మలయమారుతం by S Sridevi

  1. వంటింటి కిటికీ by S Sridevi
  2. పగుళ్ళు by S Sridevi
  3. స౦దిగ్ధపు రహదారులు by S Sridevi
  4. కోడలొచ్చింది by S Sridevi
  5. అతనిష్టం by S Sridevi
  6. ఆమె విజేత కాదు by S Sridevi
  7. యుద్ధదృశ్యం by S Sridevi
  8. బేబీ ఆఫ్ అర్చన by S Sridevi
  9. తరంగనాట్యం by S Sridevi
  10. చిట్టికి క్షమార్పణలతో by S Sridevi
  11. ఇంకో మజిలీకి by S Sridevi
  12. అధిరోహణం by S Sridevi
  13. లివింగ్ టుగెదర్ by S Sridevi
  14. గుమ్మడి గింజలు by S Sridevi
  15. బంగారుపంజరం by S Sridevi
  16. చీకట్లో పూసిన పూలు by S Sridevi
  17. గినీ పిగ్స్ by S Sridevi
  18. మలయమారుతం by S Sridevi
  19. సార్వభౌముడు by S Sridevi
  20. అమ్మానాన్నలు by S Sridevi

“అతడు మళ్ళీ వచ్చేడండీ మీకోసం. మీతో మాట్లాడిగాని వెళ్ళనంటున్నాడు. మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు” ఆఫీసునుంచీ రాగానే భర్తతో చెప్పింది శైలజ. కృష్ణమోహన్ ఛర్రుమని లేచాడు. “అతనితో నాకేం మాటలుంటాయి? చెప్పదలుచుకున్నదేదో నిన్ననే చెప్పేసాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోలేనివాళ్ళన్నా, బజార్లోనో మరెక్కడో పోగొట్టుకున్నవాళ్ళన్నా నాకెలాంటి జాలీ లేదు” అన్నాడు.
సరిగ్గా అప్పుడే గేటు చప్పుడైంది. అతనేనేమోనని తొంగిచూసింది శైలజ. ఆమె వూహ నిజమే.
“అతను చెప్పేది కూడా వినచ్చుగా? విని మీకెలా నచ్చితే అలా చేద్దాం. ఎవరికీ బాధ కలిగించి పరిష్కారం చెప్తానన్నాడు”
అప్పటికతను హాలు దాకా వచ్చేసాడు. “ఏమిటతను చెప్పేదీ నేను వినేదీను? అసలు అంతసేపు కూర్చోబెట్టి నువ్వెలా మాట్లాడావు?” కోపాన్ని అదుపుచేసుకోలేక గట్టిగా అడిగాడు కృష్ణమోహన్. వచ్చిన వ్యక్తి అతని పేరు సుదర్శనరావని చెప్పాడు తనతో. ఏం ప్రతిపాదిస్తాడో! ఒకటే టెన్షన్‍. ముందురోజైతే ఒక్కమాట కూడా వినకుండా తరిమికొట్టినట్టు పంపించేసాడు. మళ్ళీ ఎందుకొచ్చాడో!
అతని కోపంలో చిన్నపిల్లల వుక్రోషంలాంటిది వుంది. తన వస్తువునెవరేనా లాక్కుంటారనే భయం కలిగినప్పుడు వాళ్ళలో అలాంటి భావన కలుగుతుంది. జరగబోయేదాన్ని అతను చూచాయగా వూహిస్తున్నాడు. అందుకే అంతగా భయపడుతున్నాడు. తన అయిష్టాన్ని కోపంగా ప్రదర్శిస్తున్నాడు.
“ఒక్కసారి వెళ్ళి నిదానంగా కూర్చుని వినకూడదూ? జరిగినదాంట్లో మన తప్పుకూడా వుంది. అర్థం చేసుకోరేంటి మీరు?” దాదాపు అతన్ని హాల్లోకి తోసుకొచ్చినంత పనిచేసింది శైలజ.
ఇద్దరూ హాల్లోకి వచ్చేసరికి సుదర్శనరావు హాలు మధ్యలో నిలబడి చుట్టూ గోడలమీదున్న పెయింటింగ్స్, షోకేసులో వున్న షీల్డులూ కప్పులూ చూస్తున్నాడు. అవన్నీ ప్రియాంకవని తెలిస్తే వాటిని తాకి తదాత్మ్యతం చెందేవాడు. కానీ అతనికి వాటిగురించే కాదు, ప్రియాంక గురించికూడా తెలీదు. చాలా విషాదకరమైన విషయం. అతనొచ్చినదే ఆమెకోసం.
ప్రియాంక శైలజా కృష్ణమోహన్‍ల మూడోకూతురు. అతని కూతురు కూడా. వీళ్ళు రాగానే అతని పెదాలమీద చిన్ననవ్వొకటి మెరిసి మాయమైంది. తన ప్రతిపాదనకి వాళ్ళు సమ్మతిస్తారనే నమ్మకం కళ్ళలోంచీ తొంగిచూసింది.
“కూర్చోండి. నిలబడే వున్నారేం?” అంది శైలజ.
“మీకు చాలా యిబ్బందిని కలిగిస్తున్నాను. వెరీ సారీ!” అన్నాడు సుదర్శనరావ్ కూర్చుంటూ. అతను కూర్చున్నాక శైలజ తనూ కూర్చుని యింకా నిలబడే వున్న భర్తని చేతిమీద తట్టింది. అతను యాంత్రికంగా కూర్చున్నాడు.
“నిన్న మీరు వచ్చి వెళ్ళాక చాలా కలవరపడ్డాము. పెద్దవాళ్ళం మాకే అలా వుంటే చిన్నపిల్ల, ప్రియాంకకి ఎలా వుంటుందో ఆలోచించండి. తను మా కూతుర్ననే అనుకుంటోంది. పిల్లలు అలా కాకుండా ఇంకోలా అనుకోరుకదా?”
“పాప పేరు ప్రియా?” ఆర్తిగా అడిగాడు సుదర్శనరావు.
“ప్రియాంక” శైలజ చెప్పింది.
“మాది అవంతీపురం దగ్గర పల్లెటూరు. అది మద్రాసులో మాంబళందగ్గర తప్పిపోయింది” సుదర్శనరావు గొంతులో అపరిమితమైన విషాదం వుంది. “నేను, మా యిద్దరు అక్కలు కుటుంబాలతో కలిసి తిరుపతి వెళ్ళి, అక్కడినుంచీ చెన్నై వచ్చాము. ఆరుగురు పెద్దవాళ్ళం, ఐదుగురు పిల్లలు. సరదాగా కబుర్లు చెప్తూ వూరంతా తిరుగుతున్నాం. పల్లెటూరివాళ్ళంకదమ్మా, రివ్వుమని పరిగెత్తే బస్సులు, కార్లు, విశాలమైన రోడ్లు, పెద్దపెద్ద బిల్డింగులు, దుకాణాలు, క్రిక్కిరిసిపోయిన జనం… అన్నీ వింతలే మాకు. బాబీని వాళ్ళమ్మ ఎత్తుకుంది. మూడేళ్ళు దానికి. దిగి నడుస్తానని గొడవ చేస్తే దింపింది. చుట్టూ చాలా జనం. ఎప్పుడు తప్పిపోయిందో గుర్తించలేదు. ఒకళ్ళదగ్గరుందని మరొకళ్ళం అనుకున్నాం. విషయం గ్రహించి పిచ్చివాళ్ళలా నగరమంతా వెతికాం. ఆడవాళ్ళనీ పిల్లల్నీ వెనక్కి పంపేసి నేమా యిద్దరు బావలూ చెన్నైలోనే వుండిపోయి పోలీస్ కంప్లెయింటిచ్చాం. లోకల్ పేపర్స్‌లో ఫొటో వేయించాం. ఎన్ని చేసినా ప్రయోజనం లేకపోయింది”
“మాకు టీనగర్లో దొరికింది”
“ఇదక్కడికెలా చేరిందో!”
“ఒక టూరిస్టు బస్‍లోంచీ దిగిందిట. ఆ బస్సు దిగినవాళ్ళంతా వాళ్ళదారిని వాళ్ళు వెళ్ళిపోగా ఇదొక్కర్తీ రోడ్డుమీద నిలబడి ఏడుస్తుంటే జనం గుమిగూడి చూస్తున్నారు” వివరంచింది ఆమె .
ఇదంతా ఎందుకు చెప్తున్నారన్నట్టు అసహనంగా చూస్తున్నాడు కృష్ణమోహన్. అతనికి పిల్లలంటే చాలా ప్రాణం. పధ్నాలుగేళ్ళ క్రితం ఎల్టీసీమీద భార్యాపిల్లల్ని తీసుకుని తిరుపతి వెళ్ళాడు. అతనికప్పటికి యిద్దరు కూతుళ్ళు. తిరుపతినుంచి సైట్‍సీయింగ్‍కని చెన్నై వెళ్ళారు. కోడంబాకంలో తిరుగుతుంటే రెండుమూడేళ్ళ పాప ఏడుస్తూ రోడ్డుమీద కనిపించింది. జనం గుమిగూడి చూస్తున్నారు. కానీ పాపని వోదార్చే ప్రయత్నం చేయట్లేదు. సినిమావాళ్ళకి సంబంధించిన ప్రాంతమది. దీపం వెనకాలే వుండే నీడలా బ్రోకర్లూ తిరుగుతుంటారు. అలాంటిచోట పాపని వదిలేసి తమదారిని తాము వచ్చెయ్యలేకపోయారు. శైలజ దగ్గిరకి తీసుకుంది.
“పోలీస్టేషన్లో యిచ్చేద్దాం” అన్నాడు కృష్ణమోహన్.
“సరిగ్గా మాటలు కూడా రాని పసిది…” శైలజ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. “తల్లిదండ్రులొచ్చి తీసుకెళ్తే ఫర్వాలేదు. లేకపోతే..? ఏ అనాథాశ్రమంలోనో పడేస్తారు” అంది. అలా అన్నాడేగానీ ఆ అన్నది తనకే నచ్చక “మరేం చేద్దాం?” అని అడిగాడు కృష్ణమోహన్. జవాబేం చెప్పాలో శైలజకీ తెలీలేదు.
వాళ్ళు పాపని ఎత్తుకునేసరికి అక్కడ మూగిన జనం వాళ్ళ పిల్లే అనుకుని రకరకాలుగా వ్యాఖ్యానించుకుంటూ వెళ్ళిపోయారు.
“మనతో తీసికెళాం”” అంది చాలాసేపు ఆలోచించి చివరికి. ఇద్దరికీ కళ్ళముందు అసంఖ్యాకమైన లెక్కలు కనిపించాయి. తమకి వున్నదిద్దరూ ఆడపిల్లలు, తోడుగా మరో ఆడపిల్లా? పెంచగలరా?
పాపని వెతుక్కుంటూ ఎవరేనా వస్తారేమోనని చాలాసేపు అక్కడే కూర్చున్నారు. మనసు పరిపరివిధాలపోయింది. ఆడపిల్లకదా, పెంచలేక వదిలేసారేమోననిపించింది చాలాసేపు. ఇక్కడ వదిలేస్తే ఎవరేనా చేరదీసి ఫిలిమ్ యిండస్ట్రీలో చేరుస్తారేమోనన్న దురాశేమోనని కాసేపు అనుకున్నారు.
పాపని వొళ్ళో కూర్చోబెట్టుకు తదేకంగా ముఖంలోకి చూడసాగింది శైలజ. చామనచాయలో నాజూగ్గా వుంది. ప్రస్ఫుటంగా మెరుస్తున్న పెద్దపెద్దకళ్ళు, వుంగరాల జుత్తు… ఆకర్షణీయంగా వుంది. శైలజ ముఖంలోకి భయంభయంగా చూస్తోంది.
“పేరు?” అడిగింది మృదువుగా.
“బాబీ”
తన ప్రశ్నకి వెంటనే జవాబివ్వటంతో తెలుగువాళ్ళేనని గ్రహించింది.
“అమ్మేది?”
అమ్మ మాటెత్తగానే ఏడుపుముఖం పెట్టి చుట్టూ చూడసాగింది.
“ఏవూరు మీది?”
ఆప్రశ్నని ఎంత తిప్పితిప్పి వేసినా జవాబు చెప్పలేకపోయింది. “మనం తీసుకెళ్ళిపోదాం అమ్మా!” శైలజ కూతుళ్ళు అనూషా, ప్రత్యూషలు గోలచేసారు. వాళ్ళకి చాలా సరదాగా వుంది పాపని చూస్తుంటే. వాళ్ళ ఫ్రెండ్స్‌లో చాలామందికి బుజ్జిబుజ్జి చెల్లెళ్ళూ తమ్ముళ్ళూ వున్నారు. తమకి కూడా ఎందుకులేరని గొడవచేస్తుంటారు. తల్లి వడిలో బాబీని చూస్తుంటే తమ కోరిక తీరిపోయినట్టే అనిపిస్తోంది.
“వెళ్లాం పద” అన్నాడు కృష్ణమోహన్ చివరికి. చెన్నై చూసుకుని కొడై, వూటీ, బెంగుళూరు, మైసూర్ అవీ చూడాలనుకున్నవారు ప్రయాణాన్ని ముగించేసుకుని తిరుగుముఖం పట్టారు.
“ఎవరి పిల్లో పాపం…” దారిపాడుగునా బాధపడుతూనే వుంది శైలజ. “వాళ్ళెంత వెతుక్కుంటున్నారో! ఇంటికెళ్ళాక రోజూ పేపరు చూడండే పిల్లలూ, బాబీ గురించి ఎవరేనా ఎడ్వర్టైజ్‍మెంట్ యిస్తారేమో!” అంది కూతుళ్ళతో.
కృష్ణమోహన్ తాము చేసింది సరైనపనో కాదో యిప్పటికీ కచ్చితంగా నిర్ధారించుకోలేకపోతున్నాడు. రెండే ప్రశ్నలు. రూల్స్ ప్రకారం వెళ్తే పిల్లని పోలీస్‍స్టేషన్లో అప్పజెప్పాలి. తల్లిదండ్రులు వెతుక్కుంటూ వస్తే సరేసరి. లేకపోతే వాళ్ళ పిల్లని ఏ అనాథాశ్రమానికో పంపిస్తారు. అతనా ఆలోచనని తట్టుకోలేకపోయాడు. ఒక పసిపిల్ల, రేపటిరోజుని సమాజంలో ఒక చిన్నభాగం… అనాథ అవకుండా ఆపగలిగే శక్తి తనకి వుండీ ఆపకపోవటం అమానుషమౌతుంది.
అదీగాక చాలా సామాన్యమైన వ్యక్తి తను. పలుకుబడిగానీ డబ్బుగానీ లేవు. అంతదూరాన్న పోలీసుకేసుకన్నా పాపని తమతో తీసుకొచ్చి పెంచడం తేలిక. ఎవరేనా వచ్చి అడిగితే, లేదా శైలజ అన్నట్టు ఏ పేపర్లోనేనా ప్రకటిస్తే తనే తీసుకెళ్ళి యిచ్చి వస్తాడు.
ఎవరూ రాకపోతే? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. తన పిల్లల్తోపాటే వుంటుంది, తిరుగుతుంది, పెరుగుతుంది. చదువు? పెళ్ళి? మరో ఆడపిల్ల బాధ్యత తను ఎత్తుకోగలడా? శైలజకేసి చూసాడు.
అతని మనసు చదివినట్టు “చూద్దాం అప్పటి సమస్యకదా? అప్పుడాలోచించచ్చు” అంది.
తల్లిదండ్రులు పడుతున్న సంఘర్షణతో సంబంధం లేకుండా పాపతో ఆటల్లో పడ్డారు. అనూషా ప్రత్యూషా. అనూ, ప్రీతీ వాళ్ళ ముద్దుపేర్లు. బాబీ అనే పేరు వాళ్ళకి నచ్చలేదు. ఆపేరుతో ప్రీతి క్లాసులో ఒకబ్బాయున్నాడు. కాబట్టి అది మగపిల్లల పేరనే నిర్ణయానికొచ్చారు. పాపనేమని పిలవాలో యిద్దరూ నిర్ణయం చేసుకోలేకపోతున్నారు.
బాబీ ముఖంలో వుండుండి ఏడుపు ఛాయలు కనిపించినా పిల్లల సమక్షంలో వెంటనే మర్చిపోతోంది. అలా కొంతసేపు గడిచాక ఆ పిల్లకి పూర్తిగా తల్లిదండ్రుల ధ్యాస పడిపోయింది. సన్నటి రాగంతో మొదలుపెట్టి శృతిని పెంచింది. శైలజ ఎత్తుకుంది. మరిపించాలని చూసింది.
“పాలు తాగుతావా?” బాబీ అక్కర్లేదన్నట్టు కోపంగా తల అడ్డంగా వూపింది.
“బిక్కీ తింటావా?… అదుగో ఆ పువ్వుచూడు, ఎంత బావుందో! అరే ఆ చెట్టేంటి? అలా పరిగెడుతోంది?” శైలజ చిన్నకూతురికిప్పుడు ఆరేళ్ళు. ఎప్పుడో మర్చిపోయిన వూసులు.. ఓదార్పులు మళ్ళీ గుర్తుతెచ్చుకుని బాబీని మరిపించాలని చూసింది.
ఊహు< రాగం మరికాస్త పెంచింది. కృష్ణమోహన్ తీసుకున్నాడు. కంపార్ట్‌మెంట్‍లో చుట్టూ వున్నవాళ్ళు కొందరు అసహనంగా చూస్తున్నారు. రైల్లోంచీ చెయ్యి బైటికి చూపించి తీసుకెళ్ళిపొమ్మని ఏడవసాగింది బాబీ. అతనికి ఆపిల్ల తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యానికి బాగా కోపమొచ్చింది. ఇప్పుడీ పిల్లవి బుజ్జగించడం ఎలా? ఇప్పటికి వూరుకున్నా తర్వాత?
స్టేషన్ ఏదో వచ్చి రైలాగింది. ప్లాట్‍ఫాం‍మీదికి తీసుకెళ్ళి కూతకూసే దాకా కబుర్లు చెప్తూ నిలబడ్డాడు. అరటిపళ్ళొస్తే కొనిచ్చాడు. బిస్కెట్ల పేకెట్టు కావాలంది. అదీ కొనిచ్చాడు. మళ్ళీ రైలు ఎక్కగానే శైలజ బుజ్జగించి పాలుపట్టింది. చాలాసేపటికి నిద్రలోకి జారుకుంది.
ఊళ్ళో దిగగానే తమిద్దరి తల్లిదండ్రులకీ ఫోన్ చేసి రమ్మని చెప్పింది శైలజ. శైలజ తల్లిదండ్రులది ఆ వూరేగాబట్టి వెంటనే వచ్చేసారు. వచ్చీరావటంతోటే శైలజ చేతిలో బాబీని చూసారు. జరిగిన విషయం చెప్పారు శైలజా కృష్ణమోహన్‍లు.
“తొందరపడ్డారేమోనమ్మాయ్!” అన్నాడు శైలజ తండ్రి.
“వదిలేసి రాలేకపోయాము నాన్నా!!”
“పోలీస్‍స్టేషన్లో అప్పగించాల్సింది. ఇప్పటికే యిద్దరు ఆడపిల్లలు మీకు” అంది శైలజ తల్లి. “ఏదో ఒకటి వాళ్ళే చేద్దురు. ఏ అనాథశరణాలయానికో పంపిస్తారు. ఎంతమంది లేరు? తెల్లారి లేస్తే పేపర్నిండా అవే వార్తలు”
“ఏమో! అలా చెయ్యలేకపోయాం. మా పిల్లల్లాంటిదే కదా?”
“నీ యిష్టం, మీ ఆయనిష్టం. ఇద్దరూ అనుకునే తెచ్చుకున్నాక మేమెవరం కాదనటానికి?” అంది శైలజ తల్లి సగం నిష్ఠూరంగానూ, సగం వాస్తవాన్ని ఒప్పుకుంటూను. తర్వాత వచ్చిన కృష్ణమోహన్ తల్లిదండ్రులు కూడా అలాగే రాజీపడ్డారు.
మొదట్లో రోజూ పేపరు చూసేవారు. తప్పిపోయిన పిల్లల గురించిన వార్తలు, ప్రకటనలు వస్తుంటే రేడియోలోనూ టీవీలోనూ వినేవారు. రోజులు నెలలుగా మారాయి. బాబీకోసం ఎవరూ రాలేదు. ఎవరూ రారనే వాస్తవం స్థిరపడిపోయింది. “బాబీ యింక మనింట్లోనేనా?” పెద్దవాళ్ళ సందిగ్ధతకీ పిల్లల సంతోషానికీ పొంతన కుదరటం లేదు,
శైలజకి ఒక చెల్లెలు, కృష్ణమోహన్‍కి ఒక అన్న. ఒక వయసు పిల్లలు ఏడుగురు. బట్టలు, బొమ్మలు, పుస్తకాలు వాళ్ళ కుటుంబాలమధ్య తిరుగుతూ వుంటాయి. అందర్లోకీ చిన్నది బాబీ. నాలుగు పొట్టైన గౌన్లు, ఒక టెడ్డీబేర్ బొమ్మ, పలకాబలపంతో వాళ్ళమధ్య ఇమిడిపోయింది. తన వునికిని స్థిరపరుచుకుంది. మరో అరలీటరు పాలు, ఇంకో గుప్పెడు అన్నం వాళ్ళ బడ్జెట్‍నేమీ తలకిందులు చేయలేదు.
బాబీ మొదట్లో బాగా ఏడ్చి గొడవ చేసేది. ఆ పిల్ల చేసే అల్లరికి హడిలిపోయింది శైలజ. ఏ వస్తువునీ దక్కనిచ్చేది కాదు. షెల్ఫుల్లో సర్దినవన్నీ అందినంతవరకూ లాగిపారేసేది. అప్పటిదాకా అలమారలకి తలుపులండీ అని శైలజ ఎంత మొరపెట్టుకున్నా వినని కృష్ణమోహన్ ఈ అల్లరికి జడిసి ఆమె చెప్పకుండానే ఆ పని చేయించాడు.
అతని వొళ్ళోకెక్కి తల రెండుచేతుల్తోటి వంచి గుప్పిళ్ళతో జుత్తుపీకేది.
“బాబోయ్! నీ జుత్తే శైలజా!” అనేవాడతను విడిపించుకుంటూ. అతని జుట్టు చూసే శైలజ అతన్తో ప్రేమలో పడి పెళ్ళిదాకా వచ్చింది. వంటింట్లో బాబీ పెత్తనం సరేసరి. గుప్పిళ్ళతో మట్టి తీసుకొచ్చి దొరికినవాటిల్లో పోసేసేది. మంచినీళ్ళలో వుప్పు, పప్పుల్లో నీళ్ళు ఏది దొరికితే అది కలగాపులగం చేసెసేది.
“ఇలాగైతే నేను నిచ్చెన వేసుకుని అంతెత్తుని వంట చేసుకోవలసిందే!” అంది శైలజ నిస్సహాయంగా.
పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళ గదిలోకి వెళ్ళి దొరికిన పుస్తకాలన్నీ చింపేసేది. పెన్ను దొరికితే చాలు బరబర పుస్తకాలమీద గీసేసేది. “అయ్యబాబోయ్! చెల్లంటే యింత భయంకరంగా వుంటుందా?”” గుండెలమీద చేతులు వేసుకుని అంది ప్రీతి.
బాబీ ఎంత అల్లరి చేసినా కొట్టడానికి చేతులొచ్చేవికాదు శైలజకి. “ఎందుకే, యింతల్లరి చేస్తావు?!!” అంది ఓరోజు బాబీ బుగ్గలు పట్టి సాగదీస్తూ. బాబీ ఆమె కళ్ళలోకి సూటిగా చూసింది. ఆ కళ్ళలో తల్లిదండ్రులకోసం వెతుకులాట, తన కోరికనెవరూ గుర్తించటం లేదన్న వుక్రోషం, నిస్సహాయత… అనేక భావాలు,

“నేనున్నాను కదమ్మా?” ముద్దు పెట్టుకుంటూ అంది. బాబీ ఆమె మెడవంపులో ముఖం దాచుకుంది.
అప్పట్నుంచీ ఆ పిల్ల అల్లరి కొంచెం తగ్గింది. కూతుళ్ళకి కూడా చెప్పింది శైలజ. “దాన్ని కోప్పడటం, కొట్టడంలాంటివి ఎప్పుడూ చెయ్యకండి. నోటితో చెప్పలేకపోయినా తల్లిదండ్రుల బెంగ వుంటుంది. నెమ్మదిమీద మరిపించాలి” అంది.
ఎర్రటి స్కెచ్చిపెన్నిచ్చి పువ్వు గియ్యటం నేర్చింది ప్రీతి. ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన చిన్నప్పటి బొమ్మల పుస్తకాలు చూపించి చిన్నచిన్న కథలు చెప్పేది అనూష. క్రమంగా ఆయింట్లో అలవాటుపడియింది బాబీ.
తెలిసినవాళ్ళకి బాబీ విషయం ఎలాగా తెలుసు. తెలియనివాళ్ళకి ప్రత్యేకించి చెప్పేవారు కాదు దొరికిన పిల్లని. తమ కూతురనే అనేవాళ్ళు. స్కూల్లో వేసినప్పుడు ప్రియాంకనే పేరుతో వేసారు. ప్రీతికి బాగా నచ్చిన పేరది. తను వీళ్ళ కూతురు కాదని బాబీకి తెలుసు. ఒక మామూలు విషయంలా దానికి అలవాటుపడి యింది. ఒకరోజు మాత్రం శైలజని అడిగింది –
“మీరు నన్ను తీసుకురాకపోతే ఏమయేదమ్మా?” అని. ఆమె కళ్లు భయంతో రెపరెపలాడాయి. వెంటనే దగ్గరకి తీసుకుంది శైలజ. “మేము కాకపోతే ఇంకొకరు పెంచుకునేవారు. పసిపిల్లని వదిలేస్తారా?” అంది.
“ఎవరూ తీసుకెళ్లకపోతే?”
“అలా వుండదు. చంటిపిల్లని రోడ్డుమీద ఎవరూ వదిలిపెట్టరు” మాట మార్చబోయింది శైలజ. అలాంటి ప్రశ్నలామెకి నచ్చవు. బాబీ వాళ్లమధ్యని ఎంత బాగా ఇమిడిపోయిందంటే ఆమె దొరకడం ఒక కలలాగా అసలామె తన స్వంత కూతురేనన్నది వాస్తవంలాగా అనిపిస్తుంది.
తల్లీకూతుళ్లిద్దరూ మాట్లాడుకుంటుంటే కృష్ణమోహన్ అక్కడే వున్నాడు. “బాబీ!” అని పిలిచాడు.
“నాన్నా!” దగ్గరికెళ్లింది.
“చూడమ్మా! జరిగిపోయిన వాటి గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు. ముఖ్యంగా చెడు తప్పిపోయి మంచి జరిగినప్పుడు. నువ్వొక బొమ్మవేశావనుకో, దాన్నొక పోటీకి పంపించావనుకో, ప్రైజొచ్చిందనుకో. అప్పుడందరూ నిన్ను మెచ్చుకుంటారు. అలాగే క్లాస్ ఫస్టాస్తే, ఎంత బావున్నాయో చూడు, ఆ ఆలోచనలు! అలాంటివి ఆలోచించాలి. మంచిపిల్లలు అలాగే వుంటారు” అన్నాడు.
“సారీ నాన్నా!” అంది బాబీ.
చిన్నప్పుడు చేసిన అల్లర్లో వుండే విధ్వంసధోరణి పెరగకుండా ఆమె దృక్పథాన్ని మార్చడానికి చాలా ప్రయాసపడ్డాడు. ఇంట్లో అందరి సమిష్టికృషి బాబీ వ్యక్తిత్వం, ఇప్పుడామెకి పదిహేడేళ్ళు. మైల్డ్‌గా వుంటుంది. బైటికెళ్తే అక్కల చాటుని తిరుగుతుంది. ఇంట్లో వుంటే తల్లి కొంగు వదలదు. ఇంత కష్టపడి బాబీని తమలో ఒకటిగా చేసుకున్నాక ఇప్పుడీ వ్యక్తి వచ్చి తన కూతుర్ని తనకి యిమ్మంటున్నాడా? ఎటూ అంతు చిక్కకుండా వుంది.
జరిగినదాన్ని శైలజా కృష్ణమోహన్‍లు చేసుకున్నట్టే ఆ వచ్చినతను కూడా గుర్తు చేసుకున్నాడు. వాళ్లతో చెప్పటానికి కూడా సంకోచించలేదు. “పాప తప్పిపోయాక నా భార్య దాదాపు పిచ్చిదైంది. లేకలేక కలిగిన సంతానం అది. ఎన్నో పూజలు చేస్తే పుట్టింది. అలాంటి పిల్లని జాగ్రత్తగా చూడలేకపోయామనే అపరాధ భావన నన్ను కూడా ముత్తింది”
“తిరుపతి వెళ్లామన్నారు. దానికి జుట్టు తీయించలేదేం?” శైలజ చప్పున గుర్తు చేసుకుని అడిగింది.
“ఆడపిల్లలకి జుట్టు తీయించే సాంప్రదాయం మాకు లేదు. కానీ దాన్ని కొండకి తీసుకెళ్లి నిలువుదోపిడీ యిస్తానని మొక్కుకుంది నా భార్య. అలాగే చేసాం”
“…”
“మా అజాగ్రత్తే … మా అజాగ్రత్తే. కొరడా అంచులా తగిలేదామాట. ఎవరి చేతుల్లో పడిందో, ఎలాంటివాళ్లకి దొరికిందో పగలూ రాత్రీ అదే చింతన. గడిచే ఒక్కొక్క రోజూ మా గుండెలమీద ఒక గాయాన్ని చేసేది. తప్పిపోయినప్పుడు రెండున్నరేళ్లు. మూడు… నాలుగు… ఐదు… పది… ఇలా వయసొస్తుంటే మేం భయంతో వణికిపోయేవాళ్లం. ఎక్కడున్నా అది క్షేమంగా వుండాలని మొక్కని దేవుడు లేడు. చెయ్యని పూజలు లేవు. మా పూజలు వృధాగా పోలేదు. మీకు దొరికింది”
“మీకసలు మా ఎడ్రెసెలా దొరికింది?” శైలజ అడిగింది.
“నేను బిజినెస్ పనులమీద అనేకచోట్ల తిరుగుతుంటాను. అలాగే ఎంతోమంది కస్టమర్లు. ఏజెంట్లు, పరిచయాలు. హోటళ్ళలో, బార్లలో, క్లబ్బుల్లో వ్యాపారలావాదేవీలు… అనేక విషయాలపై చర్చలు. కొద్దిరోజులక్రితం ఒక వ్యవహారం జరిగాక సమాజంలోని మంచిచెడులమీద చర్చజరిగింది. ఆ కస్టమరు మీగురించీ, మీరొక పిల్లని దొరికితే పెంచుకున్న సంగతీ చెప్పాడు. నేను ఆశగా వివరాలు తెలుసుకున్నాను. బాబీని చూడాలని దాని కాలేజిముందు ఎన్నో సాయంత్రాలు నిలబడ్డాను. ఆఖరికి దాన్ని చూసాను. మా పెళ్లయ్యేసరికి నా భార్యది ఇదే వయసు. అచ్చుగుద్దినట్టు ఆమెలాగే వుంది. అప్పుడు నిర్ధారణ చేసుకుని మీముందుకి వచ్చాను”
“బాబీని తీసుకెళ్లాలని వచ్చారా?”” సూటిగా అడిగింది శైలజ. ఆమె గొంతు వణికింది. కృష్ణమోహన్ తీక్షణంగా చూశాడు.
సుదర్శనరావ్ తల అడ్డంగా ఊపాడు, ” మీకెలాంటి బాధా కలిగించనని నిన్ననే చెప్పాను. మీరసలు మాట వినిపించుకుంటేనా?” ఆరోపించాడు.
“మరి?”
“మగపిల్లవాడివైపునుంచీ పిల్లనిమ్మని అడగటానికి వచ్చాను” చిన్నగా నవ్వి అన్నాడు.
“అంటే?”
“ఈరోజు కాకపోతే రేపయినా మీరు బాబీకి పెళ్లి చేస్తారు. ఎవరో తెలీనివాళ్లింటికి కోడలిగా పంపే బదులు మా ఇంటికే పంపండి”
“వరసెలా కలుస్తుంది?” శైలజ అయోమయంగా అడిగింది.
“వ్యాపారంలో తోడుకోసమని నా మేనల్లుడిని తెచ్చి దగ్గర పెట్టుకున్నాను. వరసేగా?”
శైలజ, కృష్ణమోహన్ ముఖాల్లో ఆందోళన తొలగిపోయి ప్రసన్నత చోటుచేసుకుంది.
“బాబీకన్నా పెద్ద పిల్లలు మాకింకా ఇద్దరున్నారు” అన్నాడు కృష్ణమోహన్ నెమ్మదిగా.
“ఎప్పుడు చేసినా సరే మీ ఇష్టం. నేను దాని కన్నతండ్రిననే హక్కతో అడగటం లేదు. రెండుచేతులూ జోడించి అభ్యర్థిస్తున్నాను” అన్నాడు. అప్పటిదాకా ఎంతో స్థిరంగా వున్న అతని గొంతు అప్పుడు వణికింది. దుఃఖంతో గద్గదమైంది. కళ్లు చెర్చాయి. జేబులోంచి రుమాలు తీసుకుని ముఖం తుడుచుకున్నాడు.
“అన్నీ సవ్యంగా జరిగాయికదా, ఇంక బాధపడకండి” ఓదార్పుగా అన్నాడు కృష్ణమోహన్.
శైలజ కాఫీ తెస్తానని లోపలికి వెళ్లింది. ఆ కొద్దిసేపూ మగవాళ్లిద్దరూ జనరల్ టాపిక్స్ మాట్లాడుకున్నారు. సుదర్శనరావ్ తన వ్యాపారాన్ని గురించి చెప్పాడు. అతనిది కమిషన్ బిజినెస్. వస్తువుల్ని సీజన్లో కొని ఆఫ్‍సీజన్‍లో లాభానికి అమ్ముతాడు. కృష్ణమోహన్ తన ఉద్యోగంలో వుండే సాధకబాధకాలు చెప్పాడు.
“అబ్బాయేం చదువుకున్నాడు? ఎంతుంటుంది, వయసు? బాబీని చేసుకోవటం యిష్టమేనా?” శైలు కాఫీకప్పుల్తో వచ్చి అడిగింది.
“మీకు శ్రమిచ్చాను” అంటూ కప్పు తీసుకుని మేనల్లుడి వివరాలు చెప్పాడు. “పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేస్తూ బిజినెస్ చూసుకుంటున్నాడు. జీవితంమీద మాకు ఆశే లేకుండా పోయిన క్షణంలో వాడే మాకు ప్రాణాధారమయ్యాడు”
“మీకు వేరే సంతానం కలగలేదా?”
“దేవుడిచ్చిన ఒక్క పిల్లనే కాపాడుకోలేపోయాం. ఇంకా పిల్లలా అమ్మా? మా ఆరాటాలనీ, కోరికలనీ దేవుడిమీదికి మళ్లించుకుని రోజులు దొర్లించేస్తున్నాం” నిర్లిప్తంగా అన్నాడు. శైలజకి మనసెలాగో అయింది. గాజుబొమ్మని పెంచినట్టు పెంచింది యిక్కడ తను బాబీని. అక్కడ వాళ్లు దానికోసం ఆరాటపడుతూ అలాగే బతికారు. ఈ మలుపు అనూహ్యమైనది. అయినా ఆశించతగిందే! బాబీ పెళ్లి ఒక పెద్ద ప్రహసనంలా మారకుండా తమని గట్టేక్కించింది.
“బాబీని ఒక్కసారి చూసి వెళ్లచ్చా?” సుదర్శవరావ్ ఆడిగాడు. అతని మాటల్లో వాళ్ళకెక్కడా ఇబ్బంది కలిగించకూడదనే తపన వుంది. వాళ్ళపట్ల ఎనలేని గౌరవం వుంది. ఏ ఆకాశంలోనో వుండాల్సిన దేవతల్లా అనిపిస్తున్నారు.
” పిల్లలు ముగ్గురూ పిక్చర్‍కెళ్లారు. వచ్చేస్తారు. భోజనం చేసి వెళ్లండి” అంది శైలజ.
కొద్దిసేపటిక్రితందాకా అతనిమీద కోపాన్ని ప్రదర్శించిన కృష్ణమోహన్‍కి అతనొక స్నేహితుడిలా ఆత్మీయంగా అనిపించాడు ఇప్పుడు. తన అభిప్రాయం కూడా అదేనన్నట్టు సూచించాడు. సుదర్శనరావు మొదలు ఒప్పుకోలేదు. భార్యాభర్తలిద్దరూ బలవంతం చేస్తే సరేనన్నాడు. అతనికైతే రెక్కలు కట్టుకు వెళ్ళి తనవాళ్లతో ఈ సంతోషాన్ని పంచుకోవాలనుంది.
ఇంకొద్దిసేపటికి ఇంటిముందు ఆటో ఆగిన చప్పుడైంది. సుదర్శనరావు కుతూహలంగా వాళ్లని చూశాడు. అనూషా ప్రీతిల మధ్య ప్రియాంకని చూడగానే అతని ముఖం వెలిగిపోయింది. సంతోషాన్ని ఏమాత్రం దాచుకోలేకపోయాడు.
హాల్లో కూర్చున్న కొత్తవ్యక్తిని చూసి ముగ్గురూ సంకోచంగా ఆగిపోయారు.
“హలో! నా పేరు సుదర్శనరావ్. డూయూ రిమెంబర్ మీ?” ప్రియాంకకేసి చెయ్యి చాస్తూ అడిగాడు చిరునవ్వుతో,
ఆమె అర్ధం కానట్టు చూసింది. వెళ్లి శైలజ వెనక నిలబడింది. “మీ నాన్నగారు” అంది శైలజ. అలా అంటుంటే ఆమెకి బాధనిపించింది. కృష్ణమోహన్ చివ్వుమని తలతిప్పి చూశాడు. ప్రియాంక అపనమ్మకంగా ఒకసారి చుట్టూ చూసి, చప్పున తల్లి మెడవంపులో ముఖం దాచుకుంది. “నాకు నువ్వూ డాడీ, అక్కలూ, తప్పించి ఇంకెవరూ తెలీదు. నేనెక్కడికీ వెళ్ళను. నన్నెక్కడికీ పంపించొద్దు” అంది. అప్పటికే కళ్లలోంచి నీళ్లు కారిపోతున్నాయి. ఎక్కెక్కి పడుతోంది. కన్నతండ్రిని చూస్తుంటే సంతోషానికి బదులు తీవ్రమైన అలజడి కలిగింది.
అతి చిన్నవయసులోనే సంభవించిన తుఫాను తట్టుకునేందుకు తన శాయశక్తుల్నీ వెచ్చించింది. జ్ఞానం తెలీని వయసులో, ప్రకృతి వేసిన బంధాలని తెంచుకుని కొత్తబంధాలలో ఇమడడానికి చాలా శ్రమపడింది. ఇప్పుడు మళ్లీ సమూలమైన మార్చంటే ఆమె తట్టుకునేలా లేదు. శైలజ యిదంతా గుర్తించింది. ఆమెని ప్రేమగా దగ్గరకి తీసుకుంటుంటే సుదర్శనరావు వెలవెలబోతూ చూసాడు. అతనికి దుఃఖమూ సంతోషమూ ఏకకాలంలో కలిగాయి.
“పెళ్ళి చేసుకుని కూడా వెళ్ళవా?” ప్రియాంక ముఖం పైకెత్తుతూ అడిగింది శైలజ.
ఒక్కక్షణం ఏమీ అర్థం కాలేదు ప్రియాంకకి. “పెళ్ళా?!”

“నిన్ను వాళ్ళ మేనల్లుడికి చేసుకుంటామేమోనని అడగడానికి వచ్చారు”
ప్రియాంక సిగ్గుతో తడబడిపోయింది. ఆ వయసు అలాంటిది. సుదర్శనరావుకేసి అలవోగ్గా చూసి అక్కడినుంచి వెళ్ళిపోయింది.
కూతురు తనని చూసి ఆత్రంగా దగ్గరకి రాలేదనీ, అల్లుకుపోయి ఏడవలేదనీ అతను బాధపడలేదు. తమని మించిన తల్లిదండ్రులు దొరికాక ఎలా వస్తుంది? అనుకుని సమాధానపడ్డాడు. కూతురిగా రానన్న పిల్ల పెళ్ళి చేసుకుని అనేసరికి సిగ్గుపడిపోవటం చూసి నవ్వుకున్నాడు. ఆ పెళ్ళిప్రస్తావన తర్వాత కృష్ణమోహన్లో వచ్చిన మార్చుకూడా అతనికి నవ్వే తెప్పించింది. మార్కెట్లో ఎన్నో వస్తువులుంటాయి. వాటన్నిటిపట్లా మనకి జాగ్రత్తా ప్రేమా వుండవు. మనం కొనుక్కున్న వస్తువుమీద… మన చేతికొచ్చినదానిమీదే మనకి అనురాగం అల్లుకుంటుంది. భగవంతుడి సృష్టిలో ఎందరో మనుషులుంటారు. మన గుండె గూట్లోకి చేరుకున్న మనిషిమీదే మనకి ప్రేమాదరణలుంటాయి. ప్రియ తమ చేతుల్లోంచి జారిపడ్డ ముత్యం. వాళ్ళ గుండెగూట్లోకి చేరుకుంది. అలాంటప్పుడు వాళ్ళ ప్రేమాభిమానాలు సహజమే. ఇంకొద్దిరోజులు యిలాగే ఓపికపడే బాబీ తమ దగ్గరకొచ్చేస్తుంది. శాశ్వతంగా. ఎవరి మనసులూ విరగకుండా.
భోజనాలయ్యాయి. భోజనాల దగ్గర ప్రియాంక సుదర్శనరావ్ కేసి చూడను కూడా చూడలేదు. ఎక్కడ తనను తనతో రమ్మంటాడోనని తప్పుకు తిరిగింది. ఆమె మనసులో ఒక అభద్రతాభావం లాంటిది సుళ్ళుతిరుగుతోంది. అదెప్పుడూ ఆమెలో వున్నదే. ఐతే యిప్పుడు మళ్ళీ జాగృతమైంది. అన్నం తినటం తొందరగా పూర్తిచేసి, అందరికీ గుడ్‍నైట్ చెప్పేసి, బెడ్రూమ్‍లోకెళ్ళి తలుపేసుకుంది.
“అనూ, ప్రీతి। మీరూ తినేసి వెళ్ళండే. ఆదొక్కర్తీ గదిలో కూర్చుని ఏం చేస్తోందో ఏడుస్తోందేమో!” అని కూతుళ్ళని తరిమింది శైలజ. అనూష యింకా చెయ్యి కడుక్కుంటూనే వుంది, ప్రీతి వెళ్ళి చూసి గోడక్కొట్టిన బంతిలా తిరిగొచ్చింది.
“దొంగ! నన్ను చూసి దిండులో ముఖం దాచుకుంటోంది!” అంది పెద్దగా.
“ఇంతకీ పెళ్ళెప్పుడే?” అడిగింది అనూష కుతూహలంగా,
“మీ చదువులు తెల్లారినట్లే వున్నాయి. పెద్దపిల్లలు మీకిద్దరికీ కాకుండా దానికెలా చేస్తామే?” శైలజ కోప్పడింది.
“ఐతే అనూ, నీ రిసెర్చి…? హరోం హరా!”అంది ప్రీతి.
“ఏం పెళ్ళయ్యాక చెయ్యకూడదా?” శైలజు దబాయించింది. అనూష ముఖం ఎర్రబడింది. దాన్ని కవర్ చేసుకుంటూ ప్రియాంకమీదికి దాడి మళ్ళించింది. “ఐతే మనకింక యింట్లో రాధామాధవీయాలూ, సుభద్రార్జనీయాలూనన్నమాట!” అంది. అక్కాచెల్లెళ్ళిద్దరూ ప్రియాంక దగ్గరకి వెళ్ళారు.
సుదర్శనరావ్ యింక వెళ్తానని లేచాడు.
“మీ భార్యనీ మేనల్లుడినీ తీసుకుని రండి. బాబీగురించి మీకు చెప్పదగ్గదాన్ని కాదు. కానీ దాని మనసు యిప్పటికే ఒకసారి విరిగి అతుక్కుంది. మళ్ళీ వడిదుడుకులంటే తట్టుకోలేదు. పెళ్ళిద్వారానే అది మీకు దగ్గరౌతుంది” శైలజ చెప్పింది.
అతను రెండు చేతులూ జోడించి నమస్కరించి కదిలాడు. కృష్ణమోహన్ గేటుదాకా వెళ్ళి పంపించాడు.
“బాబీనే పంపించనంటే.. నువ్వు ముగ్గుర్నీ కలిపి ఒక్కసారే అంపకం పెట్టేలా వున్నావు” కినుకగా అన్నాడు.
“సరే అయితే, మీ ముద్దుళ్ళ కూతుళ్ళు ముగ్గుర్నీ అలాగే వుంచుకోండి” అంది శైలజు వెక్కిరింతగా.
“నువ్వూరుకుంటావేమిటి?”
(ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 21/11/2002)