లేమి నేపథ్యంలో translation by Savitri Ramanarao

ఆంగ్లమూలం Prabhakar Dhoopati’s story “Violence in Poverty”

జూన్ 2017లో నన్ను ఐదవతరగతిలో వేసారు. మా స్కూల్ మేముండే గుడిసెనుండీ మూడు కిలోమీటర్ల దూరం. మా గుడిసెలు మా గ్రామంలో హరిజనేతరులు వుండే ప్రాంతాలనుండి సుమారు నాలుగు కిలోమీటర్ల పైబడిన దూరంలో ఉంటాయి.
మేము దళితులం. స్కూల్లో మమ్మల్ని ఎస్ సీ లు అంటారు. ఈ రకంగా మమ్మల్ని వేరుపరచటంవలన మాకు మాకు సీట్లలో, ఉద్యోగాలలో కొన్ని కేటాయింపులు ఉంటాయి. అలాగే ఫీజ్ ,ఇతరత్రా అంశాలలో కాస్త మినహాయింపులు, వెసులుబాట్లు ఉంటాయి. ఈ కేటాయింపులు, రాయితీలు డాక్టర్ బీఆర్ అంబేడ్కరువలననే మాకు లభించాయని మావాళ్ళు ఆయనని దైవంగా భావించుతారు. అంబేడ్కర్‍కి ముందు మా కులాలవారి పరిస్థితి చాలా దైన్యంగా ఉండేది. వారు చెప్పే విషయాలు వింటూ నేటితో నాటిస్థితిని పోల్చుకుని మా కులాలవారు ఆరోజుల్లో అంత వివక్షకు, హింసకు గురౌవుతూ ఎలా జీవించేరో అని బాధతో కూడిన ఆశ్చర్యానికి, భయానికి లోనవుతూ ఉంటాను.
దళితులలో కూడా మాకులం ఇంకా తక్కువ స్థాయికి చెందినది. మా నాన్న శవాలను దహనం చేసే వారుండే స్థలాలలో పడుకుని దహనం అవుతున్న శవాలను దహనం పూర్తిగా అయేవరకూ జాగర్తగా కాపలాకాయటం చేసే కాటికాపరి వృత్తి చేసేవాడు. ఆయన పడుకోవడం కూడా ఆ చితుల దగ్గరే. శవాల కాపలా, దహనం పూర్తి అయేవరకూ కనిపెట్టుకు ఉన్నందుకు ఆ శవం సంబంధీకులు మా నాన్నకి డబ్బు ఇచ్చేవారు. తనకి డబ్బు ఇయ్యకపోతే దహనం చెయ్యనిచ్చేది లేదని ఖరాఖండీగా చెప్పి మరీ డబ్బులు వసూలు చేసేవాడు మా నాన్న. మా కుటుంబానికి అదే ఆదాయం. మాకులం వాళ్ళ వృత్తి అదే. ఈ వృత్తి ఎప్పటి నుండో ఉందని హరిశ్చంద్రుడు ఈ వృత్తిని చేసాడని మావాళ్ళు చెప్పారు. మావాళ్ళు సత్యహరిశ్చంద్రుడు కూడా కాటికాపరిగా చేసాడు అని గొప్పగా ఆయన కధ చెప్పేవారు.
మాకు ఎవరయినా పోయాడంటే ఆరోజు పండగే. ఆరోజు మాకు భోజనంలో కాస్త మాంసం, కొన్ని స్వీట్స్ చేర్చుకునే వీలు ఉంటుందని ఆనందపడేవాళ్ళం. హరిజనేతరులు గొడ్డు మాంసం తినరు. కానీ అది కోడి, మేక మాంసాలకన్నా చవకగా దొరకటంవల్ల మేము బయట ఎవరికీ తెలియకుండా రహస్యంగా తినేవాళ్ళం. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని మాఇంటివారు నాకు చెప్పేవారు.
ప్రతిరోజు సాయంత్రం ఒక ముసలాయన తలమీద వెదురుబుట్టలో సరుకులు పెట్టుకుని మా గూడెంకి వచ్చేవాడు. మా గూడెంలో అందరూ అతని దగ్గర సరుకులు కొనేవారు. అగ్రవర్ణాల హిందువులలా కాక మేము ఏ రోజు కావలసిన సరుకులు ఆరోజు అతని దగ్గర కొనుక్కునేవాళ్ళం. అతను మొదట చిన్న కిరోసిన్ దీపం పెట్టుకుని రాత్రి వరకూ సరుకులు అమ్మే వాడు. ఇప్పుడు సోలార్ లాంప్ పెట్టుకుంటున్నాడు. ఆయన సరుకులు కొలవటం, తూచటం, నేను పక్కనే కూచుని చిన్న కాగితంమీద పెన్సిల్‍తో కొనుగోలుదారు కొనుక్కున్న సరుకుల వివరాలు రాయటం చేసేవాడిని. ఆయన సరుకులు ఇవ్వటం అయిపోయాక ఒక్కో సరుకు ధర చెప్పేవాడు. నేను అవి సరుకు పక్క రాసి మొత్తం కూడి ఎంత సొమ్ము తీసుకోవాలో చెప్పేవాడిని. అలా నాకు కూడికలు, తీసివేతలు బాగా వచ్చేసాయి. అతను నేను చేసిన కూడిక సరిగా ఉందో లేదో చూసుకునేవాడు. ఒక్క తప్పు లేకుండా నేను కూడికలు చేయటంతో ఆయనకి నా పనితీరు చాలా నచ్చింది. నన్ను విశ్వాసపాత్రుడిగా పరిగణించటం మొదలుపెట్టాడు. అతను ఆరోజు అమ్మకాలు పూర్తిచేసుకు వెళిపోయేటపుడు నా చేతిలో రెండురూపాయలు పెట్టి ఒక పార్లే జీ బిస్కెట్లపేకెట్ ఇచ్చేవాడు. అందుకు నాకు చాలా సంతోషం అనిపించేది.
సరుకులు అమ్మేటప్పుడు నేను వాటిమీద ఉండే ఇంగ్లీష్‍పేర్లు చదివేవాడిని. ఆ ముసలాయన నాకు కూడికలు, తీసివేతలతో పాటు ఎక్కాలు, గుణకారాలు కూడా నేర్పాడు. మంచి జ్ఞాపకశక్తి, తెలివితేటలవలన నేను ఎంతో చురుకుగా చెప్పినవన్నీ తొందరగా గ్రహించేవాడిని. ఈరకంగా నా లెక్కలు చేసే శక్తి, ఇంగ్లీష్ రెండూ మెరుగు పడ్డాయి.
నేను ఐదోక్లాస్ మంచిమార్కులతో పాసయాను. నన్ను ఆరులో చేర్చాడు మా నాన్న. మా గూడెంకి ఏ రాజకీయనాయకుడు వచ్చినా మా నాన్న నన్ను వాళ్ళ ముందు నిలబెట్టి ఇంగ్లీష్‍లో రైమ్స్ చెప్పమనేవాడు. ఇంకా ఎక్కాలు ఒప్పచెప్పమనేవాడు. పెద్ద అంకెల గుణకారాలు నోటితో చెప్పించేవాడు. అవన్నీ ఒక్క తప్పు లేకుండా చెప్పేవాడిని.
ఒకసారి మా సర్పంచి, ఎమ్మెల్యే అయే అవకాశాలు ఉన్న వ్యక్తితో కలిసి మా గూడెంకి వచ్చాడు. వాళ్ళ ముందు ఎప్పటిలాగే నాచేత అన్నీ చెప్పించారు. నా ప్రతిభకు ముచ్చటపడి ఆ ఎమ్మెల్యే కాండిడేట్ నాకు రెండువేల బహుమానం ఇచ్చి మా నాన్నను నన్ను ఒక ప్రైవేట్‍స్కూల్‍కి పంపమని చెప్పాడు. ఒక రికమెండేషన్ లెటర్ కూడా ఇచ్చాడు.
మా నాన్న నన్నొక ప్రైవేట్‍స్కూల్‍కి తీసుకువెళ్ళాడు. అక్కడ ఫీజులు మా ఆర్ధికస్థాయికి చాలా పైన ఉన్నాయి. ఆ స్కూల్ సగానికి సగం ఫీజ్ తగ్గించింది నాకు. అయినా ఆ మిగిలిన సగం ఫీజు కట్టటం కూడా తలకి మించిన భారంగానే అనిపించింది మాకు. సరుకులు అమ్మే ఆయన కొంత సాయం చేస్తే మిగిలినది మా తలితండ్రులు నానాతంటాలు పడి సర్దుబాటుచేసారు.
ప్రతి నెలా ఫీజు కట్టే సమయానికి గ్రామంలో ఎవరైనా పోవాలని కోరుకునేవాడిని. అలా పోయినప్పుడు వచ్చే డబ్బుతో నా ఫీజ్ కట్టుకోవచ్చుకదా అని నా ఆశ. ఇక్కడ చేరక మునుపు నా దృష్టి ఎవరయినా పోతే మంచి భోజనం వస్తుంది అనే ఉండేది. కానీ ఇప్పుడు నా దృష్టి తిండిమీదనుండి చదువుమీదికి మళ్ళిపోయింది. ఎవరయినా పోతే బావుండును నాకు ఫీజ్ కట్టుకుందికి డబ్బులు వస్తాయి కదా అనిపించేది.
ఫిబ్రవరి 2020లో నేను పరీక్ష ఫీజ్ కట్టాల్సి వచ్చింది. ఎప్పటిలాగే ఎవరయినా పోవాలని కోరుకున్నాను. మా క్లాస్‍టీచర్ మా ఆఖరి టర్మ్‌ఫీజు, పరీక్షఫీజు ఒకేసారి కట్టేయాలన్నారు ఆరోజు ఇంటికి వచ్చేటప్పుడు.
కళ్ళు మూసుకు మా గ్రామదేవత పోచమ్మను “తల్లీ! మా గ్రామంలో ఎక్కువ చావులు ఉండేట్లు చెయ్యి.” అని ప్రార్ధించాను.
ఇంతలో కరోనా మహమ్మారి వచ్చి పడింది. ఎక్కువ చావులు వుంటాయని నాకు ముందు చాలా సంతోషం వేసింది. అంతలోనే నన్ను భయం కమ్మేసింది. మా నాన్న కరోనా వైరస్‍వల్ల చనిపోయేవాళ్ళ శవాలకి దగ్గరగా ఉండటం, చితుల దగ్గర పడుక్కోవటం ,వాళ్ళ బంధువులకు దగ్గరగా మెలగటం చేస్తే తనకి కరోనా వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ ఉంటుంది కదా అనిపించింది.
మర్నాడు నేను సరుకులు అమ్మే ఆయన అమ్మకం పూర్తి అయ్యాక ఆయనకి లెక్కలు అప్పజెప్పి ఇల్లు చేరేసరికి మా నాన్న జ్వరంతో దగ్గుతున్నాడు. మా అమ్మ ఏడుస్తోంది. మా పక్కింటివాళ్ళ సాయంతో నాన్నని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాము. అక్కడి డాక్టర్లు పరీక్ష చేసి మామూలు వైరల్ ఫీవర్, కరోనా వైరస్‍వల్ల కాదు అన్నారు. మమ్మల్ని మా ముక్కులని, నోళ్ళని టిష్యూపేపర్‍తోను, లేదా శుభ్రమైన గుడ్డతో చేసిన మాస్క్‌లతో మూసి ఉంచుకోమన్నారు.
మా నాన్న ని ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు దారిలో నా అజ్ఞానాన్ని మన్నించమని, గ్రామంలో జనాన్ని రక్షించమని పోచమ్మని ప్రార్ధించాను.