వారసత్వం by S Sridevi

  1. కాగితం మీది జలపాతం by S Sridevi
  2. తేడా వుంది by S Sridevi
  3. అన్ హోనీ by S Sridevi
  4. గూడు by S Sridevi
  5. కోడలి యిల్లు by S Sridevi
  6. విముక్తి by S Sridevi
  7. వారసత్వం by S Sridevi
  8. మళ్ళీ అదే తీరానికి by S Sridevi
  9. యుద్ధం ముగిశాక by S Sridevi
  10. గతజలం, సేతుబంధనం by S Sridevi
  11. తనువు, మనసు, ఆత్మ by S Sridevi
  12. లిఫ్ట్ ప్లీజ్ by S Sridevi
  13. కుటుంబదృశ్యం by S Sridevi
  14. అనుభూతులు పదిలం…పదిలం by S Sridevi
  15. స్నేహితుడు by S Sridevi

Youtubers please WhatsApp to 7382342850

చిన్నన్నగారింట్లో పెళ్ళికి వెళ్ళొచ్చింది తులశమ్మ. వస్తూ అక్కడ తనకి ఇచ్చినవన్నీ ఏ ఒక్కటీ వదలకుండా జాగ్రత్తగా తెచ్చుకుంది.
“నువ్వు రాలేదని అక్కడంతా అడిగార్రా! ” అంది రాగానే, కొడుకుతో. రఘురాం నవ్వేసి వూరుకున్నాడు.
హల్లో కూర్చుని పెట్టె తెరచింది. అదోక పండోరా బాక్స్. తెరిస్తే రఘురాంకి అంతా బాధే.
“ఇదుగో, యీచీర పెట్టాడు నాకు.” అని గంధం రంగు చీర తీసి చూపించింది. రఘురాం తలూపాడు.
“ఆడపెళ్ళివాళ్ళు మరీ పిసినిగొట్టువాళ్ళు. ఎంచెంచి ఒక్కటే కర్పూరం పువ్విచ్చారు. అక్కడికీ చెప్పాను, యింట్లో యిద్దరు పిల్లలున్నారమ్మా, దెబ్బలాడుకుంటారని. విననట్టే వెళ్ళిపోయిండా పువ్వులు పంచుతున్న పిల్ల. నా పక్కని శారద వుంటే దాన్నడిగి రెండోది తీసుకున్నాను. ” అని మనవలిద్దరినీ పిలిచి చెరొకటి యిచ్చింది.
శారదంటే రఘురామ్ పెద్దమేనమామ కూతురు. ఆమెకీ యిద్దరు పిల్లలున్నారు మరి!
“నీకూ, రజనీకీ బట్టలు పంపించారు” ఇంకో ప్లాస్టిక్ కవరు తీసివ్వబోతూ చెప్పింది.
అతను దాన్నందుకోలేదు. అందుకోకుండా, “ఎందుకు తీసుకున్నావు? పెళ్ళికి మేం రాలేదుకద?” అనడిగాడు. అప్పటికే అతని ముఖంలోని ప్రశాంతత ఎగిరిపోయింది.
“బావుంది. పెళ్ళికెళ్ళనంతమాత్రాన… సొంతమేనల్లుడివి, బట్టలు పెట్టడం మానేస్తారా?”
”నాకలా నచ్చదని ఎన్నోసార్లు చెప్పాను”
“సర్లే, నీదంతా చాదస్తం”” తీసిపారేసిందావిడ.
అదే… అదే రఘురామ్‍కి నచ్చనిది. మనిషిని రెచ్చగొట్టి రక్తం వుడికేలా చేస్తుంది. వద్దని తను చెప్తున్నా ఎందుకు తీసుకోవాలి? పెళ్ళికెళ్ళనివాళ్ళందరికీ బట్టలు పెట్టాలని ఎక్కడుంది? వాళ్ళకీ యివ్వాలని వుండకపోవచ్చు. తన తల్లే అడిగి రాబట్టుకుని వుండి వుంటుంది.
“మురళికి వేరే వుద్యోగం వచ్చిందట. పదిహేడువేలట జీతం. చీర కొనుక్కొమని ఐదొందలిచ్చాడు.”
“…”
“శారదావాళ్ళూ ఇల్లమ్మేసారట. పాతికలక్షలట. వేరే సెంటర్లో కొంటారట. దాని భర్త ఫైనాన్స్ కంపెనీ పెడతాడట. మరి నాకేమిస్తావే అనడిగాను. వెంటనే రెండొందలు తీసి చేతిలో పెట్టింది.”
రఘురామ్‍కి తలతీసికెళ్ళి దేనికిందేనా పెట్టాలనిపించింది.
“వాళ్ళందరి దగ్గిరా ఎందుకు తీసుకుంటావు?” చిరాగ్గా అడిగాడు.
“బావుంది. అందరూ తలో చెయ్యీ వేస్తేనేగా, నువ్వు ఇంతటివాడివయ్యావు?” తేలిగ్గా అనేసిందావిడ.
“ఛ…ఛ…” విసుగ్గా అక్కడినుండి వెళ్ళియాడు. ఆవిడకి దూరంగా వెళ్ళటమైతే వెళ్ళాడుగానీ మనసులో ఆవిడ మాటలు మార్మోగుతునే వున్నాయి.
నిజమే! తన బాల్యం చాలా దయనీయంగా గడిచింది. పెద్దమేనమామ ఫీజులు కట్టేవాడు. రెండో మేనమామ ఆయన పిల్లలకి పొట్టైన బట్టలు తనకి ఇచ్చేవాడు. విశాలా, హరీ, మురళీ, శారదా వీళ్ళంతా తన కజిన్స్. వాళ్ళ పాకెట్‍మనీలోంచి ఐదూపదీ తీసి ఖర్చులకి తనకిచ్చేవారు. అప్పుడప్పుడు వాళ్ళ ఖర్చులతో సినిమాలకీ హోటళ్ళకీ తీసుకెళ్ళేవారు. అదంతా తల్లిమీద అభిమానం చూపిస్తూ… తండ్రిని హేళన చేస్తూ. తనకి వద్దనాలనిపించేది.  వాళ్ళు ఇవ్వటానికీ తను వద్దనటానికీ మధ్య అడ్డుగోడలా తల్లి వుండేది. మరి తన తండ్రి?
ఎమ్మే ఎల్లెల్బీ చేసాడు. ప్రాక్టీసు పెట్టి వాదించి నెగ్గి సంపాదించే నేర్పు లేదు. అలాగని మన నేర్పుతోటీ, అడిగి సాధించడంతోటీ సంబంధంలేని ఏ వుద్యోగమేనా చెయ్యాలంటే నామర్దా. ఎప్పటికేనా ఒకప్పటికి గొప్ప లీడింగ్‍లాయర్నౌతానని కలలుకనేవాడు. లేమి మనిషికి శాపం కాదు. అది అతని అసమర్ధత. తండ్రి అసమర్ధత తమ జీవితాలతో ఆడుకుంది. ఆయన పోయాకకూడా దాని ప్రభావం వదల్లేదు. మనసు చాలా సున్నితమైనది. దాని చుట్టూ పొరలుపొరలుగా మోడెస్టీ, సామాజికకట్టుబాట్లూ, బంధుత్వాల్లాంటివన్నీ చుట్టుకుని వుంటాయి.  ఆ పొరలన్నీ చిరిగిపోయి నేరుగా ఎన్నో ఆటుపోట్ల దాడిని ఎదుర్కొంది తన మనసు. ఎన్నో గాయాలయ్యాయి దానికి. ఆ తర్వాతే ఒక వొడ్డుకి చేరుకుంది తన వొడ్డుకి చేరుకుంది తన జీవితం. తనతోపాటే తన తల్లిదికూడా. ఐనా ఆవిడని పాతజీవితపు చాయలు వదల్లేదు. భుజమ్మీద చెయ్యిపడేసరికి చివ్వున తలతిప్పాడు రఘురామ్. రజని. అతని భార్య.
“ఆవిడ మారదని తెలిసీ మీరెందుకు ఇలా మనసు పాడుచేసుకోవటం? ఆవిడకి వాళ్ళు పైవాళ్ళు కాదు. స్వంత అన్నదమ్ములూ , అక్కచెల్లెళ్ళూ, వాళ్ళ పిల్లలు. అడగటంలో తప్పేం లేదనిపించించవచ్చు” అంది మృదువుగా.
రఘురామ్ తన భుజమ్మీద ఆమె వేసిన చేతిని లాక్కుని అందులో ముఖం దాచుకుని అశాంతిగా కదుపుతూ అన్నాడు,” వాళ్ళు నాకుకూడా పైవాళ్ళు కాదు రజనీ! వాళ్ళందరితోటీ సరదాగా కలవాలని వుంటుంది. వాళ్ళంతా నాకు అంతో యింతో చేసినవారన్న కృతజ్ఞత కూడా వుంది. అదంతా సరే. ఇప్పుడు నేనే ఒఅక్రికి పెట్టే స్థితిలో వున్నాను. ఇంకాకూడా వాళ్ళనుంచీ ఆశిమ్చడం అవసరమా? వాళ్ళని డబ్బు అడుగుతుంది. పెట్టుపోతలవీ దబాయించి తీసుకుంటుంది. వాళ్ళు అదో వెక్కిరింతగానో జాలితోనో యిస్తారు. ఇదంతా నేను భరించలేకపోతున్నాను”
“బాధపడేం లాభం? మీరెంత గట్టిగా చెప్తే ఆవిడంత మొండిగా వుంటోంది”
“నిజమే! ఎంతకాలం ఈ కృతజ్ఞత మోస్తూ తిరగను? ఏదైనా గట్టిగా అంటే మళ్ళీ వెళ్ళి వాళ్ళకి చెప్పుకుంటుంది. ఎలా రజనీ? పోనీ ఈ బంధువులకి దూరంగా వెళ్ళిపోయి నా విలువేదో నాకుండేచోట నేనుగా బతుకుతానంటే నాతో రాదు” అసహనంగా అన్నాడు.
రజని నిట్టూర్చింది. భర్త బాధ అర్థమైంది. మామగారికి చదువుండేది. తోటివారితో సమానంగా నిలబడగలిగే తెలివికూడా వుండేది. ఐనా ఆయన తన బాధ్యతలని సరిగా నిర్వర్తించలేదు. మనిషి తన పిల్లలకి ఆస్తిపాస్తులతోపాటు బంధుత్వాలనికూడా వారసత్వంగా ఇస్తాడు. వాళ్ళతో అతనికి వుండే అనుబంధాలు, గౌరవవిలువలు… అన్నీ అతని తరువాత వాళ్ళకి అందుతాయి. అతని యిమేజి వాళ్ళని అంటిపెట్టుకునే వుంటుంది. అదొక పునాదిలాంటిది. దానిపైనే వాళ్ళ వ్యక్తిత్వం, సామాజికవిలువా నిర్మించబడతాయి. చుట్టాలమధ్య వున్నప్పుడు రఘురాం‍లో ఒకలాంటి ఆత్మన్యూనత చోటుచేసుకోవడాన్నీ వాళ్ళతో అతను సరిగా మాట్లాడలేకపోవటాన్నీ గుర్తించిందామె. ఇవన్నీ అతని కెరీర్‍మీద ప్రభావాన్ని చూపుతున్నాయనికూడా. సక్సెస్‍ఫుల్ ఎగ్జిక్యూటివ్‍ కాలేకపోతున్నాడు.
అత్తగారు అతని మనసెరిగి ప్రవర్తిస్తే బాగుండుననిపించింది రజనికి. కానీ ఆవిడ వినదు. మనిషి ఆత్మాభిమానాన్ని చంపుకుని ఒక మెట్టు దిగితే ఆ తర్వాతివన్నీ జారుడుమెట్లే. అదేకాదు, ఆవిడకి భర్తతోటీ, అత్తింటిగౌరవంతోటీ ఎలాంటి అనుబంధం ముడిపడలేదు. పెళ్ళయాకకూడా ఆవిడ పుట్టింట్లోనో పుట్టింటివారిమధ్యనో గడిపింది. వాళ్ళు పెడితే తింది. తన భర్తని అసమర్ధుడంటే సహించింది. అలా ఆయనతో వుండవలసిన అనుబంధాన్ని తెంపుకుంది. దాని ప్రభావం కొడుకుమీద పడుతుందని అనుకోలేదు. అతను, తన కొడుకుగాబట్టి తనలాగే ఆలోచిస్తాడని అనుకుంది. అలా వుండలేక అతనికి నరకం

తెలిసినవాళ్ళు ఫ్రీడంఫైటర్స్ పాస్‍మీద కాశీ వెళ్తూ తులసమ్మని రమ్మన్నారు. ఆవిడ వెళ్దామనుకుంటే రఘురాం ఎల్టీసీమీద వెళ్ళచ్చు. కానీ వుత్తిగా వస్తున్నప్పుడు వదులుకోవడమెందుకని వెళ్ళిపోయింది. తల్లీకొడుకులకి గొడవైంది- అదీ ఎప్పట్లాగే.
రఘురాం‍కి యీ వొక్క విషయంలోనే తల్లితో గొడవ. మిగిలిన అన్ని విషయాల్లో ఆవిడంటే యిష్టం, సానుభూతీ  వున్నాయి. తనలాగే ఆవిడా తండ్రివలన బాధపడింది. ఆయన తెలివితక్కువతనం ఆవిడ జీవితాన్నీ అస్తవ్యస్తం చేసింది. అందరిలా గౌరవంగా బతకగలిగే పార్శ్వాన్ని నిర్వీర్యం చేసింది.
తులశమ్మ వెళ్ళీవెళ్ళగానే ఆవిడ చెల్లెలి కూతురి పెళ్ళొచ్చింది. ఆవిడది చాలా పెద్ద బలగం. నలుగురు అన్నదమ్ములు, ఇద్దరక్కచెల్లెళ్ళు వున్నారు. భర్తవైపు సరైన సంబంధాలు ఏర్పడకపోవటంతో ఇటువైపు అనుబంధాలని పెంచుకుంది. ఎప్పుడూ ఏవో ఒక సందర్భాలు. పెళ్ళిళ్ళూ, చావులూ, పుట్టుకలూ, బారసాలలు…
తల్లి లేకపోవటంతో రఘురాంకి వెళ్లక తప్పలేదు. చాలా అయిష్టంగా బయల్దేరాడు.
“అక్కడ ఎవరితోటీ గొడవపడకండి” హెచ్చరించింది  రజని. పెళ్ళికి బంధువులంతా వచ్చారు.
“ఏరా, బావున్నావా? పెద్దవాడిపోయావు. మమ్మల్ని కాస్త గుర్తుంచుకో మరి!” పెద్దమేనమామ పలకరింపులో వ్యంగ్యం.
“మీ అందరివల్లేగా మామయ్యా, ఇంతటివాడినయ్యాను. ఎలా మర్చిపోతాను? ” అనాలి రఘురామ్. అనక తప్పదు. జీవితాంతం వాళ్ళపట్ల కృతజ్ఞత మోస్తూ తిరగాలి. అతనిలో అశాంతి. ఎవరినీ పట్టించుకోనట్టు … ఎవరి విలువ వారికి ఇస్తూ నిశ్చింతగా తిరగలేదా తను? ఆ స్వతంత్రం తనకి లేదా?
“రజనినీ, పిల్లల్నీ తీసుకురావల్సింది” అంది శారద, ఆయన కూతురు.
రఘురామ్ నవ్వేసి వూరుకున్నాడు.
“పుట్టింటివైపు తప్పించి మనవైపు చుట్టరికాలు అక్కర్లేదేమిటి తనకి?” మరో విసురు. దానికీ అతను చిరునవ్వే. నిస్సహాయుడి బ్రహ్మాస్త్రం చిరునవ్వు. పెళ్ళి జరుగుతోంది. ఎంతో అపురూపంగా గుర్తుంచుకోవలసిన ఘట్టమది ఎవరికేనా.
బంధువులెవరి ప్రమేయం లేకుండా తనకి తను ఇష్టపడి చేసుకున్నాడు రజనిని. తల్లితోసహా అందరికీ కోపం వచ్చింది. పెళ్ళంతా మర్యాదలు సరిగ్గా జరగలేదని మగపెళ్ళివారు అలగటాలు, ఆడపెళ్ళివారు సర్దిచెప్పటాల్తోనే సరిపోయింది. తల్లిలో సహజసిద్ధంగా అంటే … ఆవిడ వివాహవైఫల్యం కారణంగా వున్న కోపానికి ఈ అసంతృప్తి తోడై, అగ్నికి ఆజ్యం పోసినట్టైంది. పెళ్ళివారితో గీసిగీసి బేరమాడింది. తను చూసిన ఏ పెళ్ళిలోనూ ఇలా జరగలేదు. రెండువైపులవాళ్ళూ ఒకరినొకరు గౌరవించుకున్నారు. సరదాగా గడిపారు. ఈరోజుకీ తను మాత్రం మామగారిముందు తలెత్తలేడు. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. తనకెక్కడ కోపం వస్తుందోనని అత్తవారింట్లో అంతా భయపడుతుంటే  అసహ్యం వేస్తుంది. రజనికూడా మొదట్లో తన దగ్గర అలాగే వుండేది. తామిద్దరూ మానసికంగా ఒకటి కావటానికి చాలాకాలం పట్టింది.
“ఏరా, బావున్నావా? మరీ బైటి చుట్టంలా ముహూర్తం టైముకి వచ్చావే?” భుజంమీద చరుస్తూ మురళి పిలిచేసరికి ఆలోచనల్లోంచీ తేరుకున్నాడు రఘురాం. వచ్చి పక్కని కూర్చున్నాడు మురళి. ఈ మురళిని తనిలా చనువుగా భుజం చరిచి మాట్లాడగలడా? క్రీగంట చూసాదు రఘురాం. న్యూనతాభావం అతని వెన్నెముకనిండా నిండిపోయి దాన్ని వంగిపోయేలా చేసింది.
“ఎలా వుంది నీ జాబ్? ప్రమోషన్సుంటాయా?” అడిగాడు మురళి. ఇప్పటిదాకా అతనికి సరైన వుద్యోగమే లేదు. తండ్రి ఆస్థిని కరిగిస్తూ గడిపాడు ఇన్నాళ్ళూ. ఆ విషయం ఇద్దరికీ ఆ క్షణాన గుర్తు రాలేదు. “అసిస్టెంటు అకౌంట్సాఫీసరు లిస్టులో వున్నాను” జవాబిచ్చాడు రఘురాం.
హరి వచ్చి వాళ్ళదగ్గర కూర్చున్నాడు.  అతన్ని చూస్తే ఒక విషయం గుర్తొచ్చి చాలా బాధపెడుతుంది రఘురాంని.  అందరూ కలిసి ఒకసారి వైజాగ్ బీచికి వెళ్ళారు. తడి ఇసుకలో కూరుకుపోయి హరి చెప్పు తెగిపోయింది. దాన్ని రఘురాంతో మోయించాడు.
“హౌ ఆర్ యూ?” అని కళ్ళెగరేసాడు హరి. రఘురాంకి మళ్ళీ నవ్వే శరణ్యమైంది.
“ఔన్రా, మీ బావమరిది బేంకులోనేగా, చేసేది? నాకో లక్ష పర్సనల్ లోను కావాలి. కొంత కేపిటల్ అవసరముంది” అన్నాడు హరి అథార్టీగా. ఆరోజు చెప్పులు మోసిన చేతులైతే నావిగానీ మా బావమరిది చేసే బేంకుమాత్రం నాది కాదని చెప్పాలనిపించింది రఘురాంకి. కానీ మాటలు రాలేదు.
“చూస్తాను” అన్నాడు మెల్లగా.
“ఎప్పట్లో వస్తుంది?”
“అడిగి చెప్తాను”
“వీలైనంత తొందరగా వచ్చేలా చూడమను. వెళ్ళగానే కనుక్కుని ఫోన్ చెయ్యి” హరిలో అదే అథార్టీ. దాన్నే తను తప్పించుకోవాలనుకునేది. వాళ్ళు చేసిన సాయాలేమో చాలా చిన్నవి. వాళ్ళ సామాజిక జీవితానికిగానీ నిత్యజీవితంలోని సౌఖ్యాలకిగానీ ఎలాంటి హానీ చెయ్యనివి. తనని చెయ్యమని అడిగేవి మాత్రం ఇరుకున పెట్టేవి. నిజంగా లక్షరూపాయలు చేతిలో లేకుండానే వున్నాడా హరి?  తల బలంగా విదిల్చాడు రఘురాం.
పెళ్ళికి ఇంకా చాలామంది బంధువులొచ్చారు. వాళ్ళలో చాలామందికి రఘురాం తెలీదు. అతనుమాత్రం ఎంతోమందికి తెలుసు. తెలీనివాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటున్నారు.
తులసమ్మ కొడుకు…
తులసమ్మ కొడుకట…
ఉద్యోగం ఏమైనా వుందా? తండ్రిలాగేనా?
వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ అతన్ని కుతూహలంగా చూస్తున్నారు. వాళ్ళ చూపులు అతన్ని గుచ్చుతున్నాయి.
జీలకర్రబెల్లం పెట్టడం, మంగళసూత్రధారణ అయ్యాయి. తలంబ్రాలు పోసుకున్నారు. చదివింపులు మొదలయ్యాయి. వెయ్యినూటపదహార్లు తీసాడు రఘురాం చదివిచడానికి. కానీ అంతా వందా రెండువందలు చదివిస్తుంటే తనొక్కడూ అంత ఇస్తే భేషజానికి పోయినట్టుంటుందనిపించి మళ్ళీ లోపల పెట్టేసుకుని నూటపదహారే తీసాడు.
అప్పటికి మధ్యాహ్నం పన్నెండౌతోంది. చదివింపులౌతునే వున్నాయి. ఒక్కొక్కరూ వెళ్ళి బఫేలో చేరారు. రఘురాంకూడా వెళ్ళాడు. ప్లేట్ తీసుకుని అన్నీ వేసుకుని ఒక వారగా నిలబడ్డాడు. అదైపోతే అందరికీ చెప్పేసి వెళ్ళిపోవచ్చు. ఊపిరి పీల్చుకోవచ్చు.
తింటుంటే శారద వచ్చి కలిసింది. “నీకసలు మమ్మల్ని చూడాలనీ కలుసుకోవాలనీ వుండదా?” నవ్వుతూ అడిగింది. చాలా మామూలుగా వుంది ఆ నవ్వు. కావల్సినవాళ్ళు పలకరించుకుంటున్నట్టు వుంది. కానీ రఘురాం గుండెని కోసింది. తను తరచు వచ్చిపోతుంటే వాళ్ళ మెహర్బానీ ఇంకా బాగా చూపించుకోవచ్చుననేమో! అనిపించింది.
“ఎప్పుడో మీ పెళ్ళిలో చూసాను రజనీని. మళ్ళీ చూడలేదు. పిల్లలేం చదువుతున్నారు?” శారదే అడిగింది.
“బాబు మూడు, పాప ఒకటి”
“బారసాలకూడా సింపుల్‍గా చేసేసుకున్నారు ఎవర్నీ పిలవకుండానే”
“బాబు పుట్టినప్పుడు తనకి బాగా సీరియసైంది. దాదాపు ఆర్నెల్లు పట్టింది కోలుకోవడానికి. పేరే పెట్టలేదు వాడికి. బాబని పిలిచేవాళ్ళం. వాడికి చెయ్యలేదని పాపకీ ఫంక్షన్ చెయ్యలేదు. స్కూల్లో అడ్మిషన్లప్పుడు నచ్చిన పేర్లు రాసేసాం”
“ఫంక్షన్స్‌కి కూడా రారేమిటి మీరిద్దరూ, పిల్లల్ని తీసుకుని? పిల్లలకి బంధుత్వాలెలా తెలుస్తాయి?”
“అమ్మ వస్తునే వుందికద?”
“”అత్తయ్య ఒక్కర్తీ వస్తే సరిపోతుందేమిటి?”
“”…””
“మీనాన్నకి బంధుప్రీతి చాలా ఎక్కువ. హైద్రాబాద్ ఎప్పుడొచ్చినా మావూళ్ళో దిగకుండా వెళ్ళేవాడు కాదు” అంది.
ఎక్కడో ముడి బిగుసుకుంటోందనిపించింది రఘురాం‍కి. తింటున్న ప్లేట్ అలాగే వదిలేసి పారిపోవాలన్న కోరిక బలంగా కలిగింది.
“ఏమిటే, ఏదో మాట్లాడుకుంటున్నారు?” పెద్దమేనమామ వాళ్ళ దగ్గరకొచ్చాడు. ఆయన్ని చూసి అందరూ ఒకరొకరుగా అక్కడికే వచ్చి చేరారు. యూనియన్ బడ్జెట్లో లోటు, ఎన్డియ్యే గవర్నమెంటు, ప్రస్తుతం వున్న కార్పొరేట్ పాలసీ… ఎన్నో వున్నాయి మాట్లాడుకోవటానికి. కానీ వాటిల్లో ఏ వొక్కటీ ఎవరికీ గుర్తు రాకపోవటం రఘురాం దురదృష్టమనుకోవాలి.
“ఎప్పుడూ ఎవరింటికీ రావేమిటని అడుగుతున్నాను నాన్నా!” అంది శారద.
“వీడిక్కాదుగానీ, వీళ్ళ నాన్నకుండేదమ్మా, మనవాళ్ళన్న ప్రేమ. ఎక్కడ ఏ కార్యం వున్నా, వచ్చేవాడు. చేతిలో డబ్బుందో లేదో కూడా చూసుకునేవాడు కాదు. ఒక్కొక్కసారి తిరుగుచార్జీలకి నేనే ఇచ్చేవాడిని” అన్నాడు పెద్దమేనమామ. రఘురాంకి పొలమారింది. విశాల వెళ్ళి నీళ్ళు తెచ్చిచ్చింది.
“థేంక్స్” అందుకుని గటగట తాగేసాడు
“మీ ఆవిడ తలుచుకుంటుందేమో” ఆమె నవ్వింది. అతనికి నవ్వు రాలేదు. తనకెందుకు పొలమారిందో వీళ్ళకెవరేనా చెప్తే బాగుండననిపించింది. ఆగిపోయిన సంభాషణ మళ్ళీ వూపందుకుంది.
“డబ్బు దగ్గర ఆయనకెలాంటి మొహమాటమూ వుండేదికాదు. ఓ పదివ్వరా అని నిస్సంకోచంగా అడిగి తీసుకునేవాడు”” అన్నాడు మురళి.
“చాలా తెలివైనవాడు. దాన్ని సరైనదార్లో వుపయోగించుకుంటే ఎంతో పైకొచ్చేవాడు”” పెద్దమేనమామ నిజాయితీగానే బాధపడ్డాడు. అదాయన చెల్లిలి జీవితం పాడైనందుకు కావచ్చు.
“ఒకసారిలాగే! హైద్రాబారెళ్తూ దారేకదా, మావూళ్ళో దిగాడు. రావటం బాగానే వచ్చాడు. మాపాపకి బిస్కెట్ల పేకట్టనుకుంటా, తెచ్చాడు. అంతదాకా సరే, తిరిగి వెళ్ళడానికి డబ్బులు చాలవే, వో వంద వుంటే యిమ్మంటాడు. నాదగ్గరెక్కడివి? పెళ్లైన కొత్త. ఏ ఖర్చైనా మావారే చూసుకునేవారు. అందుకని ప్రత్యేకించి నాదగ్గిరేమీ వుంచుకునేదాన్ని కాదు. భలే యిరుకున పెట్టేసాడు. ఆ విషయం మావారు విన్నారు. ఏమీ ఎరగనట్టు వందతీసి టేబుల్ మీద పెట్టి ఆఫీసుకి వెళ్ళిపోయారు. ఇచ్చి పంపించాను. ఇప్పటికీ ఆయన దెప్పుతుంటారు, ఆవిషయం గుర్తుచేసి”” అంది శారద.
రఘురాం తలొంచుకుని ప్లేట్లో గీతలు గీస్తున్నాడు. తల్లితోకూడా వీళ్ళివే విషయాలు మాట్లాడతారా? ఆవిడకీ తనలాగే యిబ్బందిగా వుంటుందా? ఆ యిబ్బందిని అధిగమించడానికి డబ్బనీ, లాంఛనాలనీ అడుగుతూ ముళ్ళకంపలా ఆత్మరక్షణ చేసుకుంటుంటుందా?
“మా ఫ్రెండు ఒకతని కోర్టుకేసు ఉంటే వరంగల్ వెళ్లాను. అదాలత్ ముందు కనిపించాడు ఈయన. ఏమిటి మామయ్యా, ఇక్కడున్నావు అనడిగాను. ఎవరితోటో కలిసి వచ్చానన్నాడు. ఆ తీసుకొచ్చిన పెద్దమనిషి తనదారిన తను తిరుగుతుంటే యీయన తిండీతిప్పలూ లేక అలా చూస్తూ నిలబడ్డాడు. జాలేసి హోటల్‍కి తీసుకెళ్ళి నాతోపాటు భోజనం పెట్టించాను” అన్నాడు మురళి.
మనిషికి శాపం కాదు. దాన్ని ప్రదర్శించుకోవడం పెద్దశాపం.  సంఘంలో వునికి, గుర్తింపు వుండి, చెప్పుకోవటానికి ఒక కుటుంబం,  వుండటానికో యిల్లూ, వంట్లో ఆరోగ్యం వున్న వ్యక్తి లేమిలో వున్నాడంటే అది శాపం కూడా కాదు. అతని లోపం. చేతిలో సరిపడ్డంత డబ్బు లేకుండా ఎవరిమీదో ఆధారపడి తండ్రి, వరంగల్ ఎందుకు వెళ్లాలి? వెళ్ళినవాడు ఈ మురళివెంట హోటల్‍కి ఎందుకు వెళ్ళాలి? ఇతనెందుకు తీసుకెళ్ళాలి? తీసుకెళ్ళినవాడు అదంతా ఎందుకు ప్రచారం చేయాలి? ఆరోజుని ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి ఇచ్చేస్తే తీసుకుంటాడా ఈ మురళి? తననీ అపఖ్యాతినుంచీ విముక్తిచేస్తాడా ? రఘురాం చెయ్యి జేబుదాకా వెళ్ళింది. మళ్లీ వెనక్కి తీసేసుకున్నాడు.
ఎవరికి, ఎంతని అప్పు తీర్చగలడు? తనకి తిండి పెట్టి చదివించినది వీళ్ళు. సంఘంలో తనకొక స్థానాన్ని చూపించినది వీళ్ళు. వీళ్ళ సహాయం, హేళన చేస్తూ ఇచ్చిన డబ్బు తన రక్తంలో ఇంకిపోయింది. అంతేకాదు, తనూ రజనీ పిల్లలూ తినే తిండిలోకూడా కల్సిసిపోయింది. ఏదని, ఎన్నని తిరిగి ఇవ్వగలడు? తన తండ్రి గురించి చులకనగా మాట్లాడటంలో వీళ్ళకి సంతోషం వుంది. ఆ సంతోషాన్ని ఎందుకు కాదనాలి తను?  కాదన్నంతమాత్రాన సంఘటనలు చెరిగిపోతాయా? డబ్బు తిరిగి ఇచ్చేసినంతమాత్రాన వీళ్ళు తనని సమాన స్థాయిలో చూస్తారా?   తన తండ్రిగురించి చెప్పుకోకుండా ఉంటారా? తినటం ముగించి సింక్ దగ్గరికి వెళ్లాడు రఘురాం.
“ఇంక వెళ్తాను పిన్నీ!” అన్నాడు అక్కడినుంచి ఆడపెళ్ళివారి విడిదింట్లోకి వెళ్లి.
“అదేంట్రా వచ్చినట్టే లేదు, అప్పుడే వెళ్ళిపోతానంటున్నావు? ఐనా రజనినీ పిల్లల్నీ తీసుకురావద్దూ?” కోప్పడింది పినతల్లి.
“ఆఫీసులో అర్జెంట్ పనుంది. ఒక్కపూటకి అందరూ ఎందుకని తీసుకురాలేదు”
ఆవిడ నవ్వింది. “బావుంది నీ తెలివి. నువ్వు వెళ్ళినా వాళ్ళో రెండురోజులు ఉండేవారుకదా? వస్తూపోతూ ఉంటేనే చుట్టరికాలు” అంది.
ఇంతలో ఆవిడ భర్త వచ్చాడు.
“నిన్ను చూస్తుంటే మీ నాన్నని చూస్తున్నట్టే ఉందిరా!” అన్నాడాయన. రఘురాంకి ఇంకక్కడ నిలబడాలనిపించలేదు.
“వస్తాను పిన్నీ!” అన్నాడు గబగబా అడుగులు వేస్తూ.
“ఉండరా! అన్నిటికీ తొందరే” అంటూ ఆపి స్వీట్స్ బట్టలు తెచ్చిచ్చింది.” అదికూడా వస్తే బాగుండేది” అని మరోసారి రజని గురించి అంది.
“ఇప్పుడివన్నీ దేనికి పిన్నీ? ఈసారి అందరం కలిసి మీఇంటికి వస్తాం. అప్పుడు పెడుదువుగాని”  అన్నాడు తీసుకోకుండా.
“ఎప్పటి లెక్క అప్పటిదే. మీరిద్దరూ కలిసి రావాలేగానీ ఇంకోసారి పెట్టలేనా?” అంది ఆవిడ. ఆవిడలా అన్నా తీసుకోవడానికి మనస్కరించలేదు రఘురామ్‍కి. ఇంతలో శారదావాళ్ళూ వస్తూ కనిపించారు. ఎవరో తరుముకొస్తున్నట్టు పేకెట్లు తీసుకుని కదిలిపోయాడు.
వెనకనుంచి పినతండ్రి అట్టహాసంగా నవ్వుతూ ఏదో అనటం వినిపించింది. ఆ తర్వాత  అందరి నవ్వులు… అవన్నీ వెంటపడుతున్నట్లు నడక వేగం పెంచాడు రఘురాం. తనగురించేనా? ఈ బట్టలు తీసున్నాడనేనా? అసలు తనెందుకు తీసున్నాడు? గట్టిగా వద్దనేసి ఎందుకు రాలేకపోయాడు? అందర్లోకీ వచ్చినప్పుడు ఎందుకని తన వ్యక్తిత్వం కుంచించుకుపోతోంది? చెయ్యాలనుకున్నది ఎందుకు చెయ్యలేకపోతున్నాడు? నడక వేగం ఇంకా పెంచాడు. చేతిలో బేగ్ చాలా బరువనిపించింది.
ఎవరో తన వెంబడి వస్తున్నట్టు అనిపించింది కాసేపటికి. ఆగాడు.  ఎవరో పెద్దాయన.  సన్నగా చువ్వలా వున్నాడు. బట్టతల. చత్వారం జోడు. కాళ్ళకి అరిగిపోయిన హవాయిచెప్పులు. కట్టుకున్న ధోవతి ముతగ్గా, మురిగ్గా ఉంది. లాల్చీ కూడా అలాగే ఉంది. నాలుగైదుచోట్ల కుట్లున్నాయి. అందుకోవడానికి చాలా ప్రయాసపడినట్టున్నాడు, ఆయాసపడుతున్నాడు.
రఘురాం తనకేసి తిరగ్గానే నవ్వడానికి ప్రయత్నిస్తూ, “నిన్ను కలుసుకోవాలని పెళ్ళికి వచ్చినప్పటినుంచీ ప్రయత్నిస్తున్నాను” అన్నాడు.
“మీరు? ” అతని భృకుటి ముడిపడింది. “పోల్చుకోలేకపోతున్నాను. మరోలా అనుకోకండి” అన్నాదు.
“మీ అమ్మ నా మేనత్తకూతురు. మీ నాన్నా నేనూ మీకూ మాకూ చుట్టరికాలు కలవకముందునుంచే స్నేహితులం” అన్నాడు.
రఘురాం పాతాళానికి కృంగిపోయాడు. ఈయనదగ్గరకూడా తండ్రి  డబ్బులు తీసుకుని ఉంటాడా? తనని ఈ నీడ వదలదా?
అతని భావోద్వేగాలను పట్టించుకోలేదు పెద్దాయన. “రైల్వేస్టేషన్‍కా? నేనూ అటే. వెళ్తూ మాట్లాడుకుందాం” అన్నాడు నడుస్తూ. మార్గాంతరం  లేక తనూ నడక సాగించాడు రఘురాం.
“మీనాన్నకి వుద్యోగం లేదు. సంపాదన లేదు. నీ చిన్నతనం, చదువూ అవీ ఎలా సాగాయో మరి! మేనమామలు ఆదుకున్నారని తులసమ్మ ఒకసారి మాటల్లో చెప్పిందిలే”
ఆయనేం చెప్పినా వినటానికి మనసు సంసిద్ధం చేసుకున్నాడు రఘురాం.
“ప్రాక్టీసు పెట్టి పెద్ద లాయరవాలని వుండేది మీ నాన్నకి. కానీ దానికి తగ్గ వాక్చాతుర్యం లౌక్యం ఉండేవి కాదు. లాయరన్నాక కావలసినవే అవి.   గవర్నమెంట్ జాబ్ వెతుక్కుని అందులో చేరిపొమ్మని ఎవరెన్ని చెప్పినా వినలేదు. చేరితే మరింక ప్ర్రాక్టీసుకి అవకాశం ఉండదని వాడి వాదన” తెలిసినవే ఇవన్నీ. చర్వితచర్వణం.
“అంతదాకా బాగానే ఉంది. ఉద్యోగం రాకపోతుందా అని తులసమ్మనిచ్చారు. ఉద్యోగం లేదు, ఆదాయం లేదు. ఆ పైన కుటుంబభారం… దాంతో పరాన్నజీవిగా మారిపోయాడు. ఇదిగో, నీ పేరు?”
రఘురాం వులిక్కిపడ్డాడు. ఆయన పనిగట్టుకుని తనని వెతుక్కుంటూ వచ్చి ఇదంతా ఎందుకు చెప్తున్నాడో  అర్ధమవలేదు.  తనని పేరు ఎందుకు అడుగుతున్నాడో? చెప్పాడు. ఇందులో కొత్తగా పోయే పరువేమున్నదని.
“మానాన్న సొసైటీలో సృష్టించిన ఇమేజి నా జీవితాన్ని నిరర్ధకం చేసింది. ఈ చరమాంకంలోకూడా బతుకుని విశ్లేషించుకోవాలన్న  తపన ఇంకా చావలేదు. పెళ్ళికొచ్చినప్పట్నుంచీ చూస్తున్నాను. ఏదో అశాంతిలో కొట్టుకుపోతున్నట్టున్నావు, ఎందుకని?” అడిగాడు.
రఘురాంకి వూపిరి నిలిచిపోయినట్టైంది. తనలాగా బాధపడే వాళ్ళు ఇంకా ఉన్నారా? మురళికి తండ్రి ఆస్థి ఇచ్చాడు. హరికి చదువు, ఉద్యోగం సమకూర్చాడు అతని తండ్రి. శారదకీ, విశాలకీ చక్కటి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసారు. ఇప్పటి ఈ పెళ్ళికూతురు … దాన్ని గుండెలమీద నడిపించి పెంచారు పిన్నీ, బాబాయ్. ఇంకా తన కజిన్స్ చాలామంది. వాళ్ళ జీవితాల్లో ఇంకెవరి జోక్యం వుండదు. ఫలానావారి పిల్లలమని గర్వంగా చెప్పుకుంటారు.  వాళ్ళ జీవితాలను వాళ్ళకి నచ్చినట్టు మలుస్చుకోగలిగే స్వేచ్ఛాస్వతంత్రాలు వున్నాయి. తనకి అలాంటివేం లేవు. ఏం చదవాలో పెద్ద మేనమామ నిర్ణయించాడు. ఏపీపియెస్సీ రాయమని మురళి నిర్దేశించాడు. భయం వాళ్ళకి… అదుపు తప్పుతాడని… డబ్బిచ్చారు, పోషించారు. వాటిలో ఏ వొక్కటీ తన తండ్రి చెయ్యలేదు. ఆయనపరంగా వచ్చిన అపఖ్యాతితప్ప తనకి ఇంకేమీ దక్కలేదు.
దాదాపు అరవయ్యేళ్ళుండే ఈ పెద్దాయన ఆయన తండ్రి పరంగా అనుభవించిన సమస్యేమిటి?
ఇద్దరూ స్టేషన్ చేరుకున్నారు. ” టికెట్స్ తీసుకొస్తాను. మీరెక్కడికి?” అడిగాడు రఘురామ్.
దానికాయన నవ్వి, “నేనెక్కడికీ లేదు. సాయంత్రం అయ్యాక కొద్దిసేపు ఇక్కడే కూర్చుంటాను” అన్నాడు.
“మీదీ వూరేనా?”
ఆయన తలూపాడు.  ట్రైన్ రావడానికి ఇంకా పదినిమిషాలుంది. రఘురాం వెళ్ళి తన టికెట్టూ,  ఆయన కోసం ప్లాట్‍ఫాం టికెట్టూ  కొనుక్కొచ్చాడు. ఇద్దరూ స్టేషన్ లోపలికి వెళ్ళారు.
“మీనాన్న మీ జీవితాలతో ఆటలాడుతున్నప్పుడే నాలో ఈ విశ్లేషణ మొదలైంది.  తండ్రితాతల ఔదార్యం, అసమర్ధత, జీవనశైలి…  ఇవన్నీ మన జీవితంతో చెడుగుడు ఆడేస్తాయి. మనం చెయ్యాలనుకున్నదాన్ని చెయ్యనివ్వవు. కులం, గోత్రం, వంశం… వీటిని మనం వదిలేసినా, పేరెంటల్ ఇమేజి మనని వదలదు. మాకు చాలా ఆస్థి వుండేది. అడగనివాడిది పాపమన్నట్టు ఎవరెంత అడిగితే అంత దానం చేసేవాడు మానాన్న. బంధువులంతా ఆయన్ని పొగిడేవారు. అలా ఇచ్చి పొగిడించుకోవటంలో ఒక ఆనందానుభూతిని పొందేవాడనుకుంటా. మనుషుల్లో రకరకాలు. అవతలివారిది మనకెందుకు అనుకునేవాళ్ళు, వుత్తిగా వస్తున్నప్పుడు వద్దని ఎందుకనాలనుకునేవాళ్ళు, వుందికదా, యిస్తే తప్పేమిటని ఆశించేవాళ్ళు… మా నాన్న పోయాక వీళ్ళందరిమధ్యా వంటరిగా చిక్కుకుపోయాను.”
రైలొస్తున్నట్టు అనౌన్స్ చేశారు. రఘురాం ముందుకి నడిచాడు.  ఆయన అనుసరించాడు.
“ప్రతిమనిషిలోనూ కొంత నిక్కచ్చితనం వుండాలి. తనెలా బతకాలో  ముందుగా నిర్ణయించుకోవాలి. అదర్శాలు కావాలనుకునేవాడు సాంసారిక సుఖాలకి దూరంగా ఉండాలి. సాంసారికజీవితం కావాలనుకున్నప్పుడు ఆదర్శాలని మర్చిపోవాలి. ఇటు చూస్తే ఆస్థికి మించిన అప్పులు, అటు చూస్తే ఆశ్రితులు. మా నాన్న సృష్టించుకున్న ఇమేజి. దాన్నెలా చెడగొట్టను? అసలు నాదగ్గర లేదంటే నమ్మేవాళ్ళెవరు? ఒకొక్కటీ అమ్మి మానాన్న దార్లోనే నేనూ నడిచాను. అన్నీ పూర్తయాకగానీ నాకళ్ళు తెరుచుకోలేదు. నా భార్య మాటలు వినిపించలేదు. తండ్రి పేరు చెడగొట్టేస్తున్నానన్న బంధువులమాటలే  వినిపించేవి. భార్య, ఇద్దరు పిల్లలు… వీళ్ళకి తిండిపెట్టాల్సిన బాధ్యత… పెట్టడానికేమీలేని పరిస్థితి. చరిత్రపుటల్లో స్వర్ణాక్షరాలతో నాపక్కని తన పేరు రాయించుకోవడానికి నన్ను పెళ్లి చేసుకోలేదు నా భార్య. సాధారణమైన కుటుంబజీవనాన్ని ఆశించి చేసుకుంది. విఫలమైంది. నాకన్నాముందే మా ఆర్థికపరిస్థితిని గుర్తించి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయి మనోవర్తి దావా వేసింది. ఇవ్వటానికి నా దగ్గరేముంది? మానాన్నపరంగా నేను నిలబెట్టిన ఇమేజీ పేకమేడలా కుప్పకూలిపోయింది. భారతంలో కర్ణుడు చేసిన దానాలగురించి చదువుకుంటాం. ఆయన పిల్లలేమయ్యారని ప్రశ్నించుకోం. ఆశ్రితులకోసంసరే, రారాజుకోసంసరే, వాళ్ళకోసం ఏం చేసాడని ప్రశ్నించుకోం”
“మీ పిల్లలు?” ఆతృతగా అడిగాడు రఘురాం, ఆయన ఆర్తి అర్థమై.
“పదిమంది కొడుకుల్ని కన్నాడు. ఒక్కడు మిగిలాడు. ఇద్దరు తల్లులకి గుండెకోత మిగిలింది.”
ఆయన జవాబు చెప్పే స్థితిలో లేడు.
“దుర్యోధనుడు, రావణుడు వీళ్ళంతా విలన్లు. కానీ వాళ్ళవాళ్ళ పిల్లలకి రోల్‍మోడల్స్. లక్ష్మణకుమారుడు, ఇంద్రజిత్తు వాళ్ళ అండదండల్లో పెరిగారు. ఆ తండ్రులకోసం ప్రాణాలిచ్చారు. రాముడు హీరో. మనందరికీ ఆదర్శం. కానీ భార్యాపిల్లల బతుకుల్ని పరాధీనం చేసాడు. వాళ్ళతన్ని ఎదురడిగారు. నిలదీసారు” రఘురాం ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా తన దోరణిలో చెప్పుకుపోయాడు. ఇంకా చెప్తూనే ఉన్నాడు.
“నీ తండ్రి నీ జీవితాన్ని పరాధీనం చేశాడు. వాడిచ్చిన లోకువతో ఈ బంధువులంతా నీ జీవితంలో జోక్యం చేసుకున్నారు. నీ తండ్రి ఇమేజితో నిన్ను బాధిస్తారు. నీ జీవనశైలిని నీ చేతుల్లూ వుండనివ్వరు. నీ ఆలోచనల్ని క్రిపుల్ చేసి నీలో న్యూనతాభావాన్ని నింపుతారు.  నీలో ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే దెబ్బతిందో అప్పుడింక నీ పిల్లలకి నువ్వేం దారిచూపించగలవు? పిల్లలకి తండ్రే ఫస్టుహీరో.  ఇంకెప్పుడూ వీళ్ళమధ్యకి రాకు. నీభార్యని తిసుకు రాకు. మీ అమ్మే వీళ్ళకి సరి. ఆమె ఇంకా చెడేదేం లేదు”
రఘురాం వింతగా చూసాడాయన్ని. ఇంతకాలం తన ఆలోచనల్లోనే తప్పుందనుకున్నాడు. తనలాంటివాళ్ళు ఇలాగే ఆలోచిస్తారన్నమాట!
“మీనాన్నంటే వున్న అభిమానంతో చెప్తున్నాను. వాడు తన అసమర్ధతతో జీవితాన్ని పాడుచేసుకున్నాడు. వీళ్ళంతా ఒకపైస పెట్టి పదిమంది దగ్గిరా గొప్పగా చెప్పుకునే మనుషులు. నిజంగా మీ నాన్నంటే అభిమానంగలవాళ్ళైతే వాడిని సరైనదార్లో పెట్టేవాళ్ళు. వాడి అవసరానికి మెహర్బానీగా డబ్బిచ్చి వెనక నవ్వుకునేవారు కాదు. నీకూ మాకూ సంబంధం లేదు పొమ్మనుంటే వాడికి బాధ్యత తెలిసేదనుకుంటా”
రైలొచ్చేస్తోంది. రఘురాం ప్రశ్నకి జవాబు దొరకలేదు. ఈ కర్ణుడి కొడుకులేం చేస్తున్నారో!
“మీ పిల్లలు?  రఘురాం మళ్ళీ అడిగాడు.
“పెద్దవాడు వంటలు చేసుకుంటూ బతుకుతున్నాడు. చిన్నవాడు…” ఆయన పెదాలు కదిలాయిగానీ మాటలు వినిపించలేదు. రైలుకూతలో కలిసిపోయాయి. మరోసారి యీ వూరు రావాలనుకున్నాడు రఘురాం, ప్రత్యేకించి యీయన్ని కలవడానికి.
రైలాగింది. దిగేవాళ్ళు దిగుతున్నారు. రైలంతా దాదాపు ఖాళీగా ఔతోంది. ఇంతలో ఒక వ్యక్తి హడావిడిగా వస్తూ వీళ్ళని చూసి ఆగిపోయాడు.
“అబ్బ! రైలు తప్పిపోతుందనుకున్నాను బాబాయ్!” అన్నాడు పెద్దాయన్ని చూసి పలకరింపుగా నవ్వుతూ.
అతన్ని “నాన్నగారబ్బాయ్” అని రఘురాంకి పరిచయం చేసాడు పెద్దాయన. అలాగే రఘురాంని తన మేనత్త మనవడిగా. అదే సమయానికి అతన్ని ఇంతకుమునుపు ఎక్కడో చూసినట్టుకూడా అనిపించింది. రఘురాం ఆశ్చర్యాన్ని చూసి నవ్వేసాడా వ్యక్తి.
“నాపేరు కాశ్యప్. నాన్నగారబ్బాయ్… అది నామీద నేను విసురుకునే సెటైర్. బాబాయ్ నన్నలా పరిచయం చేసారంటే మీకు నాగురించి చెప్పాలన్నమాట… అరె… ట్రెయిన్ కదుల్తోందే! ఎక్కండి చప్పుని ” అంటూ
బేగ్ లోపలికి విసిరేసి తనూ లోపలికి జంప్ చేసి, రఘురాంని లోపలికి లాగాడు. ఇద్దరూ వూపిరి పీల్చికుని బైటికి చూసేసరికి ముసలాయన దూరమౌతూ కనిపించాడు.
రఘురాం పక్క సీట్లో ఒకతను వచ్చి కూర్చున్నాడు. చూస్తే సన్నగా గెడకర్రలా ఉన్న యువకుడు. పెద్దగా చదువుకున్నట్టైతే లేడుగానీ
టి‍ప్‍టాప్‍గా వున్నాడు. మరీ లేబర్‍లా కూడా లేడు. జన్మగతసంస్కారమేదో ముఖంలో కనిపిస్తోంది. అమ్ముకునేవాళ్ళు, ముష్టివాళ్ళు తిరుగుతుంటే అతను కొంచెంకొంచెం లోపలికి జరుగుతున్నాడు. రఘురాంకి ఇరుగ్గా అనిపించింది. జరగమనేలోపు టీటియ్యీ వచ్చాడు. పక్కనున్నతను ఏదో పనున్నట్టు నెమ్మదిగా లేచి జారుకున్నాడు. అది చూసి రఘురాం నవ్వుకున్నాడు. కశ్యప్‍కూడా దాన్ని గమనించినట్టు నవ్వాడు. టీటియ్యీ వీళ్ళదగ్గరకొచ్చాడు. రఘురా  టికెట్‍కోసమని జేబులో చెయ్యిపెట్టాడు. టికెట్టు, దాంతోపాటు పర్సుకూడా చేతికి తగల్లేదు. గతుక్కుమని లేచి చూసుకుంటే రెండూ సీట్లో పడున్నాయి. ఇదంతా తన పక్కని కూర్చున్నతని చలవన్నమాట. పర్సు లాగుతుంటే టికెటు బయటికొచ్చేసింది.
టీటియ్యీ ఇదంతా చూసి, “జాగ్రత్త సార్!  ఈ లైన్లో పిక్‍పాకెటర్స్ బాగా ఎక్కువ” అని హెచ్చరించి, టికెట్ చెక్ చేసి ఇచ్చేసాడు.
“బాబాయ్ చిన్న కొడుకు కూడా ఇలాగే రైళ్ళలో తిరుగుతుంటాడు” అన్నాడు కశ్యప్.
రఘురాం దిగ్భ్రాంతిగా చూసాడు. తల్లిదండ్రులు చేసే పొరపాటుపనులు పిల్లల జీవితాలని ఎలాంటి మలుపు తిప్పుతాయో అర్థమైంది. జరిగిందంతా జరిగిపోయాక మనుష్యులెలా పునశ్చరణ చేసుకుని బాధపడుతుంటారో కూడా.
“ఏ రైల్లోంచేనా అతడు దిగుతాడేమోనని ఆయన రోజూ స్టేషనుకొచ్చి కూర్చుంటాడు. వెళ్ళే రైళ్ళలోనూ, వచ్చే రైళ్ళలోనూ వెతుక్కుంటుంటాడు. ఆ కుర్రాడు ఒకటి రెండుసార్లు నాకు కనిపించాడు. ఎలా వుంటాడనుకున్నారూ? జస్ట్ జెంటిల్‍మాన్‍లా. అతనికి తండ్రి ఆరాటాన్నిగురించి చెప్పాను. ఐనా రానన్నాడు. అతనికి ఆయనంటే అసహ్యం. తమ జీవితాలిలా కావటానికి కారణం ఆయనేనని. కాదనలేం. కానీ… కుటుంబం ఎక్కువగా స్త్రీల త్యాగంమీదే నిలబడుతుంది. పిన్ని ఆయన్ని అసహ్యించుకోకుండా వుంటే… కనీసం ఆ అసహ్యాన్ని దాచుకుని వుంటే, ఈ పిల్లలు ఇలా వుండేవారు కాదేమో! ఆవిడ దాన్ని దాచుకునే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యలేదు. నిత్యం దెబ్బలాడుతూ వుండేది…”
“మీకు వాళ్ళెలా తెలుసు?” కుతూహలంగా అడిగాడు రఘురాం.
“నా చిన్నతనమంతా వాళ్ళింట్లోనే గడించింది. నిండుకుటుంబాన్నీ, ఆ తర్వాత అది విచ్ఛిన్నమై పతనం ఆఖరి అంచుకి చేరుకోవటాన్నీ చూసాను”
“మీ పరిచయం?’ అడిగాడు కశ్యప్. చెప్పి, “మిమ్మల్నెక్కడో చూసినట్టుంది” అన్నాడు రఘురాం.  
“అనిపించిందా? చూసే వుంటారు. కానీ నన్ను కాదు” అంటూ నవ్వి, బేగ్‍లోంచే ఒక పుస్తకం తీసి, వెనక అట్టమీది ఫోటో చూపించాడు. రఘురాం చకితుడయ్యాడు. .. ఫోటోలోని వ్యక్తీ, ఇతనూ ఒకేలా వున్నారు కానీ కాదు. పోలికలు అచ్చుగుద్దినట్టు కలుస్తున్నాయి. వయోబేధం తెలుస్తోంది. ఫోటో ప్రముఖ రచయిత దేవసేన్‍ది. మరితను? కొడుకా?
“మీకు నాగురించి చెప్పాలని బాబాయ్ వుద్దేశం. ఎందుకో మరి?!”
“ఇద్దరం పితృబాధితులం” రఘురాం నవ్వాడు. అలా చెప్పటానికి అతనేం సంకోచించలేదు. పెద్దాయన పరిచయంతో అంతర్గతవేదనగా వుండిపోయిన తన సమస్య ఒక బహిర్గత రూపాన్ని పొందగలిగింది. తండ్రిపరంగా పొందుతున్న బాధకీ వేదనకీ ఎక్కడేనా పరిష్కారం దొరుకుతుందాని తపన.
కశ్యప్ తనగురించి చెప్పడం ప్రారంభించాడు.  “ప్రతివ్యక్తికీ తన జీవనచిత్రాన్ని వేసుకోవటానికి దేవుడు ఆయువనే కేన్వాస్ ఇస్తాడు. మనిషి పుట్టి చచ్చేలోపు దాన్ని నింపాలి. ఐతే ఇందులోని ఐరనీ ఏమంటే మనం పుట్టేసరికే యీ కేన్వాసు దాదాపుగా నిండిపోయివుంటుంది. దేశకాలపరిస్థితులకనుగుణంగా తమకి నచ్చినట్టు, వచ్చినట్టు మన పెద్దవాళ్ళే బొమ్మంతా గీసేసి మనకోసం ఎక్కడో చిన్నపిసరు వదిలిపెడతారు. దాన్ని మనం ఎలా నింపుతామోనని వెయ్యి ఆంక్షలతో వెయ్యికళ్ళు పెట్టుకుని కనిపెడతారు. మూసలోంచీ తప్పిపోకూడదుకదా? బొమ్మ వాళ్ళనుకున్నట్టే రావాలనేది వాళ్ళ అభిలాష. ప్రతివ్యక్తిదీ ఇదే పరిస్థితని నా నమ్మకం. కాకపోతే అతనికివ్వబడిన స్వేచ్ఛలో చిన్న మార్పు. ఉదాహరణకి చూడండి… అనాథగా రోడ్డుమీద వదిలెయ్యబడినవాడికి అలా బతకడం మినహా మరో దారేముంటుంది? అదే రోడ్డుఈదనో చెత్తకుప్పపక్కనో కాకుండా ఏ అనాథాశ్రయం అరుగుమీదో వదిలిపెడితే వాడి జీవితం అనాథగానే ఐనా కొంత మెరుగ్గా వుంటుందేమో. అంటే ఈ రచన అతడి తల్లిదండ్రులు చేసినదేకదా?”
రఘురాం ఈ విశ్లేషణని ఆశ్చర్యంగా విన్నాడు. అందులో కాదనటానికేమీ లేదు. కానీ కశ్యప్ గొంతులో ధ్వనిస్తున్న విచారంలాంటిదానికర్థం?
“విధి, కర్మ, అదృష్టం … మనిషికీ మనిషికీ మధ్య బేధాలు వుండటం విధి. విధి అలా బేధాన్ని చూపటం కర్మ. ఆ కర్మ కలిసొచ్చేదైతే అదృష్టం లేకపోతే తలరాత. దాదాపు ముప్పయ్యేళ్ళకిందటే మా నాన్న పేరుమోసిన రచయిత. పాఠకులనీ, పత్రికలనీ కుదిపేసే రచనలు చేసారు. చిన్నప్పుడే  తల్లిదండ్రులు చనిపోతే దూరపుబంధువుల ముసలమ్మ ఆయన్ని పెంచిపెద్ద చేసింది. జీవనానికి ఇల్లూ పొలాలు వుండేవి. వాటిని దాయాదులపరం కాకుండా నిలబెట్టింది. ఆయనకి కొంత వయసొచ్చేసరికి ఆవిడకూడా చనిపోయిందట.”
ఒక ప్రముఖరచయిత జీవితచరిత్రని ఆయన కొడుకుద్వారా వింటున్నాడన్న ఆలోచన రఘురాంలో వుత్తేజాన్ని నింపింది. తన జీవితానికి సరిపోలే కొస ఎక్కడో అందీఅందకుండా వుందనిపించి దాన్ని అందుకోవాలనే తపన మొదలైంది.
“మా అమ్మ ఆయన పుస్తకాలు చదివి, ప్రేమించి, ఇంట్లోంచీ వచ్చేసి ఆయనదగ్గర వుండిపోయింది. వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకున్నారో లేదో తెలియదుగానీ, వాళ్ళమధ్యలోకి అనాహ్వానితుడిలా నేనొచ్చి పడ్డాను. ఆ యింటిగచ్చుమీద ఆకలికి పారాడానో, కన్నీళ్ళు తుడుచుకుని  గోడల్ని పట్టుకుని పైకి ఎగబ్రాకానో… నా చిన్నతనమంతా ప్రేమలేమితోనే గడిచింది. మసకవెలుతురుగా వుండే గదిలో కూర్చుని నాన్నగారు కథలు రాస్తుంటే వాటినలా అలవోగ్గా అందిపుచ్చుకుని పత్రికలవాళ్ళు వేసుకునేవారు. సినిమాలవాళ్ళు కొనుక్కునేవారు. అనుసంధానకర్త అమ్మ…”
“వ్యక్తినుంచీ కుటుంబందాకానో వ్యవస్థగానో ఎదిగినవ్యక్తియొక్క బాధ్యతారాహిత్యానికి శిక్ష అతనికి పడదు. ఆ తప్పుకి బలైపోయినవాడు  అనుభవించినదే అకారణమైన శిక్ష. చట్టపరమైన తప్పులు శిక్షతో రద్దౌతాయేమోగానీ మానవసంబంధాలలో జరిగేవి అనైతికతగానో అపక్రమంగానో రూపుదిద్దుకుని తర్వాతి తరాలకి కొనసాగించబడతాయి” అన్నాడు రఘురాం ఆవేదనగా.
“నేను పుట్టినవాడిని పుట్టినట్టే వుండిపోలేదు. పెరిగాను. నాతోపాటే నా అవసరాలు. ఐహికబాధ్యతలు తెలీని ఇద్దరు పెద్దవాళ్ళమధ్య నేను పెరిగాను. ఇంటిని నడపడానికీ నన్ను చూసుకోవటానికీ పనివాళ్ళని పెట్టారు. వాళ్ళు ఇంటిమీద పట్టుదొరికేదాక పనిచేసి, అటుతర్వాత అందినవి అందినవి దొరకబుచ్చుకుని పారిపోయేవారు. అలాగే పెరిగి పెద్దౌతున్నాను. పేరు పెరుగుతున్నకొద్దీ నాన్నగారికి సభలూ సన్మానాలూ జరిగేవి. ఇంటికి ఎవరెవరో వచ్చేవారు. సాహితీగోష్ఠులు జరిగేవి.  వచ్చినవాళ్ళలో ఒకరికి సిగరెట్లు కావాలి. మరొకరికి వక్కపొడి, ఇంకొకరికి కిళ్ళీ… ఇంకా ఏవో అవసరాలు. పనివాళ్ళ సహకారంతోనేనా ఇంటిని నడపడం, పొలం విషయాలు, డబ్బు వ్యవహారాలు… ఎవరూ పట్టించుకోని ఈ బాధ్యతలన్నీ నా భుజంమీద పడ్డాయి. క్రమంగా నన్ను తమలోకి పీల్చేసుకున్నాయి. నేను… నా చదువు… నేను పైకి రావటం.. ఇవన్నీ ఆ యింట్లో అప్రధానమైన విషయాలు. నాన్నగారు గొప్ప రచయిత. అమ్మ ఆయన అభిమాని.  ఆయనతో మమేకమైంది. ఆయన దీపం, ఆమె ఛాయ. ఆయన ఖ్యాతిని ఆమె అనుభవించింది. ఆయన సంతోషాన్ని ఆమె అనుభూతిగా మార్చుకుంది”
రఘురాం అతన్ని నిశితంగా చూసాడు. నవ్వుతూ కనిపించిన ఈ వ్యక్తిలో ఎంత ఆవేదన? తల్లీ తండ్రీ పట్టించుకోకపోతే పిల్లలేమౌతారు?
“బైటిప్రపంచంలో దేవసేన్‍గారి అబ్బాయినని నన్ను చాలా ప్రత్యేకంగా చూసేవారు. స్కూల్లో నాగురించి హై ఎక్స్‌పెక్టేషన్సుండేవి. కానీ నేను చదువులో చాలా పూర్. టెంత్ ఫెయిలయ్యాను”
కొద్దిసేపు కశ్యప్ ఏమీ మాట్లాడలేదు. అతని మౌనం దుస్సహంగా అనిపించినా రఘురాం అందులోంచీ చాలా చదివాడు. పండితపుత్ర: పరమశుంఠ అనేసి వుంటారు జనం. కానీ దానిలోతు అనుభవించేవాడికి తెలుస్తుంది. ఒకడు పండితుడైతే వాడికి ఎంతమంది సపోర్టు కావాలి? అతడు పట్టించుకోని ఐహికబాధ్యతలని మరొకరు అందుకోవాలి. అతడి వ్యక్తిగత, ప్రత్యేక అవసరాలని మరొకరు చూడాలి. వాళ్ళు ప్రపంచానికి కావాలిగానీ వాళ్ళకి ప్రపంచం అవసరం లేదు. వాళ్ళకి ఒకటే తపన. ఏదో తెలుసుకోవాలని. అదే పట్టుదల… అనుకున్నది సాధించాలని.
“నేను బాగా చిన్నవాడిని. అంటే ఎల్‍కేజీయో యూకేజీయో చదువుతున్నాను. ఎవరు నన్ను స్కూల్లో వేసారో నాకు తెలీదు. ఇప్పటికీ కూడా. అప్పుడు చదువులో చురుగ్గానే వుండేవాడిని. పుస్తకంలో టీచరు గుడ్ అని రాసింది. దాన్ని అమ్మకి చూపించాలని ఆరాటంగా… స్కూలునుంచీ రాగానే పెద్దగా అరుస్తూ లోపలికి పరిగెత్తాను. అమ్మ నా సంతోషాన్ని వాకిట్లోనే ఆపేసింది.
“నాన్నగారు రాసుకుంటుంటే ఏంటా అరుపులు? గట్టిగా మాట్లాడకూడదని ఎన్నిసార్లు చెప్పాను? వెళ్ళి ఆడుకో” చిరాగ్గా అంది.
“ప్రతికూల పరిస్థితుల్లోనే  మనిషికి పట్టుదల పెరుగుతుంది. నేను బాగా చదవాలని ప్రయత్నించేవాడిని. కానీ చిన్నచిన్న సందేహాలు … మొదట్లోనే తీరిపోతే నాకెంతో దోహదం చేసేవి, అలా తీరక అవరోధాలైపోయాయి”
ఏదో  సాధించాలనే తపన మనసుని జ్వలిస్తూ వుంటే నివురుచాటుని దాన్ని దాచి వుంచి సెగతగ్గిపోయిందనుకోవడం… తనదీ అదే అనుభవం. రఘురాం నిట్టూర్చాడు.
“మా నాన్నగారి అభిమాని ప్రీతి. ఆయన రచనలమీద రిసెర్చి చేస్తోందట. మాయింటికొచ్చేది. నాతో సరదాగా మాట్లాడేది. ప్రేమలేమితో అనుక్షణం దహించుకుపోతున్న నేను దాన్నే ప్రేమనుకున్నాను. తనని ప్రేమిస్తున్నానని చెప్పగానే-
నీకేముందని నిన్ను ప్రేమించాలి? చదువా? వుద్యోగమా? వ్యాపకమా? వ్యవహారమా? నీ తండ్రి సంపాదనమీద పరాన్నజీవిలా బతికేస్తున్నావు. నీగుర్తింపంతా ఆయనే. నాన్నగారబ్బాయ్…
-అంది హేళనగా.
నాలో నేను బాధపడ్డాను. తొందరపడి అలా అన్నందుకు సారీ చెప్పాను. కానీ గుండె రగిలిపోయేంత బాధ. ఈయిల్లూ, ఇందులోని మనుషులూ నాకేమౌతారు? నాకు వాళ్ళతో వున్న అనుబంధం ఏమిటి?ఎందుకు నేనిక్కడ వున్నాను? ఏం సాధించాలని? నా గమ్యం ఏమిటి?  అనేక ప్రశ్నలు వేసుకున్నాను. ఒక్కదానికీ సంతృప్తికరమైన జవాబు దొరకలేదు. వాళ్ళకి నేను పుట్టాననే ఒక్క కారణం నాకు ఎలాంటి అనుబంధం కలిగించలేదు. ఇల్లొదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాను.
బాబాయ్ గురించి  ఇప్పుడు మీకు చెప్తాను. పక్కపక్క యిళ్ళు మావి. అప్పటికి వాళ్ళు భార్యాభర్తలు కలిసే వుండేవారు. నేను ఏడిస్తే పిన్ని పరిగెత్తుకొచ్చేది. అమ్మకన్నా ముందు నన్నెత్తుకుని లాలించేది. ఇలాంటి మనుషుల్ని ఎక్కడా చూడలేదు… బాధ్యత తెలియని మనుషులు… అని ఆమె అనుకోవటం   ఇప్పటికీ నా చెవుల్లో వినిపిస్తుంటుంది. ఎవర్ని గురించనేది నాకు తెలీదు. బాబాయ్‍గురించా లేక నా తల్లిదండ్రులగురించా అనేది సందిగ్ధమే. ఆ తర్వాత వాళ్ళ కుటుంబం విచ్ఛిన్నమైంది. పిల్లల్ని తీసుకుని ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. కుటుంబాన్ని పట్టించుకోవట్లేదని మనోవర్తికి దావావేసింది. అదలాగే వుంది, ఇక్కడ బాబాయ్‍కి వూర్నిండా అప్పులు. ఆస్తుల్ని మించిపోయాయి. కొన్ని ఆయనే అమ్మేసి బాకీలు తీర్చాడు. ఇల్లు జప్తు చేసారు. సగం కాలిన కొరకంచులా ఆయన మిగిలాడు. ఇల్లొదిలి వెళ్ళిపోతానన్న నా నిర్ణయం చెప్పగానే ఆయన నన్ను దగ్గరకి తిసుకుని ఏడ్చేసాడు-
వద్దురా! నా చిన్నకొడుకు ఇల్లొదిలి పారిపోయాదు. ఎక్కడున్నానాడో ఏమయాడో తెలీదు. ఎక్కడికెళ్తావు? ఎలా బతుకుతావు?  ప్రీతి కాకపోతే ఇంకో జ్యోతి… నీకోసం ఎవరో ఒకమ్మాయిని పుట్టించే వుంటాడు దేవుడు. నువ్వు ఇంట్లోంచీ వెళ్ళిపోయినంతమాత్రాన ఆ పిల్ల నిన్ను పెళ్ళిచేసుకుంటుందా? మీ అమ్మానాన్న బాధ్యత తెలియని మనుషులు. ఐతేనేం? బోల్డంత ఆస్థి వుంది. ఆయన ఇంకా సంపాదిస్తున్నాడు. ఆయన సంపాదననీ ఆస్థినీ అనుభవించే హక్కు నీకుగాక ఎవరికి వుంటుంది? నువ్వున్నావుకాబట్టి ఇక్కడన్నీ సవ్యంగా నడుస్తున్నాయి. నువ్వెళ్తే అంతా అన్యాక్రాంతమౌతుంది. ఎవరికి దొరికింది వాళ్ళు అంకించుకుంటారు. నీ చిన్నతనమంతా అలాగే గడిచింది. దానివలన నీ తల్లిదండ్రులకే నష్టం లేదు. వాళ్ళేం బాధపడతారనుకోను. నీ బాధ అర్థం చేసుకుంటారనీ అనుకోను. వాళ్ళకి డబ్బూ, బాధ్యతలూ అక్కర్లేదు. వాళ్ళ ప్రపంచమే వేరు. నష్టపోయేది నువ్వు. నీ ఆస్థి నువ్వు కాపాడుకుంటున్నావనుకో.  కాదూ, ఆ గొప్పరచయితకి పర్సనల్ సెక్రెటరీననుకో – అన్నాడు.
నేను వాస్తవాన్ని  గుర్తించాను. ఇదోరకం జీవితం. డబ్బుంది. కష్టపడకుండా వస్తోంది. దాన్నెలా వాడుకున్నా అడిగేవాళ్ళు లేరు. అనుభవిస్తే తప్పేమిటని రాజీపడిపోయాను. ముందుజాగ్రత్తగా ఒక హోటల్ అమ్మకానికొస్తే కొని నా పేర్న పెట్టుకున్నాను.
నా లైఫ్ కాన్వాసంతా అలికేసినట్టు గజిబిజిగా ఐపోయింది. ఐనా నాకింకా చిన్నచోటుంది. రెండు చుక్కలతో ఖాళీ నింపాను. ఆ రెండు చుక్కలూ స్వేచ్ఛా, స్వతంత్రం. నా తల్లిదండ్రుల జీవనశైలితో నాకిప్పుడింక ఎలాంటి బాధా లేదు. కొదరు స్నేహితుల్ని పోగుచేసుకున్నాను. ఒక భార్యని సంపాదించుకోవాలి. ఓ కొడుకుని కనాలి. జాగ్రత్తగా పెంచాలి. .. అంటే మళ్ళీ మూసలోకే.
అప్పుడప్పుడు ప్రీతి గుర్తొస్తుంది. నేను చదువుకుని వుంటే తను నా క్లాస్‍మేట్‍గానో జూనియర్‍గానో పరిచయమయేదేమో! అప్పుడు మా ప్రేమకి ఎలాంటి ఆటంకం వుండేది కాదేమో! కానీ తనూ నాలాగే మరో మూసలో తయారైన బొమ్మ. చదువే మనిషికి విలువని నమ్మే మూసలో…” అని ముగించాడు కశ్యప్.
రఘురాం చిత్తరువులా వుండిపోయాడు. జీవితసత్యమేదో అర్థమయ్యీ కానట్టు స్ఫురిస్తోంది.
కాజీపేట స్టేషన్ వచ్చింది. రఘురాం దిగాడు.  ఆ రెండు పరిచయాలూ అతన్ని మరింత ఆలోచనలగుండంలోకి తోస్తూ ముగిసిపోయాయి. ఆతర్వాతెప్పుడూ వాళ్ళతనికి కలవలేదు. కాకతాళీయంగానేనా. అతనికీ ఇంక కలిసే అవసరం కనిపించలేదు.
స్టేషన్‍నుంచీ ఆటో చేయించుకుని యిల్లు చేరుకున్నాడు రఘురాం. రజనీ హాల్లో కూర్చుని వుంది. కొడుకుని దేనికో గద్దిస్తోంది.
“ఉ<హు<. నాకు భయం. నువ్వొచ్చి చెప్పు” అంటున్నాడు వాడు.
అడుగుల చప్పుడు విని ఇద్దరూ తలతిప్పారు.
“నువ్వెళ్ళి ఆడుకో” అని కొడుకుని పంపించింది రజని.
“ఫ్రిజిలోంచీ వాటర్‍బాటిల్ తీసిచ్చి, “పెళ్ళి బాగా జరిగిందా?” అని అడిగింది రజని.
“వాళ్ళు మళ్ళీ బట్టలు పెట్టారు. మనిద్దరికీ, అమ్మకీ కూడా.” నిస్పృహగా అన్నాడు.
ఆమె అతనికేసి నిశితంగా చూసింది. తర్వాత అతను అందించిన పేకెట్టు తీసుకుని  అందులోని బట్టలు తీసి నాణ్యత పరిశీలించింది. “మంచివే. మొక్కుబడిగా పెట్టినవి కాదు.” అని క్షణం ఆగి, “వాళ్ళలో వాళ్ళు పెట్టుకుని మనని వొదిలేస్తే మీకు బావుంటుందా?”  అడిగింది.
ఛెళ్ళుమని చరిచినట్టైంది రఘురాంకి. ఈ విషయం తనెప్పుడూ ఆలోచించలేదు. బ్లాంక్‍గా చూసాడు.
రజనీ యీ విషయం అతనితో చర్చించాలని కొంతకాలంగా అనుకుంటోంది. ఆమెకి అతనిపట్ల సానుభూతి వుంది. అతని తండ్రిది అన్యాయమే. బాధ్యతారాహిత్యమే. ఆయనవల్ల కష్టాలుపడ్డాడు. గౌరవాన్ని కోల్పోయాడు. పోగొట్టుకున్నచోటనే దాన్ని వెతుక్కోవటం ఎందుకు? పోగొట్టుకున్నదాన్నే తిరిగి పొందాలన్న తపనెందుకు? ఉద్యోగం వుంది. పెళ్ళిద్వారా కొత్తబంధువులనీ స్నేహితులనీ సంపాదించుకున్నాడు. అతనికి ఆహ్లాదాన్నిచ్చే కొత్తప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు. అందులోకి అతని తల్లి వస్తే వస్తుంది. లేకపోతే లేదు. ఎన్నాళ్ళిలా బాధపడతాడు? బాధపడి అతను తనని తాను కోల్పోతున్నాడు. న్యూనతాభావంలోకి కూరుకుపోతున్నాడు. పిల్లలు పెరుగుతున్నారు. వాళ్ళమీద అతని ప్రభావం కనిపిస్తోంది. వాళ్ళూ అతనిలాగే ముడుచుకుపోతున్నారు. నలుగుర్లోకీ వెళ్ళినప్పుడు నెగ్గుకురాలేకపోతున్నారు. వాళ్ళ బంతి పక్కపిల్లాడు  లాక్కున్నా , క్లాసులో పుస్తకం పోయినా  వచ్చి అడగమని తనకి చెప్తున్నారు. రఘురాం వచ్చేసరికి కంప్లెయింటు అదే. బాల్ పక్కవాళ్ళింట్లో పడింది. తననెళ్ళి అడిగి తెమ్మంటున్నాడు, కొదుకు.
“అలా వాళ్ళు మననొదిలేస్తే తట్టుకోలేం” తను అడిగిన ప్రశ్నలకి తనే జవాబు చెప్పింది రజని యింతసేపు గడిచాకా అతన్నుంచీ రాకపోతే.


కాశీనుంచీ తిరిగొస్తూ తులశమ్మ పెద్దన్నగారినుంచీ ఒక షాకింగ్ న్యూస్ తీసుకొచ్చింది. రఘురాం పెద్దమేనమామ ఏసీబీరైడ్‍లో పట్టుబడి సస్పెండయాడని. వినగానే రఘురాం విచలితుడయ్యాడు. మళ్ళీ సందిగ్ధత. వెళ్ళాలా, వద్దా అని. వెళ్ళకపోతే కృతఘ్నుడనుకుంటారేమో! వెళ్తే హేళన చెయ్యడానికి వచ్చాడనుకుంటారేమో! చాలా వూగిసలాడాడు.
“వెళ్ళి పలకరించి రాకపోతే  బాగుండదు” అంది రజని అతనిపక్షాన తనే నిర్ణయం తీసుకుని. అతను అర్ధమనస్కంగా బయల్దేరాడు. అతనక్కడికి చేరుకునేసరికి మురళి, శారద వచ్చి వున్నారు.
“ఏరా! దారితప్పిగానీ వచ్చావా?” ఏమీ జరగనట్టు అడిగాడు పెద్దమేనమామ. “మీ అమ్మేమైనా చెప్పిందా?” అతని సందిగ్ధతని గమనించి తనే మళ్ళీ అడిగాడు.
“అమ్మ చెప్పాక వచ్చి చూడకుండా వుండలేకపోయాను” నెమ్మదిగా జవాబిచ్చాడు రఘురాం.
ఆయన పెళ్ళుమని నవ్వాడు. “ఇదుగో, వింటున్నావటమ్మా? వీడిని తండ్రి పట్టించుకోకుండా వదిలేస్తే మేమంతా తలో చెయ్యీ వేసి సాయంచేసాంకదూ, అందుకని మాకేదైనా కష్టం వస్తుందాని ఎదురుచూసి, ఇప్పుడు పరామర్శించి వీలైతే సాయపడి  తన కృతజ్ఞత చూపెట్టుకోవాలని వచ్చాడు…” అక్కడే వున్న భార్యతో అని, యింకా అదే నవ్వుతో, “అదేంట్రా, యింగ్లీషు సామెత… నేనంటే నీకెందుకు కోపం, నీకేం ఉపకారం చేసానని? అంతేనా?” అన్నాడు .
ఎందులోనో ఇరుక్కున్నట్టు వుక్కిరిబిక్కిరయాడు రఘురాం.
“ఛ… అలా ఎందుకనుకుంటాను మామయ్యా?” తేరుకుంటూ అన్నాడు.
“నిజంగానే నువ్వలా అనుకోకపోతే చాలా సంతోషం. నారాయణ్రావ్ ఎమ్మే ఎల్లెల్బీ కొడుకువని నీకు మేం చదువు చెప్పించలేదు. తులసమ్మ మా ఏడుగురిలో ఒకతి. దానికొడుకు తక్కువగా వుండకూడదని చెప్పించాం. మీ తాతగానీ, పినతండ్రీ పెదతండ్రులుగానీ పట్టించుకోలేదు. వదిలేసారు. వాళ్ళపట్ల లేని ఆక్షేపణ మామీదనా?” అన్నాడాయన.
“నాకు ఎవ్వరిపట్లా ఆక్షేపణలేదు మామయ్యా! కానీ ఒక్క విషయంలోమాత్రం సమాధానపడలేకపోతున్నాను. మనిషి సంఘజీవి. తను నిర్మించుకున్న, తను నివసించిన సంఘాన్ని పిల్లలకి వారసత్వంగా యిస్తాడు. అదే సంఘంముందు ఒక అందమైన ఇమేజిని నిలుపుకోవలసిన అవసరం లేదా?ఎందుకంటే సంఘం అతన్ని ఆ ఇమేజి మాధ్యమంలోంచే చూస్తుందికద? మా నాన్న ఆ బాధ్యతెందుకు విస్మరించాడు?  మనం యీరోజుని ఇలా కూర్చుని మాట్లాడుకునే సందర్భానికి కారణం ఆ బాధ్యతారాహిత్యమేగా?” రఘురాం గొంతులో ఆవేదన పెటిల్లుమని చిట్లి లావాలా ఎగజిమ్మింది.
అతని పెద్దమేనమామ కొద్దిసేపు మాట్లాడకుండా వుండిపోయాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు.  “నువ్వు మీ నాన్నలా ఆలోచిస్తున్నావేంట్రా? ఆయన తను చెయ్యలేని పనిగురించి ఆలోచించేవాడు. నువ్వు నీచేతిలో లేనిదానిగురించి ఆలోచిస్తున్నావు. వారసత్వం… ఎక్కడికి పోతుంది?” ఆయన గొంతులో నిరసన వుంది. “మేం మిమ్మల్ని కన్నాంగానీ మీరు మమ్మల్ని కాదు. మా జీవితాలు సక్రమంగా లేవని ఎందుకు బాధపడతారు? మాకు తోచినట్టు, మాకు వీలైనట్టు మేం బతికాం. మీకు నచ్చితే మాలాగే మీరూ వుండండి. నచ్చకపోతే మీకు తోచినట్టుండండి. మేమేదో చేసామనో చెయ్యలేదనో మీరేడ్చి, మీ యేడ్పుల్ని మీ పిల్లలకి నేర్పడం దేనికి? … ఇలా జరుగుతుందని భయపడే విశాలని నీకివ్వలేదు” శారద చప్పుని కలగజేసుకుంది.
“ఇప్పుడవన్నీ దేనికి నాన్నా? ఇతనికెప్పుడూ అలాంటి వుద్దేశ్యం లేదు. విశాల… దాని కాపురమేదో అది చేసుకుంటోంది ” అంది.
రఘురాం మ్రాన్పడిపోయాడు. ఏదో అనుకుని వస్తే ఇంకేవో బహిర్గతమౌతున్నాయి.
“భోజనాలకి లేవండి. ఎప్పుడనగా తిన్నాడో ఏమో!”  అంది అత్త. ఆవిడ వడ్డిస్తుంటే అందరూ డైనింగ్‍టేబుల్ దగ్గరకి చేరారు. తనీ కేసులోంచీ బైటపడగలనన్న ధీమాని వ్యక్తపరిచాడు రఘురాం మేనమామ.
“లంచాలు తీసుకోవటం తప్పే. కాదనను. కానీ మడికట్టుకుని కూర్చుంటే నాకెలా కుదురుతుంది? చేసేది గుమస్తా వుద్యోగం. అవకాశాలన్నీ మూసేసి బాధ్యతల్ని నెత్తిన రుద్దితే దొంగదారులు వెతుక్కోక ఏంచేస్తాం? మీ నాన్నో లార్డు. ఉద్యోగం చెయ్యడు. భార్యాపిల్లల్ని పోషించడు. నెలలతరబడి ఇక్కడే వుండిపోయేదిమీ అమ్మ. దాన్ని పొమ్మనలేను. మేం ఏడుగురుపిల్లలం. పెద్దవాడిని, నేను సహకరించకపోతే తమ్ముళ్ళ చదువులు, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఎలాగౌతాయి? ఇవన్నీ ఎత్తుకుని నాభార్యాపిల్లలకి అన్యాయం చెయ్యలేనుకదా? తప్పో… వప్పో! నా బాధ్యతలన్నీ తీరాయి. కేసులోంచే బైటపడితే సంతోషం. లేకపోతే కంపల్సరీ రిటైర్‍మెంటో డిస్మిసలో తప్పదు. పెన్షనొస్తే సరి. లేకపోతే వున్నవి కరిగించుకు తింటాను. నాకొకరి జాలీ సానుభూతీ అవసరం లేదు” ఖండితంగా చెప్పాడాయన.
రఘురాం తీవ్రంగా హర్టయాడు. అదతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. తినటం ముగించి లేచాడు. ఆయనలా అనకపోతే అతను మారుపెట్టి చుకునేవాడన్న విషయం తోచింది శారదకి. తప్పుచేసినట్టనిపించింది. ఎందుకు ఇతనిమీద అందరికీ కోపం? ఆరోజుని విశాలకూడా ఇదే ప్రశ్న అడిగింది. విశాలకి ఇతనంటే చాలా యిష్టం. ఇతన్ని తప్పించి ఇంకెవర్నీ చేసుకోనని పట్టుపట్టింది. కానీ పినతండ్రి వప్పుకోలేదు. అత్తకూడా అడిగింది. చుట్టరికాలు ఇంతలోనే వుంచమన్నాడు. అలాంటి కృతఘ్నుడికి పిల్లనివ్వనన్నాడు. ఏమిటి, వీళ్ళితన్నుంచీ ఆశించేది? ఇతనెలా వుంటే వీళ్ళకి బాగుంటుంది? చిన్నప్పట్నుంచీకూడా  ఇతనిది ముడుచుకుపోయే స్వభావం. చాలా సెన్సిటివ్. తమతో పెద్దగా కలిసేవాడు కాదు. ఇన్ఫీరియారిటీ కాంపెక్సు కూడా కావచ్చు. అతనికన్నా ఒకమెట్టు పైన వున్న భావన తమది.  ఎలా కలుసుకోగలరు?
“ఒకళ్ళ జాలీ, సానుభూతీమీద బతకాలని ఎవరికీ వుండదు మామయ్యా! మీరుకూడా అలా బతక్కూడదనే కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి బతుకు బరువెంతో నాకు తెలుసు” అనేసి లేచి హాల్లోకొచ్చాడు రఘురాం. అతని మేనమామ ఆయనగదిలోకి వెళ్ళిపోతే మురళీ శారదా అతని వెంటే హాల్లోకి వచ్చారు. అప్పటికతను బ్రీఫ్‍కేసు లాక్ చేసి షూ వేసుకుంటున్నాడు.
“నాన్న మాటలకి పట్టింపేమిట్రా? ఇలా జరిగిందన్న వుక్రోషంకొద్దీ ఏవేవో అంటున్నాడు. నన్నూ అన్నాడులే!” అన్నాదు మురళి.
“ఇంతరాత్రి ఏంప్రయాణం? ఇవేళ్టికి వుండి రేపు వెళ్ళచ్చు” అంది శారద. రఘురాం ఠక్కుని తలెత్తాడు.
“మానాన్నకి నువ్విచ్చిన వందా తిరిగిచ్చి మీవారిముందు తలదించుకున్న ఆ సందర్భాన్ని చెరిపెయ్యలేకపోవచ్చు. వరంగల్ అదాలత్ దగ్గర మురళి మా నాన్నకి పెట్టించిన భోజనానికి వెల కట్టలేకపోవచ్చు. విశాలకి నేను తగినవాడిని కాకపొవచ్చు. మీకన్నా నేను ఎన్నోమెట్లు కింద వుండచ్చు. కానీ చదివించి ప్రయోజకుడిని చేసిన మీ పతనాన్ని కోరుకునేంత కిందిస్థాయిలోమాత్రం లేను శారదా!” అని బ్రీఫ్‍కేసు చేతిలోకి తీసుకుంటూ, “అమ్మ ఈ విషయం చెప్పాక రాకుండా వుండలేకపోయాను, అంతేగానీ ఆయన్ని అవమానపరచాలని కాదు” అన్నాడు.
“అవేం మాటలు రఘూ?” అని మాత్రం అంది శారద.
“వస్తాను శారదా! వస్తాను మురళీ! మామయ్యకి చెప్పు. వస్తానత్తయ్యా!” అని లోపలికి వినిపించేలా చెప్పి మరోమాటకి ఆస్కారం ఇవ్వకుండా కదిలిపోయాడు.
“పెడితే తింటారుగానీ వున్నమాట అంటే ఎవరూ పడరు” లోపల్నుంచీ అన్నాడు రఘురాం పెద్దమేనమామ.
“ఇప్పుడతన్ని అనడం దేనికి నాన్నా? అనాల్సినంత తప్పులేం చేసాడు?” విసుగ్గా అంది శారద.
“రానురాను మీకు చాదస్తం ఎక్కువౌతోంది. వెతుక్కుంటూ వచ్చిన పిల్లాడిని వెళ్ళగొట్టారు. మీ అన్నదమ్ములు నలుగురూ నలుగురే. ఇతనికి విశాలనిస్తే మీ తమ్ముడికేం నష్టం? మనం పెంచి పెద్దచేసినవాదు. చెప్పుచేతల్లో వుండేవాడు. గొప్ప సంబంధమని చేసారు. దానికేమో మనసులేని మనువు. అతడికేమో డబ్బుపిచ్చి. ఇక్కడ వీడి సంపాదనంతా పైపిల్లెవరో వచ్చి  తింటోంది. దర్జాగా అనుభవిస్తోంది” అంది ఆయన భార్య.


“అనవసరంగా వెళ్ళాను” అన్నాడు రఘురాం రజనీతో.
“ఏం జరిగింది?” అడిగింది.
“నేనేదో ఆయన్ని  అవమానించడానికి వెళ్ళాననుకుంటున్నాడు. వాళ్ళ మనసుల్లో ఏదో వుంది రజనీ! నానుంచీ ఏం కోరుకుంటున్నారో తెలీడంలేదు”
“అనుకునేవాళ్ళు ఎప్పుడూ అనుకుంటారు. మీరు వెళ్ళకపోయినా అనుకుంటారు. మీ బాధ్యత మీరు తీర్చుకున్నారు” అంది రజని.
“పెంచి పెద్దచేసిన మేనమామ.  ఒకమాటంటే కష్టంలో వున్నాడు. ఒకమాటంటే తప్పా?” అంది తులసమ్మ.
“బావుంది. ఆయనకి కష్టమొస్తే యీయన్ని అనడం దేనికి?” రజని జవాబు.
రఘురాం తీవ్రమైన చింతనలో మునిగిపోయాడు. యాంత్రికంగా ఆఫీసుకెళ్తున్నాడు. వస్తున్నాడు. ఎవరితోటీ మాట్లాడ్డం లేదు. అసలే అలజడిగా వుండే అతని మనసు అతలాకుతలమైంది. మేనమామ మాటలు మర్చిపోలేకపోతున్నాడు. అవి అతని మనసులో ఘనీభవించాయి. కొండరాతిని బలంగా డీకొని చిన్నాభిన్నమైన కెరటాల్లా ఆలోచనలు ఆ ఘనీభూతశిలని తాకి పగిలిపోయి శకలాలని వెదజల్లుతున్నాయి.
తన వెనుక ఏవేవో జరిగాయి. అవన్నీ తనకి తెలియవు. తెలియవుగాబట్టి స్పందించలేదు. విశాలని తను కోరుకోలేదు. ఆమెపట్ల తనకి అలాంటి చూపు లేదు. వాళ్ళమధ్య తనకి తప్పించుకుపోవాలనే వుండేదితప్ప ఇరుక్కుని వుండాలనిపించేది కాదు. తల్లికి తెలుసా, ఈ విషయం? ఆవిడే సంబంధం అడిగిందా? అవమానభారంతో క్రుంగిపోతున్నట్టనిపించింది.
తన లైఫ్ కాన్వాసంతా  అలుక్కుపోయి గజిబిజిగా కనిపిస్తోంది. మానవసంబంధాలు వెలవెలబోతూ, ఇచ్చిపుచ్చుకోవటాలలోని వ్యాపారత్వం దారీతెన్నూ లేనట్టూ సాగుతున్నాయి. కాన్వాసంతా పరికించి చూస్తే తనొక సన్నని గడ్డిపరక. దాని చివర్ని అది మొయ్యలేనంత బరువైన పువ్వు. దాన్ని మొయ్యటానికది వంకర్లు తిరుగుతోంది. వెన్నెముక వంగిపోయి, నెత్తిన మొయ్యలెనంత కృతజ్ఞతాభారంతో. దాన్ని తనెందుకు మోస్తున్నాడో, ఎలా దించుకోవాలో ఎవరికి పంచివ్వాలో తెలీనంత అయోమయం.
తన జీవనచిత్రాన్ని మెరుగుపరుచుకోవాలన్న తపన రఘురాంలో పెరిగిపోయింది. తండ్రి, రైల్వేస్టేషన్ కర్ణుడు, నాన్నగారబ్బాయ్ కశ్యప్… కెలాడిస్కోపులో బొమ్మల్లా కదిలిపోయారు. తండ్రి, కర్ణుడు.. చిన్నచుక్కో, దిద్దుబాటో వాళ్ళ జీవితాన్ని అర్ధవంతంగా మార్చి వుండేది. నాన్నగారబ్బాయ్ కశ్యప్… అతనికి పుష్కలంగా డబ్బుంది. అది లేకపోవటంవలన వచ్చే పరాధీనత లేదు.
పెద్దమేనమామ గుర్తొచ్చాడు. ఆయనలో ఏదో ఒక అంశం రఘురాంని బలంగా ఆకర్షించి పదేపదే ఆయన్ని గుర్తుతెస్తోంది. ఆయన జీవితచిత్రం వూహించుకోబోయి దిగ్భ్రాంతుడయ్యాడు. అక్కడా అతనికి కనిపించింది ఒక గడ్డిపరకే. దాని నెత్తిన బరువైన పువ్వు. తను, తల్లి, తండ్రి, ఆయన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, భార్యాపిల్లలు…. అంతా రెక్కల్లాగ.
ఒక్క విషయం స్పష్టమైంది. ఈ ప్రపంచం చాలావరకు గడ్డివనమే. చాలామందికి తల్లితండ్రులపట్ల, తమవారిపట్ల ఏవో ఒక కంప్లెయింట్లున్నాయి. ఎవరికి తోచినట్టు వాళ్ళు బతికారు. కొందరికి సంతోషాలు దొరికాయి. కొందరికి దు:ఖాలు. అవి వాళ్ళ బతుకుల్లోంచీ వచ్చినవి.  
మేనమామ తప్పుదారిన నడిచిన అహంభావం గల వ్యక్తే కావచ్చు. కానీ పదిమంది జీవితాలని నిలబెట్టాడు. ఆయన వారసత్వం తనెందుకు తీసుకోకూడదు? తన తండ్రి నిర్వ్యాపారంగా గడిపాడు. ఏమీలేనిదాంట్లోంచీ తనకేం అందుతుంది? వారసత్వం తండ్రివైపునించే ఎందుకు రావాలి? తల్లివైపునించీ ఎందుకు రాకూడదు? తన తండ్రిని లార్డన్నాడు మేనమామ. అలాంటి లార్డ్స్ ఎందరో ఈ దేశంలో. అలాగే తనలాంటి రఘురాంలు కూడా. కృతజ్ఞతని ఎత్తుకున్నచోటే దింపుకోవాలనేముంది?


“వాళ్ళు నన్ను పెంచిపోషించినప్పుడు కొంత కృతజ్ఞతని ఆశించడంలో తప్పులేదు. కానీ నా కృతజ్ఞతని చర్యగా మార్చే అవకాశంలేనప్పుడు… ” అని బహిరంగంగానే వప్పుకున్నాడు రఘురాం.
తమ కేస్ట్‌కి చెందిన అసోసియేషన్‍లో చేరాడు. ఒక పిల్లవాడికి చదువు చెప్పిస్తున్నాడు… గోప్యంగా. ఒక వ్యవస్థకి రుణపడివుండటం మనిషి ప్రగతికీ, వ్యక్తికి రుణపడి వుండటం అతని తిరోగతికీ కారణమౌతాయనేది జీవితానుభవం.
అతన్లో వచ్చిన మార్పుకి రజని సంతోషించింది.
తులసమ్మకూడా, “మా పెద్దన్నయ్య పోలికలొచ్చాయి వీడికి. ఒకళ్ళకి సాయపడటమేగానీ మాటంటే పడడు” అంది.
రఘురాం అభ్యంతరపెట్టలేదు.
తర్వాతెప్పుడో పెద్దమేనమామ కలిసినప్పుడు “ఏరోయ్! సంఘసేవలో పడ్డావట?” అంటే నవ్వేసి వూరుకున్నాడు.
ఆయన కరప్షన్ కేసులోంచీ బైటపడలేదు. డిస్మిసయ్యాడు. రఘురాంకి ఆ విషయం తెలియద్దనుకున్నాడు. తెలిసినా తెలీనట్టే వుండిపోయాడు రఘురాం.