మనుషులిచ్చిన శాపం by S Sridevi

  1. పాతకాలపు మనిషి by S Sridevi
  2. ఒలీవియా by S Sridevi
  3. నాకొద్దీ అభ్యుదయం by S Sridevi
  4. అర్హత by S Sridevi
  5. సింధూరి by S Sridevi
  6. మలుపు by S Sridevi
  7. యంత్రసేవ by S Sridevi
  8. ప్లాస్మా జీవులు by S Sridevi
  9. మనుషులిచ్చిన శాపం by S Sridevi
  10. వంకరగీత by S Sridevi
  11. బంధీ by S Sridevi
  12. లాటరీ by S Sridevi
  13. ముల్లు by S Sridevi
  14. లే ఆఫ్ by S Sridevi
  15. నేను విసిరిన బంతి by S Sridevi
  16. మలివసంతం by S Sridevi
  17. తప్పనిసరిగా by S Sridevi
  18. ప్రేమరాహిత్యం by S Sridevi
  19. పార్థివం by S Sridevi
  20. ఖైదీ by S Sridevi

Youtubers please WhatsApp to 7382342850

బాలసదనం అది. అనాథపిల్లలకోసం. అంగవైకల్యం, మనోవైకల్యం కల పిల్లలని వుంచే వార్డు వేరే వుంది. వాళ్ళలో అందరూ అనాథలు కారు. నిస్సహాయులు. కన్నవాళ్ళు పెంచలేక తీసుకొచ్చి ఇక్కడ చేరుస్తారు. అలాంటి పిల్లలు నలభైమంది. కొందరు నడవలేరు. కొందరు చూడలేరు. ఇంకొందరికి వినిపించదు. వినిపించదుకాబట్టి మాట్లాడలేనివాళ్ళు మరికొంతమంది. మానసికమైన ఎదుగుదల లేనివాళ్ళు ఇంకొద్దిమంది. అలాంటివాళ్ళందర్నీ అంతమందిని ఒక్కచోట చూసి, వికలమైంది సతీష్ మనసు. తన కొడుకు… ఇక్కడ? వాళ్ళలో ఎవరు తన కొడుకు?
అంతకి కొన్ని గంటలముందు అతనికో టెలిగ్రాం అందింది. అదతన్ని ఇక్కడికి లాక్కొచ్చింది.
అనసూయ ఎక్స్పైర్డ్ మండే ఎయ్‍టీన్త్- టెలిగ్రాం కాగితం చదివి నిరాసక్తిగా టేబుల్‍మీద పడేసి సోఫాలో వెనక్కి వొరిగాడు. తర్వాత రెండుకాళ్ళూ పైకి పెట్టుకుని వాటిచుట్టూ చేతులు బిగించుకుని కూర్చున్నాడు. దాదాపు పదేళ్ళుగా అతని అదే భంగిమ. ఏ పనీ చెయ్యడు. దేనిమీదా ఆసక్తి లేదు. కాలాన్ని కొలుస్తున్న గడియారం ముల్లులా రోజుల్ని దొర్లించేస్తున్నాడు.
“ఎక్కడినుంచీ టెలిగ్రాం? ఐనా ఈరోజుల్లో టెలిగ్రాం ఇచ్చేదెవరు? అన్నీ ఫోన్లమీదే జరిగిపోతున్నాయి” అంటూ వంటింట్లోంచీ వచ్చి, దాన్నందుకుని చదివిన మమత కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయాయి.
“అనసూయంటే?!!!” సందిగ్ధం.
“ఆమేకదూ?” నిర్ధారణ.
“మరింకా ఇలాగే కూర్చున్నావేమిటి? వెళ్ళవా?!” ఆశ్చర్యం.
“లే. వెంటనే బయల్దేరితే అరగంటలో రైలుంది.అందుకోవచ్చు” ఆపైన నిర్దేశం.
“వెళ్ళి?” ఆమె వెంటవెంటనే ప్రదర్శించిన నాలుగు చర్యల్లోని వుద్వేగాన్నీ ఒక్క ప్రశ్నతో చల్లార్చాడు.
“వెళ్ళకపోతే ఎలా? ” అయోమయంగా అడిగింది.
“వెళ్ళి చేసేదేముంటుంది? ప్రేమించానని అర్ధరాత్రి లేపుకొచ్చి కదలని మెదలని రాతివిగ్రహం ముందు పసుపు రాసిన దారం మెడలో కట్టి మూడునెలలు కలిసుండి వదిలేసి వచ్చినప్పుడే చచ్చిపోయి వుంటుంది, మానసికంగానూ, నైతికంగానూ. ఇంక ఇది ఈ జన్మలో ఇంకా జరగబోయే పతనంనుంచీ విముక్తిమాత్రమే” నిర్వికారంగా అన్నాడు. “సోమవారం చచ్చిపోయిందంటే ఈవేళ్టికి మూడోరోజు. ఇన్నిరోజులు శరీరాన్ని వుంచరు. నేను వెళ్ళి చేసేదేం వుండదు”.
అతని మాటల్లోని కాఠిన్యానికి మమత ఏడ్చింది. అతను చెప్పినవన్నీ జరగటానికి కారణం తను. . . కచ్చితంగా తనే.
మేనత్త కొడుకతను తనకి. తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్థి. ఇద్దరికీ పెళ్ళిచెయ్యాలని పెద్దవాళ్ళు చిన్నప్పుడే నిర్ణయించారు. అతని మనసులో ఏముందో ఎప్పుడూ బయటపడలేదు. తెలుసుకోవాలనీ ఎవరూ అనుకోలేదు.
బియ్యీ పాసయ్యాడు. అమెరికా వెళ్ళి ఇంకా బోల్డు సంపాదిస్తాడని అతని తండ్రి ఆశపడ్డాడు. అమెరికా అల్లుడికి మామ కావచ్చని తన తండ్రి కలలు కన్నాడు. అలాంటి సమయంలో అతనొక మామూలు వుద్యోగం వెతుక్కుని అందరికీ దూరంగా వెళ్ళిపోయాడు. ఎక్కడికెళ్ళాడో, ఏమైపోయాడో ఎవరికీ తెలీలేదు. కొన్ని నెలల సుదీర్ఘమౌనం తమందరి మధ్యా. తనకి తెలీదు, అతనొక పిరికి ప్రేమికుడని, పెద్దవాళ్ళకి చెప్పే ధైర్యంలేక ఇంట్లోంచీ వెళ్ళిపోయి పెళ్ళి చేసుకున్నాడని. నలుగురూ గుర్తిస్తేనే అది పెళ్ళౌతుందని అతనికి తెలీదు.
తండ్రీ మేనమామ అతని జాడ తెలుసుకున్నారు. హైదరాబాదులో ఒక మారుమూల వుంటున్నాడు. ఒకమ్మాయిని గుళ్ళో పెళ్ళిచేసుకుని కాపురంపెట్టాడు. నలుగురు రౌడీలసాయంతో అతన్ని వెనక్కి లాక్కొచ్చారు. ఆ అమ్మాయే అనసూయ.
ఇంకో ఆడపిల్లతో కాపురం చేసినవాడిని నేను చేసుకోను పొమ్మనుంటే ఏం జరిగేదో! అతన్ని గదిలో బంధించి కాపలాపెట్టారు. తర్వాత ఆఘమేఘాలమీద ముహూర్తాలు…ఆ తర్వాత అదే వేగంతో పెళ్ళి. అప్పట్నుంచీ అతనింతే. ఒక జడపదార్థంలా వుండిపోయాడు. తనతో మొక్కుబడి కాపురం. పోనీ , అన్నీ తెంచేసుకుని ఆమెదగ్గిరకి వెళ్ళిపోతాడా అంటే వెళ్ళడు.
ఆస్థులు కలిసిపోయాయి. అనుబంధాలు పెరగలేదు. దిగులుతో తన తండ్రి కాలంచేసాడు.
“బలవంతంగానేనా నిన్ను అతనికిచ్చి చేసి నీ కోరిక తీర్చినందుకు సంతోషపడాలో, అంత బలవంతంగా చేసి నీ గొంతుకోసినందుకు బాధపడాలో తెలీడంలేదు. ఏది ఏమైనా అతనింక నీవాడు. తరగని సంపద. సంతోషాన్ని వెతుక్కోవడం నీచేతుల్లో వుంది” అన్నాడు చనిపోయేముందు.
ఆయనవెంట మామగారూ కొద్దినెలల తేడాలో పోయారు. అతనుమాత్రం అలాగే వున్నాడు నిర్వేదంగా. తనకి ఇద్దరు పిల్లలు పుట్టిపోయారు. అతన్లో చలనం లేదు. దు:ఖాలన్నీ ఎప్పుడో అనుభవించేసినట్టు ఈ దు:ఖాన్ని నిర్వికారంగా స్వీకరించాడు.
జరిగినవన్నీ కళ్ళముందు కదిలినట్టై ఎంతోసేపటికిగానీ ఏడుపులోంచీ తెప్పరిల్లలేకపోయింది మమత.
“ఎందుకేడుస్తావు, జరగకూడనిదంతా జరిగిపోయాక?” అడిగాడు. చల్లారిందనుకున్న బాధ మళ్ళీ వేడికొలిమిలా మండింది ఆమె గుండెల్లో.
“నన్నింకా మాటల్తో చంపకు. మన పెళ్ళప్పటికి ఆమె ప్రెగ్నెంటని నువ్వే అన్నావు ఒకసారి. తర్వాత మూడేళ్ళ బాబుతో బజార్లో చూసాననీ, నిన్ను చూసికూడా చూడనట్టు వెళ్ళిపోయిందనీ నాదగ్గిర బాధపడ్డావు. ఆ బాబిప్పుడు తొమ్మిదేళ్ళవాడై వుంటాడు. తల్లిపోయాక వాడెలా బతుకుతాడు?” అంది.
“వాడి కష్టంతోటీ సుఖంతోటీ నీకేమిటి సంబంధం? తల్లెలా బతికిందో వాడూ అలాగే బతుకుతాడు. ఎందరులేరు, దేశంలో నాలాంటి తండ్రులు? వాడిలాంటి అనాథలు?”
“నీకు దణ్ణంపెడతాను. అలా మాట్లాడకు. నిన్నారోజుని అలా తీసుకురావటం మానాన్నా మీనాన్నా చేసిన తప్పే. అంత బలవంతంగా నిన్ను చేసుకోవటం నాదీ తప్పే. కానీ… నాది ఏమీ తెలీని వయసు. నువ్వంటే ఇష్టం. కావాలనుకున్నది పొందటమే తప్ప మరొకటి తెలీదు. ఇప్పుడాలోచిస్తుంటే అనిపిస్తోంది. ఆమె శాపాలే మనకి తగిలాయేమో! ఇద్దరు పిల్లలు పుట్టిపోయారు. వీడిని తీసుకురా! మనం పెంచుదాం. ఏ లోటూ రానివ్వను” అంది బ్రతిమాలుతూ.
అతను అయిష్టంగా లేచాడు. తప్పుచేసి పారిపోయిన వ్యక్తి పట్టుబడి శిక్ష వేయించుకోవడంకోసం వెళ్తున్నట్టుగా బయల్దేరాడు.
రైల్లో కూర్చున్నాడేగానీ అతని మనసు పరిపరివిధాల పోతోంది. ఎన్నో ఆలోచనలు… ఇంకెన్నో జ్ఞాపకాలు. అనసూయని తను ప్రేమించాడుసరే, ఆ విషయాన్ని ధైర్యంగా ఇంట్లో ఎందుకు చెప్పలేకపోయాడు? చెప్పి వుంటే? పెళ్ళి విషయంలో అస్వతంత్రుడిని చేసే ప్రక్రియ అప్పుడే మొదలయ్యేది. దురదృష్టకరమైన ఆ మూడు నెలలూ తన జీవితంలో వుండేవి కాదు. అనసూయ కాలక్రమంలో తనని మర్చిపోయి వుండేది. ఒక అభాగ్యశిశువు జన్మించి వుండేవాడు కాదు.
తను మొదట్నుంచీ అస్వతంత్రుడే. తల్లీ, తండ్రీ, మేనమామ, ఆయన కూతురు… అందరూ తనకి వెయ్యికళ్ళతో కాపలా కాసేవారు. తండ్రంటే భయంకూడా తనకి. అలాంటి తనని అనసూయ ఒక వ్యక్తిగా గుర్తించింది. అదే తమ అశాశ్వతమైన ప్రేమకి నాంది.
అనసూయ… ముద్దబంతిపువ్వులా వుండేది, సౌకుమార్యం, మొరటుతనం సమపాళ్ళలో కలిసినట్టు. తనని అమాయకంగా నమ్మింది. ధీరుడో శూరుడో అనుకుంది.
అతని కళ్ళు తడయ్యాయి. ఏళ్ళతరబడి పేరుకుపోయిన స్తబ్దత నెమ్మదిగా కరగసాగింది. ఎలా వుంటాడు తన బాబు? ఎలా గుర్తుపట్టాలి వాడిని? ఇన్నేళ్ళు వదిలిపెట్టేసి ఇప్పుడు హఠాత్తుగా వచ్చినందుకు నిలదీస్తాడా? ఏమని నచ్చజెప్పాలి? తనతో తీసుకెళ్తే మమత వాడిని ప్రేమగా చూస్తుందా? సాటి ఆడపిల్ల బ్రతుకు నాశనం చేసినప్పుడు లేని వుదారత్వం ఇప్పుడెక్కడినుంచీ వచ్చింది? డిఫెన్సివ్ లో వుందిగనుకనా?
ఈ చైతన్యంకన్నా ఆ స్తబ్దతే బావుందనిపించింది అతనికి.
నాంపల్లి స్టేషన్లో దిగాడు. మనసింకా వెనక్కే లాగుతోంది. తండ్రిముందు పసితనంనుంచీ కుంచించుకుపోయిన అతని వ్యక్తిత్వం ఇప్పుడొక పసివాడిని ఎదుర్కోవడానికి భయపడుతోంది. ఏమాత్రం ఆసక్తిలేకుండా ఎవరో వెనుకనుంచీ బలంగా తోస్తున్నట్టు అడుగులు వేసాడు.
రూటుమేపు కళ్ళముందు పరిచినట్టు అతని మనోనేత్రం ముందు ఆ యింటికి దారి స్పష్టంగా కనిపిస్తోంది. బోంబేడైయింగ్ షోరూంకి ఎదురుగా సన్నటిసందు. చాలా సన్నటిది. సైకిలు తప్పించి ఇంకే వాహనం లోపలికి వెళ్ళలేదు. ఆ సందులో లోపలికన్నీ పాతకాలపు పెంకుటిళ్ళు. రోడ్డుకివైపుకిమాత్రం పెద్దపెద్ద బిల్దింగ్స్. ఆ సందు రెండు కిలోమీటర్లు అర్థచంద్రాకారంగా సాగిసాగి మళ్ళీ మెయిన్ రోడ్డులో కలిసిపోతుంది. సందుమధ్యలో పదిపోర్షన్ల పెంకుటిల్లు. అన్నీ ఒకటీ రెండూ పోర్షన్లు. ఒకగది వాటాలో వుండేవారు తాము. అన్నీ స్పష్టంగా గుర్తొచ్చాక కొంత తత్సారం చేసి, తిరుగు రైల్లో వెళ్ళిపోవాలనే కోరికని జయించి మొత్తానికీ స్టేషను బైటికొచ్చి బస్సెక్కాడు. దాదాపు గంట తర్వాత ఆ యింటిముందున్నాడు.
మెయిన్ రోడ్డుమీద ఎన్నో మార్పులొచ్చాయిగానీ ఆ సందు అలాగే వుంది. ఆ యిల్లూ అంతే. తలుపు తట్టాడు. ఎవరో నడివయసతను బయటికి వచ్చాడు.
చాలా ఇబ్బందిగా పిరిగ్గా వుంది సతీష్‍కి. ఎలా ఎదుర్కోవడం యీ మనుషుల్ని? అప్పుడు పారిపోయి ఇప్పుడిలా వచ్చినందుకు నిలదీస్తే ఏం జవాబు చెప్పాలి? తనని గుర్తుపడతారా వీళ్ళు? ఇంతకీ అనసూయ ఇదే యింట్లో వుందా, ఆ తర్వాతకూడా? ఎన్నో సందేహాలు కలిగాయి.
తలుపుతీసిన వ్యక్తిని సూటిగా చూడలేకపోయాడు.
“అనసూయ…” నంగిగా అన్నాడు.
“ఆ పేరుతో ఎవరూ లేరు”
“ఇప్పుడుకాదు, పదేళ్ళక్రితం…”
“ఇల్లు అద్దెలకిచ్చుకునేవాళ్ళం. ఎవరో వస్తుంటారు, వెళ్తుంటారు. వాళ్ళంతా ఎలా గుర్తుంటారు?” అతను వెనక్కి తిరిగాడు.
“కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలిద్దరు వచ్చారు. మూడునెలలవగానే అతనామెని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.” తనగురించి తనే చెప్పుకున్నాడు సతీష్ అది తనేనని తెలియనివ్వకుండా.
లోపలికి వెళ్ళబోతున్నవాడు ఆగి మళ్ళీ సతీష్ కేసి తిరిగాడు. ముఖంలో ఆశ్చర్యం, ఆలోచన.
“ఇడ్లీల అనసూయగురించా, నువ్వడిగేది?”
ఎవరో ఒక అనసూయ. ఏదో ఒకలా బతికిన అనసూయ. తన వివరాలకి సరిపోతే చాలు. తలూపాడు.
“అలాంటివాళ్ళని అంత తొందరగా మర్చిపోలేం. ఔను… పదేళ్ళక్రితం భార్యాభర్తలమంటూ అద్దెకి పోర్షన్ కోసం వచ్చారు. ఇచ్చాం. ఆ అమ్మాయిని వాడు మోసంచేసి పారిపోయాడు. దాదాపు మూడునెలలు ఎదురుచూసిందామె వాడిగురించి. అద్దె అడ్వాన్సు ఐపోయింది. చేతిలో డబ్బులూ, ఇంట్లోని వస్తువులూ అన్నీ ఖర్చైపోయాయి. కట్టుబట్టలతో మిగిలింది. పైగా కడుపు. రెండునెలల అద్దె బాకీ. అద్దెలమీద బ్రతికేవాళ్ళం, మేముమాత్రం ఎంతకని చూస్తాం? మా అమ్మ ఆమెని వెళ్ళగొట్టేసింది. అద్దెబాకీ…తర్వాత అప్పుడింతా అప్పుడింతా తీర్చేసింది”.
“ఎక్కడుండేది?”
“ఈ దగ్గిర్లోనే. కొంచెం ముందుకెళ్తే సత్రం వుంది. అందులో అంతా ఇలాంటివాళ్ళే వుంటాయి. వాళ్ళదగ్గిరకి వెళ్ళింది. ఆశ్రయం ఇచ్చారు. ఇడ్లీలు అమ్ముకునేది. ఇడ్లీల అనసూయంటే ఎవరేనా చెప్తారు. మూడురోజులక్రితం పోయిందని విన్నాను. ఇంతకీ నువ్వు?” అన్నీ చెప్పి, అనుమానంగా అడిగాడు.
ఇంకా నయం, గుర్తుపట్టలేదు… చెమటలుపట్టాయి సతీష్‍కి.
“ఆమె చనిపోయిందని తెలిసింది” చెప్పి, తలొంచుకుని ముందుకి సాగాడు.
కొంతదూరాన్నే సత్రం. పెద్ద మండువా యిల్లు. మండువాకి నాలుగువైపులా గదులు. మండువాలో రకరకాల పనులు జరుగుతున్నాయి. ఒకామె మిషన్ తొక్కుతోంది. ఇంకొకామె అప్పడాలు వత్తుతోంది. మరొకామె స్టౌముందు వంటలు చేస్తోంది. ఇంకా చాలామంది వున్నారక్కడ. అంతా పనులాపి సతీష్‍ని చూసారు.
వీళ్ళలో ఒకరుగా వుండేదా అనసూయ? ఇడ్లీపిండి రుబ్బుతూ, ఇడ్లీలు వండి అమ్ముతూ…?లక్షాధికారుల ఇంట్లో పుట్టి, మరో లక్షాధికారిని చేపట్టిన అనసూయ? కేవలం ప్రేమవివాహం చేసుకున్న పాపానికి? అతనికి గుండె చిక్కబట్టినట్టైంది.
“అనసూయ…? ” మండువాలోకి వచ్చి అడిగాడు.
“లేదు. చచ్చిపోయింది. మూడురోజులైంది చచ్చిపోయి” ఎవరిదో నిర్లక్ష్యమైన జవాబు. వాళ్ళంతా జీవితాన్ని ప్రేమిస్తున్నవాళ్ళు కాదు. బతుకులో దగాపడ్డవాళ్ళు. ముందూవెనకా ఎవరూ లేని ఓ వితంతువు పెట్టిన సత్రంలో చావలేక బతుకుతూ, చావులో సేదదీరాలనుకుంటున్నవాళ్ళు.
“ఆ విషయం తెలిసే వచ్చాను. ఎవరో టెలిగ్రాం ఇచ్చారు”
ఎవరు ఎవరని వాళ్ళలో వాళ్ళు చర్చించుకున్నారుగానీ జవాబు దొరక్క చర్చ ఆపేసారు.
“ఎలా చనిపోయింది?” అడిగాడు.
“తిండి తిననివాళ్ళంతా ఎలా చనిపోతారో అలా. గుండెజబ్బొచ్చింది”.
“”ఆమెకొక బాబుండాలి…” చుట్టూ చూసాడు అక్కడెక్కడేనా వున్నాడేమోనని.
“ఆ పిల్లాడా? వాడికి పిచ్చి. పిచ్చిపిల్లల స్కూల్లో వేసింది అనసూయ వాడిని”.
వెయ్యిటన్నుల బరువు నెత్తిమీద పడ్డట్టైంది సతీష్‍కి. వాడికి పిచ్చి… వాడికి పిచ్చి… కోటిగొంతుకల ఘోష లోలోపల. చాలాసేపు పట్టింది అతనికి తేరుకోవటానికి.
అతనెవరో వాళ్ళకి తెలీదు. కానీ అలా చూసేసరికి జాలేసింది. ఒకామె వెళ్ళి మంచినీళ్ళు తెచ్చింది. మరొకామె కూర్చోమని స్టూలు జరిపింది.
కూర్చోలేదతను. మంచినీళ్ళుమాత్రం అందుకుని గటగట తాగేసాడు.
“ఎక్కడుంది వాడి స్కూలు?” అడిగాడు.
“మిషనరీలు నడుపుతుంటారు దాన్ని” మంచినీళ్ళు తెచ్చిన స్త్రీ చెప్పింది. గుర్తులు చెప్పింది. “నేనూ అనసూయా కలిసి వెళ్ళేవాళ్ళం వాడిని చూడటానికి” ఆమె గొంతు రుద్ధమైంది. “ఏమౌతుంది మీకామె? ఎప్పుడూ ఎవర్నిగురించీ చెప్పేదికాదు. కనీసం ఆ ప్రేమించినవాడినేనా గుర్తుచేసుకునేది కాదు. ఇక్కడికొచ్చిన కొత్తలోమాత్రం ఏదో మందు మింగింది చావటానికి. సమయానికి మేం చూసి ఆస్పత్రిలో చేరిస్తే బతికింది” అంది.
సతీష్ మనసులో యింకా బాధకి చోటు మిగిలిలేదు. “పిల్లవాడిని తీసుకెళ్ళడానికి వచ్చాను” అన్నాడు క్లుప్తంగా.
“తీసుకెళ్ళి ఏం చేస్తారు?బంధువులా మీరు?”
అతనిదగ్గిర ఆ ప్రశ్నలకి జవాబుల్లేవు. అక్కడే వుంటే వాళ్ళు తనెవరో కనిపెట్టేస్తారని భయం వేసింది. వెనక్కి తిరిగాడు. అతని తదుపరి గమ్యం మిషనరీలు నడుపుతున్న ఆర్ఫనేజి అయింది. అతనిప్పుడు అక్కడున్నాడు, ఆ పిల్లల్లో తన కొడుకుని వెతుక్కుంటూ.
“ఏం కావాలి?” మృదువైన గొంతు వినిపించింది. ఆవైపు చూసాడు. తెల్లటి దుస్తుల్లో వున్న నన్ అడుగుతోంది. చెప్పాడు.
“రండి. మదర్ దగ్గిరకి తీసుకెళ్తాను” అంటూ తనతో తీసుకెళ్ళింది.
అనసూయ వివరాలు చెప్పి, “బాబుని నాతో తీసుకెళ్తాను మదర్!” అన్నాడు.
మెత్తగా నవ్విందావిడ. “అతను మెంటల్లీ రిటార్డెడ్. తీసుకెళ్ళి ఏం చేస్తారు?” అడిగి, ఫదండి అతన్ని చూపిస్తాను” అంటూ సీట్లోంచీ లేచింది. ఆమెననుసరించి వెళ్ళాడు. అచ్చం అనసూయలాగే వున్న తొమ్మిదేళ్ళ అబ్బాయి… గాల్లోకి చూస్తూ ఏదో అందుకుంటున్నట్టు చేతులు కదిలిస్తూ నవ్వుకుంటున్నాడు తనలో తనే.
“తల్లి చనిపోయినప్పుడు చూపించడానికి తీసుకెళ్ళాం. కొంచెంకూడా బాధపడలేదు. అప్పుడుకూడా ఇలాగే నవ్వుకున్నాడు” చెప్పింది మదర్.
సతీష్‍కి పెద్దగా ఏడవాలనిపించింది .
“వీళ్ళు నార్మల్ లైఫ్ గడపలేరు. సమాజంకూడా వీళ్ళని యథాతథంగా స్వీకరించలేదు. ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలి వీడిపట్ల. ఇక్కడ ఇలాంటి విషయాలలో ప్రత్యేకించి ట్రెయినింగ్ చేసినవాళ్ళున్నారు. డాక్టర్లొచ్చి చూసి వెళ్తుంటారు. ఇంట్లో ఇలా వుండదు. దయచేసి ఇక్కడే వుంచండి. మీరే వచ్చి చూసి వెళ్తుండండి” అంది మదర్.
“వీడెందుకిలా?”
“చాలామంది జన్యులోపాలవలన యిలాగౌతారు. ఇతనలాకాదు. ప్రెగ్నెంటుగా వున్నప్పుడు ఇతని తల్లి ఆత్మహత్యకి ప్రయత్నించింది. విషం మింగింది. దానివలన ఇతని మెదడులోని టిష్యూలు దెబ్బతిన్నాయని డాక్టర్లు చెప్పారు”
సతీష్‍కి పాతాళంలోకి కృంగిపోతున్నట్టుగా అని6చింది. రెండుచేతుల్లోనూ ముఖం కప్పుకున్నాడు.
“తనకి ఏదేనా జరిగితే విషయం మీకు తెలియపరచమని అనసూయ కోరింది. అందుకే టెలిగ్రాం ఇచ్చాము”
“…”
“మీరు ఇతని తండ్రా? ” మదర్ గొంతు నిర్వికారంగా వుంది. “ప్రేమ… మనుషులు పిల్లలకిచ్చిన శాపం. అందుకే రోడ్లమీద, అనాథశరణాలయాల్లోనూ యిందరు అనాథలు. ప్రేమించుకుంటారు, శారీరకసుఖాలని అనుభవిస్తారు. పొరపాటున పిల్లలు పుట్టే పరిస్థితి వస్తేమాత్రం ముందు మగవాడు జారుకుంటాడు. తరువాత ఏం చెయ్యాలో తెలీని అసహాయపరిస్థితిలోనో, తనూ తప్పించుకోవాలనో స్త్రీ ఏదో ఒకటి చేస్తుంది….ఇక్కడున్న పిల్లల్లో చాలామంది అనాథలు. రోడ్లమీదా అక్కడా కనిపించినవాళ్ళు. చాలాకొద్దిమందిమాత్రమే ఇతనిలా తీసుకొచ్చి చేర్చబడ్డవారు…” అని, “జీసస్! ఈ పాపులని క్షమించు…” అంటూ చేత్తో శిలువ వేసుకుంది. ఒకరిద్దరు పిల్లల్ని పలకరించి వెళ్ళిపోయింది.
సతీష్ చలనంలేనట్టు అలాగే నిలబడ్డాడు. చాలాసేపటికి అతని దృష్టి బాబుమీదికి మళ్ళింది. అనసూయ కొడుకు! తన రక్తం పంచుకుని పుట్టినవాడు. తామిద్దరి జీవితంలో తటస్థించిన ఆ దురదృష్టపు మూడునెలల కాలానికి సజీవజ్ఞాపకం. .. నెమ్మదిగా వాడిని సమీపించాడు. వేలికొసల్తో వాడి చెంపలని స్పృశించాడు. ముఖాన్ని రెండుచేతుల్లోకీ తీసుకుని కళ్ళలోకి చూస్తూ నుదుటిమీద గాఢంగా ముద్దుపెట్టుకున్నాడు. అతనిలో వుద్వేగాల వెల్లువ మొదలైంది. మదర్‍తో మాట్లాడి వాడిని తనతో తీసుకొచ్చాడు.
భర్త తీసుకొచ్చిన ఆ పిల్లవాడిని విచారంగానూ విస్మయంగానూ చూసింది మమత. వాడు అతని ప్రేమగుర్తులా లేడు. పగిలిపోయిన జ్ఞాపకాల శకలాలని పోగుచేసి తీసుకొచ్చినట్టున్నాడు.

(Andhrabhoomi weekly, b3fore 2000)