మార్మిక గవాక్షం, మనిషి అనే ముద్రలు by S Sridevi

కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి అవి అలా జరిగినప్పుడు మనని చుట్టుకుని వున్న ప్రపంచంలో ఎక్కడో ఒక చిన్న మార్మికగవాక్షం తెరుచుకుంటుంది. దానికి అవతల మనకి తెలిసిన వ్యక్తులు ప్రపంచంకోసం తమమీద కప్పుకున్న పొరలన్నీ ఒకటొకటిగా తీసేసి కనిపిస్తారు.
మరోవైపు ఇంకొన్ని సంఘటనలగురించి మనకి క్షుణ్ణంగా తెలీదు. అవి మనం పుట్టనిక్రితమో, పుట్టాక మన పరోక్షంలోనో జరిగిపోయి వుంటాయి. వాటిలో వున్న వ్యక్తులు కొన్ని ముద్రలు మోస్తూ వుంటారు. అలాంటి ముద్రలనే మనం ఆ మనుషులుగా నమ్ముతాం. అవి ఒక్కొక్కసారి మన కళ్లకి కట్టిన గంతల్లాగా, మరొకొక్కసారి రంగుటద్దాలలాగా పనిచేస్తాయి. ఆప్టిక్స్‌లో ఒక సిద్ధాంతం వుంది. మనం కళ్ళతో చూసేది వస్తువునికాదు, దాన్ని ప్రతిబింబాన్నీ అని. మనుషులేనా అంతే. అనుభవాలూ, అభిప్రాయాలూ వేసే ముద్రలే మనకి వాళ్ళుగా కనిపిస్తారు.
తెరుచుకున్న కిటికీలోంచీ సుభాష్ చూసిన వ్యక్తి, పద్మజ. అతని మేనత్త. అతనికి ఒక ముద్రగా కనిపించినది నరుసు. మేనమామ. తెలుగువారి చుట్టరికాలు చాలా సునిశితంగా వుంటాయి. మేనమామ భార్య మేనత్త కాదు, మేనత్త భర్త మేనమామ కాడు. వెరసి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు. ఐనా మార్మికగవాక్షంలోంచీ పద్మజని చూస్తుంటే నరుసుపట్ల అప్పటిదాకా వున్న ముందస్తు అభిప్రాయాలు నెమ్మదిగా ఒకటొకటీ తొలిగిపోయి, అతని అసలురూపం వ్యక్తమవటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.
అప్పటికి గంటక్రితం గవర్నమెంటు హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక మితృడిని కలవటానికి వచ్చాడతను. స్నేహితుడిని కలవటం, మాట్లాడుకోవటం, కలిసి కాఫీ తాగటం అన్నీ అయి, అతని కన్సల్టింగ్ రూమ్‍కి ఆనుకుని వున్న జనరల్ వార్డులోంచీ ఇవతలికి వస్తూ చూసాడు వాళ్ళిద్దరినీ. నరుసు బెడ్‍మీద మగతగా పడుకుని వున్నాడు. పెరిగిన గడ్డం, లోతుకు పోయిన కనుగుంటలు, మాసిపోయి, పీక్కుపోయిన చెంపలు అతని పరిస్థితిని చెప్తున్నాయి. బెడ్ పక్కగా అటెండెట్స్‌కోసం వుండే కుర్చీలో కూర్చుని వుంది పద్మజ. ఆమె చేతిని తన చేత్తో గట్టిగా బిగించి పట్టుకుని వున్నాడు. ఇద్దరిమధ్యా ఇంత చనువు వుండే అవకాశం లేదు. అందుకే అతనికి ఆ ఆశ్చర్యం.
“అత్తా! నువ్విక్కడ?!” అడిగాడు దగ్గరకెళ్ళి.
మాట్లాడద్దన్నట్టు సౌంజ్ఞ చేసి, నరుసు చేతిని సున్నితంగా విడిపించుకుని, కిందకి వేలాడకుండా మంచంమీద వుంచి, కప్పుకున్న దుప్పటీ సరిచేసి, ఇవతలికి వచ్చింది. ఆమె ప్రతిచర్యనీ ఆశ్చర్యంగా చూసాడు సుభాష్. ఇద్దరూ వార్డులోంచీ బైటికొచ్చి, కారిడార్స్‌లోంచీ నడుస్తూ పార్కింగ్‍లాట్ చేరుకున్నారు.
“నువ్వెలా వచ్చావ్?” అడిగిందామె. జవాబుకోసం చూడలేదు. “నేనూ కార్లోనే వచ్చాను. నీదిక్కడ వదిలేసి నాదాంట్లో వెళ్దాం. తర్వాత మళ్ళీ వచ్చి తీసుకెళ్ళు” అంది తనే. మళ్ళీ ఆగకుండా, ’”నువ్వే డ్రైవ్ చెయ్. నాకు ఓపిక లేదు” అంది.
ఆ ఏకపక్ష సంభాషణ ఆమె మానసికస్థితికి అద్దం పడుతోంది. కారుతాళం, పార్కింగ్ రశీదు తీసుకుని ఆమె వేలితో చూపించినవైపుకి వెళ్ళాడు సుభాష్, కారు తీసుకురావడానికి. మరో ఐదునిముషాలకి ఇద్దరూ కార్లో వున్నారు.
“ఈ మహానుభావుడు నీకెక్కడ తారసపడ్డాడు?” అడిగాడు నరుసుగురించి. అతని మాటల్లో స్వల్పవ్యంగ్యం. “అసలింతకీ అతనిక్కడికి ఎందుకొచ్చాడు? ఎప్పుడొచ్చాడు? వచ్చినట్టు నీకెలా తెలుసు?” వెంటవెంటనే ప్రశ్నలు అడిగాడు.
“కొన్ని బంధాలు అలాగే లాక్కొస్తాయి. ప్రతి శుక్రవారం నేను జనరల్‍వార్డులో పేషెంట్సందరికీ పళ్ళూ, పాలూ, బ్రెడ్డూ ఇస్తానుకదా, అలా ఇక్కడికొచ్చినప్పుడు నరుసుని చూసాను. నాలుగురోజులక్రితం వొళ్ళు తెలీని జ్వరంతో వచ్చి అడ్మిటయాడట” ఆమె గొంతు వణికింది. నరుసుకోసం ఆమె బాధపడ్డం?!! అతని పేరు చెప్తేనే మండిపడతాడు తన తండ్రి. ఆయనగారి చిన్నచెల్లెలు, ఈవిడ ఇలాగ. ఐనా అంత బాధపడదగ్గ వ్యక్తికాదు నరుసు… అతనికి తెలిసి.
ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. నరుసుతో పరిచయం జరిగిన సందర్భం గుర్తుచేసుకుంది పద్మజ.
“అతన్ని మొదటిసారి చూసింది మీ అమ్మావాళ్ళ పెళ్ళిచూపుల్లో. నాకిప్పటికీ కళ్ళకి కట్టినట్టు గుర్తు… అసలు అతనికి సంబంధించిన ఏ చిన్నవిషయం నాకు మరుపుకి రాదు. నీలం జీన్స్, ఎరుపూ నలుపూ గళ్ళున్న వున్న ఫుల్‍షర్టూ వేసుకున్నాడు. సన్నగా పొడవైన పిల్లాడు. ఇంటరు మొదటిసంవత్సరం చదువుతున్నాడట. ఓ… హడావిడంతా తనదే అన్నట్టు ఇంట్లోకీ బైటికీ తెగ తిరిగేసాడు” అతన్నిగురించి చెప్తూ
అంది. “వాళ్ళమ్మానాన్నలకి కొడుకుగురించి ఎంత గొప్పో!” అంది ఇంకా లోతుగా జ్ఞాపకం తెచ్చుకుంటూ.
సుభాష్ వింతగా చూసాడు.
“నీకిప్పుడు పాతికేళ్ళుకదూ, నేను చెప్తున్నవి నువ్వు పుట్టకముందు ఐదేళ్ల కిందటివి. ఇప్పుడంటే పెళ్ళికన్నా ముందు శృంగారాన్నిగురించి ఆలోచిస్తున్నారుగానీ అప్పుడలా కాదు. ఇష్టమంటే వట్టి యిష్టమే. అతనంటే నాకు అలాంటి యిష్టం కలిగింది. అన్నయ్యావాళ్ళ పెళ్ళిలో మాకు స్నేహం కలిసింది. అతనంటే వాళ్ళవైపుని అందరికీ ఎంత ప్రేమో! ఫిజిక్స్ పీల్చి, మేథ్స్ తాగి, కెమిస్ట్రీ, ఇంగ్లీషూ, సంస్కృతం అన్నంలో కలుపుకుని తింటాడని గొప్పగా చెప్పేవాళ్ళు. చంద్రుడి చుట్టూ చుక్కల్లా ఎప్పుడూ పదిమంది చుట్టూ వుండేవారు. లివింగ్ ఎన్‍సైక్లొపెడియా అనేవారు. అతనికి తెలీని విషయం లేదంటే అతిశయోక్తి కాదు. క్వాంటం ఫిజిక్స్ అన్నమాట అతని నోటమ్మటే మొదటిసారి విన్నాను. అందులో రిసెర్చి చెయ్యటం అతనికి పేషన్” అంది పద్మజ.
“మా తాతయ్యకి పెరాలిసిస్ రావటంతో చదువు ఆపెయ్యాల్సి వచ్చిందని విన్నాను” సానుభూతిగా అన్నాడు సుభాష్. పద్మజ చిన్నగా నిట్టూర్చింది. హేతువు సేతువు కాదు. కారణం, వున్నచోటే వుండి కనుమరుగైపోతుంది. దాన్నుంచీ పుట్టిన పరిణామాలు వంతెన నిర్మించుకుంటూ దూరంగా వెళ్ళిపోతాయి. ఆ వంతెనకి ఇటు చివర్న వున్నాడు సుభాష్. అతన్ని వెనక్కి నడిపించాలి.
“ఏం చదువుకున్నాడు?” అడిగాడు.
“డిగ్రీ మధ్యలో మానేసి ఎల్డీసీగా చేరాడు”
ఎక్కడో కలుక్కుమంది అతనికి. ఆమెకేసి సూటిగా చూసాడు. నరుసుని సమర్ధిస్తున్నందుకు ఎక్కడా తప్పు చేసినట్టో, తలదించుకోవాలన్నట్టో లేదు ఆమె చూపు. తనూ స్థిరంగానే చూసింది.
“తెలివిలాగే మూర్ఖత్వంకూడా మనిషికి గొప్ప బలాన్నిస్తుంది. అది తెలివికంటే చాలా బలమైనది. మా అమ్మ అలాంటి మూర్ఖురాలు. మనది వ్యవసాయాధారమైన దేశంకాబట్టి అదో సాంప్రదాయంగా ఆడపిల్ల పెళ్ళప్పుడు తాడూ- చేదా ఇస్తారు. సరదాకి, పుట్టింటినుంచీ సిరిసంపదలు చేదుకొమ్మని వేళాకోళం చేస్తారు. దాన్ని త్రికరణశుద్ధిగా నమ్మిన మనిషి ఆవిడ” అంది పద్మజ. పెళ్ళైన కొత్తలో తన తల్లి చాలా కష్టాలు పడిందని విన్నాడు సుభాష్. ఇప్పుడు తల్లీతండ్రీ సఖ్యతగానే వుంటున్నారుకాబట్టి అంతా సర్దుకుందన్న నమ్మకం అతనిది.
“ఒక కష్టంకాదురా, వదిన పడ్డది. మీ నాన్న ఇష్టమొచ్చినట్టు కొట్టేవాడు. ఒకొక్కరోజు కొట్టి ఇంట్లోంచీ పెరట్లోకి నెట్టేసి తలుపేసేవారు ఆయనా, అమ్మాను. రైలుటికెట్టు చేతిలో పెట్టి నిర్దాక్షిణ్యంగా పుట్టింటికి తోలేసేవారు. మీ తాత… అంటే ఆవిడ తండ్రి పురుగునాకిపోయేదాకా అలాగే సాగించుకున్నారు. ఆయనో వెర్రిబాగులమనిషి. ఈవిడ వెళ్ళినప్పుడల్లా డబ్బిచ్చి పంపించేవాడు. వాళ్లకీ పెద్దగా ఆస్తులేమీ లేవు. ఆయన ఎయ్‍డెడ్ స్కూల్లో టీచరు. వీళ్ళిద్దరు సంతానం. స్వంతిల్లుండేది. దానిమీద అప్పు తెచ్చి కూతురి పెళ్ళి చేసారు. అది అమ్మేసి ఆఖరిపైసాకూడా మాచేతిలో పోసి, అద్దింట్లోకి మారేదాకా నిద్రపోలేదు మా అమ్మ. ఆయనకి పక్షవాతం రావడంతో నరుసుకి ఇంక దారిలేక చదువు మానేసి వుద్యోగంలో చేరాడు”
అప్పుడు… సుభాష్‍కి గుండె బరువెక్కింది, అంతటి హింస అనుభవించిన తల్లి రూపం కళ్లముందు కదిలి.
“ఇష్టంలేని వుద్యోగం. ఆ వుద్యోగం చూపించి చేసిన పెళ్ళి. రెండిట్లోనూ ఇమడలేకపోయాడు. కొన్నిరోజులు గడిచాక మొదట మీ తాతయ్యా, తర్వాత అమ్మమ్మా పోయారు. అతనికి పగ్గాలు తెగినట్టైంది. ఆఫీసుకి సరిగ్గా వెళ్ళేవాడు కాదట. ఎవరికీ చెప్పకుండా నెలలతరబడి ఎక్కడికో వెళ్ళిపోయేవాడట. విసిగిపోయి అతని భార్యని పుట్టింటివాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆతర్వాత పూర్తిగా స్థిరం తప్పాడు. ఉద్యోగం వదిలేసాడు. ఎక్కడెక్కడో తిరుగుతాడు. నాకు గుండె దడదడలాడుతూ వుంటుంది. పేపరు చదవాలంటే భయం… వార్తలు చూడాలంటే భయం. అతనిగురించి ఏలాంటి వార్త తెలుస్తుందోనని. ఇప్పుడిక్కడ ఇతన్ని ఇలా చూసాక ఎంత రిలీఫ్ కలిగిందో చెప్పలేను” అంది.
పద్మజ యింక ఏడుపు ఆపుకోలేకపోయింది. మోచేతి వంపులో ముఖం దాచుకుని డేష్‍బోర్డుమీద తలాన్చింది. భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఏమిటీ దు:ఖం? ఎక్కడా కారణం కనపడదే? ఒకప్పుడు ప్రేమించిందేమో, పెళ్ళి చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆమె మరొకరి భార్య. అతను మరొకరి భర్త. ఏమీ కాని మనిషికోసం ఇలా బాధపడటం?!! వింతగానే కాదు, ఎన్నేళ్ళు, ఎంత దాచుకున్న దు:ఖమో అనికూడా అనిపించింది.
సుభాష్ కారు పక్కకి తీసుకుని ఆపాడు. డోర్‍తీసుకుని దిగాడు. రద్దీవేళ కాకపోవటంతో ఒకటీ అరా వాహనాలు తప్ప రోడ్డు నిర్మానుష్యంగా వుంది. ఎన్నో ప్రశ్నలు అతని మనసులో తలెత్తుతున్నాయి. అంత హింసని తల్లి ఎందుకు భరించింది? భరించిందికాబట్టే తనకీ యీరోజుని తండ్రి అనే బంధం దక్కిందా? ఒక బంధాన్ని నిలపడంకోసం అంత హింసపడాలా? అలాంటి హింస పణంగా దొరికిన ఈ బంధం విలువ ఎంత? ఆలోచిస్తూ నిలబడ్డాడు.
ఐదునిముషాలు గడిచాక పద్మజ సర్దుకుంది. వాటర్ బాటిల్ తీసుకుని, దిగి, ముఖం కడుక్కుంది. సుభాష్ వెళ్ళి రోడ్దుకి అటువైపు వున్న బంకునించీ రెండు కప్పులు టీ తీసుకొచ్చాడు. ఒక కప్పు ఆమెకిస్తే అందుకుంది.
“థాంక్స్‌రా!” అంది. ఇద్దరూ నిలబడే తాగారు. తాగడం అయాక ప్రయాణం మళ్ళీ మొదలైంది.
“అమ్మ అన్ని కష్టాలు పడిందన్నావు, విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చుకదత్తా?” అడిగాడు.
“పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా, నీ స్థానం అక్కడే అని వాళ్ళు పంపించేస్తుంటే ఇంకెక్కడికి వెళ్తుంది? స్టాక్‍హోం సిండ్రోమ్ అంటారు. అలా వుండివుండి వాళ్ళని బాధపెట్టినచోటునే ప్రేమించడం మొదలుపెడతారు ఆడవాళ్ళు. అదే తమ యిల్లనే నమ్మకానికి వచ్చేస్తారు. ఇది మీ అమ్మ విషయంలో జరిగింది” అంది.
“మీరిద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నది ఎప్పుడు?” అంత ఏడ్చేడ్చి వున్న ఆమెని అడగొచ్చో అడక్కూడదో తెలీని సందిగ్ధంలో అడిగాడు. “చేసుకోలేదుగానీ, లేకపోతే అత్త స్థానంలో నువ్వుండేవాడివి, ఏడుస్తూ ” అన్నాడు నిరసనగా.
పద్మజ కళ్ళు మళ్ళీ తడయ్యాయి. మళ్ళీ ఏడుస్తుందేమోనని భయపడ్డాడు. కానీ వెంటనే సర్దుకుంది.
“ప్రేమకథలు వినడానికి బావున్నంతగా ఆచరించడానికి అనువుగా వుండవు. మాదేమీ ప్రేమకథ కాదు. నాకతను బాగా నచ్చాడని చెప్పానుకదా, అతనికలా చెప్పడంకూడా తెలీదు. అన్నీ బావుండి, కుండమార్పిడి అన్న ఒక్క అడ్డూ దాటేస్తే మా పెళ్ళి సాధ్యపడేది. కానీ పరిస్థితులు మారిపోయాయి. నరుసు కొంపకూల్చి, ఇద్దరక్కయ్యలకీ పెళ్ళి చేసారు. చిన్నవదిన కన్నీళ్ళు పోగుచేసి మూడోదానికి చేసాక, నాకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. నా మనసులో వున్నది చెప్పాను. పెద్ద గొడవలైపోయాయి.
ఏముందే, వాడికి? నా ముగ్గురల్లుళ్ళూ పెద్దపెద్ద వుద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ పక్కని నిలబడే అర్హత కూడా లేదు-అంది అమ్మ.
అతనికేమీ లేకపోవడమేమిటి? నువ్వు కనిపడేసిన ఇద్దరాడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన మహరాజు- అన్నాను.
ఆ మాటలు విన్న అన్నయ్య నా చెంపలు వాయించేసాడు. అదే కోపంలో వెళ్ళి నరుసు ఆఫీసులోకూడా గొడవ చేసి వచ్చాడు. ఆ తర్వాత బలవంతంగా నా పెళ్ళి జరిగింది. పెళ్ళికి ముందురోజుకూడా అన్నయ్య వదినమీద చెయ్యిచేసుకున్నాడు.
నీ పుట్టింటివాళ్ళంతా చచ్చిపోయారా? కూతురి అత్తారింట్లో పెళ్ళి జరుగుతుంటే రావల్సిన అవసరం లేదా? చదివింపులేవీ వుండవా? -అని.
వదిన ఫోన్ చేస్తే నరుసే పీటలమీద కూర్చునేవాళ్ళకి బట్టలు, నాకు కానుకా తీసుకుని వచ్చాడు. అతన్ని చూసి నాకు కన్నీళ్ళు ఆగలేదు. వాళ్ళ నాన్నకి అప్పటికే పక్షవాతం. ఆయన్ని ఒక్కడినీ వదిలిపెట్టి వచ్చే వీలు లేనందున వాళ్ళమ్మ రాలేదు. మనసు చంపుకుని ఇతనొచ్చాడు. పీటలమీద నన్ను చూసి అతని కళ్ళలోనూ పల్చటి కన్నీటి పొర… అదే అతన్ని ఆఖరుసారి చూడటం”
తండ్రిమీద పెద్ద గొప్ప అభిప్రాయమేమీ లేదు సుభాష్‍కి కానీ ఇంత చెడ్డవాడన్నది తెలీదు.
“నువ్వు కడుపులో వున్నప్పుడు మీ నాన్నకి చాలా పెద్ద యాక్సిడెంటైంది. అసలు బతుకుతాడనుకోలేదు. బతికినా, చక్రాలకుర్చీకే పరిమితం కావలిసినవాడు. మీ అమ్మ సేవ చేసింది. నరుసునీ బానే వాడుకుంది. బతికించుకుంది. ఇప్పుడాయన పులితొడుగు ఇంకా వదిలిపెట్టని పిల్లి”
“…”
“నా పెళ్ళైన ఐదారేళ్ళకి అతనికి పెళ్ళైంది. కొన్నాళ్ళు బాగానే వున్నారు. నువ్వన్నావే, అతన్ని చేసుకుంటే ఆవిడ స్థానంలో నువ్వుండేదానివని… ఆ మాటలు మా అమ్మ నోటమ్మట వినివిని చెవులు తూట్లుడిపోయాయి. కానీ మీ కెవరికీ తెలీదు… ఆవిడ స్థానంలో నేనుంటే అతనిలా అయ్యేవాడు కానేకాదు. నేనున్నానని ధైర్యం చెప్పేదాన్ని. నీ చదువేదో నువ్వు చదువుకో, నేను వుద్యోగం చేస్తాననేదాన్ని. నీవు నేర్పిన విద్యే నీరజాక్షా అన్నట్టు, మా పుట్టింటినుంచీ పిండీ పీడించీ డబ్బు తెచ్చి సంసారం నడిపేదాన్ని. అవేవీ జరగలేదు. నరుసు భార్య… ప్రమద్వర అనుకుంటా, ఆమె పేరు… పెళ్ళినుంచీ, భర్తనుంచీ ఏం కావాలో అవి తీసుకోవడానికి వచ్చింది. అవేవీ దొరక్క వదిలిపెట్టి వెళ్ళిపోయింది” అంది పద్మజ.
ఇద్దరు కొద్దిసేపు మౌనంగా వున్నారు. “అతన్ని అలా వదిలెయ్యద్దు సుభాష్! ఈరోజుని మీ అమ్మ జీవితం నిలబడిందంటే, మీ నాన్న పక్కని కంచిపట్టుచీర కట్టుకుని, వజ్రాల నెక్లెసు పెట్టుకుని దర్జాగా తిరుగుతోందంటే, మొగుళ్ళ వెనకాల విలాసాలు ఒలకబొస్తూ మా అక్కలు తిరుగుతున్నారంటే అతడి భిక్షేరా! అమ్మానాన్నల ఆస్తులు కావాలనుకున్నప్పుడు వాళ్ళు చేసే పాపాల్లోనూ వాటా తీసుకోవాలి. వాటిని ఈరోజుని వద్దనుకుంటే రేపెప్పుడో మనకి అనువుగా లేని సమయం చూసి చుట్టుకుంటాయి. మీ నాన్నే దానికి నిదర్శనం”
“…”
“ఇప్పుడు నరుసు ఇక్కడికి ఎందుకు వచ్చాడో, ఏం వెతుక్కుంటూ వచ్చాడో తెలీదు. అతడి కలలేవీ నెరవేరలేదు. కనీసం చివరిరోజులదాకా ప్రశాంతంగానూ, గౌరవంగానూ గడిపేలా ఏర్పాటు చెయ్యి. ఏదేనా హోమ్‍లో డబ్బుకట్టి చేర్పించు. నువ్వు స్వతంత్రుడివి. వుద్యోగం వుంది. చెయ్యగలవని అనుకుంటున్నాను” అంది ఆశగా.
“ఇన్నాళ్ళూ నాకివేవీ తెలీవు. తెలిసాక ఎందుకు వదిలేస్తాను?” అన్నాడు సుభాష్. “మామయ్యకి తెలుసా, ఈ విషయాలు?” అడిగాడు ఆమె భర్త గురించి.
“కొంతవరకూ తెలుసు. నాలోని గిల్ట్ అర్థంచేసుకున్నారు”


పద్మజని యింటిదగ్గర వదిలేసి కేబ్ పట్టుకుని మళ్ళీ హాస్పిటల్‍కి వెళ్ళాడు సుభాష్. నరుసుకి జ్వరం దిగినట్టుంది, బెడ్ మధ్యగా మఠం వేసుక్కూర్చుని పక్క బెడ్‍ పేషెంటుతో ఏదో మాట్లాడుతున్నాడు. మాటలాపి ఎవరన్నట్టు చూసాడు.
“నేను మామా!” అన్నాడు తన పరిచయం చెప్పుకుని.
“ఎంత పెద్దవాడివయ్యావురా? అక్క బావుందా? సంతోషంగా వుందా?” అడిగాడు గబగబ.
“అంతా బానే వున్నారుగానీ, నువ్వేంటి యిక్కడ?”
“నేనని నీకెలా తెలుసు? పద్మ చెపిందా?” నవ్వుతూ అడిగాడు నరుసు. “తను నాకు మంచి స్నేహితురాల్లే” అన్నాడు తనే.
అతనలా నవ్వుతుంటే ప్రస్తుతపు రూపం నెమ్మదిగా మారిపోతూ అత్త చెప్పిన పదహారేళ్ల పిల్లాడిరూపం వూహల్లో నిలిచింది సుభాష్‍కి. తను ఆ వయసులో అతనిలాగే వుండేవాడేమో! మేనమామ పోలికని ఎవరూ చెప్పలేదు. అనుకోవడానికికూడా భయపడో, చిన్నతనం పడో వుంటుంది తల్లి. అతన్ని గట్టిగా కౌగిలించుకుని గుండెలకి హత్తుకోవాలనిపించింది. తమింట్లో జరిగిన పెళ్ళి అనే క్రతువువలన ఎన్ని కోల్పోయాడితను! తన తల్లి కష్టాలు పడిందంటారు. ఆ కష్టాలని నిజంగా భరించిది ఇతను.
వారణాశిలో వుంటున్నాడట.
“తాళపత్రగ్రంథాలేవో పరిష్కరిస్తున్నానురా! అక్కడే ఆశ్రమంలో వుంటున్నాను. తిండీ అదీ వాళ్ళే పెడతారు. కొంచెం డబ్బులిస్తారు. ఉండటానికి గదికూడా ఇచ్చారు. ఖర్చులు వెళ్ళిపోతాయి. మీ అత్తని పుట్టింట్లోవాళ్ళు సరిగ్గా చూడట్లేదట. అమ్మానాన్నలు పోయాక వెనకట్లా ఎలా వుంటుందిలే? ఉత్తరం రాసింది. నాతో తీసుకెళ్దామని వచ్చి, ఇలా ఇరుక్కుపోయాను” అన్నాడు.
“ఎక్కడికి వెళ్తావు మామా? నీకే సరైన ఆధారం లేదు. ఆవిడ్నికూడా తీసుకెళ్ళి ఏం చేస్తావు?” అడిగాడు సుభాష్.
“ఏదో ఒకలా బతికేస్తాంరా! ఇప్పుడు బతకట్లేదా? అలాగే” అన్నాడు.
ఎంత ఖర్చౌతుంది ఇతన్ని తిరిగి నిలబెట్టడానికి? సుభాష్ లెక్కలు వేసుకున్నాడు. ఏడాదికి జీతం నలభై లక్షలు. చిన్న యిల్లు, క్లుప్తంగా జీవిక వెళ్ళడానికి కాస్త ఏర్పాటు… అతనికి మొత్తం జీవితమే తరిగిపోయినప్పుడు ఒక్క ఏడాది తన జీతంలోంచీ తరిగిపోతే?
రిసెర్చి పిల్లలకి నోట్సూ, థీసిస్‍లూ రాసిస్తాడట. వాళ్లు కొంత డబ్బిస్తారట. గుండెమీద తన్నినట్టు చెప్పాడు, ఒకప్పుడు ఫిజిక్స్ పీల్చి, మేథ్స్ తాగి, కెమిస్ట్రీ, ఇంగ్లీషూ, సంస్కృతం- తెలుగు అనే తెల్లన్నంలో కలుపుకుని తిన్న ఆ మనిషి. సుభాష్‍కి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. పద్మజ ఎందుకు ఏడ్చిందో అవగాహనకి వచ్చింది.
“నాతో తీసుకెళ్తాను. కొద్దిరోజులు నా ఫ్రెండుదగ్గిర వుండు. నీకు ఇల్లూ అదీ ఏర్పాటు చేస్తాను. ఆదాయానికి మార్గం చూపిస్తాను. అత్తనికూడా తీసుకొద్దువుగాని. కొంచెం టైమివ్వు” అన్నాడు తన లెక్కలు తను వేసుకుంటూనే.
“వద్దురా! ఇన్నాళ్ళకి కష్టాలు తీరి మీ అమ్మ ఏదో… తనదారిన తను సుఖంగా బతుకుతోంది. చేసిందంతా వృధా ఐపోతుంది” భయపడిపోయాడు నరుసు. అతని కళ్లలో స్పష్టమైన భయం … అక్క తిన్న దెబ్బలగురించో, తను తిన్న చావుదెబ్బ గురించో…
“నీకు మంచి ఫోనూ, కంప్యూటరూ కొనిస్తాను. యూట్యూబు చానెల్ పెట్టుకో. నువ్వు చెప్పాలనుకున్నవన్నీ అందులో చెప్పు. వాళ్లకీ వీళ్ళకీ పని చెయ్యకు” అన్నాడు ప్రేమగా. నరుసు కళ్ళు మెరిసాయి.
“నిజంగా కంప్యూటరు కొనిస్తావా?” ఆశగా అడిగాడు. “అక్కడికే వెళ్ళిపోతానురా! గది అద్దెకి తీసుకుంటాను. కంప్యూటరు జాగ్రత్తగా దాచుకుంటాను” చిన్నపిల్లవాడిలా అన్నాడు. ఎంత నచ్చజెప్పినా ఇక్కడ వుండటానికి యిష్టపడలేదు.
“నేను మళ్ళీ వస్తాను. ఇప్పటికి రెస్టు తీసుకో” అని ఇంటికి వెళ్ళాడు.
అతని పెద్దమేనత్తలు వచ్చి వున్నారు. తల్లి వాళ్ళతో కూర్చుని మాట్లాడుతోంది. డైనింగ్ టేబుల్‍ముందు కుర్చుని కంచంలో అన్నీ పెట్టుకుంటుంటే ఆవిడ వచ్చింది. తింటూ జరిగిన విషయాలు చెప్పాడు.
“వాళ్ళిద్దరూ ఇంకా కలుసుకుంటునే వున్నారటనా? మీ అత్తకి వాడిక్కడున్నట్టు ఎలా తెలిసిందట? నాన్నకి తెలిస్తే వాణ్ణి చంపేస్తారు. అంత బుద్ధిలేని మనిషేమిటి? ఏళ్ళొచ్చి ఏం లాభం?” అంది చిరాగ్గా. ఈవిడా ఏకధాటీగానే మాట్లాడింది.
“అందరికీ అన్నీ అమరవు. పెట్టి పుట్టాలి. పెద్ద చదువులు చదవాలి, పెద్దింటి పిల్లని చేసుకోవాలని కలలుకనడం, ఆకాశానికి నిచ్చెనలు వేసి బొక్కబోర్లాపడటం దేనికి? మా నాన్న నా పెళ్ళి చేసాడు. కొంచెం ఎక్కువే పెట్టాడేమో! ఒక్కగానొక్క కూతుర్నని పెట్టాడు. వాడికి చిన్నదో పెద్దదో గవర్నమెంటు వుద్యోగం వచ్చింది. అందులోనే వుండి పరీక్షలవీ రాసుకుంటే ప్రమోషన్లొచ్చేవి. చుక్కలాంటి పిల్లని తెచ్చి చేసాం. దాన్ని నిలువునా ముంచాడు” అంది పెద్దగొంతుతో.
“ఇన్నేళ్ళ తర్వాత ఇక్కడికొచ్చాడు. మనింటికి రాలేదేం? పోనీ రాలేదు, చీరో ఏదో కొనుక్కోమని వెయ్యో ఐదువేలో చేతిలో పెట్టాడా? నమో నాస్తి. పుట్టింటి ఆశన్నది లేకుండా చేసాడు” అంది ఆవేశంతో రొప్పుతూ.
తల్లిని పరీక్షగా చూసాడు సుభాష్. మనిషి నిరంతర పీడనకి గురయ్యాక క్రమంగా ఆ పీడనలోనే జీవితాన్ని వెతుక్కుంటాడు. ఇది ఒక వ్యక్తికో, ఒక కుటుంబానికో మాత్రమే పరిమితమైన విషయం కాదు. రాజ్యాలనీ, మతాలనీ, సమాజాలనీ నడిపించే సూత్రం. ప్రేమతోటీ సాటిమనిషిని జయించవచ్చు, పీడనతోటీ ఆ పని చెయ్యచ్చు. మొదటిది అందరికీ రాదు. రెండోది సర్వజనీనమైనది. చంటిపిల్లాడిని పెంచే క్రమంలో కళ్ళెర్రచేసి చూడ్డంతో మొదలౌతుంది. భార్యని చాచిపెట్టి కొట్టడంతో మొదలౌతుంది. రాజదండం పట్టుకుని పౌరుణ్ణి బెదిరించడంతో మొదలుతుంది.
“ఏమిటొదినా?” అత్తలిద్దరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు.
“ఏం వుంది? ఏ జన్మలోనో చేసుకున్న ఖర్మం. ఒక్క తమ్ముడు. మా నాన్న తర్వాత ఇల్లు నిలబెట్టాల్సినవాడు…. బైరాగాడిలా దేశాలు పట్టుకుని తిరుగుతున్నాడు. వీడికి ఎక్కడో కనిపించాడట” అంది నిరసనగా.
“డబ్బేమైనా అడిగాడేమిట్రా?” పెద్దత్త ఆరా తీసింది.
“పద్మత్త వెంటపడ్డాడు. మీ నాన్న వెళ్ళి చమడాలూడదీసి వచ్చాడు” అంది రెండో అత్త.
“ఎక్కడ కనిపించాడ్రా, నీకు?” తండ్రి గదిలోంచీ వస్తూ అడిగాడు. చెప్పద్దన్నట్టు చూసింది తల్లి.
“రోడ్డుమీద” అబద్ధం చెప్పాడు సుభాష్. పుట్టలో పాములన్నీ ఒక్కసారి కదిలినట్టు అనిపించింది. తను చెయ్యాల్సింది చాలా వుందని అర్థమైంది. భోజనం చేసి మళ్ళీ హాస్పిటల్‍కి వెళ్ళేసరికి నరుసు లేడు. భార్య వచ్చి డిశ్చార్జి చేయించుకుని తీసుకెళ్ళిపోయిందట. తన డాక్టరు స్నేహితుడిని అడిగితే చెప్పాడు.
“నువ్వొస్తే ఈ వుత్తరం ఇమ్మన్నాడు” అని ఒక కవరు ఇచ్చాడు.
నాన్నా, సుభాష్!
నిన్నూ, పద్మనీ చూడటం అనేది నేను ఎదురుచూడని వరం. మనసు నిండిపోయింది. ప్రమద నాతో వస్తానంది. ఆ పిచ్చిపిల్ల కాళ్ళు కడిగి నెత్తిమీద నీళ్ళు చల్లుకోవటంకన్నా ఏం చెయ్యగలను? వారణాసిలో కాయాపేక్ష, ఫలాపేక్షా వదిలిపెట్టమంటారు. అంటే శరీరప్రేమ, చేసిన పనులయొక్క ఫలితాలమీద ఆశింపూ వుండకూడని అర్థం. అవన్నీ ఎప్పుడో వదిలేసాను. సైన్సు, టెక్నాలజీ అనే వూహావుయ్యాలలో వూగుతున్న మనిషిని నేను. దిగి రాలేనురా! ప్రాచీనగ్రంథాలు చదవటం. లైబ్రరీల చుట్టూ తిరగడం, చదువుకున్నవాళ్లని ఆరాధించడం… వీటన్నిటిలో నా జీవితం ఇమిడిపోయింది. ఫాంటు మాసేదాకానే అక్కడా ఇక్కడా కూర్చోవడానికి ఆలోచించేది. ఒకసారి మాసిందా, దాంతోపాటే ఆ ఆలోచనకూడా మాసిపోతుంది. బతకడం నాకు ఎప్పుడూ సమస్య కాదు. ఎలా బతకాలన్న విషయంలోనే రాజీపడలేకపోతున్నాను. నాకు ఏవేవో చేస్తానన్నావు. కంప్యూటరు కొనిస్తానని నా మనసుని మురిపించి ఆ మెరుపుని నా కళ్లలో చూసి సంతోషపడ్డావు. క్షణమాత్రపు ఆ సంతోషం నాకు చాలు. ఆ తల్లిదండ్రుల కడుపున పుట్టాల్సినవాడివి కాదురా, నువ్వు. ఎక్కడివాళ్లం అక్కడ వుంటేనే అందరికీ సుఖం. మీ నాన్నజీవి శాంతంగా వుంటాడు. మీ అమ్మ … వ్యక్తిత్వం చచ్చిపోయిన మనిషి. ఆవిడొక ఎండుకట్టె. ఎలాగో ఒకలా వునికిని నిలబెట్టుకోవాలన్న స్వీయప్రేమతప్ప మరే ప్రేమా మిగిలిలేనంతగా ఎండిపోయిన మనిషి. ఒక్కమాట మాత్రం చెప్తాను. నీ మనసు చెప్పిన మాట విను. దాన్ని అణిచిపెట్టకు. లేదా కొన్నాళ్ళకి అది స్వతంత్రం ప్రకటించుకుంటుంది. అప్పుడింక మన అదుపులో వుండదు. ఇష్టమైన చదువూ, ఇష్టమైన పిల్లా… మగవాడు నిలకడగా వుండటానికి ఇంకేం కావాలి? అక్కడ రాజీ పడకు.
నరుసు మామ


మరికొన్ని గంటలకి…
వారణాశి వెళ్ళే విమానంలో వున్నాడు సుభాష్. నరుసుకన్నా ముందే అక్కడికి చేరుకుని, రైల్వేస్టేషన్లో వాళ్ళకి స్వాగతం చెప్పడానికి. నరుసుకోసం ఆన్‍లైన్‍లో ఆర్డరు పెట్టిన కంప్యూటరు, వర్కుస్టేషన్, ఇంకొన్ని వస్తువులు వస్తున్నాయి. అతని జీవితాన్ని అతనికి తిరిగి ఇవ్వలేకపోవచ్చు. ఈ కొంచెమేనా చెయ్యకపోతే పద్మజ చెప్పినట్టు పీడకుడిని అతనూ ప్రేమిస్తున్నట్టే.