విముక్తి by S Sridevi

  1. కాగితం మీది జలపాతం by S Sridevi
  2. తేడా వుంది by S Sridevi
  3. అన్ హోనీ by S Sridevi
  4. గూడు by S Sridevi
  5. కోడలి యిల్లు by S Sridevi
  6. విముక్తి by S Sridevi
  7. వారసత్వం by S Sridevi
  8. మళ్ళీ అదే తీరానికి by S Sridevi
  9. యుద్ధం ముగిశాక by S Sridevi
  10. గతజలం, సేతుబంధనం by S Sridevi
  11. తనువు, మనసు, ఆత్మ by S Sridevi
  12. లిఫ్ట్ ప్లీజ్ by S Sridevi
  13. కుటుంబదృశ్యం by S Sridevi
  14. అనుభూతులు పదిలం…పదిలం by S Sridevi
  15. స్నేహితుడు by S Sridevi

          “అమ్మేంటి అలా అంది? నాన్న చాలా బాధపడుతున్నారు” అన్నాడు రాంబాబు భార్యతో.  వసుధకీ అలాగే అనిపించింది. కానైతే ఆమె నాణానికి గల రెండోవైపుని గురించి కూడా ఆలోచించింది. అత్తగారు మాట తూలే మనిషి కాదు. అలాంటామె అంతమాటందంటే కారణం ఏమై ఉంటుందో !  

          సంక్రాంతి పండుగకని వచ్చారు అందరూ. పండుగ సరదా, హడావిడీ ఆవిరైపోయాయి. ఇదే చర్చనీయాంశమైంది. రాజారావైతే అతలాకుతలమైపోతున్నాడు. అవమానంతో దహించుకుపోతున్నాడు.

          ఎంత మాటంది భార్య! తనని వదిలేసి వెళ్ళిపోతుందట. ఎంత అహంభావం ఆమెకి.  ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళతో పచ్చటి సంసారం ఉండగా, ఇవన్నీ వదులుకుని ఆశ్రమంలో ఉంటుందట. తనని రమ్మంది. కాదన్నాడని అంతమాటనేసింది.

          ఆమెకు జాబ్ చెయ్యటం ఇష్టం ఉండేది కాదు. పిల్లల్ని కని పెంచటంలోనూ అంతే! ఆసక్తి లేదు. అసలామె మనస్తత్వమే విభిన్నంగా ఉంటుంది. అన్నింటినీ వదిలించేసుకుని తామరాకుమీద నీటిబొట్టులా ఉండే మనస్తత్వం. పెళ్ళికి ముందునుంచే జాబ్ చేసేది. ఉద్యోగం ఉంటే తల్లితండ్రులకి కట్నంలో కలిసొస్తుందని చేరినట్టుంది. పెళ్ళయ్యాక కూడా తన వాళ్ళకి సాయం చేసేది. తరువాత ఎలాగో ఫుల్ పెన్షనొచ్చే దాకా చేసి రిటైర్మెంట్ తీసుకుంది.

          అదయ్యాక పిల్లలకి పెళ్ళిళ్ళు. పెళ్ళిళ్ళోతూనే మగపిల్లల్ని వేర్లు పెట్టింది. ఆడపిల్లలు పెళ్ళిళ్ళై వాళ్ళిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. మిగిలింది తామిద్దరు. అప్పుడప్పుడు వచ్చిపోయే పిల్లలు. ఈ బాధ్యతలు కూడా లేకుండా ఏ ఆశ్రమంలోనే వెళ్ళి ఉందామంటుంది.

          తానామెకి బరువు, బాధ్యత. తనకి వండి పెట్టి ఇల్లు సర్దుకోవటం ఆమెకి భారం. అలాంటి వ్యక్తితో ఇన్నాళ్ళెలా కలిసి కాపురం చేశాడు? ఎప్పుడూ ఆమె వుదాశీనంగానే ఉండేది. తాను సర్దుకుపోయేవాడు. ఆ అలుసు చూసుకునే అలా అంది. తానే వదిలేస్తాడామెని. ఆశ్రమాల్లో దిక్కూమొక్కూ లేకుండా పడుండే సరదా ఏమిటో తీరిపోతుంది. విసురుగా లేచాడు రాజారావు భార్యతో తన నిర్ణయం చెప్పటానికి. సరిగ్గా అప్పుడే ఎదురొచ్చింది వసుధ. ఆయనకేసి అభ్యర్ధనగా చూసింది.

          “నేను మాట్లాడతాను మామయ్యగారూ! ప్లీజ్” అంది మృదువుగా,

          రాజారావు ఆగాడు. “నా నిర్ణయం ఒకటేనమ్మాయ్! లంకంత ఇల్లు కట్టుకుని, మిమ్మల్నందర్నీ వదిలేసి ఎక్కడో ఉండడం అర్ధంలేని మాట. అసలా అవసరం నాకు లేదు. అలాంటి సరదా, అక్కరా తనకుంటే ఒక్కదాన్నీ వెళ్ళిపొమ్మను. అదీ ఈ రోజే. ఒకవేళ తాను నిర్ణయం మార్చుకున్నా కూడా, ఎప్పుడైతే తాను నన్నంత మాటందో ఆ క్షణం నుంచే మా బంధం తెగిపోయింది. కలిసున్నానేనెవరో తానెవరో అంతే!” నిక్కచ్చిగా అన్నాడు. ఆ అనటంలో తన కోపాన్నంతటినీ వ్యక్తపరచి వెళ్ళిపోయాడు.

          నెమ్మదిగా అత్తగారి గదిలోకి అడుగు పెట్టింది. ఆ గది ఒక పెద్ద అద్భుతం వసుధకి.  ఇద్దరు కొడుకులకీ, కూతుళ్ళకీ, మామగారికీ తలో గదీ,  హాలూ, కిచెన్. గెస్ట్‌రూమ్‍తో ఇల్లు ప్లాన్ చేస్తే, తనక్కూడా విడిగా ఒక గది కావాలని దెబ్బలాడి కట్టించుకుందట ఆవిడ. రాంబాబు ఎన్నోసార్లు చెప్పాడు ఆ విషయాన్ని విస్మయంగా.  గదినిండా రేక్‍లలో రకరకాల పుస్తకాలు. మరోవైపు క్యాసెట్లు. చిన్న టేప్‍రికార్డర్. వాక్‍మన్.  అదావిడ ప్రపంచం. పాటలు వింటూ, పుస్తకాలు చదువుకుంటూ నిశ్శబ్దంగా గడుపుతుంది.

          “అలా ఆశ్చర్యపోకు. నా ఫ్రెండ్స్, కజిన్స్ వస్తుంటారు. మా బెడ్‍రూమ్‍లోకి ఎలా తీసుకెళ్ళను? అలాగని అంత చనువున్నవాళ్ళని హాల్లో ఎలా కూర్చోబెట్టి కబుర్లు చెప్తాను? అందుకే ఈ చిన్న స్పేస్” అందొకసారి వసుధ పెళ్ళైన  కొత్తలో. రాజారావు, కొడుకులు, ఇతరులు… ఎవరేమనుకున్నా ఆవిడంటే గొప్ప ఆరాధన వసుధకి. అది రాంబాబు నేర్పినది కొంత. తానుగా ఆవిడని చదివి అర్ధం చేసుకున్నది కొంత.

          వసుధ పెళ్ళిలోనే రకరకాలుగా అనుకున్నారంతా. ఆవిడది కలివిడి మనస్తత్వం కాదనీ, ముంగిలా ఒక్కత్తే ఉంటుందనీ – ఇలా చాలా చాలా. వసుధ కూడా భయపడింది. ఆవిడతో ఎలా నెగ్గుకురావాలా అని. రాంబాబు చెప్పాడు. “       “మా అమ్మ అంత కలుపుగోలుగా వుండదు వసుధా! ఏదీ పెద్దగా పట్టించుకోదు. తానేంటో, తన లోకం ఏంటో అంతే. కానీ, చెడ్డది మాత్రం కాదు” అని అతనన్న మాటల్లో చివరివి ఆమెకి ధైర్యానిచ్చాయి. అత్తగార్ని చాలా గమనించింది.  ఆవిడో అద్భుతంలా కనిపించింది.

          ఆవిడ చదివినన్ని పుస్తకాలు, విన్నన్ని పాటలు, వాటిలో ఆవిడకి ఉన్న ఆసక్తి – ఆ వయసు, ఆస్థాయివాళ్ళల్లో ఎవర్లోనూ కనిపించదు. వసుధ తన ఫ్రెండ్స్‌లోనే ఎందర్నో చూసింది. పెళ్ళికి ముందున్న టాలెంట్సన్నీ పెళ్ళిపందిట్లో అగ్నిహోత్రంలో వేసేసి సాదా గృహిణుల్లా ‘భర్త’ అనే ఒరవడిలో ఇమిడిపోవటం. ఆవిడ ఈ రోజుకీ తన ఆసక్తి నిలబెట్టుకుంటోందంటే దాని వెనుక ఎంత సంఘర్షణ వుండి వుంటుందో! ఆ సంఘర్షణని తట్టుకోవటానికి ఎంత మనోబలం చూపించిందో!.

          “ఇంటిపనంతా పూర్తిచేసుకుని డైనింగ్‍టేబుల్‍మీది వస్తువులు జరుపుకుని అంతా పడుక్కున్నాక రాసుకునే రచయిత్రి ఒకామె నాకు స్నేహితురాలు వసుధా!” అని చెప్పింది ఆవిడే మరో సందర్భంలో.

          వసుధ అడుగుల సవ్వడి విని తల తిప్పింది అనసూయ. “రామ్మా” అంది చిన్నగా నవ్వి. మంచం అటు చివరికి జరిగి చోటిచ్చింది. వసుధ కూర్చుంది.

          “మీరలా ఎందుకన్నారు? మామయ్యగారు చాలా బాధపడుతున్నారు.” సూటిగా అడిగేసింది.

          “బాధపడ్డానికేముంది? తనకి కావల్సిందేదో తాను చెప్పారు. నాకు కావల్సిందేదో నేను చెప్పాను” అంది అనసూయ.

          “అలా కాదు. మీకిప్పుడేం కష్టం వచ్చిందని ఎక్కడో వెళ్ళి ఉండటం?””

          “కష్టం వస్తేనే ఓల్టేజిహోమ్‍లో ఉండాలా? సుఖంగా ఉన్నప్పుడు మార్పు కోసం వెళ్ళకూడదా?”

          “మార్పు కోసమే అయితే మా ఎవరింటికేనా వచ్చి కొన్నాళ్ళుండవచ్చుగా!”

          అనసూయ మంచం మీద లేచి కూర్చుంది. వసుధ మంచం అంచుకి దిండు ఆనించింది. దానికి ఆనుకుని కూర్చుని వసుధ మొహంలోకి పరీక్షగా చూస్తూ అడిగింది.

          “నీకెప్పుడూ విసుగెయ్యలేదా? ఏళ్ళతరబడి ఈ వండుకు తినడం, ఇల్లు మెయింటైన్ చెయ్యటం, అన్నీ పద్ధతిగా చేసుకుపోవటం, పిల్లలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ పరమైన బాధ్యతలు?” ఆవిడ ప్రశ్నల్లో కుతూహలం ఉంది. తానొక్కదానికేనా అలా అనిపించేది లేక అందరికీ అలాగే ఉంటుందా అని తెలుసుకోవాలనే శోధన ఉంది. ఆవిడనేదో అడిగి ఒప్పించాలనుకున్న వసుధ ఆ ప్రశ్నల పరంపరకి తట్టుకోలేక నిస్తేజంగా నవ్వింది.

          ““ఎందుకనిపించదు? ఒక్క క్షణం కూడా తీరిక లేనంతగా ఊపిరి సలపని పని. అలాగని మనసుకి కొంచెం కూడా సంతృప్తి ఉండదు. ఎప్పుడు పిల్లలు పెద్దౌతారా, తీరిక చిక్కుతుందా అనిపిస్తుంది” అంది.

          ఇద్దరూ వయోబేధాన్నీ, సాంప్రదాయిక వైరాన్ని మర్చిపోయారు. అసలీ సమస్యకి దేశకాలహద్దులు లేవు. ఇండియా అయినా, ఇంగ్లాండేనా ఒకటే. హౌస్‍కీపింగ్ ఆడవాళ్ళ పని అని శిలాక్షరాలతో చెక్కేశారు. కాల్పనిక సాహిత్యంనుంచి పాఠ్యపుస్తకాలదాకా ఒకటే వరస. అమ్మలే వంటిళ్ళలో ఉంటారు, నాన్నలు ఎప్పుడోగానీ కనిపించరు.

          “ప్రతిదీ మనమే పట్టించుకుని, అన్నీ మన బాధ్యతలే అనుకుని అన్నిటా అతిగా తలదూర్చేస్తూ మన స్వతంత్రాన్ని కొంత కోల్పోవటం లేదూ?” అడిగింది అనసూయ.

          “కానీ, తప్పదు కదా అత్తయ్యా, మగవాళ్ళు పట్టించుకోనప్పుడు?”

          “అన్నీ సవ్యంగా జరిగిపోతున్నంతకాలం మగవాళ్ళు ఏదీ పట్టించుకోరు. ఇంటా బైటా మనం బాధ్యతల్లో కూరుకుపోయి ఉంటే, వాళ్ళుమాత్రం పట్టించుకోకుండా ఉంటూ ఏదో ఒకప్పుడు విసుగేసి మనమూ అలాగే వుంటే, ప్రపంచం తలకిందులైనట్టు బాధపడతారు. నేను వంటపనితోటీ, ఇంటిపనితోటీ సతమతమైపోతుంటే, మీ మామగారు తీరిగ్గా టీవీ రిమోట్ నొక్కుతూ కూర్చుంటారు.”

          “పోనీ వంటకీ దానికీ ఎవర్నేనా పెట్టుకోండి.”

         “వాళ్ళమీద సూపర్‍విజన్ ఎవరు చెయ్యాలి? పని చెయ్యటం కష్టం కాదు. ఆ వెనకాల ఉండే బాధ్యత మొయ్యటం కష్టం. వసుధా! అసలు నీకో విషయం తెలుసునా? పెళ్ళి అనే కోణంలోంచి చూస్తే ఆడవాళ్ళు రెండురకాలు. ఒకటోరకం ఆ చట్రంలో ఇమిడిపోగలిగేవాళ్ళు. సమాజంలో ఎక్కువభాగం వీళ్ళే ఉంటారు. సమాజంకూడా అలా ఉండేలాగే స్త్రీలని కండిషన్ చేస్తుంది. ఎంతో కొంత సంఘర్షణ తరువాతో, అసలెలాంటి సంఘర్షణా లేకుండానే ఆడవాళ్ళంతా వివాహవ్యవస్థనీ , అందులోని పురుషాధిక్యతనీ వప్పేసుకుంటారు”

          “మీకు పెళ్ళి చేసుకోవటం ఇష్టం ఉండేది కాదా?”

          “పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఆ బాధ్యతలన్నా. కొత్త వ్యక్తులతో కలవాలన్నా ఇష్టం ఉండదు. నా ఇష్టాన్ని నిలబెట్టుకునే స్వేచ్ఛ నాకివ్వలేదు. అలాంటి స్వేచ్ఛ ఎవరూ ఎవరికీ ఇవ్వరని నాకు తెలిసేసరికే పెళ్ళైపోయింది. ఇష్టమయో, అవకో చేసుకున్నాను కాబట్టి నేను దానికి కట్టుబడే వున్నాను. నా బాధ్యతలన్నీ నేను నిర్వర్తించాను. ఇప్పుడికనాకు కావాల్సింది విముక్తి.”

          ఆవిడంత స్పష్టంగా తన అభిప్రాయం చెప్పేశాక ఇంకేం మాట్లాడాలో తోచలేదు వసుధకి. ఒకవేళ వాళ్ళిద్దరిమధ్యా గొడవేదైనా వస్తే ఎవరో ఒకరు దాన్ని మధ్యవర్తిత్వంచేసి సర్దవచ్చు. ఈ వ్యవస్థే వాళ్ళ మధ్య ఉత్పన్నమైన సమస్య. ఒరవడిలో ఆవిడ ఇమడలేకపోతోంది. భర్తా, పిల్లలూ అంటూ చాలా సామాన్యమైన కోరిక గల తనకే ఆవిడ మాటలు విన్నాక ఏ ఇరుకు గోడల మధ్యనో ఇరుక్కుపోయినట్టుంది. అలాంటిది, ఆ భావాలు ఆవిడ రక్తంలోనూ, జన్యువుల్లోనూ ఉద్భవించినవి. అవామెని ఎంతగా బాధిస్తున్నాయో!

          అసలంతదాకా ఎందుకు వారంలో ఆరు రోజులు పనిచేసేది ఏడో రోజుని సెలవొస్తుందని. ఎప్పటికో ఒకప్పటికి విముక్తి దొరుకుతుందని ఈ బాధ్యతలని ఎత్తుకుంటే, అవెప్పటికీ తీరవని నిర్ధారితమైపోతే ఎలా ఉంటుంది ఎవరికైనా?

          “ఇంగ్లాడులోనూ, అమెరికాలోనూ వారానికి ఐదురోజులు అరవచాకిరీ చేసి వీకెండ్స్‌లో హాలిడే స్పాట్స్‌కి వెళ్ళి ఫ్రెషప్ అయి తిరిగొస్తారు. వెనుకటి ఆడవాళ్ళకి నెలసరి మూడురోజులూ ఇంటికీ, బాధ్యతలకీ, పనివత్తిడికీ దూరంగా ఉండే అవకాశం ఉండేది మనిళ్ళలో. అలా ఎవరికి వారు తమ తమ వీలునిబట్టి  ఏర్పరచుకుంటే అవన్నీ వదిలేసి, ఇప్పుడేమిటిలా? గానుగెద్దుల్లా? సెలవులు వచ్చాయంటే పని, ఇంకా పని?”

          వసుధ నిశ్శబ్దంగా అక్కణ్ణుంచి వచ్చేసింది.

          ““ఏమంటోంది అమ్మ?” రాంబాబు ఆత్రంగా అడిగాడు.

          “ఆవిడమీద మీ నాన్నగారికి గల ప్రేమని బట్టి వాళ్ళ బంధం నిలబడుతుంది”

          “అంటే?”

          “మీ నాన్నగారు తానొక్కరే సుఖపడటాన్ని గురించి ఆలోచిస్తున్నారు. ఆవిడ తానుకూడా సుఖపడే మార్గాన్ని చెప్తోంది.”

          “అందుకు ఆశ్రమంలో వెళ్ళి ఉండాలా?”

         “అరయ్యేళ్ళకి షష్టిపూర్తి చేసుకునేది ఎందుకు? వేడుక కోసమా, వినోదానికా?”

         “కాక?”

         “మనిషి మొదటి ఇరవయ్యేళ్ళూ శారీరకంగా ఎదుగుతాడు. తర్వాతి ఇరవయ్యేళ్ళూ మాననసికమైన ఎదుగుదల మొదలౌతుంది. ఇంకో ఇరవై ఏళ్ళు అది స్థిరంగా ఉండి, ఆ పై శైథిల్యం మొదలవుతుంది. అప్పుడు తన బాధ్యతలన్నిటినీ వదిలించుకుని వానప్రస్థాశ్రమానికి, అంటే ఏ అడవులకో వెళ్ళి ప్రశాంతంగా కాలం గడపాలి. ఆ స్టేజ్ వచ్చిందని గుర్తు చెయ్యడానికి షష్టిపూర్తి.”

          “ఇప్పడవన్నీ ఎవరు పాటిస్తున్నారు?”

          “నిజమే. ఎవరికీ అక్కర్లేని నియమాలు వదిలి పెట్టచ్చు. బయటెక్కడా తిండి తినను అనే నియమం పెట్టుకున్న వ్యక్తి భార్య ఎప్పడేనా వండటానికి విసుగుని ప్రకటించినప్పుడు తాను వంటకి ఉపక్రమించాలి. అంతేగానీ, తన నియమాన్ని ఆమె మీద రుద్దకూడదు.”

          రాజారావు వాళ్ళ సంభాషణ విన్నాడు. కోడలి వాదన భార్య ప్రవర్తనకన్నా అసంబద్ధంగా అనిపించింది. ఏమనుకుంటున్నారు వీళ్ళు తనని? కోపం వచ్చింది. విసురుగా స్కూటర్ తీసుకొని ఇంట్లోంచి బయటపడ్డాడు. వెళ్ళటానికి అతనికో గమ్యం కనిపించింది. స్కూటర్ని అటు ఉరికించాడు.

          రాజారావు వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. అక్కడంటే, రాజారావు పుట్టి పెరిగిన పల్లెటూరు. అతనుండే ప్రదేశానికి దాదాపు ముప్పై నలభై కిలోమీటర్ల దూరాన ఉంటుంది. అతని తల్లీ, తండ్రీ ఉంటారక్కడ. రాజారావు స్కూటర్ మీద అక్కడికి చేరుకునేసరికి బాగా ఎండెక్కింది. వగర్చుతూ గేటు తీసి లోపలికి అడుగు పెట్టాడో, లేదో తండ్రి కనిపించాడు.

          రోటి ముందర ముక్కాలి పీట వేసుకుని కూర్చుని వణుకుతున్న చేతుల్తో వచ్చడి నూరుకుంటున్నాడు. లోపల గదిలో చాపమీద పడుకుని రాజారావు తల్లి అరుస్తోంది, ” ఎనభయ్యేళ్ళ వయసొచ్చింది. ఇంకా రోటి పచ్చళ్ళు కావాలి… రోటిపచ్చళ్ళు. ఎందుకొచ్చిన తిప్పలివి? వండి పెట్టినవి ఇమ్ముగా తిని పడుకోక” అని.

          “ఏమిటి నాన్నా, ఇది?” రాజారావు నొచ్చుకున్నాడు. అతనికి నవ్వూ,కోపం రెండూ వచ్చాయి ఆయన పడుతున్న తాపత్రయానికి. అది వయసుతో సరితూగక.

          “చప్పగా ఇంత పప్పు ఉడకేసి పడేస్తుందిరా! వండటానికి వొళ్ళొంగదు” తండ్రి చాడీ చెప్పాడు. నిజమా అన్నట్టు తల్లిని చూశాడు రాజారావు.   ఆవిడ మూతి మూడు వంకర్లు తిప్పింది.

          “చచ్చేదాకా నాకీ వంట తప్పడు కామోసు! హాయిగా కొడుకింటికెళ్ళి కోడలిచేత కంచంలో పెట్టించుకు తిందామంటే వినడు” అంది.

          “సర్లే. ఎండని పడి వచ్చావు. తిన్నావా, లేదా? తిని, చల్లపాటివేళ రావలసింది. అనసూయా, పిల్లలూ, మనవలూ బాగున్నారా? దాన్నేనా తీసుకురావాల్సింది” అంటూ కుండలోంచి మంచినీళ్ళు ముంచి ఇచ్చి, అన్నం తినాలన్న కొడుకు ప్రతిపాదన విని, ముందుగా వండిన అన్నం అతనికి పెట్టి మళ్ళీ కుక్కరు పడేసింది. రాజారావు తండ్రిచ్చి తాను రుబ్బిన పచ్చడి కాస్త వేశాడు.

          పప్పూ, ఆ పచ్చడీ. అంతే ఆధరువులు, తన చిన్నతనం గుర్తొచ్చింది రాజారావుకి. కందిపొడి , కారప్పొడి, పల్లీపొడి, గోంగూరపచ్చడి – ఇలా నాలుగైదురకాల నిలవపదార్థాలు కాక రెండు కూరలూ, పప్పూ, పులుసో, చారో ఉండేవి. ఎంతో ఇష్టంగానూ, ఓపిగ్గానూ వండేది తల్లి. అంతేకాదు, తండ్రి ఊరుకునేవాడు కాదు ఏది తక్కువైనా. ఏమైంది తల్లికి? ఓపిక సడలిందా? ఆసక్తి తగ్గిందా? అనసూయదికూడా ఇదే సమస్యా?

          అన్నం తింటూ చెప్పాడు ఆమె ప్రతిపాదన. వినగానే రాజారావు తల్లి ముఖం వికసించింది.

          “ఇదిగో, వింటున్నావా? అబ్బాయి, కోడలూ బాబా ఆశ్రమానికి వెళ్ళి ఉంటారట. మననీ రమ్మంటున్నాడు” అంది బయట ఇంకా రోటితో కుస్తీ పడుతున్న భర్తతో,

          “తాతలనాటి ఇల్లుంది నాకు. దర్జాగా ఉంటాను నువ్వు వెళ్ళు, కావాలంటే” అక్కణుంచే చెప్పాడు ముసలాయన. భూమి గుండ్రంగా ఉండటమంటే ఇదేననిపించింది రాజారావుకి.

          “నీకు రావాలనుందామ్మా” అనడిగాడు రాజారావు తల్లి నుంచి ఏదో తెలుసుకోవాలని ఆశించి.

          “నాకున్నా ఏం లాభం? మీ నాన్న ఈ ఊరొదిలి ఎక్కడికీ రాడు” నిరుత్సాహంగా అంది.

          “పోనీ నువ్వు రా, ఆయనిక్కడే ఉంటాడు”

          “అలా ఎలా కుదుర్తుంది?”

          తన భార్యకి కుదిరినది తల్లికెందుకు కుదరదో అర్ధం కాలేదు. “నీకీ వంట పనీ అదీ విసుగ్గా ఉండదూ?” కాసేపాగి మళ్ళీ తానే అడిగాడు.

          “ఆడపుట్టుక పుట్టాక వండకా వార్చకా తప్పుతుందా? అంతెందుకు, సంపాదనపరురాలైన నీ భార్యకే తప్పలేదు”.

          రాజారావుకి ఆవిడ జవాబు నచ్చలేదు. అంతకన్నా ఇదో పెద్ద పనా అనో, భర్తకీ, పిల్లలకీ వండి పెట్టడం పెద్ద గొప్పా అనో – ఇంకా అందమైన భావాన్ని వ్యక్తీకరించి ఉంటే బావుండేదనిపించింది.

          “ఏరా, పచ్చడి బావుందా?” తండ్రి కేకేసాడు. రాజారావు నవ్వేశాడు ఆ తాపత్రయం చూసి. తల్లి కూడా నవ్వింది. “తెల్లారి లేచిన దగ్గర్నుంచి ఇదే తాపత్రయం ముసలాయనకి?” అంది.

          భోజనం చేసి రాజారావు ఇల్లంతా కలయ తిరిగాడు. పెద్ద ఆవరణ ఉండేది ఒకప్పుడు. తల్లి తుడిచి, శుభ్రం చేసి ఉంచుకోలేనంటే స్కూలుకి రాసిచ్చేశారు. ఇప్పుడు ఇల్లు, చిన్న దొడ్డీ మాత్రమే ఉన్నాయి. ఆ కాస్త స్థలం కూడా గడ్డి, పిచ్చి మొక్కలు మొలిచి చీదరగా ఉంది. చిన్నగా నిట్టూర్చాడు.

          “కాసేపు పడుకో” అంది తల్లి.

          మడతమంచం వాల్చుకుని పడుకున్నాడు. మడతమంచం బట్ట బాగా మాసి ఉంది. ‘విరక్తి’ అంటే ఇదేనా? అతని తలలో ఒక ప్రశ్న ఉదయించింది. ఎప్పట్నుంచి మొదలైంది తల్లిలో విరక్తి? జవాబు వెతకాలని ప్రయత్నిస్తుండగానే కళ్ళు మూతలు పడ్డాయి. మళ్ళీ మెలకువ వచ్చేసరికి సాయంత్రమైంది. ఇంక వెళ్తానని తయారయ్యాడు. రావటమైతే అంత దూరం ఏదో ఆవేశంలో స్కూటర్ మీద వచ్చేశాడు గానీ, తిరిగి దానిమీదే వెళ్ళటం తనవల్ల కాదనిపించింది. ” స్కూటరిక్కడే ఉండనీ. పిల్లలెవరో వచ్చి తీసికెళ్లారు” అని చెప్పి బస్సెక్కాడు.

          బస్సు హైదరాబాద్‍నుంచి వస్తోంది. అందులో రాధారాణి ఉంది. ఆమె రాజారావుకి పోస్టుగ్రాడ్యుయేషన్లో క్లాస్‍మేట్. తర్వాత పిహెచ్‍డీ చేసింది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేస్తుంది. ఇంకో ఏడాదో, ఆర్నెల్లో ఉంది సర్వీసు. వరంగల్లో ఉన్న అన్న దగ్గరకి వెళ్తోందిప్పుడు. అలా ఎప్పుడు వరంగల్ వచ్చినా రాజారావు ఇంటికి వెళ్ళకుండా ఉండదు. అనసూయతో ఆమెకి మంచి స్నేహం వుంది.

          రాధారాణి పెళ్ళి చేసుకోలేదు. ఎందుకనో రాజారావుకి తెలీదు. అలాంటి అంతరంగికవిషయాలు అడగాలంటే ఎంతో చనువుండాలి. రాజారావు అలాంటి చనువు తీసుకోలేకపోయాడు. అనసూయ అడిగి తెలుసుకుందేమో అతనికి తెలీదు.

          అతను ఖాళీగా ఉన్న కామన్‍సీట్లో కూర్చుంటే, ఆమె తానున్న లేడీస్ సీటొదిలేసి అతని పక్కన కూర్చుంది. కుశల ప్రశ్నలయ్యాయి. ఇంతకాలం తాను టచ్ చెయ్యటానికి సంకోచించిన విషయం ఇప్పుడు మాట్లాడాలనిపించింది.

          “ఇలా ఒంటరిగా ఉంటే విసుగనిపించటం లేదూ?” అడిగాడు.

      “ఒంటరితనంలోనే మనిషి ఎదుగుతాడట. నాకేంటి? హాయిగా ఉన్నాను. ఒకరికి దాస్యం చెయ్యక్కర్లేకుండా” తేలిగ్గా అనేసింది.

          రాజారావు ఉలిక్కి పడ్డాడు. “పెళ్ళి దాస్యమా?” తెలతెలబోతూ అడిగాడు.

          “కాదంటావా? తానా అంటే తందానా అనుకోవాలి భార్యాభర్తలిద్దరూ. ఏ ఒక్కర్లో కాస్త ఇండివిడ్యువాలిటీ ఎక్కువైనా సమస్యలే.”

          “అందుకని అసలు పెళ్ళే వద్దంటావా?”

          “మనకి బతకటం రాదోయ్. ఎంతసేపూ ఎదుటివాళ్ళని చూసి ఏడ్వటం మాత్రమేవచ్చు. భార్య కాస్త బాగుపడ్తుంటే చూసి ఓర్చుకోగలిగే మగవాళ్ళెవరు? అలాంటప్పుడు పెళ్ళెందుకు ఆడవాళ్ళకి ?”

          “కుటుంబం ముఖ్యమా? వ్యక్తిగత ప్రగతి ముఖ్యమా”

         “అదే ప్రశ్న నేను నిన్నూ వేస్తే?”

          “భార్యాభర్తలిద్దరూ ఎవరి దారిన వాళ్ళు పోతే మరి వాళ్ళ పిల్లల సంగతి?”

          “నువ్వు చెప్తున్న కుటుంబ వ్యవస్థ ఏ పుస్తకాల్లో ఉంది? ఆ రోజుల్లో కూడా ఎవరికీ ఎక్కువమంది పిల్లల్లేరు. ఒకరి గురించి ఒకరు తెలుసుకొని, మనసా వాచా కర్మణా యిష్టపడి పెళ్ళిచేసుకోవటం, అలా కాదంటే పెద్దవాళ్ళే చెయ్యటం. ఆ పైన పిల్లలు పుడితే వాళ్ళని పదిపన్నెండేళ్ళదాకా పెంచి గురుకులానికి పంపటం, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పెళ్ళి చేసుకోవటం… అంతేగానీ, ఇల్లూ, పిల్లలూ అంటూ వేళ్ళాడటం ఎక్కడైనా ఉందా?”

          ఆమె మాటలకి రాజారావు ఆలోచనలో పడ్డాడు. నిజమే. ఇవన్నీ కృత్రిమ విలువలు. మనిషి తానే సృష్టించుకుని తనకే సంకెళ్ళుగా వేసుకున్నవి. భార్య అన్నట్టు ఇందులో ఇంక వ్యక్తిగత వికాసానికి చోటెక్కడ? అయితే, ఈ వ్యక్తిగత వికాసం కోసం ఇల్లూ, వాకిలి వదిలేసి ఎక్కడికో పారిపోవాలా అనేది తన సంసారంలో ఉత్పన్నమైన సమస్య.

          “ఏమిటంత ఆలోచన?” అడిగింది రాధారాణి,

          రాజారావు చెప్పాడు.

          “అనసూయ అన్నదాంట్లో తప్పేముంది? ఇల్లన్నాక వండుకోవటం, సర్దుకోవటం, బాధ్యతలు తప్పవు. ఇలా ఎంతకాలం? అరవయ్యేళ్ళు రాగానే ఆఫీసులో రిటైర్మెంటు దొరుకుతుంది. ఫైళ్ళ ఆలోచనలనుంచీ విముక్తి దొరుకుతుంది.  మరి ఆడవారికి ఇంట్లో? రేపేం వండుకోవాలి? కూరలేం వున్నాయి? సరుకులేం తెచ్చుకోవాలి? ఇలాంటి ఆలోచనల్లోంచీ వాళ్ళకి విముక్తి వుందా?”

          “అక్కడికెళ్తే మాత్రం కూర్చోబెట్టి పెద్దారా?”

         “మా తమ్ముడికూతురికి ఈమధ్యనే పెళ్ళైంది. కాపురం పెట్టారు. ఇద్దరూ వుద్యోగస్తులుకాబట్టి బాధ్యతలని పంచుకున్నారు. కొన్ని పనులు అతను… కచ్చితంగా చెయ్యాలని. వారానికి ఒకసారి బెడ్‍షీట్లు మార్చటం అందులో ఒకటి. ఆమె గుర్తుంచుకుని చెప్తేగానీ అతను మార్చడు.  పని వేరు, బాధ్యత వేరు”

          “చిన్న విషయం. అతనికంత ప్రత్యేకంగా చెప్పేబదులు తనే మార్చవచ్చు. అదేం పెద్దపని కాదు”

          “ఎగ్జాక్ట్‌లీ. అంత చిన్నపనికూడా చెయ్యలేనివారిని ఎంతకని భరించగలం?”

          రాజారావుకి తృప్తి కలగలేదు. ““ఎక్కడికో వెళ్ళి తిని కూర్చోవాలనుకోవడం అసంబద్ధంగా లేదూ?” అనడిగాడు.

          “ఇక్కడ నువ్వు చేస్తున్నదీ అదేగా?” క్లాస్‍మేటనే చనువుతో అనేసింది. చెళ్ళుమని చరిచినట్లైంది రాజారావుకి.

          అతని ముఖకవళికలని గమనించి అంది తానే మళ్ళీ. “ఈ ఆశ్రమాన్ని గురించి నేనూ విన్నాను, చదివాను. బాగా చదువుకున్నవాళ్ళు సైతం వెళ్తుంటారు. డాక్టర్లు, ఇంజనీర్లూ -ఒకరేంటి, ఎందరో. ఎవరికి నచ్చిన పని వాళ్ళు చెయ్యొచ్చు. ప్రొఫెషనల్ సర్వీసెస్ కూడా తీసుకుంటారు. ఒంటరిగా నాలుగోడల మధ్య ప్లాస్టిక్ డబ్బాలో ప్రపంచాన్ని వెతుక్కునే కన్నా అలాంటిచోట వెతుకులాటేది లేకుండానే కనిపిస్తుంది. వాళ్ళకి డబ్బో, సేవో రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వగలిగితే సరిపోతుంది. పూర్తిగా కాకుండా కొన్నాళ్ళు వెళ్ళి రండి. అందులో వుండే సాధకబాధకాలు తెలుస్తాయి. పిల్లలుకూడా పెద్దవాళ్ళేగా?”

          రాజారావులో సమాధానపడటం మొదలైంది. తన భార్యతో మొదలు పెట్టి నలుగురు స్త్రీల స్పందన చూశాడు. అందరూ ఈ సంసారజంజాటాలనుంచి విముక్తిని కోరుకుంటున్నవాళ్ళే. తన తల్లి చావుతో ముడి పెట్టుకుంది. అనసూయ మధ్యే మార్గాన్ని వెతుక్కుంది. అదే దార్లో ఉంది వసుధ. రాధారాణి… అసలామె పంజరంలోకి అడుగే పెట్టలేదు. బంధించబడి ఉన్నవాళ్ళకి విముక్తి కావాలి. బంధనాలేవీ లేని తనలాంటివాళ్ళకి దాని అర్థం తెలీదు. తెలుసుకోవాలనుకోలేదు. కానీ, తెలిసింది. ఇక పైన ఏం చెయ్యాలో అదే చెయ్యాలి. బస్సు హనుమకొండలో ఆగింది. ఇద్దరూ దిగారు.

          “లివ్. లెట్ లివ్ పాలసీ మర్చిపోతున్నాం మనం” అంది రాధారాణి.

          “ఇప్పుడు గుర్తొచ్చింది” నవ్వాడు రాజారావు. ““మనం బతకడం కోసమేనా ఎదుటివాళ్ళను  బతకనివ్వాలి. అనసూయ లేనిదే నేను బతకలేను. కానీ, తాను అలిగింది. నన్నొదిలిపెట్టేసైనా వెళ్ళిపోతానంది. తన కోసం నేనే వెళ్తాను.”

          “అవినాభావ సంబంధం.” ఎప్పడో చదివిన తెలుగుపదం గుర్తు తెచ్చుకుందామె.

          “నువ్వు కూడా చేసుకోకూడదూ? అందులో ఉండే మజా తెలుస్తుంది. బెటర్ లేట్ దేన్ నెవర్ అన్నారు”

          “ఎవరేనా స్టూడెంటుని చేసుకుంటాను. క్లాసులు పీకినా వింటాడు” అని నవ్వి, వెళ్తున్నానన్నట్టు చెయ్యూపి వెళ్ళిపోయింది. రాజారావు టికెట్ కౌంటర్ దగ్గరకెళ్ళి భార్య చెప్పిన చేసిన ప్రయాణానికి టిక్కెట్లు రిజర్వు చేసుకుని వచ్చాడు.

(ఇండియాటుడే, 28 నవంబరు, 2000)