సంగమం 14 by S Sridevi

  1. సంగమం 12 by S Sridevi
  2. సంగమం 13 by S Sridevi
  3. సంగమం 14 by S Sridevi
  4. సంగమం 15 by S Sridevi
  5. సంగమం 16 by S Sridev
  6. సంగమం 17 by S Sridevi
  7. సంగమం 18 by S Sridevi
  8. సంగమం 20 by S Sridevi
  9. సంగమం 21 by S Sridevi
  10. సంగమం 22 by S Sridevi

“కరుణ పెళ్లికి మీ అత్తవారంతా వచ్చారు” అంది ఉదయ. కిరణ్మయికి భయంతో చిరుచెమటలు పట్టాయి.
” అంతా అంటే?” అడిగింది.
” మీ అత్త మామలు, పెద్ద బావగారు, ఆయన భార్య”
“…”
” నీగురించి అడిగారు. ఇలా ఎక్స్‌కర్షన్‍కి పంపించినట్టు చెప్పాము. వాళ్ళు వస్తుండగా అలా ఎలా పంపించారని గొడవ మొదలైంది. అన్ని విషయాలూ తెలుసుకునే వచ్చినట్లున్నారు …ఈ ఊళ్లో వాళ్ల చుట్టాలు చాలామందే ఉన్నారు. వాళ్లందర్నీ పోగుచేసుకొచ్చి పెద్ద పంచాయితీ పెట్టారు” ఉదయ నోట్లోంచీ వస్తున్న ఒక్కొక్క మాటా ఒక్కొక్క శూలపుపోటులా కిరణ్మయిని పొడుస్తున్నాయి.
” కరుణ… అత్తవారింటికి వెళ్లిందా?” తడారిపోతున్న గొంతుతో అడిగింది.
“ఆవిడ… కామేశ్వరమ్మగారుకూడా చాలా గొడవ చేసింది. చైతన్య గట్టిగా నిలబడ్డాడు. కరుణని మన ఇంటికి జన్మలో పంపించనని శపధంచేసి దాన్ని తీసుకెళ్లిపోయారు. అది పెద్ద సమస్య కాదులే. ఈ కోపాలు ఎంతకాలం ఉంటాయి? అదక్కడ సుఖంగా ఉంటే చాలు, మన ఇంటికి వస్తే ఎంత రాకపోతే ఎంత అన్నారు పెద్దావిడ… మీ బామ్మ”
” మరి?”
” మీ వాళ్ళ మోటుతనం నీకు తెలుసుకదా?”
” ఏం జరిగింది వదినా?”
” మీ మామగారూ, పెద్దబావగారూ గోపాలకృష్ణతో నీ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తామని బెదిరించారు. గోపాలకృష్ణ ఫోన్ చేశాడే, ఆ రోజు రాత్రి… అదే సమయానికి ఇల్లంతా గోలగోలగా ఉంది. వాళ్లు నానా యాగీ చేస్తున్నారు. అతనలా చెప్పాక మాకు ఇంక కాళ్ళూ చేతులూ ఆడలేదు. మరో ఆలోచనకికూడా అవకాశం లేకుండా పోయింది. కిరణ్! శ్రీధర్ నీ నుదుట వేసిన ముద్రని ఎలా చెరపలేమో, అలాగే ఈ పెళ్లిని కూడా కాదనలేము. జరగాల్సినదానిగురించి ఆలోచిద్దాం” ఉదయ ఆమెని దగ్గరికి తీసుకుని ఓదార్చిందేగానీ ఇంకా అసలు విషయం చెప్పలేదు.
” ఇంకేం జరిగింది?” అయోమయంగా అడిగింది కిరణ్మయి.” శాంతిని వాళ్లు తీసుకెళ్లారు. ఇంతమందిమి ఉన్నాం. చేతులు ముడుచుకుని కూర్చోము. సామరస్యంగా ఆలోచిద్దాం”
ఆ మాటలు వినగానే ఎక్కడ లేని నీరసమూ కిరణ్మయిని ఆవహించింది. ఓపికలేనట్టు సీట్లో ఒరిగిపోయింది.
అయిపోయింది… అంతా అయిపోయింది. భగవంతుడు తన ముఖాన్న ఏ సుఖమూ లేకుండా బతకమని రాశాడు. ఆయన రాతకి ఎదురుతిరిగి దెబ్బతింది. వాళ్ల మూర్ఖపు పట్టుదల తనకి తెలుసు. శాంతిని తిరిగి ఇవ్వరు. అంతా తనదే తప్పు. దాన్ని కూడా తనతో తీసుకు వెళ్లాల్సింది. అలా చేసి ఉంటే ఈ అనర్థం జరిగేది కాదు. అయినా వాళ్లు దాన్ని ఎందుకు తీసుకెళ్లారు? ఏం చేయాలని? ఏమాశించి? సంఘర్షణకి తట్టుకోలేకపోతోంది.
” కిరణ్! కిరణ్!” ఉదయ రుద్ధస్వరంతో పిలవడం లీలగా వినిపించింది. ఇల్లు చేరింది గుర్తులేదు. తల్లి తనని పట్టుకుని ఏడవడం గుర్తులేదు. అంతా కలలోలా ఉంది. చుట్టూ రకరకాల గొంతులు… ఎక్కడో దూర తీరాలనుంచీ వినిపిస్తున్నట్లున్నాయి.
“”శాంతిమీద అభిమానమా, పాడా? అతని ఆస్తికి వారసురాలు కాదూ, అదీ వాళ్ళ భయం”
” ఆస్తి అక్కర్లేదు. మా పిల్లని మాకు ఇమ్మని కబురు పెడదాం”
“అలాగని వాళ్లు ఒప్పుకుంటారా? కిరణ్ ఎలాగా మళ్లీ పెళ్లిచేసుకుంటోంది . పిల్లలు పుడతారు. మావాడి జ్ఞాపకంగా మేము దీన్ని తీసుకెళుతున్నామని ఎన్ని కబుర్లు చెప్పారు?”
” అన్నీ పైపై మాటలు”
” మరి ఏం చేద్దాం?”
“వాళ్లు నిజంగా కొడుకుమీది అభిమానంతో తీసుకెళ్తే అది వేరే సంగతి. రానని ఏడుస్తున్నదాన్ని బరబర లాక్కెళ్లి ఆటోలో కుదేసింది రాకాసిలాగా” తల్లి కోపంగా అనటం కిరణ్మయి గుండెల్ని తాకింది. ఆ దృశ్యం కళ్ళముందు కదిలి నిలువెల్లా వణికిపోయింది.
” అయినా కిరణ్ బతికే ఉంది. దాని పిల్ల, దాని ఇష్టం. వీళ్ళ పెత్తనమేమిటి మధ్యలో?” చందూ అన్నాడు.
“నిజమేరా! మనం వాళ్లపరంగా కూడా ఆలోచించాలి. కిరణ్ ద్వితీయం చేసుకుందంటే నలుగురిలోనూ చిన్నతనం కదా? అందులోనూ పల్లెటూరివాళ్ళు. అంత విశాలంగా ఆలోచించలేరు. పాపని తీసుకెళ్తే తప్పనిసరిగా కిరణ్ వెళ్లి అక్కడే ఉంటుందని వాళ్ల ఉద్దేశ్యమేమో!” గోపాలకృష్ణ నిదానంగా అన్నాడు.
” మరైతే ఏం చేద్దాం?”
“కిరణ్‍ని పంపిద్దాం. వెళ్ళి నచ్చజెపుతుంది. ఆస్తిలో వాటా అడగననీ, శాంతిని బాగా చూసుకుంటాననీ, వాళ్లు చూడాలనుకున్నప్పుడు ఆ పిల్లని తీసుకెళ్లి చూపిస్తాననీ అర్థమయ్యేలా వివరించి చెప్తే వినకపోరు. ఒక పసిదాని బాధ్యత తీసుకోవాలంటే వాళ్లకి కూడా ఇబ్బందే”
అతను వెళ్లి కిరణ్మయి పక్కన కూర్చున్నాడు. అతని స్పర్శ ఆమెలో అంతులేని స్పందన రేపింది. అతని చెయ్యి పట్టుకుని ఏడ్చేసింది.” నాకు శాంతి కావాలి” ఒకటే తపన. ఒకటే ఆర్తి.
” కిరణ్! ఏమిటిది? ఏడిస్తే శాంతి తిరిగొస్తుందా? అంతా నీ చేతుల్లో ఉంది. నువ్వు వాళ్ళింటికి వెళ్ళు. నచ్చ చెప్పు.ఊ < లేవాలి” అన్నాడు.
అతని మాటలు మంత్రంలా పనిచేశాయి ఆమెమీద. ఏదో ఆశ. కొత్త బలం వచ్చింది.
లేచి ముఖం కడుక్కుని వచ్చింది. తల్లి కంచంలో ఇంత అన్నం కలిపి తీసుకువచ్చింది. ముద్దలు చేసి పెడితే వద్దనకుండా గబగబా తినేసింది. ఉదయ జుట్టు సరిచేసింది. చందూ టాక్సీ తీసుకొచ్చాడు.
మళ్లీ అదృష్టంతో పందెం మొదలు. అనిశ్చితమైన జీవితం. గమ్యం లేని పరుగు.
చందూ టాక్సీలోనే కూర్చున్నాడు. అతనప్పటికే వాళ్ళతో గొడవపడి వున్నాడు. కిరణ్మయి ఒక్కతే ఇంట్లోకి వెళ్ళింది. రెండురోజుల ప్రయాణంలో నలిగిపోయిన బట్టలు… ఏడ్చేడ్చి ఉబ్బిన ముఖం… చెదిరిన కుంకుమ… రేగిన జుట్టు… ఈ రూపంతో ఆమె టాక్సీ దిగి వెళ్తుంటే చుట్టుపక్కలవాళ్లంతా ఇళ్లల్లోంచి తొంగిచూశారు.
ఇంటి గేటు మూసేసి ఉంది. వీధిలోంచీ ప్రవేశద్వారం ఉన్న ముందు గది తలుపులు తెరిచి ఉన్నాయి. ఆ గదిలో మగవారు వ్యవహారాలు మాట్లాడుకుంటున్నారు. ఆడవాళ్లు అందులోకి రారు. అడుగుపెట్టరు. అలాంటి గదిలో ఈశ్వర్రావు, కమలాకర్, కిరణ్మయి మామగారు కూర్చుని ఉన్నారు. ఆమె రాక ఆమెకన్నా ముందే వాళ్లని చేరిపోయింది. ఆమె కోసమే ఎదురుచూస్తున్నారు.
గేటు కొట్టి కొట్టి, ఎవరూ తీయకపోవడంతో ఆ గదిలోకి అడుగుపెట్టింది కిరణ్మయి.
“ఒక్కదానివే వచ్చావా?”” ఈశ్వర్రావు ఆరాగా అడిగాడు.
” అన్నయ్య వచ్చాడు. టాక్సీలోనే ఉన్నాడు” అంది కిరణ్మయి.
“అదేం? మీ ఆయన రాలేదా?” కమలాకర్ గొంతులోని వ్యంగ్యం చురుక్కుమంది. కిరణ్మయి జవాబిచ్చేంతలో ఆమె మామగారు కలుగజేసుకున్నారు.
” చూడమ్మా! ఇందులో నువ్వింత ఏడ్చి రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదు. లక్షణంగా ద్వితీయం చేసుకోబోతున్నావు. హాయిగా ఉంటావు. మేమా, పుత్రశోకంతో కుమిలిపోతున్నాము. పాప మాకు కాస్తంతా వెలుగురేఖ. శ్రీధర్ జ్ఞాపకంగా దాన్ని ఇక్కడే ఉండనీ. మరోవిధంగా అయితే దాంతోపాటు నువ్వుకూడా ఇక్కడే ఉండేదానివి. ఇప్పుడు నీతో ఆ బంధం తెగిపోయింది. ఆ పసిదానిమీద ప్రాణాలు నిలిపుకున్నవాళ్ళం. దాన్ని చూడకుండా ఉండలేము” అన్నాడు.
కిరణ్మయి చప్పుని వెళ్లి ఆయన కాళ్లు తాకింది. “”అది లేకుండా నేను బతకలేను. మాతోనే ఉంటుంది. తల్లీబిడ్డలని వేరు చెయ్యకండి” అని అక్కడే కూలబడిపోయి ఏడ్చింది. ఆయన కాళ్లు వెనక్కి తీసుకున్నాడు.
” అమ్మా! లోకవిదితమైన విషయాలు మాట్లాడుకుందాం. ఈవేళ మీతో శాంతి ఉండటానికి అతగాడు ఒప్పుకోవచ్చు. రేపు అతని మనసు మారుతుంది. అప్పుడు దాని గతేంటి? నా కొడుకు కన్నబిడ్డ అనాధలా అల్లాడితే వాడికి ఆత్మక్షోభ కలగదా? మేం తట్టుకోగలమా?”
” అలా జరగనివ్వను. దానిమీద ప్రమాణం చేసి చెబుతున్నాను. అటువంటిది జరిగిన రోజు శాంతిని నేను వదిలిపెట్టను. అది నాకూ కూతురని మర్చిపోకండి”
” శాంతిని మించిన బంధాలు నీ కాళ్లకు పడతాయి. అన్నిటికీ మించినది సంసారబంధం”
” దాన్ని తన కోడలిని చేసుకుంటానంది మా అమ్మ. శ్రీకాంత్‍కి అది చక్కగా ఈడౌతుంది”
” చాలా సంతోషం. పిల్లకి పెళ్లీడు రాగానే మేమే కబురు చేస్తాం. తండ్రి ఆస్తితోసహా అత్తవారింటికి దాన్ని పంపిస్తాం”
” అన్ని మమకారాలూ తెంచేసి ఆయన వెళ్లిపోయారు. ఇంకా ఆ ఆస్తి మాకెందుకు? ఏ అనాధాశ్రమానికో హాస్పిటల్‍కో రాసేయండి” దు:ఖం నిలవరించుకోలేకపోతోంది.
ఆమెనలాగే కాసేపు ఏడవనిచ్చాడు. తర్వాత దగ్గరకు వచ్చి ,తలమీద చెయ్యుంచి “దీర్ఘసుమంగళీభవ” అని దీవించి వెళ్లిపోతుంటే-
” ఒక్కసారి దాన్ని చూడనివ్వండి” ఆఖరి ప్రయత్నంగా అడిగింది. తనని చూస్తే శాంతి వదలదు. “ఇంట్లో లేదు. ఆడవాళ్ళంతా తీర్థానికి వెళ్లారు” జవాబు వచ్చింది లోపలినుంచే . కమలాకర్ హేళనగా చూసి లేచి వెళ్లిపోయాడు . ఈశ్వర్రావు, కిరణ్మయి మిగిలారు. అతనికేనా నచ్చచెప్పాలని తలెత్తింది కిరణ్మయి. కానీ అతడు సైంధవుడికన్నా నికృష్టుడని అర్థమైంది . సైంధవుడు బావమరుదుల భార్య ద్రౌపదిని కామించాడు. కానీ ఈశ్వర్రావు? అతడి తండ్రి మాట్లాడినదాంట్లో సబబు ఉంది. అర్థం ఉంది. మనవరాలికోసం తపన ఉంది. ఆ పిల్లపట్ల బాధ్యత ఉంది. మరి ఇతడు? కిరణ్మయికి కామమే ప్రధానమన్నాడు. గోపాలకృష్ణని వదిలేస్తే తను వుంచుకుంటానన్నాడు. కాకినాడలో ఉంచి అప్పుడప్పుడు శాంతిని తీసుకొచ్చి చూపిస్తాడట. శాంతిమీద అంత ప్రేమ కాలిపోతుంటే మాట విని తీరాలన్నాడు.