తల్లిదండ్రుల దగ్గర పదిహేనురోజులు వుంది సంయుక్త. ఢిల్లీ వెళ్లేరోజు దగ్గరపడింది. వారంరోజులు సెలవుతీసుకుని వచ్చాడు శ్రీధర్. తమ యింటికే వచ్చెయ్యమని చెప్పాడు రాజారావు. అతను కొంచెం మొహమాటపడ్డాడు కానీ రాజారావు మరీమరీ చెప్పడంతో అలాగే వచ్చేసాడు. ఉదయాన్న కాలింగ్‍బెల్ శబ్దానికి సంయుక్త తలుపుతీసేసరికి గుమ్మంలో నిండుగా అతని విగ్రహం…సమ్మోహనంగా నవ్వుతూ. సంయుక్త ఆశ్చర్యపడింది. సంతోషం వుప్పెనలా పొంగింది.
“ఇంకా నాన్న స్టేషనుకి బయల్దేరబోతున్నారు” అంది.
“ట్రెయిన్ పదిహేను నిముషాలముందే వచ్చేసింది” జవాబిచ్చాడు.
పలకరింపులు, కాఫీ ఫలహారాలు, కొంత విశ్రాంతి, స్నానాదులన్నీ అయ్యాయి. అప్పటినుంచి కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టే అయింది అతని పరిస్థితి. మొదటిరోజు ఇద్దరు స్నేహితుల సహాయంతో సామాన్లు మూవర్స్‌కి ఇచ్చేసాడు. మరుసటిరోజు తండ్రిని కలవటానికి ఆశ్రమానికి బయల్దేరాడు సంయుక్తనీ పిల్లలనీ వెంటబెట్టుకొని.
“మేము కూడా వస్తామని అతనికి చెప్పు సమ్మూ! వాళ్ల నాన్నగారిని చూసి పరిచయం చేసుకుంటాం” అంది శారద. సంయుక్త శ్రీధర్‍కి చెప్పింది. బంధాలు ఒకటొకటిగా కలుస్తున్నందుకు అతను చాలా సంతోషించాడు. ఊరికి దూరంగా దాదాపు ఐదెకరాల విస్తీర్ణంలో వున్న ఆశ్రమం అది. ఒక రకంగా వానప్రస్థాశ్రమంలాంటిది. ప్రశాంతమైన వాతావరణం. సాదరంగా ఆహ్వానించాడు శ్రీధర్ తండ్రి. కొడుకుని దగ్గరకి తీసుకున్నాడు. సంయుక్త వంగి కాళ్ళకి నమస్కరించింది. రాజారావు, శారదలతో పరిచయ మర్యాదలయాయి.
“తన్మయి తన భర్తతో ఇక్కడికి వచ్చింది శ్రీధర్! అబ్బాయి చాలా మంచివాడు, మర్యాదస్తుడు… అతను నీ అన్నయ్యటకదా, సంయుక్తా! విని చాలా సంతోషమైంది” అన్నాడు శ్రీధర్ తండ్రి . మనవాళ్ళని మంచివాళ్ళని మరొకరు అంటుంటే అందులోని సంతోషం సంయుక్తకి మొదటిసారి పరిచయమైంది. శ్రీధర్ ఆయన్ని తనతో వచ్చెయ్యమన్నాడు. ఎప్పటిలాగే సున్నితమై తిరస్కారం. ఆయన కుటుంబ జీవనంలో ఇమడలేడు. భార్య పోయాక అందులోంచీ బయటికి వచ్చేసాడు. తెగిపోయిన పూసలదండలా తమ కుటుంబం, రాలిపడ్డ పూసల్లా తామూ అనిపిస్తారు. వాటిని తిరిగి కూర్చగలిగే నేర్పు ఆయనలో లేదు.
రాజారావుకి ఆశ్రమంతా తిప్పి చూపించాడు. తన భావి జీవితం అక్కడ నిక్షిప్తమై వుందనిపించింది రాజారావుకి. అక్కడ వాతావరణం చాలా నచ్చింది. సాయంత్రందాకా వుండి అంతా తిరుగు ప్రయాణం అయారు.
“రేపు నానమ్మగారిని చూడ్డానికి వెళ్దాం. తొందరగా బయల్దేరి పోదాం. ” ఇంటికెళ్లాక సంయుక్తకి చెప్పాడు శ్రీధర్. అతను చెప్పినట్టే వుదయాన్నే బయల్దేరారు.
” పిల్లలెందుకే? వాళ్లని మా దగ్గర వదిలేసి వెళ్లండి” అంది శారద. పెళ్ళైన వెంటనే ఇద్దరు పిల్లల్ని వెంటేసుకుని తిరగటమంటే అతనికి ఇబ్బందిగా వుంటుందేమోననుకుంది. కానీ శ్రీధరే జవాబిచ్చాడు.
” పిల్లలని తీసుకెళ్తానని అతనొచ్చాడట కదండీ! సంయుక్త చెప్పింది. సంయుక్త వాళ్లని తనతోనే వుంచుకోవాలనుకుంటోంది. అది చట్టసమ్మతం కూడా. మేము లేనప్పుడు మళ్ళీ వస్తే లేనిపోని సమస్యలు”
నిజంగా శేషు కోర్టుకెక్కితే తను చెయ్యగలిగింది ఏమీ వుండకపోవచ్చు. వీలైనంతగా అతన్ని పిల్లల ఆలోచననుంచీ డైవర్టు చేస్తే బావుంటుందని అతని ఆలోచన. ఒకసారి అతనిక్కూడా పెళ్ళైందంటే కొత్త బంధాలలోపడి ఆ విషయం ఉపేక్షించవచ్చు. పంతమే తప్ప శేషుకి పిల్లలపట్ల పెద్దగా ప్రేమంటూ ఏమీ లేదని సంయుక్త అననే అంది. అది నిజంకూడా. ప్రేమే వున్నవాడైతే పిల్లలని వదిలిపెట్టి ఇన్నాళ్ళు వూరుకోడు.
వీళ్ళు వెళ్లేసరికి నిర్మల, దయానంద్ అక్కడే వున్నారు. కాంతామణి తన్మయి పెళ్లప్పటికన్నా బాగా తగ్గిపోయింది. సంయుక్తని చూడగానే
ఆవిడ కళ్ళలో వెలుగు.
“నువ్వు నా అద్దానివా? ప్రతిబింబానివా?” అని అడిగింది. సంయుక్త నవ్వింది.
తన్మయీ, శీనూ వాళ్లని భోజనానికి పిలిచారు. శేషుకీ, శ్రీధర్‍కీ మధ్య తేడా చాలా స్పష్టంగా తెలుస్తోంది శీనుకి. మనిషి ఎలాగేనా వుండచ్చు. ఎదుటివారిని బాధపెట్టనంతవరకూ ఎవరూ పట్టించుకోరు. శ్రీధర్‍లో కూడా లోపాలు వుండచ్చు. అతనిది ఒకరిని బాధపెట్టే తత్వం కాదు. ఆ గుణం అతని లోపాలని కప్పిపుచ్చుతుంది. పిలిచాక ఇంట్లో చెప్పాడు శీను. తల్లిదండ్రులకి అభ్యంతరం వుంటుందనుకోలేదు.
” వాళ్లని ఇంటిదాకా ఎందుకురా?”నారాయణరావు తిరస్కారంగా అన్నాడు. శీను తెల్లబోయాడు. సంయుక్త విషయంలో తండ్రి వెనక్కి తిరిగిపోతాడనుకోలేదు.
“తన్మయి పిలిచింది ” అన్నాడు.
“ఈ ఐమూల చుట్టరికాలు నాకు నచ్చలేదు. పరాయి మగాడి భార్యాపిల్లలని వెంటేసుకుని తిరిగేవాడు వాడొక మగాడు, అదొక పెళ్లి, నీ భార్యకి మామయ్య…” నిరసనగా అన్నాడు. ప్రపంచాన్ని పెద్ద మాయ అంటారు వేదాంతులు. దేనికీ కచ్చితత్వం వుండదు. చూసే దృష్టిని బట్టి అది మారుతుంది. సంయుక్త సమస్యని శ్రీధర్ చూసే కోణం వేరు. ఇతరుల కోణం వేరు.
“మీరిలా మాట్లాడతారనుకోలేదు నాన్నా! లేకపోతే బైటే కలుసుకునేవాళ్ళం. పిలిచాక ఇప్పుడు బావుండదు” అన్నాడు శీను.
“ఎలాగా వెళ్లిపోతున్నారుకదండీ” అంది వసంత. ఆమెకి సంయుక్తని చూడాలని ఆరాటంగా వుంది. ఢిల్లీ వెళ్తే మళ్ళీ ఎప్పటికో చూడటం!
“ఇంకేం? అమ్మాకొడుకులు ఏకమయారు… ఏదో ఒకటి ఏడవండి” అని విసురుగా వెళ్లిపోయాడు నారాయణరావు.
“ఈయన మారరామ్మా?” అడిగాడు శీను.
“ఆయన ఇంకేం మారతారుగానీ, కనీసం నువ్వేనా మారావు. సంతోషం” అంది వసంత.
నారాయణరావు ఇంటినుంచి నీహారికని కలవడానికి వెళ్లారు. అక్కని గృహిణిగా చూసి గమ్మత్తుగా అనిపించింది శ్రీధర్‍కి. బాబుని పెంచుకునే ప్రయత్నంలో వున్నారు. రోజుల పిల్లవాడికోసం చూస్తున్నారు.
మేఘమాల వూళ్ళో లేదు. ఏదో కాన్ఫరెన్స్‌కి వెళ్లింది.
ప్రయాణం రోజు. రాజారావు, శారద స్టేషన్‍కి వచ్చారు. తన్మయి, శీను వచ్చారు. రైలు కదుల్తుంటే ఒక తలకాయ స్తంబం చాటుకి తప్పుకోవటం గమనించింది సంయుక్త. అది శేషుది. బైటికే అంది ఆశ్చర్యం ఆపుకోలేక. శ్రీధర్ నవ్వాడు. తర్వాత అతని ముఖం కొద్దిగా సీరియస్‍గా అయింది.
“ఒకొక్క వ్యక్తిని చూస్తుంటే ఇతన్నొక చెంపదెబ్బ కొట్టి, దారిలో పెట్టేవాళ్ళు ఎవరేనా వుంటే బావుండుననిపిస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడో అతను కొన్ని చెడ్డ పనులు చేస్తూ వుంటే వుపేక్షిచడం వలన ఆ పనుల్లోని చెడ్డతనం అతని వ్యక్తిత్వంలో భాగంగా మారి క్రమంగా అతన్ని చెడ్డవాడిగా మారుస్తుంది. శేషుని మొదటిసారి చూసినప్పుడు నాకు కలిగిన భావాలు ఇవి” అన్నాడు.
“చెంపదెబ్బ కన్నా బలమైనదే తగిలింది” అంది సంయుక్త.
“అతనిప్పుడు మారుతున్నాడు”
“మంచిదేగా?”
“మరో ఆడపిల్ల సుఖపడుతుంది”రైలు వేగం అందుకుంది.
(అయిపోయింది)
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.