మలివసంతం by S Sridevi

  1. పాతకాలపు మనిషి by S Sridevi
  2. ఒలీవియా by S Sridevi
  3. నాకొద్దీ అభ్యుదయం by S Sridevi
  4. అర్హత by S Sridevi
  5. సింధూరి by S Sridevi
  6. మలుపు by S Sridevi
  7. యంత్రసేవ by S Sridevi
  8. ప్లాస్మా జీవులు by S Sridevi
  9. మనుషులిచ్చిన శాపం by S Sridevi
  10. వంకరగీత by S Sridevi
  11. బంధీ by S Sridevi
  12. లాటరీ by S Sridevi
  13. ముల్లు by S Sridevi
  14. లే ఆఫ్ by S Sridevi
  15. నేను విసిరిన బంతి by S Sridevi
  16. మలివసంతం by S Sridevi
  17. తప్పనిసరిగా by S Sridevi
  18. ప్రేమరాహిత్యం by S Sridevi
  19. పార్థివం by S Sridevi
  20. ఖైదీ by S Sridevi

పేపరు తిరిగేస్తూ మధ్యమధ్య యామిని ఏం చేస్తోందోనని వంటింట్లోకి తొంగి చూస్తున్నాడు శశాంక. అతని నిరీక్షణ ఫలించి ఐదునిమిషాలకి ఆమె ఇవతలికి వచ్చింది. చేతిలో షర్బత్ గ్లాసులతో. ఒకటి అతనికిచ్చి ఎదురుగా కూర్చుంది. మాట ఎలా కలపాలో ఇద్దరికీ తెలియడంలేదు. చల్లటిగాలి రివ్వుమని వచ్చి ఇంట్లోని వస్తువులన్నిటినీ పరామర్శించి వెళుతోంది. అలమారలోని పుస్తకాలు రెపరెపలాడుతున్నాయి. కరెంటు పోలేదు. అదొక్కటే అదృష్టం. అతను వస్తాడని తల్లీ తండ్రీ బయటికి వెళ్లిపోయారు. తామిద్దరూ అరమరికలు లేకుండా మాట్లాడుకోవాలని.
” మీరు మిలట్రీనుంచి ఎప్పుడు వచ్చేసారు?” అని అడిగింది, ఏదో ఒకటి అడగాలని . అంతే! బిగుసుకున్న పూసలపేరు తెగిపోయింది. జలజల రాలే పూసల్లా దొర్లిపోయాయి మాటలు.
” సంవత్సరం అయింది” చెప్పాడు అతను.
” ఇంతకాలం మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు?” అడిగింది.
” వీలుపడక” సింపుల్ గా చెప్పాడతను. ఆ జవాబు ఆమెకి కొరుకుడుపడలేదు. ప్రశ్నార్థకంగా చూసింది.
శశాంక చెప్పడం మొదలుపెట్టాడు. “నాకు చాలా చిన్నప్పుడే మా నాన్న పోయాడు. అన్నయ్య ఇంటి బాధ్యతలు ఎత్తుకున్నాడు. వాడు కష్టపడి పైకి వచ్చాడు. నేను కష్టపడకుండా పైకి రావాలనుకునేవాడిని. దారి తప్పుతున్నానని గ్రహించి ఆర్మీలో చేర్పించాడు. కానీ నేను అప్పటికే దారి తప్పాను”
“అంటే?” వుత్కంఠగా అడిగింది.
” స్నేహితులు, సినిమాలు, పేకాట… వీటికోసం చేసిన అప్పులు తీర్చడానికి అన్నయ్య కష్టపడి కొనుక్కున్న సైకిల్ అమ్మేసి పోయిందని అబద్ధం చెప్పాను. వింటున్నారా? అప్పుడు నాకు పదహారేళ్లు”
” ఇంత చిన్న వయస్సులో అవన్నీ చేశారా?” అని అంటుండగానే ఆమె ముఖం ఎర్రబడింది.
” అన్నయ్యకి విషయాలు తెలిసాయి. అప్పుడే మావూళ్ళో ఆర్మీ సెలక్షన్స్ జరుగుతున్నాయి. తీసుకెళ్లి చేర్చేసాడు”
” అన్నయ్య కాక మీకు ఇంకెవరూ పెద్దవాళ్ళు లేరా?”
” మా అమ్మ వుండేది. ఆవిడకు అన్నీ తెలుసునని అప్పట్లో నమ్మేవాడిని. కానీ ఆవిడకి ఏమీ తెలీదని ఇప్పుడు అర్థమయింది. ఆవిడ మాటలకి అపారమైన విలువ యిచ్చినందుకు ఇప్పుడు విచారిస్తున్నాను. నాపట్ల ఘోరమైన తప్పిదం జరిగిందని ఆవిడ నమ్మకం. ఆవిడనిబట్టి నేనూ నమ్మాను”
“…”
” అన్నయ్యమీద ద్వేషంతో రగిలిపోతూ ఆరేళ్ళు గడిపాను. ఇలా చెప్పుకుంటున్నందుకు నాకేం చిన్నతనంగా లేదు. నా యీ భావాలు, బాధ అన్నీ ఎవరికో ఒకరికి వాళ్ళని చెప్పుకోవాలని ఎంతోకాలంగా అనుకుంటున్నాను. అటువంటి వ్యక్తెవరూ తటస్థపడలేదు. మొదటి ఆరేళ్లలోనే అమ్మ నామీది దిగులుతో చనిపోయింది. తాడూ బొంగరం లేకుండా అయిపోయింది నా పరిస్థితి”
” ఎందుకు, మీ అన్నయ్యగారిపట్ల మీకు అకారణ ద్వేషం? ఆయనేమీ తప్పు పని చేయలేదే? తన పరిధిలో తనకు చేతనైనంతలో మీకు ఒక ఉపాధి కల్పించారు”
” నేనలా ఆలోచించేవాడిని కాదు. వాడు దర్జాగా భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తూ నన్ను ఈ రొంపిలోకి తో చేశాడని కోపం వుండేది. అమ్మ పోయాక చాలాకాలం నేను ఇంటికి వెళ్ళలేదు. తర్వాత నాకు తెలిసింది, ఇక్కడ నేను గడుపుతున్నదానికన్నా గొప్ప జీవితమేదీ వాడు గడపడం లేదని. ఇక్కడ శరీరశ్రమ పడితే చాలు, తిండీ బట్టా దొరుకుతాయి. బయటి ప్రపంచంలో ఆ రెండిటికోసం నానా గడ్డీ కలవాలి”
” అంత తేలిగ్గా తీసి పారేస్తున్నారేమిటి ఆర్మీ అంటే లైఫ్ రిస్కు కదా?”
“రిస్కు లేనిదెక్కడ? ఇంట్లోనుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి మళ్లీ క్షేమంగా తిరిగి వస్తాడని హామీ ఇవ్వగలరా మీరు? రైల్లో టిక్కెట్ కొనుక్కుని బయలుదేరిన వ్యక్తి క్షేమంగా గమ్యం చేరుతాడని గేరంటీగా చెప్పగలరా ? అక్కడ ఆర్మీలో మేము ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటాము. శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో కచ్చితంగా తెలుస్తుంది. ఇక్కడ? రాజీవ్ గాంధీ అలా చనిపోతారని ఒక్కరు… ఒక్కరైనా ఊహించారా?”
“…”
” అన్నయ్య, వదిన ఓట్లు వేద్దామని వెళ్ళినవారు బూత్ పేల్చివేయడంతో చచ్చిపోయారు. వాళ్లకి ఇద్దరు పిల్లలు. కవలలు. గవర్నమెంట్ కాంపన్సేషన్ యిచ్చింది. కానీ వాళ్ల జీవితాల్లో వచ్చిన సుడిగుండాలు డబ్బుతో ఆగుతాయా?”
” పిల్లలు ఏమయ్యారు?”
” నేను మా అన్నయ్య మీద అలిగి ఇంటికి వెళ్లడం మానేసానని చెప్పాను కదా! నాకు ఈ వార్త చేరలేదు. దాదాపు ఆరునెలల తర్వాత సౌత్‍లో ఉండే నా ఫ్రెండ్ ఒకడు వాళ్ళ ఊరు వెళ్లి తిరిగి వస్తూ ఈ వార్త ప్రచురించబడిన పేపర్లో ఏదో పేక్ చేసి తెచ్చుకున్నాడు. అందులో అన్నయ్యావదినల ఫోటోలు వేశారు అలా అనుకోకుండా తెలిసింది నాకు”
“ఎంత ఘోరం?!”
“నా గుండెల్లో అప్పటిదాకా శృతి తప్పి ఉన్నదేదో మళ్ళీ సరిగ్గా పనిచెయ్యడం మొదలెట్టినట్టుంది. వెంటనే లీవు శాంక్షన్ చేయించుకుని వెళ్లాను. పిల్లలిద్దర్నీ చెరో మేనమామా తీసుకెళ్లాడు”
“పోన్లెండి అదీ అదృష్టమే”
“కానీ నేను భరించలేకపోయాను యామినిగారూ! ఇలా అనాథలౌతారని ముందే తెలుసు కాబట్టి దేవుడు వాళ్ళని కవలలుగా సృష్టించాడు, కనీసం ఒకరికి ఒకరు తోడుగా ఉంటారని. అలాంటివాళ్ళని విడగొట్టి చెరోచోటా ఉంచడం బాధగా అనిపించింది. గవర్నమెంట్ కొంత డబ్బు ఇచ్చింది. పిల్లలకి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఒక్కచోట ఉంచితే కనీసం ఒకరికొకరు వున్నారన్న ధైర్యం ఉంటుంది వాళ్లకి. వాళ్ల మేనమామలకి చెప్పి చూశాను. ఇద్దరు చిన్నపిల్లలని ఎవరు పెంచగలరని విసుక్కున్నారు. నాతో తీసుకొచ్చాను. డబ్బు లెక్కలు అడిగితే గుమ్మడికాయల దొంగల్లా భుజాలు తడుముకున్నారు. రెసిడెన్షియల్ స్కూల్లో వేశాను. తప్పలేదు. వాళ్లకోసమే పెళ్లి మానేశాను””
“మంచిపని చేశారు.ఇద్దరు పసిపిల్లల కన్నా ఏదీ ముఖ్యం కాదు” మనస్ఫూర్తిగా అంది యామిని.” ఏం చదువుతున్నారు వాళ్ళు?”
“బీటెక్ పూర్తైంది. ఉద్యోగాలకోసం చూస్తున్నారు”
“??!!”
“ఇప్పటి విషయమా ఇది?” అతను నవ్వాడు. నవ్వి, బయటికి చూశాడు. తుంపరపడుతోంది. కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడకుండా కూర్చున్నారు. తర్వాత యామినే , ” నా గురించి మా నాన్న ఏం చెప్పారు?” అని అడిగింది.
” అడ్వర్టైజ్మెంట్‍లో వేసిందే. మీరు డివోర్సీ అని, మీకో కొడుకని”
“అయినా మీకు ఇష్టమేనా?”
“ఇష్టమయ్యే కదా, ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది ?”
“నన్ను మీరు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. నా గురించి పెద్దగా ఏమీ తెలీదు ఇష్టం ఎలా పుట్టింది?”
“నా అవసరం చేత. నిర్మొహమాటంగా చెప్తే బాధపడతారేమో! నలభయ్యేళ్ల వయసులో పిల్లనెవరు యిస్తారు చెప్పండి?”
” అందుకని లాస్ట్‌ఛాయిస్‍గా నన్ను ఎంచుకున్నారా?”
“నేను చూసుకున్న సంబంధం ఇదే మొదటిది. అన్నయ్య పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళ జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాక మిగిలే ఒంటరితనం నన్ను ఇప్పట్నుంచే భయపెడుతోంది. అందుకే పెళ్లి చేసుకోవాలనుకున్నాను”
“…”
“బై ద బై … మీ అబ్బాయేం చదువుతున్నాడు? మీదగ్గర ఉండటగా? అప్పుడప్పుడూ వచ్చి వెళుతుంటాడా?” శశాంక వేసిన ప్రశ్నలకు ఆమె పునర్నిర్మించుకోబోతున్న జీవితపు పునాది కదిలినట్టైంది. ముప్పయ్యైదేళ్ళు దాటబోతున్న తరుణంలో మళ్లీపెళ్లి చేసుకోవాలని తను తీసుకున్న నిర్ణయం సహేతుకమేనా లేక తాత్కాలికమైన ఆవేశంలో తీసుకున్నదా అనే అనుమానం మొదలైంది. అతనేదీ దాచకుండా చెప్పినట్టు తనూ చెప్పాలంటే మొదట తననితాను ప్రశ్నించుకోవాలి. మొదట జరిగినది పెళ్లేనా అని.

పదహారేళ్ళ వయసులో ప్రేమ కలల్లోని అద్భుతం. ఇరవయ్యేళ్ళ వయస్సులో ప్రేమ భూమ్మీది అద్భుతం.
ఆ అద్భుతాన్ని సొంతం చేసుకోవాలని యామిని ఇంట్లోనుంచి పారిపోయి తిలక్‍ని పెళ్లి చేసుకుంది- రహస్యంగా- గుడిలో.
ఏడాది గడిచింది. బాబు పుట్టాడు. ఒకరోజు …
“చెన్నై వెళ్దాం. ఎదుగూ బొదుగూ లేని ప్రైవేటు ఉద్యోగంతో ఎంతకాలం ఇలా? అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు. సినిమా ఛాన్స్‌కి ప్రయత్నిస్తాను. తమిళ ఇండస్ట్రీలో వాళ్ళకి చాలామంది తెలుసట ” అన్నాడు.
“మనకిప్పుడేం తక్కువ?”
“అసలేం వుందని ?”
“ఇలాగే ఎందుకుంటాం? కష్టపడితే పైకొస్తాం”
“తెలీనట్టు మాట్లాడకు. సినిమాఛాన్సంటే జాక్‍పాట్ కొట్టడమే”
“అయితే ఆ పని అందరూ ఎందుకు చేయరు? ఎవరో ఎందుకు? మీరు చెప్పిన మీ ఫ్రెండ్సే చెయ్యచ్చుకదా?”
“అందరికీ నాలాంటి పర్సనాలిటీ ఉండద్దా?”
“కావచ్చు కానీ మరోసారి ఆలోచించు. అంత పెద్దసిటీలో ఏ ఆధారం లేకుండా ఎలా బతుకుతాం భాష కూడా రాదు?” కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అడిగింది యామిని.
” నాకు ఫ్రెండ్స్ ఉన్నారన్నానా?” అతనికి సహనం నశించి అరిచాడు.
” ఎంతకాలం వాళ్లు మనకి ఆసరా ఇస్తారు?”
” ఏదో ఒక దారి దొరక్కపోదు. నాతో నువ్వూ వస్తే అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. నిన్ను చూసి నాకు చాన్స్ ఇస్తారు” అతని మాటల్లో వక్రత అప్పుడు అర్థమైంది యామినికి. “నేను రానన్నానా?” అనేసింది గట్టిగా.
తిలక్ కోపం తగ్గాక నెమ్మదిగా నచ్చజెప్పచ్చనుకుంది యామిని. కానీ అతను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాడని ఆమెకి తెలీదు.
ఆమె మంచి నిద్రలో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ మూటగట్టుకుని చెన్నై పారిపోయాడు. ఆమె కళ్ళు తెరచి చూసేసరికి బ్రతుకు నడిబజారులో ఉంది . కొంత సంయమనంగల వ్యక్తి గనుక ఏం చేయాలని జాగ్రత్తగా ఆలోచించింది. జరగబోయే నష్టం ఆపటంకోసం స్వాభిమానాన్ని చంపుకోవటం మేలని ఎంచి పుట్టిల్లు చేరింది. అప్పటికి ఆమెకి ఆర్నెల్ల కొడుకు.
జరిగిన విషయాలు చెప్తుంటే తండ్రి నిర్లిప్తంగా విన్నాడు. తల్లి ఆమెని గుండెలకి హత్తుకుంటూ ఏడ్చింది. ఏడుస్తూ అంది , “ఎవరూ పిల్లలకు ఇలాంటి పేర్లు పెట్టుకోరంటే వినలేదు మీ నాన్న . ఏ ముహుర్తాన ఆ పేరు పెట్టారోగానీ నీ బ్రతుకంతా అయిపోయింది” అని.
మధ్యలో వదిలేసిన చదువుని పూర్తిచెయ్యడం దగ్గరనుంచి యామిని జీవితానికి రిపేర్లు మొదలయ్యాయి… బంధువులు… అయినవాళ్ళు… కానివాళ్ళు… అందరినుంచి వెల్లువెత్తిన కుతూహలం, విమర్శలు… నిందలు, వద్దువద్దనటాలు, భయాలు… ఈ అన్నిటిమధ్య.
ఇంక ఆ పాతజీవితాన్ని మర్చిపోతేనే తను ఆమెకి అండగా నిలబడతానని ఖండితంగా చెప్పి హద్దురేఖ గీసాడు ఆమె తండ్రి.
యామిని పుట్టిల్లు చేరిందని తెలిసి సంబంధం పునరుద్ధరించుకోవటానికి వచ్చాడు తిలక్. అతన్ని యామిని జీవితంలోంచీ తప్పించడానికి చాలా ప్రయాసపడ్డాడు ఆమె తండ్రి . ఆధారాల్లేని పెళ్లి. దాన్ని విడగొట్టడానికి అడ్డదారే సవ్యమార్గమైంది. మర్డరుకేసులో ఇరికించి బెదిరిస్తే రాష్ట్రం వదిలిపోయినవాడు తిరిగి చూడలేదు.
ఆరోజు…
ఆఫీసుకి వెళ్దామని చీర మార్చుకుంటోంది.
“అమ్మా!” గుమ్మంలో నిలబడి చూస్తూ పిలిచాడు శీను.
“ఏంటి నాన్నా?” చీర కుచ్చెళ్ళు ఒక చేత్తో పట్టుకుని రెండోచేత్తో సరిచేసుకుంటూ అడిగింది.
“మా నాన్నెవరు?” బాంబులా వచ్చింది ఆ ప్రశ్న. ఇప్పటికి ఎన్నోసార్లు అడిగాడు . అడిగినప్పుడల్లా ఆమె తృళ్ళిపడుతూనే ఉంది. ఇప్పుడూ అంతే. చీర కుచ్చెళ్లు జార్చేసింది. ఇంత పెద్దగా వున్నావు, నీకు నాన్న ఉన్నాడు-నాకెందుకు లేడని కళ్ళతోటే ప్రశ్నిస్తున్నట్లుగా ఆమె వడ్డూ పొడవూ చూస్తున్నాడు వాడు.
“భడవకానా! ఇంతమందిమి ఎదురుగా ఉంటే మేమెవ్వరం అక్కర్లేదుగానీ ఇక్కడెక్కడా లేని నాన్న నీకు కావల్సి వచ్చాడా ?” అమ్మమ్మ హాల్లోంచీ వస్తూ అంది.
“ఎక్కడా లేడంటే చచ్చిపోయాడా?” మరో ప్రశ్న.
“ఛ, వెధవా! నోర్ముయ్” ఆవిడ కసిరింది. ఆవిడ బాధ ఆవిడది, అతనంటూ బతికి వున్నాడు కాబట్టే కూతురు ఇంత పసుపూకుంకాలతో తిరుగుతోందని.
“చెప్పవేమ్మా? అందరికీ నాన్న వుంటాడట. నాకెందుకు లేడు?” మళ్ళీ తల్లినడిగాడు వాడు. యామిని తెప్పరిల్లింది. చీర చుట్టుకుంటూ వాడికేసి నిశితంగా చూసింది. చూస్తున్నకొద్దీ ఆవేశం.
ఎన్నిసార్లు అడుగుతాడు వీడు ఈ ప్రశ్నని? తను చెప్పదని తెలుసు. ఇష్టం లేదనీ తెలుసు. ఐనా అడుగుతునే వుంటాడు. నాన్న లేకపోతేనేం? అమ్మా నాన్నా రెండూ కూడా తనే అయి పెంచడంలేదా? ఎక్కడిది వీడికీ మొండితనం? తండ్రి పోలికా? అంతే అయ్యుండవచ్చు. అతనూ అంతే. ప్రేమించానని వెంటపడ్డాడు. కులంకాదు, భాషకాదు, ప్రాంతం కాదు. సరిసాటి కాదు. తల్లిదండ్రులు వప్పుకోరంది తను. ఇల్లొదిలి వచ్చేదాకా ప్రేమప్రేమని చెండుకు తిన్నాడు. ఆ తర్వాత నట్టేట ముంచేసాడు. అలాంటివాడు తండ్రని కొడుక్కి తెలియచెప్పాలా? ఉ<హు< ఆ నీడే పడకూడదు….
రాడ్‍కి తగిలించిన ఖాళీ హేంగరు అందుకుంది. ఒక్కో అడుగూ వేస్తూ కొడుకుని సమీపించింది. తల్లి కొడుతుందని వాడు వూహించలేదు. బిత్తరపోయి అలాగే చూస్తూ నిలబడ్డాడు. యామిని వాడి భుజం దగ్గర నొక్కి పట్టుకుని పళ్ళ బిగువుని అడిగింది.
“చెప్పు. ఇంకోసారి నాన్న గురించి అడుగుతావా? చెప్పరా, చెప్పపు…” అని అరుస్తూ కొడుతోంది ఆమె. ఒక్కొక్క దెబ్బా పడుతుంటే కెవ్వుమంటున్నాడు వాడు.
“అమ్మాయ్! ఏమిటే, ఇది? పసిపిల్లాడిని ఏమిటా కొట్టడం?” యామిని తల్లి వచ్చి అడ్డంపడి ఇద్దరినీ విడదీసింది. “చిన్నవాడు… వాడికేం అర్థమౌతాయి మన సమస్యలు? అందరూ అంటుంటే విని అడిగాడు. అంతోటిదానికి ఇలా కొట్టుకుంటారా? కొట్టినంతమాత్రాన అడిగే నోరు మూతపడుతుందా? అసలీ ఆవేశమే నీ కొంప ముంచింది” అంటూ మనవడిని ఎత్తుకుని అక్కడినుంచి వెళ్ళిపోయింది.
“అమ్మ రాక్షసి… దెయ్యం… నాన్నే మంచి. మా నాన్నేడి అమ్మమ్మా?” ఆవిడ భుజంమీద మొహం దాచుకుంటూ అడిగాడు వాడు. అందనివి ఎప్పుడూ రమ్యహర్మ్యాలు. తల్లి మాటలకే షాక్ తిన్న యామిని కొడుకు మాటలకి పూర్తిగా కదిలిపోయింది. చేతుల్లో ముఖం కప్పుకుని నిల్చున్నచోటే కుప్పకూలిపోయింది.
“అమ్మ రాక్షసి… నాన్నే మంచి…” పదేపదే వాడి మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. వాడిని అనాథాశ్రమంలో వదిలెయ్యమనీ తనకి మరో పెళ్లి చేస్తాననీ అన్నాడు తండ్రి. మమకారం తెంచుకోలేకపోయింది తను. పైగా-
“తప్పు చేసిన నన్నే మీరు గుండెల్లో దాచుకుంటున్నారు. అలాంటిది ఏ తప్పూ చెయ్యని వీడినెందుకు వదిలెయ్యాలి నాన్నా?” అని ప్రశ్నించింది. లోకనిందనీ, తండ్రి నిరసననీ ఎదుర్కొని మరీ పెంచినందుకు వాడు తనని రాక్షసన్నాడు. ఒక్కసారేనా మొహం చూడని తండ్రిమీద వ్యామోహం.
ఆరోజు ఇంక ఆఫీస్‍కి వెళ్ళలేదు. తల్లే ఫోన్ చేసి ఆరోగ్యం బాగా లేదని చెప్పేసింది.

పోలీసుకేసు, గొడవల తర్వాత తిలక్ మళ్ళీ యామినికి తటస్థపడలేదు. అలాగని ఏ ఒక్క సినిమాలోనూ కనిపించలేదు. ఏమైపోయాడో తెలీలేదు. తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఆ అంకానికి తెరదించేసాననే అనుకుంది. తిలక్ మాత్రం కొడుకుని మర్చిపోలేదు. వాడే తన ఆఖరి అస్త్రం అనీ, ఈ ఫీల్డులో తను సాధించలేనిది కొడుకుద్వరా సాధించాలనేది అతని అభిమతం. దానికి సమయంకోసం చూస్తున్నాడు.
సమయం… అంటే… శీను కొంచెం పెద్దై , తల్లినుంచీ దాపరికాలు నేర్చునే వయసు వచ్చేదాకా…

శీనుకి కాలేజి అడ్రెసుకి మొదటి వుత్తరం వచ్చింది. తండ్రినుంచి. ఉత్తరం ఎవరికీ కనిపించకుండా దాచుకొమ్మనే సలహాతో. యామినికి తను సినిమాల్లో చేరటం ఇష్టం లేదనే వక్రీకృత వాస్తవంతో. చెన్నైలో తన పరపతి గురించి రాసాడు. ఎందరో హీరోలని తనే ఇండస్ట్రీకి పరిచయం చేసానని రాసాడు. ముద్ర పడిపోయింది.
తండ్రి ఎంత గొప్పవాడోనని ఆశ్చర్యపోవటం శీను వంతైంది. అంతటివాడికి కొడుకయ్యుండి ఆ విషయాన్ని బైటికి చెప్పుకునే వీలులేని పరిస్థితిని కల్పించిన తల్లిమీద అతనికి చాలా కోపం వచ్చింది. ఇది మొదటి అడుగు ఆమెకి దూరమవటానికి. ఆ తర్వాత పడ్డ అడుగులన్నీ ఆ దిశలోనే… దూరాన్ని పెంచుతునే.
సినిమా ఫంక్షన్లలో ప్రముఖులతో దిగినట్టు ట్రిక్ ఫొటోలన్నీ పంపించేవాడు తిలక్. అతను ఆశించినట్టే శీను ప్రలోభంలో పడ్డాడు. బాగా కాలనిచ్చి ఇనుముమీద సమ్మెట దెబ్బ వేసినట్టు తన ఆఖరి వుత్తరం రాసాడు తిలక్.
“నాన్నా! శీనూ!
నీ తపన అర్థమైంది. నీ భవిష్యత్తు పుస్తకాలలో కాదు, వున్నది. మీ అమ్మ దగ్గర అసలే కాదు. వెంటనే బయల్దేరి ఇక్కడికి వచ్చెయ్. ఎవరికీ తెలియనీకు. ముఖ్యంగా అమ్మకి. ఆపేస్తుంది.
నాన్న

“శీనూ! ఈమధ్య సినిమాలు బాగా చూస్తున్నావు . క్లాసులు ఎగ్గొట్టి కూడా చూస్తున్నావట?” ఒక కొలీగ్ చెప్తే విషయం తెలిసి, ఆఫీసునుంచి రాగానే అడిగింది యామిని.
” లేదమ్మా ! జస్ట్… ఒకటి రెండుసార్లు ఫ్రెండ్స్ బలవంతం చేస్తే వెళ్లాను. ఇంపార్టెంట్ క్లాసెసేమీ కాదు”
“నో… చదువుకునే వయసులో చదువుమీద శ్రద్ధ ఉండాలి. సినిమాలు, ఎంటర్టైన్మెంట్స్ తర్వాత” ఖచ్చితంగా చెప్పింది యామిని. తలూపి అక్కడినుంచి వెళ్ళిపోయాడు శీను.
ఇప్పుడిప్పుడే దారుఢ్యం నింపుకుంటున్న శీను నడకలో ఒక రకమైన స్వింగ్. వంపు తిరిగిన గెడ్డం కొన… దాన్ని చూసుకుంటున్నట్టు కాస్త వంగిన ముక్కుకొస… సరిగ్గా తిలక్ ఇలానే వుంటాడు. ఆలోచనలూ, ఆసక్తులూకూడానా? ఎందుకొస్తాయి అవాంఛనీయవ్యక్తుల పోలికలు? అతని దార్లోనే వెళ్లి పోతాడా? కలుక్కుమంది యామినికి.
కొడుకు సరిగ్గా చదవటంలేదంటే బాధ. సినిమాలు చూస్తున్నాడంటే బాధ. వాడిలో అతని పోలికలు ఎక్కువగా వున్నాయంటే బాధ. వాడి పెంపకం విషయంలో తను అజాగ్రత్తగా వుంటోందేమోనని బాధ. అన్నీ బాధలే. బాధపడటానికే పుట్టిన మనిషేమో తను! విరక్తిగా అనుకుంది.
“అలా కూర్చున్నావేమే?” తల్లి వచ్చి అడిగేదాకా అలాగే వుంది. ముప్పయ్యైదేళ్ళకే విరాగిలా తయారైన కూతుర్ని చూసి ఆవిడ గుండె తరుక్కుపోయింది.
“లేమ్మా! లే. లేచి కాళ్ళూచేతులూ కడుక్కుంటే టిఫెను పెడతాను” ప్రేమగా అంది.
యామిని లేచింది. పెరట్లోకి వెళ్ళి ఫ్రెషై వచ్చింది. టిఫెన్ తింటూ తల్లితో అంది.
“ఈమధ్య శీనుకి ఎందుకో చదువులో శ్రద్ధ తగ్గింది “
కూతురికేసి నిశితంగా చూసి అంది తల్లి.
” పిల్లలమీద అంతంత మమకారాలు పెంచుకోకూడదు. పిల్లల్ని కంటాంగానీ వాళ్ళ రాతల్ని రాయలేం మనం” అంది. యామిని శీనుపట్ల పెంచుకున్న మమకారం చూస్తుంటే ఆవిడకి భయం వేస్తుంది ఒక్కోసారి. ప్రవాహంలో కొట్టుకుని పోతున్నవాడు గడ్డిపరకని ఆధారం చేసుకున్నట్టు అన్నీ పోగొట్టుకుని కొడుకుని అల్లుకుపోతుందని.
ఆవిడ మాటల్ని శ్లేషగా అర్థం చేసుకుంది యామిని. తనమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. పద్ధెనిమిదేళ్ల వయసులో తిలక్‍తో ఇంట్లోంచి వెళ్ళిపోయింది. పోనీ ఆ పెళ్లి నిలుపుకుని వాళ్ళకి సంతోషం మిగిల్చిందా అంటే అదీ లేదు. అతనికెప్పుడూ అనాయాసంగా వచ్చే డబ్బు మీదే దృష్టి ఉండేది. తన వంటిమీద వుండే నగలన్నీ అమ్మేసి వ్యాపారంలో పెట్టాడు . రెండోరోజుని దివాలా తీశాడు. గుర్రపు పందాలు, పేకాటలో పోగొట్టుకున్నది తిరిగి సంపాదించాలని పాకులాడేవాడు. అవన్నీ సాగక పొట్టగడవటానికి చిన్నచిన్న వుద్యోగాలు చేసేవాడు.
” ఏం, మీ నాన్నకి నువ్వు ఒక్కదానివే కదా, పిలిచి మనిద్దరినీ దగ్గర పెట్టుకుంటేనేం? ” అనేవాడు తరచూ.
“వాళ్ళు పిలిస్తే మాత్రం మనం వెళ్తామా? నేను చేసింది తప్పు కాదని చెప్పుకోగలిగిన రోజున వెళ్తాం” అని తను జవాబిచ్చేది.
తన వలన ఎలాంటి ప్రయోజనం లేదని తెలిశాక నడిబజారులో వదిలేసి వెళ్ళిపోయాడు. కొడుకుని తీసుకుని పిలవకపోయినా పుట్టిల్లు చేరింది.
పిల్లవాడిని వదిలెయ్యమని వీళ్ళు అన్నారు. అక్కడకూడా వాళ్ల ఆశల్ని వమ్ము చేసింది. తిలక్‍మీది ప్రేమ అప్పటికి ఇంకా పూర్తిగా చావలేదు. లోకాన్ని గురించి అర్థమయ్యీకాని వయసు. అతని గుర్తుగా వాడిని పెంచాలనుకునేది. ఆదర్శవంతంగా వాడిని తీర్చి దిద్ది ప్రయోజకుడిని చేసి సగర్వంగా అతనికి చూపించాలనీ, అతడు పశ్చాత్తాపంతో క్షమించమని అడుగుతాడనీ కలలు కనేది. ఎంత పిచ్చితనమో! తర్వాత్తర్వాత తన జీవితానికి కొడుకే ఆలంబన అనిపించింది. అదే అలవాటైంది.
ఇవన్నీ గడిచిపోయిన ఇన్నేళ్ళకి తల్లి మాటలతో మళ్ళీ గుర్తొచ్చి కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి.
అదే సమయానికి తన గదిలో మంచంమీద బోర్లా పడుకుని తండ్రి రాసిన ఉత్తరం చదువుతున్నాడు శీను. అప్పటికి ఎన్నిసార్లు చదివాడో!వచ్చేయమంటున్నాడు తండ్రి. ఏం చేయాలి? ఇంత ప్రముఖ వ్యక్తికి కొడుకు తను. చదివి ఏమి సాధించాలి? ఒకవేళ చదివినా ఏ గుమస్తా ఉద్యోగమో వస్తుంది. అదే తండ్రి దగ్గరకెళ్తే చాన్సు తగిలితే హీరో కావచ్చు. లక్షలు, కోట్లు ఆర్జించవచ్చు. ఫస్ట్ ఇయర్ ఎలాగో గట్టెక్కాడు తను. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడే దగ్గరపడుతున్నాయి. ఫెయిల్ అవ్వడం ఖాయం. తండ్రి ఎవరని అడిగితేనే చావకొట్టిన తల్లి పరీక్ష తప్పితే ఊరుకుంటుందా? కందిరీగల తుట్టె కదిలినట్టు బుర్రలో ఆలోచనలు కదులుతున్నాయి.

యామిని కళ్ళు వర్షిస్తున్నాయి.
“మగవాడి చేతిలో రెండుసార్లు ఓడిపోయాను. ఒకసారి భార్యగా, ఒకసారి తల్లిగా” అంది. “కోకిల పిల్లని కాకి పెంచినట్టు అతని భావాలు పుణికిపుచ్చుకున్న పిల్లవాడిని నేను పెంచాను. రెక్కలొచ్చాయి. వాడి గూటికి వాడు చేరుకున్నాడు”
” అంటే శీను తండ్రి దగ్గరికి వెళ్లిపోయాడా?”
” ఆహా! అతను వాడిని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. నేను తప్పుకున్న స్థానంలోకి మరో స్త్రీని తెచ్చుకున్నాడు. ఆమెకూడా ఇండస్ట్రీ మనిషే. జూనియర్ ఆర్టిస్ట్. వాళ్ల ఆశలు కొనసాగడానికి శీను ఎంతేనా అవసరం. వాడు భవిష్యత్తులో ఎప్పుడేనా లీడ్ రోల్ వేస్తాడేమో నాకు తెలీదుగానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా చెయ్యిజారిపోయాడు”
“అలా చేజేతులా పిల్లవాడి భవిష్యత్తు నాశనం చేసే తండ్రి వుంటాడా?”
“ఇతనున్నాడుకదా? నాన్న వెళ్లి అడిగినా ప్రయోజనం లేకపోయింది. పంపలేదు. అప్పటికే వాడి కళ్ళముందు ఆకాశహర్మాలు కట్టేసాడు”
“…”
“నాన్నకి హార్టెటాక్ వచ్చింది. ఇది రెండవసారి. ఆయనకి బతుకు భయంకన్నా నా దిగులు ఎక్కువగా పట్టుకుంది. తను లేకపోతే వంటరిగా ఎలా బతుకుతాననే భయం… పెళ్లి చేసుకొమ్మని వత్తిడి చేసారు. నాకొక ఆసరా వుండాలని బలమైన కోరిక…”
“మంచిదేకదా? ఏ మనిషేనా ఒక్కరూ ఎలా వుండగలుగుతారు? ఎందుకు అలా దిగులు మోస్తూ వుండటం? మా అన్నయ్య తర్వాత మిమ్మల్నే చూస్తున్నాను యామినీ! నాన్న పోవటంతో గాలివానకి చెల్లాచెదరైపోయిన గూటిలాంటి బతుకుల్ని కూడగట్టుకుని ఏమీ లేకపోవడంలోనుంచి తనకో ఇంటినీ, ఇల్లాలూ పిల్లలని సృష్టించుకున్నాడు వాడు. తుఫానులో చిక్కుకుపోయినా సామర్థ్యంతో బయటపడి, జీవితాన్ని పునాదులతోసహా మళ్ళీ నిర్మించుకున్న మిమ్మల్ని చూస్తున్నాను. వసంతం ఒక్కసారి వచ్చి వెళ్లిపోదు. మళ్ళీ మళ్ళీ వస్తునే వుంటుంది ” అన్నాడు శశాంక వుద్వేగంగా.
“మలి వసంతం గత శిశిరంలో ఆకురాలిన ఆనవాళ్ళని చెరపలేదు” అంది ఆమె.
“అన్ని అనుభవాలు, గుర్తులు, జ్ఞాపకాలతోసహా మీరు… తెల్లకాగితం మీది రంగురంగుల బొమ్మలా … సరేనా? ట్రస్ట్ మీ” అన్నాడు.
ఒక నిర్ణయం పూర్తైంది. సరిగ్గా అప్పుడే వచ్చారు యామిని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నది ఆశో నిరాశో తెలుసుకోవటానికి.