ప్రేమరాహిత్యం by S Sridevi

  1. పాతకాలపు మనిషి by S Sridevi
  2. ఒలీవియా by S Sridevi
  3. నాకొద్దీ అభ్యుదయం by S Sridevi
  4. అర్హత by S Sridevi
  5. సింధూరి by S Sridevi
  6. మలుపు by S Sridevi
  7. యంత్రసేవ by S Sridevi
  8. ప్లాస్మా జీవులు by S Sridevi
  9. మనుషులిచ్చిన శాపం by S Sridevi
  10. వంకరగీత by S Sridevi
  11. బంధీ by S Sridevi
  12. లాటరీ by S Sridevi
  13. ముల్లు by S Sridevi
  14. లే ఆఫ్ by S Sridevi
  15. నేను విసిరిన బంతి by S Sridevi
  16. మలివసంతం by S Sridevi
  17. తప్పనిసరిగా by S Sridevi
  18. ప్రేమరాహిత్యం by S Sridevi
  19. పార్థివం by S Sridevi
  20. ఖైదీ by S Sridevi

Youtubers please WhatsApp to 7382342850

మనిషి తనకి ప్రేమించడం, ద్వేషించడం తప్ప మరొకటి తెలీదనుకుంటాడు. కానీ ఈ రెండింటికీ మధ్యస్థమైన స్థితి యింకొకటి వుంది. అది ప్రేమరాహిత్యం . నిత్యం ఎంతోమంది కలుస్తారు. వాళ్ళందరిపట్లా ప్రేమగానీ ద్వేషంగానీ వుండదు. పెళ్లై యింతకాలం గడిచాక తనకీ వసంతకీ మధ్యనున్న పరిస్థితి కూడా యింతేననుకుంటే అతనికి ఆశ్చర్యం కలుగుతోంది.
“వంకాయలూ బెండకాయలూ వున్నాయి ఏం వండను?”” ఫ్రిజిలోంచి కూరగాయల ట్రే తీస్తూ అడిగింది వసంత.
“కాకరకాయలు వేయించు” కసిగా అన్నాడు సారధి. ఆమె చురచుర చూసి, వంకాయలు తరగసాగింది.
“ఏం వండను?… పిల్లలకి స్కూలు టైమౌతోంది. త్వరగా తయారై దింపిరా… గేస్ అయిపోయింది….” ఇదేనా భార్యా భర్తల మధ్య జరిగే సంభాషణ? ఆ ప్రశ్నకి జవాబు వెతుక్కుంటున్నాడు సారధి.

పబ్లిక్‍గార్డెన్లో లాన్లో ఒక్కడూ పడుకుని వున్నాడు సారథి. పైన సుదూరంగా ఆకాశం కనిపిస్తోంది. అందులో గుంపులు గుంపులుగా మబ్బులు కదుల్తున్నాయి. వాటికి బాగా క్రింద పక్షులు బారులు తీరి ఎగుర్తున్నాయి. కాస్త దూరాన్న పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. ఇంత సందడి మధ్యకూడా సారధి మనసు వంటరిగానే వుంది.
పెళైన పదేళ్ళకి అనిపిస్తోందతనికి, తన వైవాహికజీవితంలో లోపం వుందని. వసంత లేకుండా బ్రతకలేనని ఎప్పుడూ అనుకోలేదు సారథి. అలాగని ఆమెని చేసుకున్నందుకు విచారపడిన సందర్భంకూడా లేదు. అసలేంటో! ఒకరినొకరు కావాలనుకున్నారో వద్దనుకున్నారో తెలీకుండానే తమ పెళైంది.
ఇద్దరివీ పక్కపక్క యిళ్ళు. వసంత పుట్టినప్పట్నుంచీ ఆమె జీవితంలో జరిగిన ప్రతి సంఘటనా తనకి తెలుసు. కలిసి ఆడుకున్నారు. చదువుకున్నారు అప్పుడెంతో సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ వుండిన వసంత పెళ్ళయాక మారిపోయింది. తన తల్లిలా, ఆమె తల్లిలా, యింకా ఎందరో స్త్రీలలా గృహిణిగా మారిపోయింది.
తను? పుట్టుక, చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు… ఒక మగవాడి జీవితంలో ఎన్ని తతంగాలుంటాయో అవన్నీ జరిగాయి… అన్నీ జనాంతికంగానే. కానీ… వీటన్నిటికీ అతీతంగా తన మనసు యింకేదో కోరుకుంటోంది. ఎందుకని తన జీవితం యింత రసహీనంగా తయారైంది? ఉండటానికో స్వంతిల్లుంది. బేంకులో ఉద్యోగం, చక్కటి భార్య, పిల్లలు. అందరూ వేటికోసమైతే ఆరాటపడతారో అవన్నీ తనకున్నాయి. మరి?
సారధి ఆలోచనలు అక్కడ ఆగిపోయాయి. సరిగ్గా అప్పుడే మెత్తటి పచ్చిక మీద సుపరిచితమైన అడుగుల చప్పుడు. అది చెలానిది. చెలం సారధి బాల్యంలోని మరోపార్శ్వం . వసంత సారధితో ఎన్ని ఆటలు ఆడిందో చెలంతో అంతకంటే ఎక్కువే ఆడింది. అతని ఇల్లు సారథి ఇంటికి మరోపక్కన. అతనికి హైద్రాబాదులో వుద్యోగం. ఎప్పుడేనా సెలవు పెట్టి వరంగల్ వస్తాడు. అది చాలా అరుదు. అలా వచ్చినప్పుడు సారధిని కలవకుండా వుండడు.
“ఎప్పుడొచ్చావు?”” చెలాన్ని చూసి లేచి కూర్చుని వంటికి అంటుకున్న గడ్డిపరకలు దులుపుకుంటూ అడిగాడు సారధి.
“ఇప్పుడే. ఇంటికెళ్ళి బేగ్ పెట్టి నీకోసం మీయింటికెళ్తే నువ్విక్కడుంటావని చెప్పింది వసంత”” చెప్పి పక్కనే తనూ కూర్చుంటూ అడిగాడు చెలం. “”ఒక్కడివే యిక్కడేం చేస్తున్నావు?””
సారధి మాట్లాకుండా వూరుకుని కాసేపటికి అన్నాడు, “”లైఫ్ బోర్ కొడ్తోందిరా!”” అని.
తను సరిగ్గానే విన్నాడా అనే అనుమానం కలిగింది చెలానికి, “”ఏమిటి?!””
“ఏమిటో… విసుగ్గా అనిపిస్తోంది.””
“అప్పుడేనా?!””
“ఎప్పట్నుంచో!””
“ఎందుకని అలా?””
“ఏమో!””
మళ్ళీ కొద్ది సేపు యిద్దరూ మాట్లాడుకోలేదు.
“ఎందుకు? వసంత నీతో సరిగా వుండదా?”” అడగలేక అడిగాడు చలం. సారధికీ వసంతకీ పెళ్ళవటంతో అతను వాళ్ళ అంతరంగిక విషయాలకి సంబంధించినంతవరకూ బైటివాడిగానే వుండిపోయాడు. ఆ దూరం వసంతతో మరీ స్పష్టంగా ఏర్పడిపోయింది.
“ఛ… అదేంకాదు. వసంత చాలా మంచమ్మాయి”” అన్నాడు సారధి.
“మరేంటట?””
“అదే అర్థం కావటం లేదు””
చెలం అతని ముఖంలోకి పరీక్షగా చూసి, అడిగాడు “నేను చెప్పనా?”” అని. తలూపాడు సారధి.
“అన్నీ అమరిన జీవితం. సాధించడానికంటూ ఏదీలేదు. అలాంటప్పుడు స్తబ్దత చోటుచేసుకుంటుంది. ఏదేనా కొత్త వ్యాపకం కల్పించుకో…””
సారధి నవ్వాడు. తన సమస్యలోని మౌలికత అదికాదు. దాన్ని వ్యక్తీకరించడం రాదు. అదొక అంతర్మథనం. అంతే.
“సరేగానీ, నీ సంగతేంటి? ఎంతకాలం యిలా పెళ్ళిచేసుకోకుండా వుంటావు? ఆ అమ్మాయెవరో యిపాటికి పిల్లల తల్లికూడా అయుంటుంది. నువ్వు మాత్రం వంటరిగా మిగిలావు”” అన్నాడు మాటమార్చి.
హఠాత్తుగా గాలి తనమీదికి మళ్ళేసరికి చెలం వుక్కిరిబిక్కిరయ్యాడు. అతనో అమ్మాయిని ప్రేమించి భంగపడ్డాడు. అందుకే యింతకాలం పెళ్ళిచేసుకోలేదు. సారధికి అంతవరకే తెలుసు. ఆ అమ్మాయెవరో, చెలంలాంటి హీరోని ఎందుకు కాదందో తెలీదు. చెలంకూడా ఎప్పుడూ చెప్పలేదు. మితృడి మనసు నొప్పించటం యిష్టంలేక సారధి కూడా తర్కించి అడగలేదు.
“జరిగిందేదో జరిగిపోయింది. డబ్బుకి డబ్బూ, అందానికి అందం రెండూ వున్నవాడివి, సున్నితమనస్కుడివి, నిన్నే కాదందంటే ఆ అమ్మాయికి బలమైన కారణం ఏదో వుండి వుండాలి. లేకపోతే నీది ఏకపక్ష ప్రేమైనా కావాలి… అవన్నీ మర్చిపో. హేవే ఫ్రెష్ బిగినింగ్” అతని భుజమ్మీద తట్టాడు సారధి.
చెలం ఆశ్చర్యపోయాడు. తనకో ప్రేమకథ వుందని ఎప్పుడూ ఎవరికీ చెప్పుకోలేదు. దేవదాసు వేషం కూడా వెయ్యలేదు. ఐనా అందరూ తను పెళ్ళి చేసుకోకపోవటం వెనక ఏదో వుందని వూహాగానాలు చేస్తున్నారు. నిజంగా అంతగా ప్రేమించాడా తనామెని… తెరిచిన పుస్తకంలా అందరికీ కనిపించేలా?
“అమ్మ చాలా గొడవ చేస్తోంది నా పెళ్ళి చూడాలని. వదినలు తలో సంబంధం తెస్తున్నారు. ఈ బాధ మరీ ఎక్కువగా వుంది. ఏదో ఒకటి వప్పేసుకుని, నోవేకెన్సీ బోర్డు పెట్టెయ్యాలనుకుంటున్నాను”” అన్నాడు.
“ఇంకేం?””
“ఆపనిమీదే వచ్చాను. పెద్ద వదిన చెల్లిలి పెళ్ళిలో ఒక అమ్మాయిని చూపించారు. పోస్ట్ గ్రాడ్యుయేటు. ఏవరేజిగా వుంటుంది. సరేననేసాను” భావరహితంగా వుంది చెలంగొంతు.
“ఇంత మంచివార్తని అంత నిర్లిప్తంగా చెప్తావేంట్రా?”” అయోమయంగా అడిగాడు సారధి.
పెళ్ళి విషాదానికి నాంది పలకడం యీవొక్క వేదభూమిలోనే జరుగుతుందేమో! తెలిసో తెలీకో ప్రేమలో పడటం… అది పెళ్ళిగా పరిణమించడానికి గల అవకాశాలకంటే అలా పరిణమించకుండా వుండటానికి ఆటంకాలే ఎక్కువ. కులం, మతం, జాతకాలు, గోత్రాలు, పెద్దల యిష్టానిష్టాలు, పెట్టుపోతలు… ఒకటేమిటి? అన్నీను. అక్కడితో ఆ ప్రేమకి సమాధి కట్టేసి దానిమీద పెళ్ళికి పునాది లేపడం… ఆ పైన జీవితం విషాదకావ్యమేకదా?
ఆలోచిస్తున్న సారధిని చూసి చెలం నవ్వాడు. ఆ నవ్వులో ఒక విచిత్రమైన భావన వ్యక్తమైంది. దాన్ని సారధి భరించలేకపోయాడు.
“పద వెళ్డాం”” అన్నాడు లేచి నిలబడి.
ఇంక మాట్లాడుకోవడానికంటూ ఏమీ మిగల్లేదుగాబట్టి ఒకరింటికి యింకొకరు వెళ్ళే ఆలోచన చెయ్యలేదు. సందుమలుపు దగ్గర విడిపోయారు.


“చెలం పెళ్ళి కుదిరింది” ఇంట్లో అడుగుపెడ్తూనే అన్నాడు, సారధి. వంటింట్లో వున్న వసంత వులిక్కిపడింది. మనసంతా ఏదో అర్థంకాని అలజడి నిండిపోయింది. ముసురు కమ్మిన సాయంత్రంలా ఏమీ తోచకుండా తయారైంది.
చెలానికి పెళ్ళా? చెలం… చెలం పెళ్ళి చేసుకోబోతున్నాడా? అపనమ్మకంగా అనిపించింది.
తను పెళ్ళి చేసుకుంది. సారధీ చేసుకున్నాడు. అలాగే చెలంకూడానని అనిపించలేదు. తనదైనదేదో పరాయిగా మారిపోతున్న భావన కలిగింది. మళ్ళీ మళ్ళీ అదే ఆలోచన. ఆలోచించిన కొద్దీ బాధ పెరుగుతోంది.
“ఏంటి, అలా వున్నావు?” భోజనాలప్పుడు సారధి అడిగితే తనే మళ్ళీ ఆశ్చర్యపోయింది. చెలం పెళ్ళివార్త వినగానే తను ఎలాగో వుండటమేమిటని.
“తలనొప్పిగా వుంది”” అని తోచిన జవాబు చెప్పింది. భోజనాలయ్యాయి పిల్లల్ని వాళ్ళగదిలో పడుకోబెట్టి వచ్చి సారధి పక్కని డబల్‍కాట్ అంచున పడుకుంది. ఇద్దరికీ మధ్య అందనంత దూరం. సారధి తనే జరిగి దగ్గరకొచ్చాడు. మీద చెయ్యేసి దగ్గరకి తీసుకోబోయాడు.
“ప్లీజ్… వద్దు”” అంది అతనికేసి తిరక్కుండానే. సారధి చెయ్యి వెనక్కి తీసేసుకున్నాడు.
అతని గుండెల్లో చివ్వుమని ఎగిసిన బాధ. ఎందుకు వసంత యిలా మూడీగా డల్‍గా వుంటుంది? తన చేతుల్లో కరిగిపోవటానికి బదులు, ఈ చర్యని కావాలి – వద్దు అనుకునే అవసరంగా మార్చేసింది? కనీసం తనవైపు తిరిగి ఏవేనా మాట్లాడచ్చుకదా? అతనికి పెద్దగా ఏడవాలనిపించింది. నిజంగానే ఏడుస్తానేమోననే భయంకూడా కలిగింది. దిండులో ముఖం దాచుకుని బోర్లాపడుకున్నాడు. ఎప్పటికో నిద్రపట్టింది. వసంతకి ఆరాత్రంతా నిద్రలేదు.

చెలానికి పెళ్లిగురించి ఏమీ సంతోషం లేదు. ఉచ్చు మెడచుట్టూ బిగుసుకుంటున్నట్టు వుంది. ఇప్పటిదాకా తనకి సంతోషం లేకపోయినా స్వేచ్ఛ వుంది. ఇకమీదట అదికూడా వుండదేమో అశాంతిగా అనిపించింది. అతను అనుభవిస్తున్న అశాంతికి అది ఒక కొస. దాని యింకో కొసన-
“లైఫ్ బోర్ కొడ్తోందిరా!”” సారధి మాటలు వెంటాడుతున్నాయి.
ఏమిటి, సారధికి బోర్ కొడుతున్నది? జీవితమా? వసంతా? వసంత బోర్ కొడితే ఆమెతో పంచుకునే జీవితమూ అలాగే వుంటుంది. కానీ… అలా ఎలా? యిద్దరూ ఒకరినొకరు యిష్టపడి చేసుకున్నారు?
పెళ్ళికుదిరినప్పుడు సారథి అన్న మాటలు యిప్పటికీ చెలం మర్చిపోలేదు. అవి శిలాక్షరాల్లా అతని గుండెలమీద వుండిపోయాయి. అవే అతనికి ఒక నిబద్దతనీ నియంత్రణనీ ఏర్పరిచాయి.
“నా పెళ్ళి ఫిక్సైందిరా… సడెన్‌గా. ఇదింత హఠాత్తుగా జరుగుతుందని నేను వూహించలేదు. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం… వసంతతో. చిన్నప్పట్నుంచీ తెలిసినమ్మాయితో పెళ్లంటే గమ్మత్తుగా లేదూ? నిజానికి నాకిప్పటిదాకా తనపట్ల అలాంటి దృష్టిలేదు. ఉండి వుంటే రోజూ కాసిని ప్రేమకబుర్లు చెప్పేవాడిని” అని పెద్దగా నవ్వాడు సారధి.
“వసంతేమంది?” చెలం ప్రశ్న. అతని గొంతులోని భయం, ఆర్తి, ఆతృత… యివేవీ సారధి గుర్తించలేదు. తన ధోరణిలో తను చెప్పుకుపోయాడు.
“ఇష్టమేనంది”
ఆ చిన్నవాక్యం చెలం గుండెల్లో డైనమైట్లు పేల్చింది. అతను వసంతని ప్రేమించాడు. పెద్దవాళ్ళు తమ పెళ్ళికి వప్పుకోరు. కులం, గోత్రంలాంటి ఆక్షేపణలూ, అభ్యంతరాలూ వాళ్ళకెన్నో వుంటాయి. ఐనా అందర్నీ ఎదిరించేనా ఆమెని పెళ్ళిచేసుకోవాలనుకున్నాడు. ఆ ప్రేమని యింకా ఆమె ముందు ప్రకటించనేలేదు, ఆమె పెళ్ళి స్థిరపడింది- సారధితో. ఇద్దరికీ యిష్టమేనట? మరి తను? ఓటమితో రాజీపడి మౌనాన్ని ఆశ్రయించటమే…. అదే యిన్నాళ్ళూ చేసాడు. ఇప్పుడు… యినేళ్ళ తర్వాత సారధి అన్నమాటలు అతన్ని మళ్ళీ ఆలోచనలో పడేసాయి. అశాంతిని రేపాయి.
సారధి సమస్యతో తనకి ఎక్కడో సంబంధం వుందనిపించింది. మూలం వెతకబోయాడు మళ్ళీ మానుకున్నాడు.

“కంగ్రాట్స్. పెళ్ళి చేసుకోబోతున్నావటగా? స్నేహితుడికోసం ప్రేమని త్యాగం చేసావు. ప్రేమించిన అమ్మాయికోసం పెళ్ళిని వద్దంటావనుకున్నాను” తెల్లారి మూడింటికి వసంత చేసిన ఫోన్‍కాల్‍తో చెలం నిద్రమొత్తంగా ఎగిరిపోయింది.
“”వ… సం… తా…”” దిగ్ర్భాంతిగా అన్నాడు.
“కనీసం యిప్పటికేనా సంతోషంగా వుండు చెలం””వెంటనే డిస్కనెక్ట్ చేసేసింది. కాని ఆమె గొంతులోని దుఃఖం చెలాన్ని విచలితుడిని చేసింది.
అసలే పెళ్ళిపట్ల ఎలాంటి సరదా లేని చెలం యిప్పుడు మరింత విముఖతలో పడ్డాడు. అందులో కొంత అయోమయం కూడా వుంది. సారధిని యిష్టపడి చేసుకున్న వసంత… అతని ఆలోచనలు ముందుకి సాగటం లేదు.
చెలం యింకా ఆ విభ్రాంతిలోంచీ, అయోమయంలోంచీ యింకా బైటపడనేలేదు, ఉదయాన్నే సారధి వచ్చి “నువ్వివేళ ఫ్రీయేగా? నేనూ లీవు పెట్టాను. చాలా రోజులైంది తిరిగొద్దాం రా!”” అని లాక్కెళ్ళాడు.
ఇద్దరూ కలిసి కొందరు పాతఫ్రెండ్సుని కలిసారు. హోటల్లో టిఫిన్ కానిచ్చి, సినిమాకెళ్ళారు. మళ్ళీ బైటే తిని ఎక్కడెక్కడో తిరిగారు. రాత్రయేదాకా వదిలి పెట్టలేదు సారధి చెలాన్ని. చెలం సారధి అనుభవిస్తున్న ప్రేమరాహిత్యాన్ని గుర్తించాడు. ఇంట్లో ప్రేమ దొరకని మగవాడు స్నేహితుల్ని వెంటేసుకుని తిరుగుతాడు. భర్త దగ్గిర ఆత్మీయత లభించకపోతే స్త్రీ పుట్టింటి మమకారాలని పెంచుకుంటుంది. వెరసి… మనిషి కోరుకునేదీ, ఆశించేదీ ఒకటే, సాన్నిహిత్యం .
ఇద్దరూ ఇంక ఎవరింటికి వాళ్లు వెళ్లేముందు తన మనసు బైట పెట్టాడు సారధి “”నిన్న నీతో అన్నది ఏదో కేజువల్‍గా కాదురా, చెలం! వసంతలో చాలా మార్పొచ్చింది. అది క్రమంగా వచ్చినది కాదు. పెళ్ళికి ముందు ఎలా వుండేదో నీకు గుర్తుందిగా? ముఖ్యంగా నాతో పెళ్ళయ్యాక ఒక్కసారి
మారిపోయింది. నిర్లిప్తంగా వుంటుంది. కొన్ని సంవత్సరాలుగా కలిసి వుండటానికి అలవాటుపడ్డవాళ్ళు విడిపోలేరు చూడు, అలాంటి యాంత్రికమైన సాన్నిహిత్యానికి అలవాటు పడ్డాం”
చెలం నవ్వటానికి విఫలప్రయత్నం చేసాడు. “”ఇంటిపనులతోటీ, పిల్లల బాధ్యతలతోటీ అలా వుంటుందేమో తను.””
“నా అనుమానం… తను పెళ్ళికి ముందు యింకెవర్నేనా ప్రేమించిందేమోనని…”
చెలాన్ని విభ్రాంతి మరోసారి ఆవహించింది. తేరుకుని అన్నాడు. “”అదేంట్రా నువ్వంటే యిష్టమందని చెప్పావు?””
“ఇష్టం వేరు, ప్రేమవేరూరా! అది యిప్పుడే అర్ధమౌతోంది”
“…”
“ఆ విషయం… అంటే తన మనసులో ఎవరైనా వున్నారేమో అడగాలని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ పెళ్ళై పదేళ్ళై, యిద్దరు పిల్లలు పుట్టాక ఆమెని అలా అడిగి అవమానపరచటం కాదు?”
“…”
“అంతేకాదు, అలాంటిదేదైనా వుంటే?”
“ఉంటే?”
“అంత స్పష్టంగా తెలిసిన నిజాన్ని నేను తట్టుకోలేను. ఇద్దరం విడిపోగలమా? పిల్లల భవిష్యత్తు ఏమౌతుంది?”
“సారథీ!”
“మళ్ళీ నాకే అనిపిస్తుంటుంది. నా ఆలోచనల్లో ఏదేనా లోపం వుందేమో! పెళ్ళాయ్యాక ఆడవాళ్ళు అలాగే వుంటారేమో!”
“అందరూ అంతేనా?”
“అంతేనేమో, ఎందరు లేరు? ఒకరు లేకపోయినా రెండోవారు ఆ వెల్తిని ఏదో ఒకలా పూడ్చుకుని చివరిదాకా బతికేస్తున్నవాళ్ళు?”
“ఒకళ్ళు పోగానే రెండోవాళ్ళు పోవాలనా?”
“బతకలేమనిపించాలి. జీవచ్చవాలుగా మారిపోవాలి. వాళ్ళ ఆలోచనల్లోనూ ఆఖరికి విడిచే శ్వాసలోనూ కూడా అవతలివారి జ్ఞాపకాలే వుండాలి”
“నువ్వు చాలా సెల్ఫిష్‍గా ఆలోచిస్తున్నావు. అలా ఎందుకుంటుంది? ఎవరి జీవితంవాళ్ళది.”
“ఎందుకుండకూడదు? పెళ్ళయ్యాక యింకా యిండివిడ్యువాలిటీ ఏంటి?”” గట్టిగా అన్నాడు సారధి.
ఒక్కక్షణం వూరుకుని చెలం మెల్లగా అడిగాడు. “”పోనీ, నీకుందా, వసంతపట్ల అలాంటి ప్రేమ?””
సారధి దెబ్బతిన్నాడా ప్రశ్నకి. “”తనకి లేనిదే నాకెలా పుడుంది?”
“తనూ అలాగే అనుకుంటే?”
ఆ చీకట్లో సారధి ముఖం వికసించడం చెలానికి కనిపించలేదు.
“అంత ప్రేమ వసంతమీద వొలికిద్దామని చూస్తాను. తను విసుక్కుంటుంది” అన్నాడు నవ్వేస్తూ.
“ప్రకటించుకునేది. ప్రదర్శించుకునేదీ ప్రేమకాదు సారధీ. నిశ్శబ్దంగా గుండెల్లో పుట్టి, నిలువెల్లా నిండి, మనమీద మనకి నియంత్రణ లేకుండా చేసేది ప్రేమంటే. అలాంటి ప్రేమని నేను అనుభవించాను. దానికి రెసిప్రొకేషన్తో నిమిత్తం లేదు. కానీ నాది ప్రేమని తెలిసి ఆమె ముందు వ్యక్తపరిచేలోపే ఆమె పెళ్ళైపోయింది” మొదటిసారి తన ప్రేమగురించి మాట్లాడాడు చెలం,
“మరి… ఆమె?”
చెలం నవ్వాడుగానీ జవాబివ్వలేదు. ఇప్పుడిప్పుడే ఆ విషయాన్ని మర్చిపోయి పెళ్ళి చేసుకోబోతున్న అతన్నింకా కదిలించి బాధ పెట్టడం దేనికని సారధి అంతటితో వదిలేసాడు.

చెలానికి ఫోన్ చేసాక వసంతలో వుదేగం చాలావరకు తగ్గింది. తనూ, చెలం ప్రేమించుకున్నారు. కానీ తన పెళ్ళి సారధితో జరిగింది. పదేపదే ఆ విషయం మనసుకి స్ఫురించి ఏమీ చెయ్యలేని నిస్సహాయతవల్ల మళ్ళీ అదే యాంత్రికత… అదే జడత్వం ఏవైతే సారధికి ప్రేమరాహిత్యం అనిపిస్తున్నాయో, అవి.
సంఘటనలు జరుగుతాయి. వాటి ప్రభావం మనిషిమీద వుంటుంది. కానీ వాటిలోంచి బాధనో, సంతోషాన్నో పుట్టించేది మాత్రం మనసు, అది చేసే ఆలోచనలు… ఆ ఆలోచనల తాలూకు జ్ఞాపకాలు. దాదాపు పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది వసంత…
“సారధిని చేసుకుంటావటే? వాళ్ళూ మనతో సంబంధానికి యిష్టపడుతున్నారు. నాన్న వెళ్ళి అడిగితే సరేనన్నారు” అడిగింది తల్లి. అప్పటిదాకా వసంత పెళ్ళిని గురించి నిర్దుష్టంగా ఏమీ అనుకోలేదు ఇంట్లోగానీ, ఆమెగానీ. బియ్యేస్సీ చదువుతోంది. చదువే లోకంగా వుంది. తనతో ఆడి, తిరిగి, తనతోపాటే పెద్దైన సారధి పెళ్ళికొడుగ్గా మారాడన్న విషయం గురించలేదు. ఒక్కసారిగా తల్లి అలా అడిగేసరికి తడబడిపోయింది. వెంటనే చెలం గురొచాడు. అది కేవలం యిస్టింక్చువల్. దానికింకా భావరూపం లేదు.
“సారధికన్నా చెలం బెటరు” అనేసింది అనాలోచితంగా.
“వాళ్ళకీ మనకీ ఎలా కుదురుంది? వేరే కులంవాళ్ళు” వెంటనే జవాబిచ్చింది ఆవిడ.
అప్పటికి వూరుకున్నా, తర్వాత భర్తతో చెప్పింది. “అది చెలాన్ని చేసుకుంటానంటోంది. అదేదో అతనిదాకా వెళ్ళి గొడవయ్యేలోగా యీపెళ్ళి జరిపించటం మంచిది”
ఆయన ముఖం కోపంతో ఎర్రబడింది.
మనిషి కులాలు, మతాలని తనచుట్టూ ఎన్ని యిరుకు గోడలు కట్టుకుంటున్నాడో! ఇవికాక, వున్నవాడు-లేనివాడు అనే తేడా. ఆ గోడల మధ్య తనో మూసబొమ్మ. ఇంత యిరుకులో మనసనేది పిడికిట్లో బిగించి పట్టుకున్న మొగ్గలాంటిది. అది వికసించకూడదు. వికసిస్తే నలిపెయ్యాలి. దాని పేరే సంసృతి, నాగరీకత. ఐనా అనాగరికంగా కొన్ని మనసులు వికసిస్తూనే వుంటాయి…
వసంత యిష్టానిష్టాలతో సంబంధం లేకుండా ఆమె పెళ్ళి సారధితో జరిగిపోయింది. చెలం మనసులో ఏముందో ఆమెకి తెలీదు. తర్వాత తెలిసింది. అతనెవర్నో ప్రేమించి భంగపడ్డాడని ఆ ‘ఎవరో’ తనేనని యిప్పటికి అర్ధమైంది.

చెలం వసంతతో వంటరిగా మాట్లాడాలనుకున్నాడు. ఎవర్నో పెళ్ళి చేసుకోవాలనుకున్న అతని నిర్ణయం యిప్పుడు పూర్తిగా వీగిపోయింది.
ఒక సమావేశం…
కొన్ని సంవంత్సరాల క్రితమైతే చక్కటి ప్రణయవేదికయేది. కానీ యిప్పుడు రెండు వేరువేరు గతాలకి ఐక్యవేదికైంది.
“వసంతా! సారధికి విడాకులివ్వు మనిద్దరం ఎటేనా దూరంగా వెళ్ళి పెళ్ళిచేసుకుందాం” అన్నాడు చెలం సూటిగా…
“మరి మా పిల్లలు?”
సూటిగానే వచ్చి తాకింది అతన్ని ఆ ప్రశ్నకూడా. కానీ జవాబుకి వెతుక్కోలేదు. “వాళ్ళని వదిలిపెట్టి వుండలేననుకుంటే నీతో తీసుకొచ్చెయ్. సారధి పిలలు నాకు పైవాళ్ళు కారు” అన్నాడు.
“కానీ వాళ్ళకి నువ్వేమౌతావు?”
“వ… సం… తా!”
“వాళ్ళ యిన్స్టింక్టు నిన్ను తండ్రిగా వప్పుకోనివ్వదు. వాళ్ళకి సారధితో బలమైన అనుబంధం వుంది. వాళ్ళతన్ని వదిలిపెట్టి వుండలేరు. నన్నూ వదులుకోలేరు. చెలం! నేను ప్రేమకోసం ఏదైనా చెయ్యగలిగే స్టేజిని దాటిపోయాను” అంది వసంత. ఆమె ముఖంలో తీవ్రమైన సంఘర్షణ కనిపిస్తోంది. సమాజం, కుటుంబం, భర్త, పిల్లలు అనే చట్రంలో బిగించబడివుంది ఆమె మనసు. చెలంపట్ల ప్రేమ అనేది ఆకర్షణ. దాన్ని తట్టుకునేందుకు ఆమె సంఘర్షిస్తోంది. ఇప్పుడు. ఇన్నేళ్లకి. అలాంటిది ఒకటి వుందని గుర్తుపట్టి.
ఆమె మాటల్ని జీర్ణించుకునేందుకు చెలానికి కొద్ది వ్యవధి పట్టింది. నిజమే! తన ఊహలకి అందనంత దూరంలోనే వుంటోందామె ఎప్పుడూ. తనతో షటిల్, గల్లీ క్రికెట్టూ ఆడి, అప్పుడప్పుడు బైక్ మీద లిఫ్టడిగి కాలేజీకి వెళ్తూ, చూడీదార్లలో తిరిగే అమ్మాయి పెళ్ళికి ఎదిగిపోయిందని సారధి ఫోన్ చేసి చెప్పేదాకా తెలీలేదు. ఆ తర్వాత కూడా తన మనసులో పీఠం వేసుకుని వున్నది యీ వసంత కాదు. ఆమె తన మనసులోనే పుట్టి, పెరిగి వూహాలోకాల్లో తనతో సంచరించింది. ఆమె ఒక ప్రేమ భావన. ఆమెకి ప్రేమతప్ప లౌకికమైన బాధ్యతల్లేవు. తనకోసం పరితపిస్తుంది. తనే లోకమంటుంది. తామిద్దరి అంతరంగిక ప్రపంచం ఒకటి. కానీ ఆమెకి భౌతికమైన రూపంలేదు. రూపంలేని అంతరంగాన్ని ప్రేమిస్తూ వచ్చాడు. భౌతికంగా తనముందున్న యీ వసంత ఆంతరంగికంగా తనకెంతో దూరంగా వుంది.
“నేను చాలా తెలివితక్కువవాడిని కదూ, వసంతా? నిన్ను ప్రేమించినప్పుడు, ఆ విషయం నీకెప్పుడూ చెప్పలేదు. అసలేంటో, నువ్వూ నేనూ వేరువేరని ఎప్పుడూ అనిపించేది కాదు.” ఆవేదనగా అన్నాడు.
“జరిగిపోయినవి యిప్పుడెందుకు చెలం?”
“నాకెందుకు ఫోన్ చేసావు?”
“నీ పెళ్ళని విన్నాక ఆ బాధని తట్టుకోలేకపోయాను. నువ్వీ బాధని యేళ్ళతరబడి అనుభవించావు. “ఒకసారి యీ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే బావుంటుందనిపించింది. మూసేసి వున్న యీదార్లోంచీ వెనక్కి వచ్చేద్దాం. ఈ వుద్వేగాల్లోంచీ బైటపడదాం”
“ఔను, మనది తొలిప్రేమకదూ?”” నిరసనగా అన్నాడతను. అతని గుండెల్లో బాధ సుళ్ళు తిరుగుతోంది. ఒక్కక్షణం మౌనంగా కళ్ళుమూసుకుని ప్రార్థించాడు. ఓ దేవుడా! మళ్ళీ జన్మంటూ వుంటే అప్పటికి యీ దేశాన్ని కులమతరహితంగా వుంచు. అలా కాకపోతే కనీసం అలాంటి బేధాలు లేనిచోట మా యిద్దర్ని పుట్టించు- అని. కానీ అప్పుడు ఇద్దరిమధ్యా ఈ ప్రేమ పుడుతుందా?
“ఏమిటి చెలం?” అతను కళ్ళు మూసుకోవడం చూసి అడిగింది వసంత.
అతను జవాబివ్వలేదు. “”ఇంతేనా వసంతా?” చాలసేపటికి అడిగాడు. “ఇద్దరం… మిగిలిన జీవితమంతా ఒకరికొకరం ఏమీ కాకుండా మిగిలిపోవాలా?”
అతని మాటల్లో ధ్వనించిన విషాదం వసంతని కుదిపేసింది. తట్టుకోలేక ఏడ్చింది. చెలం నిర్వికారంగా చూస్తూ కూర్చున్నాడు. ఆమెని వోదార్చడానికి అతన దగ్గర మాటలేకాదు, భావాలు కూడా లేవు.
“నా చిన్నతనం గురొస్తోంది చెలం! ఎంత అందమైన రోజులవి! అమ్మానాన్నల మధ్యన స్వేచ్ఛగా పెరిగాను. నాకేం కావాలనిపించినా వాళ్ళతో నిస్సంకోచంగా చెప్పేదాన్ని. వాళ్ళుకూడా ఎన్నో విషయాల్లో నాకోసం సరుకునేవారు చెలం! వాళ్ళు తమ జీవితాన్ని పిల్లల చుట్టూ నిర్మించుకున్నారు. మేమే లోకంలా బ్రతికారు. ఇప్పుడు నేను… నాప్రేమకోసం… మా పిల్లల్ని యిబ్బంది పెట్టనా? వాళ్ళు మనకోసం తల్లినో తండ్రినో వదులుకోవాలా? నువ్వు వాళ్ళని ప్రేమగానే చూస్తావు. ఆ ప్రేమతో వాళ్ళకి నువ్వొక మంచి అంకుల్‍వి కాగలవు. అంతేగానీ తండ్రివి కాలేవు…అందుకే ఇవేవీ వద్దు ” అంది వసంత ఏడుపులోంచీ బైటికి వచ్చాక.
ఆమె చాలా బాగా అర్ధమైంది చెలానికి. నిశ్శబ్దంగా లేచి నిలబడ్డాడు.
“నువ్వూ పెళ్ళిచేసుకో చెలం. ఒకరిద్దరు పిల్లల్ని కను. అప్పుడు నీకే తెలుస్తుంది, నువ్వు నువ్వుగా మిగిలేవని.”
చెలం వెళ్ళిపోయాడు.


చెలం పెళ్ళి చేసుకున్నాడు. వసంత చెప్పిన అనుభవం కోసం పెళ్ళి చేసుకున్నాడు. తనని తను ఇంకేవో అనుబంధాల్లో కోల్పోవడంకోసం చేసుకున్నాడు. తనంటూ లేకపోతే తనకి సంబంధించిన దుఃఖమూ వుండదని చేసుకున్నాడు. పెళ్లి జరుగుతూ వున్నప్పుడు తనలోంచీ ఎవరో బయటికి వచ్చి దూరంగా జరుగుతున్నట్టు అనిపించింది చెలానికి. బయటికి వచ్చినవాడొక గుంపులో చేరాడు.
కూరగాయలసంచీ పట్టుకుని కొందరు సారథులూ- వంకాయలా, బెండకాయలా కూరేం చెయ్యను అని కొందరు వసంతలూ- అడుగూతుండటం చూసి విషాదపడే అతరంగాల గుంపు అది.
(ఆంధ్రభూమి – 2004, సింధూరి)