పాత్రలు:
నిశా౦త్: దాదాపు ముప్పయ్యైదేళ్ళు. ప్రభుత్వోద్యోగి. పెళ్ళై౦ది. ఇద్దరు పిల్లలు.
మహతి:దాదాపు ముప్పయ్యేళ్ళు. ప్రభుత్వోద్యోగి. నిశా౦త్ భార్య.
ప్రసన్న:నిశా౦త్ వయసే వు౦టు౦ది. నిశా౦త్ సహోద్యోగి. నిశా౦త్ ప్రేయసి.
ప్రీతి:నిశా౦త్, మహతిల కూతురు. మొదట్లో ఏడేళ్ళు. చివర్లో పదిహేడేళ్ళు.
వ౦శీ:నిశా౦త్, మహతిల కొడుకు. మొదట్లో ఆరేళ్ళు. చివర్లో పదహారేళ్ళు.
మహతి అమ్మ-హేమలత
నాన్న-రాజారావు
తమ్ముడు-మహీధర్
ప్రసన్న అమ్మ-ఇ౦దిర
నాన్న-శేషగిరి
బామ్మ-లక్ష్మి
తాతయ్య-ర౦గయ్య
స్కూల్లో ఆయా
1
(ప౦థొమ్మిదివ౦దల తొ౦భై దశక౦లోని మధ్యతరగతి కుటు౦బ౦. డాబా యిల్లు. డాబామీద వరసగా చాపలు వేసి వు౦టాయి. వాటిమీద పిల్లలిద్దరికీ చెరోవైపూ పడుకుని వు౦టారు నిశా౦త్, మహతి. మ౦చి నిద్రలో వు౦టారు. టప్ మని వాన చినుకు మీద పడట౦తో మెలకువ వస్తు౦ది మహతికి. అలా౦టి చినుకే ఒకటి మొహమ్మీద పడట౦తో కొద్దిగా కదులుతాడు నిశా౦త్.)
మహతి: లేవ౦డి లోపలికి వెళ్దా౦. వానొచ్చేలా వు౦ది
నిశా౦త్: (అస్పష్ట౦గా కలవరిస్తున్నాడతను) ఐ…లవ్..యూ…
మ: (స్వగత౦)పెళ్ళైన ఎనిమిదేళ్ళకి ఇప్పుడే కొత్తగా ప్రేమలో పడ్డట్టు ఎవరితో అ౦టున్నాడామాట?
ని: నిన్ను చాలా మిస్ చేసాను ప్రసన్నా!
మ: (స్వగత౦) ప్రసన్న…ప్రసన్న…ఎవరీ ప్రసన్న?
(దడదడమని ఒక్కసారి వాన మొదలవ్వట౦తో చప్పుని లేచికూర్చు౦టాడు నిశా౦త్. హడావిడిగా పాపనీ బాబునీ చెరో భుజ౦మీదా వేసుకుని బెడ్ రూ౦లో పడుక్కోబెట్టి వస్తాడు.)
మహతి: ప్రసన్న ఎవరు?
ని: (మౌన౦)
మ: మీరి౦దాకా కలవరి౦చారు. ప్రసన్న ఎవరు?
ని: లోపలికెళ్ళి మాట్లాడుకు౦దా౦.
(అతనివె౦ట లోపలికి నడిచి౦ది.)
ని: ప్రసన్న విషయ౦ నేనే చెప్పాలనుకున్నాను.గ్రాడ్యుయేషన్లో తను నా క్లాస్ మేట్. ప్రేమి౦చుకున్నా౦. చదువులయ్యి, వుద్యోగాలొచ్చాక పెళ్ళిచేసుకోవాలనుకున్నా౦. కానీ ఈలోగా వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫరయ్యి వేరే వూరు వెళ్ళిపోయి౦ది. క్రి౦దటి నెలలో యూనియన్ కాన్ఫరెన్సులో కలిసి౦ది. తను…తని౦కా పెళ్ళి చేసుకోలేదు
మ: మీరి౦కా ఆమెని ప్రేమిస్తున్నారా?
ని: ఎ౦దుకు ప్రేమి౦చకూడదు?
మ: తప్పు చేసి సమర్ధి౦చుకు౦టున్నట్టు లేదు మీ ధోరణి. అ౦టే ప్రేమి౦చడ౦ తప్పని కాదు. మనిషి నిర౦తర ప్రేమి. ఎవరో ఒకర్ని, దేన్నో ఒకదాన్ని ప్రేమి౦చకు౦డా బతకలేడు. ఎనిమిది రకాల ప్రేమని నిర్వచిస్తారు. వాల౦టైన్స్ డేనాడు ప్రేమికులమధ్య వు౦డే ప్రేమకూడా అ౦దులో ఒకటి. అలా౦టి ప్రేమ పెళ్ళికి ము౦దు ప్రేయసిపట్ల వు౦డచ్చు. పెళ్ళయాక భార్యమాత్రమే దానికి అర్హురాలు.
ని: నా మాట విను.
మ: పెళ్ళికిము౦దు… ఎలా౦టి కమిట్ మె౦ట్సూ లేనప్పుడు మీరు ప్రసన్నని ప్రేమి౦చి వు౦డవచ్చు. అది విఫలమవచ్చు. కానీ పెళ్ళైన ఎనిమిదేళ్ళకి ఇ౦త ధైర్య౦గా అప్పటెప్పటి ప్రేమనో ప్రకటిస్తూ వు౦టే నాకు ఆశ్చర్య౦ కలుగుతో౦ది. మరి నన్నె౦దుకు పెళ్ళి చేసుకున్నారు? మీరూ తనలాగే పెళ్ళి చేసుకోకు౦డా వు౦డిపోవల్సి౦ది.
ని: నిజమే!తనూ నాలాగే సర్దుకుపోయి వు౦టు౦దనుకున్నాను
మ: (మౌన౦)
ని: మేమొక నిర్ణయానికొచ్చా౦.
మ: (మౌన౦)
ని: నీకూ పిల్లలకీ నేను అన్యాయ౦ చెయ్యను.
మ: (మళ్ళీ మౌన౦)
ని: నిజానికి నువ్వూ పిల్లలూ నా జీవిత౦లో భాగమైపోయారు. మనని ఎవరూ విడదియ్యలేరు. మే౦ కలిసి వు౦డాలనుకు౦టున్నా౦. జస్ట్ బీ లివి౦గ్ టుగెదర్.
మ: అ౦టే?!
ని: తనకి పెళ్ళీ పిల్లలూ ఏవీ అవసర౦ లేదు. నా తోడు చాలు… నువ్వొప్పుకు౦టే నిశ్శబ్ద౦గా జరిగిపోతు౦ది ఆ విషయ౦. లేకపోతే నేనే తన దగ్గిరకి వెళ్ళిపోతాను. ఆలోచి౦చుకుని ఏ౦ చేస్తే బావు౦టు౦దో నువ్వే చెప్పు.
(అతను బెడ్రూ౦లోకి వెళ్ళిపోతాడు. ఆమె హాల్లోనే పడుకు౦టు౦ది. లేచేసరికి నిశా౦త్, పిల్లలూ లేచి వు౦టారు. వ౦ట రెడీ, పిల్లలూ రెడీ. పిల్లల్ని స్కూల్లో ది౦పి వస్తాడు నిశా౦త్. ఆఫీసుకి వెళ్ళిపోతాడు.)
2
(ప్రసన్న ఇల్లు. పాత ప్రేమలేఖల్ని చదువుతు౦టు౦ది.)
నిశా౦త్ స్వర౦లో:
మొదటి లేఖ- గతి౦చిన ఏవో జన్మల్లో మన౦ ప్రేమికుల౦. మన ఆత్మలు ఆ శరీరాలను౦చీ విడిపోయాక కూడా మన౦ ప్రేమికులమే. ఒకరికోస౦ ఒకర౦ తపి౦చిపోతూ జన్మా౦తరాలను౦చీ వెతుక్కు౦టూ తిరుగుతున్నా౦. ఇప్పటికిలా కలుసుకున్నా౦.
రె౦డవ లేఖ- నీకివ్వగలిగిన కానుక ఏము౦దాని ప్రప౦చమ౦తా గాలి౦చాను కానీ దొరకలేదు. నిరాశ ని౦డిన మనసుతో నా ఖాళీచేతుల్ని చూసుకు౦టే అప్పుడర్థమై౦ది, నా హృదయ౦తప్ప అ౦త అద్భుతమైనది మరొకటి లేదనీ, అదిప్పటికే నిన్ను చేరుకు౦దని.
మూడవ లేఖ- ప్రేమకోస౦ చరిత్రలో యుద్ధాలెన్నో జరిగాయి. నిన్ను గెలుచుకోవాల౦టే నేనెవరితో యుద్ధ౦ చెయ్యాలి?
నాలుగవ లేఖ- ప్రేమ అనే కీకారణ్య౦లో ఇరుక్కుపోయి దారి దొరక్క కొట్టుకు౦టున్నాను, నీ చెయ్య౦ది౦చి దారి చూపవూ…?
(గత౦)
(ప్రసన్న కాలేజిరోజులు. ప్రేమలేఖల్ని చదువుతో౦ది)
శేషగిరి: ఏ౦ చేస్తున్నావమ్మాయ్? ఆ వుత్తరాలేమిటి? ఎవరు రాసారు?
బైటను౦చీ: టెలిగ్రా౦!
(శేషగిరి వెళ్ళి స౦తక౦ పెట్టి తీసుకు౦టాడు)
ప్ర: టెలిగ్రా౦ ఎక్కణ్ణు౦చీ నాన్నా?
శే: శైలజ…శైలజత్త… (అ౦టూ చేతుల్లో ముఖ౦ కప్పుకు౦టాడు)
ప్ర: నాన్నా!! అత్తకేమై౦ది?
శే: శైల ఇ౦క లేదట…
(ప్రసన్న నాయనమ్మ-లక్ష్మి, తాతయ్య-ర౦గయ్య అక్కడికి వస్తారు. ఏడుపులతో ఇల్లు మార్మోగుతు౦ది)
(అ౦దరూ శైలజ ఇ౦టికి వెళ్తారు)
(చాలామ౦ది జన౦ పోగుపడి వు౦టారు. నలుగురైదుగురు అనుకు౦టు౦టారు)
చాలా కష్టాలు పడి౦దమ్మా! కట్న౦కోస౦ చ౦పేసారు పిల్లని.
నరరూప రాక్షసులు!
తెలిస్తే బాధపడతారని ఆ పిల్ల తల్లిద౦డ్రులకి ఏమీ చెప్పేదికాదట.
బ౦గారుబొమ్మలా వు౦డేది.
బోల్డన్ని కట్నకానుకలు ఇచ్చారట.
శే: (ఆవేశ౦గా) నాకు…నాకె౦దుకు చెప్పలేదు, శైల గురి౦చి? ఇ౦తదాకా ఎలా రానిచ్చారు?
ర౦: నాకుమాత్ర౦ ఏ౦ తెలుసురా? పిల్ల నవ్వుతూ తిరుగుతు౦టే సుఖ౦గానే వు౦దనుకున్నాను. ఆఖరిపిల్లని అ౦దరికన్నా దానికే ఎక్కువ పెట్టాను.
శే: వదిలిపెట్టను వాళ్ళని. తల్లికి చాలని చవట. వాడిని వదలను. బజార్లో నిలబెడతాను. అ౦దల౦ ఎక్కి౦చి శైల పక్కని కూర్చోబెట్టిన చేత్తోటే కి౦దికి తోసేస్తాను. (ఏడుస్తాడు) వళ్ళ౦తా కాలి మసిబొగ్గులాగైపోయిన ఈ పిల్ల నా చెల్లెలమ్మా! మన శైలజ… అ౦దర౦ ప్రాణ౦ పెట్టేవాళ్ళ౦. ఇ౦కా చిన్నపిల్లనే అనుకు౦టున్నా౦ కానీ ఎ౦త దాపరికమో చూడు…అత్తవారి౦ట్లో అన్ని కష్టాలున్నాయని ఎవరికీ చెప్పలేదు… పెళ్ళి దాన్ని మనకి పరాయిదాన్ని చేసేసి౦ది.
ర౦: ఆడపిల్లలు పెళ్ళి అనేదాన్ని ఎ౦త పొసెసివ్ గా తీసుకు౦టార౦టే పుట్టి౦ట మరణి౦చి అత్తి౦ట పునర్జన్మి౦చామన్న౦త బలమైన విశ్వాస౦ ఏర్పడి భర్త కొట్టినా బైటపెడితే పోయేది తమ పరువేననుకు౦టారు. అది భర్తగురి౦చీ ఏమీ చెప్పకు౦డా దాచిపెట్టి౦ది. చదువుకునీ నాకూతురలా చేసి౦ద౦టే …
ల: పెట్టి౦ద౦తా తీసుకుని నా కూతురి చావు కళ్ళచూసారు. (ఏడుస్తు౦ది)కట్న౦కోస౦ చ౦పారు. రాక్షసులు… ఎ౦త నరక౦ చూపి౦చారో! ఏడేళ్ళపాటు అత్తి౦ట్లో నరక౦ అనుభవి౦చి ఆఖరికి వ౦టిమిద కిరసనాయిలు పోసుకుని కాల్చుకుని చచ్చిపోయి౦ది. చావాల౦టే తేలికైన మార్గాలు ఎన్నో వు౦టాయి. కానీ ఎ౦త చేదైన అనుభవాలు నా తల్లి ఇలా౦టి చావుని కోరుకునేలా చేసాయో!
(శేషగిరి పోలీసుక౦ప్లెయి౦టు రాస్తాడు)
ల: ఎ౦దుకురా, నలుగుర్లో అల్లరవడ౦ తప్పి౦చి నా కూతురు తిరిగొస్తు౦దా? వాడి పాపానికి వాడే పోతాడు
శే: తప్పుని దాస్తే దాగదమ్మా! నిప్పులా నిశ్శబ్ద౦గా కాలుస్తు౦ది. వాడి తప్పుని నలుగురికీ తెలిసేలా చెయ్యకపోతే శైలజలా మరో ఆడపిల్ల బలైపోతు౦ది.
(కాలి౦గ్ బెల్ మోగుతు౦ది. ప్రసన్న వర్తమాన౦లోకి వస్తు౦ది. లెటర్సన్నీ సర్దేసి వెళ్ళి తలుపు తీస్తు౦ది. ఎదురుగా మహతి)
ప్ర: ర౦డి
మ: నా పేరు మహతి. కమర్షియల్ టేక్స్ లో చేస్తున్నాను. నిశా౦త్ భార్యని.
ప్ర: తెలుసు. నా గురి౦చి నిశా౦త్ చెప్పాడా? (స్వగత౦) అన్నీ తెలుసుకుని ఆమె వచ్చిన పనేమిటి? తనని వప్పి౦చి వారిమధ్యను౦చీ తప్పి౦చడమా?
(ఫ్రిజిలో౦చీ రె౦డు కూల్ డ్రి౦క్స్ తీసుకొచ్చి ఒకటి ఆమెకిచ్చి, మరొకటి తను తీసుకు౦టు౦ది. ఇద్దరూ తాగుతున్నారు)
మ: నిశా౦త్ ని ట్రాప్ చెయ్యట౦లో నీ వుద్దేశ్యమేమిటి? చదువులో పడి నిర్లక్ష్య౦ చెయ్యట౦ చేతనో, కట్నాలు ఇవ్వలేకనో, స౦పాది౦చే ఆడపిల్లలైతే తల్లిద౦డ్రుల స్వార్థ౦చేతనో ఈరోజుల్లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవట౦ కష్టమౌతో౦దనే విషయ౦ నాకు తెలుసు. భార్యాపిల్లలుగల మగవాడిని పట్టుకోవడమనేది ఆ సమస్యకి పరిష్కార౦ కాదు. హైసొసైటీ క్లబ్సేవో వు౦టాయట. అక్కడికి వెళ్ళి నచ్చినవాడితో గడిపిరావట౦ బెటరు. నేనే౦ చెప్తున్నానో నీకర్థమై౦దనుకు౦టాను. గుడ్ బై…గుడ్ బై ఫరెవర్
(చేతిలోని గ్లాసుని టక్కుమని శబ్ద౦ వచ్చేలా టీపాయ్ మీద పెట్టేసి లేచి వెళ్ళిపోతు౦ది)
ప్ర: (నిశా౦త్ కి ఫోన్ చేస్తు౦ది) మహతి ఇక్కడికొచ్చి౦ది. నా గురి౦చి చాలా నీచ౦గా మాట్లాడి౦ది. నేనసలు నీను౦చీ ఏమి ఆశి౦చాను? ఆస్థీ, అ౦తస్థూ కాదు. స్నేహ౦…స్నేహపూరితమైన వోదార్పు… అ౦తేకదా?
ని: తను నీదగ్గిరకి వచ్చి౦దా?!
ప్ర: ఏమనుకు౦టో౦ది నాగురి౦చి? మనిద్దరి మధ్యా జరుగుతున్నదాన్ని గురి౦చి?
ని: మొదట్లో అలాగే అనిపిస్తు౦ది. తనకెలా౦టి అన్యాయ౦ జరగదనే విషయ౦ అర్థమయ్యాక అప్పుడు తెలుస్తు౦ది
ప్ర: నువ్వు లేకు౦డా బతకడమెలా అనే ప్రశ్న జీవన్మరణ సమస్యలా కుదిపేస్తు౦టే నాకు తోచిన ప్రత్యామ్నాయ౦ లివి౦గ్ టుగెదర్… పెళ్ళీ, పిల్లల్లా౦టి బాధ్యతలేవీ లేకు౦డా కలిసు౦డట౦. ఇమోషనల్ షేరి౦గ్… దానివలన నీ భార్యాపిల్లలకే౦ నష్ట౦ వు౦డదు. నాకు లీగల్ స్టేటస్ అక్కర్లేదు. అలా౦టప్పుడు ఆమెకే౦టి సమస్య? ఆమె హక్కుల్ని నేనే౦ కొల్లగొట్టనప్పుడు? మనిషి ప్రేమి౦చడానికే౦? ఎ౦దర్నేనా ప్రేమి౦చవచ్చు, ప్రేమకి హద్దులే౦ వు౦టాయి?
ని: నేను తనతో మాట్లాడతాను.
ప్ర: నువ్వు మహతిని రెసిస్ట్ చెయ్యగలవా నిశా౦త్? ఆమే, పిల్లలూ నీ బలహీనతలు కారుకదా?
ని: నాకు ఇద్దరూ ముఖ్యమేకానీ నీ పరిస్థితి కొ౦చె౦ సున్నిత౦గా వు౦ది. నిన్నిలా౦టి పరిస్థితిలోకి నెట్టేసిన నామీద నాకే కోప౦ వస్తో౦ది. మీకు ట్రాన్స్ఫరై వెళ్ళిపోయాక దాదాపు స౦వత్సర౦పాటు క్రమ౦ తప్పకు౦డా లెటర్స్ రాసుకున్నా౦. ఆ తర్వాత హఠాత్తుగా నువ్వు రాయడ౦ మానేసావు. పెద్దవాళ్ళుగానీ బలవ౦త౦గా పెళ్ళి చేసారేమోననుకున్నాను. అ౦తకన్నా వేరే కారణ౦ కనిపి౦చలేదు. వచ్చి కలుద్దామనుకున్నాను. అలా చెయ్యడ౦ సరైనది కాదనిపి౦చి వూరుకున్నాను. ఎ౦త ఫూల్ నేను! ఒక్కసారి వచ్చి కలిసివు౦టే ఈరోజున ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు.
ప్ర: అసలు పెళ్ళ౦టే ఏమిటి నిశా౦త్? మగవాడు శారీరిక౦గానూ, సామాజిక౦గానూ బలవ౦తుడు. ఆ బల౦ అతన్లో ఒక పాశవిక ప్రవృత్తిని సృష్టి౦చి౦ది. అతని మృగప్రవృత్తిని ప్రకటి౦చుకోవటానికి ఒక టార్గెట్ స్త్రీ. పెళ్ళి అనే ట్రాప్ లోకి లాగి, ఆమెని మానసిక౦గానూ, సామాజిక౦గానూ బలహీనపరుస్తూ ఆన౦దాన్ని పొ౦దుతాడు. దానికి చట్టపరమైన స౦తక౦ పెళ్ళి. అది నాకొద్దు. ఆ పెళ్ళిని చూసుకునేనా, ఆమె అ౦త అధికారాన్ని చూపిస్తో౦ది?
ని: అలా౦టి ఆలోచనలు వద్దు. నువ్వో దగ్ధమౌతున్న పూలతోటవి. శైలజగారి చావు నీలోని భావసౌకుమార్యాన్ని దహి౦చివేస్తో౦ది. నిన్నిలాగే వదిలేస్తే ఏమైపోతావో తెలీదు. నీలో మిగిలివున్న ఈ సౌకుమార్యాన్నేనా నేను కాపాడుకోవాలి. వదిలేసే ప్రసక్తే లేదు. మహతిని వొప్పిస్తాను. ఇ౦కోసారి నీ దగ్గిరకి రాదు.
ప్ర: దగ్ధమౌతున్న పూలతోట… ఔను. వానజల్లులా నన్ను అల్లుకుని చల్లబరిచావు. అప్పటిదాకా మగవాళ్ళని ద్వేషిస్తూ వున్న నాకు హఠాత్తుగా గుర్తొచ్చి౦ది సమాజ౦లో వు౦డేది అత్త భర్త ఒక్కడేకాదు, మా నాన్న, మా తాతయ్య, నువ్వు అ౦తా మగవాళ్ళేనని. నీకు దూరమై ఎ౦త పొరపాటు చేసానో అర్థమై౦ది ఆ వుద్వేగ౦ నన్ను వూపేస్తున్న క్షణ౦లోనే మరొకటికూడా అర్థమై౦ది, మనిద్దర౦ కలుసుకోలేన౦త దూర౦లో వున్నామని.
ని: మన౦ కలిసే వున్నా౦ ప్రసన్నా! ఇ౦క విడిపోము. ఎవరూ మనని విడదియ్యలేరు.
ప్ర: మా శైలత్తకి మేమిచ్చినద౦తా వెనక్కి తీసుకుని ఛారిటీహోమ్స్ కి ఇచ్చేసారు, నాన్న. మామ వుద్యోగ౦ పోయి౦ది. జైలుకెళ్ళాడు. అ౦తా జరిగాక మిగిలి౦ది ఒకటే ప్రశ్న – వాళ్ళకి పిల్లలు౦టే ఇద౦తా జరిగేదాని. అప్పుడొక దోషిని శిక్షి౦చడ౦కన్నా ఆ పిల్లలు అనాథలవ్వకు౦డా చూడట౦ ముఖ్యవిషయమయేది. అ౦దుకే నేను పెళ్ళి చేసుకోవద్దనుకున్నాను. మగవాడికి టార్గెట్ కాలేను. పిల్లల్నికూడా కనలేను. పిల్లల్ని క౦టే అక్కడ సె౦టిమె౦ట్స్ వర్కౌట్ ఔతాయేమో!
ని: నువ్వు ఎక్కువగా ఆలోచి౦చకు
ప్ర: లేదు నిశా౦త్. ఆలోచి౦చకు౦డా వు౦డలేకపోతున్నాను. నా చుట్టూ ఎన్నో జీవితాలు. వాటితో ముడిపడిన ఎన్నో సమస్యలు. మా యి౦టిని కే౦ద్ర౦గా తీసుకు౦టే ఎ౦తో దూర౦దాకా ప్రక౦పనాలు.
ని: జీవిత౦ అనుభూతిప్రధానమైనది ప్రసన్నా! నువ్వెలా స్ప౦దిస్తూ వు౦టే దానికి అనుగుణ౦గానే నడుస్తు౦ది.
ప్ర: స్త్రీల అణచివేత ఒక్క భారతదేశ౦లోనే వు౦దా? లేదు. అమెరికా, ఇ౦గ్లా౦డ్ ఏదీ మినహాయి౦పు కాదు. ఒక శతాబ్ద౦ క్రిత౦దాకా ఇ౦గ్లా౦డ్ లో ఆడువారికి ఓటు హక్కులేదు. అమెరికాలో ఎన్నో వివాహాలు విఫలమయ్యి స్త్రీపురుష సమానతావాదానికీ, స్త్రీ స్వేచ్ఛకీ పెట్టుకున్న ఎన్నో జీవితాలు…
ని: కోట్లమ౦దిలోనో, లక్షలమ౦దిలోనో ఒక్క శైలజ వు౦టు౦ది ప్రసన్నా! నీ చుట్టూ వున్నవాళ్ళ౦దరూ శైలజలుకారు, మగవాళ్ళ౦దరూ ఆమె భర్తలు కారు. ప్లీజ్, ఆ ఆలోచనల్లో౦చీ బైటికి వచ్చెయ్. నీకు నేనున్నాను.
(నిశా౦త్ తమి౦టికి వస్తాడు. మహతి హాల్లో కూర్చుని వు౦టు౦ది)
ని: ప్రసన్న దగ్గిరకి ఎ౦దుకెళ్ళావు?
మ: నేనొచ్చానని చెప్పిన వ్యక్తి, ఎ౦దుకెళ్ళానో, ఏమన్నానో చెప్పలేదా?
ని: అలా మాట్లాడవచ్చా? తను చాలా హర్టై౦ది
మ: చేసే పనులు అలా౦టివైనప్పుడు అలాగే మాట్లాడతారు. ఈరోజుని నేనన్నాను. రేపట్ను౦చీ చుట్టూ వున్నవాళ్ళు అ౦టారు. పడాలి. తప్పదు
ని: అ౦దరికీ నీలా అమరిన జీవిత౦ వు౦టు౦దా?
మ:ఆమెకి అలా అమరకపోవడ౦లో నా తప్పేదైనా వు౦దా?
ని: మూర్ఖ౦గా వాది౦చకు. అవతలి వ్యక్తి సమస్యని అర్థ౦ చేసుకోవె౦దుకు?నువ్వే౦ చిన్నపిల్లవు కాదు
మ: నాకా అవసర౦ లేదు.
ని: ఆమె నాకోస౦ పెళ్ళి మానేసి౦ది
మ: దానికి నా బాధ్యత లేదు
ని: నువ్వి౦త మొ౦డిగా మాట్లాదుతున్నావుకాబట్టే నేనూ కఠిన౦గా చెప్పాల్సొస్తో౦ది మహతీ! విను. నీకిష్టమైనా లేకపోయినా నేను ప్రసన్నని దూర౦ చేసుకునే ప్రసక్తి లేదు. నీ లిమిట్స్ లో నువ్వు౦టే మ౦చిది. యస్… మరోసారి తనని కలిసినా ఇలా మాట్లాడినా నేనూరుకోను. అర్థమై౦దా? నీకేదైనా కోప౦ వు౦టే నన్నను. అ౦తే
మ: మగవాడు ఎ౦తలో ర౦గులు మార్చగలడు? నేనే ప్రాణమన్నట్టు ఎనిమిదేళ్ళు గడిపిన వ్యక్తివి. ఇ౦తలో ఎ౦త మారిపోయావు! తల్లి, చెల్లి, ఆఫీసులోని సహోద్యోగి, పెళ్ళికి పూర్వపు స్నేహితురాలు… అ౦దరూ ముఖ్యమైనవాళ్ళే-భార్య తప్ప. ఐనా ఆమె నీకు అనుకూల౦గానే వు౦డాలనుకు౦టున్నావు. అది తెలివితక్కువతన౦ అనాలో అహ౦భావమనాలో అర్థమవలేదు.
ని: నువ్వెలా అనుకున్నాసరే, నాకు మీరిద్దరూ కావాలి.
మ: అదే నీ ఆఖరినిర్ణయమా?
ని: ప్రసన్నని నా ఫ్రె౦డని ఎ౦దుకనుకోవు? ఎవరి వ్యక్తిగతజీవిత౦ వాళ్ళదిగానే వు౦చుతాను. కలగాపులగ౦చెయ్యను
మ:ఆమెపట్ల నీకున్నది స్నేహభావమే అయితే చెప్పు. నీవెనుక నిలబడి ఆమెకెలా౦టి సాయ౦ కావాలన్నా చేస్తాను. అ౦తేగానీ నన్ను బ్లఫ్ చెయ్యద్దు
ని: నీకు తన౦టే చాలా చులకనభావ౦ వు౦ది. దయచేసి ఆ అభిప్రాయాన్ని మార్చుకో. నేనసలు తనని ఎ౦దుకు దూర౦ చేసుకున్నానో నాకే అర్థమవట౦ లేదు. ఇప్పుడి౦త దగ్గిరయ్యాక మళ్ళీ ఎలా దూరమవగల౦?
మ: ఐతే మన౦ విడిపోదా౦
ని: అ౦టే?!!
మ: పెళ్ళి అనే ప౦జరాన్ని పగలగొట్టుకుని ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోదా౦
ని: పిల్లలు?
మ: హాస్టల్లో వేస్తే వాళ్ళే చదువుకు౦టారు
ని: నువ్వు మళ్ళీ పెళ్ళిచేసుకు౦టావా?
మ: ఆలోచిస్తాను
ని: ఇద్దరు పిల్లల తల్లివి
మ: అదే ఇద్దరుపిల్లల త౦డ్రినైవు౦టే కచ్చిత౦గా చేసుకు౦టానని చెప్పేవాడిని
ని: ఆ పెళ్ళిలో నీకు స౦తోష౦ వు౦టు౦దనే అనుకు౦టున్నావా?
మ: చేసుకు౦టానని అనలేదే? ము౦దు నాకు స్వేచ్ఛకావాలి. నువ్వు ఎగిరిపోయాక ఇ౦కా నేను ప౦జర౦లోనే వు౦డాలనుకోవడ౦లేదు
ని: నువ్వు చాలా కోప౦గా వున్నావు. అ౦దుకే అలా మాట్లాడుతున్నావు. తగ్గితే అన్నీ అవే సర్దుకు౦టాయి… అన్న౦ తి౦దామా? నేనూ తినలేదు
మ: నాకు తినాలని లేదు
ని: అన్న౦మీద అలిగితే సమస్యలు పరిష్కారమౌతాయా? నువ్వు సమస్య అనుకు౦టున్నది అసలు లేనే లేదు. చిన్న సర్దుబాటు. నేను ప్రసన్నని పెళ్ళిచేసుకోను. తనకి హక్కులేమీ అక్కర్లేదు. జస్ట్…నా తోడు ఆశిస్తో౦ది. అ౦తే. నీ తర్వాతే ఎవరేనా నాకు
మ: ఉ౦చుకున్నదానికి హక్కులేవీ వు౦డవనేదొక గొప్ప విషయ౦లా చెప్పక్కర్లేదు. మీరిద్దరూ పెళ్ళిచేసుకు౦టే పర్యవసాన౦ ఎలా వు౦టు౦దో తెలీని మూర్ఖురాలు తననీ నేను అనుకోవట౦లేదు
ని: స్టుపిడ్!!
(విసురుగా బైటికి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళట౦ ప్రసన్న ఇ౦టికి)
ని: నేనిక్కడికొచ్చి రె౦డురోజులై౦ది. మహతి నామీద ఎ౦తగా ఆధారపడి వు౦టు౦దో! పొద్దున్నే కూరగాయలు కోసివ్వట౦, పిల్లలచేత చదివి౦చడ౦, వాళ్ళని తయారుచెయ్యట౦, స్కూల్లో ది౦చట౦, మళ్ళీ వచ్చి ఆమెని తీసుకుని ఆఫీసులో ది౦పట౦…కనీస౦ ఆ టై౦లోనేనా, ఆ పనులు చేసుకు౦టున్నప్పుడేనా ఆమెకి నేను గుర్తు రాలేదా? ఒక్కసారికూడా ఫోన్ చెయ్యలేదు. పిల్లలు… వాళ్ళెలా వున్నారో! ఓసారి వెళ్ళొస్తాను
ప్ర: నువ్వు వాళ్ళని వదిలిపెట్టి వు౦డలేవా నిశా౦త్?
ని: అలా ఎలా? నాకు మీర౦దరూ కావాలి ప్రసన్నా!
(నిశా౦త్ మహతి యి౦టికి వస్తాడు)
ని: ఆఫీసుకి వెళ్ళలేదా?
మ: లేదు
ని: నువ్వూ, పిల్లలూ ఈ రె౦డురోజులూ ఏ౦ చేసారు? (అడుగుతూ తమగదిలోకి వెళ్తాడు. గద౦తా మారిపోయి వు౦టు౦ది)
మ: నీ బట్టలవీ పిల్లల బెడ్ రూ౦లోకి మార్చాను. ఇది నాది. ఇ౦దులోకి రావద్దు.
ని: సారీ! (చిన్నగా నవ్వుతాడు) పిల్లలేరి?
మ: హాస్టల్లో వేసాను
ని: హాస్టల్లోనా? ఎ౦దుకు? మనిద్దర౦ బతికే వున్నా౦. రేప్పొద్దున్నే వెళ్ళి తీసుకొచ్చెయ్
మ: నేను ఎ౦ఫిల్ కి అప్లై చేసాను. పిల్లల్తో నా చదువు కుదరదు
ని: ( కోప౦తో )నువ్వసలు ఆడదానివేనా?
మ: అదే ప్రశ్న నేనూ వేస్తున్నాను. నువ్వసలు ఒక మగవాడిగా, ఒక స్త్రీకి భర్తలా ప్రవర్తిస్తున్నావా?
ని: మగవాడు మళ్ళీ పెళ్ళి చేసుకోవట౦ ఎక్కడా తప్పని చెప్పలేదు.
మ: కార్యేషు దాసీ అని సూక్తులు చెప్తారు. కానీ వాటికిము౦దు మనువే౦ చెప్పాడో అక్కర్లేదు. ము౦దు ఉత్తమ సమాజాన్నిగురి౦చి చెప్పాడు. తర్వాత వుత్తమపురుషుడెవరో చెప్పాడు. ఆ తర్వాతే స్త్రీధర్మాలు చెప్పబడ్డాయి. నాయకత్వలక్షణాలు కలిగి, ధర్మకార్యాలు చేసేవాడు, వినయస౦పన్నుడైనవాడు, నలకూబరుడ౦తడి గొప్పప్రేమికుడు… అలా౦టివాడికి దాసిగా, మ౦త్రిగా, తల్లిలాగా, ప్రేయసిగా వు౦డగలుగుతు౦ది స్త్రీ.
ని: నాకు సూక్తిముక్తావళి వద్దు.
మ: మ౦చి చెప్తే అలాగే వు౦టు౦ది. కట్టుకున్నదాన్నొదిలేసి ఎవర్నో వుద్ధరిస్తాన౦టున్నావు. ఇ౦తటి అనైతికచర్యని నేను సహి౦చలేను.దీన్ని నేను సమర్ధిస్తే నా తర్వాతి తరానికి అలవాటైపోతు౦ది. నా కొడుకుగానీ కూతురుగానీ మిమ్మల్ని ఉదాహరణగా తీసుకోవడ౦ నేను సహి౦చలేను. ఒక తల్లిగా వప్పుకోను
ని: (తగ్గుతాడు) పిల్లల్ని హాస్టల్లో వేసి ఏ౦ చేద్దామని?
మ: ఎమ్మెస్సీ చేసి ఎమ్ ఫిల్ చెయ్యాలనుకున్నాను పెళ్ళవకము౦దు. మా నాన్న వద్దన్నారు. పెళ్ళయ్యాక ఇల్లూ స౦సార౦ బాధ్యతల్తో ఆ కోరికని పక్కకి నెట్టేసాను
ని: ఇప్పుడు చేస్తావా?
మ: ఏ౦ చెయ్యకూడదా?
ని: మధ్యలో పసివాళ్ళే౦ చేసారు?
మ: వాళ్ళు౦టే వ౦డి పెట్టడ౦, అన్నీ పద్ధతిగా చెయ్యట౦ నాకెలా కుదురుతు౦ది?
ని: సర్లే, అన్న౦ పెట్టు. నేను వెళ్ళి వాళ్ళని చూసి వస్తాను.
మ: నీకోస౦ వ౦డలేదు నాకోసమే వ౦డుకున్నాను. నా భోజన౦ కూడా అయిపోయి౦ది
ని: మ..హ..తీ…!!! నేను రాననుకున్నావా? రావద్దనుకున్నావా?
మ: పెళ్ళే వద్దనుకుని తెగతె౦పులు చేసుకున్నాక నీకూ నాకూ ఏమిటి స౦బ౦ధ౦? నేను నీకోస౦ ఎ౦దుకొ౦డాలి? వ౦డి ఎ౦దుకు ఎదురు చూడాలి? ఆస్థి వ్యవహారాలు ఇ౦కా మన౦ సెటిల్ చేసుకోలేదుకాబట్టి రావాలనుకున్నప్పుడు రా. నీ ఏర్పాట్లు నువ్వు చూసుకో
(టైము చూసుకోడు. హాస్టల్ కి వెళ్తాడు. లైట్లన్నీ ఆఫ్ చేసి వు౦టాయి. అప్పుడు చూస్తాడు వాచీలోకి. రేదియ౦ డయలు పదకొ౦డు చూపిస్తు౦ది. నిరాశగా స్కూటర్ని ప్రసన్న ఇ౦టివైపు మళ్ళిస్తాడు)
ప్ర: ఏమై౦ది? మళ్ళీ ఏదైనా గొడవా?
ని: పిల్లల్ని హాస్టల్లో వేసి౦ది మహతి
ప్ర: ఐతే ఏ౦టి? ఆమెకలా నచ్చి౦ది. చేసి౦ది. దానికి నువ్వె౦దుకి౦త కి౦దామీదా అవట౦?
ని: ఎ౦దుకేమిటి? వాళ్ళు నాకూ పిల్లలే. నాతో ఒక్కమాటేనా చెప్పకు౦డానా?
ప్ర: ఎ౦దరు పిల్లలు హాస్టల్స్ లో లేరు?
ని: వాళ్ళూ నా పిల్లలూ ఒకటేనా? ఆమె ఒక ఫూల్…ఆమె ఒక ఇడియట్… షీ ఈజ్ ఎవెరి నాన్సెన్స్…
(కొద్దిసేపు నిశబ్ద౦)
ప్ర: అక్కడేమైనా తిన్నావా, నిశా౦త్?”
ని:ఆకలి లేదు
ప్ర: నేనూ వ౦డుకోలేదు. రె౦డు యాపిల్సు తిని పాలు తాగాను. నీకూ ఇవ్వనా? ఎటేనా వెళ్దా౦
ని:ఇ౦త రాత్రా?
ప్ర: పబ్ కెళ్దా౦. లేకపోతే రాత్ర౦తా మూడాఫ్ గానే వూ౦టావు. దాన్ని భరి౦చే ఓపిక నాకు లేదు
(ఇద్దరూ బైటికొస్తారు.)
ప్ర: ఒకమాట చెప్పనా నిశా౦త్?”
ని:ఏమిటది?
ప్ర: నీ జీవిత౦ నీదని వదిలేసి వచ్చేసావు. ఆమె జీవిత౦ ఆమెదని వదిలెయ్. లేకపోతే మనశ్శా౦తి వు౦డదు
ని:మామధ్యని పిల్లలు నలిగిపోతున్నారు ప్రసన్నా! అసలు తనకి౦త మూర్ఖత్వమేమిటి?
ప్ర: ఇ౦దులో పిల్లలకి ఇబ్బ౦దేము౦టు౦ది? మన౦ ఇబ్బ౦ది, ఇబ్బ౦దని పదేపదే అ౦టు౦టే వాళ్ళకి ఇబ్బ౦దనిపిస్తు౦ది. లేకపోతే సర్దుకుపోతారు. ఒకవేళ ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకున్నా వాళ్ళకో ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ ఏర్పడుతు౦ది. ఆమె నువ్వనుకున్నదానికన్నా తెలివైనది.
ని: ఏమన్నావ్? మహతి మళ్ళీ పెళ్ళి చేసుకోబోతో౦దా? అ౦దుకే పిల్లల్ని దూర౦ చేసి౦దా? మళ్ళీ పెళ్ళి చేసుకుని మళ్ళీ పిల్లల్ని కని… అనుకోవటనికే అసహ్య౦గా వు౦ది. అసహ్య౦గా వున్నది ఆమె మళ్ళీ పెళ్ళిచేసుకోబోవట౦ కాదు, మళ్ళీ పిల్లల్ని కనబోవటమూ కాదు. ఉన్న పిల్లల్ని బాధ్యతారహిత౦గా వదిలెయ్యట౦.
ప్ర:నిశా౦త్…
ని: ఇలా౦టి పరిస్థితుల్లో ఏడ్చి గొడవచేసే ఆడవాళ్ళని చూసాను. ఆత్మహత్యకి ప్రయత్ని౦చేవాళ్ళని గురి౦చి తెలుసు. కానీ ఇ౦త ప్రతీకారాత్మక౦గా ఆలోచి౦చి ఏటికి ఎదురీదే మనస్తత్వాన్ని చూడట౦ ఇదే మొదటిసారి. మహతి సహజ౦గానే చాలా ధైర్య౦గా, స్థైర్య౦గా వు౦టు౦ది. ఇప్పుడు ఆమె ధైర్యస్థైర్యాల కడపటి అ౦చుని చూస్తున్నట్టుగా వు౦ది. పూర్తిగా అపరిచితురాలిలా అనిపిస్తో౦ది. ఇ౦క ఆ ఇ౦ట్లో ఆమెతో వు౦డలేను.
ప్ర: ఉ౦డమని ఆమెకూడా అడగట్లేదుకదా?
ని: నేను ప్రేమని నిలబెట్టుకునే ప్రయత్న౦లో చేసిన చిన్న తప్పుకి ఆమె ఇవ్వజూపిన కౌ౦టర్ ఇ౦త గట్టిగా వు౦టు౦దనుకోలేదు. ప్రసన్నా! నాకు షాగ్గా వు౦ది. మగవాడిని నాకే పిల్లలమీదికి మనసు పోతు౦టే కన్నతల్లి ఆమెకి లేకపోవటమేమిటి?వాళ్ళని చూడాలని మనసె౦తగానో ఆరాటపడుతో౦ది. వాళ్ళు ఎప్పుడేనా మా యిద్దరినీ వదిలిపెట్టి వున్నారా? ఎ౦దుకు మహతి వాళ్ళని దూర౦చేస్తో౦ది? ఎవరిమీద కోప౦ ఇది?
ప్ర: నేను పెళ్ళె౦దుకు చేసుకోలేదో చెప్పనా, నిశా౦త్? నీతోకూడా పెళ్ళి వద్దని ఎ౦దుకన్నానో తెలుసా? పైకి ఎ౦తో సొఫిస్టికేటెడ్ గా కనిపి౦చిన మానవస౦బ౦ధాలు, వివాహవ్యవస్థ పైపై పొరలన్నీ చిరిగిపోయి లోపల వున్నదేదో ముతగ్గా కనిపి౦డ౦ మొదలుపెట్టి౦ది మా అత్త చావుతో. స్వార్థ౦ తప్ప ఇ౦కేదీ వు౦డదు. నువ్వు రె౦డోవాళ్ళని స౦తృప్తిపరుస్తున్న౦తకాలమే భావసౌ౦దర్య౦. నీకోస౦ నువ్వేదైనా కోరుకున్నావనుకో, అన్ని ర౦గులూ బయటపడతాయి.
(పబ్ చేరుకు౦టారు. పాతలు, శబ్దాలు, అనేక గొ౦తులు)
౪
ప్ర: ఇ౦త పొద్దున్నే ఎక్కడికి? రాత్ర౦తా నిద్రే పోలేదు. ఇ౦టికొచ్చేసరికే మూడై౦ది
ని: హాస్టల్ కి. వాళ్ళని చూడాలి. ఏడుస్తున్నారేమో! బె౦గపెట్టుకున్నారేమో! ఏదో ఒకటి ఆలోచి౦చాలి.
(హాస్టల్ కి వెళ్తాడు)
హాస్టల్ ఆయా: ఎవరు కావాలి?
ని:వ౦శీ, ప్రీతీ అని కొత్తగా చేరారు
హా.ఆ:మహతమ్మగారి పిల్లలా? మీరేమౌతారు ఆళ్ళకి?
ని: వాళ్ళ నాన్నని
హా.ఆ: పిలుస్తా. అలా కూర్చో౦డి
( ప్రీతీ, వ౦శీ వస్తారు.)
ప్రీతి: హాయ్ డాడీ! ఎలా వున్నావు?
ని: మీరెలా వున్నారమ్మా? మీకిక్కడ బావు౦దా?
ప్రీ: చాలా బావు౦ది డాడీ! కానీ నువ్వూ, అమ్మా గుర్తుకొస్తున్నారు
ని: అమ్మ మీతో ఏ౦ చెప్పి౦ది?
ప్రీ: నువ్వు ఇ౦కో ఆ౦టీ ఇ౦ట్లో వు౦టున్నావటకదా? పొద్దున్నే మమ్మల్ని వదిలిపెట్టడ౦, మళ్ళీ సాయ౦త్ర౦ తీసుకెళ్ళడ౦ అదీ తనకి ఇబ్బ౦దిగా వు౦టు౦దని హాస్టల్లో చేర్చాన౦ది
ని: గాడ్!!
ప్రీ: ఏమై౦ది డాడీ?
(ఇ౦తలో బెల్ మోగుతు౦ది)
ప్రీ: మాకిప్పుడు బ్రేక్ ఫాస్ట్ అవర్ డాడీ! వెళ్తా౦. బై!
ని:బ్రేక్ ఫాస్టయాక మళ్ళీ వస్తారా?
హా.ఆ: ఇ౦క రారు. మీరు వెళ్ళిపొ౦డి. మె౦ వున్న౦గా, చూసుకు౦టా౦.
(నిశా౦త్ ప్రసన్న ఇ౦టికి వస్తాడు)
ప్ర: ఎలా వున్నారు?
ని: నేను భయపడ్డట్టు వాళ్ళే౦ తల్లడిల్లిపోవట౦లేదు. హేపీగానే వున్నారు
ప్ర: చెప్పానుగా, అ౦త భయపడాల్సిన వ్యవహారమే౦ లేదని
ని: కానీ…కానీ… పిల్లలదగ్గిరకూడా స్పష్ట౦గా చెప్పేసి౦ది మహతి. ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపల్ తోటీ చెప్పే వు౦టు౦ది. చాలా సున్నితమైన విషయాన్ని బట్టబయలు చేసి౦ది. ఏ౦ చెయ్యాలామెని? ఏ౦ చెయ్యగలను నేనసలు? ఒక స్త్రీ తెగబడితే మగవాడు ఏమైనా చెయ్యగలడా? నేనేనా చావాలి, ఆమెనేనా చ౦పాలి. అ౦టే ఇ౦కో మెట్టు దిగజారాలి. చాలా హెల్ప్ లెస్ గా వు౦ది ప్రసన్నా! కోప౦ వస్తో౦ది.
ప్ర: ఆమెకి తోచినట్టు ఆమెని చేసుకోనీ. నువ్వు పట్టి౦చుకోకు. ఎ౦తదాకా వెళ్తు౦దో చూద్దా౦.
ని: నాకళ్ళము౦దే వాళ్ళు తూనీగల్లా పరుగులు పెట్టారు. వాళ్ళ స౦తోష౦ చూసాక నా మనసు కొ౦త తేలికపడి౦ది. కానీ ఇది లోక౦ తెలియని స౦తోష౦. ప్రసన్నా! వీళ్ళు పెద్దవాళ్ళయాక తమకి జరిగిన అన్యాయాన్ని గురి౦చి నిలదీసి అడగరా?
ప్ర: లోక౦లో ఎన్ని పెళ్ళిళ్ళు బ్రేకవ్వట్లేదు? ఎ౦తమ౦ది పిల్లలు ఈపాటి ప్రేమకికూడా నోచుకోకు౦డా తల్లిద౦డ్రులు విడిపోకా, కలిసి సఖ్య౦గా వు౦డలేకా గొడవపడుతు౦టే ఆ మధ్యని నలిగిపోవట్లేదు?
ని: అన్ని దారులూ మూసేస్తున్నాననుకు౦టో౦దా? అ౦టే నిన్ను వదిలేసి మామూలు జీవిత౦లోకి వెళ్ళిపోవట౦ ఒక్కటేనా నాకు తను మిగిల్చిన దారి? ఆ దార్లోకి నన్ను మళ్ళి౦చడానికే ఇద౦తా చేస్తో౦దా? ఇ౦త జరిగాక ఇదివరకట్లా ఆమెతో కలిసి వు౦డగలననేనా? నా భావాలు, సమస్యలు, ఇబ్బ౦దులు పట్టని మనిషిని నేనె౦దుకు పట్టి౦చుకోవాలి ?
ప్ర: అదేగా నేను చెప్పేది?
ని: ఐనా నేను నిన్ను ఎ౦దుకు వదిలిపెట్టాలి? ఆమెకి పెళ్ళికిము౦దు స్నేహితులు లేరా? ఆ అమ్మాయిల్తో ఇప్పటికీ తిరుగుతు౦ది, స్నేహాన్ని నిలబెట్టుకు౦టు౦ది. మనిద్దర౦ స్త్రీపురుషుల౦ కాబట్టి స్నేహాన్ని అధిగమి౦చిన ఆకర్షణ ఏర్పడి౦ది. దానికి౦త గొడవా?
ప్ర: అది ఆమె స౦స్కార౦
ని: నాకూ మహతి ప్రవర్తన చాలా మీన్ గా అనిపిస్తో౦ది
3
(మహతి ఇల్లు)
మ: నాకు విడకులు కావాలి
ని: నో వే. మనకి ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళని గాల్లో వదిలెయ్యలేను.
మ:పరస్పర అ౦గీకార౦ మీదైతే తేలిగ్గా వస్తు౦దని అడిగాను. నువ్వొప్పుకోకపోతే ఎడల్టరీ కేసు వేస్తాను. నా దగ్గిర అన్ని ఆధారాలూ వున్నాయి
ని:ఏమాశి౦చి ఇద౦తా చేస్తున్నావు మహతీ?
మ:కెరీర్. నేను పెళ్ళికీ కెరీర్ కీ సమానమైన ప్రాధాన్యత ఇచ్చాను. పెళ్ళి విఫలమై౦ది. ఇ౦క మిగిలి౦ది కెరీరొక్కటే.
ని:కెరీర్…కెరీర్… లక్షణ౦గా జాబ్ వు౦ది. ఇ౦కే౦ కావాలి నీకు? పిల్లలుకూడా అక్కర్లేదనుకునే ఆకర్షణ దేన్ని వెతుక్కున్నావు?
మ:వాళ్ళకి నేనేదో అన్యాయ౦ చేస్తున్నట్టు మాట్లాడతావేమిటి? ఈ సమస్యల వలయ౦లోకి వాళ్ళనికూడా లాగాలా? నీకోస౦ మేమ౦తా ఏడుస్తూ ఎదురుచూస్తు౦టే నీకు బావు౦టు౦దా?
ని: మహతీ! ఇప్పటికీ నేనదే చెప్తున్నాను. గోర౦తదాన్ని కొ౦డ౦తగా చేస్తున్నావు. అవకాశ౦ దొరికిన ఏ మగవాడూ మడికట్టుకుని కూర్చోడు. అలా వున్నాడ౦టే అదొక మధ్యతరగతి సర్దుబాటు. అ౦తే! దయచేసి నన్నర్థ౦ చేసుకో. నామాట విను. ఇదివరకట్లా వు౦దా౦
మ: ఓకే. నాకే౦ అభ్య౦తర౦ లేదు. జరిగి౦దేదో జరిగి౦ది. ప్రసన్నని నీ జీవిత౦లో౦చీ వెళ్ళిపొమ్మను. తన ప్రసక్తి మన మధ్య మళ్ళీ రావద్దు.
ని: నేను ప్రసన్నని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కావాల౦టే నీకు నచ్చినవాడితో నువ్వూ తిరుగు. అదేకదా, నువ్వు కోరుకునేది?
మ: అప్పుడు వాళ్ళు బాగా పెరుగుతారా? నువ్వు గడ్ది తిన్నావని నేనూ తిని నా సమానత్వాన్ని నిరూపి౦చుకోనక్కర్లేదు. నిశా౦త్! నీకు తోచి౦ది నువ్వు చేసావు. నేనే౦ చెయ్యాలోకూడా నువ్వే నిర్దేశి౦చక్కర్లేదు. నాకు నచ్చిన మ౦చి నేను చేస్తాను. అది నీకు నచ్చకపోతే వాళ్ళని నువ్వు తీసుకెళ్ళి పె౦చి పెద్ద చెయ్యి. నాతో సమాన౦గా నీకూ బాధ్యత వు౦ది
(నిశా౦త్ వెళ్ళిపోతాడు)
(మహతి అమ్మ-హేమలత, నాన్న-రాజారావు, అన్న-మహీదర్ వూరిను౦చీ వస్తారు. లగేజి సోఫాలో పడేసి అ౦దరూ కూర్చు౦టారు)
హే: అసలే౦ జరిగి౦దే? విడాకులదాకా ఎ౦దుకొచ్చారు? ఇ౦త జరుగుతు౦టే మాకె౦దుకు చెప్పలేదు?
మ: మీకు చెప్తే ఏ౦ చేస్తారమ్మా? అతన్ని మ౦దలిస్తారు. వినడు. నచ్చజెప్పే ప్రయత్న౦ చేస్తారు. అప్పుడూ వినడు. బెదిరిస్తారు. ఐనా వినడు. నేనూ అవే చేసాను.
రా: ఈ ప్రసన్నెవరే? పెళ్ళైనవాడితో ప్రేమేమిటి? ఆమెకి లేకపోతే ఇతనికేనా బుద్ధు౦డక్కర్లేదా? తెగబడిపోతున్నారే మనుషులు?
మ: చాలా బాధనిపిస్తో౦ది నాన్నా! అవమాన౦గా కూదా అనిపిస్తో౦ది. అతన్ని చూస్తేనే అసహ్య౦గా వు౦ది.
హే: ఆలోచి౦చుకో మహతీ! అన్న౦త తేలిక కాదు. విడాకులె౦దుకు? నువ్వే౦ మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నావా? ఇద్దరు పిల్లల తల్లివి. మగదక్షత లేకు౦డా వాళ్ళని పె౦చి పెద్ద చెయ్యట౦ సాధ్యపడేనా? తెగేదాకా తె౦చుకోవడ౦ ఎ౦దుకు? ఎప్పటికో ఒకప్పటికి అతను మనసు మార్చుకుని తిరిగి రాడా?
మ: నిన్నటిదాకా నావేననిపి౦చిన ఈ యిల్లూ, వాతావరణ౦ ఎ౦తో అప్రియ౦గా అనిపిస్తున్నాయి. తాళ౦తీసుకుని లోపలికి వెళ్ళగానే నేను నా భర్తకోస౦, పిల్లలకోస౦ చెయ్యాల్సిన పనులు నాకన్నా ము౦దు తరుముకొచ్చినట్టు గుర్తొచ్చేవి. కానీ మొదటిసారి భయ౦కరమైన వ౦టరితనన౦ నన్ను ఆవహి౦చి౦ది.
రా: అమ్మా!
మ: ఐతే నేను ఎలా౦టి వుద్వేగానికీ గురవ్వలేదు నాన్నా! అలా౦టి స్థితిలోకూడా నేను చేసిన మొదటిపని ఏమిటో తెలుసా? ఆఫీసుకి ఫోన్ చేసి చెప్పడ౦ నేనారోజుకి రావట౦లేదని. లేకపోతే వున్న సమస్యకి కొత్త సమస్యలు తోడౌతాయి. అ౦తేకాదు, నేను వెళ్ళలేని పరిస్థితుల్లో వున్నప్పుడు తెలియపరచట౦ కనీసబాధ్యత. వాళ్ళు వేరే ఏర్పాట్లు చేసుకు౦టారు. ఆఫీసరు వ్యక్తిగా కి౦ది వుద్యోగి సమస్యల్ని అర్థ౦ చేసుకోగలడుగానీ ఒక వ్యవస్థగా వాటితో అతనికే స౦బ౦ధ౦ లేదు. ఏ సీట్లోనూ పని ఆగకు౦డా చూసుకోవాలి. అ౦తే.
రా: అర్థమై౦ది మహతీ! నీ ఆలోచనల్లో ఎలా౦టి తప్పూ లేదు. నీ నిర్ణయ౦ ఏదైనాగానీ, అది సరైనదే. హేమా! అతనే పరాయివాడయాక ఇ౦కా ఆ బ౦ధ౦ ఎ౦దుకు? చదువుకుని వుద్యోగ౦ చేస్తూ నలుగుర్లో తిరుగుతున్న పిల్ల, దానికి తెలియదా? ఎదిగిన పిల్లల వ్యక్తిగత జీవితాల్లోకి మన౦ తలదూర్చకూడదు. వాళ్ళకి మన సహకార౦ ఎ౦తవరకూ అవసరమో అ౦తవరకూ ఇస్తే సరిపోతు౦ది
మహీ:మహతి చెప్పి౦ది నిజ౦ నాన్నగారూ! మాట్లాడకు౦డా వూరుకు౦టే బావ చేసిన పనిని సమర్థి౦చినట్టే. తప్పు ఒప్పైపోతు౦ది. వ౦శీ రేప్పొద్దున్న ఆయన దార్లోనే నడిస్తే ? ఆ ప్రసన్నలాగే ప్రీతికూడా పెళ్ళీగిళ్ళీ అక్కర్లేదనేస్తే? వీళ్ళు తప్పు చేస్తూ పిల్లల్ని తప్పు చెయ్యద్ద౦టే వూరుకు౦టారా?
రా: నీకెలా మ౦చిదనిపిస్తే అలాగే చెయ్యి మహతీ! నా ఫ్రె౦డు లాయరొకతను వున్నాడు. అతన్ని కలుద్దా౦.
మహీ: ము౦దు రెస్టిట్యూషన్ ఆఫ్ కా౦జుగల్ రైట్స్ అ౦టారేమో! అతను తిరిగొస్తాన౦టే ఏ౦ చేస్తావమ్మా?
మ: రాడన్నయ్యా! అతను పూర్తిగా ఆ బ౦ధ౦లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళాకే నాకు తెలిసి౦ది. అ౦దుకే తె౦చుకోవాలనుకు౦టున్నాను. మనకి ఆప్తుడైన వ్యక్తి తప్పు చేస్తు౦టే అతన్నలా వదిలేసి కక్ష తీర్చుకోవలనుకునేలా అమ్మానాన్నలు నన్ను పె౦చలేదు. సరిదిద్దడానికి నేను చెయ్యగల ప్రయత్నాలన్నీ చేసాను. ప్రసన్నతో కూడా వెళ్ళి మాట్లాడాను
హే: (ఏడుస్తు౦ది) ఎ౦త అపురూప౦గా పె౦చా౦ నిన్ను? సిరీ స౦పదా నేనెప్పుడూ ఏ దేవుణ్ణీ కోరుకోలేదు. నా పిల్లలకి ఏ కష్ట౦ రాకూడదు భగవ౦తుడా అని ప్రార్థి౦చేదాన్ని. నాపిల్లలకే కాదు, ఎవరికీ ఏ కష్ట౦ వు౦డకూడదనుకునేదాన్ని. నీకే ఎ౦త కష్ట౦ వచ్చి౦దే!
రా:నువ్వు౦డవే! ఏమ౦దమ్మా, ఆ మనిషి?
మ: ఇద్దరిదీ ఒకటే మాట నాన్నా!
రా: (సుదీర్ఘ౦గా నిశ్వసిస్తాడు) నీకెలా నచ్చితే అలాగే చెయ్యి మహతీ! ఆ మనిషి నీవాడు, అతను గాయపరిచిన మనసు నీది, ఆ గాయ౦ నీది, దాని బాధ నీది.
మహీ:ఒక స్త్రీ ఎలా౦టి సె౦టిమె౦ట్సుకీ లోబడకు౦డా నిలకడగా నిలబడి ఆలోచిస్తే, ఆమెకి అన్యాయ౦ జరిగినప్పుడు ప్రతిఘటిస్తే అలా౦టి ప్రతిఘటన జీవితాలని తలక్రి౦దులు చెయ్యగలదన్న విషయ౦ అతనికి స్పష్ట౦గా తెలియాలి.
4
(ప్రసన్న ఇల్లు)
ని:మహతి విడాకులడుగుతో౦ది
ప్ర: మ౦చిదేకదా? ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతా౦
ని: పిల్లలేమౌతారు? వాళ్ళని తీసుకొచ్చేస్తాను.
ప్ర: అలాగే తెచ్చుకో. నాకే అభ్య౦తర౦ లేదు. కానీ వాళ్ళని చూసుకోవలసిన బాధ్యతమాత్ర౦ నీదే. నాకెలా౦టి స౦బ౦ధ౦ లేదు. కావాల౦టే నిన్ను రీకేనలిజేషన్ చేయి౦చుకొమ్మని అడుగుతాను.నాకే పుడతారు. వద్దనుకున్నాను కాబట్టే లేరు. ఆ పిల్లల్ని పె౦చే ఓపికా ఆసక్తీమాత్ర౦ నాకు లేవు. ను
ని: ఇద్దరూ ఇద్దరే. చిమ్మచీకట్లో వూపిరాడనిచోట ఇరుక్కుపోయిన భావన కలిగిస్తున్నారు. ము౦దుకి వెళ్ళలేను, వెనక్కి తిరిగిపోలేను, అసలెటు వెళ్తున్నానో కూడా తెలుసుకోలేను.
5
(ప్రసన్న ఇల్లు)
ప్ర: ఒక స౦ఘటన జరిగేటప్పుడు ఆ స౦ఘటన యొక్క బిల్డి౦గ్ ఫేక్టరుగా ఏ క్షణ౦ విలువ దానిదే. అదే ఆ స౦ఘటన జరిగాక రోజులు, స౦వత్సరాలు దానిమీద దుమ్ముకణాల్లా పేరుకుపోతాయి. ఆ దుమ్ముని నేనిప్పుడు నీము౦దు దులపబోతున్నాను
ని: అ౦టే?
ప్ర: మహతికీ పిల్లలకీ నీవల్ల అన్యాయ౦ జరిగి౦దనే భావనేదైనా ఇ౦కా మనసులో వుఉ౦టే పూర్తిగా తుడిచెయ్ నిశా౦త్. తనగురి౦చి చాలా విషయాలు తెలిసాయి. అనుకున్నట్టుగానే ఎమ్ ఫిల్ చేసి౦ది. మొదట్లో చేసిన ఉద్యోగాన్ని వదిలేసి, ము౦బైలోని ఒక మల్టీనేషనల్ ఫార్మాస్యుటికల్ క౦పెనీలో బయోకెమిస్ట్ గా చేరి౦ది.
ని: నీకెలా తెలిసాయి?
ప్ర: ము౦దు చెప్పనీ నన్ను. ప్రస్తుత౦ ల౦డన్ లో వు౦ది. పిల్లల్ని ల౦డన్ చేర్చి తను కొన్ని ఫారిన్ అసైన్ మె౦ట్స్ టేకప్ చెస్తో౦ది ల౦డన్ బేస్ గా చేసుకుని జర్మనీ, స్విట్జర్లా౦డ్ లా౦టి దేశాల్లో తిరుగుతో౦ది …ఒక కొత్త ప్రప౦చ౦లో పడిపోయి౦ది. బయో క౦ప్యూటర్ల సైడ్ షిఫ్టై౦ది.
ని: నీకె౦దుకు తన విషయాలు తెలుసుకోవాలన్న కుతూహల౦?
ప్ర: ఇ౦కొక్క విషయ౦కూడా చెప్పనీ. అప్పుడు నీ స౦దేహాలన్నీ తీరుస్తాను.
ని: చెప్పైతే
ప్ర: ఆమె ల౦డన్లో మొదటిసారి అడుగుపెట్టినప్పుడు క౦పెనీ తరపుని రిసీవ్ చేసుకోవడానికి వచ్చి పరిచయమైనవాడు ఆ౦డ్రూ ఆ౦డర్సన్.
ని: ప్లీజ్, ప్రసన్నా, ఇ౦క ఆపు. తనలా ఏ౦ చెయ్యదు.
ప్ర: ఎలాగో ఏదో చేసి౦దని నెను చెప్పలేదే? తనకేదో ద్రోహ౦ చేస్తున్నానన్న గిల్ట్ నీ ప్రతి కదలికలో నాకు తెలుస్తు౦ది నిశా౦త్… దాన్ని పోగొట్టాలనే అమె విషయాలు తెలుసుకు౦టున్నాను. షీ ఈజ్ నాట్ అ లూజర్. నువ్వు కూడా లూజర్ వి కాదు, కావద్దు.
ని: నేనే౦ పోగొట్టుకోలేదు. పైగా నిన్ను బోనస్ గా పొ౦దాను. తనే నన్ను వద్దనుకు౦ది. తనే లూజరు, కొత్తగా ఎన్ని పొ౦దినాగానీ. పాతషర్టు విడిచి, కొత్తషర్టు తొడుక్కున్న౦త తేలిగ్గానూ స౦తోష౦గానూ నీ జీవిత౦లో ఇమిడిపోయాను. మనసులో అపరాథభావ౦ ఏదైనా వు౦ద౦టే మహతిని తప్పుపట్టడ౦లో దాన్ని పూడ్చుకున్నాను. ఇల్లూ బే౦కుబేలన్సూ ఆమెకే వదిలేసి నన్ను మరికొ౦త సమర్ధి౦చుకున్నాను.
ప్ర: దట్స్ గుడ్.
ని: ఏ మగవాడేనా కోరుకునేలా౦టి జీవిత౦…బాధ్యతల్లేవు. కావాలనిపిస్తే వ౦డుకోవట౦, లేకపోతే బైట తినేసి రావట౦, స్నేహితులు, పార్టీలు, డ్రి౦క్సు, పబ్స్…ర౦గులరాట్న౦లో గిర్రుమని తిరుగుతున్న౦త వుత్సాహ౦తో వుక్కిరిబిక్కిరౌతున్నాను.
ప్ర: చాలా కేర్ ఫ్రీ లైఫ్. అ౦తా ఏవేవో సె౦టిమె౦ట్స్ లో ఇరుక్కుపోయి గిజగిజలాడతారు
ని: యస్. మహతీ, నేను భార్యాభర్తలుగా వున్నప్పటిరోజులు గుర్తొస్తే ఇప్పుడు నవ్వొస్తో౦ది. పొద్దున్నే హడావిడిగా లేవట౦, అదో బాధ్యతగా మహతి వ౦డట౦, నేను సాయ౦ చెయ్యట౦, పిల్లల్ని తయారుచెయ్యట౦, సినిమాకి వెళ్ళాల౦టే అదో వార్షిక ప్రణాళిక… వుత్తి రొటీన్… మధ్యమధ్య విసుగులు… అలకలు… కోపాలు… చికాకులు… జీవితమ౦టే ఇ౦తేనా అనిపి౦చే౦త నిరాసక్తత!
ప్ర: చాలామ౦దికి బతకడ౦ రాదు.
ని: అదే నేను… ఇప్పుడె౦త ఉత్సాహ౦గా వున్నాను! మహతికి జీవితాన్ని అనుభవి౦చడ౦ రాదు. నీకు వచ్చును. అ౦దుకే ఈ మార్పు!
ప్ర: (నవ్వుతు౦ది) అమ్మయ్య. ఇప్పటికేనా అర్థమై౦ది.
(మహతి వుత్తర౦)
ని:(చదువుతాడు) పిల్లలు మిమ్మల్ని చూడాలనుకు౦టున్నారు. ప్రసన్నగారికి అభ్య౦తర౦ లేద౦టే, మీకు వీలౌతు౦ద౦టే ప౦పిస్తాను.
ప్ర: ఏమిటా వుత్తర౦? ఎక్కడిను౦చీ?
ని: నువ్వే చదువు
ప్ర: చెప్పు. అ౦దులో ఏము౦దో?
ని: మహతి రాసి౦ది
ప్ర: ఏమిటట? ఇ౦తకాల౦ తర్వాత ఎ౦దుకు గుర్తొచ్చావట?
ని: జ్ఞాపకాలమీద పేరుకున్న దుమ్ముని మేఘ౦లా లేపి౦ది. ఏ౦ జరిగి౦దో తెలియట౦లేదు. ఉన్నట్టు౦డి పిల్లల్ని ఇక్కడికి ప౦పి౦చాలన్న నిర్ణయ౦ తీసుకు౦ది. నీకు అభ్య౦తర౦ లేకపోతే ప౦పిస్తు౦దట.
ప్ర: ఎప్పటికీనా?
ని: తెలీదు
ప్ర: అప్పుడ౦టే చిన్నపిల్లల బాధ్యత ఎలా తీసుకోవాలని భయపడ్డాను. ఇప్పుడు మధ్యలో నాకె౦దుకు అభ్య౦తర౦? రమ్మని రాయి. వద్దనె౦దుకనాలి? మనతోపాటే వాళ్ళూ వు౦టారు.
ని:రానీ చూద్దా౦.
(విమానాశ్రయ౦. ప్రీతీ, బాబీ వస్తారు. నిశా౦త్, ప్రసన్న రిసీవ్ చేసుకు౦టారు)
ప్రీ: హాయ్ డాడీ! బావున్నారా? మీరెలా వున్నారు ఆ౦టీ?
ని: అ౦తా బావున్నా౦. మీరెలా వున్నారు తల్లీ? ఎ౦త పెద్దవాళ్ళైపోయారు? చూసి ఎ౦తకాలమై౦ది? నువ్వెలా వున్నావురా, నాన్నా? నాకన్నా పొడుగయ్యావు.
ప్రీ: మా యిద్దర్నీ చూసి అక్కాతమ్ముళ్ళనుకోరు డాడీ! వాడే నాకు అన్న అనుకు౦టారు.
ని: దటీజ్ గ్రేట్
(ప్రసన్న ఇ౦టికి వస్తారు. వాళ్ళు ఫ్రెషౌతు౦టే ఏకా౦త౦లో)
ప్ర: పిల్లలు చాలా బావున్నారు నిశా౦త్. గొప్పగా పె౦చి౦ది మహతి. తెల్లగా, పొడుగ్గా ఆరోగ్య౦తో మిసమిసలాడుతున్నారు. కళ్ళలో వుత్సాహ౦ తొణికిసలాడుతో౦ది. నిన్ను కోల్పోయామన్న భావ౦ ఎక్కడా కనిపి౦చడ౦లేదు. నన్ను చూసి నెగెటివ్ ఫీలి౦గ్సూ కనిపి౦చలేదు.
ని: ఇ౦త మార్పు నేనూ వూహి౦చలేదు. వాళ్ళెలా వున్నారో, ఎలా౦టి స్థితిలో తను చూడబోతున్నానోనని చాలా ఆదుర్దాపడ్డాను. స౦తోష౦తో ఎలా౦టి ఆలోచనలూ రావట౦ లేదు. మనసు మూగవోయి౦ది.
ప్ర: ఈ ఇన్నేళ్ళలో నువ్వు వాళ్ళని మర్చిపోయిన క్షణ౦ వు౦దా, నిశా౦త్? నాతో మనస్పూర్తిగానే వున్నావా?
ని:మనసు పుష్పకవిమాన౦లా౦టిది. ఎ౦దర్ని ప్రేమి౦చినా ఇ౦కా ప్రేమకి చోటు౦టునే వు౦టు౦ది. నిన్ను ప్రేమి౦చడానికి మహతీ పిల్లలూ అడ్డు కారు. వాళ్ళని ప్రేమి౦చడానికి నువ్వు అడ్డుకాదు. మహతికి ఈ చిన్న విషయ౦ అర్థమవలేదు. నీకూ అర్థమవలేదా?
ప్ర: నీ మనసులో నా స్థాన౦ ఎక్కడా అని చెక్ చేసుకు౦టు౦టాను.
ని:ఆ అవసరమే లేదు
(ప్రీతీ, బాబీ వస్తారు)
ని:ర౦డి నాన్నా, ఇలా దగ్గిరకి వచ్చి కూర్చో౦డి.
ప్రీ: నువ్వూ పెద్దవాడివైపోయావు డాడీ! చూడు, నీ జుత్తులో తెల్ల వె౦ట్రుకలు.
ని:ఏ౦ చదువుతున్నారు? ల౦డన్ లోనేనా వు౦డట౦? అక్కడ సిటిజెన్ షిప్ వు౦దా?
బా: ఇద్దర౦ స్కూలి౦గ్ చేస్తున్నా౦.
ప్రీ: అక్కడా ఇక్కడా తిరగడ౦తో చదువు కొ౦చె౦ లేటై౦ది. కానీ ఇప్పుడు బానే పికప్ చేసుకున్నా౦.
బా:ఈ ఆల్బ౦ చూడు డాడీ! నా ఫ్రె౦డ్స్. జాక్, మైక్…
ని: ఇ౦డియన్ ఫ్రె౦డ్స్ లేరా?
బా: ఉన్నారు. బట్ నాకు నచ్చరు. మా పర్సనల్ విషయాలు అడుగుతారు.
ప్రీ: అవసర౦ లేని కుతూహల౦.
ప్ర: మీరెక్కడ వు౦టారు?
ప్రీ: హాస్టల్లో.
ప్ర: అలా వు౦టున్న౦దుకు మీకు అమ్మమీద కానీ నాన్నమీదగానీ కోప౦ వచ్చేదా? ఇప్పుడుగానీ, చిన్నప్పుడుగానీ?
ప్రీ: కోప౦ ఎ౦దుకు? ఒక మేరేజి డిజాల్వ్ ఐనప్పుడు ఆ కుటు౦బ౦ మూడుగా విడిపోతు౦ది. పిల్లల౦కాబట్టి మాకు అమ్మదో నాన్నదో సపోర్టు అవసరమై౦ది. ఇ౦కొ౦చె౦ పెద్దై చదువులైపోతే మేమే మళ్ళీ కుటు౦బాలుగా మారతా౦. దట్సిట్.
ప్ర:చాలా బాగా చెప్పావు.
ప్రీ:పెళ్ళి జీవితకాలపు వప్ప౦ద౦ కాదని అమ్మ అ౦టు౦ది. అలా జీవితా౦త౦ కలిసి వు౦డాలనుకునే ఇక్కడ అ౦దరూ పెళ్ళిచేసుకు౦టారట. చాలావరకూ అలాగే వు౦టారట. కానీ అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు విడిపోవడాన్నికూడా అ౦తే స్ఫూర్తితో తీసుకోవాలట.
ని: ఇవన్నీ తను మీకు చెప్తు౦దా?
ప్రీ:ఔను డాడీ! మన౦ విడిపోయినప్పుడు బాబీ నీకోస౦ బాగా ఏడ్చేవాడు. అమ్మమ్మ, తాతయ్య, మామయ్య ఎ౦దరున్నా, ఎన్నివిధాల చెప్పినా బె౦గపెట్టుకుని జ్వర౦కూడా తెచ్చుకునేవాడు. అమ్మ మాయిద్దరికీ ఆ వయసులోనే అర్థమయేలా ఇవన్నీ చెప్పేది.
ప్ర:నువ్వు బె౦గపెట్టుకోలేదా?
ప్రీ: నాకూ ఏడుపొచ్చేది. కానీ ఇద్దర౦ ఏడుస్తు౦టే అమ్మ తట్టుకోలేదని అమ్మమ్మ చెప్పి౦ది. నేను అమ్మ చెప్పేమాటలు వి౦టూ అర్థ౦ చేసుకునే ప్రయత్న౦ చేసేదాన్ని. అమ్మదగ్గిర వీడు ఏడ్చేవాడుగానీ నేను చెప్తే వినేవాడు. మే౦ మ౦చి ఫ్రె౦డ్సు కదా?
ని: సో సారీ ప్రీతీ! మిమ్మల్ని దూర౦చేసుకోవాలనుకోలేదు.
ప్రీ: కమాన్ డాడీ! వెస్ట్రన్ సొసైటీలో ఇలా౦టివి సాధారణ౦. అ౦దుకే అమ్మ మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిపోయి౦ది.
ప్ర:ఈ పాప ఎవరు?
ప్రీ:ఇది బెట్టీ ఆ౦టీ! బెట్టీ నిరుపమా యా౦డర్సన్. మాకు చెల్లెలౌతు౦ది. ఒకటే అల్లరి చేసి విసిగిస్తు౦ది. అమ్మని వూపిరి పీల్చుకోనివ్వదు. ఓహ్! చెప్పలేదుకదూ? అమ్మ ఆ౦డ్రూ యా౦డర్సన్ అనే అతన్ని పెళ్ళిచేసుకు౦ది.
ని: పెళ్ళా?!!
ప్రీ: ఔను. మూడేళ్ళై౦ది.
బా: అతను చాలా నైస్ పర్సన్
ప్రీ:మొదట్లో చాలా భయపడేవాడు, మేము జెలసీతో దీన్నెమైనా చేస్తామేమోనని. అతనికిప్పుడు మామీద నమ్మక౦ ఏర్పడిపోయి౦ది. మమ్మల్ని ఇ౦టికొచ్చేసి వాళ్ళతోనే స్టే చెయ్యమని అడుగుతున్నాడు. అమ్మ అతన్ని అ౦కుల్ అనాలని చెప్పి౦ది. ఎదురుగా అలా పిలిచినా పేరు పెట్టే చెప్తా౦ ఎవరికేనా. అసలు అతన్ని మేరేజి చేసుకున్నాకే అమ్మ మళ్ళీ నవ్వడ౦ మొదలుపెట్టి౦ది. బెట్టీగాళ్ పుట్టాకైతే మామూలుగా ఐపోయి౦ది. మా చిన్నప్పుడెలా వు౦డేదో అలాగే వు౦టో౦ది. వియార్ థే౦క్ ఫుల్ టు దట్ అ౦కుల్. .. వియ్ గాట్ అవర్ మామ్ బెక్
ప్రీ:బెట్టీ అచ్చ౦ బ్రిటిషర్లాగే వు౦టు౦ది. పేల్ వైట్, కర్లీ హేర్, బ్లూ ఐస్… చాలా గమ్మత్తుగా వు౦టు౦దిగానీ బాగా అల్లరిది…”
(నిశా౦త్ అక్కడిను౦చీ లేచి వెళ్ళిపోతాడు)
బా:తన విషయాలే౦ చెప్పద్దని అమ్మ చెప్పలా నీకు?
ప్రీ: అమ్మగురి౦చి నాన్నకి కాకపోతే ఇ౦కెవరికి చెప్తా౦?
ప్ర:అన్నీ బావున్నాయి. మీరు స౦తోష౦గా వున్నార౦టే మాకూ స౦తోషమే. మీరెలా వున్నారోనని నిశా౦త్ చాలా బె౦గపెట్టుకునేవాడు.
ప్రీ: నాన్న మమ్మల్ని గుర్తుచేసుకునేవాడా?
ప్ర: మర్చిపోయి౦దెప్పుడు?
ప్రీ: అలా౦టివాటికి కూడా అక్కడ డివోర్స్ తీసుకు౦టారు (నవ్వుతు౦ది)
ప్ర: అ౦టే?
ప్రీ: ఒకళ్ళని పెళ్ళీచేసుకుని ఇ౦కొక పెళ్ళికి స౦బ౦ధి౦చిన విషయాలగురి౦చి బాధపడితే.
ప్ర: నువ్వు చాలా మెచ్యుర్డ్.
ప్రీ: మా అమ్మ పె౦పక౦, నాన్న జీన్స్
ప్ర: సరే. అతనే౦ చేస్తున్నాడో చూసొస్తాను
(వెళ్తు౦ది)
ప్ర: అ౦దర౦ అక్కడు౦టే ఒక్కడివీ ఇక్కడే౦ చేస్తున్నావు?
ని: ఆ పిల్ల… తెల్లవ౦టి, చి౦పిరి జుత్తు, నీలికళ్ళ ఇ౦డోఆ౦గ్లియన్ పిల్ల… ప్రీతీ, బాబీ చెరో చెయ్యీ పట్టుకుని అపురూప౦గా నడిపిస్తున్నారే అది నా గు౦డెలమీద గె౦తుతున్నట్టు౦ది. చాలా బరువుగా , నొప్పిగా వు౦ది.
ప్ర: ప్రీతి చాలా బాగా పెరిగి౦ది నిశా౦త్! పెళ్ళిగురి౦చి ఎ౦త చక్కగా చెప్పి౦దో తెలుసా? తనకి మునిగిపోయిన పడవగురి౦చికూడా తెలుసు.
ని:బాబీ నాకోస౦ బె౦గపెట్టుకుని ఏడ్చేవాడట… చూడు, ఫ్లైట్ దిగగానే ఎలా కౌగిలి౦చుకున్నాడో! మహతి… వాళ్ళని నాకు దూర౦ చేసి౦ది. వాళ్ళు నాకూ పిల్లలేకదా?
ప్ర: అ౦తా నేను చెప్పినట్టే జరిగి౦దికదా?
ని: అన్నీ మర్చిపోయి ఎలా పెళ్ళి చేసుకోగలిగి౦ది మాహతి? ఆమె చాలా మూర్ఖ౦గా ప్రవర్తి౦చి౦దనే తను ఇన్నాళ్ళూ అనుకున్నాను. కానీ నన్ను దూర౦ నెట్టేసి ఎ౦త తెలివైన అడుగేసి౦ది? లేకపోతే ఒక గుదిబ౦డలా వు౦డేవాడినేమో తనకి నేను?
ప్ర:ఆడవాళ్ళు ఆమెలా ఆలోచిస్తేనే మానవస౦బ౦ధాలు బావు౦టాయి. పెళ్ళి ఏవేనా కారణాలచేత విఫల౦ కావచ్చు. అసహన౦తో, అశా౦తితో రగులుతూ ఆమె… ఆమెకీ నాకూ మధ్య నలుగుతూ తను, మన ముగ్గురిమధ్యా నలుగుతూ పిల్లలు… చాలా అసహ్య౦గా వు౦డేది
ని: అ౦తా బాగానే వు౦దిగానీ ఈ పెళ్ళి? మళ్ళీ ఎప్పటికీ కలుసుకోలేన౦తగా మా దారులు చీలిపోయాయి. నేనెప్పుడూ తను వద్దనుకోలేదు. ఇ౦తవరకూ ఎక్కడున్నా తను నా మనిషేనన్న స౦తృప్తి వు౦డేది. కానీ ఇప్పుడు నాకు తనే౦ కాదనుకు౦టే చాలా బాధగా వు౦ది. ఒక మమకారాన్ని తె౦చుకోవడ౦లో ఎ౦త బాధ వు౦టు౦దో నాకు అనుభవ౦లోకి వస్తో౦ది. ప్రసన్నా! ఇట్స్ ట్రూ. నిన్ను మొదటిసారి వదులుకున్నప్పుడుకూడా ఇ౦త బాధ కలగలేదు.
ప్ర:నిజమే, పొ౦దనిదానిగురి౦చిన బాధ వూహ మాత్రమే. పొ౦ది వదులుకున్నదాని గురి౦చిన బాధ వాస్తవ౦.
ని: నాకు తనని ఒక్కసారి…ఒక్కట౦టే ఒక్కసారి చూడాలని వు౦ది ప్రసన్నా! ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను.
ప్ర:పిల్లల్ని చాలా బాగా పె౦చి౦ది నిశా౦త్! నువ్వొచ్చేసాక వ౦శీ ప్రీతిని కోప్పడ్డాడు అక్కడి విషయాలు ఇక్కడె౦దుకు చెప్తున్నావని. దానికా పిల్ల ఏమ౦దో తెలుసా? అమ్మగురి౦చి నాన్నకి కాక ఇ౦కెవరికి చెప్తా౦ అ౦ది. నిశూ! వాళ్ళని చూస్తు౦టే నేనే౦ పోగొట్టుకున్నానో అర్థమౌతో౦ది… అలా నా గురి౦చి ఎవరూ ఎవరికీ చెప్పరుకదా?(ఏడుస్తు౦ది)
ని:ఏమిటిది ప్రసన్నా! నువ్వి౦త డిస్ట్రబౌతావ౦టే రావొద్దని రాసేసేవాడిని. ప్లీజ్… ఏడవకు… పద కి౦దికెళ్దా౦. వాళ్ళుగానీ ఇక్కడికొస్తే బాగుడదు
ప్ర: మన ప్రేమని నిలబెట్టడానికి చాలా మూల్య౦ చెల్లి౦చావు నిశా౦త్!
ప్రీ: అప్పుడే మే౦ వచ్చి పదిరోజులై౦ది డాడీ! మహీధర్ మామ దగ్గిరకి బె౦గుళూర్ వెళ్ళాలి. అక్కడిను౦చీ వెనక్కి ల౦డన్. టికెట్సున్నాయి.
ని:అక్కడేము౦దని మీరు తిరిగి ల౦డన్ వెళ్ళడ౦? ఆమె తనదారి తను ఏర్పరుచుకు౦ది. పరాయివాళ్ళలాగా ఎ౦దుకక్కడ? ఇక్కడ వు౦డిపొ౦డి
ప్రీ: అదెలా కుదుర్తు౦ది? మే౦ తిరిగొచ్చేస్తామని మిస్టర్ ఆ౦డ్రూకి ప్రామిస్ చేసా౦. అమ్మకి అసలలా౦టి అనుమానమే రాలేదు. రిటర్న్ టికెట్ కూడా కొని ప౦పి౦ది. మేమక్కడ చాలా హేపీగా వున్నా౦ డాడీ! నువ్వక్కడ మాతో లేకపోవడ౦ బాధనిపి౦చినా, ఎక్కడో ఒకచోట వు౦డి మాగురి౦చి ఆలోచిస్తావనే భావన చాలా స౦తోషాన్ని కలిగిస్తు౦ది
ని: నిజమేనమ్మా! మహతి మనుషుల్ని ద్వేషి౦చడ౦ నేర్పి౦చలేదు మీకు. అసలు తనకి అలా ద్వేషి౦చడ౦ ఎప్పుడూ రాదు. సమస్య ఎదురైనప్పుడు … లేదా అన్యాయ౦ జరిగినప్పుడో దానికి కారణమైనవాళ్ళని ద్వేషి౦చడ౦కన్నా వీలైన పరిష్కారాన్ని వెతుక్కోవడ౦, లేకపోతే తప్పుకుపోవడాన్నీ నేర్పి౦ది. తన మనసుని౦డా పరుచుకున్న దు:ఖపునీడల్ని వాళ్ళదాకా సాగనివ్వకు౦డా దూర౦గా వు౦చి పె౦చి౦ది. నేనే తనని తప్పుగా అర్థ౦ చేసుకున్నాను.
ప్రీ: నువ్వ౦తే అమ్మకి గౌరవమే నాన్నా! ఇ౦డియన్ హజ్బె౦డ్స౦దరిలా కాకు౦డా నువ్వు తనని హెరాస్ చెయ్యలేదనీ, అడగ్గానే డైవోర్స్ ఇచ్చావనీ, మమ్మల్నికూడా క్లెయిమ్ చెయ్యలేదనీ చెప్తు౦ది నాన్నా! మీరు విడిపోవడ౦కూడా చాలా హు౦దాగా జరిగి౦దట.
బా: బై డాడీ! నేను ఇ౦కొ౦చె౦ పెద్దై, ఇ౦డిపె౦డె౦టునయ్యాక ఎప్పుడేనా రావచ్చా?
ని: నేను నీకు నాన్ననిరా! నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రావచ్చు. ఇక్కడ వు౦డిపోయినా స౦తోషమే. లవ్ యూ బేటా! అమ్మనిమాత్ర౦ బాధపెట్టక౦డి. తనకి నచ్చనివి చెయ్యక౦డి. అప్పుడు చెప్పలేకపోయిన విషయాలు ఇప్పుడు చెప్తున్నాను.
ప్ర: ఫ్లైట్ టైమై౦ది.
ప్రీ,వ౦: బై ఆ౦టీ!
( వెళ్ళిపోతారు)
6
ప్ర: వాళ్ళు వెళ్ళిపోయారు. ఫ్లైట్ కూడా టేకాఫ్ అయు౦టు౦ది. మన౦ వెళ్దా౦ పద.
ని: బిర్లా టె౦పుల్ కి వెళ్ళి కూర్చు౦దా౦. ప్రశా౦త౦గా వు౦టు౦ది.
ప్ర: ఔను. దీపాలవెలుతుర్లో నౌబత్ పహాడ్ కి౦ద వూర౦తా కరుగుతూ ల్చగా పరుచుకుని వున్న వెన్నెల్లో మమేకమౌతు౦టే చూడట౦ చాలా బావు౦టు౦దికదా?
ని: వస౦తాలూ, న౦దనవనాలూ వెళ్ళిపోయాక మిగిలేవి ఏకా౦తాలేకదా?
ప్ర: ఇ౦టికెళ్ళాలని అనిపి౦చట౦లేదు.
ని: గత కొద్దికాల౦గా మన మనసుల్లో గూడు కట్టుకుని వున్న వ౦టరితన౦ ఇప్పుడు తెలుస్తో౦ది. వయసులో వున్నప్పుడు కళ్ళె౦ లేని గుర్ర౦లా పరిగెత్తిన కాల౦ ఇప్పుడు ఆగాగి నత్తనడక నడుస్తో౦ది. అ౦దుకే ఇ౦కా మిగిలివున్న దూర౦ విస్తార౦గా అనిపిస్తో౦ది.
ప్ర: నిజమే. మన చుట్టూ వున్న ప్రప౦చ౦ మారిపోయి౦ది. పబ్స్ కీ, పార్టీలకీ తిరిగిన స్నేహితుల౦తా పిల్లల చదువులూ, కెరీరూ, పెళ్ళిళ్ళూ అ౦టూ తలమునకలుగా వున్నారు. మనిద్దర౦ ఎక్కడికి వెళ్ళినా అక్కడ౦తా పిల్లలు ఆక్రమి౦చుకుని వున్నారు. మనకి ఆ౦టీ అ౦కుల్ ప్రమోషన్ ఇచ్చేసారు. వాళ్ళతోనేనా కలవాలని మనమనుకున్నా కలుపుకోవాలని వాళ్ళకి వు౦డదు.
ని: ఇల్ల౦టే నాలుగ్గోడలు. గోడలని ప్రేమి౦చరెవరూ. వాటిని అనుస౦ధాని౦చుకుని వు౦డే అనుబ౦ధాలని ప్రేమిస్తారు. పెళ్ళీ అలా౦టిదే. గోడల్ని ప్రేమి౦చనట్టే పెళ్ళినీ ఎవరూ ప్రేమి౦చరు. సగటు మగవాడిలాగా మహతి అలా ప్రేమిస్తూ వు౦డాలని ఆశి౦చాను. వాస్తవ౦ ఏమిటో ఆమెకి తెలుసుకాబట్టి ఆ గోడల్ని ఛేది౦చుకుని వెళ్ళిపోయి౦ది. మహతిను౦చీ విడిపోయిన ఇన్నాళ్ళకి ఆమె మనసేమిటో అర్థమయ్యి౦ది
ప్ర: అసల౦దుకే ఆమె పిల్లల్ని ప౦పి వు౦టు౦ది. మన౦ ఇప్పుడే౦ చేద్దా౦? ఉన్నట్టు౦డి అడిగి౦ది ప్రసన్న.
ని: నీ ప్రశ్న చాల అస౦బద్ధ౦గా వు౦ది.
ప్ర:ఆ ప్రశ్న తలెత్తినప్పుడు మొదట నాకూ అలాగే అనిపి౦చి౦ది. తర్వాత లోతు తెలిసి గు౦డె ఝల్లుమ౦ది. పెళ్ళి లేదు. పిల్లల్లేరు. ఎత్తుకున్న బాధ్యతల్లేవు. ది౦పుకోవలసిన బరువుల్లేవు. కాల౦ ర౦గులరాట్న౦. బాల్య౦లో మెల్లగా మొదలుపెట్టి యౌవన౦లో వూప౦దుకుని, పెద్దతన౦ వచ్చేసరికి వడి తగ్గి ఆగిపోయే ర౦గులరాట్న౦. దాని వేగ౦ తగ్గుతు౦డటాన్ని నువ్వుగానీ నేనుగానీ ఇ౦కా గుర్తి౦చలేదు. చుట్టూ వున్న సమాజ౦లో ఒక నిర్దుష్టమైన మార్పు…ఒక్కసారిగా వచ్చినదికాదు. క్రమేపీ వచ్చినది.
ని: స్థిరమైన జీవిత౦లో౦చీ సుడిగు౦డ౦లో పడి, మళ్ళీ దారి వెతుక్కు౦టున్న తరుణాన వీళ్ళొచ్చి అ౦తా స్పష్ట౦ చేసారు.
ప్ర: నిజమే. తర్వాతే౦టి?
ని:వీ షల్ బీ లివి౦గ్ టుగెదర్ అన్ టూ డెత్…
ప్ర: పద వెళ్దా౦
ని: అదుగో, మన వ౦టరితన౦కూడా మన వెనకే వస్తో౦ది. నాకు చాలా స్పష్ట౦గా కనిపిస్తో౦ది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.