Youtubers please WhatsApp to 7382342850
లాబ్‍లో ఇచ్చిన రిపోర్టులు తీసుకుని డాక్టరుకి చూపించి ఆయన చెప్పింది విని మౌనంగా ఇవతలికి వచ్చాడు మధు.
“మీరు కాఫీ టీలు, సిగరెట్లు మానెయ్యాలి. అల్సర్స్ బాగా పెద్దవయ్యాయి. వీలైనంత తొందరగా సర్జరీ చేయించుకోండి” డాక్టరు మాటలు చెవుల్లో మార్మోగాయి. ఆరోగ్యం కన్నా విలువైనదీ, మనిషికి జీవనపోరాటంలో నైతికబలాన్నిచ్చేదీ మరేదీ వుండదు. ఇంకేం మిగిలింది తనకి? మనశ్శాంతి లేదు, ఆరోగ్యం లేదు. ఎలా వున్నా ఏం తిన్నా పట్టించుకుని మందలించేవాళ్ళు లేరు. మనసు చాలా అలజడిగా మారింది. క్రమంగా దు:ఖంతో నిండిపోయింది.
ఇంటికి వచ్చాడు. పిల్లలు ఇంట్లో లేరు. ఆడుకుందుకు వెళ్ళారు. భార్య రమ వుంది. ఆమె పెళ్ళికి ముందు ప్రైవేట్ కాలేజిలో చేసేది. టైమింగ్స్ కలవక పెళ్ళైన కొత్తలోనే వుద్యోగం మానేసింది. ఉద్యోగం మానకుండా వుండి వుంటే బాగుండేదనిపించింది ఆ క్షణాన.
“ఇవాళ తొందరగా వచ్చారే ! ” అంది విస్మయంగా.
అతను నవ్వి వూరుకున్నాడు. రిపోర్టుల్లోని విషయాలు, డాక్టరు చేసిన హెచ్చరికలు ఆమెకి చెప్పాలనిపించలేదు. తనకి తను అందర్నించీ విడిగా అనిపించాడు. అలసటగా సోఫాలో కూలబడితే లోపలికి ఆమె వెళ్ళి చల్లటి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది.
“ఉండండి. కాఫీ కలుపుకుని వస్తాను” అని మళ్ళీ వెళ్ళింది. వంటింట్లోంచి కమ్మటికాఫీ వాసన ముక్కుకి సోకుతుంటే “ఇవాళ ఇదెన్నో కాఫీ?” అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. పదోసారో పదకొండోసారో సరిగా లెక్క కుదరలేదు. వదిలేసాడు.
రమ కాఫీ గ్లాసుతో వచ్చింది. అతనికిచ్చి పక్కనే కూర్చుంది.
“నీకో? ” అడిగాడు తాగబోతూ.
“నాకిన్నిసార్లు అలవాటులేదు. నిద్రపట్టదు”
చురుక్కుమనిపించింది. తనకి మాత్రం అలవాటా? చాలాకాలం పాలలో లైట్‍గా బ్రూ వేసి ఇచ్చేది తల్లి. ఆపైన కూడా కొంచెం స్ట్రాంగ్‍గా తాగడం జరిగిందిగానీ ఎక్కువసార్లు తాగడం లేదు. తనకి తెలియకుండానే ఒకటికి రెండు, రెండుకి నాలుగుసార్లు కాఫీకి అలవాటు పడ్డాడు. దాన్ని పెంచుకుంటూపోయాడు. అన్నిసార్లు తాగద్దని రమ నచ్చజెప్పినా ఆరోగ్యం పాడౌతుందని డాక్టర్లు హెచ్చరించినా అది కొద్దిసేపు ఇచ్చే ఫ్రెష్‍నెస్‍కోసం వదలలేకపోతున్నాడు. అలాగే సిగరెట్లు.
పెళ్ళి…. పిల్లలు… ఇంటా బయటా వత్తిడి. ఇది మంచిదనిగానీ చెయ్యమనిగానీ చెయ్యద్దని చెప్పడానికిగానీ తల్లీతండ్రీ లేరు. ఇంత విశాలమైన ప్రపంచంలో తనొక్కడు. తనని ఆశ్రయించుకుని భార్యాపిల్లలు. ఎందుకో ఈమధ్య వాళ్ళు మొయ్యలేనంత బరువనిపిస్తున్నారు. తనని ఇరికించి పట్టుకున్న బంధాల్లాకూడా అనిపిస్తున్నారు. అందుకే అనిపించడం, రమ వుద్యోగం మానకుండా వుండాల్సిందని.ఆఫీసులోఅన్నిటికీ డెడ్ లైన్లు. ఇంట్లో పిల్లల అవసరాలు, ఆఫీసులో ప్రాజెక్టులు. సుడిగుండంలో ఇరుక్కుపోయినట్టనిపించిది. కణతలు రుద్దుకున్నాడు. కొద్దిరోజులుగా అతను చేస్తున్న ఆలోచన ఒక రూపానికొచ్చింది. ఊపిరి పీల్చుకున్నాడు.
“ఏమిటి?” అడిగింది రమ.
“ఈ దసరాకి మన వూరు వెళ్తున్నాం. బతకమ్మ పెట్టడం అక్కడే. లీవు పెడతాను” అన్నాడు వున్నట్టుండి ఒక నిర్ణయానికి వచ్చినట్టై.
ఆమె తెల్లబోయింది. “మన వూరా? ఏముందక్కడ? ” అడిగింది.
“ఇల్లు, పొలం”
“ఇంట్లో దూరపు చుట్టాలెవరో వుంటున్నారుకదా? “
“ఇల్లు చూడటానికని వుంటున్నారు. రెండు గదులు వాడుకుంటున్నారు. మిగిలిన ఇల్లంతా అలాగే వుంది”
“కాదు మధూ! ఇప్పుడింత హఠాత్తుగా అక్కడికెందుకు? అదీ పండక్కి. అత్తయ్య, మామయ్య అక్కడ వున్నారు, ఎదురుచూస్తుంటారంటే వెళ్ళడం వేరు. పిల్లలేమంటారో! స్నేహితులు, సందడి ఇక్కడ వుండగా మరెక్కడికో వెళ్దామంటే ఏం గొడవచేస్తారో!” నచ్చజెప్పబోయింది.
ఆమె చెప్పడం పూర్తవనే లేదు, అతను అగ్నిపర్వతంలా బ్రద్దలయాడు.
“ఇన్నేళ్ళూ మీరు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళాను. ఎటు రమ్మంటే అటొచ్చాను, ఎలా కావాలంటే అలా వున్నాను. నా యిష్టాలూ అభిప్రాయాలూ పక్కనపెట్టి నువ్వెలా ఇల్లు నడిపితే అలాగల్లా సహకరించాను. ఒక్కసారి… ఒకే ఒక్కసారి మావూరు…. నేను పుట్టి పెరిగిన వూళ్ళో నాకెంతో ఇష్టమైన పండుగ జరుపుకుందామంటే నీకు ఇబ్బందిగా వుందా? రమా! ఎప్పుడూ నాకింత బలంగా అనిపించలేదు. అక్కడికి వెళ్దాం. వెళ్ళాలి. అంతే. రేపే ప్రయాణం” అన్నాడు గట్టిగా.
చెప్పడం పూర్తవగానే పడగ్గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. అంత చిన్న విషయానికి అతనికంత కోపం ఎందుకొచ్చిందో రమకి అర్థమవలేదు. ఈమధ్య చాలా మూడీగా వుంటున్నాడు. ఆఫీసునించీ రావటమే విసుగ్గా అలసటగా వస్తున్నాడు. ఏం మాట్లాడబోయినా చిరాకుపడుతున్నాడు. పిల్లలతోకూడా గడపటంలేదు. రాగానే మళ్ళీ ఆఫీసువర్కంటూ కంప్యూటర్‍కి అతుక్కుపోతున్నాడు. ఒక్కర్తి ఎంతకని ఇంటాబయటా సమర్ధించగలదు? ఇంటి పని. పిల్లలకి స్కూల్లో వెనకటి చదువులు కాదు. వాళ్ళ వయసుకి మించిన ప్రాజెక్టులు ఇస్తున్నారు. వాటికోసం షాపులు తిరగటం, అవి పూర్తిచెయ్యటం అయేసరికి వాళ్ళ చదువుకాదుగానీ తన చదువుని తిరిగి దిద్దుకుంటున్నట్టౌతోంది. ఇవికాక ఇంట్లో అవసరాలకి బజారుపనులు… సంపాదించుకు రావటంతో తన బాధ్యత తీరిపోయినట్టు అతను ప్రవర్తిస్తుంటే కష్టంగా అనిపిస్తోంది. అతనితో ఈ విషయాలన్నీ మాట్లాడాలి. అతనూ దొరకట్లేదు, తనకి తీరికా చిక్కట్లేదు. ఇప్పుడీ ప్రయాణం.
“నాన్న మన వూరు వెళ్లామంటున్నారు. ఈసారి దసరా అక్కడ జరుపుకోవాలని తన కోరిక” పిల్లలు రాగానే చెప్పింది. ఇద్దరు పిల్లలు. కూతురు ధన్య, కొడుకు ఆర్య.
“అక్కడికా?” ఇద్దరూ ఒక్కసారే అన్నారు, అక్కడికేదో తమని అంటార్కిటికాలోనో అంగారకగ్రహమ్మీదో అంట్లు తోమటానికి తల్లితండ్రులు తీసుకెళ్తున్నట్టు.
“ఏం? మన వూరు, మనిల్లు. మీనాన్న పుట్టి, చిన్నతనమంతా గడిపిన వూరు. అక్కడికి వెళ్ళడంలో వింతేముంది?” ఇంతకుముందు పిల్లల పక్షాన భర్తకి చెప్పబోయింది. అతను వినలేదు. ఇప్పుడు అతని పక్షాన పిల్లలకి చెప్తోంది. ఇరుపక్షాలవారి మధ్యా సమన్వయం కుదర్చడానికి ప్రయత్నిస్తోంది.
“నోమ్మా! ఇవ్వక ఇవ్వక మాకేదో నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ఫ్రెండ్సుతో సరదాగా గడపకుండా ఆ వూరు వెళ్లామంటే నేనొప్పుకోను” కూతురు గట్టిగానే అంది.
“నేను కూడా” అక్కకి ఏమాత్రం తీసిపోకుండా చెప్పాడు కొడుకు.
దసరాకి స్నేహితుల్తో కలిసి గడపడానికి ఎన్నెన్ని ప్లాన్లు వేసుకున్నారు! బతకమ్మలు పేర్చడం, గాలిపటాలు ఎగరెయ్యడం, సైకిల్ రేసులు… అవేవీ జరగవంటే వాళ్ళు జీర్ణించుకోలేకుండా వున్నారు.
మధు అడిగిన ప్రశ్నలు చెప్పింది రమ. “నాన్న అడగడం కాదు. ఆయన బదులుగా నేను అడుగుతున్నాను. మీ చిన్నప్పట్నుంచీ ఈరోజుదాకా తనకిది కావాలనిగానీ, ఇచ్చినది వద్దనిగానీ అనడం చూసారా? అడగక అడగక తను పుట్టి పెరిగిన వూరు వెళ్దామని అడిగారు. ఆ ఒక్క కోరిక మనం తీర్చలేమా? తనంతట తను అడిగాకకూడా ఇంత తర్జనభర్జనపడటం అవసరమా?” పదునుగా అడిగింది రమ.
పిల్లలిద్దరు తగ్గారు. ” అక్కడికి వెళ్ళడం మాకిష్టం లేదని కాదమ్మా! పోనీ పండగ వెళ్ళాక వెళ్దాం” అన్నాడు కొడుకు.
“లేదు. ఈసారి పండుగ అక్కడే” కచ్చితంగా చెప్పింది. వాళ్ళిద్దరూ ముఖాలు ముడుచుకుని వాళ్ళ గదుల్లోకి వెళ్ళారు.
రమ ఒక్కర్తే మిగిలిపోయింది. పెళ్ళప్పటి మధు గుర్తొచ్చాడామెకి. ఎంతో సున్నితంగా సరదాగా నవ్వుతూ నవ్విస్తూ వుండేవాడు.
అతని తండ్రి… అంటే తన మామగారికి పొద్దున్న పదిన్నరకి వెళ్తే సాయంత్రం ఐదింటికల్లా ఆఫీసైపోయేది. కాసేపు అట్నుంచీ అటే బాడ్మింటన్ కోర్టుకి వెళ్ళి, అక్కడినుంచి గుడికి వెళ్ళి మిత్రసాంగత్యమో, పురాణకాలక్షేపమో చేసుకుని భోజనాలవేళకి ఇంటికి చేరేవారు. పైగా ఆయనది పల్లెటూళ్ళో వుద్యోగం కావడం, అది స్వంతవూరుకూడా కావడంతో చాలా సునాయాసంగా గడిచిపోయింది ఆయన జీవితం. అంత అందంగానూ మధు బాల్యం కూడా వుండేదట. తరం మారడంతోపాటు జీవనగమనంకూడా మారింది.
మధు బీటెక్ చదివాడు. ఆపైన మంచి బీస్కూల్‍లో ఎంబియ్యే చేసాడు. కేంపస్ సెలక్షన్స్‌లో ప్రైవేట్ కంపెనీలో వుద్యోగం వచ్చింది. కళ్ళు చెదిరే జీతం. చెల్లిస్తున్న జీతానికి దామాషాలోనే పని… వత్తిడి. మొదట్లో వున్న వుత్సాహం క్రమంగా తగ్గింది. సాయంత్రాలయేసరికి గూటికి గువ్వలా ఇంటికి వచ్చెయ్యాలని అతని ఆరాటం. కానీ, ఈ దేశపుయువత బ్రతుకుల్లోంచీ సాయంత్రాలు ఎప్పుడో కనుమరుగైపోయాయనేది అతను గుర్తించని విషయం. దానికితోడు చేసేది మార్కెటింగ్‍లో కాబట్టి వుద్యోగంలో టార్గెట్స్, డెడ్‍లైన్లు… ఆపైన…
ఆపైన అతని తల్లిదండ్రులు ఇద్దరూ ఒకేసారి యాక్సిడెంట్లో పోయారు. అది అతన్లో స్పష్టమైన మార్పుని తెచ్చింది.
ఇప్పుడిలా వాళ్ళ వూరెళ్దామని పట్టుపట్టడం ఎందుకో అర్థమవడం లేదు రమకి. పొద్దున్న లేచాక మరోసారి మాట్లాడదామనుకుందిగానీ అతనప్పటికే ప్రయాణం ఏర్పాట్లలో వుండటంతో చేసేదేంలేక తనూ ఆ పనిలో పడింది.
ధన్యకోసం బతకమ్మలకి పట్టులంగా, పండుక్కి కట్టుకుంటుందని కొన్న డిజైనర్ లంగా పెడుతుంటే, “ఆ పల్లెటూళ్ళో తిరగడానికి ఇంత మంచివి దేనికి?” అని తీసి పక్కని పెట్టేసింది. ఆర్య తన కొత్త ఫాంటు పెట్టనివ్వలేదు. అలాగే అన్నీ రమ పెట్టడం,వాళ్ళు తీసెయ్యడం. విసుగొచ్చేసింది ఆమెకి. మీరే సర్దుకోండని అక్కడినుంచి వెళ్ళిపోయింది.
“రెడీయా?” అని మధు సీరియస్‍గా అడిగేదాకా ఈ ప్రహసనం కొనసాగింది.
అతనింక అడిగాక ఒకొక్కరూ తయారై వచ్చారు. తీసేసిన బట్టలే మళ్ళీ బేగుల్లో పెట్టుకున్నారు.
కార్లో బయల్దేరారు. వెళ్తూ కూడా పెద్దగా ఏమీ మాట్లాడుకోలేదు. అవసరానికి మించి ఒక్క ముక్క కూడా ఎవరి నోట్లోంచీ రాలేదు. మధు ముభావం అందర్నీ అలా శాశించింది. దార్లో హోటల్లో భోజనం చేసారు. సాయంత్రమైంది వూరు చేరేసరికి. ఇంకో పదినిముషాలు పట్టింది పొలిమేరలనుంచీ ఇల్లు చేరడానికి. రోడ్డుకి అటూఇటూ విస్తరించుకుని పెరిగిన చెట్ల మధ్య నుంచి కారు వెళ్తుంటే ధన్య, ఆర్యలు అలక మర్చిపోయి కళ్ళు విప్పార్చుకుని చూసారు. హాలీవుడ్ సినిమాల్లో సీనరీల్లా అనిపించాయి. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చేవాళ్ళిక్కడికి. ఆఖరిసారి వచ్చింది తాతయ్య, బామ్మలు పోయినప్పుడు. ఐదేళ్ళైంది అది జరిగి. ఇద్దరికీ పెద్దగా గుర్తు లేదు.
పెద్దపెద్ద గేట్లున్న ఇంటిముందు కారు ఆగింది. అందరూ దిగారు. విశాలమైన ఆవరణ. గేటు దగ్గర్నుంచీ కారు లోపలికి వెళ్ళడానికి పట్టేంత వెడల్పైన బాట వుంది. బాటకి అటూ ఇటూ మళ్ళలో రంగురంగుల బంతి, చామంతి, కనకాంబరాలూ, నీలిగోరింటా విరగబూసి వున్నాయి. సాయంత్రం కావడంతో పసుపూ, వూదాచంద్రకాంతలు మొక్కలనిండా విచ్చుకుని వున్నాయి. ప్రహరీగోడకి ఆనుకుని నందివర్ధనం, గన్నేరు చెట్లున్నాయి. చెట్లనిండా రంగురంగుల పువ్వులు. అందులో ఒక గన్నేరుచెట్టు తను పెట్టిందేనని గుర్తొచ్చింది రమకి. పెళ్ళైన కొత్తలో పూలమొక్కల్ని కుతూహలంగా చూస్తుంటే మధు చెప్పాడు-
“ఈ గన్నేరుచెట్టుంది చూసావా, కొమ్మ పాతితే చాలు ఏనుకుంటుంది” అని.
ఆమెకి నమ్మకం కలగలేదు. ఈ సంభాషణ విన్న అతని తండ్రి ఒక ఎర్రగన్నేరుకొమ్మ విరిచి, బెరడు చెక్కేసి పాతమని ఇచ్చాడు. రమ అపనమ్మకంగానే అట్లకాడతో చిన్నగొయ్యి తవ్వి పాతి, నీళ్ళు పోసింది. రెండోరోజుకి అది కొంచెం వడిలినట్టై, నమ్మకం ఇంకొంచెం సడలింది. వారంపాటు అటు చూడనే లేదు. అన్ని మొక్కల్తోపాటు దానికికూడా నీళ్ళుపెట్టేవారు ఎవరో ఒకరు.
“అమ్మాయ్ అమ్మాయ్!” వారం తర్వాత మామగారు పిలుస్తుంటే ఏమిటోనని వెళ్ళింది. ఆయన చూపిస్తే చూసింది. ఆమె పాతిన గన్నేరు కొమ్మ చిగురువేసింది. ఆయన సంతోషం చూసి వింతగా అనిపించింది. ఇంత చిన్న విషయానికి అంత సంతోషమా అనికాదుగానీ, చిన్న చిన్న విషయాలకే ఇంతగా సంతోషపడిపోయే మనస్సుని పెద్దపెద్ద ప్రలోభాలవైపుకి ఎందుకు తోస్తున్నామన్న సందేహం.
నిండా గుత్తులుగుత్తులుగా పూలతో వున్న చెట్టుని చూపించి పిల్లలకి చెప్పింది,”ఆ చెట్టు నేను పెట్టినదే, తెలుసా?” వాళ్ళు తలూపారు.
ఇంట్లో వుంటున్నవాళ్ళు భార్యాభర్తలిద్దరూ ఇవతలికి వచ్చారు. ఆమె పేరు వనజ. మధుకి అత్తవరుస. భర్త రాములు. వాళ్ళకి పిల్లలు లేరు. ఏవో చిన్నచిన్న పనులు చేసుకుంటూ గడుపుతున్నవాళ్ళు, మధు తల్లిదండ్రులు పోయినప్పుడు ఇల్లు చూసుకుంటామని వాళ్ళంతట వాళ్ళు ముందుకి వచ్చారు. అప్పటికి పొలం వేరేవాళ్ళ కౌలులో వుండేది. అదికూడా నెమ్మదిమీద వీళ్ళే తీసుకున్నారు.
ఇంటిముందంతా పూలమొక్కలు, పెరటినిండా కూరలమొక్కలు, పాదులు. ఇల్లంతా పరిశుభ్రంగా వుంది. వాళ్ళని వాడుకొమ్మని ఇచ్చిన రెండుగదులు తప్ప ఇంచికూడా అతిక్రమించలేదు. అంత నమ్మకస్థులు. పండుగనో తాము వస్తున్నామనో కడిగి ముగ్గులుకూడా పెట్టింది వనజ. పిల్లలుమాత్రం ఇక్కడ వుండాలా అన్నట్టు చూసారు. వాళ్ళుండే అపార్టుమెంటుకల్చర్‍కి ఇది పూర్తిగా భిన్నంగా వుంది.
కుశలప్రశ్నలయ్యాయి. తరువాత టీలు, స్నానాలు, కాస్తాగి భోజనాలు అన్నీ వరుసక్రమంలో ముగిసాయి. ఎదురమావస్య అని త్రయోదశిరోజు
బయల్దేరారు. మర్నాడు చతుర్దశి. మధు పదోతరగతిదాకానే ఆ వూళ్ళో వున్నది. తర్వాత చదువుల కోసం సిటీకి వచ్చేసాడు. అతనితో చదువుకున్న పిల్లలంతా కూడా చదువులై వుద్యోగాలు వచ్చి, పెళ్ళిళ్ళై ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. అత్తవారింట్లో రమ వున్నదికూడా చాలా తక్కువ. ఎప్పుడో పండుగలకి రావటమే. అందుచేత ఇద్దరికీ పెద్దగా పరిచయస్తులు లేరు.
“ఇంటికి చుట్టాలొచ్చినట్టున్నారు?” అని ఒకరో ఇద్దరో వనజావాళ్ళనే అడుగుతున్నారు.
“బయటివాళ్ళెవరూ కాదు, రాజారావు బావ కొడుకూ, కోడలూ, పిల్లలూను” అని వీళ్ళు కొంచెం మొహమాటపడుతూ చెప్తున్నారు.
పక్కరోజు అమావస్య. వనజతో వెళ్ళి గునుగుపూలు, తంగేడుపూలు కోసుకొచ్చింది ధన్య. ఇంట్లో పూసిన పూలన్నీ తెంపింది. చాలా పెద్ద బతకమ్మలను పేర్చారు ముగ్గురూ కలిసి. ఆర్యకి క్రికెట్ ఫ్రెండ్సు దొరికారు. తాటిమట్టలతో ఆడేసుకుంటున్నారు. దసరాకి తమ వూళ్ళో వుండటంలేదన్న విషయాన్ని మర్చిపోయారు. పిల్లలు కొత్త విషయాలకి తొందరగా ఆకర్షితులౌతారు.
సాయంత్రం అందరితోపాటు చెరువుగట్టుకి వెళ్ళి బతకమ్మలు ఆడి, చెరువులో కలిపి వచ్చారు. ధన్య తల్లి ఫోన్లో అవన్నీ ఫొటోలు తీసింది. ఫ్రెండ్స్ కోసం వాట్సప్‍లో పెట్టింది.
రోజంతా బాగా తిరిగీ, ఆడీ పిల్లలిద్దరూ బాగా అలిసిపోయారు. వనజని అడిగి భోజనం పెట్టించుకుని తిని తొందరగా నిద్రపోయారు. ఈ హడావిడిలో చాలాసేపట్నుంచీ మధు ఎక్కడా కనిపించలేదు రమకి. అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. లోపలిగదుల్లో ఎక్కడా లేడు. ఇంటిముందు చూసింది. కనిపించలేదు. ఎవరింటికేనా వెళ్ళాడా అని సందేహపడుతునే పెరటివైపుకి వెళ్ళింది. అతన్నక్కడ చూసి ఆశ్చర్యపడింది.
“ఇక్కడేం చేస్తున్నావు?” అడగబోయిన మాట నోట్లోనే వుండిపోయింది. అతని కాళ్ళదగ్గిర పెద్ద చేంతాడుంది. పైకి విసరడానికి అనువుగా రెండు చేతుల్తోనూ ఒక కొస పట్టుకుని పై దూలంకేసి చూస్తున్నాడు.
“ఏం చేస్తున్నావు? నువ్వు చేస్తున్న పనేమిటి?” గట్టిగా అడుగుతూ వెనకనుంచే అతని చెయ్యి పట్టుకుని లాక్కొచ్చి ఇంటిముందు అరుగులమీద కూలేసింది. మధు ఆమెని ఎదుర్కోలేనట్టు తలదించుకున్నాడు. మామూలుగా అవడానికి రెండుమూడునిముషాలు పట్టింది రమకి. ఆమె కేకలకి లోపల్నుంచీ వనజా, రాములూ వచ్చారు. అక్కడి దృశ్యం చూడగానే అర్థమైంది వనజకి.
“ఏమైందమ్మా?” అని రాములు అడగబోతుంటే-
“లోపలికి రండి. ఇక్కడెందుకు?” అని రమ చెయ్యిపట్టుకుని తీసుకెళ్ళింది వనజ. మరబొమ్మలా అనుసరించాడు మధు. వెనకే రాములు.
“ఎంతపని చేసావయ్యా? ఏం కష్టం వచ్చింది నీకు? చక్కటి వుద్యోగం, భార్యాపిల్లలు, ఆస్తిపాస్తులు… బోల్డంత వయసు ముందుంది…” అడిగింది వనజ మృదువుగా. మధు జవాబివ్వలేదు. మనసులో వున్న ఆలోచన బహిర్గతమయాక అతనికి చాలా తేలిగ్గా వుంది. చచ్చిపోవాలనే తన నిర్ణయం అందరికీ తెలిసిపోయింది. తన ఇంట్లో… తన చిన్నతనం గడిచినచోట…ఏ బాధ్యతలూ తెలీకుండా పెరిగినచోట… ప్రాణాలు వదిలెయ్యాలనుకున్నాడు. అది తీరలేదు. ఈ ప్రయత్నం కాకపోతే ఇంకొకటి. చావాలంటే ఎన్ని మార్గాలు లేవు?
“ఏమైంది మధూ? అసలిదంతా ఏమిటి? ఎందుకిలా చెయ్యబోయావు? ఇందుకేనా, ఇక్కడికి రావాలని పట్టుబట్టావు?”” తనని తను సంభాళించుకుని అడిగింది. అతను జవాబివ్వలేదు. కళ్ళెత్తి ఆమెనొకమాటు చూసి మళ్ళీ దించుకున్నాడు.
“నాకు చాలా భయంగా వుంది. ఏం జరిగిందో చెప్పు మధూ?” రమ గొంతులో దు:ఖపు జీర. కళ్ళలో పల్చటి నీటి పొర. అతను కొద్దిగా చలించాడు.
“అలసిపోయాను… చాలా. అమ్మానాన్నలు పోయిన బాధ నన్ను నిద్రలో కూడా స్థిమితంగా వుండనివ్వటం లేదు. దాంట్లోంచీ నేనింకా బయటపడలేకపోతున్నాను” అన్నాడు.
“ఎంతకాలం బాధపడినా వాళ్ళు తిరిగి రారుకదా ? మళ్ళీ మనింట్లోనే పుడతారేమో… ఆర్యకీ ధన్యకీ పెళ్ళిళ్ళయాక పిల్లలుగా. అలా అనుకుంటే ఆశగా లేదూ? ఆ పిల్లలు వాళ్ళే అనుకుంటే అదింకెంత సంతోషం? మనని మనం ఇలాగే ఓదార్చుకోవాలి మధూ! ఎంతకాలం బాధపడతాం? బాధలో వున్నామని మనకోసం ప్రపంచం ఆగుతుందా? మనని వున్నచోటే వదిలేసి వెళ్ళిపోతుంది” నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. హఠాత్తుగా జరిగిన ఆ సంఘటనని అతను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడు. జ్ఞాపకాలు ఎన్నున్నా అవి వోదార్పునివ్వవు. ఇంకా ఇంకా దు:ఖాన్ని పెంచుతున్నాయి. అతని కంప్యూటర్లోనూ, సెల్‍లోనూ నిండా వాళ్ళ ఫొటోలే. వాళ్ళతో తను గడిపిన జ్ఞాపకాల గుర్తులే. మర్చిపోవటానికి ప్రయత్నం చెయ్యట్లేదతను. మరీమరీ గుర్తు తెచ్చుకుని దు:ఖాన్ని పోగేసుకుంటున్నాడు.
“మా కంపెనీ విస్తరించుకునే ప్రయత్నంలో వుంది. కొత్తకొత్త టార్గెట్స్… డెడ్‍లైన్లు… అందుకోలేకపోతున్నాను. క్లయంట్ మీటింగ్స్… వాళ్ళని వొప్పించి ప్రాజెక్ట్స్ తేవటం… ఈ వత్తిడి తట్టుకోలేకపోతున్నాను. యాన్యువల్ వర్క్ అసెస్‍మెంట్ కూడా సరిగ్గా లేదు. ఎప్పుడేనా ఫైర్ చేసేస్తారు. బీటెక్‍లో గోల్డ్‌మెడలిస్టుని. ఎంబియ్యేలో టాప్ స్కోరర్‍ని. నా రెజ్యుమె పట్టుకుని మళ్ళీ వుద్యోగాలకోసం తిరగాలి… నా వల్ల కాదు. నౌ అయామె ఫెయిల్యూర్ యూనో… ” అన్నాడు. నిస్సహాయంగా కంప్లెయింట్ చేస్తున్నాడు.
చిన్నగా నిట్టూర్చింది రమ. ప్రభుత్వోద్యోగం చేస్తున్న తన తండ్రికూడా ఇలాగే అంటున్నాడు. రెండేళ్ళ సర్వీసు వదిలేసి వాలంటరీ రిటైర్‍మెంట్ తీసుకుంటాడట. డెస్క్‌వర్క్ చెయ్యటానికి రిక్రూటై, బేసిక్ క్లాసిఫికేషన్స్ మీద వుద్యోగాల్లో చేరినవారి పనియొక్క మౌలికతని మార్చేసి వాళ్ళు చెయ్యలేకపోతే అసమర్ధులుగా ముద్ర వేస్తున్నారు. రోజంతా ఆఫీసులోనే పాతుకుపోయి చేసినా పూర్తవని పని. ఒకప్పుడు సాయంత్రమయేసరికి పువ్వులో స్వీట్సో తీసుకుని సరదాగా ఇంటికొచ్చే తన తండ్రి విసుగ్గా అలసటగా ఇంటికొస్తున్నాడు. తమ్ముడు బెంగుళూర్లో, మరదలు చెన్నైలో. వారాంతపు కాపురం.
“వత్తిడి ఎందుకు మధూ? పదిహేనేళ్ళుగా చేస్తున్నపనేకదా?”
అతను మాట్లాడలేదు. మాట్లాడే స్థితిలో లేడు. రెండుచేతుల్తో తల పట్టుకుని కూర్చున్నాడు.
“నాకొక్క రెండురోజులు సమయం ఇవ్వు. మనం ఏం చెయ్యచ్చో ఆలోచిద్దాం. నీకు నచ్చకపోతే కంపెనీ ఫైర్ చేసేదాకా ఎందుకు, నువ్వే రిజైన్ చేద్దువుగాని. ప్లీజ్… ఒక్క రెండురోజులదాకా ఈ విషయం ఆలోచించకు. ఏదో ఒకటి ఆలోచిస్తాను. ఒకవేళ ఏ దారీ దొరకనప్పుడు అందరం కలిసే చచ్చిపోదాం’” అంది రమ. ఏడుపు ఆపుకోలేకపోతోంది. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలీడం లేదు.
“అందరూనా?” అతను తెల్లబోయాడు.
“నువ్వులేకుండా మేం మాత్రం బతికి ఎందుకు?”
వనజ చప్పుని కలగజేసుకుంది, ’”నిండింట్లో ఈ చావు కబుర్లేమిటమ్మాయ్?” అని రమని కోప్పడి, “మధూ! రెండురోజులు వ్యవధి అడిగిందికదా! అప్పటిదాకా ఏం మాట్లాడకు. వెళ్ళి పడుకో” అంది పెద్దరికం తీసుకుని.
“కాస్త ఏదైనా తినండి” అంది తనే మళ్ళీ.
నలుగురూ తిన్నామనిపించి లేచారు. మధు నిద్రకి వుపక్రమించాడు. అంటే నిద్ర వస్తోందని కాదు. వాళ్ళనుంచి తప్పించుకోవాలని.
“అతన్ని కనిపెట్టుకుని వుండాలి రమా! ” అంది వనజ అతనికి వినిపించకుండా.
రమ తండ్రికి ఫోన్ చేసింది. వాళ్ళు కొడుకు దగ్గర బెంగుళూర్లో వున్నారు. జరిగినది క్లుప్తంగా చెప్పి, “మీరు అమ్మని తీసుకుని వెంటనే రాగలరా నాన్నా?” అని అడిగింది. “ఫ్లైట్ టికెట్స్ బుక్ చెయ్యనా? “
వాళ్ళు వస్తామనగానే వెంటనే టికెట్స్ బుక్ చేసింది. పండగరోజులు, వెంటనే కావటంతో చాలా ఖరీదు పడ్డాయి. తర్వాత మధు లాప్‍టాప్ తెచ్చుకుని కూర్చుంది. తెరవబోతుంటే రాములు వచ్చి ఎదురుగా కూర్చున్నాడు.
“చెప్పండి బాబాయ్!” అంది కంప్యూటర్ పక్కని పెట్టి.
“రేపు మీ నాన్నగారు వచ్చాక ఏం నిర్ణయిస్తారోగానీ రమా, నీకు చెప్పినంత స్వతంత్రంగా వారికి చెప్పలేను” అన్నాడు సంకోచంగా.
“అయ్యో! చెప్పండి”
“ఏ ఆధారం లేనివారికి మరొకరికింద వుద్యోగాలుగానీ అతను చెయ్యలేనప్పుడు ఆ వుద్యోగం ఎందుకమ్మా? ఈరోజుని ఎంత గండం తప్పింది? మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళి నీ వ్యాపకాల్లో నువ్వు పడిపోతే అతన్ని కాయగలవా?”
రమ భయం కూడా అదే. కానీ నెలకి లక్షరూపాయల జీతం వచ్చే వుద్యోగానికి ప్రత్యామ్నాయం ఏది?
“ఈ వూరు వచ్చెయ్యండి. ఇక్కడ మీ మామగారి పరిచయస్థులు చాలామంది వున్నారు. మధు మనుషుల్లో పడతాడు. వ్యవసాయం చూసుకోవచ్చు. నేను తోడుంటాను” అన్నాడు.
“వ్యవసాయమా? అందరూ వదిలేసి పోతుంటే మమ్మల్ని ఇందులోకి రమ్మంటారా?”
“విత్తనం దగ్గర్నుంచీ అప్పుల్తో మొదలుపెట్టి మునుగుతున్నారు రమా! అప్పులమీది వడ్డీలుకూడా పెట్టుబడికి కలిసిపోయి, లాభాలు రావట్లేదు. పండించిన పంట కళ్ళారా చూడకుండానే కళ్ళాలమీదే అమ్ముకునే పరిస్థితి. అటు పెద్దల దగ్గర్నుంచీ నేర్చుకున్న పద్ధతులూ మట్టిగొట్టుకుపోయి, ఇటు చదువుకున్నవాళ్ళ పద్ధతులూ పాటించలేక త్రిశంకుస్వర్గంలా వుంది రైతు పరిస్థితి. నేల వున్నంతమాత్రాన రైతూ కాడు, చేతిలో పుస్తకం వున్నంతమాత్రాన పండితుడూ కాలేడు”
“మాకుమాత్రం ఏం తెలుసని?” అడిగింది రమ. అతని మనసులో వున్నదేమిటి? ఒకవైపు నష్టం వస్తోందంటూనే తమని ఇందులోకి ఎందుకు రమ్మంటున్నాడు? ఈ గొడవల్లో పొలం అమ్మేస్తే కుదురుకున్న వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తమౌతాయనా? కష్టం యొక్క నీడ చాలా పెద్దది. అంత మంచీ అందులో లుప్తమైపోతుంది. రమ అతనికేసి నిశితంగా చూసింది.
“వ్యవసాయమంటే చారెడంత భూమీ, అందులో పండే పంటా మాత్రమేనా? ఆవుల్నీ గేదెల్నీ పెంచాలి. కోళ్ళనీ పెంచుకోవాలి. ఈమధ్య ఎవరిదగ్గరో విన్నాను, వరిమళ్ళమధ్య నీరు నిలవచేసి చేపలు పెంచుతున్నారని. పాడికి పాడి, ఎరువుకి ఎరువు… ఒకదానికి ఇంకొకటి అన్నీ కలిసొస్తాయి. మీరిద్దరూ చదువుకున్నవాళ్ళు. మీలాంటివాళ్ళు కొత్త విషయాలని అర్థం చేసుకోగలరు. నాలుగుచోట్లకి వెళ్ళి నలుగుర్ని కలుపుకుని ముందుకి వెళ్ళగలరని చెప్తున్నాను”
“మీ ఉప్పు తిని బతుకుతున్నాము. మీ మంచి కోరి చెప్తున్నాను. మీ నాన్నగారు వచ్చాక ఈ పొలం, ఇల్లూ అమ్మెయ్యమంటారేమో! బావగారు పోయినప్పుడు అన్నారు. తొందరపడి ఆ పని చెయ్యకండి. ఒక ఆధారాన్ని కోల్పోతారు. మాదేముంది? ఇక్కడ కాకపోతే ఇంకొకచోట … ఇద్దరు మనుషులకి ఎంతకావాలి? పిల్లాజెల్లా లేరు, పోగు చేసి ఇవ్వాలనుకోవడానికి” అని చేతులు జోడించి నమస్కరించి వెళ్ళిపోయాడు. అతన్ని అనవసరంగా అనుమానించాననుకుంది రమ.
పైకలా అన్నాడేగానీ అతనికి దిగులుగానే వుంది. భార్యాభర్తలిద్దరూ ఎన్నో కష్టాలు పడి వున్నారు. మధు ఇంట్లో ఒక ఆశ్రయం దొరికింది. రోజులు సాఫీగా సాగిపోతున్నాయనుకుంటే ఇప్పుడీ సమస్య. మధు మనసులో అదుపు తప్పిన భావోద్వాగాలు అతనికి జీవన్మరణమస్యగా మారటంతోపాటు అతని చుట్టూ వున్నవాళ్ళ జీవితాలనికూడా కుదుపుతున్నాయి. కూకటివేళ్ళతో పెళ్ళగించేసే ప్రయత్నం చేస్తున్నాయి. మనిషి తనొక్కడినే అనుకుంటాడు. కానీ అతనొక వ్యవస్థ.
మధు వుద్యోగం వుంటుందో, వుండదో? పనితీరు ఎంత బాగున్నా కార్పొరేట్ సెక్టర్లో అంతర్గత రాజకీయాలు చాలా వుంటాయి. ఇతను తప్పుకుంటే మరొకరికి జరిగే లాభమేదైనా వుందంటే పావులన్నీ కదలటం మొదలౌతుంది. పెర్ఫార్మెన్స్ కూడా బాగాలేదంటున్నాడు. సీనియర్ కాబట్టి కంపెనీ తీసెయ్యకపోవచ్చు. ఇతనంతట ఇతనే వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకో వుద్యోగం వెతుక్కోనంటున్నాడు. బలవంతపెట్టే పరిస్థితికూడా లేదు. ఎలాగా అతనికి బ్రేక్ కావల్సినప్పుడు ఇక్కడికి వచ్చి వుండటంలో తప్పులేదు. కానీ పిల్లల చదువు? ఆమె ఆలోచనలు అక్కడ ఆగిపోయాయి.
మధు నిద్రలోకి జారుకున్నాడని అర్థమైనా పడుకునే సాహసం చెయ్యలేకపోయింది. లాప్‍టాప్ తెరిచి అందులో నిమగ్నమైంది. అతని డైరీ మెయిల్స్… ఒకొక్కటీ అతని మనసుకి కాదు, అది వున్న స్థితికి అద్దం పడుతున్నాయి. తెలతెలవారుతుంటే ఇంట్లో అలికిడి మొదలైంది. అప్పుడు నెమ్మదిగా కూర్చున్న సోఫాలోనే నిద్రకి వొరిగింది.
“మీ నాన్నగారి స్నేహితులంట మధూ! ఇద్దరు ముగ్గురు కలిసారు. నువ్వొచ్చావని తెలిసి తీసుకు రమ్మన్నారు” అన్నాడు రాములు. మధు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అతనే బలవంతం చేసి తీసుకుపోయాడు. వెళ్ళాక రాజారావు కొడుకట అని ఇంట్లోవాళ్ళకి చెప్తుంటే ఆ గుర్తింపు మనసు లోపల ఎక్కడో సుతారంగా తాకింది. పిల్లల స్కూలికి వెళ్ళినప్పుడు ధన్యా-ఆర్యా-వాళ్ళ-నాన్న అని గుర్తించినప్పుడు ఎలాంటి భావం కలిగిందో అలాంటిది కదిలింది. అతన్లో గడ్డకట్టుకుపోయిన భావాలకి కొద్దిపాటి వెచ్చటి సెగ తగిలింది. నలుగురైదుగురి ఇళ్లకి వెళ్ళి తిరిగివచ్చారు.
మహర్నవమి కాబట్టి ఇంట్లో వంటలు తప్ప పెద్దగా సందడి లేదు.
సాయంత్రానికి రమ తల్లిదండ్రులు వచ్చారు. “నువ్వు రమ్మన్నావా?” అన్నట్టు కోపంగా చూసాడు మధు రమని. మామా అల్లుళ్ళమధ్య సాధారణ పలకరింపులయ్యాయి. వాళ్ళింకా అతని మనసులో తల్లిదండ్రుల స్థానాల్లోకి రాలేదు. పిల్లలు ఆటల్లోంచీ తిరిగొచ్చారు. అమ్మమ్మా తాతయ్యలని అల్లుకుపోయారు. స్నానాలు, భోజనాలు అయాక విశ్రాంతిగా కూర్చున్నప్పుడు నెమ్మదిగా విషయాన్ని లేవనెత్తాడు రమ తండ్రి.
“మనసులో బాధేమిటో పైకి చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది మధూ? నిన్న జరిగినదానికి అమ్మాయి తల్లడిల్లిపోతోంది. ఫోన్ చేసి చెప్పేసరికి మాకూ కంగారుగానే వుంది. ప్రాణం తీసుకోవాలనిపించేంత పెద్ద సమస్య ఏమిటి? అమ్మానాన్నలు పోయి ఐదేళ్ళైంది. బాధ బాధే. కాదనను. ఎంతకాలం బాధపడినా వాళ్ళైతే తిరిగి రారు. వాస్తవాన్ని గుర్తించాలి మీరు… ఇంక వుద్యోగంలో సమస్యలు… గవర్నమెంటు వుద్యోగం కాదు, ఈ కంపెనీ కాకపోతే ఇంకొకటి…” అని ఇంకా చెప్పబోతుంటే –
“రమా!” కోపంగా పిలిచాడు మధు.
ఆమె రాగానే, “నా సమస్యలు మీకేం తెలుసని అందరూ ఇలా సలహాలు ఇస్తున్నారు? చనిపోయింది నా తల్లిదండ్రులు. ఆ బాధ నాది. ఉద్యోగం నాది. అందులో బాధలు నావి. ఈ బతుకు నాది, బతకాలో చావాలో నిర్ణయించుకునే హక్కు కూడా నాదే” గట్టిగా అరిచాడు.
రమ తండ్రి చిన్నబుచ్చుకున్నాడు. రమకి కూడా కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. తండ్రిని వెంటబెట్టుకుని అక్కడినుంచీ ఇవతలికి వచ్చింది.
“అసలు ఇక్కడికి ఎందుకొచ్చారమ్మా? ఈ పల్లెటూళ్ళో ఏం చేద్దామని? అసలే మనసు చెదిరి వున్నాడు. తలుచుకుని ఇంకాస్త బాధపడటానికి కాకపోతే? అప్పుడే అమ్మేసెయ్యమన్నాను. వినలేదు ఇద్దరూను. ఇప్పుడు ఉద్యోగం మానేసి ఏం చేస్తాడు? ఈ పల్లెటూళ్ళో గడ్డి పీక్కుంటూ కూర్చుంటాడా? ఇలా చస్తాను చస్తానని బెదిరించేవాళ్ళని చూసి మనం బెదరకూడదు. చచ్చి చూపించమనాలి” అన్నాడు కోపంగా.
ముప్పయ్యెనిమిదేళ్ళ సర్వీసు చేసి, బాధ్యతలన్నీ తీరి వుండి, ఇంక చెయ్యలేని పరిస్థితి వున్నప్పటికీ కూడా వాలంటరీ రిటైర్మెంటు తీసుకోవటానికి ధైర్యం చాలటం లేదు. అలాంటిది, ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకుని అంత బాధ్యత తెలీకుండా ఎలా వున్నాడు, అల్లుడు? పోయినవాళ్ళని తలుచుకుని ఏడటానికి అతనేం చిన్నపిల్లవాడు కాదు. ఇద్దరు పిల్లల్తో కూతుర్ని ఏ గంగలో ముంచబోతున్నాడు? కోపం ముంచుకొస్తోంది.
“నాన్నా! ప్లీజ్, వూరుకోండి” అంది రమ.
ముగ్గురూ పెరట్లోకి వెళ్ళి కూర్చున్నారు.
“ఏం చేద్దామని రమా?” అడిగాడు అయన. “ఎవరిచేతేనా చెప్పిస్తే? ఏదైనా వైద్యం చేయిస్తే?”
“అవేవీ వెంటనే జరగవు నాన్నా!” రమ జవాబిచ్చింది. “ముందు అతనికి బ్రేక్ కావాలి. కొన్నాళ్ళు ఇక్కడ వచ్చి వుందామనుకుంటున్నాం”
ఆత్మహత్య చేసుకోవాలనుకునే మనుషులు అందరిళ్ళలో వుండరు. అలాంటివాళ్ళతో ఎలా ప్రవర్తించాలో చాలమందికి తెలియదు. అలాంటి ప్రయత్నం ఇంట్లో ఎవరేనా చేస్తే కూడా అదొక తాత్కాలికమైన సంఘటనలా అనిపిస్తుంది. ఆ గండం తప్పిపోయిందనుకుంటారు. అంతకన్నా లోతుగా ఆలోచించరు.
మనిషికి బతకాలనే కోరిక ఎంత బలమైనదో, చనిపోవాలనేది కూడా అంతే బలమైనది. మొదటిది వ్యక్తమౌతూ వుంటుంది. రెండోది అవ్యక్తంగా వుంటుంది…. నివురు వెనక దాక్కున్న నిప్పులా. ప్రతికూల పరిస్థితులు దాన్ని బహిర్గతం చేస్తాయి … అప్పుడప్పుడు. ఆ పరిస్థితులు మారగానే మళ్ళీ అది కప్పడిపోతుంది. మారనప్పుడు మాత్రం అది కొద్దికొద్దిగా అతన్ని కాల్చుతూ వుంటుంది.
“ఇక్కడా? అసలు ఇంతదాకా ఎందుకు వచ్చింది పరిస్థితి? ఇద్దరూ ఏవేనా గొడవపడ్డారా?” అడిగింది రమ తల్లి. చాలా మామూలు ప్రశ్న.
“అలాంటిదేం లేదమ్మా! ఒక్కసారి వాళ్ళు పోయేసరికి స్తబ్దుగా మారిపోయాడు. అంత పెద్ద సంఘటన తర్వాత వెనుకట్లా ఐతే వుండడుకదా? అలానే అనుకుని సర్దుకుపోయాను. ఆ స్తబ్దత క్రమంగా పెరుగుతూ వచ్చింది… గుర్తించలేనంత సూక్ష్మంగా. ఇన్నేళ్ళు పోగుచేసుకున్న దు:ఖం, దానిలోంచీ బయటపడలేని నిస్సహాయత”
“అక్కడి ఫ్లాట్? పిల్లల చదువు? ఇక్కడేం చేస్తారే? పొలం అమ్మేస్తే కోటేనా రాదూ? బేంకులో వేసుకుంటే వడ్డీ వస్తుంది. కొన్నాళ్ళాగి అతను మరో కంపెనీ చూసుకుంటే సరి. కాదంటే నువ్వు చూసుకోవచ్చు”
“పొలం అమ్మెయ్యటమనే ఆప్షన్ ఎప్పుడూ వుంటుంది. ఇప్పుడే ఎందుకు? మధుకి తల్లిదండ్రులతో వున్న ఆఖరి అనుబంధం ఇది. కొన్నాళ్ళు ఇక్కడుంటే మధు మనసు మారుతుందేమో. వాళ్ళు అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్ళిన జీవితాన్ని తను కొనసాగిస్తున్నాడని అనుకోగలిగితే చాలు. అతన్లో మార్పు వస్తుంది. రాములుబాబాయ్ నమ్మకంగానే చూసుకుంటున్నాడు ” జవాబిచ్చింది రమ.
జాబ్‍కి రిజైన్ చేసేసాడు మధు. రమ రిజైన్ చెయ్యమని చెప్తే అతను మొదట ఆశ్చర్యపోయాడు.
“చెయ్యలేనప్పుడు ఆ వుద్యోగాన్ని పట్టుకుని వేలాడటం ఎందుకు? కొన్నాళ్ళు ఇక్కడే వుందాం. బావుంది ఇక్కడ. ఆ విషయాలు మాట్లాడాలనే మా పేరెంట్స్‌ని రమ్మన్నాను. నాన్న కొన్నాళ్ళు సెలవు పెడతానన్నారు. అక్కడ ఇల్లు ఖాళీ చేసి రెంటుకివ్వటం, పిల్లల స్కూలు అవీ చూసుకుంటారు” అని అతన్ని కన్విన్స్ చేసింది. అతనేమీ మాట్లాడలేదు.
ధన్యా- ఆర్యలని స్కూలు మార్చడం పెద్ద ప్రహసనమే అయింది. సంవత్సరం మధ్యలో టీసీ ఇవ్వటానికి పాత స్కూల్లో వప్పుకోలేదు, తీసుకోవటానికి ఇక్కడ వప్పుకోలేదు. మొత్తానికి అదైంది.
ఈలోగా రమ కనీసం ఒక వందమందిని కాంటాక్ట్ చేసి వుంటుంది. .. రాములు చెప్పిన ఆర్గానిక్ వ్యవసాయాన్ని గురించి.
“ఆర్యూ క్రేజీ? వ్యవసాయమా?” అన్నవాళ్ళనీ-
“గో ఎహెడ్” అన్నవాళ్ళనీ_
పక్కనబెడితే ఒక మంచి సలహా వచ్చింది.
“స్వతంత్రం రాకముందటి చదువులు బ్రిటిష్‍వారి అవసరాలకి అనువుగా, దుబాసీ పని చెయ్యడానికి వుపయోగపడేలా వుండేవి. స్వతంత్రం కూడా వచ్చాక మార్పేం రాలేదు. ఇటు కుటుంబానికిగానీ అటు సమాజానికిగానీ వుపయోగపడని చదువులు. ఇప్పుడైతే కుటుంబానికీ, దేశానికీ కూడా వుపయోగపడకుండా ప్రైవేటుసంస్థలకీ, పైదేశాలకీ వుపయోగపడుతున్నాయి. మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. నేను చాలాకాలంగా ఆర్గానిక ఫార్మింగ్ చేస్తున్నాను. విత్తనాలు, ఎరువులు, పురుగులమందులకోసం మార్కెట్‍కి వెళ్ళకపోతే వ్యవసాయం లాభదాయకమే. పుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా పెట్టుకుంటే సర్‍ప్లస్ వృధా అవదు. వడ్లతో అటుకులు, మరమరాలు, పేలాలు, వడియాలు చేసి మనవాళ్ళు చూపించనే చూపించారు. ఇదేమీ కొత్తదారి కాదు. పాతతీరానికే చేరుకుంటున్నాం. అయాం విత్ యూ” అని ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసరు రాసాడు. రమ ఫ్రెండుకి ఆయన చిన్నాన్న. ఆమె ఆయన నెంబరు ఇచ్చింది . ఫోన్లోకూడా మాట్లాడాడు.
“నీలో చనిపోవాలన్న ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? నాకు శాస్త్రీయంగా తెలుసుకోవాలని వుంది” అంది రమ మధు కొంచెం ప్రసన్నంగా వున్న సమయం చూసి.
“ఐతే నన్ను వైద్యం చేయించుకోమంటావు?” అన్నాడతను. అతని పెదాలమీద చిన్న చిరునవ్వు… చాలా అరుదుగా అమావస్యతో కలిసివచ్చే పాడ్యమినాడు కనిపించే కనీకనిపించని చంద్రరేఖలా. ఆ రేఖ ఇంకా విస్తరించాలని ఆశపడింది రమ.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.