పెళ్లి పిలుపు – 7 by S Sridevi

  1. పెళ్లి పిలుపు – 1 by S Sridevi
  2. పెళ్లి పిలుపు – 2 by S Sridevi
  3. పెళ్లి పిలుపు – 3 by S Sridevi
  4. పెళ్లి పిలుపు – 4 by S Sridevi
  5. పెళ్లి పిలుపు – 5 by S Sridevi
  6. పెళ్లి పిలుపు – 6 by S Sridevi
  7. పెళ్లి పిలుపు – 7 by S Sridevi
  8. పెళ్లి పిలుపు – 8 by S Sridevi
  9. పెళ్లి పిలుపు – 9 by S Sridevi
  10. పెళ్లి పిలుపు – 10 by S Sridevi
  11. పెళ్లి పిలుపు – 11 by S Sridevi
  12. పెళ్లి పిలుపు – 12 by S Sridevi
  13. పెళ్లి పిలుపు – 13 by S Sridevi
  14. పెళ్లి పిలుపు 14 by S Sridevi“
  15. పెళ్లి పిలుపు – 15 by S Sridevi

గతం కీకారణ్యంలాంటిది. మనసు అందులోకి తెలిసినదార్లోనుంచే వెళ్ళగలుగుతుంది. కొత్త దారులు వెతకలేదు. సంయుక్తకి తెలిసిన దారంతా ముళ్ళపొదలే వున్నాయి. సుదీర్ఘ ప్రయాణం చేసి జ్ఞాపకాలనే గాయాలతో తిరిగి వచ్చింది.
శేషుతో ముడిపడిన జీవితం అంతా ముళ్ళమయమే. అతను ఇంట్లో వున్న సమయంలో భయం . అతను లేని ఏకాంతంలో కన్నీళ్ళు. శ్రీధర్ ఆమె దారిలో పూలు పరిచాడు. పాదాలు ఆ దారంట నడవడం మొదలుపెట్టినా మనసు ఆ మెత్తటి నడకకి ఇంకా అలవాటుపడక దాటివచ్చిన ముళ్ళకేసే భయంగా చూస్తూ వుంటుంది. తనేనా, ఈ కొత్త జీవితంలో వున్నది? ఇది నిజమా లేక పునర్జన్మా? ఎంత అపనమ్మకమో!
పైకి మాములుగానే తిరుగుతుంది. లోపల ఈ మథనం. ఈ శ్రీధర్ ఏమిటి, తనని ఒక్కమాట కూడా అనడు? తన చేతివేళ్లతో ఆడుకుంటాడు . నుదుటిమీద పడే వెంట్రుకలని కొనగోటితో సర్దుతాడు. మాట్లాడతాడు, నవ్వుతాడు, నవ్విస్తాడు. అతని ముప్పయ్యారేళ్ళ జీవితాన్ని తన ముందు పరుస్తాడు. పిల్లలగురించి కూడా అతనికి పట్టింపులేమీ లేవు. “
“ఇందరు పెద్దవాళ్ళం వున్నాము. ఇద్దరు పిల్లల్ని పెంచలేమా? ఎంతవరకూ చదువుకుంటానంటే అంతవరకూ చదివిద్దాం. పెళ్లి ఎప్పుడు చెయ్యమంటే అప్పుడు చేద్దాం” అనేసాడు. అంత చులాగ్గా వుంటుందా జీవితం? ఎన్ని లెక్కలు, ఎంత అహం శాసిస్తే…అప్పుడుకదా, క్షణమేనా, తృణమేనా కదిలేది! ఇదంతా కలేమో…కరిగిపోతుందేమో…అని భయం. అతన్ని గట్టిగా తాకాలన్నా భయమే… వాస్తవం కాడేమో, అదృశ్యమైపోతాడేమో అనిపిస్తుంది. ఇప్పుడొక కొత్త గాయమైంది సంయుక్తకి . ఆ గాయంవల్ల జరిగిందింతా నిజమేనని నిర్ధారణ అయింది. అందుకే ఈ పునరావలోకనం.
ఫోను మోగింది. శ్రీధర్ నుంచి. ఆఫీసుకి వెళ్లాక రెండుమూడుసార్లు చేస్తాడు.
“ఏం చేస్తున్నావు?” అతని ప్రశ్న.
“ఏం లేదు”
“ఖాళీగా వున్నావా? ఏదో ఒకటి ఆలోచిస్తావు. గుర్తు తెచ్చుకుని బాధపడతావు. అదంతా అవసరమా? ఆ రోజులు గడిచిపోయాయి”
“అలాంటిదేమీ లేదులెండి “
“డల్ గా అనిపిస్తున్నావు?”
“శీను పెళ్లికి మనని పిలవలేదు” అతను సుదీర్ఘంగా నిశ్వసించాడు. “
“సంయుక్తా! వాళ్లందరికీ నచ్చనిది చేసి ఇంకా వాళ్ల కళ్ళముందే వున్నాం. పెద్దవాళ్ళు…కోపం వుండదా? మనని ఎలా పిలుస్తారు? నువ్వు అలాంటివి పట్టించుకోవద్దు… ” అన్నాడు.
“నిజమే ” వప్పుకుంది. ” కానీ ఎందుకో అలా అనిపిస్తుంది. నా జీవితం నాది కాదా?”
“అలాగని వంటరిగా మనకి మనం బతకగలమా? అందరూ కావాలనిపిస్తుంది”
“అందరూ ఏకమై నన్ను వేరుచేస్తుంటే కోపంగా వుంది”
“సరేగానీ ఇంకో పెళ్లికి అర్జెంటుగా వెళ్లాలి” మాట మార్చాడు.
“అర్జెంటుగా పెళ్లికి వెళ్లటమేమిటి?” నవ్వొచ్చి నవ్వింది సంయుక్త. ఆ నవ్వుతో ఇద్దరి మనసులూ తేలికపడ్డాయి.
“నాలుగురోజులక్రితం బావ ఆఫీసుకి వచ్చి శుభలేఖ ఇచ్చి వెళ్లాడు. నేను మర్చిపోయాను. ఇందాకే ఫోన్ చేసాడు. ఏరా, రావట్లేదా? పెళ్లికూతుర్ని కూడా చేసేసాం అన్నాడు” చెప్పాడు.
“మీకిద్దరే కదా, అక్కలు? వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోలేదు. మధ్యలో ఈ బావెవరు?” ఆశ్చర్యంగా అడిగింది.
“ఓహ్! మన పెళ్లికి ఎవరినీ పిలవకపోవటంతో నీకెవరూ తెలీదు. నిర్మలక్కావాళ్ళు మా పక్కవాటాలో వుండేవాళ్ళు. అమ్మ పోయాక ఎక్కువ భాగం వాళ్లింట్లోనే పెరిగాం. నిర్మలా, మేఘమాలా క్లాస్ మేట్స్. అలా తను నాకు మూడో అక్క అయింది. దారిలో అన్నీ మాట్లాడుకుందాం. కారు పంపిస్తాను. వచ్చెయ్ “
శీను పెళ్లికి తనని పిలవలేదని బాధపడినదల్లా ఒక్కసారిగా సంకోచంలో పడిపోయింది. “
“వెళ్లాలా?” బెరుగ్గా అడిగింది.
“ఎక్కడికీ వెళ్లకుండా ఎంతకాలం?”
“ఏమో! భయంగా వుంది “
“ఎప్పుడో ఒకప్పుడు దాన్ని తుంచాలికదా?”
సంయుక్త ఇంకేం మాట్లాడలేదు. పది కుటుంబాలమధ్య పెరిగింది. ఎప్పుడూ ఏవో ఒక శుభాలు, వేడుకలు, అలాగే అశుభాలు… శేషు ప్రవర్తనతో బాధేగానీ ఇవన్నీ ఒక ఆటవిడుపు. ఎప్పుడూ సందడిగా వుండేది. నలుగురిలో తిరగాలనీ , సరదాగా వుండాలనీ ఎంతగా వున్నా బెరుకు. అప్పుడు ఒకలాగ, ఇప్పుడు ఇంకొకలాగ. ఐనా శ్రీధర్ పక్కన వుంటే భయం దేనికి? అతనే తనకి కొండంత అండ. అతను చూస్తుండగా తనని ఎవరూ ఏమీ అనలేరు.పెళ్లికి వెళ్లాలనే కోరిక మనసులో నిండుతుంటే వుత్సాహంగా తయారైంది… బెనారస్ సిల్క్ చీర, వర్క్ చేసిన జాకెట్టు…షాంపూ చేసుకున్న మృదువైన వెంట్రుకలని పోనీగా వేసుకుంది… ఆమెలోని అందాన్ని శ్రీధర్ ఎలా వెతికిపట్టుకుంటాడో అలా తయారైంది. పైనుండి కొన్ని నగలు.
ఆమె అలా అలంకరించుకుంటూ, సందడి చేస్తూ వుండటం చూస్తుంటే అతనికి తల్లి గుర్తొస్తుంది. తమ కుటుంబంలో లోపించిందేదో మళ్ళీ వచ్చి చేరుతున్న భావన . తను పెద్దవాడై, అక్కలుకాక చెల్లెళ్ళై వుంటే తమ జీవితాలు మరోలా వుండేవని అనిపిస్తుంది.
సంయుక్త తయారయేసరికి వాకిట్లో కారు సిద్ధంగా వుంది. శ్రీధర్ కేంపు వైజాగ్‍లో. అక్కడికి వచ్చేస్తే ఇద్దరం కలిసి వెళ్లచ్చునని డ్రైవర్‍తో చెప్పి కారు పంపాడతను. వైజాగ్ చేరాక డ్రైవర్ని పంపేసి తనే డ్రైవ్ చెయ్యసాగాడు. అప్పుడు తెలిసింది సంయుక్తకి, ఏ పెళ్లికైతే తను వెలిపడిందో అదే పెళ్లికి ఆడపెళ్ళివారివైపునుంచి వెళ్లబోతోందని. ఆమె వుత్సాహమంతా దిగిపోయింది.
“వద్దండీ! వెనక్కి వెళ్లిపోదాం. మావాళ్లు చాలా పట్టుదల మనుషులు. అసలే ఆడపిల్ల పెళ్లి. మనని పిలిచారని ఎంత గొడవేనా చేస్తారు” అంది భయంగా. అతనామెని దగ్గరకు తీసుకున్నాడు. ఈ మలుపు అతనికీ వూహించనిదే. వెంటనే తేరుకుని స్థిరంగా అన్నాడు.
“అలా జరిగితే నిర్మలా, మేఘమాలా వూరుకోరు. ఇద్దరూ చాలా కచ్చితమైనవాళ్ళు. వాళ్ల జుట్టులోంచీ పుట్టుకొచ్చింది తన్మయి. ఏదైనా తేడా వస్తే పెళ్లివాళ్లని వుతికి ఆరేస్తారు. ఐనా అదంతా అప్రస్తుతం. వాళ్లు మనగురించి తెలిసే పిలిచారు. మనం వెళ్తున్నాం. ఎందుకు అంత భయం?” అన్నిటికీ అతను వున్నాడని ధైర్యం చెప్పుకుంది.
మేఘమాల తనతో సంయుక్త పిల్లలని తీసుకొచ్చింది. ఆమె ఇంకా తెలిసినవాళ్లని పలకరిస్తూ లోపలికి వస్తోంది, వాళ్ళు అమ్మమ్మా తాతయ్యలని చూసి వాళ్ళ దగ్గరకు చేరిపోయారు. వాళ్ళెలా వచ్చారా, ఎవరు తీసుకొచ్చారో చూడటానికి విడిది యింట్లోంచీ హాల్లోకి వచ్చింది జయలక్ష్మి.
“ఏంట్రా, ఇప్పుడా రావటం? పెళ్లికూతుర్ని కూడా చేసేసాం… అంతా మేఘమాల చెప్పిందిలే. ఇప్పటికేనా పెళ్లి చేసుకుని మంచిపనే చేసావు. ఎవర్నీ పిలవకుండా పెళ్లి చేసుకున్నావు సరే, మేం పిలిస్తే కూడా రావా?” అని దబాయించాడు దయానంద్… నిర్మల భర్త…పెళ్లికూతురి తండ్రి.
” అన్యాయం బావా! పిలిచాను. మీరే రాలేదు” అన్నాడు శ్రీధర్. దయానంద్ పెద్దగా నవ్వేసాడు. శ్రీధర్ పిలిచాడుగానీ ఆ సమయానికి వాళ్లు అమెరికాలో వుండి రాలేకపోయారు. నిర్మలకూడా వచ్చింది. సంయుక్తని ప్రేమగా దగ్గరకు తీసుకుంది. అందరూ కలిసి లోపలికి నడుస్తుంటే జయలక్ష్మి చూసింది. మళ్ళీ విడిదింట్లోకి వెళ్లింది.
“ఇప్పుడా మామయ్యా, రావటం?…అత్తయ్య చాలా బావుంది…నీ ఎంపిక అద్భుతం” అంది పెళ్లి కూతురు తన్మయి. ఆ అమ్మాయి సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. టీసీయస్‍లో చేస్తోంది. నెలకి నలభైవేలట జీతం. సాంప్రదాయపు పెళ్లికూతుళ్ళలా సిగ్గుపడి ముడుచుకుపోవటం లేదు. ఇంగ్లీషులోనూ తెలుగులోనూ దడదడ మాట్లాడేస్తోంది. వచ్చినవాళ్లని పలకరిస్తోంది. అడిగిన చోట తన ఇష్టాలను నిర్మొహమాటంగా చెప్తోంది. ఇష్టం లేనివి అంతే నిర్భయంగా చెప్తోంది. అంత స్వేచ్ఛాస్వతంత్రాలున్నా సాంప్రదాయాన్ని గౌరవిస్తోంది. విస్మయంగా చూసింది సంయుక్త ఆమెని.
శేషుతో తన పెళ్లి జరిగినప్పటి విషయాలు గుర్తొచ్చాయి. వాళ్లకో ఆటబొమ్మ దొరికినట్టైంది. తను… సంయుక్త కాదు. రాజారావు, శారదల కూతురు కాదు. చదువుతో, ఆటపాటలతో, సరదాసంతోషాలతో జీవితాన్ని నింపుకోవాలనుకున్న అమ్మాయి కాదు. పుట్టగానే తను భార్య. శేషుకి భార్య. తన ప్రతి చర్య, ఆకాంక్ష ఆ పరిధికి లోబడే వుండేవి. ఆ తర్వాత వరుసగా మూడు అబార్షన్లు. ఇంత చిన్న వయసులో పెళ్ళేమిటని డాక్టర్ తిడితే అప్పుడు కొంత వ్యవధి. తర్వాత ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరూ ఆడపిల్లలని పెద్ద గొడవ. ఏడవటానికే తను పుట్టిందా అనిపించేంత విరక్తి. ఎలాగైతేనేం, ఆ చెరలోంచీ బయటికి వచ్చింది. ఇప్పుడు నడుస్తున్న దారి, నడిపిస్తున్న చెయ్యి ఎటు తీసుకెళ్తాయో!అందరితోటీ పరిచయాలయ్యాయి. తండ్రి ఒక్కడూ వున్నప్పుడు శ్రీధర్‍ని తీసుకెళ్ళి తండ్రి దగ్గర నిలబెట్టింది. అతను నమస్కారం చేసాడు. ఆయన ఆశీర్వాదం చేస్తున్నట్టు చెయ్యెత్తి వూపి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. అందుకే సంతోషపడింది సంయుక్త.అంతా సవ్యంగానే జరుగుతోందనిపించినా, ఎవరూ ఏ ఆక్షేపణా చెయ్యకపోయినా ఆమెకి గుండె దడదడలాడుతునే వుంది. ఆమె భయాలని నిజం చేస్తూ మగపెళ్ళివారు దేనికో అలిగారనే వార్త వచ్చింది. దయానంద్, నిర్మల కంగారుపడుతూ వెళ్లి, పాలిపోయిన ముఖాలతో తిరిగొచ్చారు.
“ఛ…ఛ…ఇంత సంస్కారం లేని మనుషులనుకోలేదు. చదువులు చూసి మోసపోయాం. అన్నీ పైపై హంగులు…” గొణిగాడు దయానంద్.
ఏం చేద్దాం అన్నట్లుగా చూసింది నిర్మల. ఇద్దరూ మరో గదిలోకి వెళ్ళారు.
“ఏం జరిగింది బావా?” వెనకే వెళ్ళాడు శ్రీధర్. సంయుక్త వూహించగలిగింది. అవమానంతో, సిగ్గుతో రగిలిపోతూ తనున్నచోటునుంచీ లేచి బాల్కనీలోకి వెళ్లి నిలబడింది. తన్మయి వెంట వెళ్లింది.
“ఏంటత్తా! ఏం జరిగింది?” అడిగింది. ” అమ్మా నాన్నా అలా అంటున్నారేమిటి? మామయ్య కూడా కంగారుపడుతున్నాడు” అంది.