శతాయుష్మాన్ భవతి by S Sridevi

  1. అక్కాచెల్లెళ్ళు by S Sridevi
  2. గుండెలోతు by S Sridevi
  3. మనుష్యరేణువులు by S Sridevi
  4. బడి వదిలాక by S Sridevi
  5. హలో మనోరమా! by S Sridevi
  6. ఇరవైమూడో యేడు by S Sridevi
  7. అతనూ, నేనూ- మధ్యని మౌనం By S Sridevi
  8. ఒకప్పటి స్నేహితులు by S Sridevi
  9. పుత్రోత్సాహం by S Sridevi
  10. వెంటాడే జ్ఞాపకాలు by S Sridevi
  11. ప్రేయసి అందం by Sridevi Somanchi
  12. ఉరి by S Sridevi
  13. మరోజన్మ by S Sridevi
  14. అంచనా తప్పింది by S Sridevi
  15. వప్పందం by S Sridevi
  16. శతాయుష్మాన్ భవతి by S Sridevi
  17. కొత్త అతిథికోసం by S Sridevi
  18. చెయ్ by S Sridevi
  19. పరారైనవాడు by S Sridevi
  20. కృతజ్ఞతలు by S Sridevi

భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‍కి చెందిన ఎనిమిదేళ్ళమ్మాయి తండ్రిని ఇలా అడిగింది, “నాన్నా! మనకెందుకు ఎప్పుడూ ముసలి ప్రైంమినిస్టర్లూ ప్రెసిడెంట్లూ వుంటారు? చక్కగా చిన్నవాళ్ళెందుకు ఎప్పుడూ రారు?”
తండ్రికేం జవాబు చెప్పాలో తోచలేదు. మనకి స్వాతంత్య్రం వచ్చిన నాటికి నెహ్రూకి యాభై ఎనిమిదేళ్ళు. అరవై నాలుగులో ఆయన చనిపోయేసరికి డభ్భయ్యైదు. ఆ తర్వాత వచ్చిన శాస్త్రిగారికి అరవై. ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ పంథొమ్మిదివందల పదిహేడులో పుట్టింది. ఒక్క రాజీవ్ గాంధీని మినహాయిస్తే అంతా ఒక పరంపరలా సాగింది. చాలాసేపు ఆలోచించగా ఒక జవాబు తట్టింది.
“మనది పెద్దవాళ్ళని గౌరవించే సాంప్రదాయం. అందుకని పార్టీలో సీనియర్లు ఎవరుంటే వాళ్ళని ఆ పదవిలో కూర్చోబెడతారు” అన్నాడు. తండ్రి చెప్పాడు గాబట్టి నిజమని నమ్మే వయసు. అందుచేత నమ్మింది. కానీ వాస్తవం అది కాదు. చిన్నవాళ్ళు నాయకులైతే పార్టిలో వుండే సీనియర్లు వాళ్ళ మాట వినరు. ఇదొక్క రాజకీయాల్లోనే కాదు, ఆఫీసుల్లో, ట్రేడ్‍యూనియన్లలో, ఇళ్ళలోవాకిళ్ళలో… సర్వేసర్వత్రా.
అదే అమ్మాయి మరో నాలుగేళ్ళ తర్వాత “మనం రాజీవ్ గాంధీని ఎందుకు కాపాడుకోలేకపోయాం? యువనేత కదా!” అని బాధపడింది.
ఇరవైరెండేళ్ళొచ్చి, పోస్టుగ్రాడ్యుయేషన్ సర్టిఫికెటు చేతికొచ్చాక తన భావాలని తండ్రి దగ్గర స్పష్టంగా ప్రకటించింది. “మనకి కూడా యువనేతృత్వం వుంటే చాలా బావుంటుంది నాన్నా! ప్రతి పదేళ్ళకీ ఒక కొత్తతరం తయారౌతుందని చెప్తారు. మొదటిసంవత్సరం వున్న ఆలోచనాసరళి పదోసంవత్సరానికి వచ్చేసరికి కాలం చెల్లిపోతుంది. బామ్మ అమ్మలా ఆలోచించలేదు. అమ్మ నాలా ఆలోచించలేదు. మీ ఆలోచనలు వేరు, మా అవసరాలు వేరు. సమాజాన్ని కేవలం వయసువలన వచ్చిన అనుభవం క్వాలిఫికేషన్ గా మనని రూల్ చేస్తే ఎలా? వయసువలన వచ్చిన అనుభవాన్నీ నడివయసులో వుండే శక్తినీ, వర్తమానానికి కావలసిన అవసరాలనీ ఖచ్చితంగా అంచనావేసి చెప్పగలిగే యువతతో జత కలిపి రూల్ చేస్తే బావుండదూ? మాకేం కావాలో మీకు తెలీదు. మీరిచ్చేది మాకు అవసరంలేనిది. మాకు అవకాశాలివ్వరు. అవకాశాలని వెతుక్కుంటూ ఎక్కడెక్కడికో వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి, ఒక అమెరికాకన్నా, ఒక జపాన్‍కన్నా మనదేశం ఎందులో తక్కువ?” అంది.
తండ్రి ఆశ్చర్యపోయాడు. అలా మాట్లాడవచ్చా? పెద్దవాళ్ల అనుభవం ముందు ఏవి నిలుస్తాయి? పెరిగి పెద్దదైన ఆ అమ్మాయే పావని, ఆ అమ్మాయి తండ్రికి అమ్మంటే ప్రాణం. పెద్దవాళ్ళంటే గౌరవం. ఈ రెండూ సాధారణంగా కనిపించే అసాధారణమైన విషయాలు. అతన్ని ఆశ్రయించుకుని వున్నవాళ్ళ జీవితాలని ప్రభావితం చేసేవి.


కూతురి ఆడబడుచుకి ఏదో పెళ్ళి సంబంధం వుందంటే ఆ వివరాలు తెలుసుకుందుకు స్నేహితుడితో కలిసి బయల్దేరాడు మూర్తి. ముందురోజు రాత్రి ఈ పనిమీదే కూతురు వచ్చింది. అతనిలా చెప్పులు వేసుకున్నాడో లేదో మననడొచ్చి కాళ్ళకి చుట్టుకుపోయాడు. తననీ తీసుకెళ్ళమని ఒకటే అల్లరి. ఏడాది నిండింది వాడికి.
“పావనీ! వీడిని పక్కకి తీసుకెళ్ళమ్మా!!” లోపలున్న కూతురికి కేకేసి చెప్పాడు. ఆ అమ్మాయి రాలేదుగానీ మూర్తి భార్య అరుంధతి వచ్చింది.
“అది పడుకుంది. వీడసలు దాన్ని నిద్రపోనిస్తాడూ? పగలంతా ఆఫీసు. రాత్రంతా వీడి అల్లరి” మురిపెంగా అంటూ పిల్లవాడిని తియ్యబోతే వాడు. అమ్మమ్మకి నో చెప్పేసాడు. చెప్పులేసుకున్న తాతయ్యని వదిలిపెట్టలేదు. ఎన్నో మాయమాటలు చేస్తేగానీ అతని దగ్గర్నుంచీ ఆమె దగ్గరకి వెళ్ళలేదు. అరుధంతి వాడికి వూసులు చెప్తూ పెరట్లోకి తీసుకెళ్ళిపోయింది. స్నేహితులిద్దరూ మాట్లాడుకుంటూ పోర్టికోలోకి వచ్చారు. మూర్తి కారు తియ్యబోతుంటే అతని తల్లి ఎదురొచ్చింది. దాదాపు ఎనభయ్యేళ్ళుంటాయి అవిడకి. రాజారావూ పరిచయమే.
“బైటికెళ్తున్నారల్లే వుంది? కార్లోనేగా? పొద్దుటినుంచీ ఆయాసంగా వుందిరా! ఒక్కమాటు డాక్టరు దగ్గరికి తీసుకెళ్దూ” అంది.
“నేను వేరే ముఖ్యమైన పనిమీద వెళ్తున్నానమ్మా! అరుంధతి తీసుకెళ్తుందిలే” అన్నాడు మూర్తి.
“పొద్దుటినుంచీ దానికి మనవడితోనే సరిపోతోంది” ఆవిడ గొణుక్కుంటూ వెళ్ళిందిగానీ అతన్లో తప్పుచేసిన భావన. అలాగే కారు స్టార్ట్‌చేసాడు.
కొడుకు కారు కదిలాక ఇంట్లోకి వచ్చింది శాంత. హాల్లో కూర్చుని మనపడితో వూసులాడుతోంది అరుంధతి,
“అబ్బాయి ఎక్కడికో వెళ్ళాడు. నిన్ను తీసుకెళ్ళమన్నాడు డాక్టరు దగ్గరకి” అంది.
అరుంధతి చురుగ్గా చూసింది. “ఇప్పుడేమైంది?” అడిగింది.
“పొద్దుటి నుంచీ ఆయాసంగా వుంది… “
“పావని రేపు పొద్దుట వెళ్ళిపోతుంది. దానికేవైనా చేసివ్వాలి. ఈవేళకాదు రేపు వెళ్దాం”
“ఎంత? పది నిముషాల్లో వెళ్ళిపోతాం” బతిమాలింది సీతమ్మ.
“వెళ్ళడానికి పది నిముషాలే. కానీ ఆయన్ని కలవటానికి గంటల తరబడి ఎదురుచూడాలి. ఈవేళ నావల్ల కాదు… ఐనా ఆయాసం ఎందుకొచ్చింది? వద్దంటుంటే నిన్న ఆ నువ్వులపచ్చడి ఎందుకు వేసుకున్నారు? మీకు నువ్వులు పడవుకదా? ఇప్పుడేమో డాక్టరు దగ్గరకి పరిగెత్తమంటున్నారు. ఇంతకుముందు తెచ్చిన మందులు వేసుకోండి. అదే తగ్గుతుంది” అనేసి అక్కడినుంచీ వెళ్ళిపోయింది అరుంధతి.
ఇంట్లో కోడలిదే రాజ్యం. తన మాట ఎవరికి పట్టింపు? మొదట్లో ఇలాంటివి జరిగితే కొడుకు ఆమెని కోప్పడేవాడు. కోడలు అగ్గగ్గలాడుతూ వినేది. రానురాను అతనూ మారిపోయాడు! అతన్నిబట్టే ఆమెకూడా.
మూర్తి బైటినుంచీ రాగానే చెప్పింది డాక్టరు దగ్గరికి తీసుకెళ్లలేదని. అతనికి చిరాకూ, కోపం రెండూ వచ్చాయి.
“రేపు తీసుకెళ్తానని చెప్పాగా? ఎందుకు గొడవ? ఇంతకుముందు ఎలర్జీకి ఇచ్చిన టేబ్లెట్లు వేసుకుంటే తగ్గుతుందని చెప్పానా? బైటినుంచీ వచ్చిన మనిషిని విసిగిస్తారెందుకు?” అతను తనని అడక్కముందే అంది అరుంధతి.
“ఓమాటు తీసుకెళ్తే నీ సొమ్మేం పోయేది? పెద్దదాన్ని బాధపెడ్తావ్?” కోపంగా అడిగాడు మూర్తి,
“ఔను. ఆవిడకి నడుం వంగి కర్రపోటేసుకుని నడుస్తోందిగాబట్టి మేమందరం కూడా కర్రలు పట్టుకుని నడుస్తాం. ఆవిడకి పళ్ళూడాయిగాబట్టి మేం పళ్ళు రాలగొట్టుకుంటాం. ఆవిడకి ఎలర్జీ, షుగరు, బీపీ వున్నాయిగాబట్టి మేం అన్నీ తినడం మానేసి నోళ్ళు కట్టుకుంటాం. ఇప్పుడంత అర్జెంటేమొచ్చిందని డాక్టరు దగ్గరకి పరిగెత్తాలి? ఆవిడ ఏమేం తిందో అడగండి. పావనికి యిష్టమని కాస్తంత నువ్వులపచ్చడి చేసాను. వదలకుండా తింది. బాబిగాడికి పెట్టచ్చని పాయసం చేసాను. గ్లాసునిండా పోసుకుని దాచుకుదాచుకు తాగింది” అరుంధతి గట్టిగానే అంది.
మూర్తికి ఏం మాట్లాడాలో తోచలేదు.
ఇంతలో పావని వచ్చింది అక్కడికి. నాయనమ్మతో చిన్నప్పట్నుంచీ ఇలా ఆమెకి అలవాటే. అమ్మ విసుక్కోవటమే కొంచెం కొత్త. నిజమే! అమ్మమాత్రం ఎంతకాలం సర్దుకుపోతుంది? తల్లిపట్ల జాలి కలిగింది. బామ్మ పెద్దదౌతోందని ఆవిడపట్లా జాలి పుట్టింది.
“నువ్వెళ్ళిన పని ఏమైంది నాన్నా?” అడిగింది. అది ముఖ్యం.
మూర్తికి చిన్నతనం అనిపించింది. రాగానే ముందు ఆ విషయాన్ని కూతురికి చెప్పాలనుకున్నాడు. కానీ మరోలా జరిగింది. “పెళ్ళిచూపులకి వస్తామన్నారు. వచ్చే ఆదివారం నేను వెంటబెట్టుకుని వస్తాను. మీరు ఏర్పాట్లలో వుండండి” అన్నాడు. పావని ముఖం వికసించింది.
“నీ సుపుత్రుడేడి?” అడిగాడు మూర్తి ఆరాగా.
“నిద్ర తీస్తున్నాడు. ఇంకో గంటకో అరగంటకో లేస్తాడు. రాత్రంతా వుంటుంది, మనకి” పావని నవ్వింది.
“భోజనాలకి రండి. వడ్డించాను” పిలిచింది అరుంధతి.
“ఇంకా ఎవరూ తినలేదా?” అడిగాడు మూర్తి.
“నువ్వొస్తే కబుర్లు చెప్పుకుంటూ తిందామని ఆగిపోయాం. మళ్ళీ రేపు వుదయాన్నే నేను వెళ్ళిపోవాలి” అంది పావని.
“ఇంకో రెండురోజులు వుండేలా రాకపోయావామ్మా?” అభిమానంగా అడిగాడు.
“లీవుల్లేవు. వీడికి జలుబు చేసినా జ్వరం వచ్చినా భయపడి పెట్టించేస్తారు తను” పావని భర్త గురించి చెప్పింది. అల్లుడి వుద్యోగాన్ని గురించి మూర్తి కొన్ని ప్రశ్నలు అడిగాడు. అరుంధతీ మాట కలిపింది. అక్కడ తనకి ప్రాధాన్యత లేదనిపించింది శాంతకి. అంతేగానీ వయసులో వున్నప్పుడు తన కూతుళ్ళు కూడా వచ్చీరావటంతోటే తన వళ్ళో వాలిపోయేవారన్న విషయం గుర్తురాలేదు.
ఆ రాత్రంతా మూర్తి ముభావంగానే వున్నాడు. భార్యతో సరిగా మాట్లాడలేదు. ఇది వరకూ కూడా ఇలాంటి గొడనలు చాలాసార్లు వచ్చాయి. అరుంధతి తనదే తప్పన్నట్టు సర్దుకుపోయేది తప్ప ఎదురుచెప్పేది కాదు. ఈమధ్యే విసుగూ, చికాకూను. ఢిల్లీలో వుండే కొడుకు దగ్గిరకి కొద్దిరోజులు వెళ్ళి రావాలనేది ఆమె కోరిక. అతడికీ ఒక పిల్లవాడు. పావని కొడుకుకన్నా నెల చిన్న. వాడిని చూడాలని తపించిపోతుందామె.
“పెద్దది, అమ్మని వదిలేసి ఎలా? ” అని మూర్తి అంటాడు. ఇద్దరూ చాలాసార్లు ఆ విషయమై గొడవపడ్డారు.
“ఇల్లన్నాక పెద్దవాళ్ళు లేకుండా వుంటారా? వాళ్ళమంచి చెడ్డలు చూసుకోవద్దా? ఈ వయసులో ఆవిణ్ని జాగ్రత్తగా చూసుకోవటం మన బాధ్యత. పిల్లలు వాళ్ళ విషయాలు వాళ్ళు చూసుకోగలరు” అని కోప్పడ్డాడు ఆ అన్నిసార్లూ.
మరుసటిరోజు వుదయాన్నే పావని వెళ్ళిపోయింది. ఇల్లంతా చిన్నబోయినట్టనిపించింది అరుంధతికి. ఆడపిల్లలు… ఎంతలో పరాయివాళ్ళైపోతారు! నిన్నటిదాకా ఈ ఇంట్లోని పిల్ల… తమ పిల్ల.. ఇప్పుడు తనిల్లనీ, తనవాళ్ళనీ ఆరాటంగా వెళ్లిపోతోంది! కళ్ళలో నీళ్ళు నిలిచాయి. ఇంట్లో ఇంక మిగిలేది అత్తగారూ, తనూ. ఆవిడలా దేనికో ఒకదానికి గొణుగుతూ విసిగిస్తూ వుంటుంది.
“ముసలివాళ్లు పసిపిల్లల్తోసమానం. వాళ్ళని అపురూపంగా చూసుకోవాలి” అంటాడు మూర్తి.
“నాలుగు లక్కపిడతలు కొనుక్కొచ్చి ముందు వేసి ఆడిస్తూ కూర్చోండైతే” అంది ఒకసారి వళ్ళుమండి.
అమ్మంటే అతనికి ప్రేమ. కాదనదు తను. అమ్మంటే ఎవరికి మాత్రం వుండదు? కానీ వాళ్ళే లోకంగా ఎంతకని బతకడం? విసుగ్గా వుంటుంది. అన్నిటికీ ఆధారపడి వుండేవాళ్లని ఎంతకాలం ఎవరేనా భరించగలరు? ప్రతిదీ తనే చేసిపెట్టాలని ఆశిస్తారు తల్లీకొడుకులు. చిన్నపని కూడా ఆవిడా చెయ్యనివ్వడు. ఆవిడా చెయ్యదు. దాన్నే ప్రేమగా చూడటం అనుకుంటాడు.
ఇరవైనాలుగ్గంటలూ తన కొంగు పట్టుకుని తిరుగుతుంది. అన్నిట్లో తల దూరుస్తుంది. తను టీవీ చూస్తే ఆవిడా చూస్తుంది. తను పడుకుంటే ఆవిడా పడుకుంటుంది. పిల్లలు రెండురోజులు వుండాలని వస్తే మాత్రం ఇష్టపడదు. వాళ్ళొచ్చిన రెండురోజులూ ఆవిడకి సరిగ్గా జరగదని మూర్తీ అంతే. అది చెడ్డతనం కాకపోవచ్చు. కానీ తనకి బాధనిపిస్తుంది.
పిల్లలిద్దరి దగ్గరికీ నాలుగురోజులు వెళ్ళి వుండాలనిపిస్తుంది. ముఖ్యంగా కొడుకు దగ్గరికి. పెంచి పెద్దచెయ్యటంతో తెగిపోయే అనుబంధాలు కావుగా, ఇవి? తన ఫీలింగ్స్‌ని అతనసలు పట్టించుకోడు. నువ్వెళ్తే అమ్మకిక్కడ జరగదనేస్తాడు.
పిల్లవాడిని క్రెష్‍లో వదిలిపెట్టి కొడుకూ కోడలూ వుద్యోగాలకి వెళ్ళిపోతారు. లేతకూన… అమ్మకి దూరంగా..ఒక సంస్థలో, ఇప్పట్నుంచీ జీవనపోరాటం చేస్తూ. తలుచుకుంటేనే గుండె కదిలిపోతుంది. వాడిని చూసుకోవటానికి క్రెష్‍లుంటే ఈవిణ్ని చూసుకోవటానికి ఎన్ని వృద్ధాశ్రమాలు లేవు? ఆ మాట తను అనలేదు. అంత ధైర్యం లేదు. మనసూ రాదు.
“ఈ రోజైనా డాక్టరుకి అమ్మని చూపించు” అన్నాడు మూర్తి.
అరుంధతి అలాగే తీసుకెళ్ళింది. పోను పదినిముషాలు. రాను పది నిముషాలు. డాక్టరు దగ్గర మాత్రం గంటన్నర. ఆయన చూసింది రెండే నిముషాలు. పడని పదార్థాలు తిన్నందుకు కోప్పడి అవే మందులు రాసిచ్చాడు.


సాయంత్రం టౌనుహాల్లో ఎవరికో పౌరసన్మానం జరుగుతుంటే వెళ్లాడు మూర్తి. నూట ఎనిమిదేళ్ళున్న ముసలామెకి సన్మానం చేస్తున్నారు. ముసలివగ్గు, జీవపదార్థంలా వుంది తప్పిస్తే కదలిక లేదు. గర్వంగా నవ్వుతోంది. నిర్వాహకులు వీల్‍ఛెయిర్లో కూర్చోబెట్టి తీసుకొచ్చారు. రాజారావు కూడా వచ్చాడు దానికి. ఇద్దరూ అక్కడ కలుసుకున్నారు.
“ఆవిడకి కాదు, అవిడనింత కాలంగా చూసుకుంటున్నవాళ్ళకి చెయ్యాలి సన్మానం” అన్నాడు రాజారావు.
అతని మాటలు ఎప్పుడూ వింతగానే అనిపిస్తాయి మూర్తికి. ఒకొక్కసారి వెంటాడుతుంటాయికూడా. తామిద్దరికీ పరిచయమైన సందర్భంకూడా చాలా తమాషా అయినది.
కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్ళాడు తను. పిల్లలిద్దరూ బాగా చిన్నవాళ్ళు, పావనే బాగా చిన్నది. కొడుకింకా చిన్నవాడు. ఎత్తుకునేంత చిన్న. ఒకచేత్తో వాడినెత్తుకుని మరోచేత్తో సూట్‍కేసు నెట్టుకుంటూ అరుంధతి నడుస్తోంది. వాడేమో చేతిలో ఇమడకుండా జారిపోతున్నాడు. పావని కాళ్ళునెప్పులు, ఎత్తుకోమని ఏడుస్తోంది. అరుంధతి విసుగుపుట్టి ఆ పిల్ల వీపుమీద ఒక్కటి వేసింది. అవేవీ తను పట్టించుకోవటం లేదు.
తల్లికి చలి వెయ్యకుండా శాలువా కప్పి జాగ్ర త్తగా నడిపించుకొస్తున్నాడు. ఏదో థ్రిల్. ఎన్నో ఏళ్ళనుంచీ తిరుపతి చూడాలనుకుంటోంది ఆవిడ. తండ్రి వున్నప్పుడు సాధ్యపడనిది తన టైంలో సాధ్యపడింది. తల్లి వుద్విగ్నపడుతుంటే తనూ అందులో పాలుపంచుకుంటున్నాడు.
“ఆవిడ్ని నడవనిచ్చి పాపని మీరు ఎత్తుకోవచ్చు కదా? సిస్టర్ ఒక్కరూ ఇద్దరు పిల్లల్నీ లగేజినీ ఎలా మేనేజి చేస్తారు?” వెనకనుంచీ ఎవరిదో గొంతు కోప్పడుతున్నట్టు. కమాండ్ చేస్తున్నట్టు.
అప్పటి ఆ పరిచయం తిరుగు ప్రయాణం కలిసి చెయ్యటంతో బలపడింది. ఒకే వూరివాళ్ళవటంతో స్థిరపడింది. అప్పటికీ ఇప్పటికీ అదే గొంతు. అదే కమాండ్ రాజారావుది. అన్ని విషయాల్లోనూ తలదూర్చడుగానీ దూర్చిన కొద్ది సందర్భాలలో మాత్రం వీపుమీద చెళ్ళుమని చరిచినట్టు అనేస్తాడు. తెలీకుండానే రాజారావు ఇప్పుడున్న మాటలు మూర్తి మనసులో నాటుకుపోయాయి.
మూర్తి ఇంటికొచ్చేసరికి తల్లి చాలా సంతోషంగా చెప్పింది. “డాక్టరు ఆరురకాల మందులు రాసాడు. వాటితో తగ్గిపోతుందట” ఏం తగ్గిపోతుందో అతనికి అర్ధం కాలేదు.
భార్య కోసం చుట్టూ చూసాడు. ఆమె పడుకుని వుందని అర్థమైంది. ఆమె ఇదివరకట్లా వుండట్లేదు. ఈ ఉదాశీనత ఎందుకో అర్ధమవట్లేదు. అతని అలికిడి విని ఆమే లేచి ఇవతలికొచ్చింది. ఏడ్చినట్టు ముఖం ఎర్రగా వుబ్బి వుంది.
“మధ్యాహ్నం ఢిల్లీనుంచీ వాడు ఫోన్ చేసాడు. కొడుక్కి జ్వరమట. అప్పట్నుంచీ ఇదిలా ఏడుపు, చంటిపిల్లలన్నాక ఏమీ రాకుండా వుంటాయా? వాడు ఫోన్ చెయ్యటం, ఇదిక్కడ కంగారుపడిపోవటం. వాళ్ళ పిల్లాడిని వాళ్ళు చూసుకోలేరా?!!” అంది శాంత. అరుంధతి ఏమీ మాట్లాడలేదు. మనసులో తీవ్రమైన బాధ సుళ్ళు తిరుగుతోంది.
“ఆ అమ్మాయి కొంతకాలం వుద్యోగం మాట మర్చిపోయి ఇంట్లో వుండాలి అసలు. పిల్లలు పెద్దవాళ్ళయాక చెయ్యచ్చు” మూర్తి తీర్మానం చేసాడు.
“అంత చదువుకున్న అమ్మాయిని చెయ్యకుండా వుండాల్సింది. ఏ ఇంటరో బియ్యేనో చదివినదైతే ఈ సమస్యలు వుండేవి కాదు” చురుగ్గా అంది అరుంధతి ఇంక వూరుకోలేక. మూర్తి కోపంగా చూసాడు.
కొడుకు ఎంటెక్, అతనితో సమానంగా చదివిన అమ్మాయి కావాలని మూర్తే ఎక్కువ హంగానూ చేసాడు. అంత చదివిన పిల్ల ఇంట్లో కూర్చోమంటే ఎందుకు కూర్చుంటుంది? అందులోనూ ఐటీ రంగంలో ఒకసారి పక్కకి తప్పుకుంటే మళ్ళీ దూరటం ఎంత కష్టమో ఇంట్లో వున్న తనకే తెలుసు, అతనికి తెలీదా? పావని కొడుకుని ఆ అమ్మాయి అత్తగారు చూస్తుంది. తనకీ అలాంటి బాధ్యత లేదా? అందరూ తలోచెయ్యీ వేస్తేనే కదా, సంసారాలు నడిచేది? ఒకప్పటి అవసరం డబ్బు. ఇప్పుడు డబ్బు బానే సంపాదించుకుంటున్నారు. కానీ అప్పుడూ ఇప్పుడు కావల్సింది మాత్రం పెద్దవాళ్ళ ఆదరణ.
భోజనాలు చెయ్యటంతో ఈ రోజుకి దినచర్యలోని ఆఖరి అంకం పూర్తైంది. మర్నాడు వుదయం పెరట్లోంచీ మాటలు వినిపిస్తుంటే మెలకువ వచ్చింది మూర్తికి, ఆ టైంకి సాధారణంగా లేవడతను. ఎందుకో మెలకువ వచ్చింది.
“అలా వున్నారేంటి అమ్మగారూ?” అనడుగుతోంది పనామె. పాతికేళ్ళ చనువు ఇంట్లో.
“చిన్నబాబుకి జ్వరంగా వుందటనే. రాత్రంతా వాడే కళ్ళముందు కదిలాడు”
“పావనమ్మ కొడుక్కా?”
“కాదు , సుధీర్‍బాబు కొడుక్కి!”
“ఢిల్లీలో కదమ్మా ఆ బాబుండేది? ఒకమారు వెళ్ళి రాకపోయారా?”
“ఏం వెళ్ళిరావటం? అయ్యగారు వెళ్ళనిస్తారా? పెద్దమ్మకి జరగదని పంపరు. అక్కడ పిల్లాడ్నేమో చూసేవాళ్ళు లేక క్రెష్‍లో వేస్తున్నారు. ఇక్కడీ ముసలామెమాత్రం కూర్చుని అన్నీ చేయించుకుంటోంది. వెళ్ళనిస్తే కాస్త అలవాటుపడేదాకా వుండి తెచ్చుకుంటే బావుణ్ణుని వుంది. పడనివ్వటం లేదు” నిస్సహాయత. ఉక్రోషం అరుంధతి గొంతులో. పనిమనిషితో ఇంటి విషయాలు చెప్పకూడదు. కానీ బాధ పంచుకోవడానికి మారుమనిషంటే ఆ స్త్రీయేగా?
“ఎంతకాలం బతుకుతారమ్మా, ఈ ముసలాళ్ళు? గోసపుచ్చుకుంటున్నారు. మా అత్తా అంతే. మంచాన్నపడి ఇప్పటికి నాలుగేళ్ళు. అన్నీ చేయించుకుంటది. నేను పని కొస్తే నా కూతురు ఏడేళ్ళది దానిచేత చేయించుకుంటుంది. తల దువ్వమంటది. పక్క సదరమంటది. పేన్లు చూడమటది. సతాయించుకుంటుకు తింటది. చావంటే భయం”
“అలా ఎందుకనుకోవాలిలేవే, పాపం మాటలు. ఎవరి బతుకు వాళ్ళు బతికితే ఎవరెంత కాలం బతికినా మరొకరికి ఆక్షేషణ వుండదు. కూర్చుని చేయించుకోవటానికి మనుషులు కావాలనుకున్నప్పుడే వస్తాయి గొడవలు” అంటూ అరుంధతి లోపలికి వచ్చేసినట్టుంది, ఇంక మాటలు వినిపించలేదు. మూర్తికి మళ్ళీ నిద్రపట్టలేదు. లేచి ఇవతలికి వచ్చాడు. భార్య అభిప్రాయం స్పష్టంగా అర్థమైంది. ముందురోజు పౌరసన్మానసభలో రాజారావు అన్న మాటలు గుర్తొచ్చాయి. ఆ వృద్ధురాలిని చూస్తున్నవాళ్ళెవరో?
సభని నిర్వహించినవాళ్ళలో ఒకతను తెలుసు. అతనికి ఫోన్‍చేసి అడ్రసు తెలుసుకున్నాడు. రాజారావుని అడిగితే అతనూ వస్తానన్నాడు. అక్కడికే వచ్చి కలుస్తానన్నాడు. డ్రెస్ చేసుకుంటుంటే ఫోన్ మోగింది. ఎత్తాడు. కొడుకు.
“ఎలా వుందిరా వాడికి?” అడిగాడు.
“ఇంకా టెంపరేచరుంది! అమ్మ కొద్దిరోజులు వస్తే బావుంటుంది. మాకు చాలా సపోర్టుగా వుంటుంది. సత్య కంగారుపడిపోతోంది. తన పేరెంట్సు స్టేట్స్‌లో వున్నారు. ప్రస్తుతం. పెద్దవాళ్ళుంటే మాకు ధైర్యం”.
“అమ్మకెలా కుదుర్తుందిరా? సెలవు పెట్టుకుని వాడిని తీసుకుని ఇక్కడికే వచ్చెయ్యండి”
సుధీర్‍కి కోపం వచ్చింది. “ఔను ఆవిడెక్కడికీ రాదు, మీరు పంపరు. బామ్మని పట్టుకుని వుండాలి. ఇంకెవరేమైపోయినా మీకక్కర్లేదు. సెలవులు పెట్టుకునే వీలుంటే అక్కడిదాకా ఎందుకు? ఇక్కడే వుండి మా పిల్లాడ్ని మేమే చూసుకోగలం. మా తిప్పలేవో మేం పడతాం. మీ సలహాలు అవసరం లేదులెండి” ఫోన్ పెట్టేసాడతను.
తనన్నదాంట్లో తప్పేముందో అర్ధమవలేదు మూర్తికి. ఆలోచించే పని పెట్టుకోకుండా తన పని మీద బైటపడ్డాడు. సగం దార్లో వుండగా మళ్ళీ ఫోను. కొడుకునుంచే. పక్కకి తీసుకుని ఆపాడు.
“నాది గవర్నమెంటు జాబ్. సత్యది ప్రైవేట్ జాబ్. తన జీతంకూడా నాకన్నా ఎక్కువ. అందుకని బాబు పెద్దయ్యేదాకా నేనే ఐదారేళ్ళు లీవు పెట్టాలనుకుంటున్నాను. అంత లీవంటే జీతం వుండదు. అందుకు ముందే ఇన్షూరెన్స్ ప్రిమియా అవీ కట్టుకోవాలి. చేతిలోకి సరిపడా డబ్బు వుంచుకోవాలి. అందుకేనా ఇంకో రెండుమూడు నెలలు నేను డ్యూటీలో వుండాలి. మీరు ఎలాగో సర్దుబాటు చేసుకుని అమ్మని పంపించగలిగితే చాలా సంతోషం” అని కొంచెం కోపంగానూ, మరికొంచెం అనునయంగానూ చెప్పాడు. మూర్తికి అసలేం అర్థం కాలేదు. సుధీర్ సెలవు పెట్టుకుని కొడుకుని చూసుకోవటం ఏమిటి? తనమీది కోపంతో అలా అంటున్నాడేమో! భార్యని వుద్యోగం మానిపించాలి. ఇది కాకపోతే మరోటి దొరుకుతుంది. ఇల్లూ, పిల్లలకన్నా ఆడవారికి ఏదీ ఎక్కువ కాదు. ఇంటికి వెళ్ళాక మాట్లాడాలనుకున్నాడు. మళ్ళీ కారు స్టార్ట్ చేసాడు.
ముసలామె ఇల్లు తేలిగ్గానే దొరికింది. అప్పటికే రాజారావు వచ్చేసి వున్నాడు.
నూటాఎనిమిదేళ్ళ ముసలామెని చూసుకుంటున్నది ఎనభయ్యేళ్ళ ఆవిడ కూతురు.
“నాకు ఇద్దరు అన్నయ్యలు, ఒక అక్కయ్య. వాళ్ళు ముగ్గురూ చనిపోయాక ముప్ఫయ్యేళ్ళక్రితం ఈవిడ నా దగ్గరకొచ్చింది. అప్పట్నుంచీ ఈవిడ చుట్టే నా జీవితం. నాలోని జీవరసం మొత్తం పీల్చుకుని తను బతికింది. ఇంత బతికినా ఈవిడకి విరక్తి రాలేదు. నాకేనా చచ్చిపోవాలనిపిస్తుందిగానీ ఈవిడకి అలాంటి కోరికేలేదు. జీవితేచ్ఛే ఆవిడని బతికిస్తోంది. చావుతోటే నాకు విముక్తి, నాకూ నలుగురు పిల్లలు. వాళ్ళు రమ్మంటారు. వాళ్ళ దగ్గరకి వెళ్ళి చివరిరోజులు విశ్రాంతిగా గడపాలని వుంటుంది. ఈమెని వదిలిపెట్టి ఎలా వెళ్తాను? వాళ్ళేనా నన్నొక్కదాన్నే తీసుకెళ్తారుగానీ ఈమెని రమ్మనరు. ఇద్దరికీ చెయ్యలేరు. మనుషుల్ని పెట్టి చేయించేంత వసతి మాకు లేదు. నేను తల్లిని కాబట్టి వాళ్ళకా బాధ్యత” అంది నిర్వకారంగా. “ఓల్డేజిహోంలో వెయ్యాలని చూసాను. ఇంత పెద్దవాళ్ళని తీసుకోరట. ఎక్కడో ఒకటీ రెండు ఆశ్రమాలు ముందుకి వచ్చినా అంతంత మేం ఇవ్వలేక వూరుకున్నాను. నా ఖర్చులకి సరిపోనూ మా ఆయన పెన్షనొస్తుంది. అందులోనే ఇద్దరం సర్దుకుని బతుకుతున్నాం. పిల్లలేదో పంపించారు కొంతకాలం. నాకూ ఈవిడకీ వైద్యాలకి సరిపోయాయి. వాళ్ళూ పెద్దవాళ్ళయారు. వాళ్ళకీ కోడళ్ళూ అల్లుళ్ళూ వచ్చారు. ఇంకా ఏం పంపిస్తారు? అందరికీ ఈ విషయంలో బైటికనలేని అసంతృప్తి”
మూర్తి ఆశ్చర్యంగా విన్నాడు.
“అయ్యా! ఈ బాధ్యత అలాంటిది. మన పిల్లల్ని మనం పెంచుకోవటంలో ఆనందం వుంటుంది. అది ప్రాకృతిక బాధ్యత. పెద్దవాళ్ళకి చెయ్యటం మన విద్యుక్తధర్మం. కొద్దోగొప్పో వాళ్ళ డబ్బు వాళ్లకుండాలి. వాళ్ళ ఇల్లూవాకిలీ వాళ్ళకుండాలి. వాళ్ల వ్యాపకాలు వాళ్ళకుండాలి. చివరిరోజుల్లో నిస్సహాయస్థితి వస్తే చూసుకుంటాం. అంతేగానీ వాళ్లే మన జీవితం కారాదు. ఏళ్ళతరబడి వాళ్ళని వీపుమీద మొయ్యలేం. వాళ్లకి చెయ్యటం, వాళ్లని చూసుకోవటం అనేవి మన జీవనశైలిని మార్చకూడదు. నిన్నటి సభలో కూడా చాలా చెప్పారు. పెద్దవాళ్ళు పసిపాపల్లాంటివాళ్ళనీ, వాళ్ళు మనకి అపురూపమైన వరాలనీ…. ఇంకా చాలా. విని ఆవిడ సంతోషపడుతోంది. ఇంకో సన్మానం ఎప్పుడు జరుగుతుందా అని ఎదురుచూస్తోంది. అది ఆవిడ జీవితంలో చిందే వెలుగు. వాటికోసం ఎదురుచూడ్డంలో తప్పులేదు. నేనుమాత్రం విసిగిపోయాను” అంది.
పెద్దావిడ అన్నీ వింది. స్థితప్రజ్ఞతతో తలూపింది.
“భగవంతుడి పిలుపు వస్తే నేనుమాత్రం వుంటానుటే?” అంది. ఏ సంతోషం, ఎలాంటి రక్తీ అనురక్తీ మిగిలిలేని జీవితాలు. అందుకే ఆ విసుగులు.
ఇల్లు చూసాడు మూర్తి. బాగా చిన్నది. ముందొక వరండా, వంటకి వెనకో వరండా. మధ్యలో ఒక గది. ఇంటికి గుమ్మాలు లేవు. పెద్దామె నడవలేదు. బాగా నడుం వంగిపోయింది. ఎవరో ఇచ్చిన వీల్‍చెయిర్ వాడుకుంటోంది. కాఫీ ప్రయత్నం చెయ్యబోతే రాజారావు వారించాడు. ఇంకొంతసేపు మాట్లాడాక ఇద్దరూ వెళ్తామని లేచారు. వచ్చేముందు రాజారావు పదివేలు తీసి పెద్దావిడ చేతిలో పెట్టాడు.
“మీ మనవడో కొడుకో అనుకోండి” అంటూను. వాళ్ళు మొహమాటపడుతూనే తీసుకున్నారు.
మూర్తి కార్లో తిరుగుప్రయాణమయారు.
“యువభారతం అని మురిసిపోతున్నాంకానీ, ఈ యువతంతా ఒకేసారి ముసలివాళ్ళైతే ఎలాగన్న జాగ్రత్తలు ఎవరూ తీసుకోవట్లేదు” అన్నాడు రాజారావు. “ప్రతి కాలనీకీ పిల్లలకోసం ఒక పార్కూ, రీడింగ్‍రూమూతోపాటు, పదిమందికి వసతి వుండేలా ఒక సీనియర్‍కేర్ హోమ్ కూడా పెట్టుకుంటే బావుంటుందేమో!”
“నీ ఆలోచన సరైనది కాదు. మనందరికీ యిల్లూవాకిలీ కావాలి. పెద్దవాళ్ళుమాత్రం ఎక్కడో హోముల్లో దిక్కులేకుండా వుండాలా” తీవ్రంగా ఆక్షేపించాడు మూర్తి.
“మన పెద్దవాళ్ళకి కాదు. మనకే” రాజారావు నిర్వికారమైన జవాబు. మూర్తి తెల్లబోయాడు. ” పెద్దవాళ్ళ బాధ్యతని అత్తవనీ, అమ్మవనీ ఆడవాళ్ళమీద వదిలేస్తున్నాం. వాళ్ళ అమ్మల్నీ నాన్నల్నీ వదిలేసి మనమ్మలకీ నాన్నలకీ చెయ్యమని సాంప్రదాయం పేరిట నిర్బంధిస్తున్నాం. వాళ్ళు చేస్తే విజయకేతనం ఎగరేస్తున్నాం. చెయ్యకపోతే చెడ్డవాళ్ళనేస్తున్నాం. అన్నా పడ్డా ఆ చేసేతరం ఇక్కడితో సరి. మన పిల్లలకి అసలలాంటి విషయమే అర్థమవదు. అందుకు”
“…”
“ఇప్పుడీ ముసలావిడ విషయమే చూడు, కూతురు తనే పెద్దది, యింకా ఆవిడ్ని చూసుకుంటోంది. పిల్లలో మనవలో మరొకరో చూడట్లేదు, పట్టించుకోవట్లేదు, నైతికబాధ్యత, చట్టపరమైన హక్కులు… అవన్నీ వున్నాయిసరే. కానీ సామాజిక బాధ్యతల్ని మనం మర్చిపోయి చాలాకాలమైంది. అదీ నన్ను బాధ పెట్టే విషయం. మనకి సరైన జీవనశైలి లేదు. మారాలన్న కోరికా లేదు. కొన్నిటిని అలా మార్చుకుంటే అందరికీ సంతోషంగా వుంటుంది. మన కాలనీ పార్కులోనే అలాంటిది ఒకటి కడితే అందరం కలిసి చూసుకోలేమా?”
మూర్తికి ఏదో బాధ కలిగించాయి ఆ మాటలు. పెద్దవాళ్ళు బతుకుతుండటం ఇంత బాధాకరంగా వుంటుందా అందరికీ? వాళ్ళు చేసుకోలేరు కాబట్టి మరొకరు చెయ్యాలని ఆశిస్తారు. అది తప్పా? ఎంతకాలమేమిటి? ఎన్నాళ్ళేనా చెయ్యాలి. ఒకళ్ళ ఆయుష్షుని మనం లెక్కలు కడతామా? ఇది మానవసమాజం. జంతువులుండే అడవి కాదు. తననీ, తల్లినీ కూర్చోబెట్టి అరుంధతి చేస్తోంది. చెయ్యకపోతేనో చెయ్యలేకపోతేనో అనే ప్రశ్నకి అతని మనసులో చోటు లేదు. అలాంటివి ఆలోచించడం అతనికి నచ్చదు. అరుంధతిని తన కళ్ళముందే చూస్తున్నాడు. సత్య మాత్రం మరోలా ఎందుకుంటుంది? అదామె బాధ్యత. కొడుకు వూరుకుంటాడా?
“మా అక్కయ్య యిల్లు దార్లోనే. ఓమాటు చూసేసి వెళ్దాం” అన్నాడు రాజారావు. మూర్తికీ ఆమె తెలుసు. రాజారావుకన్నా మూడేళ్ళు పెద్ద. కమర్షియల్ టాక్స్‌లో చేసి రిటైరైంది. ముగ్గురు పిల్లలు. పెళ్ళిళ్ళయాయి. అందరిదీ ఇదే వూరు. వీళ్ళు వెళ్ళేసరికి ఆవిడొక్కర్తే ఇంట్లో వుంది. ముఖంలో ఒక విధమైన బాధ. ఒకరకమైన వుదాశీనత. కుర్చీలోంచీ లేవాలని ప్రయత్నించి లేవలేక మళ్ళీ కూర్చుంది. కీళ్ళనొప్పులు. మోకీళ్ళు అరిగాయట. ఒకప్పుడు రాజారావు చెప్పాడు.
పలకరింపులయ్యాయి.
“లేవకులే, నొప్పులు ఎలా వున్నాయి? అలా వున్నావేం? ఏమైంది?” అడిగాడు రాజారావు ఆవిడని.
“కళ్ళెదుట వుంటారని పిల్లలకి ఇదే వూళ్ళో సంబంధాలు చేసాం. అదో పెద్ద పొరపాటు. శెలవొచ్చిందంటే చాలు, ముగ్గురికి ముగ్గురూ వాళ్ళ పిల్లలని తీసుకొచ్చి వదిలేసి వూళ్ళమీద పడతారు. అమ్మ చెయ్యగలదా లేదా అనే ఆలోచన వాళ్లకి లేదు. ఇక మీ బావ… వాళ్ళమ్మానాన్నల్ని ఇక్కడికి తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు” అంది. ఆవిడ ఆరోపణలు సరిగ్గా అనిపించలేదు మూర్తికి.
“పిల్లలకి అర్థమయ్యేలా చెప్పకపోయావా?”
“నాదే స్వార్థం కనిపిస్తోంది”
“ఎవరంతటివాళ్ళు వాళ్ళయ్యాకకూడా ఇంకా అమ్మ చెయ్యాలనుకోవటమేమిటి?”
“ఎవరికని చెప్పగలం? ముప్పయ్యైదేళ్ళ సెడెంటరీ లైఫ్‍ ఎలాగో వదిలించుకుని బైటపడ్డాను. నేను సంపాదించినదీ, దాంతో కుటుంబాన్ని నిలబెట్టుకున్నదీ మర్చిపోయారు మీ బావ. అంతా తన ప్రయోజకత్వమే అనుకుంటారు. సంతోషం. ఇప్పుడీ మోకీళ్ళు అరిగాయి. డాక్టరుకి చూపిస్తే ఇప్పుడే సర్జరీ వద్దు, కొన్నాళ్ళు మందులు వాడి, ఫిజియోథెరపీ చేయించుకుంటే బావుంటుందన్నారు. బరువుకూడా తగ్గే వుపాయం ఆలోచించమన్నారు”
“మంచిదేకదా? సర్జరీకి తొందర దేనికి? డాక్టరే అన్నాక?”
“కానీ బావకి అలా లేదు. సర్జరీ చేయించుకుని తొందరతొదరగా నొప్పులన్నీ తగ్గించేసుకుంటే వాళ్ళమ్మానాన్నల్ని తీసుకురావచ్చని ఆలోచన. ఎంతసేపూ వాళ్ళకి చెయ్యలేదు, పిల్లలకి చెయ్యలేదనే కానీ, నాగురించి ఆలోచన లేదు” ఆవిడ నిర్లిప్తమైన మాటల్లో లోతైన బాధ దాగి వుంది.
“చేయించుకోక తప్పనప్పుడు, అదేదో చేయించేసుకుంటే నొప్పులు వదిలిపోతాయి కదక్కయ్యగారూ! ” అన్నాడు మూర్తి.
“అది అక్కయ్యా, డాక్టరూకదా, నిర్ణయించుకోవలసినది?” చురుగ్గా అడిగాడు రాజారావు.
“అక్కడ పెద్దవాళ్ళూ, ఇక్కడ పిల్లలూ ఇబ్బంది పడుతూ వున్నప్పుడు…” తెలివితక్కువగా అన్నాడు మూర్తి.
“ఎవరిగురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నప్పుడు నేనొక్కదాన్నే మానెయ్యాలా?” ఆవిడ మాటలు పదునుగా వున్నాయి.
అలాంటప్పుడేకదా, స్వార్థపరులనే మాట పడవల్సి వచ్చేది? ఇంట్లో గొడవలొచ్చేది? ఆవిడ ఒక్క మెట్టు తగ్గితే అన్నీ సర్దుకుపోతాయి. రాజారావు ఈవిడకి అలా చెప్తే బావుంటుందనిపించింది మూర్తికి.
“నేను బావతోటీ పిల్లలతోటీ మాట్లాడతాను. నువ్వూరికే మనసులో పెట్టుకోకు. డాక్టరు ఎలా చెప్తే అలా చెయ్యి. మనది వచ్చే వయసేకానీ పోయే వయసు కాదు. సర్జరీతో ఒక సమస్య తీరుతుందేమోకానీ, లేని ఓపికైతే రాదు. మీ అత్తమామల్ని చూసుకోవటానికీ నీ సర్జరీకీ లింకు పెట్టకండి. అవసరమైతే మనుషుల్ని పెట్టుకోండి, డబ్బుకి చూడక. ఇద్దరికీ పెన్షన్లున్నాయి” అన్నాడు రాజారావు. ముగ్గురికీ కాఫీ తనే చేసుకొచ్చాడు. కాఫీ తాగాక వెళ్తామని లేచారు మితృలిద్దరూ.
ఇంటికొచ్చాడు మూర్తి.
“చూడండి. వాళ్ళు ఒక్కలా కంగారుపడుతున్నారు. వాళ్ళ అవసరాలూ, ఆపదలూ మనం కాక ఇంకెవరు చూస్తారు? అలా ఇంకెవరేనా చూస్తూ వుంటే మనకీ వాళ్ళకీ మధ్య ఇంకేం మిగిలుంటుంది? నన్ను వెళ్ళనివ్వండి. వాడిని కొంచెం అలవాటు చేసుకుని తీసుకొచ్చేస్తాను. వాళ్లూ పంపిస్తామన్నారు. ఇందరు పెద్దవాళ్ళం వుండి పసివాడిని క్రైష్ వుంచడం ధర్మమా? ఆవిడ్ని మీరు చూసుకోండి. వంటకి రాధమ్మ వస్తానంది. పనామెని మీరు ఆఫీసుకి వెళ్లిన టైంలో వచ్చి వుండమనండి” అంది అరుంధతి నచ్చచెప్తున్నట్టు.
మూర్తి విసురుగా లేచి వెళ్ళాడు. ఏజెంటుని కాంటాక్ట్ చేస్తే ఇమీడియెట్ ఫ్లైట్‍కి టిక్కెట్సున్నాయన్నాడు. వెళ్ళి తీసుకొచ్చి ఆమె ఒళ్లోకి విసిరి “నీకు తోచినట్టు ఏడు” అన్నాడు. ఆమె గాయపడింది. అసహ్యం కలిగింది భర్తపట్ల. కొద్దిరోజులకే ఏమైపోతుంది పెద్దామెకి? అంత పోయే ప్రాణం తను పట్టుకుంటే మాత్రం ఆగుతుందా?
బేగులో రెండుజతల బట్టలు పెట్టుకుని ఒక్కర్తే ఏరోడ్రోంకి బయల్దేరింది. ఏమనుకున్నాడో ఏమో, మూర్తి ఆమెని ఆపి తను తీసుకెళ్ళి దింపి వచ్చాడు. ఇంటికి తిరిగొచ్చేసరికి అనంతమైన శూన్యంలా అనిపించింది. రాజారావు అక్క పంతం, పెద్దావిడ కూతురి మాటలు ఇప్పుడు అరుంధతి పట్టుదల… ఏవీ నచ్చలేదు. కుటుంబాలన్నాక పంతాలూ పట్టుదలలూ వుంటే ఎలా? అందునా కుటుంబాన్నీ, ఇంటిల్లిపాదినీ నిభాయించాల్సిన ఆడవాళ్ళకి? అంతలోనే నిన్న వెళ్ళిన పావని కొడుకు గుర్తొచ్చాడు తా…. అంటూ వాడు తనమీదకి ఎగబాకడం గుర్తొచ్చింది. వాడి సుతిమెత్తటి స్పరా, మెరిసే కళ్ళూ, లేతబుగ్గలూ, అన్నీ పదేపదే గుర్తొచ్చాయి.
సుధీర్ కొడుకు. వాడినీమధ్య చూడలేదు. వాడూ అలాగే అల్లరి చేస్తున్నాడేమో! తనూ వెళ్ళివుంటే బావుండేది. కానీ అమ్మ? అతని మనసు ఆ చట్రంలోనే పరిభ్రమిస్తుంది. అతని కోపాలూ ప్రేమలూ అన్నీ ఆ పరిభ్రమణానికి అనుకూలంగానే.
“అమ్మ బయల్దేరింది. ఇప్పుడే ఫ్లైట్ ఎక్కించాను. వీలైనంత వెంటనే తిరిగి పంపండి. ఇక్కడ ఆమె లేకపోతే కష్టం” అని ఫోన్లో కొడుక్కి చెప్పాడు. ఇక్కడికి బదులు అక్కడికి చాకిరీ చెయ్యడానికి వెళ్ళింది భార్యన్న విషయం ఆ క్షణాన్న అతనికి స్ఫురించలేదు. అలాంటి చాయిస్ మాత్రమే ఆమె కోరుకుందనికూడా.
వారంరోజుల తర్వాత తిరిగొచ్చింది అరుంధతి. కోడల్నీ, మనవణ్ని వెంటపెట్టుకుని. ఆశ్చర్యంగానూ, అయిష్టంగానూ చూసాడు మూర్తి. అమ్మకి చెయ్యడానికే విసుగుపడుతోంది, ఇప్పుడీ చంటిపిల్లాడికి చెయ్యగలదా? ఎందుకొచ్చిన బరువుబాధ్యతలు? అని అతననుకుంటే మనవడొచ్చాక ఇంక నన్నేం చూసుకుంటుంది అనుకుంది శాంత.
అప్రయత్నంగా మనవడికోసం చేతులు చాపాడు. పిల్లవాడికి కొత్తలేదు. మీదికి వురికాడు. పావని కొడుకు తెల్లగా తెలుపు. వీడు కొంచెం ఛాయ తక్కువ. జ్వరంచేత కాస్త డీలాపడ్డాడు. ఐనా బుల్లివస్తాదులా కాళ్ళు నిగడదన్నాడు. వాడి వంటినిండా తాయత్తులు, మొలతాడుకి వెండిగొట్టం, మెళ్ళో నల్లటితాడుకి రాగిరక్షరేకూ, హనుమంతుడి లాకెట్టూ, లక్కబొమ్మా వున్నాయి. దండకి కూడా ఇంకో రాగిగొట్టంవుంది. వాడి తల్లి మమకారాల వెన్నముద్దలా వున్నాడు. వాడిని కాసేపు తెలుగులోనూ, కాసేపు ఇంగ్లీషులోనూ, మరికాసేపు హిందీలోనూ ముద్దు చేస్తోంది ఆ అమ్మాయి.
వాడిని చూడటానికి పావని పరిగెత్తుకొచ్చింది. వదినామరదళ్ళు ఒకటే కబుర్లు. ఇద్దరు చంటిపిల్లల్తో హడావిడి పడుతోంది అరుంధతి. ఒక్కడూ కుదురుగా వుండడు. ఒకడు చేసిన అల్లరి ఇంకొకడు చెయ్యడు. ఏవి కనిపించినా నోట్లో పెట్టేసుకుంటాడు సుధీర్ కొడుకు. “ఖతర్నాక్ అద్మీ!” పెద్దగా నవ్వి అంది పావని పూర్తిగా మూడడుగల పొడవేనా లేని ఆ చిన్నివాడిని గురించి. ఆమె కొడుకలా చెయ్యడుగానీ పైనున్న వస్తువులన్నీ లాగిపారేస్తాడు.
పావని కొడుకు పదిదాకా మాటలు నేర్చేసుకున్నాడు. అత్త, తాతా అని చులాగ్గా అనేస్తున్నాడు. సత్య కొడుకు నోరే తెరవటం లేదు. ఏవేనా చెప్తే బ్లాంక్‍గా చూస్తున్నాడు. అత్తగారి దగ్గర ఏడ్చేసింది సత్య.
“వాడితో మూడు భాషల్లో మాట్లాడేస్తున్నావు. కుక్కపిల్లని చూపించి ఒకసారి కుక్కనీ ఇంకోసారి కుత్తా అనీ మరోమాటు డాగ్ అనీ అంటే వాడు గుర్తించలేకపోతున్నాడు. ఒక్క భాష…అదీ మాతృభాషైతే మంచిది. చుట్టూ వున్నవాళ్ళందరూ అదే మాట్లాడతారు. అందులో పదాలని పరిచయం చేసి, ఆ తర్వాతే పర్యాయపదాలు, పరాయి భాషా పదాలు పరిచయం చెయ్యాలి. నీకెందుకు, నువ్వు మళ్ళీ వచ్చేసరికి వాడికి ఎన్ని మాటలు నేర్పిస్తానో!” అంది అరుంధతి.
“అంతేనంటారా?” అంటూ సర్దుకుంది ఆ అమ్మాయి. ఆదివారం రాత్రి కొడుకుని వదిలిపెట్టి తిరిగి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వుద్యోగం చేస్తుంటే కొడుకు ఇంట్లో వుండి పిల్లవాడిని చూసుకుంటాడనేది మూర్తికి జీర్ణంకాని విషయం. రాజారావుతో అంటే, “వాళ్ళిద్దరికీ సమస్య లేనప్పుడు నీకెందుకు?” అన్నాడు.
అరుంధతిలో ప్రస్ఫుటమైన మార్పు కనిపిస్తోంది మూర్తికి. మనవడికోసం చకచక పనులు చేసుకుంటోంది. వాడితో వూసులాడుతూ కూర్చుంటోంది. మూర్తి గుండె ముళ్లు విడుతున్నాయి. ఏదో వుత్సాహం, సంతోషం తనలో కూడా నిండుతున్నట్టు గుర్తించాడు. అది మనవడివలన వచ్చిందని వప్పుకోవటానికి అతను సిద్ధంగా లేడు.
(ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 8/2/2007)