ఆంగ్లమూలం: ధూపాటి ప్రభాకర్‌గారి Calibration
కరోనావల్ల తొలిసారి లాక్డౌన్ పెట్టినప్పుడు నేను ఇంట్లోనే వ్యాయామానికి కావలసిన సరంజామా అంతా కొని మరీ ఓ జిమ్‌ను ఏర్పాటు చేసుకున్నాను. మాఇంటి గ్రౌండ్‌ఫ్లోర్‌లో వాడకుండా ఉన్న వంటగదిని నా జిమ్రూమ్ చేసేసుకున్నాను. గ్రౌండ్‌ఫ్లోర్‌లో నాకో డ్రాయింగ్ హాల్, స్టడీ రూమ్, గెస్ట్ రూమ్ కూడా ఉన్నాయి. నేను, నా భార్యతో ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉంటానుకాబట్టి నాకని ప్రత్యేకంగా ఈ గ్రౌండ్‌ఫ్లోర్‌లో వేరేగా ఈ ఏర్పాట్లు చాలా సౌకర్యంగా అనిపిస్తాయి.
జిమ్ ఏర్పాటు చేసుకున్ననాటినుండి నేను క్రమం తప్పకుండా ట్రెడ్మిల్తోపాటు కొన్న అన్ని పరికరాలు ఉపయోగించి వ్యాయామం చేయసాగాను. ఈ వర్క్ఔట్స్తో బాగా చెమటపట్టటం జరిగేది. ఒకరోజు సడన్‌గా నాకు మక్క దగ్గర పట్టేసి నొప్పి మొదలయింది. ఆ నొప్పి అంతకంతకు ఎక్కువయి నడవలేని పరిస్థితి వచ్చింది. ఇదంతా నా అతివ్యాయామంవలనే అనుకున్నాను.
మాఇంట్లో డాక్టర్లు ఎక్కువ. నా బావమరిది కొడుకు ఎంఎస్. ఇది వాస్కులర్ ప్రాబ్లెమ్ అయివుండవచ్చు అని తాను పని చేస్తున్నచోట ఒక సీనియర్ డాక్టర్, వాస్క్యూ లర్ సర్జన్‌తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసాడు.
నేను అతని దగ్గరకి పరీక్ష చేయించుకుందికి వెళ్ళాను. ఆయన ఏవేవో పరీక్షలు చేసి ఇది వాస్కులర్ ప్రాబ్లెమ్ కాదన్నాడు. అక్కడికి వెళ్ళాక మొట్టమొదటిసారిగా నాకు తెలిసిన విషయం గుండెకు రక్తం తీసుకువెళ్ళే నాళాలలోనే కాక శరీరంలో ఇతరభాగాలలో వుండే రక్తనాళాలలో కూడా స్టెంట్స్ వేస్తారు అని. ఆ వాస్క్యులర్ సర్జన్ న్యూరోలజీ డాక్టర్ని కలవమని సలహా ఇచ్చాడు. మా బావమరిది కొడుకు నాకు వెంటనే ఒక న్యూరోలోజిస్ట్ని కలవడానికి ఏర్పాటు చేసాడు.
నేను న్యూరోలోజిస్ట్ దగ్గరికి వెళ్ళగానే ఆయన దట్టంగా గంజి పెట్టిన నా తెల్లట్రౌజర్ని తెల్ల లినెన్ హాఫ్‌స్లీవ్స్ షర్ట్‌ని ఆసక్తి గా చూసాడు.
నేను చిన్ననవ్వుతో అమెరికన్ యాక్సెంట్లో “ఏమిటి డాక్టర్ అలా వింతగా చూస్తున్నారు?” అన్నాను.
దానికి ఆయన కొద్దిగా తడబడి మళ్ళీ సర్దుకుని చిన్నగా నవ్వుతూ “మీరు రాజకీయనాయకులో, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారో అన్నట్లు అనిపించింది మిమ్మల్ని చూస్తే” అన్నాడు.
ఆయనని ఒకింత చకితుడిని చేస్తూ “మీ ఊహ సరి అయినదే” అన్నాను.
ఆయన ఏవో కొన్ని పరీక్షలు చేసి నన్ను కొన్ని ప్రశ్నలు వేసి “ఇది వెన్నుముక సమస్య అయి ఉండొచ్చు” అంటూ కొన్ని మందులు చెప్పి, ఫిజియోథెరపీ కూడా అవసరమన్నాడు. అతనికి ధన్యవాదాలు చెప్పి వచ్చేసాను.
ఇద్దరు డాక్టర్లు నన్ను వాళ్ళ దగ్గరికి పంపిన మా బావమరిది కొడుకు గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు.
ఓ పదిహేనురోజుల తరువాత ఆ మందులవల్ల యేమీ ఉపయోగంలేదని నాకర్ధం అయింది. నేను మరో న్యూరోలజిస్ట్ని కలిసాను. ఆయన బోలెడు మజిల్ రిలాక్సన్ట్స్ , పెయిన్ కిల్లర్స్ నొప్పి తగ్గటానికి అంటూ వాటితోపాటుగా ఎసిడిటీ రాకుండా ఏంటాసిడ్స్ రాసాడు.
ఈ మందులు వేసుకుంటూ ఉంటే నొప్పి పెద్దగా తగ్గలేదుకానీ , రోజంతా మగతగా ఉండటం మొదలెట్టింది. ఇక లాభం లేదని ఒక చేతికర్ర కొనుక్కుని దాని ఊతంగా నడవటం మొదలుపెట్టాను.
ఈలోగా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన రోజు వచ్చింది. డాక్టర్ నన్ను చూసి, “ఇది ఎముకలకి సంబంధించింది కావొచ్చు. ఇదే హస్పిటల్లో ఆర్థోపెడిక్ సర్జన్ వున్నాడు. అతనికి చూపించండి” అన్నాడు.
ఆ ఆర్థోపెడిక్ సర్జన్ పెల్విక్ రీజియన్ ఎక్స్‌రే, ఎమ్ ఆర్ ఐ స్కాన్ చేయించమన్నాడు. అవి చూసి హిప్ జాయింట్ అరిగిపోయింది అని చెపుతూ, “కుడి వైపు హిప్ జాయింట్ సిరామిక్ గానీ స్టెయిన్లెస్ స్టీల్‌ది కానీ సర్జికల్ గ్రేడ్ మెటీరియల్‌తో రీప్లేస్ చెయ్యాలి. సర్జరీ చేయించుకోండి” అన్నాడు. “మన్నికపరంగా సిరామిక్ మంచిది. కానీ ఖరీదు ఎక్కువ. చిన్నవాళ్ళకి ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి సిరామిక్ది వేస్తారు. అయితే రెండురకాల మెటీరియల్ కూడా ఇంపోర్టెడ్వే. ఒకేలా పని చేస్తాయి. ఎవరి ఆర్ధికస్థాయినిబట్టి వాళ్ళు కావలసింది ఎంచుకోవచ్చును”
నా భార్య డాక్టర్లు మాకు చెప్పినవన్నీ వాళ్ళ తమ్ముడికి చెప్పింది. అతను సర్జరీ విషయంలో తొందరపడక మరికొంతమంది అనుభవజ్ఞులైన ఆర్తోపెడిక్ సర్జన్స్ని కలిసి సెకండ్, థర్డ్ అభిప్రాయాలు కూడా తీసుకోమన్నాడు. అలాగే అని వేరే ఆర్థోపెడిక్ సర్జన్స్ని కలిస్తే వారుకూడా సర్జరీ అవసరం అని చెప్పారు.
సర్జరీ తప్పదు కదా అని మా బావమరిది నన్ను తన అత్యంత సన్నిహితమిత్రుడు, ఆర్తోపెడిక్ సర్జన్, సొంత హాస్పిటల్ ఉన్న వ్యక్తిని కలవమన్నాడు. అతను నాకు కూడా తెలుసు. అప్పుడప్పుడు అతనితో కలిసి డ్రింక్స్ కూడా తీసుకోవటం జరిగింది.
“సరే!” అని అతనిని కలిసాను. అతను మా ఊరివాడే. నాతో కూడా మా బావమరిదితో ఉన్నట్లే చనువుగా, సరదాగా ఉంటాడు. నన్ను చూసి, “బావగారూ! మీరు ఒకటి సర్జరీ చేయించుకోండి లేదా మీరిప్పుడున్న 80 కేజీల బరువు తగ్గించుకుని, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోండి” అన్నాడు.
ఏదో తేల్చుకోలేనట్లు మొహం పెట్టిన నన్ను చూసి మళ్ళీ అతనే “మీ అభిమాన హీరో అమీర్‌ఖాన్ చూడండి. సినిమాలకోసం తన బరువును, బాడీషేప్ను ఎలా మలుచుకున్నాడో! లగాన్, ఘజినీ, 3ఇడియట్స్, దంగల్. ఇప్పుడు సూపర్‌స్టార్. అతను అలా చేయగలుగుతున్నపుడు. మనం ఎందుకు చేయ్యలేం?” అన్నాడు నవ్వుతూ.
అతను నవ్వుతూనే అన్నా ఆ మాటలు నామీద బాగానే పనిచేసాయి. అప్పటినుండి బరువు తగ్గడం, షుగర్ అదుపులో ఉంచుకోవటంమీద దృష్టి పెట్టాలని చాలా దృఢ మైన తలపు బుర్రలో ప్రవేశించింది. ఇంటికి వస్తూనే బరువు తగ్గి తీరాలి, డయాబెటిక్స్ కంట్రోల్ చెయ్యాలి అని గట్టి నిర్ణయం తీసుకున్నాను.
ఇక మొదలు పెట్టాను. డయాబెటిక్స్మీద వీడియోలు చూసాను. రోజుకి రెండుసార్లు తీసుకునే ఇన్సులిన్ డోస్‌ని మానేసాను. ఆరారా కొంచెంకొంచెం తినమని గతంలో చెప్పిన సలహాని అనుసరించి కాస్తకాస్త ఎక్కువసార్లు తినటం చేసేవాడిని ఇన్నాళ్ళూ. ఇప్పుడది మానేసి రోజుకి రెండుసార్లు కేవలం బ్రంచ్, డిన్నర్ తినటం మొదలు పెట్టాను. కార్బోహైడ్రేట్స్ తినటం చాలా తగ్గించేసాను. ముఖ్యంగా వరి, గోధుమలతో చేసినవన్నీ దూరం పెట్టేసాను.
గతంలోనే రాగులు, కొర్రలు, ఊదలులూ, జొన్నలు అలాగే ఇంకేవేవో ప్రయత్నించి అవేవీ నా షుగర్ లెవెల్స్ తగ్గించలేదు, ఎందుకంటే వాటిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అని నాకు నేను నిర్ణయించేసుకుని అవన్నీ వద్దనేసుకున్నాను. వరి అన్నం ఒక చిన్న కప్పు బ్రంచ్ టైంలో, దానికి రెట్టింపు పప్పుధాన్యాలు, ఆకుకూరలతో చేసిన పదార్ధాలతో తీసుకోవడం మొదలు పెట్టాను. దానికి రెండు ఉడకపెట్టిన గుడ్లు లంచ్ టైంలో జతచేసాను. రాత్రి డిన్నర్‌కి జొన్నపిండితో చేసిన రెండు పుల్కా లు, ఉడకపెట్టిన గింజలతో సరిపెడుతూ వచ్చాను. లంచ్, డిన్నర్ మధ్య సలాడ్స్, పళ్ళు ఇంకా ఆకలి తీరకపోతే సాంబారు తాగటం ఇలా గడుపుతూ వచ్చాను.
నేను ఇన్సులిన్ వాడటానికి పూర్వం వాడే మందులు మళ్ళీ వాడటం మొదలు పెట్టాను. ఎందుకో నాకు నా డయాబెటాలజిస్ట్ని సంప్రతించాలనిపించలేదు. అతను నాకు ఇన్సులిన్ తీసుకోమనే ముందు నా కేస్ సరిగా స్టడీ చేయలేదనే భావన నా మనసులో పడిపోయింది. జలుబు, జ్వరం, దగ్గు వాళ్ళకి సామాన్యంగా వాడే మందులు పూర్తిగా కేస్ గురించి తెలుసుకోకుండానే ఇచ్చేసేటట్లు డయాబెటిక్స్ అనగానే ఇన్సులిన్ వాడేయమంటారు ఈ డాక్టర్లు అనిపించేది నాకు నేను ఇన్సులిన్ తీసుకునేప్పుడల్లా.
కార్బోహైడ్రేట్స్ తగ్గించడం, ప్రొటీన్ డైట్ పెంచటం వల్ల నా శరీరంలో అద్భుతమే జరిగింది. నేను బరువు తగ్గసాగాను. ఇంట్లో ఓ పాత బరువు తూచుకునే మిషన్ ఉంది. దానితో బరువు తూచుకుంటే కాస్త నాకు సంతోషం కలిగించేలా బరువు తగ్గినట్లు రీడింగ్ చూపింది. హాస్పిటల్లో 80 కేజీలు బరువు చూపితే ఇంట్లో ఈ మిషన్ ఇప్పుడు 75 కేజీలు చూపింది. నా బట్టలు వదులు అయ్యాయి. ఇదివరకు ముందుకు వచ్చిన పొట్టవలన షర్ట్ టక్ చేయలేకపోయేవాడిని. ఇప్పుడు చేసుకోగలుగుతున్నాను. నేను నా మందులు ఇన్సులిన్ వాడకుండా రకరకాలుగానూ, డోస్‌లు మార్చుకుంటూ తీసుకోవటం ద్వారా షుగర్ లెవెల్స్ అదుపులోకి తెచ్చుకోగలిగినందుకు నాకు చాలా సంతోషం కలిగింది.
ఓ పదిహేనురోజులతరువాత నేను మళ్ళీ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాను. నా భార్యకూడా నాతో వచ్చింది. అక్కడి నర్స్ నా బీపీ, షుగర్, బరువు చూసింది.
నేను డాక్టర్‌కి ఎంత కష్టబడి నా బరువు తగ్గించుకున్నానో వివరంగా చెప్పాను. అంతా విని అతను నా భార్యతో “చెల్లెమ్మా! బావగారిని కధలు, కల్పనలు కోర్ట్‌లో చెప్పమను నా క్లినిక్‌లో కాదు” అన్నాడు నవ్వుతూ.
ఇద్దరు ఓ పెద్దమోసగాడినో, నేరస్తుడినో పట్టుకున్నట్లు నన్ను చూస్తూ గట్టిగా నవ్వుతుంటే నాకు మరీ ఇబ్బందిగా అనిపించింది. నా అవస్థ గమనించి డాక్టర్ నవ్వుతూనే నా బరువు 84 కేజీలు అని చెప్పాడు. నేను ఆశ్చర్యపోయి కొంచెం అవమానం అనిపించి నిశ్శబ్దంగా ఉండిపోయాను.
ఇంట్లో 75 కేజీలు బరువు హాస్పిటల్లో 84 కేజీలుగా ఎలా చూపిందా అన్నది నాకర్ధం కాలేదు. చాలా దిగులుతోపాటు విపరీతమైన కోపం వచ్చేసింది నాకు. ఇంటికి వెళుతున్నపుడు మా డ్రైవర్ని త్రోవలో ఓ కొత్త ఎలెక్ట్రానిక్ వెయింగ్ మిషన్, కొన్ని బీరు బాటిల్స్, మంచి రుచికరమైన మీల్స్, కొన్ని బెంగాలీ స్వీట్స్ తీసుకోమన్నాను.
ఇంటికి వచ్చి బీర్ తాగి, తృప్తిగా భోజనం చేసి, తరవాత ఆరోజు కావలసినన్ని స్వీట్స్ తిన్నాను. నా వైఫల్యంవల్ల దెబ్బతిన్న నా మనఃపరిస్థితి అర్ధం చేసుకున్న నా భార్య ఆ రోజంతా నేనేమి చేసినా వారించలేదు. మర్నాటినుండి ఇన్సులిన్ తీసుకోవాలి అని నిశ్చయించుకున్నాక ఆరోజు హాయిగా నిద్ర పోయాను.
ఈ ప్రహసనం అంతా చూసాకా ఈ రుచీ, పచీ లేని తిండి తింటూ, ఊరికే నోరు, కడుపు కట్టుకు బాధ పడటం బదులు నచ్చింది శుభ్రం గా తినటం, ఇన్సులిన్ డోస్ తగినట్లు తీసుకోవటం డయాబెటిక్రోగులకు డయాబెటాలజిస్ట్ల కొత్తమంత్రం అని నాకనిపించింది.
హాయిగా నిద్రపోయి సాయంత్రం 5.30కి లేచి నా బెడ్రూమ్నుండి బయటికి వచ్చాను. హాల్లో నా ఆర్తోపెడిక్ డాక్టర్ నా భార్యతో మాట్లాడుతున్న వాడు నన్ను చూసి, “సోరీ బావగారూ! మా హాస్పిటల్లో వెయింగ్ మిషన్ తప్పు రీడింగ్ చూపించింది. రిపేర్ చేయించాను. మీరు బరువు తగ్గారు. కంగ్రాట్స్. మీ డైట్ ప్లాన్, మందులు ఇప్పుడు తీసుకుంటున్నట్లే కొనసాగించండి. అది మీకు చెప్పటానికే ఇలా వచ్చాను. మళ్లీ ఆదివారం వస్తాను” అన్నాడు.
నాకేం చెప్పాలో తెలియని అయోమయం తో ఓ వెర్రినవ్వు నవ్వాను. నా భార్యకు ఈ మొత్తం ప్రహసం గొప్ప వినోదంగా ఉండి నవ్వుతోంది.
నా పేరు ఆయాపిళ్ళ సావిత్రి. జననం 1955. పుట్టింది అనకాపల్లి, ఆంధ్ర ప్రదేశ్ లో. తల్లితండ్రులు.. లేట్ గంటి వెంకట రమణయ్య,సుందరమ్మ. భర్త.. లేట్ A.V.Ramana Rao.విద్యార్హతలు: MSc physic s, Mphil, PG Dip Electronics ఉద్యోగం: విశాఖపట్నం AVN కళాశాలలో భౌతికశాస్త్ర విభాగంలో విభాగఅధిపతిగా చేసి.2013 లో రిటైర్ ఆయాను. కధలు, కవితలు రాయటం సరదా.కొన్ని ప్రచురింపబడ్డా అవి ఏవీ సేకరించి పెట్టుకోలేదు.అసలు ప్రచురణకి పంపటమే చాలా తక్కువ. రిటైర్ అయాకా ఈ fb లోకి వచ్చాకా ఏదో రాసి మన గోడ మీద పెట్టటం మొదలుపెట్టాను. ఆ రకం గా నా వ్రాతలు ఎక్కువగా fb లో పెట్టినవే అయ్యాయి.ఇది సరదాగా ఎంచుకున్నది. మిత్రుల ప్రోత్సాహంతో కొనసాగిస్తున్ది మాత్రమే. ఇప్పటి వరకూ ఎన్ని రాసాను అన్నది ఖచ్చితం గా చెప్పలేను. అయినా 2015 నుండీ గజల్స్, ఫ్రీ వెర్సెస్, కొన్ని వృత్తాలు, పద్యాలు, కధలు, మ్యుజింగ్స్ లా వివిధ విషయాలపై నా భావాలు Fb లో టపా లు గా వ్రాస్తూనే వున్నాను.