తన్మయి పెళ్లి నుంచి వచ్చాక సంయుక్తలో స్పష్టమైన మార్పుని చూశాడు శ్రీధర్. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. కొత్త ఉత్సాహాన్ని నింపుకుంది . శ్రీధర్ తనకన్నా చాలా ఉన్నతుడనీ, ఎంతో త్యాగం చేశాడనీ అనుకునేది. అది తగ్గింది. దానివలన కలిగిన న్యూనతాభావం తగ్గింది. ఆ స్థానంలో అతని పట్ల ప్రేమ, అభిమానం చోటుచేసుకున్నాయి. ఆ ప్రేమ ప్రతి చర్యలోనూ చూపిస్తోంది. శ్రీధర్‌కి చాలా సంతోషం కలిగింది.
అతనికి త్వరలోనే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కాబట్టి వెంటనే వెళ్లి చేరాలి. తను వెళ్లి, ఇల్లు చూసుకుని సంయుక్తనీ, పిల్లలనీ తీసుకెళ్తానన్నాడు.
” ఒక్కదానివే ఎందుకు? మన ఇంటికి వచ్చెయ్” అని తీసుకెళ్ళింది శారద. ఆమె పుట్టింటికి వచ్చిందని తెలిసి శేషు వెళ్ళాడు. రాజారావు పిల్లల్ని తీసుకుని పార్క్‌కి వెళ్ళాడు. సంయుక్త, శారద హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు. శేషుని చూసి శారద కంగారుపడింది. ఏం గొడవ జరుగుతుందోనని గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి.
దానికి తగ్గట్టే అతను,” పిల్లల్ని తీసుకెళ్దామని వచ్చాను అత్తయ్యా!” అన్నాడు.
” మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వద్దని నువ్వూ మీ అమ్మా కంకణం కట్టుకున్నారా? ఏ జన్మలో చేసుకున్న పాపం ఇది?” కోపంగా అడిగింది శారద. సంయుక్త వెంటనే కలగజేసుకుంది. ఆమె వూహించినదే ఇది.
“తీసుకెళ్ళనివ్వమ్మా? నాకే కాదు, అతనికి కూడా బాధ్యత ఉంటుంది కదా? ఎప్పుడు తీసుకెళ్తావు బావా? నాకో రెండురోజులు వ్యవధి ఇవ్వు. వాళ్లకి నెమ్మదిగా నచ్చజెప్తాను” అంది. శారద నివ్వెరపోయి చూసింది. కూతురు పిల్లల్ని కూడా వద్దనుకుంటోందా? అర్థం అవ్వలేదు. బాధతో గుండె మెలిపెట్టినట్టైంది. శేషు కూడా కంగుతిన్నాడు.
“నేను తనతో మాట్లాడతాను. అమ్మా! నువ్వు లోపలికి వెళ్లు” సంయుక్త అంది.
శారద లోపలికి వెళ్ళిపోయింది.
“బావా! ఒక్క ఐదు నిమిషాలు నీ కోపం, ఆవేశం అన్నీ పక్కన పెడితే మనం కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ప్లీజ్!” అంది శేషుతో. అతను అయిష్టంగా కూర్చున్నాడు.
“నేను ఆత్మహత్యకి ప్రయత్నించిన రోజుకి ముందురోజు నువ్వు నాతో మాట్లాడినది ఏమిటి? ఒకసారి గుర్తు తెచ్చుకుంటావా?” అడిగింది. అతను మాట్లాడలేదు.
“నేనంటే ఇష్టం లేదని చాలా స్పష్టంగా చెప్పావు. అలా కాకుండా పెళ్లయ్యాక ఇన్నేళ్లకి ఇప్పుడు ఎందుకు ఆ ప్రశ్న అనో, ఇష్టం లేకపోతే పెళ్లి ఎందుకు చేసుకుంటాను అనో నువ్వు అని ఉంటే ఆ ఒక్క మాట ఇచ్చే భరోసాతో నీలో మార్పుకోసం ఎదురు చూస్తూ జీవితమంతా గడిపేసేదాన్ని. నీ అయిష్టాన్ని అంత స్పష్టంగా వ్యక్తపరిచాక అది తెలుసుకోకుండా అన్నేళ్లు నీతో కలిసి ఉన్నందుకు నామీద నాకే అసహ్యం వేసి చచ్చిపోవాలనుకున్నాను”
“అదంతా అయిపోయింది కదా? అన్నీ తెంచుకుని వెళ్లిపోయావు. ఇంక దేనికి?”
” అదే చెప్పబోతున్నాను. మన పెళ్లి ఒక నిర్బంధంలా జరిగింది. నీకు స్పష్టంగా ఇష్టం లేదు. అత్తయ్యకి ఎదురు చెప్పలేకపోయావు. నాకు ఇష్టమో కాదో అనే స్పష్టత లేదు. అమ్మావాళ్ళకి అన్నీ తెలుసుననుకున్నాను. అలా పడ్డ బంధంలో ఇమడలేక నిత్యం అసంతృప్తితో రగిలిపోతూ ఉండేవాడివి”
“సమ్మూ! ఇప్పుడు దేనికే అవన్నీ? పిల్లలని తీసుకెళ్లాలని వచ్చాను. నా పిల్లలు ఇంకెవరి దగ్గరో పెరగటం నాకిష్టం లేదు. వాళ్లని నాతో పంపించు”“
“మంచికో చెడుకో మన దారులు విడిపోయాయి. ఇష్టంలేని మనిషివలన పుట్టిన పిల్లలు నిత్యం కళ్ళముందు తిరుగుతూ ఉంటే నీకు బావుంటుందా? నామీది కోపంతో వాళ్లని కొట్టి చంపుతావా? నా విషయంలో మా అమ్మావాళ్ళూ వూరుకున్నారుగానీ వాళ్ళ విషయంలో మాత్రం నేను వూరుకోను. వాళ్లని నేను పెంచుకోగలను. ఐనా విడాకులప్పుడు పిల్లల ప్రస్తావన రాలేదు. నేనే బాధ్యత తీసుకుంటానని చెప్పాను. ఇప్పుడు కొత్తగా ఇదేమిటి? నువ్వు కూడా నీకు నచ్చిన అమ్మాయిని చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. “
“ఇప్పుడు నువ్వు వంటరిగా లేవుకదా? ” ఆమాట అనడానికి చాలా కష్టపడ్డాడు శేషు.
వళ్ళంతా భగభగమంటోంది. శ్రీను పెళ్లిలో జరిగిన అవమానానికి మనసు రగిలిపోతోంది. తల్లికి సరేసరి. సంయుక్తకి బుద్ధి చెప్పాలంటే పిల్లలని తీసుకురమ్మని ఆవిడే పంపింది. నిజానికి అతనుగానీ ఆవిడగానీ వాళ్లని పెద్దగా దగ్గరికి తీసినది లేదు. ఆడపిల్లలని చిన్నచూపే చూసారు తల్లీ కొడుకులు. సంయుక్తలాగే వాళ్లు కూడా బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. ఎక్కువగా శారదా రాజారావు దగ్గరే పెరిగారు.
అసలు సంయుక్త అంత తెగింపుతో ప్రవర్తిస్తుందని అతను ఎప్పుడూ ఊహించలేదు. ఆమెని నచ్చుకోకపోవటం తన హక్కు అనుకున్నాడు అంతేగానీ ఆమెకికూడా అలాంటి హక్కు వుంటుందనుకోలేదు. ఆమె ఆత్మహత్యకి ప్రయత్నించినప్పుడు కూడా కదలని అతని గుండె మారుపెళ్ళికి వెళ్లినప్పుడు కదిలింది. ఊహకి వ్యతిరేకంగా ఒకొక్కటీ జరిగినప్పుడు సంయుక్తమీద కోపం వచ్చింది. చంపేయాలన్నంత ఆవేశం కలిగింది. ఉక్రోషం, బాధ, అవమానం అన్నీ కలిగాయి. ఆ తర్వాత ఏమీ చెయ్యలేని తన అసక్తత అర్థమయింది. ఆఖరిది తనేంటి అనే గందరగోళం. తల్లి దిశానిర్దేశనం చెయ్యలేదు. సంయుక్తని ఏం చేయాలి, ఎలా బాధపెట్టాలని మాత్రమే ఆలోచించింది. ఇప్పుడు కూడా పిల్లలని తీసుకొస్తే ఆమె గిజగిజలాడుతుందనే ఆవిడ ఆలోచన. అతనికీ అలాగే అనిపించింది.
అతని మనసు చదివినట్టు” కావాలనుకుంటే తీసుకెళ్ళు. వద్దని నేనేం అనట్లేదు. పిల్లలని తీసుకెళ్లటం అంటే నన్నేదో బాధపెట్టడం కాదు బావా!” అంది సంయుక్త . ” చివరిదాకా వాళ్ల బాధ్యతని తీసుకోవాలి. చదివించాలి. బుద్ధులు నేర్పాలి. పెంచి పెద్దచేసి పెళ్లిళ్లు చేయాలి. ఎందుకు కన్నారని వాళ్లు రేపటిరోజున మనని నిలదీయకూడదు . ఇవన్నీ నువ్వూ, అత్తయ్యా చెయ్యగలరా? నీకు కాబోయే భార్య వాళ్లతో
కంఫర్టబుల్‌గా ఉంటుందా? … నీకు దొరికిన స్వేచ్ఛని మళ్లీ సంకెళ్ళలో ఇరికిద్దామని ఎందుకు అనుకుంటున్నావు? ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మళ్లీ మార్చవలసిన అవసరం ఉందా? ” సూటిగా అడిగింది. ఆమె మాటలు కొరడా అంచులా తాకాయి.
“అవన్నీ నువ్వు చెయ్యగలవా?” బెదిరింపుగా అడిగాడు శేషు.
“చెయ్యగలను” స్థిరంగా వచ్చింది ఆమె జవాబు. ” నా వెనక ఎంతమంది నిలబడ్డారో నువ్వే చూసావుకదా? ” ఎదురుగా వున్నది వెనకటి సంయుక్త కాదు. ఎలాంటి బెదురూ లేకుండా సూటిగా అడుగుతోంది. నిర్భయంగా, నిర్మోహమాటంగా చెప్పేస్తోంది.
సంయుక్త చెయ్యగలిగిన పని తను మాత్రం చెయ్యలేడా? అతనికి అహం పొడుచుకు వచ్చింది. కానీ ప్రశ్న ఆమె అడిగినదే! ఒకసారి తెగిపడిన సంకెళ్ళని మళ్లీ తగిలించుకోవలసిన అవసరం ఉందా? వాళ్లని కన్నతల్లి చూసుకోగలనంటోంది. ఆమెని కాదని తన తల్లికి ఈ వయసులో బాధ్యతగానో , చేసుకునే అమ్మాయికి పెళ్లి షరతుగానో ఇవ్వవలసిన అవసరం వుందా? పిల్లల్ని తీసుకుపొమ్మని తేలిగ్గా అనేసింది సంయుక్త. ఆమె తనతో వున్నప్పుడంటే అమ్మమ్మా తాతయ్యలు చూసారు. ఆమెలాగే వాళ్ళూ దులుపుకుంటే అప్పుడేమౌతుంది? ఆమె తెరిపిన పడుతుంది. ఇద్దరాడపిల్లలు… వాళ్ళని పెంచడం, చదువు, పెళ్ళి… ఇవన్నీ తనకి చుట్టుకుంటాయి. తల్లి ఇలాగని తెలిస్తే ఎవరేనా వాళ్ళని చేసుకునేందుకు ముందుకొస్తారా? తను ఇరుక్కుంటాడు. అతనికి కొండంత బరువు కోరి ఇవ్వమని అడుగుతున్నట్టనిపించింది. ఆమెనే పెంచుకోనీ. ఏదేనా తేడా వస్తే తనే యాగీ చేస్తాడు. ఆ హక్కు తనే వుంచుకుంటాడు.
అతని దగ్గరున్నా, ఆమె దగ్గరున్నా పిల్లలు అతనికి పావులే. సంయుక్తమీద విసరడానికి. అదే అతని మనస్తత్వం. ఆ తల్లి పెంపకం.
” వాళ్లేరి? చూసి వెళ్తాను”
“నాన్నతో పార్కుకు వెళ్ళారు”
“సరే. నీ మాటే కానీ” అతను వెళ్లిపోయాడు. అతను అంతకి భిన్నంగా ప్రవర్తిస్తాడని ఆమె వూహించలేదు. సమస్య తేలిపోయినందుకు తేలిగ్గా నిశ్వసించింది. అతను గేటు దాటేదాకా చూసి, వీధితలుపు గడియపెట్టి తల్లి దగ్గరకు వెళ్ళింది.
“తండ్రితో వాళ్లని పంపించేస్తావేమోనని భయపడ్డాను. అసలెంత పెద్ద గొడవౌతుందోనని హడిలిపోయాను” అంది శారద. తన మనసులో కలిగిన భావాలు తనలోనే దాచుకుంది. అలా ఆలోచించినందుకు సిగ్గనిపించింది.
“అలా ఎలా అనుకున్నావమ్మా? ఎప్పుడేనా వాళ్లని దగ్గరకు తీసిన మొహాలేనా అవి? మూర్ఖుడు. అతను అడిగీ అడగ్గానే పంపించనని ఖరాఖండిగా చెప్పేస్తే బలవంతంగా లాక్కుపోతాడు. అప్పుడు ఇంక పోలీసులు, కోర్టు కేసులూను. నేను మళ్ళీపెళ్ళి చేసుకున్నానుగాబట్టి అతనికే ఇచ్చేవారు. అదొక తలనొప్పి. అందుకే ముందు సరేనని, బుర్రకి పట్టిన తుప్పు వదిలించాను”
“అలా ఎలా విన్నాడే?” శారదకి ఇంకా నమ్మకం కలగలేదు. జరిగింది చెప్పింది సంయుక్త.
“చేసుకోనీ చేసుకోనీ…ఎలాంటి పిల్ల వస్తుందో నేనూ చూస్తాను” అంది శారద.
“ఎవరొచ్చినా నాలా పడి వుండరు, మీలా ఆ పిల్లని వదిలెయ్యరు” కోపంగా జవాబిచ్చింది.
శారద ప్రేమగా కూతురి చెయ్యి పట్టుకుని దగ్గర కూర్చోబెట్టుకుంది. “సారీ తల్లీ! చాలా బాధపడ్డావుకదూ? బైటి సంబంధమైతే ఎప్పుడో తెగతెంపులు చెప్పేవాళ్ళు. అత్తకి ఎదురు చెప్పలేక…”
“ఎదురు చెప్తే? ఏమయ్యేది? ఇప్పుడేమైంది? అప్పుడూ ఇదే అయేది”
“సమ్మెటతో కొట్టాలంటే ఇనుము వేడెక్కాలి. నువ్వు ప్రాణంమీదకి తెచ్చుకున్నాక కదా, మీ నాన్నలో చలనం వచ్చింది?”
“నేనంటే నాన్నకి ఇష్టమేనా? అత్తతో గొడవలు తెచ్చినందుకు కోపమా?”
“పిచ్చిదానా! ఆయన ప్రాణం నువ్వు. దూరం పంపలేక కళ్ళముందే వుంటావని కదా, నిన్నతనికి ఇచ్చింది? సరసం తెలియని మూర్ఖుడనుకోలేదు. మారతాడనే ఎదురు చూసాం. .. పోనీలే జరిగిపోయిన విషయాలు ఇంక దేనికి?” శారద మాటమార్చింది.
“ఓ కాంతమ్మనో కాంతయ్యనో కనాలట… నానమ్మగారు… అదేనమ్మా, కాంతామణిగారు చెప్పారు ” అంది సంయుక్త. ఒక్క క్షణం శారదకి అర్థం కాలేదు.
“వెంటనే కాదుగానీ, ఆలోచించు. వాళ్ల కోరిక సమంజసమైనదే. వాళ్లతన్ని అంతగా ప్రేమిస్తున్నారు” అర్థమయాక నెమ్మదిగా,మృదువుగా అంది. సంయుక్త ఔననలేదు, కాదనలేదు. తల్లి వొళ్ళో తలపెట్టుకుని పడుకుంది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.