అవి నేను కొత్తగూడెం సింగరేణి కోలరీస్ డిగ్రీ కాలేజ్‍లో లెక్చరర్‍గా పనిచేస్తున్న తొలి రోజులు. అమ్మా, నాన్నగారు హైద్రాబాద్‍లో వుండేవారు. నేను ప్రతి సెలవులకు హైదరాబాద్ వెళ్ళిపోయేదాన్ని. ఈసారి కూడా అలాగే వరసగా పండగ సెలవులు రావటంతో, తెల్లరితే భోగీ కదా అని ముందురోజు పొద్దున్న ప్రాక్టికల్ క్లాస్ చేసేసి మధ్యాహ్నం వర్క్ లోకల్ గా ఉన్న కొలీగ్‍కి అప్పజెప్పి రూమ్‍కి వెళ్లి బాగ్ తీసుకుని బస్‍స్టాండ్‍కి వచ్చి లంచ్ చేసి రెండుగంటలకు హైద్రాబాద్ బస్ ఎక్కేసాను.
“రాత్రి 10 కల్లా హైదరాబాద్ గౌలిగూడ బస్‍స్టాండ్ చేరిపోతాను. అక్కడనుంచి మా ఇల్లు దార్ వుల్ షఫా రిక్షాలో వెళ్ళిపోవచ్చు. సెకండ్ షో వదిలేవరకు రోడ్లుమీద జనంతో సందడిగానే ఉంటుంది కనుక సమస్య లేదు. చక్కగా భోగినాడు ఇంట్లోనే గడపవచ్చు” అనుకుని అలా బయలుదేరాను.
బస్ బయలుదేరింది. నేను ఏదో పుస్తకంలో మునిగిపోయాను. పుస్తకం పట్టుకుంటే ప్రపంచం తెలిసేదికాదు ఆరోజుల్లో నాకు. చీకటిపడింది. సడన్‍గా బస్ ఆగిపోయింది.
బస్‍లో వాళ్ళు అడిగితే ఇంజిన్లో ఏదో ప్రాబ్లెమ్ వచ్చింది, రిపేర్ అయితేకానీ కదలదు అన్నారు. ముందు మైనర్ ప్రాబ్లెమ్ అనుకున్నారు. కానీ తరవాత అది పెద్దదై బస్ కదలదని తెలిసి, పండగరోజుల్లో మరోబస్‍లో మమ్మల్ని పంపేసరికి ఇంచుమించు మూడుగంటలు పట్టింది. అలా లేట్ అవటంతో నాకు భయం మొదలయింది. “బాగా లేట్ అయిపోతే ఎలారా, ఇంటికి వెళ్ళటం? “అని బెంగ మొదలయింది.
మొత్తానికి బస్ మెల్లిగా రాత్రి రెండుగంటలకు గౌలిగూడా బస్‍స్టాండ్ చేరింది. బస్‍లో ప్రయాణికులు మెల్లిగా దిగి వెళ్ళిపోయారు. చివరిగా నేను బాగ్, హాండ్‍బాగ్ పట్టుకుని దిగాను. బస్‍స్టాండ్‍లో తెల్లారేవరకు ఉండి వెలుగు వచ్చాక వెళదాం అనుకుంటూ చూస్తే బస్‍స్టాండ్ ఖాళీగా ఉంది. బస్సులు వచ్చినపుడు సందడే తప్ప తరవాత ఎవరూ ఉండరులా ఉంది. ఈలోపల డ్రైవర్, కండక్టర్ కూడా బస్ దిగిపోయారు. వెళ్లి కండక్టర్ అడిగాను, అక్కడ వుండే వీలు ఉంటుందా అని.
అతను “అలా కుదరదు మేడమ్. మీరు వెళిపోటమే మంచిది. మరీ లేట్ చేస్తే బయట ఆటోలు, రిక్షాలు కూడా దొరకవు. సెకండ్ షో వదిలేశారు. ఇప్పుడేనా దొరుకుతాయో లేదో చెప్పలేం” అన్నాడు.
నా గుండె గుభేల్‍మంది. కళ్ళలో నయాగరాలు దూకటానికి సిద్ధంగా ఉన్నాయి. “సరే “అని చేసేది లేక బాగ్ పట్టుకు భారంగా కదిలాను అక్కడినుండి.
ఇంతలో కండక్టర్ మళ్లీ వచ్చి,” ఎక్కడికి వెళ్ళాలి? నేను మీతో వస్తాను పదండి” అన్నాడు.
“అతన్ని మాత్రం ఏమి నమ్మ గలను” అని మనసు అంటున్నా మరోమార్గం లేక చెప్పి, కూడా రమ్మన్నట్లు తల ఊపాను.
లోన అగ్ని పర్వతాలు పేలుతున్నాయి. ” ఛీ !ఎందుకు ఇలా ఈరోజు బయలుదేరాను? రేపు పొద్దున ఆరుగంటల బస్‍కి వెళితే డే టైం కాబట్టి ప్రాబ్లెమ్ లేక పోయేది. భోగి మిస్ అయినా మనసు ప్రశాంతంగా ప్రయాణం జరిగేది. బుద్ధిలేనిపని చేసాను” అని నన్ను నేనే తిట్టుకుంటూ బస్టాండు బయటికి వచ్చాము.
జనవరి నెల చాలా చలిగా ఉంది వాతావరణం. అంత చలిలోనూ నేను వణుకుతున్నా ముచ్చెమటలు పోసి. భయంవలన గొంతు తడారిపోతున్నట్లు అనిపిస్తూ చాలా దయనీయంగా ఉంది నా పరిస్థితి.
కండక్టర్ ఓ రిక్షా దారుల్ షఫాకి మాట్లాడి ” పదండి “అన్నాడు.
నేను “ఒక రిక్షా కాదు, రెండు మాట్లాడండి” నా గొంతులో కాఠిన్యం నాకే అసహజంగా అనిపించింది. ఏమో, ఆ జనవరి నెల చలిలో ఆ అపరిచితుడితో గూడురిక్షాలో అంత దగ్గరగా కూచోటానికి నా మనసు సుతరాము ఒప్పుకోలేదు.
అతను మారు మాట్లాడకుండా ఇంకోరిక్షా మాట్లాడాడు.
సరే! చెరో రిక్షాలో కూచుని బయలుదేరాం.
నా రిక్షావాడు హుషారుగా ” ఆ గలే లగాలే అప్ నా బనాలే ” అని పాడుకుంటూ రిక్షా జోరుగా తొక్కుతున్నాడు. నాకు కంపరం ఎత్తుతోంది. వాడిని ఆ పాట ఆపు అని గట్టిగా అరవాలని అనిపిస్తోంది. కానీ ఏమీ అనలేదు. అలా వాడికి తోచిన పాటలు పాడుతూ ఈల వేసుకుంటూ పోతూన్న వాడల్లా రిక్షా ఆపేసి దిగాడు. ఏమి అయిందా అని చూసిన నాకు ఇంకా సాలార్‍జంగ్ మ్యూజియం దగ్గరే ఉన్నాం అని అర్ధం అయింది. నా గుండె ఓసారి ఆగి కొట్టుకుంది.
“క్యా హువా? “అడిగాను.
వెనకాల రిక్షా కూడా ఆగి “క్యాహువా భాయ్?” అన్నాడు ఆ రిక్షావాడు.
దానికి వీడు “అబే దిఖ్‍తా నై. చైన్ గిర్ గయా ” అంటూ చైన్ సరిచేసి మళ్లీ తొక్కడం మొదలెట్టాడు.
ఊపిరి పీల్చుకున్నాను. కానీ దడ వదలలేదు.
మెల్లిగా రిక్షాలు దారుల్ షఫాలో మా గల్లీ దగ్గరకి వచ్చాయి. గల్లీలోకి సీదా ఓ మూడు నిముషాలు నడవాలి. అక్కడ పెద్ద గేట్. అది రాత్రి లాక్ చేస్తారు. అందులో ఓ చిన్న గేట్ రాత్రి కూడా తెరిచే ఉంటుంది. లోపలకి వెళితే కుడివైపు మా ఇల్లు.
గల్లీ ముందు ఆపమని ఒక్క ఉదుటున రిక్షాలోంచి దూకి పరుగులాంటి నడకతో వెనక్కి చూడకుండా చిన్న గేట్లోంచి వెళ్లి మా ఇంటి తలుపు దబాదబా బాదేసాను.
నాన్నగారు తలుపు తీసి “ఇంత రాత్రా!..నువ్వా! “అంటూ పక్కకి తప్పుకుని లోపలకి త్రోవ ఇచ్చారు.
అమ్మ లేచి “ఎవరూ? సావిత్రీ, ఇంత రాత్రప్పుడు ఎలా వచ్చావు? పగలు వచ్చే బస్సులు దొరకలేదా? కూడా ఎవరొచ్చారు?” అంటూ తన ధోరణిలోప్రశ్నల వర్షం కురిపించింది. “చెప్తాను, ఉండమ్మా!” అన్నాను.
అమ్మ ప్రశ్నలకి నాకు స్పృహ వచ్చి, నాతోపాటు వచ్చిన కండక్టర్ గుర్తు వచ్చాడు. “అయ్యో ! అతనిమాటే మరిచిపోయాను. ఛీ ..అన్నీ బుర్రతక్కువ పన్లే చేస్తాను ” అని నన్ను నేనే తిట్టుకుంటూ హాల్లోకి వచ్చాను.
ఆసరికి అతను లోపలకి వచ్చి నాన్న గారికి నా బాగ్, హాండ్‍బాగ్ ఇచ్చి మాట్లాడుతున్నాడు.
నేను వాళ్ళదగ్గరికి వెళ్లేసరికి అతను”ఆప్ బహుత్ పరేషాన్ థే! బాగ్స్ భీ రిక్షా మే ఛోడ్ కే భాగ్ ఆయే ” అన్నాడు.
నేను అప్పటికి కాస్త తేరుకుని ఈ లోకంలో పడి హిందీ లోనే “సారీ అండీ! థాంక్ యు. రిక్షాకి డబ్బులు కూడా ఇయ్యలేదు” అంటూ నా బాగ్ తీసి డబ్బులు యీయబోతుంటే , “నేనిచ్చానమ్మ! మీ భయం నేను అర్ధం చేసుకున్నాను. కాస్త ఏమయినా తాగి రిలాక్స్ అవండి. వస్తాను. బాగా రాత్రి అయ్యింది. తరవాత మళ్లీ కలుద్దాం. బహన్ బాగా పరేషాన్ అయింది. ఆమెకి చూడండి సాబ్ .” అని నాన్న గారికి చెప్పి సెలవు తీసుకు వెళ్లిపోయాడు.
తరవాత నాన్నగారు చెప్పారు అతను నిన్ను ఒక్కదాన్ని పంపటం మంచిదికాదని ఇంటి దగ్గర దింపాలనుకుని కూడా వచ్చాడు. కానీ అది అర్ధం చేసుకునే పరిస్థితిలో నువు లేవు. అందికే అతను నీతో ఏమీ మాట్లాడలేదు. ఏమైనా చేయాలంటే ఇంటివరకు రావాలా సర్, కానీ బహన్ చాలా భయంలో వున్నారు. అది ఏమీ ఆమెకి తట్టలేదు- అంటూ నువు రిక్షాలో వదిలేసిన నీ బాగ్‍లు రెండు తెచ్చి నాకిచ్చాడు”అన్నారు.
“పది లోపల వచ్చేస్తాను అనుకున్నా ను. ఇలా జరుగుతుంది అనుకోలేదు “అన్నాను అపరాధభావంతో.
“సరేలే!ఎదో జరిగిపోయింది. నువు భద్రంగా ఇల్లు చేరావు. ఇంకెప్పుడూ ఇలా రాత్రి చేరేట్లు రాకు. ఎప్పుడు ఏమి జరుగుతుందో. ఈరోజు అదృష్టంకొద్దీ అతను మంచివాడు ,అర్ధం చేసుకున్నాడు, కూడా తోడు వచ్చాడు. లేకపోతే ?అయినా నీకు ఇది ఓ పాఠం కావాలి ఇటుపై ఇలాటి రిస్క్‌లు తీసుకోకుండా ఉండటానికి “అని సున్నితంగా మందలించారు.
అమ్మ, “అలాటివి రోజూ జరిగినా దాని బుద్ధి మారదు. ఏవో పనికిరాని పన్లు చేస్తూ దానికి, మనకి తలనొప్పి తెస్తూనే ఉంటుంది. పై ఊర్లో ఉద్యోగం వద్దు అంటే విందా? ఇక్కడ ఉద్యోగం జూనియర్ లెక్చరర్, అక్కడ డిగ్రీ కాలేజ్ సీనియర్ లెక్చర్ పోస్ట్ అంటూ పరిగెత్తింది. ఇదిగో ఇప్పుడిలా అర్ధరాత్రీ, అపరాత్రీ తనకొచ్చేదీ, మనకొచ్చేదీ చూసుకోకుండా వీరవిహారాలు చేస్తోంది” అంది.
“నాకు తెలుసు. నీ వాక్ప్రవాహం ఆగదు, నేను పుట్టిన దగ్గరనుండీ ఎత్తి పెట్టి చెప్పాల్సినవి అన్నీ పూర్తి అవుతేగానీ ” అని కాఫీ పెట్టటానికి వంటింట్లోకి నడిచాను.
తరవాత మళ్లీ కలిసినప్పుడు అతని పేరు రహీం అని, ఆ పరిస్థితిలో నా అవస్థ అర్ధం చేసుకుని సాయం చేయాలని నిశ్చయించుకున్నాడని చెప్పాడు. మా మధ్య చక్కని అనుబంధం ఏర్పడింది. సావిత్రీ బహన్ అంటూ ఆ బంధాన్ని అలాగే కొనసాగించి ఉత్తరాలు కూడా రాసుకునేవాళ్ళం. వచ్చీరాని హిందీ ఇంగ్లీష్లలో రాసేవాడు ఉత్తరం.
నేను కొత్తగూడెంలో ఎనిమిదినెలలే చేసాను. హైద్రాబాద్‍లో నాన్నగారికి ఆక్సిడెంట్ అవటంతో జాబ్ రిజైన్ చేసి వచ్చేసినా ఉత్తరాలద్వారా మా అనుబంధం కొనసాగింది. తరవాత కొన్నాళ్ళపాటు ఉత్తరం రాలేదు. నేను “ఎలా ఉన్నావు భాయీ! “అని రాసిన ఉత్తరానికి అతని తమ్ముడు అన్న ఆక్సిడెంట్‍లో పోయాడు అని బదులు ఇచ్చాడు .నా మనసు చెదిరి పోయింది.
ఆరోజు ఎంత ఏడ్చానో రహీంభాయిని తలుచుకుని. అతను నేటికీ నా గుండెల్లో వుండిపోయి ” ఆప్‍కో క్యూం పరేషానీ? మై హుం నా? ” అంటున్నట్లే అనిపిస్తుంది నాకే ఇబ్బంది వచ్చినా.
నా పేరు ఆయాపిళ్ళ సావిత్రి. జననం 1955. పుట్టింది అనకాపల్లి, ఆంధ్ర ప్రదేశ్ లో. తల్లితండ్రులు.. లేట్ గంటి వెంకట రమణయ్య,సుందరమ్మ. భర్త.. లేట్ A.V.Ramana Rao.విద్యార్హతలు: MSc physic s, Mphil, PG Dip Electronics ఉద్యోగం: విశాఖపట్నం AVN కళాశాలలో భౌతికశాస్త్ర విభాగంలో విభాగఅధిపతిగా చేసి.2013 లో రిటైర్ ఆయాను. కధలు, కవితలు రాయటం సరదా.కొన్ని ప్రచురింపబడ్డా అవి ఏవీ సేకరించి పెట్టుకోలేదు.అసలు ప్రచురణకి పంపటమే చాలా తక్కువ. రిటైర్ అయాకా ఈ fb లోకి వచ్చాకా ఏదో రాసి మన గోడ మీద పెట్టటం మొదలుపెట్టాను. ఆ రకం గా నా వ్రాతలు ఎక్కువగా fb లో పెట్టినవే అయ్యాయి.ఇది సరదాగా ఎంచుకున్నది. మిత్రుల ప్రోత్సాహంతో కొనసాగిస్తున్ది మాత్రమే. ఇప్పటి వరకూ ఎన్ని రాసాను అన్నది ఖచ్చితం గా చెప్పలేను. అయినా 2015 నుండీ గజల్స్, ఫ్రీ వెర్సెస్, కొన్ని వృత్తాలు, పద్యాలు, కధలు, మ్యుజింగ్స్ లా వివిధ విషయాలపై నా భావాలు Fb లో టపా లు గా వ్రాస్తూనే వున్నాను.