(2008లో ఆంధ్రభూమిలో వచ్చిన సీరియల్)
నిరాసక్తంగా పున:ప్రారంభమైన చదువుమీద ఆమెకి శ్రద్ధ మొదలైందంటే అది ఖచ్చితంగా అతని ప్రభావమే. చదువుతోపాటు అతను తాత్వికమైన విషయాలెన్నో చెప్పేవాడు. అతని నోట్లోనుంచీ వచ్చిన ప్రతిమాటా ఆమె మనోవికాసానికి ఎంతో కొంత తోడ్పడేది.
“నా జీవితం ఏమీ పూలపానుపు కాదు కిరణ్. చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. కష్టాలు భరించాను. ఆ మాటకొస్తే ఎవరి జీవితమూ సమస్యలు లేకుండా ఉండదు. కానీ ప్రతి సమస్యకీ ఏదో ఒక పరిష్కారం ఉండకుండా ఉండదు. లేకపోతే ప్రత్యామ్నాయంగా రాజీ అనేది ఒకటి ఉండనే ఉంది. అయితే నేను ఎదుర్కొన్న సమస్యలు అలాంటివి కాదు. నా భార్యని బలితీసుకున్నాయి. నా కూతుర్ని కూడా” బొంగురుపోయిన గొంతుతో అతను ఒకసారి చెప్పగానే కిరణ్మయికి గుండెల్లో కలిచివేసినట్టైంది. పైకి ఎంతో నిబ్బరంగా కనిపించే ఇతని గుండె ధైర్యం ఇంతేనా? భార్యగానీ భర్తగానీ చనిపోతే ఆ జంటలో మిగిలినవారికి ఇంత దుఃఖం ఉంటుందా? ఈ దుఃఖానికి అంతులేదా? అది తీరే మార్గం లేదా?
” కానీ పెళ్లి జీవితం కాదు. అందులో కొంత భాగం మాత్రమే. బాల్యం ఎంతో అందమైనది. గడిచిపోయాక మళ్లీ కావాలంటే తిరిగి వస్తుందా?” తనని తను కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు.
” అదీ ఇదీ ఒకటి ఎలా అవుతుంది?” అడిగింది కిరణ్మయి.
” నిజమే. రెండూ ఒకటి కాదు” అతను ఒప్పుకున్నాడు.”బాల్యం మన ప్రమేయం లేకుండా గడిచిపోతుంది. అది కాలగతి. పెళ్లి సృష్టి కొనసాగడానికి చేసే మానవప్రయత్నం. మన చేతుల్లో లేనిదానికి మనం ఏం చేయలేము. నిస్సహాయులము. మనం చేయగలిగినదాని విషయంలోకూడా ఏమీ చెయ్యకుండా కూర్చుంటే ఎలా? పెళ్లి విఫలమైతే మరో ప్రయత్నం చేయవచ్చు. కిరణ్! ఇంత దుఃఖం నీకు మంచిది కాదు. నీ చుట్టూ ఉన్నవారితో సంబంధాలని చెడగొడుతుంది. తర్వాత నీ మానసిక ఆరోగ్యాన్నీ, ఆమీదట నీ శారీరక ఆరోగ్యాన్నీ దెబ్బతీసి నిన్ను అగాధాల్లోకి తోస్తుంది. ఇందులోంచీ బయటికి రావడానికి ప్రయత్నించు. బాగా చదువుకో. వ్యక్తిత్వాన్ని పెంచుకో. మంచి ఉద్యోగం సంపాదించుకో. నీ కాళ్ళమీద నువ్వు నిలబడు. నీకు చేయూతనిచ్చేవాళ్లు ఎదురైతే పెళ్లి చేసుకో” అన్నాడు.
ఆమె ముఖంలోకి వెచ్చటి నెత్తురు చిమ్మింది. అతని మాటల్లో కల్మషంగానీ, దురుద్దేశంగానీ లేవు. ఆ సంగతి తనకైతే తెలుసు. కానీ అటువంటి మాటలు పరాయి మగవాడినుంచి రావటం ఎవరైనా వింటే ఎంత అసహ్యంగా ఉంటుంది!
” నాకు మళ్లీ పెళ్లేమిటి? ఒకసారి పెళ్ళైంది. పాప కూడా పుట్టింది. నా ప్రాప్తం ఇంతే” అనేసి అక్కడినుంచి వెళ్ళిపోయింది.
వైధవ్యం దుఃఖాన్ని సమాజం స్త్రీమీద వేసి రుద్దుతోంది కాబట్టి, ఆమెని అందులోంచీ బయటికి రానివ్వరు కాబట్టి, బతికున్నంతకాలం ఏడుస్తోంది. వంటికి గాయమైతే మందులు రాసి దాన్ని నయం చేసుకుంటాం. మనసుకి గాయం అయితే దాన్ని కెలుక్కుని కెలుక్కుని మనని మనమే హింసించుకునే మనుషులం. అది అవతలివారి గాయమైతే మరీ సుఖం మనకి. కిరణ్మయీ, ఆమె మనస్థితీ చీకట్లో కొట్టుమిట్టాడుతుంటే ఈ సమాజం తమాషాగా చూస్తుంది కానీ చీకట్లోంచి ఇవతలికి రావడానికి దారి చూపించదు.
సమాజాన్నీ, అది తనమీద రుద్దిన వైధవ్యాన్నీ మినహాయించుకుని చూస్తే తనకి మళ్లీ పెళ్లి ఎందుకో కిరణ్మయికి అర్థమవుతోంది.
శ్రీధర్‍తో ఆమెకి అంత ప్రగాఢమైన అనుబంధం అంటూ ఏర్పడలేదు. వైవాహిక జీవితంపట్ల తృష్ణ తీరలేదు. ఏదో కావాలని వుంటుంది. ఇంకేదో పొందాలని వుంటుంది. తన చుట్టూ వున్న దాంపత్యసంబంధాలు … ప్రేమైక భావనలు… ఆమె ఆలోచనలను ఇంకా బలపరుస్తున్నాయి.
తనింత అందంగా ఉంటుంది. ఈ సౌందర్యం ఎవరి మెప్పు కోసం?
తనకొక అందమైన మనసుంది. అది తీయటి ఊసులెన్నో చెప్తుంది. వాటిని ఎవరితో పంచుకోవాలి?
ఒంట్లో బాగాలేక అన్నయ్య ఏరోజైనా భోజనం చేయకపోతే వదిన కూడా తినదు.
రాత్రి పదింటిదాకా తండ్రి కోసం ఎదురుచూస్తూ కూర్చుంటుంది తల్లి.
కాబోయే భర్త, వరసకి అత్త కొడుకు అయిన చైతన్య ఎప్పుడైనా తమ ఇంటికి వస్తే సిగ్గులమొగ్గ అవుతుంది కరుణ.
శాంతిని చేసుకుంటావురా అని పరిహాసానికి ఎవరైనా అడిగితే అదేమిటో తెలియకపోయినా శ్రీకాంత్ ముఖం ఎర్రగా కందిపోతుంది.
శాంతితోసహా వీళ్లందరికీ నిర్ణీత గమ్యాలు ఉన్నాయి. మరి తన గమ్యం ఎటు? ఒంటరిగువ్వలా ఎలా? అపరిపక్వమైన తన మనసుకి వేదాంతం రుచించదు. తనని ఊరించి అందకుండా జారుకున్న సంసార సుఖాలపట్ల వ్యామోహం చావదు. ఎవరికి చెప్పుకోవాలి ఈ వేదన? ఎవరు అర్థం చేసుకుంటారు?
తన మనసు అగ్నిగుండంలా తయారవుతోందని గ్రహించింది కిరణ్మయి. ఆ సెగలలోంచీ ఎలా బయటపడాలో తెలియడం లేదు.
గోపాల్రావు ఆలోచనలు మరొకలా సాగుతున్నాయి. కూతురి భవిష్యత్తు ఆయన్ని చాలా భయపెడుతోంది.
శ్రీధర్ తిథులకి వెళ్లడం, అదవగానే గోడకి కొట్టిన బంతిలా వెంటనే తిరిగిరావడమేతప్ప కిరణ్మయి అత్తవారింట్లో పదిరోజులు వున్నది లేదు. ఉండమని వాళ్లు అన్నదీ లేదు. ఆమెకి వచ్చినది ఎవరూ తీర్చలేని కష్టమే. వాళ్లు సరిగా ఆదరించడం లేదన్నదీ నిజమే. ఈ నిజాలన్నిటినీ ఎక్కడో ఒకచోట సమన్వయపరిస్తేగానీ ఆమెకి భవిష్యత్తు లేదు.
కిరణ్మయీ శాంతిల బాధ్యత తమదేనని వోదార్పుగా ఒక్కమాటకూడా అనలేదు వాళ్లు ఇప్పటిదాకా. ఆస్థిలో శ్రీధర్ వాటా ఇంతనీ, దాన్ని ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎప్పటికో ఒకప్పటికి ఇస్తామన్న భరోసా ఇవ్వలేదు. అదీ కాకపోతే ఆస్థి వ్యవహారాలకి చెల్లుచీటీ రాసుకుని మనోవర్తి మాటలకీ రాలేదు. కూతురు, మనవరాలు తనకి బరువు కాదు. కానీ హక్కుభుక్తం వదులుకుని దయాధర్మాలమీద ఎందుకు బతకాలి వాళ్లు? ఎన్నో విధాల మథనపడుతున్నాడు.
తన ఆలోచనలని బైటికి అంటే కూతురు బాధపడుతుందని భయం. కానీ తప్పదు.
భార్యతో చూచాయగా అని ఆమెలో ఆలోచన రేకెత్తించాడు.
…
గోపాలకృష్ణ ఇంట్లో బాగా కలిసిపోయాడు. అతనికి శాంతి అంటే ప్రాణం. అతని కూతురు సరిగ్గా అదే వయసులో చనిపోయిందట. శాంతి మొహంలో తన కూతురి బింబం కనిపిస్తుంది అతనికి.
అతను ఉన్నంతసేపు అతని గదిలోనే ఉంటుంది శాంతి. అతని గుండెలమీద ఆడుతుంది. అతని అరచేతుల్లో నడుస్తుంది. తిక్కచేసి అప్పుడప్పుడు తల్లిని విసిగిస్తుంది. అలాంటప్పుడు గోపాలకృష్ణ దగ్గరికి తీస్తే అతని చేతుల్లో ఒదిగిపోతుంది. ఇదేమి చుట్టరికం? ఇదేమి అనుబంధం? అతని భార్యాకూతుళ్లు చనిపోవటం ఏమిటి? తమ ఇంట్లో అతను చేరడం ఏమిటి? ఈ బంధాన్ని ఇలా పెంచుకోవడం ఏమిటి? లోకం ఏమనుకుంటుంది? కాలేజీలో మగపిల్లలతో ఏ నోట్సుకోసమో ఐదునిమిషాలు మాట్లాడితేనే దాన్ని చిలవలుపలవలుగా అల్లి తమాషా చూసే మనుషులు ఇలాంటి విషయాన్ని ఉపేక్షిస్తారా? భయం భయంగా అనిపిస్తుంది కిరణ్మయికి.
ఆమె ఊహించినది నిజం. ఎవరు ఎంత కష్టంలో ఉన్నా వాళ్లు చేసే ప్రతిపనినీ సమర్ధించదు చుట్టూ ఉండే లోకం. చూసీచూడనట్టు ఊరుకోదు. గోపాల్రావు ఇంటి విషయాలు బయట చర్చనీయాంశాలయ్యాయి. ఆ కుటుంబంమీద సానుభూతి చూపించినవాళ్లే ఇప్పుడు వాళ్ళ వెనక చులకనగా మాట్లాడుకోసాగారు. పెద్దవాళ్ళం మేమంతా ఉండగా తప్పు ఎందుకు జరుగుతుందని కిరణ్మయి తల్లిదండ్రులు అనుకుంటే, పెద్దవాళ్ళే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారని అనేవాళ్లు అన్నారు. వాదుకీ, వాదనకీ రెండువైపులా పదునే… ఒక్క సంఘటనతో నిద్ర మేల్కొన్నట్టు అందరూ జాగృతులయ్యారు.
ఆరోజు ఉదయం…
కాలేజీకి వెళ్లినవాడల్లా గోపాలకృష్ణ వెంటనే తిరిగి వచ్చేసాడు. రావడంతోనే తన సామాన్లు సర్దుకుని గది ఖాళీ చేస్తున్నట్టు లక్ష్మీదేవికీ, ఉదయకీ, లోపల ఎక్కడో ఉన్న కిరణ్మయికీ కూడా వినిపించేటట్టు చెప్పాడు. అంతేగానీ ఇలాంటి నిర్ణయాన్ని ఇంత హఠాత్తుగా ఎందుకు తీసుకున్నాడోమాత్రం చెప్పలేదు వాళ్లు ఎంత అడిగినా.
” నన్నేమీ అడక్కండి. చందూ వచ్చాక చెప్తాడు” అన్నాడు రెండు చేతులూ జోడిస్తూ. కిరణ్మయి చేతిలో పని వదిలేసి అక్కడికి వచ్చింది.
” అదేంటి మాస్టారూ! పరీక్షలు ఇంకా రెండు నెలలు కూడా లేవు. మీరు వెళ్లిపోతే నేనెలా?” ఏం అడగాలో తెలియని కంగారులో అడిగేసింది.
అతనామె ప్రశ్నకి నవ్వి, “ఏడాదిపాటు కష్టపడి చదివించాను. ఈ రెండు నెలల్లో చెప్పాల్సినదాంతోటే పరీక్ష పోతుందా?” అని మాట మార్చి, ” శాంతి ఏది? పడుకుందా?” అని అడిగాడు.
” ఇప్పుడే నిద్ర పోయింది. ఐనా ఉన్నట్టుండి ఈ ప్రయాణం ఏమిటి? అన్నయ్యని రానివ్వండి. అసలేం జరిగింది?”
” మళ్లీ వచ్చి కలుస్తాను” ఎర్రబడ్డ ముఖంతో అనేసి మరో మాటకి ఆస్కారం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు.
అతను అటు వెళ్లగానే చందూ ఇటు వచ్చాడు. అతడి అవతారం చూసి అందరూ తెల్లబోయారు. దుమ్ము కొట్టుకుపోయిన ఒళ్ళూ, ఒంటి మీద దెబ్బలూ, ఎర్రగా కళ్ళూ… మనిషి ఉద్రేకంతో వూగిపోతున్నాడు.
ఏం జరిగింది అసలు? ఉన్నపళంగా అతను వెళ్లిపోవడానికీ దీనికీ ఏమైనా సంబంధం ఉందా? అంతా అయోమయంగా అనిపించి, కిరణ్మయికి కాళ్ళలోంచీ సన్నగా వణుకు మొదలైంది. అసలే బలహీనంగా ఉందేమో, నిలవరించుకోలేక పట్టు తప్పి నిలబడ్డచోటే కూలబడిపోయింది.
” ఏమైంది? ఈ అవతారం ఏమిటి?” ముందుగా తేరుకుని ఉదయ అడిగింది.
” ఏమిట్రా, ఏం జరిగింది అసలు? గోపాలకృష్ణ నువ్వొచ్చేముందే గది ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో చెప్పమని ఎన్నివిధాల అడిగినా చెప్పలేదు. తర్వాత వచ్చి కలుస్తానన్నాడు” అంది లక్ష్మీదేవి.
ఆవిడ మాటలు ఇంకా పూర్తవనేలేదు, అతను అక్కడినుంచి వెళ్ళిపోయాడు. స్కూటర్ స్టార్టయిన శబ్దం వినిపించింది.
జరిగింది ఏమిటో తెలియని అయోమయంలో పనులు వదులుకుని ఎక్కడవాళ్లు అక్కడ కూర్చుండిపోయారు. భోజనాలు కూడా సరిగా చెయ్యలేదు. వండిన వంటంతా అలాగే ఉండిపోయింది. గోపాలకృష్ణని వెంటపెట్టుకుని చందూ తిరిగి వచ్చాకగానీ విషయం తెలీలేదు. కిరణ్మయినీ,
గోపాలకృష్ణనీ కలిపి అసభ్యంగా మాట్లాడి, కాలేజీగోడలమీద పేర్లు రాశారట. గోపాలకృష్ణ తలవంచుకుని వచ్చేసాడు. ఒక పొరపాటు జరిగినప్పుడు అది మరొక పొరపాటుకి చోటివ్వకముందే సరిదిద్దుకోవాలని అతని అభిప్రాయం. చందూకి అలా తన దారిన తను రావడం రాదు. తిరగబడి నలుగురిని తన్ని, తను నాలుగు తన్నులు తిని వచ్చాడు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.