చారిత్రక నేపథ్యం: మహాభారత యుద్ధం తర్వాత కురువంశం క్రమంగా బలహీనపడింది. హస్తినాపురం కొంతకాలం మౌర్య, కుషాన్, గుప్త, వర్ధమాన, గుర్జార-ప్రతిహార సామ్రాజ్యాలలో అంతర్భాగంగా వుంది. క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దంలో ధిలు అనే రాజువలన దిల్లీగా పేరు మార్చుకుంది. ఢిల్లీ కేంద్రంగా భారతదేశం ఎన్నో దండయాత్రలకి గురైంది. క్రీ.శ. 1206 లో కుతుబుద్దిన్ ఐబక్ పాలనతో మొదలై క్రీ.శ. 1757 వరకు ముస్లిమ్ పాలనలోనూ, ఆ తర్వాత బహుకొద్దికాలం మరాఠాపాలనలోనూ వుండి తదుపరి 1947 వరకు ఆంగ్లేయపాలనలోనూ వుంది. ఆగస్టు 14, 1947లో పాకిస్తాన్‍కి, ఆ పక్కరోజున మనకి స్వాతంత్ర్యం వచ్చింది. మార్చి 25, 1971వరకు బంగ్లాదేశ్ పాకిస్థాన్‍లో అంతర్భాగంగా వుంది. ఆ తర్వాత స్వతంత్రదేశమైంది. ఇదంతా రాజకీయ చరిత్రగా అనిపించవచ్చుగానీ కొన్ని శతాబ్దాల రక్తచరిత్ర.
“రోషనారా” కథ 8.7.2007 ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో వచ్చింది. వైవిధ్యంగల కథల్లో ఇదొకటి. దేశవిభజన, బంగ్లాదేశ్ ఏర్పాటులాంటి నేపథ్యంలో ఎన్నో నవలలు, కథలు వచ్చినా భౌగోళికంగా ఈ రెండు దేశాలతోటీ ఎలాంటి సంబంధమూ లేని ప్రాంతపు భాషైన తెలుగులో ఇలాంటి కథ రావటం, గొప్ప విషయం. చాలా గాఢతగల కథ. ఆ సంఘటనలు జరిగి ఎన్నో దశాబ్దాలైనా, వాటి తాలూకు పరిణామాలు ప్రత్యక్షంగా అనుభవించినవారు చాలామంది చనిపోవటమో, వయోవృద్ధులవటమో జరిగినా, అవి ఆ ప్రజలనీ, వారి కుటుంబాలనీ దాటి పోవు. జ్ఞాపకాలుగా మనసుల్లో సుళ్ళు తిరుగుతూ వుంటాయి. ఓ తరాన్నుంచీ ఇంకో తరానికి ప్రయాణిస్తాయి.కొందరు చల్లారిన నిప్పులా వుంటే ఇంకొందరు జ్వలిస్తున్న జ్వాలలా వుంటారు. ఆ గాయాలతాలూకు మచ్చలు చరిత్ర పాఠాలుగానో, మ్యూజియంలో ఎగ్జిబిట్స్‌గానో మనకి ఎదురుపడతాయి. అలాంటి మారణహోమాన్ని జరిపినందుకు మానవజాతిపక్షాన జాతిమతకులప్రాంతాలకి అతీతంగా ఎంత వేదన కలుగుతుందో ఈ కథలో చదవచ్చు. చదవటం పూర్తిచేసాక ఎంతో ఆలోచనలో పడేస్తుంది.
కథంతా ప్రథమపురుషలో జరుగుతుంది. మొత్తం ఇరవైమంది ఈ మూడుదేశాలనుంచీ భారత్, పాకిస్థాన్, బాంగ్లాదేశ్‍ల మధ్య గల వుమ్మడి వారసత్వాన్ని గురించిన వర్క్‌షాప్‍కి ఢాకానగరానికి ఒక చివర్న వున్న అధ్యయనకేంద్రానికి వస్తారు. ఈ మూడుదేశాలమధ్య కొంత వుద్రిక్తమైన పరిస్థితి వుంది. దాన్ని మార్చాలనే ఒక ప్రయత్నం. పదిరోజుల కార్యక్రమం. పరిచయాలౌతాయి. కథకురాలు తనకోణంలోంచీ కథ చెప్తూ వుంటే సాజిద్, రోషనారాలచుట్టూ కథ తిరుగుతుంటుంది. రజా, సాజిద్, ఇంకొందరు పాకిస్తానీయులు. జపా, రోషనార బంగ్లాదేశీయులు. భోజనాలగదిలో కథ మొదలౌతుంది. సాజిద్‍కి రోషనార అంటే మొదటిచూపులోనే ఒకవిధమైన ఆకర్షణ మొదలౌతుంది. ఒక్కర్తీ కూర్చుని తింటుంటే సాజిద్ ఆమెకి కంపెనీ ఇవ్వాలని వెళ్తాడు. ఆమె తింటున్న పళ్ళేన్ని విసిరికొట్టి కోపంగా లేచి వెళ్ళిపోతుంది. అంతా ఆశ్చర్యపోతారు.
మొదటిరోజుకి వున్న బెరుకు రెండోరోజుకి పోతుంది. తమ ప్రాజెక్టుగురించి ఆలోచనలని పంచుకుంటారు. ఖాళీసమయాలని ఆటపాటల్తో గడుపుతారు. హైలమ్ అనే అమ్మాయి ఆరోజు తన గదిలో వుండమని అడిగితే రోషనార వప్పుకుంటుందిగానీ అప్పటిదాకా సరదాగా వున్నదల్లా సాజిద్‍ని చూడగానే లేచి వెళ్ళిపోతుంది. అలాంటివే ఇంకొన్ని సంఘటనలు జరుగుతాయి. రజా, సాజిద్ వాలీబాల్ కోర్టువైపు వెళ్తే అక్కడి స్థానికులు వాళ్ళని కొట్టబోతారు.
ఎప్పుడో చరిత్రలో ఏవో జరిగాయి. “అప్పటికి నేనింకా పుట్టనే లేదు. నేనెలా బాధ్యుడిని?” అని కోపంతో మండిపడతాడు సాజిద్.
ఆ తర్వాత జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లోకూడా రోషనార భాగం పంచుకోదు. అసలు ఆస్వాదించకుండా దూరంగా వుండిపోతుంది. ఇలాంటి అమ్మాయి, స్నేహభావం ఏమాత్రం లేని అమ్మాయి ఈ సదస్సుకి ఎందుకు వచ్చినట్టో మిగిలినవాళ్ళకి అర్థమవదు. సాజిద్ ఆమె తనతో అలా ఎందుకు ప్రవర్తిస్తోందో అర్థం చేసుకోలేక ఆమెతో సఖ్యతకోసం ప్రయత్నిస్తుంటాడు. చివరికి మనసు విరిగిపోతుంది.
ఢాకాలో మ్యూజియంకి వెళ్తారు. అక్కడ చూస్తారు, పాకిస్తాన్ సైనికులు వారిపట్ల చేసిన అకృత్యాల సాక్ష్యాలని. చలించిపోతారు. ఆ చేదుజ్ఞాపకాలని రోషనార మనసులో ఎంత మోస్తోందో అర్థమౌతుంది. సాజిద్ ఆమెకి తన దేశం పక్షాన క్షమాపణ చెప్పాలనుకుంటాడు. అందరూ కలిసి వెళ్తారు సాజిద్ క్షమార్పణతో కథ ముగుస్తుంది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.