Youtubers please WhatsApp to 7382342850
హైదరాబాదునుంచీ వస్తున్నాను. అవంతిపురం వెళ్ళాలి. కారు ఫ్రంట్‍షీల్డ్‌మీద వర్షపుచినుకులు పడి స్ట్రీట్‍లైట్ల వెలుతుర్లో తళుక్కుమని వైపర్స్ తగలగానే జారిపోతున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల్నించీ ఎడతెరిపిలేని వర్షం ఉందక్కడ. ఇక్కడా అదే పరిస్థితిలాగుంది. కనుచూపుమేరంతా వర్షానికి నానిపోయినట్టుంది. ఎదురుగా నల్లటి తారురోడ్డు ప్రస్ఫుటంగా మెరుస్తోంది.
తెల్లారి నాలుగున్నరకి పెళ్ళి ముహూర్తం. నాదే. మూడురోజుల ముందునించే లీవు పెట్టాను కానీ ఆఫీసులో ఫ్రాడొకటి బయటపడటంతో రిలీవ్ కాలేక పోయాను.
“పోస్ట్‌పోన్ చెయ్యలేరా?” జీ ఎం పొలైట్‍గా అడిగాడు. ఈ సందర్భంలో నేనిక్కడ వుండటం వాళ్ళకి చాలా అవసరం. అలాగని నా అవసరానికి విరుద్ధంగా ఉండమని గట్టిగా చెప్పలేకపోతున్నారు.
“అదింకా పెద్ద ఫ్రాడౌతుంది సర్” చిన్నగా నవ్వి చెప్పాను. “ఇన్విటేషన్ కార్డ్స్ వెళ్ళిపోయి, బంధువులంతా వచ్చేసి ఉంటారు. పెళ్ళిమంటపం, కేటరింగు… ఒక్కటేమిటి ? అన్నీ … ఆర్డరిచ్చేసి ఉంటారు. ఇప్పుడు ముహూర్తం వాయిదా వెయ్యటమంటే సాధ్యపడదు. ముఖ్యమైన కార్యక్రమాలు అవగానే వెంటనే వచ్చి జాయినౌతాను” నచ్చజెప్పి బైటపడ్డాను. కొన్ని వుద్యోగాలంతే. నా మితృడు ఒకరు పోస్ట్‌మాస్టర్‍గా చేసేవాడు. పల్లెటూళ్ళో. ఆఫీసులో అతనొక్కడే. మిగిలినవాళ్ళంతా సబ్‍స్టాఫ్. పెళ్ళికి సెలవు పెడితే రిలీవరు రాలేదట. రాత్రిముహూర్తం కావటంతో డ్యూటీలోనే వుండి పెళ్ళి చేసుకున్నాడట. తర్వాత రిలీవరు వచ్చాడు. అది వేరే విషయం.
కారు చాలా స్మూత్‍గా పోతోంది. విడిదింట్లోకి డైరెక్టుగా వెళ్ళిపోవటమే. అమ్మావాళ్ళూ ఉదయమే వచ్చామని ఫోన్‍చేసి చెప్పారు. “స్నాతకం ఎలారా?” అంటోంది అమ్మ.
నేనింకా రాలేదని ఆడపెళ్ళివారు తెగ కంగారుపడుతున్నారట. మాటిమాటికీ వచ్చి అడుగుతున్నారట. ఇవన్నీ చెప్పి, “వాళ్ళని మరీ అంత కంగారుపెట్టడం బావోదు. వీలైనంత తొందరగా వచ్చెయ్. ఆఫీసూ, పనీ ఎప్పుడూ వుండేవే. ఇలాంటప్పుడు కూడా వదిలిపెట్టకపోతే ఎలా?” అని మందలించింది అమ్మ.
ఒకప్పుడు పదహార్రోజులపాటు పెళ్ళి వేడుకలు జరుపుకునేవారట. తర్వాత మూడు రోజులకి దిగింది. అక్కయ్య పెళ్ళి కార్యక్రమాలు కరోజంతా జరిగాయి. నా దగ్గరికి వచ్చేసరికి వ్యవధి ఇంకా కుదించుకు పోతోంది. చిన్నగా నవ్వొచ్చింది.
యాక్సిలేటర్ రెయిజ్ చెయ్యబోతున్న నేను రోడ్డుకి మధ్యగా ఒక వ్యక్తి అడ్డు రావటంతో స్లో చేశాను. అతను ఆపమన్నట్లు చెయ్యూపుతున్నాడు. చుట్టూ చూశాను. కొద్దిదూరంలో ఒక కారు రోడ్డుమీంచీ కొంచెం దిగి బురదలో కూరుకుపోయి ఉంది. బహుశః అది అతనిదే అయుంటుంది.
“లిఫ్ట్ ప్లీజ్” దగ్గరికి వస్తూ అడిగాడు. మనిషి నిలువునా తడిసిపోయి ఉన్నాడు. ఏదో అర్జెంటు పని మీద వెళ్తుంటే ఈ అవాంతరం వచ్చినట్టు ముఖంలో నిస్సహాయత కనిపిస్తోంది.
కారాపాను.
“కోటగుడిదాకా… లిఫ్ట్ ఇవ్వగలరా ప్లీజ్?” అడిగాడు.
అసలే టైమ్ లేదు. అతని కోసం మరో పావుగంటో… అరగంటో… కానీ కాదనలేక పోయాను.
“ఎక్కండి” అయిష్టంగానే అన్నాను.
అతను ఎక్కి కూర్చున్నాడు.
“సారీ, మిమ్మల్ని చాలా యిబ్బంది పెడుతున్నాను” సీట్లో సర్దుకుని రుమాలుతో జుత్తులోంచీ మొహంమీదికి జారిపడుతున్న నీళ్ళని తుడుచుకుంటూ చెప్పాడు.
“పర్వాలేదు” అని నా టవల్ ఇచ్చి, పాకెట్‍లోంచీ డన్‍హిల్స్ తీసి, నేనొకటి వెలిగించుకుని, అతనికొకటి ఇచ్చాను. అందుకుంటూ, “దయచేసి త్వరగా పోనివ్వగలరా?” అడిగాడు.
నేను స్పీడ్ పెంచాను.
కొద్దిసేపు మేమేం మాట్లాడుకోలేదు.
“నాకీ వూరు కొత్త. ఎప్పుడూ రాలేదు. నా ఫ్రెండ్ చెప్పిన గుర్తుల ప్రకారం వస్తున్నాను. ఇంతలో వెనక వస్తున్న లారీకి సైడివ్వటంకోసం కొంచెం రోడ్డు దిగానంతే. స్కిడైంది. లారీ వెళ్ళిపోయింది. పావుగంటనుంచీ ఎదురుచూస్తున్నాను. ఏదైనా వెహికిల్ వస్తుందేమోనని… వర్షంచేతనేమో. ఒక్క ఆటోకూడా లేదు” అన్నాడతను మౌనాన్ని ఛేదిస్తూ.
“కోటగుడి దగ్గర ఎక్కడికి?”
వెంటనే జవాబివ్వడానికి అతను మొహమాటపడ్డాడు. కొంచెం ఇబ్బందిగా నవ్వాడు. తర్వాత అన్నాడు. “నా ఫీయాన్సీ ఎదురుచూస్తుంటుంది అక్కడ. ఆమెని తీసుకుని వెళ్ళిపోవాలి. కారు పాడైందికాబట్టి ఇప్పుడింక ఏదైనా రైలు పట్టుకోవాలి”
ఇంతరాత్రి… ఈ వానలో?.. దిగ్భ్రమతో తలతిప్పి చూసి, అడిగాను.
“ప్రేమ కూడా యుద్ధంలాంటిదేట కదండీ? గెలవాలంటే కష్టనిష్టూరాలని పట్టించుకోకూడదు” అన్నాడతను.
చాలా మామూలుగా జరిగిన యీ సంఘటనతో ఒక ఆడపిల్ల జీవితం ముడిపడి వుందనేసరికి నాకు కొంత కుతూహలం కలిగింది. బెరుకు, భయం కూడా కలిగాయి. ఇంకొంచెం వివరాలు తెలుసుకోవాలనుకున్నాను. నా పక్కని కూర్చుని ఉన్న ఈ వ్యక్తి సరైనవాడౌనో కాదో! నేను చేస్తున్న పని సమంజసమైనదేనా? ఇతన్ని దిగిపొమ్మంటే? ఇతనికోసం ఎదురుచూసే ఆ అమ్మాయి ఇతను రాలేదని ఏ ప్రాణమేనా తీసుకుంటే? లేదా ఒక్కర్తీ అక్కడ వుండటం చూసి ఎవరేనా ఏదేనా చేస్తే? ఎన్నో సంశయాలు నాలో.
“మీరేం చేస్తుంటారు? “అడిగాను.
ఎవరో తెలీని ఆ అమ్మాయికి కేర్‍టేకర్ పాత్ర వెయ్యసాగాను, ఇదంతా నాకు తెలీకుండానే… అంటే అప్రమేయంగానే జరిగిపోయింది. నా వుద్దేశ్యాలు అతనికి అర్థమైనట్టే వున్నాయి. అన్నీ చెప్పాడు. తన జాబ్, క్వాలిఫికేషన్, జీతం… అన్నీ. బీటెక్‍మీద ఎంబియ్యే చేసి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో చేస్తున్నాడట.
“మీ స్వంతవిషయాల్లో కలగజేసుకుంటున్నాననుకోకపోతే చెప్పండి. పెద్దవాళ్ళ అనుమతితో పెళ్ళి చేసుకోవచ్చు కద?” అడిగాను. నాగొంతులో కొంచెం కరుకుతనం వుంది. కానీ అతను పట్టించుకోలేదు.
నా ప్రశ్నకి అతను పెద్దగా నవ్వేశాడు. “ఏం చెప్పారు మిత్రమా! ప్రేమించుకున్నామని పిల్లలంటే పెద్దవాళ్ళు వొప్పుకుంటారండీ? అసలీ టీవీలూ సినిమాలూ వచ్చి వాళ్ళని మరీ చెడగొట్టేస్తున్నాయి. కోటా శ్రీనివాసరావులాగా, అమ్రిష్‍పురిలాగా తయారౌతున్నారు తండ్రులంతా” అన్నాడు
నవ్వుతూనే.
అతని మాటలకి నేనూ నవ్వేశాను. రెండునిమిషాలు పట్టింది నన్ను నేను కంట్రోల్ చేసుకోవటానికి. అప్పుడు చురుగ్గా అడిగాను, “హాస్యం వద్దు. ప్లీజ్, సీరియస్‍గా చెప్పండి. ఇంత చదువుకుని కూడా తల్లిదండ్రులకి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోవటమేమిటి?”
అతను కూడా సీరియసయ్యాడు. “మీకు మన ప్రస్తుతపు పెళ్ళిళ్ళ కాన్సెప్టు తెలుసా? అత్తలు కోడళ్ళని వెతుక్కుంటారు. మామలు అల్లుళ్లని వెతుక్కుంటారు. ఈ ప్రక్రియలో పెళ్ళిచేసుకునేవారిద్దరి ఇష్టానిష్టాలకిగానీ అభిరుచులకిగానీ ఏమాత్రం విలువలేదు” అన్నాడు.
అతని మాటలకి నేను జవాబు చెప్పలేకపోయాను. నిజమే! అక్కయ్య పెళ్ళికి నాన్న చాలా తిరిగాడు. తనకి అల్లుడనిపించుకోగలిగే అర్హతగల వ్యక్తికోసం. అలాగే నాకు భార్యని వెతికే బాధ్యత అమ్మ తీసుకుంది. వాళ్ళు చూపించిన వారిని మేము సరేనన్నాము.
” అంతేకాదు. ఈ పెళ్ళనేది ఆస్తి అంతస్తుల్నీ, కులగోత్రాలనీ, వంశమర్యాదల్నీ ప్రకటించుకునే వేదిక. అహాలని ప్రకటించుకుని పారస్పరికంగా సంతృప్తిపరచుకునే వేదిక, పిల్లల ఇష్టానిష్టాలని పట్టించుకుంటే ఆ అవకాశాలు పోతాయి…”
“మీరు పొరబడ్తున్నారేమో! ఆ పద్దతిని వప్పుకోవటంలో తప్పేమీ లేదు. అందరం సంతోషంగానే వుంటాం” వొప్పుకోలేకపోయాను.
“లేదు.” స్థిరంగా అన్నాడు. “ఆడపిల్ల పుట్టిందనగానే ఇంక పొదుపు ఉద్యమం మొదలుపెట్టాలనుకునే తల్లిదండ్రున్న వ్యవస్థ మనది. పైసపైస కూడబెట్టి దాచి, ఆ పిల్లకి ఘనంగా పెళ్ళిచేసి అత్తవారింటికి పంపి, ప్రయోజకులమనిపించుకోవాలన్నది వాళ్ళకి జీవితకాలపు ఆశయం. అందులో ఏ మాత్రం తేడా వచ్చినా తట్టుకోలేదు. అహం దెబ్బతింటుంది. అసలందుకే, ప్రేమ పెళ్ళిళ్ళకి విముఖత ఎదురయ్యేది ఆడపిల్లవైపునించే” అని,
“ఏ వ్యక్తీ మనసులోకి రానంతవరకూ మాత్రమే మీరు చెప్పినట్టు జరుగుతుంది. చదువులరీత్యాగానీ, వుద్యోగాలరీత్యాగానీ అనేక ప్రాంతాలకి వెళ్తున్నాం. కొత్తకొత్త పరిచయాలు జరుగుతున్నాయి. ఒకొక్కసారి ఎవరో ఒక వ్యక్తి నచ్చి, వారితో జీవితం బాగుంటుందనిపిస్తుంది. అలాంటప్పుడుకూడా తమకి నచ్చినవాళ్ళనే చేసుకొమ్మని పిల్లల్ని బలవంతపెట్టడం తప్పు” అన్నాడు.
ఔనేమో! వ్యక్తిగత అనుభవాలేగా, ధృక్పధాలని ఏర్పరిచేవీ, తద్వారా మనిషిని మరో మనిషినుంచీ వేరుపరిచి భిన్నంగా చూపించేవీ.
“మీ విషయం చెప్పండి”
“మాదీ అదే సమస్య. ఆమె తల్లిదండ్రులు వొప్పుకోలేదు”
“మీవాళ్ళు?”
“ఎదిగొచ్చిన కొడుకుని వదులుకోవటంకన్నా రాజీపడటం మంచిదనుకున్నారు?”
“అసలీ గొడవ దేనికి?”
“సర్వసాధారణమైన కారణమే”
అర్థమైంది.
“తను పీజీ చేసింది. ఇంట్లో సంబంధాలు చూడబోతే మాగురించి చెప్పిందట. అంతే… ఆమెకి నయానా భయానా చెప్పారు మనసు మార్చుకొమ్మని. వినలేదు. నన్నూ వాళ్ళ బంధువుల ద్వారా బెదిరించారు. ఆమె పారిపోకుండా కాపలా వుంచి, హడావిడిగా సంబంధం చూసి పెళ్ళి చేసేస్తున్నారు రేపు తెల్లారే ముహూర్తం”
నేను తుళ్ళిపడ్డాను. మనసులో కలవరంలాంటిదేదో లేచింది. దాన్ని అణిచేసే ప్రయత్నంగా అన్నాను “రేపు చాలా పెళ్ళిళ్లున్నట్టున్నాయి”
“ఔను. రేపు తప్పిస్తే మళ్ళీ మూడు నెలలదాకా ముహూర్తాలు లేవు”
మాటల్లో గమనించలేదు. మేం మెడికల్‍కాలేజి దాటేసాం. అంటే కోటగుడి వచ్చేసినట్టే.
ఒక ప్రశ్న అడగకుండా వుండలేక పోయాను. “మీమధ్యని అమాయకుడైన మరోవ్యక్తి ఇరుకునపడటం లేదూ?”
“మనసులేని పిల్లతో అతను మాత్రం సంతోషంగా వుండగలడా? పెళ్ళయాక ఆమె మారితే సంతోషమే. లేకపోతే? నాకు తెలిసి, తనంత తేలిగ్గా నన్ను మర్చిపోలేదు. చావనైనా చస్తానని తెగేసి చెప్పేసింది. అందుకే ఇలా రావల్సి వచ్చింది”
“మొదటే అతన్తో చెప్తే బావుంటుంది కదా?!”
అతను కొద్దిక్షణాలు మాట్లాడలేదు. తరువాత నెమ్మదిగా అన్నాడు.” ఈ విషయాలు మీరనుకున్నంత సాదాగా వుండవు. చాలా ముళ్ళుంటాయి దానికి. అన్నీ సందిగ్ధాలే. నేను దీన్ని సమర్ధించటం లేదు. పెళ్ళికొడుకుతో చర్చించి, నాకు నువ్వంటే ఇష్టంలేదు. నిన్ను చేసుకోలేను, అని చెప్పి సంబంధాన్ని తిరగ్గొట్టుకోవటంవలన ఆమెకి ప్రయోజనం వుండదు. అతనెలా తీసుకుంటాడో తెలీదు. ఆమె వున్న వత్తిడిలో తల్లిదండ్రులకి చేస్తున్న ద్రోహంకన్నా, పెళ్ళికొడుక్కి చేస్తున్నది పెద్దదనిపించదు. “
“నైతికత…?”
“అతను తను నమ్మకస్తుడినని నిరూపించుకున్నాడా?”
“అంటే?”
“నాన్నకి నచ్చే కట్నమిచ్చి, అమ్మకి నచ్చేలా పనిపాటలొచ్చి, అక్కచెల్లెళ్ళతో సర్దుకుపోయే సరళస్వభావం వుండి, తన కోసం అందం,చదువు, వుద్యోగం వుంటే చాలనుకునే అబ్బాయిల విషయంలో నైతికతేమిటి? ఈ ప్రేమవిషయం లేకపోతే నేనేనా అంతే. అతనుకూడా ఈ సమాజంలోనివాడేగా? సమాజం ఇచ్చే మంచిని ఆస్వాదించినట్టు చెడుకూడా స్వీకరించక తప్పదు” అతని మాటలు పదునుగా ఉన్నాయి. నన్ను ఆలోచనలో పడేశాయి. మరీ అంతలా కాకపోయినా, పెళ్ళినిర్ణయం అమ్మావాళ్ళకేకదా, వదిలేసింది నేను? అంతలోనే నవ్వు వచ్చింది. రేప్పొద్దున్న… అంటే ఇంకొన్ని గంటల వ్యవధిలో పెళ్ళి పెట్టుకుని… ఇప్పుడు ఆలోచనేమిటి?
“మెడికల్ కాలేజి దాటిపోయాము కదూ?” అడిగాడు.
“మీకీ వూరు కొత్తన్నారు?” గుర్తుచేశాను.
“మై క్లెవర్ ఫియాన్సీ… అన్నీ వివరంగా రాసింది. మెడికల్ కాలేజిదగ్గర కోటలోని గుడికి వెళ్ళే దారి ఉంటుందట. అక్కడ నిలబడతానంది”
నేనక్కడ ఆపాను. ఒక ఆటో మాత్రం ఉందక్కడ.
“మీకు చాలా ట్రబులిచ్చాను. కానీ మీరు చేసిన హెల్ప్… వృధా అయిన మీ సమయంకన్నా విలువైనది. చాలా థేంక్స్… బైదిబై… మీరెక్కడ చేస్తారు?” అడిగాడు. నేను నా విజిటింగ్ కార్డిచ్చాను. దాన్ని జేబులో పెట్టుకుని, మరోసారి థాంక్స్ చెప్పి కారు దిగాడు.
అతన్ని చూసి, ఆటోలోంచీ ఒకమ్మాయి దిగింది. నేను కారు టర్న్ చెయ్యబోయాను. ఆమె అతనికి అభిముఖంగా నడుస్తోంది. ఆ క్రీనీడ ఆమె ముఖంమీద పడ్తోంది. ఆమెని ఒక్కసారి చూడాలన్న కుతూహలం… జస్ట్… కుతూహలం… నన్నాపింది.
అతను కారు చూపించి ఏదో చెప్తున్నాడు. జరిగినదాన్నిగురించి కాబోలు. ఆమె వున్నట్టుండి తలతిప్పింది.
షాకయ్యాను.
“మై మేరేజ్ విత్ ఇందూ… ” డాష్‍బోర్డుమీద శుభలేఖ నన్ను వెక్కిరించింది. తేరుకుని ఒక్కసారి కారుని ఉరికించాను. పెళ్ళింటికి కాదు. అక్కడింక నా అవసరం లేదు.
(8 ఏప్రిల్ 2001 ఆదివారం ఆంధ్రభూమి )
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ. మొదటి కథ “అనగనగా” 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ,తిరస్కృతులు, నీకోసం నేను అనేనవలలకి ఆంధ్రభూమి ద్వితీయ 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005కిగాను వచ్చింది. “ఎంతెంతదూరం?” అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.
పెళ్ళికొడుకు లోపల వాస్తవాన్ని జీర్ణించుకునేంత సంస్కారం ఉండటం వల్ల కథ సుఖాంతం అయింది.
లేదంటే తర్వాత సన్నివేషాలలో అన్నీ మూర్ఖపు వాదనలు వినవలసి వస్తుంది….
కథ చాన బాగుంది అమ్మా….