది.
” మీ నాన్నంటే భావుకుడూ, కవీగాబట్టి ఓ పిల్లకి మబ్బనీ ఇంకో పిల్లకి మంచనీ పెట్టుకున్నాడు. మీ అమ్మ అడ్డం పడకపోతే నీకూ నిప్పనో నీళ్ళనో పెట్టుకునేవాడు ” అంది కాంతామణి తగ్గకుండా.
” పెళ్లికి పిలవడానికి ఆశ్రమానికి వస్తున్నామనిమీ నాన్నకి వారంముందే ఫోను చేసారు నిర్మలావాళ్ళూ. ఆశ్రమంలో లేరటకదా?” అంది కాత్యాయని.
“చిన్మయా మిషన్ ప్రోగ్రామ్స్ వుంటే ఢిల్లీ వెళ్లారు పిన్నీ ” శ్రీధర్ జవాబిచ్చాడు.
” సంయుక్తా! ఎదురుసన్నాహానికి అందరం తయారైపోయాం. బ్యుటీషియన్ నీకోసమే ఆగింది. వెళ్లి తొందరగా తయారయ్యి వచ్చెయ్” అంది నిర్మల. “ఇంకో చీరేదైనా తెచ్చుకున్నావా? నాదేదైనా ఇవ్వనా?” అడిగింది.
“అమ్మ దగ్గర తీసుకుంటానండీ! తన బ్లౌజు నాకు సరిపోతుంది ” అని వెళ్లింది సంయుక్త.
“శ్రీధర్! నన్ను ఇంటి దగ్గర దించాలి. కారు తియ్యి నాన్నా!”అంది కాంతామణి.
“వుండచ్చు కదా?” అంది నిర్మల.
“అర్ధరాత్రి ముహూర్తం. వుండలేను. ఆ చప్పుళ్లవీ భరించలేను. తెలారేసరికల్లా మేరేజిహాలు ఖాళీ చెయ్యాలి. అప్పుడు హడావిడిపడటం దేనికి?” అంది. శ్రీధర్ వెళ్లాడు.
“పిల్ల మంచిదే. తెలివైనదీ, నెమ్మదస్తురాలు. గడుసుది మాత్రం కాదు” అంది కాంతామణి, కాత్యాయనితో. సంయుక్త గురించి.
“చాలా భయపడ్డాను. ఇద్దరు పిల్లల తల్లి… వంటికి నిప్పంటించుకుందంటేనూ, పిలవగానే శ్రీధర్‍తో ఇంట్లోంచీ వచ్చేసిందంటేనూ… తొందరపాటు మనిషేమో, వీడి జీవితంలో ఏ తుఫాను సృష్టిస్తుందోనని. దానికి తగ్గట్టు శ్రీధర్ కూడా ఎవరికీ తీసుకొచ్చి పరిచయం చేసాడు కాదు”
” బిగించి పట్టుకుంటే ఏ సందు దొరికితే అందులోంచీ జారిపోతాయి చూడు, కొన్ని వస్తువులు… అలాగన్నమాట…”
” అన్నేళ్ళు కాపురం చేసాక ఎందుకొచ్చాయట గొడవలు?”
” అడగలేదు. మనసుకేదో గట్టి గాయం అయుంటుంది కాత్యాయనీ!”
సుదీర్ఘంగా నిశ్వసించింది కాత్యాయని. “నేను కన్నది ఒక్క పిల్లనేగానీ నలుగురు పిల్లల తలనొప్పులు భరిస్తున్నాను. లేని తల్లి ఎలాగా లేదు. ఉన్న తండ్రేనా మంచిచెడ్డలు చూసుకోవద్దా?” అంది. అలాగని తన కుటుంబంలోకి అదనంగా వచ్చి చేరిన ఆ ముగ్గురు పిల్లలూ తనకి అందించిన సంతోషాన్ని మర్చిపోలేదు. ఎంత సందడిగా వుండేదో ఇల్లు!
తల్లి పోయినప్పటికి మేఘమాలకి పదేళ్ళు. శ్రీధర్‍కి రెండు. తెల్లకామెర్లు వచ్చి పోయింది. వాళ్ల నాన్నని మరో పెళ్ళి చేసుకొమ్మని ఎందరు ఎన్నివిధాల చెప్పారో! ఆయన వినలేదు. భార్యమీద ప్రేమ కొండంత, పిల్లలకి అన్యాయం జరుగుతుందనే భయం మరో పర్వతమంత. ఆడపిల్లలిద్దరినీ హాస్టల్లో వేసి, మగపిల్లవాడిని పెట్టుకుని వుండేవాడు. శ్రీధర్ తమ దగ్గరే ఎక్కువగా వుండేవాడు. సెలవులిస్తే చాలు నలుగురూ ఒక దగ్గర చేరేవారు. ఈరోజుకీ అంతే. కష్టం సుఖం కలిసే పంచుకుంటారు.
కాంతామణి కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా అంది, ” చాలాకాలం తర్వాత ఆ అమ్మాయిలో నాకు నేను కనిపించాను. కొన్ని సారూప్యతలు ఎక్కడెక్కడి జ్ఞాపకాలో తవ్విపోస్తాయి. నా తల్లిదండ్రుల దగ్గర గడిపిన ఆ ఇరవైనాలుగేళ్ళే జీవితమంతా పరుచుకుపోయి కనిపిస్తున్నాయి. మన చుట్టూ వుండే నలుగురి వొప్పుదలో తిరస్కారమో ఇవే తప్పొప్పుల్ని నిర్ణయిస్తాయేమో! సమాజం వొప్పుకున్న తప్పులు చాలా జరిగిపోయాయి. అప్పుడవేవీ ఎవరికీ తప్పుగా అనిపించలేదు. ఆలోచనల్లో మార్పులు వచ్చి వాటిని నలుగురూ తప్పని అనడం మొదలయ్యాక తప్పులై పరిహరించబడ్డాయి. “
“బాధపడకండి. అవన్నీ గడిచిపోయిన రోజులు. ఎంతో సాధించారు. మీ ఇంటి కోడళ్ళమని ఎక్కడకి వెళ్ళినా మర్యాద దొరుకుతోంది ” కాత్యాయని ఓదార్చింది.
” ఆ రోజులు ఎక్కడ గడిచిపోయాయి? ఎవరో ఒకరి జీవితంలో వున్నాయికదా? ” కాంతామణి ప్రశ్నకి జవాబు ఎవరి దగ్గర వుంది? ఎవరో కొందరు బాగుంటే సమాజం బాగున్నట్టేనా?
శ్రీధర్ వచ్చాడు. అటునించీ సంయుక్త వచ్చింది, పిల్లలని, తల్లిదండ్రులనీ వెంటపెట్టుకుని.
“దాంతో మాట్లాడినా దానికి పలికినా వీపు చీరేస్తాను” అని చివాట్లు తిన్న చిన్నపిల్లలూ-
“దాంతో మాట్లాడినా అది మీ అక్కచెల్లెలని చెప్పుకున్నా జన్మలో మీకు పెళ్ళిళ్ళు కావు” అని శాపనార్థాలు విన్న ఆడపిల్లలూ-
శేషుకి ద్రోహం జరిగిపోయిందని స్థిరాభిప్రాయం ఏర్పరుచుకున్న మగపిల్లలూ-
సంయుక్త పెళ్ళింట్లో అటూయిటూ తిరుగుతుంటే కుతూహలంగా చూస్తున్నారు. పెద్దవాళ్ళు కలిసి మాట్లాడుకున్నాక కూడా పిల్లలమధ్య హద్దుగీతలు ఇంకా చెరగనట్టే వున్నాయి. సంధి జరిగిందని ఎవరూ వాళ్ళని పిలిచి చెప్పలేదు. అలా చెప్పగలిగే విషయంకూడా కాదు. వీలూ లేదు. ఎన్ట్రొపీలాంటి పరిస్థితి అది. సంయుక్త పక్కని శ్రీధర్‍ని చూడటం పిల్లలకికూడా కొత్తగా వుండి ఆ రేఖని చెరపలేకపోతోంది. చుట్టూచుట్టూ తిరుగుతున్నారుగానీ దగ్గరకి వెళ్ళట్లేదు. మరీ చూపులు కలిస్తే బలహీనమైన నవ్వులు నవ్వుతున్నారు. ఆ రేఖ చెరగదుకూడా. చెరపటానికి వాళ్ళు వాళ్ల మనసుల్లో పెద్ద యుద్ధం చెయ్యాల్సి వుంటుంది. పెద్దవాళ్ళు తప్పు చెప్పరనే నమ్మకంతోటీ, ఆమె చేసిన పనివలన తమకి చెడు జరుగుతుందని వాళ్ళు సృష్టించిన భయంతోటీ. కొంత సమయం పట్టచ్చు. మనసు దృఢపడ్డాక తప్పొప్పులు అర్థమయే వయసు వస్తే అర్థం చేసుకోగలరేమో! అదీ కొందరు. మిగిలిన పిల్లల్లో ఎడం ఎడంగానే వుండిపోతుంది.
అందరినీ పరిచయం చేసుకుని పెద్దవిడకి నమస్కారం చేసి వెళ్ళారు శారద, రాజారావు. కాంతామణి పిల్లలిద్దరినీ ఇద్దరినీ దగ్గరకు తీసుకుని గుండెకి హత్తుకుని విడిచిపెట్టింది. శ్రీధర్‍కి ఏదో చెప్పబోయింది సంయుక్త చిన్నకూతురు. అతను శ్రద్ధగా విన్నాడు. సహజంగా వుంది ఆ దృశ్యం.
కాంతామణిని తీసుకుని శ్రీధర్ వెళ్లాడు.
అంతా ఎదురుసన్నాహానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు. జయలక్ష్మి పెళ్లికి వుండలేదు. శేషు వెళ్ళిపోయాడని తెలిసాక ఎవరెంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయింది. ఆమె మనసు దహించుకుపోతోంది. ఇన్నేళ్ళూ నిరాఘాటంగా సాగిన పెత్తనం ఒక్కసారి చతికిలబడిపోయింది. కారణం సంయుక్త… దాన్ని ఈడ్చి పారెయ్యమంటే తమ్ముడు వినలేదు. ఆనాడే ఆ పని చేస్తే పరిణామాలు ఇలా వుండేవి కాదు… అంతరాత్మ ఘోషించింది


తన్మయి పెళ్లి హడావుడి కొంత తగ్గాక నీహారిక విషయం నిర్మలకి చెప్పింది మేఘమాల. క్లుప్తంగా గుళ్ళో పెళ్లి చేసుకుని రిసెప్షన్ అందరికీ తెలిసేలా ఇచ్చారు నీహారికా, ప్రహ్లాద్ .
” వంటరిగా మిగిలిపోయావు పెద్దమ్మాయ్! ” అంది కాంతామణి బాధగా.
“నాకా బాధేమీ లేదు నానమ్మా! సుఖంగా వున్నాను” అంది మేఘమాల. నిజంగాకూడా అంతే. పెళ్లవలేదనీ, అదొక లోటనీ ఆమె ఎప్పుడూ అనుకోలేదు.
నిర్మల పెళ్లి జరిగాక ఆమెనీ చేసుకొమ్మని అంతా చెప్పారు. తండ్రిలాగే తనూ ఆలోచించింది. తండ్రి వైరాగ్యంలో పడ్డాడు. నీహారిక చదువులో వుంది. శ్రీధర్ బాగా చిన్నవాడు. వీళ్లని వదిలేసి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. అందులో మరో ఆలోచన లేదు.
రిసెప్షన్‍కి రాజారావు, శారదా వెళ్లారు. తన్మయి, శ్రీనివాస్ వెళ్లారు. వసంతకి వెళ్లాలని వుంది.
” అడవిలో వుండాల్సిన సంతనంతా తెచ్చి నట్టింట్లో నిలబెట్టిందీ సంయుక్త. అన్నయ్య మొహం చూసి వూరుకున్నానుగానీ… వాళ్లతో అంత రాసుకుని పూసుకుని తిరగక్కర్లేదు. ఇప్పుడు ఆ ముసలమ్మ రిసెప్షన్‍కి వెళ్ళాల్సిన అక్కరేం లేదు” అని చిరచిరలాడాడు నారాయణరావు. మోటుగానే మాట్లాడాడు. సంస్కారం అనేది మనిషి వేసుకుని ఇప్పేసే చొక్కా కాదు… దాదాపు అందరికీ. పుట్టుకనుంచి మనిషిని అంటుకుని వుండే చర్మం. అతని చర్మం అందంగా లేదని అందరూ అంటే శీను పెళ్ళిలో కాసేపు వేసుకుని ఇప్పేసాడు అతడు.


కాస్త తీరిక చిక్కగానే తనకి కాతామణి చెప్పిన విషయాలు తల్లితో చెప్పింది సంయుక్త.
అంతరార్థం ఒకటి వుండి పైకి మరోలా చెప్పినప్పుడు తలెత్తే సందేహాలు ఆమెవి. అహ్యల్య ఒక ప్రాణి. ఆమెని రాయిలా బతకమని శపించారు. ఎందుకు? రాముడు గొప్పవాడు. భార్యని అగ్నిపరీక్షకి నిలబెట్టాడు. ఎలా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఆమోదయోగ్యమైన జవాబులు ఇవ్వగలిగినప్పుడే ఆ సమాజం ముందుకి వెళ్తుంది. అజ్ఞానంలోంచీ విజ్ఞానంవైపుకి వచ్చిన కాంతామణికి సంయుక్త అడగని ఎన్నో ప్రశ్నలు అర్థమయ్యాయి. ఎలాగంటే ఆమె అనుభవం, వృత్తి.
శేషుని ఒకలా తనని మరోలా చూడటం సంయుక్తని చిన్నప్పట్నుంచీ బాధపెట్టింది. ఇప్పటికీ కూడా తనని తక్కువగా చూడటం తట్టుకోలేకపోతోంది. అలాగే తను చేసినపని సరైనదా కాదా అనే విషయంలో ఆమెకి స్పష్టత లేదు.
ఇప్పుడిప్పుడే ఆలోచనలో చిన్న మార్పు మొదలైంది.
అహల్యది తప్పు అని నమ్మడం దగ్గరనుంచీ, అహల్యది హక్కేనట అనటందాకా ప్రస్థానించిన కూతురి జీవితం తమకి భిన్నంగా వుండబోతోందని అర్థమయింది శారదకి. కాబట్టే వాళ్లు అంత తేలికగా ఆమెని స్వీకరించారని కూడా. ఆ స్వీకృతి వెనక వున్న బలం ఎంత అనేది ఇంకా అంచనాకి అందటం లేదు. సాంప్రదాయం అనేది కొంతమంది మనుషులు ఒక సమూహంగా కొనసాగే సౌలభ్యం కోసం చేసుకునే కట్టుబాటు. దాన్ని సంయుక్త దాటింది.
“భగవంతుడా! ఈ పిల్లని కాపాడు” అని మనసులోనే అనుకుంది శారద.