వెఱపు by Sailaja Ramshaw

“నిహాన్! నిహాన్!” అని తల్లి పిలుస్తున్నా వినిపించుకోకుండా మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు. నొసలు ముడిపడ్డాయి సుధకి. అంత హడావిడిగా ఎక్కడినుండి వచ్చాడో తెలియట్లేదు. గబగబా పైకి వెళ్లి, అప్పటికే మూసుకున్న కొడుకు గది తలుపు తట్టింది.
తలుపు తీసి, విసుగ్గా మొహం పెట్టి, “ఏమిటమ్మా! స్నానం చేయాలని వెళుతుంటే..” అన్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, మొహం చూస్తే చిరాగ్గా ఉంది.
“నిన్ననగా వెళ్లావు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. మాకేమీ భయం వేయదనుకొంటున్నావా? తిండి, తిప్పలు లేకుండా బయట తిరగడం ఏమిటి? కనీసం ఎక్కడ ఉన్నావో చెప్పాలనే బాధ్యత కూడా లేకుండా తయారఅయ్యావేంటి? ఆ స్నానం ఏదో అయ్యాక కిందకి రా. మళ్ళీ మంచం ఎక్కకు” కొడుక్కి వార్నింగ్ ఇచ్చి వెనక్కి తిరిగింది.
పావుగంట తరువాత, కిందకి వచ్చి, తల ఎత్తకుండా గబాగబా నాలుగు ముద్దలు తిని, తల్లికి చెప్పి తన రూమ్‍లోకి వెళ్లి తలుపు వేసుకొని పడుకొన్నాడు. ఏంటి ఇవాళ, వింతగా ఉంది వ్యవహారం? అనుకొంటూ, సరేలే, తరువాత అడుగుదాం అనుకొంది సుధ.
రెండు రోజులైనా నిహాన్ పరిస్థితి అలానే ఉంది. ఎంత అడిగినా ఏమీ చెప్పట్లేదు. సరిగ్గా తిండి లేదు, నిద్రపోతున్నట్టు లేదు. వద్దన్నా కార్ తీసేవాడు, లైసెన్స్ లేదురా బాబూ అన్నా వినకుండా, దగ్గరే అమ్మా, ఇప్పుడే వస్తాను అనుకొంటూ వెళ్లిపోయేవాడు. ఈ రెండు రోజులనుండీ బయటకి కదలటం లేదు. ఇంక ఈయనకి చెప్పాల్సిందే అనుకొంటూ భర్త ఆఫీసులోకి వెళ్ళింది సుధ. అక్కడ అతను లేదు. ఆఫీస్‍కి వెళ్లిపోయినట్టున్నాడు.
సుధ భర్త రాజారావు, కేంద్రప్రభుత్వంలో పెద్ద అధికారి. ఇంట్లోకూడా ఒక ఆఫీసు, ఆయన కార్యాలయ సిబ్బంది వస్తూ పోతూ ఉండటం, వీటివల్ల రాజారావు బిజీగా ఉండడంతో పిల్లల బాధ్యత చాలామట్టుకు సుధే చూసుకొంది. అమ్మాయి పెద్దది, చదువు కాగానే వివాహం చేసి పంపించారు. అల్లుడు ఐ. పి. ఎస్. వాళ్ళు ఢిల్లీ లో ఉంటారు. అమ్మాయి ఎంబీఏ చేసి, ఢిల్లీలోనే ఓ విదేశీబ్యాంకులో పని చేస్తుంది.
ఇంట్లో ఇప్పుడు ముగ్గురే ఉండడం, నిహాన్ బాగానే చదువుకోవడం వీటివల్ల సుధకి పని తగ్గింది. తనకి తీరిక ఎక్కువ అవ్వడంవల్ల నిహాన్‍ని పట్టించుకోవడం లేదా? ఏదైనా ప్రేమ గోల కాదుకదా? రకరకాల ప్రశ్నలతో, రకరకాల ఆలోచనలతో సతమతమవుతోంది సుధ. ఆమధ్య
క్లబ్‍లో కలిసిన స్నేహితురాళ్లు అందరూ పిల్లల గురించి ఏదో ఒక సమస్య చెప్పుకొనేవారే! కొంతమందికి పిల్లల చదువులు సమస్య. కొంతమందికి వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడం సమస్య. పిల్లల కాలేజీలలో డ్రగ్స్, ర్యాగింగ్‍లాంటివన్నీ మాట్లాడుకుంటుంటారు. ఇందులో ఈ నిహాన్ ఏ సమస్యలో ఇరుక్కున్నాడో! ఆలోచిస్తుంటే తల పగిలిపోతున్నట్టుంది సుధకి.
ఇంతలో రాజారావు భోజనానికి రావడంతో, తాను కూడా కదిలింది. ఏదో ఆలోచిస్తూ భోజనం చేస్తున్న సుధని రాజారావు పలకరించాడు. “ఏమైంది సుధా! అలా ఉన్నావు? ఏమైనా నలతగా ఉందా? నిహాన్ ఎక్కడ?” అని అడగగానే, సుధకి ముందు దుఃఖం ముంచుకొచ్చింది. “వాడిగురించే నాకీ బాధ. సరిగ్గా మాట్లాడటం లేదు. భోజనం తినట్లేదు. రోజంతా తన గదిలోనే ఉంటున్నాడు. మీకు చెబుదామనే ఈరోజు మీకోసం ఎదురు చూస్తున్నాను” అంది.
“అయ్యో! ఏమైనా ఒంట్లో బాలేదేమో? కనుక్కుందాం” అని భోజనం దగ్గరనుంచి లేవబోయాడు. సుధ వారించి, “రేపు పొద్దుట మాట్లాడండి. హెల్త్ బానే ఉంది. ఏదైనా సమస్యలో ఉన్నాడేమో అనిపిస్తుంది.” అన్నది సుధ. “సరే! చూద్దాం!” అంటూ చేయి కడుక్కోవడానికి లేచాడు రాజారావు.
మర్నాడు మామూలుగానే తెల్లవారినా, దినపత్రిక చూడగానే, నగరం ఉలిక్కిపడింది. అయిదుగురు మైనర్ అబ్బాయిలు, ఒక మైనర్‍బాలికని మానభంగం చేశారని, అపరాధులని ఇంకా వెతుకుతున్నారని వార్త. చదివిన తర్వాత సుధకి చాలా విచారం అనిపించింది. ఆ పిల్లను తలచుకొంటే, గుండెను ఎవరో రంపంతో కోస్తున్నంత నొప్పి కలిగింది. కిరాతకంగా, అసలు ఒక ఆడపిల్లని, ఇంకా అవయవాలు ఎదగని అమ్మాయిని అదే వయస్సులో ఉన్న అబ్బాయిలు రేప్ చేయడం ఏమిటి? ఎంతకని పిల్లలని రక్షించుకొంటాం? ఈ పిల్లలు, పబ్‍లని, పార్టీలని తిరుగుతుంటారు. మైనర్‍పిల్లలు ఇంత ఘోరం చేయడానికి కారణాలు ఏవైనా, మనం సృష్టిస్తున్న వాతావరణం, విశృంఖలంగా లభ్యమౌతూన్న హింస, అసభ్యత, ఆడపిల్లని అంగడి వస్తువులా చూపిస్తున్న సినిమాలు, సెన్సార్‍లేని ఆన్లైన్ ప్లాట్‍ఫామ్‍లు, ఎప్పుడూ బిజీగా ఉండే తల్లితండ్రులు అయ్యుంటాయి కారణాలు అని తనలో తానే అనుకొంటూ ఉండగా, హఠాత్తుగా నిహాన్ గుర్తుకు వచ్చాడు. వెంటనే గుండె జారిపోయింది. చిన్నప్పటి నుండీ ఏదైనా అల్లరి పని చేసినా, ఎవరితోటైనా కొట్లాట అయినా వాడికి ఇలా ప్రవర్తించడం అలవాటు. తిండి, తిప్పలు మానేసి, ముడుచుకుపోయి ఉండడం, ఆ గొడవ ఏదో ఇంటికి వచ్చేవరకు తమకు తెలియకపోవడం జ్ఞాపకం వచ్చింది.
ఆందోళన నిండిన మొహంతో, భర్త ఆఫీసు గది దగ్గరికి వెళ్ళింది. సుధ వెళ్ళగానే, బయటకు వచ్చాడు రాజారావు. “నిహాన్ లేచాడా?” అంటూ.
సుధ వెంటనే, పేపర్‍లో వార్త చూపిస్తూ “మన నిహాన్ ఈ అయిదుగురి లో ఒకడు కాదుకదా!” అన్నది, భయం భయంగా. వెంటనే రాజారావు తల అడ్డంగా ఊపుతూ “మనవాడు ఆలా చేయలేడు” అన్నాడు.
“అందరు తల్లి తండ్రులు అలాగే అనుకొంటారు” అంది నీరసంగా సుధ.
ఇద్దరూ కలిసి నిహాన్ రూమ్ దగ్గరికి వెళ్లేసరికి, పక్కమీద దొర్లుతూ, అసహనంగా ఉన్నాడు . తల్లి, తండ్రి గదిలోకి వచ్చినట్టు గ్రహించినా మంచంమీదనుండి లేవలేదు. ఒక తలగడ తీసి, మొహంమీద వేసుకొన్నాడు. సుధకి ఇంకాస్త గాభరా అనిపించింది.
“ఒరేయ్! ఎన్నిరోజులలా మొహం దాచుకొని తిరుగుతావు? చేసిన వెధవ పని ఏమిటో చెప్పు” అని గట్టిగా అడిగింది సుధ. నిహాన్ అర్ధం కానట్టుగా చూశాడు తల్లి వైపు. “ఏమైందమ్మా?” అని ఆతృతగా అడిగాడు. తండ్రివైపు అయోమయంగా చూశాడు.
రాజారావు చప్పున నిహాన్ భుజం పట్టుకొని లేవదీసి, “నాలుగైదురోజులనుండీ సరిగ్గా తినటంలేదట. ఏమైందిరా! ఏదైనా సమస్యా?” అని నెమ్మదిగా అడిగాడు. జవాబు చెప్పలేదు నిహాన్.
“చూడు నిహాన్, మీ అమ్మ ఎలా ఒణికిపోతుందో? నువ్వేదైనా చెడ్డపని చేసి, మొహం దాచుకొన్నావేమో అని భయపడుతోంది. ఎలాంటి సమస్య అయినా ఫర్వాలేదు, మేమిద్దరం నీకు దిశా నిర్దేశం చేయగలం” అన్నాడు.
“ఏమీ లేదు నాన్నగారూ!” అని అతికష్టంమీద జవాబు చెప్పాడు తప్ప, వంచిన తల ఎత్తలేదు నిహాన్.
బలవంతంగా తల ఎత్తి చూస్తే, కళ్ళల్లో నుండి నీళ్లు కారడానికి రెడీగా ఉన్నాయి. సుధకి సైగ చేసి గదిలోనుండి బయటకు వెళ్ళమన్నాడు. తల్లి బయటకు వెళ్ళగానే, మంచం మీద కూలబడిపోయాడు నిహాన్. పరీక్ష్గా కొడుకుని పరికించి చూశాడు రాజారావు. ఎందుకో బెదిరిపోయాడు, అనిపించింది.
మెట్లు దిగి కిందకి వెళ్లిన సుధకి ఏం చేయాలో తెలియలేదు. చిన్నపిల్లల రేప్ కేసులు చాలానే మీడియాలో కనపడుతున్నా, బాధితురాలి గురించి ఓసారి అలోచించి ఏం చేయగలమనే నిస్సహాయత, తరువాత మర్చిపోవడం. ఈరోజు నిహాన్ ఇందులో ఉన్నాడేమో అనే ఆలోచనే తినేస్తుంది. ఆ పిల్ల, మైనర్ అని చెపుతున్నారు, చదువుకోవాల్సిన వయస్సు, ఇంకా బాల్యం వీడిపోని వయస్సు. ఇటు చేసినవారు కూడా అంతే. నిహాన్‍కూడా ఇందులో ఉన్నడా? తాను అంత కళ్ళు మూసుకొని ఉన్నదా? వాడి స్నేహాలు, అలవాట్లు నా స్కానర్‍లోకి రావటం లేదా? కంబైన్డ్ స్టడీస్, ఆటలు పేరుతో వీడు పబ్‍లకి, పార్టీలకి వెళుతున్నాడా? అమ్మాయిలకి వల విసిరేటంత పెద్దవాడైపోయాడా? ఆ పిల్లమీద ఈ మానభంగం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? తన కొడుకు ఈ క్రైమ్‍లో ఉండి ఉంటే, తల్లితండ్రులుగా తాము ఏం చేయాలి? నిహాన్ తన స్నేహితులతో కలిసి చేసి ఉంటే వారి పరిస్థితి ఏమిటి? ఇలా రేప్, హత్యలాంటి నేరాలు చేసిన మైనర్ బాలలకి సమాజం ఏం చెపుతుంది? ఇలాంటి ప్రవర్తనా లోపాలని ఎలా గుర్తించాలి? ఎలా తగ్గించాలి? ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? రకరకాల ఆలోచనలు హైవే మీద తిరిగినట్టు తిరుగుతున్నాయి. కాఫీ చేసుకొని తాగుతూ ఇంకాస్త ఆలోచనలలోకి కూరుకుపోయింది సుధ.
పక్కన కూర్చొని, అరచేతులు చూసుకొంటున్న నిహాన్ భుజంమీద చేయివేసాడు రాజారావు. “చూడు నిహాన్, ఏదైనా పొరపాటు జరిగి ఉంటే, వెంటనే చెప్పడం మంచిది. నేను ఏమైనా సహాయం చేయగలనేమో చెప్తాను” అన్నాడు రాజారావు.
ఓ నిముషం నిశ్శబ్దం తరువాత, నిహాన్ గొంతు విప్పాడు. “నేనో తప్పు చేసాను నాన్నా!. సరిగ్గా ఐదురోజులక్రితం” అని ఆగాడు. రాజారావులో ఆరాటం హెచ్చింది. కొంచెం గట్టిగా ఊపిరి పీల్చుకొని, మాట్లాడడం మొదలుపెట్టాడు నిహాన్.
“నేను, మా ఫ్రెండ్స్ రాకేష్, విస్సు, కపిల్, శ్రీధర్ కలిసి ఆరోజు క్రికెట్ ప్రాక్టీస్ కని జూబిలీహిల్స్‌కి వెళ్ళాము. గ్రౌండ్ ముందే బుక్ చేసుకొన్నాం. షూస్ వేసుకొని, దిగి కాసేపు ఆడేటప్పటికీ ఎవరో రౌడీలా ఉన్నవాళ్లు గ్రౌండ్‍లో ఇంకొకవైపునుండి ఆడడం మొదలుపెట్టారు. దాదాపు మా వయస్సే ఉంటుంది. మాకు అడ్డంగా ఉన్నారని శ్రీధర్ వెళ్లి వాళ్ళతో మాట్లాడాడు. వాళ్లు కొంచెం రఫ్‍గా ఉన్నారట. మా ఇష్టం మీదిక్కున్న చోటు న చెప్పుకోండి అని అనడంతో, మామట్టుకు మేం ఆడుకోవడం మొదలుపెట్టాం. నేను కొట్టిన బంతి ఆ గ్రూప్‍లోని వాడికి కాలిమీద తగిలిది. వెంటనే తగాదాకి వచ్చారు. సారీ చెప్పినా వినకుండా, డర్టీగా మాట్లాడడం మొదలుపెట్టారు. మా తల్లులని, అక్కచెల్లెళ్లని కూడా వదలలేదు. దానితో, కొంచెం గొడవ ఎక్కువై, కొట్టుకోవడం వరకు వచ్చింది. నేను కొట్టిన దెబ్బకి వాళ్లలో ఒకడికి చెవికింద తగిలి, చెవిలోనుండి రక్తం వచ్చింది” అని ఆగాడు.
కొంచెం ధైర్యం వచ్చింది రాజారావుకి. “తరువాత?” అని అడిగాడు కొడుకుని.
“వెంటనే హాస్పిటల్‍కి తీసుకెళ్ళాం. ఆ అబ్బాయికి ఇయర్‍డ్రమ్‍లో కన్నం అయ్యింది. ఇర్రిపేరబుల్ అంట. నాకు చాలా సిగ్గువేసింది. తెలియకుండా కొట్టాను. అంత దెబ్బ తగులుతుందని అనుకోలేదు నాన్నగారూ! ఇది విన్న తరువాత అటువైపునుండి ఎలాంటి రియాక్షన్ లేదు. కనీసం ఇంటిమీదకి వస్తారేమో అనుకొన్నాం. పోలీస్‍కేసు అవుతుందేమో అని భయపడ్డాం. వాళ్ళేం చేస్తారో అనే దానికన్నా నావల్ల యిలా జరిగిందనే బాధ ఎక్కువగా ఉంది నాన్నగారూ!” అని ఆపాడు.
ఏం చెప్పాలో అర్ధం కాలేదు రాజారావుకి, రేప్‍లాంటి హీనమైన క్రైంలో లేనందుకు ఆనందించాలో, క్షణికావేశంలో తన వయస్సువాడి చెవి పగులగొట్టినందుకు విచారించాలో, చేసిన తప్పుకి బాధపడుతున్న కొడుకుని సముదాయించాలో అర్థంకాక విభిన్నమైన ఆలోచనలు ముసురుకొన్నాయి రాజారావు తలలో.
ఒకసారి తల విదిలించి, “మీ అమ్మని పిలవనా?” అని అడిగాడు. తల ఊపాడు నిహాన్.
మెల్లిగా భయపడుతూ గదిలోకి అడుగు పెట్టిన సుధ భయం భయంగా కొడుకు, భర్త వైపు చూసింది. నిహాన్ తల ఇంకా వంగి ఉంది తప్పుచేసినవాడిలా. భర్త మొహంలో కొంచెం రిలీఫ్ కనిపిస్తోంది. కానీ, ఏదో జరగరానిది జరిగింది అని తెలుస్తుంది.
“సుధా! నిహాన్ తన నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి, క్రికెట్ ఆడడానికి వెళ్లి, అక్కడ ఎవరితోటో గొడవ పడ్డాడు. అవతలవాడికి చెవికింద దెబ్బ తగలడంతో డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళినప్పుడు ఇయర్ డ్రంలో కన్నం పడింది, దాన్ని రిపేర్ కూడా చేయలేరట అని తెలిసింది. అప్పుడు ఆవేశంలో కొట్టి, ఇప్పుడు బాధపడుతున్నాడు” అన్నాడు రాజారావు.
చప్పున కుర్చీలో కూలబడింది. పొయ్యిలో పడలేదు కానీ, పెనంమీదే ఉన్నాం అని అర్ధం అయ్యింది. నిహాన్ క్రోధాన్ని సరైన ఛానల్‍లో పెట్టాలనికూడా అర్ధం అయ్యింది.
రాజారావు నిహాన్‍ని, అతని స్నేహితులను తీసుకొని దెబ్బ తగిలిన రాజు దగ్గరికి వెళ్లాడు. మిగతా పిల్లల తండ్రులుకూడా వచ్చారు. రాజు పేరెంట్స్ సానుకూలంగా స్పందించారు. ఇలాంటి గొడవలు జరగకూడదని, మొదట గొడవ మొదలు పెట్టింది, రాజు వాళ్లేనని తెలుసుకొని వాళ్లనే చీవాట్లు పెట్టారని తెలిసింది. అందరి పిల్లలని కౌన్సిలింగ్‍కి పంపించాలని ఒక ఒప్పందానికి వచ్చారు.
సుధమాత్రం చాలారోజులు మామూలు కాలేకపోయింది. మైనర్‍బాలిక వార్తలు వచ్చినప్పుడంతా మనసు కోసేస్తున్నట్టు బాధపడింది. భయం వెన్నుపూసంతా వణికిస్తుంది. తాను లా చదివి గృహబాధ్యతలతో వదిలేసింది. ఆరోజుల్లో కాలేజీ టాపర్. ఇల్లు, వాకిలి చూసుకొంటూ తనంత గొప్ప గృహిణి లేదని ఎక్కడో గర్వం ఉండేది. నిహాన్ ఆవేశం ఎలా పరిణమించిందో, వాడిలో ఎంత అసహనం ఉందో తెలుస్తుంటే, తనమీద, తన పెంపకంమీద జాలిగా అనిపించింది. నేరమనస్తత్వం ఏ స్థాయిలో ఉన్నా, దాన్ని అదుపులో పెట్టాలని అర్ధం అయ్యింది.
ఓ సంవత్సరం తరువాత, నలుగురు చైల్డ్ సైకాలజిస్ట్‌లు, ఇద్దరు లాయర్లతో కలిసి, కౌన్సెలింగ్ సెంటర్ మొదలుపెట్టింది. చాలామంది పిల్లలు, తల్లితండ్రులని కలిసి, కౌన్సిలింగ్ చేశారు. వారి ఇబ్బందులు, పిల్లల మానసిక అవలక్షణాలు విని, ఓపికగా పరిష్కారమార్గాలు వెతికారు.
నాలుగు సంవత్సరాలలో దాదాపు వెయ్యిమంది పిల్లలు కౌన్సెలింగ్‍సెంటర్‍ద్వారా లబ్ది పొందారు. వారిలో మొదటివాడు నిహాన్.


ఇరవైరెండేళ్ళైన నిహాన్ ఇప్పుడు, వారానికొకసారి సెంటర్‍కి వచ్చి తన అనుభవాలు పిల్లలతో పంచుకొంటున్నాడు. సుధ మాత్రం ఆ ఐదురోజులు పడ్డ మానసిక వేదనని మర్చిపోలేదు. పిల్లలు ఏదైనా నేరంలో కూరుకొంటే తల్లితండ్రులమీద, కుటుంబంమీద ఎలాంటి ప్రభావం ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో, తరచుగా తల్లితండ్రుల సెషన్స్‌లో పంచుకొంటుంది.