బంధీ by S Sridevi

  1. పాతకాలపు మనిషి by S Sridevi
  2. ఒలీవియా by S Sridevi
  3. నాకొద్దీ అభ్యుదయం by S Sridevi
  4. అర్హత by S Sridevi
  5. సింధూరి by S Sridevi
  6. మలుపు by S Sridevi
  7. యంత్రసేవ by S Sridevi
  8. ప్లాస్మా జీవులు by S Sridevi
  9. మనుషులిచ్చిన శాపం by S Sridevi
  10. వంకరగీత by S Sridevi
  11. బంధీ by S Sridevi
  12. లాటరీ by S Sridevi
  13. ముల్లు by S Sridevi
  14. లే ఆఫ్ by S Sridevi
  15. నేను విసిరిన బంతి by S Sridevi
  16. మలివసంతం by S Sridevi
  17. తప్పనిసరిగా by S Sridevi
  18. ప్రేమరాహిత్యం by S Sridevi
  19. పార్థివం by S Sridevi
  20. ఖైదీ by S Sridevi

Youtubers please WhatsApp to 7382342850


“వెధవ్వుద్యోగం… పొద్దున్న పదింటినుంచీ సాయంత్రం ఆరింటిదాకా ఆఫీసులోనే కొట్టుకుంటుంటే ఇంటికొచ్చాక ఏదేనా చెయ్యడానికి టైమేం వుంటుంది?
చీరలకి ఫాల్స్ కొనాలి, టైలర్‍కివ్వాలి. అశోకాలో మంచి సినిమా వచ్చిందట. వెళ్ళి చూడాలి. విశాలాంధ్రలో కొత్తపుస్తకాలేం వచ్చాయో! అవి సరదాలు కాదు. పనులే. చేయాల్సినవి ఎన్నో ఉంటాయి. ఒంట్లో ఓపికుండదు. పాతికేళ్ళకే ముప్పాతికేళ్ళచ్చినట్లు…
ఛ…ఛ దరిద్రపు ఉద్యోగం . చేరినప్పట్నుంచీ అసంతృప్తి నాకు . రోజులోని యాక్టివ్ పార్టంతా తినేసి, నన్ను నిర్వీర్యం చేసి ఇంటికి పంపించే ఈ వుద్యోగం నాకెప్పుడూ నచ్చదు.
ఉద్యోగం అంటే ఇలాగే ఉండాలా ? మరోలా ఉండకూడదా ? మరోలా అంటే ? నవ్వుతూ తుళ్ళుతూ అనాయాసంగా చేసినట్టు ఎందుకు వుండకూడదు? రాసిందే రాస్తూ, రాసిందే చేస్తూ, జమాఖర్చుల లెక్కలు ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటూ మూసలో పోసి తీసినట్టు రోజులన్నీ ఒక్కలాగే ఎందుకుంటాయి, ఎలాంటి మార్పులేకుండా? పేజి తిప్పు, పని నేర్చుకో. పాతవాళ్ళకేనా కొత్తవాళ్ళకేనా ఒకటే సూత్రం. ముందువాడు ఐకి ఏ వంపులో చుక్కపెట్టి, టీకి ఏ వంకరగీత గీస్తే మనమూ అలాగే చెయ్యాలి. ఒరవడి మార్చడానికి వీల్లేదు. కొంచెం సృజనకోసమేనా.
చాలీచాలని జీతం. పేరుకుపోతున్న అసంతృప్తి. ఏదో చెయ్యాలన్న ఆరాటం. ఏదీ చెయ్యలేని అసక్తతత. జీవితం మారకం విలువ రూపాయల్లో. కాలం విలువ అమూల్యం. అమూల్యమైనవెన్నో మనకి దొరకనట్టే ఇదీను.
అదే నా అసహనం. నాకొక్క గంట టైమ్ కావాలి . రోజు మొత్తంలో నాకోసం నేను ఖర్చు పెట్టుకోవడానికి. ఎవరూ నా తపన అర్ధం చేసుకోరు .
అమ్మంటుంది, “ఆడపిల్లకు అంత అసహనం పనికి రాదే ! ఓర్మి ఉండాలి “
ఓర్మిగా ఉండడానికి నేనేం అందరాడపిల్లల్లాగా పెరిగినదాన్ని కాదు . పద్ధెనిమిదేళ్ళు నిండగానే “ నీ కట్నం డబ్బు నువ్వే సంపాదించుకోవాలని అన్యాపదేశంగా హెచ్చరించి, ఉద్యోగంలో ఇరికించేసి, లోకంమీదికి వదిలారు. పొద్దున్న ఆదరాబాదరాగా ఇంత తిని రెండు బస్సులు మారి, ఆఫీసుకెళ్ళి బండరాత రాసి, మగకబుర్లన్నీ విని, మళ్ళీ రెండు బస్సులుమారి ఏ ఏడింటికో ఇల్లు చేరే నాలో అమ్మ ఆశించే ఆడపిల్లతనం ఎక్కడినుంచి వస్తుంది ?
తరువాతి అధ్యాయం పెళ్ళి.

ఏడేళ్ళు నన్ను జాబ్ చేయనిచ్చి , వాళ్ళ చిన్నాచితకా అవసరాలు తీర్చుకొని సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. కట్నాల అంబరంలో నాకందిన చందమామ నాలాగే క్లర్కు. ఉద్యోగం చేసే పిల్లైతే బంగారుగుడ్లు పెట్టే బాతనే తలపుతో ఏరికోరి నన్ను చేసుకున్నారు. కట్నంలో కొంత మినహాయింపు ఇచ్చి. ఏడేళ్ళ కష్టానికి దక్కే ప్రతిఫలం ఇదేనా అని నీరుకారిపోయాను.

“నయం ఏడేళ్ళకన్నా నీకు పెళ్ళి చేశారు మీవాళ్ళు. పదేళ్ళనుంచి నా సంపాదన తింటున్నా, ఆ ధ్యాసే లేదు మా నాన్నకి. పాడిగేదెని పిండినట్లు పిండుకుంటున్నాడు . వదులుకోలేకపోతున్నాడు ” అని ఓదార్చింది నా పక్కసీట్లో ఉండే రత్న.

సర్దుకుపోయాను.

ఎవరివరికి ఎంతెంత జీతాలొస్తాయో ముందే తెలిసినా మరోసారి నిర్ధారణకోసం అనుకున్నాం. ఎంతెంత పాకెట్‍మనీ అవసరం , ఇంట్లో ఎంత ఇవ్వాలి , మాకోసం ఎంత దాచుకోవాలి, పిల్లల్నెప్పుడు కనాలి … అన్నీ మొదటి రాత్రి మాడ్రన్‍గా చర్చించుకొని వప్పందాలు చేసుకున్నాం.

అత్తగారిది అదో టైపు. “ఈవేళ వంకాయ కూర చెయ్యనా ” అని అడిగితే, అది తప్పించి మరేదైనా వండమంటుంది. ప్రతిదీ ఆవిడకి చెప్పాలి. చెప్పడమంటే వట్టి చెప్పడం కాదు, విన్నవించుకోవాలి . ఆవిడ అనుమతికోసం , ఆమోదముద్రకోసం ఎదురుచూడాలి . ఉద్యోగస్థురాలిని, నాకివన్నీ ఎక్కడ కుదుర్తాయి?

నాకు తోచిందేదో వండి , ఇంత తిని ఆఫీసుకు పరుగెడ్తే వచ్చిన కితాబులు, పొగరుబోతుపిల్ల, ఉద్యోగం చేస్తున్నానని అహంభావం, పెద్దవాళ్ళను గౌరవించడం రాదని.
” పోనీ, అమ్మ చెప్పినట్లే చెయ్యకూడదూ ? ” భర్త పాత్రలో భార్గవ సలహా.
“టైమ్ చాలదు”కాలాభావంతో రగిలిపోతుండే నా మనసుకు నచ్చిన జవాబు!
“ఓ గంట నిద్ర తగ్గించుకుంటే సరి” నాకు కమ్చీతో కొట్టినట్టైంది. రోజూ ఏడింటికి గానీ నిద్రలేవని మహానుభావుడు తనకన్నా గంట ముందు లేచే నన్ను ఇంకో గంట ముందు లేవమంటున్నాడు . అదీ నా కోసం కాదు. వాళ్ళమ్మకు ఆజ్ఞలను పాటించడానికి.
పగ్గాలు నా చేతిలోకి తీసుకోకపోతే ఈ ఇంటికీ నా ఉద్యోగానికీ లంగరందందు. రోజూ లేటైతే ఆఫీసులో వూరుకోరు. మాటలు పడాలి. ఎవరు ఏమైనా అనుకోనీ. అచ్చం మగవాడిలాగే ఆలోచించాను. కొంత సంఘర్షణ. కొంత ఒరిపిడి. మరి కాస్త పదును. ఆపైన ఇంటివాళ్ళు ఎగరేసిన శ్వేతకేతనం !

నాకు ముగ్గురాడపడుచులు. మా పెళ్ళైన దగ్గర్నుంచి మా పెద్దాడబడుచుకి పెళ్ళి చేసెయ్యాలని పట్టుకుంది అత్తగారికి. ఆ పిల్ల కోసం ఎంత దాచారో తెలీదు. మేం ఎంత ఇవ్వాలో చెప్పరు. వాళ్ళ దృష్టిలో అవన్నీ నాకు తెలియకూడని విషయాలు. అంటే … డబ్బు సంపాదించి ఇవ్వడం వరకే నా బాధ్యతగానీ, ఖర్చుల గురించీ, బాధ్యతల గురించీ అడిగే అర్హత నాకు లేదు. చూస్తూ ఊరుకున్నాను.

రెండు సంబంధాలొచ్చాయి. ఒకటి డాక్టర్ , ఇంకోటి లెక్చరర్. పెళ్ళిలో నాకు పెట్టిన నెక్లెస్‍తో అలంకరించి పిల్లని చూపించారు. మా స్థాయి ఎంతలో ఉందో నాకర్థమైంది . రెండోసారి పెళ్ళిచూపులైన రాత్రే నేను భార్గవని అడిగేశాను, “దుర్గ పెళ్ళికి ఎంత దాచారు? మనం ఎంత ఇవ్వగలం?” అని.

“ఇంకా సంబంధమే కుదరలేదుకదా, కుదరనీ ముందు. డబ్బు సంగతి అప్పుడు ఆలోచిద్దాం” అన్నాడు.

“ప్లానింగ్ ఏమీ లేదా?” షార్ప్‌గా అడిగాను.

“ప్లానింగంటే?”

“మనం ఎంత ఖర్చుపెట్టగలం? మన దగ్గర వున్నదెంత? ఇంకా ఎంత సమకూర్చుకోవాలి? దుర్గ ఒక్కతే కాదుకదా! తర్వాత ఇంకా ఇద్దరున్నారు . వాళ్ళ సంగతేంటి ? ఇవన్నీ ముందుగా అనుకోరా?”

“ఏమోమరి! అవన్ని నాకు తెలీదు. నన్నూ, తమ్ముణ్ణీ చదివించి ఇంత పెద్ద కుటుంబాన్ని లాక్కొచ్చేసరికి మా నాన్న పనైపోయింది. చెల్లెళ్ళ పెళ్ళీ తర్వాతి బాధ్యతంతా నాదీ, తమ్ముడిదీ” అన్నాడు భార్గవ.

“దుర్గ పెళ్ళికి అతనెంత ఇస్తాడట?”

భార్గవ ఇబ్బందిగా చూశాడు. “ఇలాటిని ఓపెన్‍గా మాట్లాడుకుంటారా?” అడిగాడు.
“ఇటువంటి విషయాలు చర్చించుకుని ఓ నిర్ణయానికి రాకపోతే సెటిలౌతాయా ? ” ఎదురుప్రశ్న వేసాను.
” పాతిక ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ” అన్నాడు భార్గవ చివరికి .
” పాతిక … అంటే మనం …. ? “
” మిగతాది”
“అదే ఎంత ? “
“ఎవరు చెప్పగలరు ? “
“నేను చెప్పగలను”
“ఎంత ? “
“ఇంకో యాభై”
“చాలా ?”
“పెద్దపెద్ద సంబంధాలకి వెళ్ళకండి . బతికున్నంతకాలం వాళ్ళకి మనం భావదాస్యం, ఆర్ధికదాస్యం చెయ్యాలి. మనకి తగ్గ సంబంధం చూడండి”

“అమ్మ ఒప్పుకోదు”
“ఒప్పించండి “
“వినదు”
“అయితే , మీ తమ్ముడిలా మీరూ పాతిక చేతిలో పెట్టి ఊరుకోండి “
“అది కాని పని”
“యాభైకన్నా మనం ఖర్చుపెట్టడం కూడా కానిపనే. ఎగురలేని ఎత్తులకి ఎగిరి అవి అందుకోలేక కింద పడేకంటే ఇది బెటరు. మీరే ఆలోచించండి” అన్నాను.
మర్నాడు భార్గవ తల్లితో ఇదే మాట అన్నట్టున్నాడు . ఆవిడ తారాజువ్వలా నామీదికి లేచింది . ఎన్నెన్నో మాటలు , ఎన్నెన్నో తిట్లు . భార్గవ తమ్ముడు రాంజీ నా పక్షాన మాట్లాడాడు. ఆ ప్రకరణం ముగిసింది . దుర్గకి టీచరు సంబంధం కుదిరింది .

మా ప్లానింగ్ ప్రకారం దుర్గ పెళ్ళైన తర్వాత మాకు శ్వేత పుట్టింది. రాంజీకి పెళ్ళైంది. అతని పెళ్ళితో ముడిపెట్టి రెండో ఆడబడుచు అరుణ పెళ్ళి చేశాం . మిగిలిందల్లా లక్ష్మి ఇంటరు చదువుతోంది. పెళ్ళికి ఇంకా తొందరలేదు.

ఇంట్లోవాళ్ళలో మార్పొచ్చింది. “ఈ చాకిరి నేను చెయ్యలేనమ్మా ” అని అత్తగారు విసుక్కోవడం.

“పదయ్యేసరికి టింగురంగా అని ఆఫీసుకు వెళ్ళిపోతే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు? ” అని రాంజీ భార్య విసుక్కోవడం.

వీళ్ళందరూ నానుంచి పడుతున్న కష్టాలని కడతేర్చడానికి కంకణం కట్టుకున్నట్లు రాంజీ పొరుగూరు ట్రాన్సఫర్ చేయించుకోవడం.

వరసక్రమంలో నా నిమిత్తం లేకుండా జరిగిపోయాయి. చైతన్యంతో కిటకిటలాడిన ఇంట్లో మరణానంతరపు ప్రశాంతతలాంటిది చోటుచేసుకుంది . వెలవెలబోతున్న నాలుగ్గోడలు, వాటి మధ్య భావశూన్యమైన నిశ్శబ్దం … అగాథానికి అటు అంచుని నేనూ, ఇటు అంచుని భార్గవ. మా ఇద్దరినీ ఒక్క దరికి చేర్చాలని చెరోచేతినీ మావైపు చూపుతూ చిన్నారి శ్వేత .

“నీకు సంబంధాలు నిలుపుకోవటం రాలేదు ” భార్గవ నిర్ధారించాడు. జరిగిన వాటిమీద అతని విశ్లేషణ. గాజు వస్తువు మీదికి రాయి విసిరే అది ఒక్కసారే పగులుతుంది. పదేపదే విసిరితే అందులో ఇంకా పగలడానికేమీ ఉండదు. నా మనసనే గాజు వస్తువుమీదికి ఇలా వచ్చి పడ్డ కంకరరాళ్ళెన్నో.

“కావచ్చు” భార్గవ మాటల్ని నేను ప్రతిఘటించలేదు. అతని మాటల్ని ఒప్పుకుంటూనే నా భావాలని చెప్పాను . ” నేను వుద్యోగస్తురాలిని. ఒకరకంగా ఉద్యోగం అనే బందిఖావాలో బందీని. నా స్వేచ్ఛకి పరిధి ఉంది. నాకు కొన్ని హద్దులున్నాయి . నేనేం చేసినా వీటికి లోబడే చెయ్యాలి . అలాంటప్పుడు మీరంతా కోరుకునేస్థాయిలో సత్సంబంధాలని నిలబెట్టుకోవటంఎక్కడ కుదురుతుంది ? ”

“లోకంలో మవ్వొక్కదానివే బాబ్ చేస్తున్నట్లు చెప్తావేంటి ? మా ఆఫీసులోనే చాలామంది లేడిసున్నారు . వాళ్ళంతా చాలా డీసెంటుగా ఉంటారు ” అన్నాడతను కోపంగా.

” మీ పక్కసీట్లో కూర్చుని తలొంచుకుని పనిచేసే స్త్రీలో ఆ టైమ్‍లో మీరు చూసేది ఒక భాగాన్నే. ఆమె సమర్థర్ధవంతంగా ఉద్యోగిని రోల్‌ని పోషించడాన్ని మాత్రమే. ఆమె వ్యక్తిగత జీవితాన్నీ , ఇల్లాలి పాత్రనీ తట్టి చూడండి . గుండెల్ని ఎన్ని ఉప్పెనలు ముంచెత్తుతుంటాయో మనసుని ఎన్ని భావోద్వేగాలు చిందరవందర చేస్తుంటాయో”

“నాన్సెన్స్. ఉద్యోగాలొచ్చాక ఆడవాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్సూ లేవు . అలా లేకపోవడమే మీకు ముఖ్యంగా నీకు పెద్ద సమస్య ”

“నిజం చెప్తే అలానే ఉంటుంది. టిప్‍‍టాప్‍గా గేబ్డిన్స్ వేసుకునే ఆనందరావులెందరో మైసూర్‍క్రేపులో అందంగా అలంకరించుకున్న మయూరల్ని లాగి లెంపకాయలు వేసి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ ఉంటారని చెప్తే నమ్మరేం ? లాగి లెంపకాయంటే మొహమ్మీద కాదు. మనసుమీద. అర్థమైందా? ” గట్టిగా అడిగాను . నా తప్పు లేకుండా , నా తపనేమిటో తెలుసుకోకుండా , నా నిస్సహాయతని అర్థం చేసుకోకుండా అతను నన్ను నిందిస్తున్నాడని చాలా వుద్రేకం వచ్చింది.

“నీ తలకాయ” అన్నాడు.

నేను నీరుకారిపోయాను. మా వాదన ఇలా ముగిసిపోయింది . శ్వేతని క్రెష్‍లో చేర్చి, తర్వాత స్కూలుదాకా తీసుకెళ్ళడంతో, మాకోసమే మేం బతకడం అనే కొత్త ప్రకరణానికి శ్రీకారం చుట్టాం. మొదట్లో భార్గవ చీటికీమాటికీ ఒక్కడుగానో, పాపతోనో, నన్నూ కలుపుకునో తమ్ముడి ఊరు వెళ్ళివచ్చేవాడు. జేబులో ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళ పొగడ్తలకి ఉబ్బిపోయి, అంబరంమీద నడుస్తున్నట్లు తిరిగొచ్చేవాడు. నేనో క్షుద్రప్రాణిలాగేనా కనిపించేదాన్నో, లేదో. నెలాఖర్లో నామీద పాకెట్‍మనీకి ఆధారపడుతూ నా చూపులు తన చూపుల్లో కలవకుండా జాగ్రత్తపడేవాడు. క్రమేపీ తక్కువ డబ్బుతో అక్కడికి వెళ్ళడం, అక్కరకు రాని చుట్టమనిపించుకోవడం, ఆ తర్వాత వెళ్ళడం తగ్గించడం అనే మూడు మెట్లు దిగివచ్చిన తర్వాత నాకు దగ్గరయ్యాడు.

“మనిషికీ మనిషికీ మధ్య ఉండేవి ఆర్థికపరమైన బంధాలే ” అన్నాడు నాతో.

“నన్ను కూడా ఆ కోవలోకి చేరుస్తున్నారా?” అడిగాను చకితురాలినై.

“రా ! ఇలా దగ్గరికొచ్చి కూర్చో ” అన్నాడు . నేనలాగే చేశాను. అతను చాలా ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకుని, ” నువ్వూ నేనూ వేరువేరని ఎప్పుడూ అనుకోలేదు . ఒకటిలో మనిద్దరం చెరిసగం . కానీ, మనిద్దరమే కలిసి జీవితం కాదు. అందులో ఒక భాగం. సముద్రంలో చుక్కంత. సముద్రం లేనిదే మనకి అస్థిత్వం లేదు. చుట్టాలూ, బంధుత్వాలూ, బాంధవ్యాలూ … ఇవన్నీ ఉంటేనే మన ఉనికి. అర్ధమైందా? నీకివి బోధపరచలేక నేనూ, గ్రహించలేక నువ్వూ కమ్యూనికేషన్‍గ్యాప్‍తో అవస్థపడ్డాం ఇన్నాళ్ళూ ” అన్నాడు .

లక్ష్మికి పెళ్ళి వయసు వచ్చింది. సంబంధాలు చూస్తున్నారు. రాకపోకలు పునరుద్దరించబడ్డాయి. పెళ్ళిచూపులకి మా ఇంట్లోనైతే అనువుగా ఉంటుందని అందరి అభిప్రాయం. అద్దె యిల్లైనా అందంగా అలంకరించబడిన డ్రాయింగ్‍రూమ్, కలర్‍టీవీ, ఫ్రిజ్‍లాంటి అప్లయన్సెస్, సోఫాసెట్, క్రాకిరీ – ఇవన్నీ పెళ్ళిచూపులకి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. అంతా బాగానే ఉంది. నాకూ ఆ అమ్మాయి పెళ్ళి వీలైనంత తొందరగా జరిగిపోవాలనే ఉంది . కానీ …

“నీకిష్టం లేకపోయినా రాక తప్పలేదు. ఆడపిల్ల బాధ్యత తీర్చుకోవడానికి పౌరుషం చంపుకొని వస్తున్నాం “అంది అత్తగారు కొడుకు వినేలా.

నేను జవాబివ్వలేదు. ఘాటుగా మాట్లాడి ఆవిడ నోరు మూయించవచ్చు. మళ్ళీ నన్ను నొప్పించడానికి ఆవిడ మరో అస్త్రాన్ని వెతుకుతుంది. నేను కూడా ఎదురుదాడికి సిద్ధపడాలి . ఇదంతా ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన వందేళ్ళ యుద్ధంలాంటి వ్యవహారం. తెగదు, పొసగదు. అందుకే మౌనాన్ని ఆశ్రయిస్తాను. తమాషా ఏమిటంటే, రాంజీ భార్య నాలా మాటపడి ఊరుకోదు. అత్తాకోడళ్ళిద్దరూ హోరాహోరీ దెబ్బలాడుకుంటారు. ఎడమొహం పెడమొహంగా తిరుగుతారు. రాంజీ దగ్గర ఒకళ్ళమీద ఇంకొకళ్ళు చాడీలు చెప్పుకుంటారు. అన్నీ అయ్యాక మళ్ళీ కలుసుకుంటారు. అంటే వాళ్ళిద్దరికీ ఒకళ్ళ అంతరంగంలోకి మరొకరికి ప్రవేశం ఉందన్నమాట. నాకన్నా నా తర్వాత వచ్చిన ఆ అమ్మాయే మా అత్తగారికి ఎక్కువ సన్నిహితురాలు. నాకూ ఆవిడకీ మధ్య ఒక లక్ష్మణరేఖ ఉంది . దాన్ని దాటే ప్రయత్నం ఎవ్వరమూ ఎప్పుడూ చెయ్యము . ఆవిడే కాదు . రాంజీ భార్య కూడా. ఇంకా తమాషా ఏమిటంటే, గత్యంతరం లేక నీ ఇంట్లో అడుగుపెట్టామని బాహాటంగా ప్రకటించిన మా అత్తగారు అలాగేమీ ఉండడం లేదు. భార్గవకి చెప్పి ఎయిర్‌‍కూలర్ మా బెడ్‍రూమ్‍లోంచి హాల్లోకి మార్పించుకుంది. టివీకి డిష్, స్టార్ వగైరా కనెక్షన్లన్నీ ఇప్పించుకుంది. రిమోట్ ఆవిడ చేతిలోనే ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మా ప్రైవసీ జాతీయం చెయ్యబడింది. నేను పావు తక్కువ పదింటికి చెప్పుల్లో కాళ్ళు పెట్టగానే అంతా తేలిగ్గా విశ్వసిస్తారు. మళ్ళీ తిరిగి రాగానే వాతావరణం బిగుసుకుపోవడాన్ని నేను స్పష్టంగా గమనిస్తాను. వాళ్ళమధ్య కూర్చుని నవ్వుతూ కబుర్లు చెప్తున్న భార్గవ మొహంలోని నవ్వుకూడా నారాకతో చిత్రంగా మాయమౌతుంది.

“వచ్చావా?” అంటాడు . ఇంకేం అడగాలో, మాట్లాడాలో తోచనట్టు.

“ఊ<” అంటాను.

నేను చెప్పులు విడిచి కాళ్ళూ చేతులూ కడుక్కుని మా గదిలోకి దారితియ్యగానే అతనూ నావెంట వచ్చేస్తాడు . మా వెనుక మిగిలినవాళ్ళు మొహాలు చూసుకొని నవ్వుకుంటారు . చాలా ఇబ్బందికరమైన పరిస్థితి . నా ఇంట్లో నేనే అవాంతర వ్యక్తిని . ఈ కుటుంబంతో ఇన్నేళ్ళ అనుబంధం ఉన్నా ఏ ఒక్కరికీ దగ్గర కాలేకపోతున్నాను . భార్గవ నన్ను ప్రేమించే మాట నిజమేగానీ, తనవాళ్ళ ఎదురుగా దాని ఉనికిని స్థిరపరచలేడు. హాల్లోకెళ్ళి అందరి మధ్యా కూర్చుంటే అత్తగారికి తప్పు. మామగారి ఎదరుగా సోఫాలో నేను కూర్చోకూడదు. టీవీ ప్రోగ్రామ్స్ చూడాలంటే ఓ వారగా మోడా లాక్కుని ఒదిగి కూర్చుని చూడాలి. మామగారు అటూ ఇటూ తిరుగున్నప్పుడు లేచి నిల్చోవాలి. వాళ్ళు పెట్టే ప్రోగ్రామ్స్ చూడాలి. తలా తోకా లేని తెలుగు సినిమాలు, అర్ధం లేని సినిమా పాటలూ చూస్తూ కూర్చోవాలి. “ఆరున్నర దాటాకా ఇంట్లో అడుగు పెట్టి , టీవీకి అతుక్కుపోయి కూర్చుంటే పనెలాగౌతుంది? ” సన్నసన్నగా గొణుగుతుంది అత్తగారు. అందుకే మా గదిలో నన్ను నేను బంధించుకుంటాను.

కానీ, ఎంతకాలం ఇలా ? స్వేచ్ఛ లేకుండా ? భార్గవ తన ఒక్కడి జీతంతోనే అయితే ఇవన్నీ కొనలేడు. వీటి వెనుక నాచెయ్యి కూడా ఉందని , ఈ సౌకర్యాలు అనుభవించడంలో నాకూ భాగం ఉంటుందని ఎందుకు గ్రహించరు? ఈ సమిష్టి కృషిలో నాకూ భాగం ఉందని ఎందుకు సమాదరించరు? ఎందుకీ సెకండ్ కేటగిరీ ట్రీట్మెంట్ ? రాంజీ భార్యకి కూడా ఇలాంటి ఆంక్షలే ఉన్నాయా? లేవు. ఆమెకి తన ఇంటి మీద గ్రిప్పుంది. కనుసన్నల్లో అందర్నీ శాసించగలిగే నేర్పుంది. నేనో ?!

నాకెంతో కొత్త ఉత్సాహం, సంతోషం కలిగాయి . అతన్తో ఇంత సన్నిహితంగా ఎప్పుడూ గడపలేదు .పగలు పనీ, ఆఫీసు హడావిడి. రాత్రి అలసట, పనుల వాయిదా. అతని భార్యగా ఏ ఒక్క బాధ్యతేనా నిర్వర్తించానా నేను, డబ్బు సంపాదించడం తప్ప? నీకే కూర యిష్టం? నేను ఏ చీర కట్టుకుంటే నీకు నచ్చుతుంది? అని అడిగానా? తెలుసుకోగలిగానా? కనిపించని సంకెళ్ళు నా వ్యక్తిగత జీవిత మాధుర్యంనుంచి నన్ను దూరంగా లాక్కెళ్తున్నాయి.

ఇల్లంతా వీళ్ళమీద వదిలేసి వెళ్తాను. ఇల్లు వాళ్ళదేననిపిస్తుంది. రాంజీ భార్య చంటిపిల్లల్తో చేసుకోలేదని ఓపూట వంట మా అత్తగారు చేస్తుంది . ఆ పిల్ల ఇబ్బందిగా ఫీలౌతుందని మామగారు ముందుగది వదిలి రారు. వచ్చినా ఆ పిల్లపట్ల వాత్సల్యాన్ని ప్రకటిస్తారు. మనుషుల్లో ఎందుకు ఇన్ని ముఖాలు ? నాతో ఒకలా , ఆ పిల్ల దగ్గర మరొకలా ఎందుకు ప్రవర్తిస్తారు? ఇక్కడ ఇలా, అక్కడ సర్దుకుంటూ మరోలా ఎందుకు గడుపుతారు? ఉద్యోగస్తురాలిని కావటం చేత మామూలు అమ్మాయిలా కాకుండా ప్రత్యర్థిలా కనిపిస్తున్నానా? సదుపాయాలన్నీ సమకూర్చుకోవటంలో నా కృషి వుందని గుర్తించడం బాధ కలిగిస్తుందా? ఎన్నో ప్రశ్నలు. నాకో పరిష్కారం కావాలి.

“ఇరవయ్యేళ్ళ సర్వీసు పూర్తైంది. వాలంటరీ రిట్మైంట్ తీసుకోవాలనుకుంటున్నాను” అన్నాను చాలా ఆలోచించాక భార్గవతో. అతను అర్ధంకానట్టు చూశాడు.

“మీరు రిటైరయ్యాక ఇల్లు కట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన డబ్బు దాస్తే శ్వేత చదువుకీ, పెళ్ళికీ సరిపోతుంది. సేవింగ్స్‌లోంచీ కొంత లక్ష్మి పెళ్ళికిద్దాం. మిగిలినది మన అవసరాలకి ఉపయోగపడుతుంది. నాకు పెన్షనొస్తుంది. చాలదా? సరదాగా గడుపుదాం” అనడిగాను.

“బ్రిలియంట్ ఐడియా” అన్నాడు భార్గవ సంతోషంతో. భావాలెప్పుడూ వంటరిగా వున్నప్పుడే స్థిరంగా వుంటాయి. మరొకరి ప్రభావం పడ్డప్పుడు రూపుమార్చుకుంటాయి.

ఇద్దరం కలిసి ఎన్నో కలలు కన్నాం. రోజూ పొద్దున్నే భార్గవకి యిష్టమైన టిఫెను చేసి పెడతాను. తిని అతను హ్యాపీగా ఆఫీసుకెళ్తాడు. మధ్యాహ్నం వచ్చేసరికి అతనికి ఇష్టమైనవి వండుతాను. సాయంత్రం అతను తిరిగొచ్చేసరికి చక్కగా తయారై ఉంటాను. అతనికి చెస్ చాలా యిష్టం. ఇద్దరం టెర్రస్‍మీద కూర్చుని చెస్ ఆడవచ్చు. ఫ్రెండ్సిళ్ళకు వెళ్ళవచ్చు. అనివార్యమైన పనుల్లా కాకుండా అందులోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ. ఎంత చిన్నచిన్న విషయాలు కలలుగని మరీ తీర్చుకోవలసినంత అపురూపమైనవిగా మారిపోయాయి! ఎవరికేనా నా కలలు ఇవని చెప్తే నవ్వుతారేమో!

“పెళ్ళికి ముందు నువ్వు సుఖపడ్డావో లేదో తెలీదు. పెళ్ళయ్యాక మాత్రం ఇంటా బయటా పనిలో నలిగిపోయావు” భార్గవ ప్రేమతో అన్నాడు.

ముందుగా నాకున్న ఆఫ్ పే లీవుని పెట్టేశాను. వాలంటరీ రిట్మెంట్ నోటీసు కూడా యిచ్చాను. ఇంక ఆఫీసుకు వెళ్ళననుకుంటే … ఇంట్లో తిరుగుతుంటే నాలో ఏదో ఉత్సాహం పెల్లుబుకుతోంది.

“ఇప్పుడు సెలవెందుకు పెట్టావు?” అత్తగారు అడిగింది.

“తను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటుందటమ్మా! ముందుగా కొన్నాళ్ళు లీవు పెట్టి ఇంట్లో ఉంటే బావుంటుందని … ” భార్గవ చెప్తుంటే అతని గొంతులో దాచినా దాగని సంతోషం. అందరిలా గడపాలని అతనికి మాత్రం ఉండదా?

“ఇప్పుడు ఉద్యోగం వదులుకోవాల్సిన అవసరం ఏమిటి ? మీకంతగా డబ్బు ఎక్కువైతే నా చేతికివ్వండి. సవాలక్ష ఖర్చులున్నాయి” మామగారు వెంటనే కలగజేసుకున్నారు. “పెద్దవాడిని నాతో ఒక్కమాటేనా చెప్పకుండా అంతా మీ ఇష్టమేనా ? ” కోపంగా అడిగారు.

“అందులో పెద్దగా కంగారు పడాల్సిందేం లేదు నాన్నా! ఏకమొత్తంలో గ్రాటుయిటీలాంటివి ఇస్తారు. నెలకింతని పెన్షనొస్తుంది. తను ఇంటిపట్టునే ఉంటుంది” భార్గవ డబ్బులెక్కలన్నీ చెప్పేశాడు. అలా చెప్పకుండా ఉండాల్సిందన్న ఆలోచన నాకు కలిగింది. కొన్ని తర్జనభర్జనలయ్యాయి. మొత్తంమీద నేను ఇంట్లోనే ఉండబోతున్నాననేది నిర్ధారితమైంది.

ఇంట్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆతృత,తొందర కనిపిస్తున్నాయి. అదేమిటో నాకు తొందర్లోనే తెలిసిపోయింది. భార్గవ నన్ను వాళ్ళ ఫ్రెండింటికి తీసుకెళ్ళాడు. గంట తర్వాత తిరిగొస్తామని చెప్పి ఇంట్లోంచి బయల్దేరాం. తీరా వెళ్ళేసరికి వాళ్ళింటికి తాళం ఉంది. వెంటనే తిరిగొచ్చేశాం. మేం వచ్చేసరికి తలుపులు ఓరగా వేసి ఉన్నాయి. మాటలు గట్టిగా వినిపిస్తుండడంతో యాంత్రికంగా ఆగిపోయాం.

“మూడు నాలుగు లక్షలొస్తుందట. ఏం చేసేట్టో?” మామగారి గొంతు.

“పెళ్ళప్పుడు ఉద్యోగం చేస్తుందని భార్గవకి పెద్దగా కట్నం ఇవ్వలేదు. దుర్గకీ, అరుణకీ పెద్ద కట్నాలు ఇవ్వలేకపోయాం. వాళ్ళకి చేసినట్లు లక్ష్మికి చిన్న సంబంధం తెస్తానంటే వదిలేది లేదు. ఇంట్లో ఆఖరి ఆడపిల్ల . మంచి సంబంధమూ తేవాలి. పెళ్ళీ గ్రాండుగా చెయ్యాలి” అత్తగారు చెప్తోంది.

“రిటైరైపోయి ఖాళీగా ఉంటున్నాను. పాతికముప్పైవేలతో ఏదైనా చిన్నపాటి వ్యాపారం మొదలుపెడితే సరి. చిన్నమొత్తమే కాబట్టి వచ్చినా పోయినా అంత బాధ ఉండదు. నాకు కాలక్షేపం”

“మంచి ఆలోచనే. అదేదో ఇక్కడే చెయ్యండి. ఇల్లూ వసతీ బావున్నాయి. సదుపాయాలన్నీ ఉన్నాయి. చిన్నాడి ఇంటికెళ్తే ఈ సౌఖ్యాలెక్కడివి? ఇన్నాళ్ళూ అంటే ఈవిడగారు ఆఫీసుకు తగలడితే ఇంట్లో పనంతా చూసుకుంటూ పడుండాలని అక్కడికెళ్ళి ఉన్నాం. ఇహమీదట ఆ బాధ లేదు గదా ! ”

“పనీ అదీ చేస్తుందంటావా ? నీమాట వింటుందా ? ”

“ఇహమీదట ముప్పొద్దులూ తేరగా మేపద్దూ ? వినకేం చేస్తుంది ! ”

“పెన్షనొస్తుందట”

“ఏమూలకి? జీతంపాటి చెయ్యదు కదా?”

నాకింక మాటలు వినిపించడం మానేశాయి. కాళ్ళకింది నేల కదుల్తున్నట్లనిపిస్తుంటే భార్గవని ఆసరాగా చేసుకున్నాను. అతని పరిస్థితీ అలాగే ఉంది. లక్ష్మికి పెద్ద సంబంధం. మామగారి వ్యాపారానికి పెట్టుబడి. అత్తగార్ని కూర్చోబెట్టి చెయ్యడం. పద్దెనిమిదేళ్ళ ప్రాయంనుంచి నా కాలాన్నంతటినీ వెచ్చించి నేను సాధించిందేమిటి ? మిగుల్చుకునేదేమిటి? మంచోచెడో కొడుకు సంపాదననని కోడలితోపాటు పంచుకోవడం అనివార్యంగా సాగిపోతోంది. కోడలి సంపాదనమీద కూడా మాదే హక్కంటే ఎలా? ఉద్యోగం ఉంది కాబట్టి ఆస్తిపాస్తులు లేకపోయినా కొండంత అండగా ఉండేది. ఉద్యోగం వదులుకొని …. తద్వారా వచ్చిందంతా వదులుకొని , ఇంట్లో పడుంటే … అప్పుడు మాత్రం నేను కోరుకున్న జీవితానందం నాకు దక్కుతుందా ? ఒక్కపిల్లతో సరిపెట్టుకుని … ఉద్యోగం చేసింది ఆ పిల్లకేదో ఒరగబెట్టాలని కదూ ? చదువూ, వైద్యం అన్నీ లగ్జరీలైపోయిన యీరోజుల్లో శ్వేతకి మంచి చదువు చెప్పించి చక్కటి సంబంధం తేలేని నిస్సహాయపరిస్థితి తెచ్చుకుంటే అది రేప్పొద్దున్న అడగదూ, మూణ్ణెల్ల పిల్లప్పట్నుంచీ నన్ను వదిలేసి ఆఫీసుకి వెళ్ళావు, నాకోసం ఏం మిగిల్చావని? న్యాయానికి నాకూ, శ్వేతకీ తిండి పెట్టే బాధ్యత అతనినిది. అతనిమీద అలాంటి బరువుని చెయ్యలేదు. పైగా అతని బరువుల్లోనూ, బాధ్యతల్లోనూ చేయూతనిచ్చాను. దుర్గకిగానీ, అరుణగానీ ఎందులోనూ తక్కువ చేయలేదు. లక్ష్మికీ చెయ్యబోము. కానీ వీళ్ళకి సంతృప్తిలేదు. వీళ్ళకు కోడలు అక్కర్లేదు. కొడుకు బాగు అక్కర్లేదు. కోడలనే మనిషి ఒకరు వచ్చి కొడుక్కి అండగా నిలబడి, అతన్నిబట్టి ఆ ఇంట్లోవాళ్ళ అవసరాలు చూస్తోందనిలేదు. అసలు వీళ్ళకు మనుషులక్కర్లేదు. కట్టు బానిసలు కావాలి.

భార్గవకేసి తీక్షణంగా చూశాను. తల దించుకున్నాడు. తప్పుల్ని పరిష్కరించడం అతనికి చేతకాదు. అలా తలదించుకోవడమే వచ్చును. నాకు ఆసరా ఇవ్వాల్సిన వ్యక్తి ఇలా వెన్నెముక లేనట్లు కుప్పకూలిపోతుంటే నేనెంతకని ఒంటరి పోరాటం చెయ్యగలను? ఇంట్లోవాళ్ళకు నేను ఎడం కానీ ఇతను కాదు. మా ఇద్దరి మధ్యా ఉన్న దగ్గరితనం అతనికి వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని ప్రభావితం చెయ్యదుగానీ నాకూ, వాళ్ళకూ మధ్య ఉన్న ప్రేమలేమి మా ఇద్దరి మధ్యా దూరాన్నీ, అగాధాన్నీ సృష్టించిందనేది అనుభవైకవైద్యం. కుటుంబంలోని ఒక వ్యక్తి అమాయకురాలు, నోరు లేనిది, తెలివితక్కువదీ కావచ్చు. లేదా లౌక్యం లేనిది కావచ్చు. ఆమెని అందరూ కలిసి కాపాడకుండా ద్రోహం చెయ్యాలనుకుంటే ఆ కుటుంబానికి అర్థం ఏమిటి? ఇతనూ అందరు భర్తల్లాంటివాడే. నాది స్త్రీవాదం కాదు. ఉనికి పోరాటం. అక్కడికక్కడే అప్పటికప్పుడే నిర్ణయించేసుకున్నాను. తరువాతి అడుగు తెలివిగా వెయ్యాలని.

వెంటనే భార్గవతో అన్నాను ” నేను నోటీసు వెనక్కి తీసుకుంటాను. ఒకసారెప్పుడో మీతో చెప్పాను. ఉద్యోగం అనే బందిఖానాలో బందీనని. నాలాంటి బందీలకు విముక్తి ఉండదు, బదిలీ తప్ప. ఆ జైల్లోంచి బయటపడితే ఇక్కడ మరో జైలు ఎదురు చూస్తోంది” అతను మళ్ళీ తలొంచుకున్నాడు.

(ఇండియా టు డే మార్చి 1998)