ప్లాస్మా జీవులు by S Sridevi

  1. పాతకాలపు మనిషి by S Sridevi
  2. ఒలీవియా by S Sridevi
  3. నాకొద్దీ అభ్యుదయం by S Sridevi
  4. అర్హత by S Sridevi
  5. సింధూరి by S Sridevi
  6. మలుపు by S Sridevi
  7. యంత్రసేవ by S Sridevi
  8. ప్లాస్మా జీవులు by S Sridevi
  9. మనుషులిచ్చిన శాపం by S Sridevi
  10. వంకరగీత by S Sridevi
  11. బంధీ by S Sridevi
  12. లాటరీ by S Sridevi
  13. ముల్లు by S Sridevi
  14. లే ఆఫ్ by S Sridevi
  15. నేను విసిరిన బంతి by S Sridevi
  16. మలివసంతం by S Sridevi
  17. తప్పనిసరిగా by S Sridevi
  18. ప్రేమరాహిత్యం by S Sridevi
  19. పార్థివం by S Sridevi
  20. ఖైదీ by S Sridevi

Youtubers please WhatsApp to 7382342850

“వాళ్ళిద్దరూ ఆకాశాన్ని తవ్వేసి నక్షత్రాలెత్తుకుపోతున్నారు.”


అంటార్కిటికా ఖండం. ఆరునెలలు పగలూ, ఆరునెలలు రాత్రీగా వుండే ప్రాంతం. గ్రిగేరియన్ కేలండరు ప్రకారం తారీఖు… చెప్పలేను. రేయింబవళ్ళ విభజన వుంటేకదా, తారీఖులు ఏర్పడేది?

ముత్యాలు పువ్వులుగా విరగబూసే వనంలోంచీ పుష్పలావికలు వాటిని కోసుకొచ్చి కుప్పలుగా పోసినట్టు కనుచూపుమేరంతా తెల్లటి మంచు. పైన నిర్మలమైన ఆకాశం.

ఈక్వినాక్స్ రోజుల్లో చెలరేగే సౌరధూళిలో విద్యుదావేశిత పరమాణువులు భూమియొక్క వాతావరణపు పొరల్లోకి ప్రవేశించినప్పుడు మండి రంగురంగుల కాంతులు వెదజల్లుతాయి. అవే ధృవదీపాలు. అరోరా బొరియాలిస్. ఎలాంటి నాగరీకతా, విద్యుద్దీపాల వినియోగం లేని వుత్తరధృవప్రాంతంలో ఈ దీపాల వెలుగులు చాలా ఎక్కువ. అది చూచేందుకు నేను భారతదేశంనుంచీ వచ్చాను. ఇంకా అనేకమంది శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు వచ్చారు. వారిలో ప్రద్యుమ్న వుండటం కేవలం కాకతాళీయం. కాకతాళీయమైన ఈ కలయికే నా మరణానంతర జీవితాన్ని గొప్ప మలుపు తిప్పేందుకు ప్రాతిపదిక ఔతుందని ఆ క్షణాన నాకు తెలియదు. అతడు… నా స్నేహితుడు.

మంచుతో నిర్మించబడి, ఆ మంచు కరగకుండా వుష్ణోగ్రత నియంత్రించబడిన హోటల్ గదిలో ఇద్దరం వున్నప్పుడు నేను కిటికీలోంచీ చూస్తుండగా తను మంచంమీద పడుక్కుని అన్నాడు ఆ మాటల్ని. నేను వెంటనే వెనక్కి తిరిగి అతన్ని నిశితంగా చూసాను. ముదురు నీలిరంగు జీన్స్, దానిమీద తెల్లని చీజ్ కాటన్ షర్టు… మనిషి స్థిరంగానే వున్నాడు. చూపులూ నిలకడగానే వున్నాయి. అతను సరిగ్గానే అన్నాడనీ, నేనుకూడా సరిగ్గానే విన్నాననీ అర్థమైంది. “ఎవరు?” అనడిగాను.

“ఆర్యభట్టు, ఐన్‍స్టిన్”

“ఆయనేమో పదిహేనువందల సంవత్సరాలక్రితంవాడు. ఈయనేమో గతశతాబ్ధివాడు. పైగా ఇద్దరూ ఒక దేశానికీ , ఒక మతానికీ చెందినవారు కాదు. అదీగాక ఇప్పుడు ఇద్దరూ లేరు. ఎలా కలుసుకున్నారంటావ్?”

“మనిషి చనిపోయినప్పుడు రెండు గ్రాముల బరువు తగ్గుతాడు. అంటే అంత పదార్ధం అతని శరీరంలోంచీ బైటికి వెళ్తుంది. అది పల్చటి ప్లాస్మాగా అతని ఆకృతిలోకి విస్తరించి మౌలిక పదార్ధాలుగా విడిపోయి, ప్రకృతిలో కలిసిపోతుంది. వీళ్ళిద్దరూ అలా కలిసిపోకుండా తమ వునికిని తాము కాపాడుకుంటున్నారు” స్పష్టమైన వివరణ ఇచ్చాడు. అతను ఇండియన్ ఎపిక్ సైన్సులో శాస్త్రవేత్త. అతడి వివరణని తిరస్కరించే అవకాశం లేదు.

“నువ్వు వాళ్ళని చూసావా?”

“లేదు”.

“నమ్ముతున్నావా?”

“ఔను”.

“ఎలా?”

“కొద్దిరోజులక్రితం ఆండ్రమెడా గెలాక్సీలోని ఒక నక్షత్రాన్ని తవ్వి ఎత్తుకుపోయారు. అలాంటివి వాళ్ళెన్ని చేసారోగానీ ఇదైతే మనకి దగ్గిరగాబట్టి మనదాకా వచ్చింది. ఎప్పుడైతే వున్నట్టుండి ఒక నక్షత్రం మాయమైందో, గ్రహాల ఆకర్షణశక్తులమధ్య తేడా వచ్చి ఆ గెలాక్సీవాసులు చావుతప్పి కన్ను లొట్టపోయిందన్నవిధాన బయటపడ్డారు. మనకి రేడియో మెసేజిలు పంపించారు, వాళ్ళిద్దర్నీ మీరేదైనా చేస్తారా, మేమే పేల్చెయ్యాలా అని”.

“అడగటం దేనికి?”

“వాళ్ళ మూలకాలు, మన మూలకాలు వేరువేరు. వీళ్ళని వాళ్ళ గెలాక్సీలో పేల్చేస్తే తరువాతి పరిణామాలెలా వుంటాయో తెలీక. … లేదా వీళ్ళని తరుముకుంటూ ఇంకెక్కడికో తీసుకెళ్ళాలి. అక్కడ వాళ్ళమీద ప్రయోగించాలి. అందుకు మన సాయం అడిగారు. అప్పటినుంచీ వాళ్ళని కలవడానికి మనంకూడా ప్రయత్నం చేస్తున్నాం”.

“గాడ్!!” “కొంతకాలంకిందట ఇంటర్నెట్ సెర్వర్లుగా పనిచేస్తున్న సూపర్‍కంప్యూటర్లని ఒక రాత్రి మూడుగంటలపాటు ఆపి వుంచమని అమెరికా ప్రెసిడెంట్‍తో చర్చలు జరిగాయి గుర్తుందా?”

“ఔను. అతనొప్పుకోలేదు”.

“ఆ అడిగింది వీళ్ళకోసమే. వీళ్ళంతట వీళ్ళు భూమ్మీదికి వచ్చి మనతో మాట్లాడాలనుకుంటున్నారు. మనం సాధించిన టెక్నాలజీని చూడాలనుకుంటున్నారు. ఐపీ పేకెట్స్ రూపంలో భూగ్రహమంతా అల్లుకుని వున్న సమాచార పరిభ్రమణం అందుకు సహకరించలేదు. వారి శరీరాకృతులుగా వున్నవే అతికొద్ది పరమాణువులు. అవి ఈ సమాచారతరంగాలని ఒరుసుకుని పేలిపోతున్నాయి. అందుకని ఇంటర్నెట్‍కి కొద్దిసేపు విరామం ఇవ్వమని అడిగారు. వాళ్ళ పక్షాన భారత్ ఆస్ట్రనామికల్ సొసైటీ (బాస్) ఎంతో ప్రయత్నించిందికానీ అమెరికా వప్పుకోలేదు”

“ఎందుకు?” “ప్రపంచ వ్యవహారాలన్నీ తలక్రిందులౌతాయి. ఈ డే లోని మూడుగంటలు మాయమవటమంటే నువ్వే ఆలోచించు” “మీ!!” “అసలు వాళ్ళలా అడుగుతున్నారని నీకెలా… ఐ మీన్ మనకెలా తెలుసు?”

” ఒక ట్రాన్స్మిటర్ లాంటిదాన్ని స్పేస్‍లాబ్‍లో వదిలారు. దాన్ని మణికట్టుకి ఆనిస్తే వాళ్ళనుకునేవి మన మెదడుదాకా వెళ్ళిపోయి అక్కడ డీకోడ్ ఔతాయి”.

నేను దిగ్భ్రాంతుడినయ్యాను. సైన్సు ఎంత విస్తృతమైనది? నేనేవో పరిశోధనలు చేస్తూ వున్నాను. కృత్రిమంగా జీవాన్ని సృష్టించడానికీ,డీఎన్‍ఏ తయారుచెయ్యడానికీ, అందులో మార్పులు చేసి కొత్త స్పెసీస్ సృష్టించడానికీ ప్రయోగాలు చేస్తున్నాను. ఫలితాలు అందివచ్చినట్టే వచ్చి విఫలమౌతున్నాయి. మధ్యలో కొంచేం తలెత్తి చూసేప్పటికి నా చుట్టూ వున్న ప్రపంచం నానుంచీ దూరంగా జరిగిపోతూ కనిపిస్తుంది. మళ్ళీ దాన్ని చేరుకోవడానికి ఒక పరుగు.

“ఈ విశ్వం ఎంతో విస్తృతమైనది. ఇంకా విస్తరిస్తునే వుంది. బైటికివెళ్ళగానే మనమీద పడే సూర్యకిరణాలు రెండు గ్రహాలు దాటుకుని వచ్చినవంటే వింతగా లేదూ? ఈ దూరం , ఈ సౌరకుటుంబం విశ్వపరిమాణంలో ఎంతవి? మహాసముద్రంమీద సూదిమొన ఆనించినంతకూడా కాదు. అంతటి విశాలవిశ్వంలో వాళ్ళు మహా సముద్రంమీద గడ్డిపరకల్లా తేలుతున్నారు. ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, ఏవేవో చూస్తున్నారు, చేస్తున్నారు. వాళ్ళగురించి వూహిస్తుంటేనే వుద్విగ్నంగా వుంది. ఎలాగేనా వాళ్ళని కలవాలి” ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయినట్టు అన్నాడు ప్రద్యుమ్న. నాదీ అదే స్థితి.


వారంరోజులపాటు చిమ్మచీకటి ఆకాశంలో జరిగిన దీపావళిని చూసి తిరుగు ప్రయాణమయ్యాం.

“మనం స్పేస్‍లాబ్‍కి వెళ్దాం” అన్నాను విడిపోయేముందు ప్రద్యుమ్నతో. అతను నవ్వుతూ తలూపాడు.

స్పేస్‍లాబ్ ఆకాశంలో నిర్మించిన చిన్న గ్రామంలాంటిది. కొన్ని వందలమంది శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలని ఏకకాలంలో మరొకరికి ఇబ్బంది కలగకుండా చేసుకోవచ్చు. అందులోకి వెళ్ళటానికి ప్రతివాళ్ళూ మొదట ఆరాటపడతారు. వెళ్ళాక ఎక్కువకాలం వుండలేరు. తిరిగొచ్చెయ్యాలనుకుంటారు. మొదట్లో ప్రయోగాల్లో మునిగిపోయి వున్నప్పుడు ఆ కృత్రిమమైన వాతావరణం, వంటరితనం, నిర్బంధితమైన జీవితం మనసుకి తట్టకపోయినా , దైనందిక యాంత్రికతనుంచీ మార్పులా అనిపించినా, క్రమంగా మనసు ఆ మార్పుని గుర్తించి అవగాహన చేసుకుని తిరస్కరిస్తుంది. తన వూరు, తన యిల్లు, తనవాళ్ళు అనే తపన మొదలై అక్కడినుంచీ బయటపడాలన్న కాంక్ష మొదలై తీవ్రతరమౌతుంది. గబగబ ప్రయోగాలు ముగించేసుకుంటారు. మరోసారి రావచ్చని వాయిదా వేసుకుంటారు. ఇలా రావటాలు, వెళ్లటాలు ఎప్పటికీ వుంటునే వుంటాయి. ఇవన్నీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ కాబట్టి బాస్‍కి నష్టమేం వుండదు. అంటార్కిటికానుంచీ తిరిగొచ్చిన కొద్దిరోజులకే మాకు స్పేస్‍లాబ్‍కి వెళ్ళే అవకాశం వచ్చింది. కలిసే వెళ్ళాము.

వెళ్లగానే ప్రద్యుమ్న చెప్పిన ట్రాన్స్‌మిటర్ని చూసాను. కంటికి కనిపించనంత సూక్ష్మపరికరం అది. నానో టెక్నాలజీతో తయారుచెయ్యబడింది. దాంతో స్పేస్‍లాబ్‍లోని ఒక పరికరాన్ని బగ్ చేసారు వాళ్ళు. డీ బగ్గింగ్ ప్రక్రియలో దాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. అదేమిటో అర్థమవలేదు. ఒక ప్రయోగం చేస్తుంటే మరొక ప్రయోగమేదో యాదృచ్ఛికంగా బైటపడి సైన్సుగతిని మార్చినట్టు కాకతాళీయంగా ప్రద్యుమ్న చేతికి తగిలింది. దాన్నుంచీ కొన్ని సంకేతాలు వస్తున్నట్టు అతను గుర్తించాడు. ఇంకాస్త ప్రయత్నిస్తే మణికట్టు నాడితో దానికి సంబంధం వుందని తెలిసింది.

“అఖండమైన తెలివితేటలు చూపిస్తున్నారు వాళ్ళు. కానీ దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారు. బహుశ: మనం హాని చెయ్యమని వాళ్ళకి నమ్మకం కలిగేదాకా అంతేననుకుంటా” అన్నాడు ప్రద్యుమ్న.

అప్పట్నుంచీ మొదలైంది , వాళ్ళకోసం నా ఎదురుచూపు.


భూమ్మీద 18.0 N 79.58E అక్షాంశరేఖాంశాలమీదగల పట్టణం వరంగల్. నా వూరది. ఒక కార్తీకమాసపు సాయంత్రం పొగడపూల వర్షంలో మా యింటి ముంగిలి తడుస్తున్న దృశ్యాన్ని కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తున్నాను. నాకెంతో ఇష్టమైన జ్ఞాపకమది. ప్రద్యుమ్న తన ప్రయోగాలవిషయమై ఎవరితోనో చర్చలో వున్నాడు. తనది నా పక్క చాంబరే. గాజు తలుపుల్లోంచీ కనిపిస్తుంటాడు. ఇప్పుడూ కనిపిస్తున్నాడు. తన పనిలో నిమగ్నమై వున్నాడు. హఠాత్తుగా నా కళ్ళముందు గాల్లో తేలుతూ రెండు ఆకారాలు కనిపించాయి. చిన్నప్పుడు చదువుకున్న చందమామకథల్లోని దయ్యాల్లా వున్నాయవి.

“మేం మీరనుకుంటున్నట్టు దయ్యాలంకాదు. నేను ఆర్యభట్టుని. వీరు ఐన్‍స్టీన్‍గారు” కొంచెం కోపంగా వచ్చింది జవాబు. నేను దిమ్మెరపోయి చూసాను. వాళ్ళగురించి ఎదురుచూస్తున్నది నిజమే. కానీ ఆర్యభట్టంటే ఎలా వుండాలి? జరీయంచు ధోవతి, వుత్తరీయం, తలపాగాతో వుండాలి. రెండో ఆయనమాత్రం? సూటూబూటూ వేసుకుని వుండాలి. కానీ వీళ్ళు? పిడత మొహాలు. వంటిమీద బట్టలు లేవు. అసలా అవసరమే వున్నట్టు లేవు వాళ్ళ శరీరాలు. పొట్టి పొట్టి చేతులు. రెండుకాళ్ళూ కలిసిపోయి చివర్న తోకలా వంపుతిరిగి వునాయి.

“రోదసిలో కాళ్ళ అవసరం వుండదు. ఎంతదూరమైనా తేల్తుతూ వెళ్ళిపోవడమే. అందుకే మేము కాళ్ళని ఏర్పరుచుకోలేదు. చేతుల అవసరమూ అంతే. అవసరమైతే పొడుగ్గా సాగదీసుకోగలము. స్థలం వున్నంతవరకే కాళ్ళు చాపుకోమన్నారుకదా? మాకున్న అణువుల్తో మా శరీరాలని ఇలా ఏర్పరుచుకున్నాము” మళ్ళీ జవాబు.

“బాబోయ్!” అనుకున్నాను. నా ఆలోచనలని నియంత్రణలో వుంచుకోవలసిన అవసరం చాలా వుందని గ్రహించాను. రెండుమూడుసార్లు ప్రద్యుమ్నని పిలవాలని ప్రయత్నించాను. అతడసలు తల తిప్పి చూడలేదు.

“వారొద్దులెండి. మరోసారి కలుస్తాము. పురాణాలలో వున్నవాటిమీద ప్రయోగాలుచేసి నిరూపిస్తున్నారటకదా? అన్నీ మాకు తెలిసినవే. మరోసారి ఇక్కడికొచ్చినప్పుడు వారిని కలిసి సందేహాలేవేనా వుంటే తీరుస్తాము” అన్నారు ఆర్యభట్టుగారు.

“తలుపులన్నీ మూసి వున్నాయి మీరెలా వచ్చారు?” అడిగాను. నేనున్న గదిలోని వేడి, వుద్గారవాయువు బైటికి పోయేందుకు ఏర్పాటుచేసిన చిన్న అపర్చర్ కేసి చూపించారు. అందులోంచీ దూరి వచ్చారా? విస్మయంగా అనుకున్నాను. అలా అనుకున్నానో లేదో ఐన్‍స్టీన్‍గారు రెండుసార్లు, ఆర్యభట్టుగారు మూడుసార్లు అందులోంచీ దూరి వెళ్ళి వచ్చారు. వాళ్ళలా వెళ్ళి వస్తుంటే గిస్స్‌మని గాలి వదిలిన చప్పుడైంది. అదికాదు. పిల్లచేష్టలా అనిపించి నవ్వొచ్చింది. ఆపుకుందుకు ముక్కు నులుముకున్నాను.

“మరి స్పేస్‍లాబ్‍లోకి?”

“ఎవరో ఒకరు వచ్చినప్పుడో, మీరు దేనికోదానికి… అంటే స్పేస్‍వాక్ అవీ చేస్తుంటారుకదా, అలా తలుపు తెరిచినప్పుడు వచ్చేసి ఇక్కడే తిరుగుతుంటాం. మళ్ళీ తెరిచినప్పుడు వెళ్ళిపోతాం”

“కూర్చోండి” అన్నాను ఇద్దరికీ కుర్చీలు చూపెట్టి.

ఆర్యభట్టుగారు కూర్చోవాలనుకున్నారు. ఐన్‍స్టీన్‍గారు అప్పటికప్పుడే నా కంప్యూటర్ మీద దాడి మొదలుపెట్టబోయారు. కానీ వాళ్ళ శరీరాల్లోంచీ ఆ వస్తువులు దూరివచ్చాయి. ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. నాకు వాళ్ళని చూస్తుంటే జాలేసింది.

“ఇదీ మా సమస్య. ఏ వస్తువుని పట్టుకోవాలనుకున్నా అది మాలోంచీ దూరిపోతుంది. మాకు చాలా విషయాలు తెలుసు. మేము చనిపోయాక అందరికీలాగా ఐతే అవి మాతోటే నశించిపోతాయి. అలా కాకుండా వుండాలనే మేమీ రూపాలను ఎంచుకున్నాము. మాకిప్పుడు శరీరాలు కావాలి. ఒక్కటి తయారుచేసుకోగలిగినా అందులో కాసేపు వారూ, కాసేపు నేనూ వుంటాం” అన్నారు ఆర్యభట్టుగారు. “మీరు జీవశాస్త్రం మీద చాలా ప్రయోగాలు చేసారనీ, కృత్రిమంగా ప్రాణాన్ని సృష్టించారనీ తెలుసుకున్నాము. అప్పటినుంచీ మిమ్మల్ని కలుసుకోవాలనే ప్రయత్నంమీద వున్నాంగానీ భూమిచుట్టూ ఆ వలలేమిటయ్యా? వాటిల్లోంచీ దూసుకు వెళ్దామని ప్రయత్నిస్తే రాళ్ళలాగ కొడుతున్నాయేమిటి?” అనడిగారు.

ఇంటర్నెట్ గురించీ, డాటా ట్రాన్స్మిషన్ గురించి చెప్పాను. ఆశ్చర్యంగా విన్నారు. “అబ్బో! చాలా చాలా సాధించారే!” అని ప్రశంసించారు.

“మనిషీ మనిషీ కలుసుకోకుండానే, ఎక్కడివాళ్ళక్కడే వుంటూకూడా విషయాలు తెలుసుకోవచ్చునని మీ పురాణాల్లో వుందటగా? నువ్వే చెప్పావు, మహాభారతయుద్ధాన్ని ఇంట్లో కూర్చుని గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు చూసాడని? అలాంటివేవైనా తెలుసేమో అడుగు. లేకపోతే నువ్వు చెప్పేవన్నీ అబద్దమనుకుంటాను” ఐన్‍స్టీన్‍గారు అన్నారు.

“ఆ విజ్ఞానమంతా మట్టిలో కల్సిపోయింది, అందుబాటులో లేదని చెప్పానా? నాకూ కొన్ని తెలీవు. తెలిసినవి చెప్పినా నువ్వు నమ్మవు. ఆధారాలు చూపించమంటావు. నీతో ఎలా వేగేది?”

“ఆధారాలు లేనిదాన్ని సైన్సు నమ్మదు”

“బిగ్‍బేంగు సిద్ధాంతాన్ని ఏ ఆధారాలున్నాయని నువ్వు నమ్ముతున్నావు?”

“ఆ సిద్ధాంతాన్ని ఎవరూ ఇప్పటిదాకా ఖండించి కొత్తసిద్ధాంతాన్ని చెప్పకపోవటం చేత.”

“సరిసరి. నీతో ఎవరు పడగలరు? కొన్నిటిని నమ్మి ముందుకెళ్తేగానీ ప్రయోగాలు సాగవు” కోపంగా అన్నారు ఆర్యభట్టుగారు.

వాళ్ళిద్దరూ చిన్నపిల్లల్లా కొట్లాడుకున్నారు. ఇద్దరూ మాటలాపాక నేను మొదలుపెట్టాను. డీ ఎన్ ఏ గురించి చెప్పాను. వాళ్ళు చాలా కుతూహలంగా విన్నారు. చాలాసేపు మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నారని అర్థమైంది. నా ట్రాన్స్మిటర్ కి అన్నీ అందటంలేదు. ఇందాకా చిన్నపిల్లల్లా కొట్లాడుకుంటున్నారని అనుకున్నాను కదూ, అందుకు వాళ్ళ మాటలు ట్రాన్స్మిటర్‍కి అందకుండా చూసుకున్నారు. కొన్ని మాత్రమే వినిపిస్తున్నాయి. నా మనసులోనివిమాత్రం భావాల సైతంగా అన్నీ తెలుస్తున్నాయి. నేను అడక్కుండానే వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. అడక్కుండానే అంటే నాలో రేగిన ప్రశ్నలు బైటికి రాకుండానే అని. పదిహేనువందల సంవత్సరాలక్రితం బతికిన ఆర్యభట్టుగారు ఇప్పటి తెలంగాణాలో ఒకప్పుడు విలసిల్లిన అశ్మకవిజ్ఞానకేంద్రానికి చెందినవారట. అలాని భాస్కరాచార్యులు ఒకచోట రాసారు. చనిపోయాక వంటరిగానే విశ్వంలో పరిభ్రమిస్తూవుండేవారట.

“కాలంమధ్యలో కొందరు విగతజీవులు పరిచయమయ్యారుగానీ వారికి తాము శరీరగతజీవులుగా వున్నప్పుడు కలిగిన నష్టాలకి ప్రతీకారం తీర్చుకోవాలనేగానీ ఒక వున్నతమైన ఆశయం, గమ్యం లేవు. అలాంటివారి మైత్రిని మేము స్వీకరించలేకపోయాము” అన్నారు. వారికి నమస్సులు సమర్పించాను. చిరునవ్వుతో స్వీకరించారు.

ఐన్‍స్టీన్‍గారుకూడా తమ వునికిని నిలబెట్టుకోవాలనుకునేసరికి ఇద్దరికీ దోస్తీ కలిసింది. అప్పట్నుంచీ మొదలయ్యాయి ఖగోళవాసులకి కష్టాలు. ఐన్‍స్టీన్‍గారు e=mc>2 అనే సిద్ధాంతాన్ని కనిపెట్టినవారు. ఒక పరమాణువులో అపారమైన శక్తి ద్రవ్యరూపంలో నిలవుంటుందనీ, పరమాణు విచ్ఛేదం చేస్తే ఆ ద్రవ్యం తిరిగి శక్తిగా విడుదలౌతుందనీ సూత్రీకరించి ఆటంబాంబులని కనిపెట్టారు. ఇప్పుడు దాన్నే విలోమపద్ధతిలో వుపయోగిస్తూ అపారమైన శక్తిని ద్రవ్యంగా మార్చుతూ ఒక శరీరాన్ని తయారుచేసుకోవాలని శతథా ప్రయత్నిస్తున్నారు.

“అసలంత పెద్ద నక్షత్రాన్ని ఎలా కదిలించగలుగుతున్నారు?” కుతూహలంగా అడిగాను.

“నిలబడ్డానికి చోటూ, సరిపోయేంత లెవరూ ఇస్తే భూగోళాన్ని కదుపుతానన్నాడటగా, ఆర్కిమెడిస్ అనే శాస్త్రవేత్త? గరిమనాభిమీద ప్రయోగిస్తే ఎంతటి వస్తువేనా మన అధీనంలోకి వచ్చేస్తుందికదండీ! మేమూ అదే చేస్తున్నాం. అదేదో లేజరు టెక్నాలజీట. నేర్చుకున్నాములెండి. ఒక కడ్డీని తయారుచేసుకుని నక్షత్రగరిమనాభిమీద ఆనించి తోసుకుంటూ కొంతదూరం వెళ్తాము. తర్వాత వారేమో దాన్ని పదార్ధంగా మారుస్తారు. దాన్ని మళ్ళీ తోసుకుంటూ వెళ్ళి మా వ్యోమనౌకలో అతికిస్తాం”

“మీకు వ్యోమనౌకెక్కడిది?” ఆశ్చర్యపోవడం నా వంతైంది.

“నౌకంటే పూర్తి నౌక కాదులెండి. పేలిపోయి గింగుర్లు తిరుగుతున్నదాన్ని అధీనంలోకి తెచ్చుకున్నాం”

“ఎవరిది? ఏ దేశానిది? ఎప్పటిది?”

“అదేదో యూ ఎస్ ఎస్ ఆర్ అని రాసుంది”

“హతవిధీ!”

“మాదగ్గిర చాలారకాల పదార్థాలున్నాయి. ప్రాణంమాత్రం పుట్టడంలేదు. నానో టెక్నాలజీట అదీ నేర్చుకున్నాం” అన్నారు ఆర్యభట్టుగారు.

“మీరిద్దరూ ఎలా మాట్లాడుకుంటారు? భాషలూ, భాషాకాలాలూ, తదనుసారంగా మారే శబ్దోత్పత్తి పద్ధతులూ వేరుకదా?”

“అయ్యా! బాషలు వేరైతేనేమి? రాయి వుంది, ఎదురుదెబ్బ తగిలింది. బొటనవేలు చితికింది. రక్తం కారుతున్నది. బాధ మొహంలో వ్యక్తమౌతోంది. మనం అమ్మా అంటాం. వారు గాడ్ అంటారేమో! భావం ఒకటేకదా? ఎదుటివారి స్పందన ఒకటే వుంటుంది. జాలి. అందులో అర్థం కాకపోవటానికేముంది?”

“…”

“సహవాసంమీద కూడా నేర్చుకున్నాము. వారి భాషకికూడా మాతృక సంస్కృతమే కావచ్చుననిపించింది. వారి మదర్‍కీ, ఫాదర్‍కీ మాతృక మన మాతృ, పితృ శబ్దాలే. అంతకన్నా సారూప్యత ఇంకేం కావాలి? ఐనా మాకు భాషలెందుకు, అవన్నీ మీలాంటి శరీరగతప్రాణులకిగాణి” మేమిలా మాట్లాడుకుంటుంటే ఐన్‍స్టీన్‍గారు గదంతా కలయతిరుగుతూ నా కంప్యూటర్లోకి దూరుతూ బైటికి వస్తూ దాని కీస్ నొక్కాలని శరీరాన్ని చిన్నగా చేసుకుని ఆ చిన్ని శరీరంతో ఎగిరి దూకుతూ చాలా ప్రయోగాలు చేస్తున్నారు.

మధ్యలో ఒకమాటు ఆగి, మాకేసి తీవ్రంగా చూసి,” ఇలాంటి పరికరం ఒకటి వుంటేనా? ప్రపంచాన్ని మనమే అదుపుచెయ్యలేమూ? నీలాంటి మాటలపోగును కాను నేను. మనకి తెలిసిన నానో టెక్నాలజీతో ఇలాంటిదాన్ని తయారుచేసుకోగలమేమో ఆలోచించు” అన్నారు. ఇక్కడికొచ్చినప్పుడు వాళ్ళకి ఒకటే అవసరం. ఇప్పుడు రెండయాయి. ఇంకా పెరిగేలా వున్నాయి. ఈ లేబ్‍లోనే వాళ్ళూ ప్రయోగాలు చేసుకుంటామంటారేమో! వాళ్ళంటే అశరీరులు. దేన్నేనా తట్టుకోగలరు. నక్షత్రాలు తవ్వుకురావటమవీ ఇక్కడ సాధ్యపడవు మరి!

“మేమంత కుత్సితులం కాదు.వాస్తవం చెప్పాలంటే మీ ప్రయోగాలు వేరు, వాటి స్థాయి వేరు” కోపంతో కూడిన జవాబు. మళ్ళీ వెంటనే బుజ్జగింపు. “మీరొకమాటు మాతో వచ్చినట్టైతే మా ప్రయోగాలు మీకర్థమౌతాయి. కాలాంతరం, భాషాంతరం వున్నాయికదా, కంటితో చూడనిదీ ఏదీ తెలియదు. ఇందాకే మీకు రాయీ, రక్తమూ వుదాహరణ చెప్పాను” అన్నారు ఆర్యభట్టుగారు.

“ఎక్కడుంటున్నారు? మీ ప్రయోగశాల ఎక్కడ?” కుతూహలంగా అడిగాను.

“దగ్గిర్లోనే”

“బిగ్‍బేంగ్‍తో ముందు నాన్ లైఫ్ పుట్టింది. తర్వాత ఎంతోకాలానికి లైఫ్ పుట్టింది. సృష్టిలోనూ నీరుంది, మనిషి శరీరంలోనూ నీరుంది. అలాగే ఇనుము, మెగ్నేషియం, కేల్షియం…అన్నీ బైటా వున్నాయి, లోపలా వున్నాయి. మౌలికపదార్ధాలు ఒకటే అయినప్పుడు మేం ప్రయత్నిస్తే శరీరం ఎందుకు తయారవటం లేదు? ” ఐన్‍స్టీన్‍గారు దిగులుగా అన్నారు. “నేను ప్రాణిని తయారుచేసే ప్రయత్నంలో వున్నాను. ప్రాణం పుడితే శరీరం అదే తయారౌతుంది” “దాంతో ఆత్మకూడా వుంటుంది. అది మమ్మల్ని రానివ్వదు. మా శరీరాలు మాకు కావాలి. వాటిల్లో మేమే వుంటాం” ఆర్యభట్టుగారు కచ్చితంగా అన్నారు. వాళ్ళ ప్రయోగాలు చూడాలన్న కుతూహలాన్ని చంపుకోలేకపోయాను. వెళ్ళటానికి లేచి వుద్యుక్తుడనయ్యాను. వాళ్ళిద్దరూ నాకు చెరోవైపునీ నిలబడి వున్నారు, తోడ్కొనిపోవటానికి అతిథిమర్యాదలు చేస్తున్నట్టు. రోదసిలోకి వెళ్ళటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి మర్చిపోయాను. ప్రద్యుమ్న గదివైపు చూసాను. అతనింకా చర్చల్లోనే వున్నాడు. వచ్చాక మాట్లాడుకోవచ్చని ముందుకి సాగాను. లేబ్‍లోంచీ రోదసిలోకి దారితీసే తలుపు తెరిచానో లేదో ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసాను. …నేను వేసుకున్న దుస్తులతోసహా నా శరీరం నా కళ్ళముందే జెట్టీసన్ చేస్తూ కనిపించింది. విభ్రాంతికి గురయ్యాను. మరికాస్త దూరంలో గాల్లో తేలుతూ, తేలికపాటి ఇంకో నేను.

“వాళ్ళు వ్యాస్‍ని ఎత్తుకుపోయారు. హీ ఈజ్ నో మోర్. వాళ్ళిద్దరూ నాకు కనిపించలేదుకానీ వ్యాస్ ఎయిమ్‍లెస్‍గా లేబ్‍డోర్ వైపు వెళ్ళటాన్ని చూసి ఆపబోయాను. ఐ వజ్ లేట్. అయాం సో సారీ” అనో, “వ్యాస్ వెళ్ళాక వాళ్ళ అల్లరి చాలా తగ్గింది. వాళ్ళని చాలా కంట్రోల్ చేసాడు” అనో, ప్రద్యుమ్న బాస్ హైకమాండ్‍తో చెప్పటాన్ని నేనిప్పుడు ఎలాంటి ట్రాన్స్మిట్టర్ లేకుండా వినగలను.