కిరణ్మయి అవమానంతో దహించుకుపోయింది. మనుషులింత నేలబారుగా ఎలా ఉండగలరు? శ్రీధర్ చనిపోవచ్చుగాక. అయితే మాత్రం తనెవరు? తమ్ముడి భార్య. కూతురితో సమానం. అలాంటిది ఎంత మాట అన్నాడు? దిమ్మెరపోయింది.
చెల్లెలు ఎంతకీ రాక పోయేసరికి చందూ టాక్సీ దిగి వచ్చాడు. అతన్ని చూసి ఈశ్వర్రావు అక్కడినుంచీ వెళ్ళిపోయాడు.
” పదమ్మా!” వచ్చి కిరణ్మయిని లేవదీసి నడిపించుకుని వెళ్ళాడు. తమకే సాధ్యంకానిది కిరణ్మయి వల్ల కూడా సాధ్యపడలేదని అర్థమైంది.
కొన్నాళ్లు రాయబారాలు సాగాయి.
” కోర్టులో వేద్దాం. చచ్చినట్టు శాంతిని అప్పగిస్తారు” అన్నాడు గోపాల్‌రావు.
” వద్దురా! ఎక్కడో ఒకచోట అది సుఖంగా ఉంటే చాలు. కోర్టులూ, గొడవలూ వద్దు. మనం పంతగిస్తే వాళ్లు దాన్నేమైనా చేస్తారు. అందులోకీ ఆ ఈశ్వర్రావు ఉన్నాడే, పరమ కర్కోటకుడు. ఎంతకైనా తెగించే రకం. ఎటూ శ్రీకాంత్‌కి అనుకున్నాం. ఆ తరుణం రాగానే మనమే వెళ్లి అడిగితే సరి” అని వారించింది కిరణ్మయి నాయనమ్మ.
కిరణ్మయిమాత్రం తన మనసుకి సమాధానం చెప్పుకోలేకపోతోంది. శాంతికి తను అన్యాయం చేసింది. ద్రోహం చేసింది. అక్కడది తనకోసం ఏడుస్తూ ఉంటే తను ఇక్కడ గోపాలకృష్ణతో సుఖంగా ఎలా ఉండగలదు? తన కూతురిమీద వాళ్లకి ఇంత పంతం ఏమిటి? తను ఎందుకు ఇంత తొందరపడి రెండోపెళ్లి చేసుకుంది? అయిపోయిన ఈ పెళ్లి కలలా మారిపోతే?
అన్నంముద్ద నోట్లో పెట్టుకుంటే శాంతి గుర్తొస్తుంది. దానికి గోరుముద్దలు ఎవరు పెడుతున్నారో! దానికి స్నానం ఎవరు పోస్తున్నారో! లాలిపాట పాడి ఎవరు జోకొడుతున్నారో! కలతపెట్టే ఎన్నో ఆలోచనలు!
నిర్మలమైన ఆకాశంలో జాబిల్లిని చూస్తూ నిలబడేది. అక్కడ శాంతి కూడా జాబిల్లిని చూస్తుంటుందేమో అనిపించి కళ్ళు చెమర్చేవి. మల్లెలు విచ్చుకుంటున్న వేళ అనిపించేది, కూతురి ఉంగరాల జుట్టులో కూడా ఇలాంటి మల్లెలే పక్కుమంటున్నాయేమోనని. అయినా దాని ముద్దూ మురిపెం చూడటానికి ఎవరున్నారని? తల్లా? తండ్రా?
చచ్చిపోవాలనే కోరికని బలవంతంగా ఆపుకునేది. ఏదో ఆశ! శాంతిని వాళ్లు తిరిగిచ్చేస్తారని. ఆ ఆశే ఆమెని బతికించింది. బాధంతా గుండెల్లో దాచుకునేది. అన్నీ వదులుకుని శాంతి దగ్గరికి వెళ్లిపోవాలనికూడా బలంగా ఉండేది. కానీ ఈశ్వర్రావు మాటలు అంత బలంగానూ పట్టి ఆపేవి. తనకీ శాంతికీ మధ్య చిక్కుముడి బిగుసుకున్నట్టుగా అర్థమైంది.
” నేను గోపాలకృష్ణగారిని చేసుకోవటంలో తొందరపడ్డాను. ఒక్క క్షణం… నా జీవితానికి నేనే కర్తను అనుకుని అతని మెడలో ఆ దండ వేశాను. ఆ మరుక్షణమే అర్థమైంది, చాలామందికి జవాబు చెప్పాలని” అంది తల్లితో.
ఆవిడ కిరణ్మయి కళ్ళలోకి సూటిగా చూసింది. “కొన్ని విషయాలు పిల్లలతో మాట్లాడకూడదని అనుకుంటాము. ఈ గొడవంతా… అంటే కాలేజీలో ఆ రోజటి గొడవ జరగక ముందు మీ నాన్న నాతో నిన్ను అక్కడికి పంపించడాన్ని గురించి మాట్లాడారు. శ్రీధర్ ఉన్నప్పటికీ, అతను పోయిన తర్వాతకీ పరిస్థితులు చాలా మారాయి. వాళ్ళు సంస్కారపు ముసుగులు తీసేసారు. అతనుంటే ఎలా ఉండేదో నాకు తెలియదు. కానీ మనం ఎదుర్కోవలసినది ఇప్పటి పరిస్థితి. మీ మామగారికి ఇద్దరు బయటి స్త్రీలతో సంబంధాలు ఉన్నాయి. ఈశ్వర్రావు రెండాకులు ఎక్కువే చదివాడు. అలాంటి ఇంట్లో నిన్ను వదిలి పెట్టడం అనేది నాకు ఎందుకో నచ్చలేదు. బామ్మ నీతో వచ్చినా ఎంతకాలం ఉంటుంది?”
” మీకు ముందే తెలుసా, వాళ్లలాంటి వాళ్లని?”
” తెలిస్తే అలాంటి ఇంట్లో నిన్నెందుకు ఇస్తాము?”
” ఆయన నాతో చాలా చులకనగా మాట్లాడాడు”” నెమ్మదిగా మనసు కూడదీసుకుని చెప్పింది కిరణ్మయి.
లక్ష్మీదేవి నిశ్చేష్టురాలైంది. పెద్దపెద్ద ఇళ్ళల్లో నాలుగుగోడల మధ్యని ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి! కిరణ్మయిని అక్కడికి పంపించి ఉంటే నయానో భయానో లొంగదీసుకునేవాడేమో! భర్తల్ని అదుపులో పెట్టుకోలేని ఆ వర్ధనమ్మగానీ సావిత్రిగానీ కూతురికి ఎంతవరకు రక్షణ ఇవ్వగలిగేవారు?
” వాళ్లతో ముందుగానే చెప్పి ఒప్పించి చేసుకుని ఉంటే బావుండేది అమ్మా! నేను చాలా తప్పు చేశాను” అంది కిరణ్మయి ఆవేదనగా. “
“ఎంత పిచ్చిదానివే? ఇలాంటివి సామరస్యంగా జరుగుతాయా? వాళ్లు ఒప్పుకుంటారనే అనుకుంటున్నావా? దాన్ని లాక్కెళ్లినట్టే నిన్ను కూడా లాక్కెళ్లేవారు. శాంతి గురించి దిగులుపడకు కిరణ్. మనసు సరిచేసుకో. దాని బాధ్యత వాళ్లకీ ఉంది. ఆస్తి బయటికి పోకూడదనుకున్నప్పుడు బాధ్యత తీసుకోక తప్పదు. ఇప్పుడు దానికి రెండు. పదహారేళ్లు రాగానే పెళ్లి ప్రయత్నాలు మొదలుపెడదాం. ఈలోగా కూడా ఎవరో ఒకరం వెళ్లి చూసి వస్తుంటాం” ఎన్నో రకాలుగా నచ్చజెప్పింది ఆవిడ.
తల్లి ఎంతగా చెప్పినా సమాధాన పడలేకపోతుంది కిరణ్మయి. శాంతిపట్ల అపరాధభావం ఆమెని ముంచెత్తుతోంది. గోపాలకృష్ణని తప్పించుకుని తిరుగుతోంది. తనకతనితో ఎలాంటి ప్రమేయం లేదనిపిస్తోంది. అతనెవరు? తనెవరు? దండలు మార్చుకున్నంతమాత్రాన పెళ్లి అయిపోయినట్టేనా? తనకి పెళ్లి కాలేదు. తను స్వతంత్రురాలు. ఈ ద్వైదీభావంతో ఆమెకి పిచ్చి పట్టినట్టు ఉండేది.
గోపాలకృష్ణ వరంగల్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఇద్దరి మధ్యనీ ఎలాంటి బంధమూ లేకపోయినా, ఏ అనుబంధమూ పెరగకపోయినా అతను తన భర్త కాబట్టి అతనితో వెళ్లాలనే భావన కలగగానే కిరణ్మయి అణువణువూ ప్రతిఘటించింది.
“నన్ను క్షమించండి. నేను మీకు తగను. బతికున్నంతకాలం ఈ దుఃఖాన్ని మోస్తూ తిరగమన్నాడు ఆ దేవుడు. నాతోపాటుగా మీరు కూడా ఎందుకు ఇలా? నన్ను చేసుకుని మీరేమి సుఖపడతారు? జరిగిందనుకున్న ఈ పెళ్లిని పీడకలలా మర్చిపోండి. మిమ్మల్ని సుఖపెట్టగలిగే మరో అమ్మాయిని చేసుకోండి” తెగించి అనేసింది.
అంతా పెళ్లి అనుకుంటున్నదాన్ని అలా తుంచేసాక ఎంతో తేలిగ్గా అనిపించింది. తన ఏడుపేదో తను ఏడవవచ్చు. అతని కోసం నవ్వక్కర్లేదు.
కానీ అతను ఆమె మాటల్ని సీరియస్‌గా తీసుకోలేదు.” బాప్ రే! మూడో పెళ్ళా? లాభం లేదు. ఎవరూ పిల్లని ఇవ్వరు” అన్నాడు.
కిరణ్మయి తలదించుకుంది.
” నాతో వరంగల్ రావాలనేకదా, ఇలా అంటున్నావు? నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదు. నువ్వు అక్కడ ఉండిపోవద్దు. రెండురోజులుండి ఊరు చూసి వచ్చేద్దువుగాని” అన్నాడు.
అతని మాట కాదనలేకపోయింది. సూట్‌కేస్‌లో రెండు జతల బట్టలు మాత్రం పెట్టుకుని అతన్ని అనుసరించింది. ఆమెతో ఇంకెవరూ వెళ్లలేదు. అతనే వద్దన్నాడు.
…
ముచ్చటగా నాలుగుగదుల ఇల్లు. వంటగది, హాలు, ఒక పడకగది, ముందుగది. ఎంతో పొందిగ్గా ఉంది. ఒకటే పోర్షను. ఇంటివాళ్లు తమకోసం కట్టుకున్నారట. తర్వాత బదిలీ అయ్యి హైదరాబాదు వెళ్లిపోయారు. చుట్టూ పూలమొక్కలతో పొదరింటిలా ఉంది. కిరణ్మయిని చాలా ఆకట్టుకుంది. గోపాలకృష్ణ తనపట్ల చూపిస్తున్న ఆప్యాయత, అతని సహచర్యం మొదటినుంచీ ఆమెకి నచ్చాయి. అందులో ఎలాంటి మార్పూలేదు. శ్రీధర్లా కాదితను. ఎంతో అనుభవంతో పెద్దవాడిలా వాత్సల్యంతో ప్రవర్తించేవాడు. ఆమె తనపట్ల ఎలా వుంటోందన్న విషయంపట్ల ఆసక్తి చూపించేవాడు కాదు. అతనికి మొదటినుంచి ఆమె చందూ ఇచ్చిన చాలెంజే. అందులో ఎలాంటి మార్పూ లేదు. ఇప్పుడు కొంత సొంతతనంకూడా వచ్చింది. ఈ ఏకపక్ష ప్రేమలో చాలా తేరుకుంది కిరణ్మయి. రెండురోజుల్లో తిరిగి వెళ్లిపోవాలనుకున్నది ఆ విషయం మర్చిపోయినట్టు ఉండిపోయింది.
ఆ ఒక్క సంఘటన జరక్కపోతే గోపాలకృష్ణ తనకోసం నిర్మించిన ఈ చిన్నిప్రపంచంలో ఇమిడిపోయేదేమో కిరణ్మయి. కానీ ఆ సంఘటన జరిగి, ఇప్పుడిప్పుడే కూడగట్టుకుంటున్న ఆమె నిబ్బరం సడలిపోయింది.
గోపాలకృష్ణని వెతుక్కుంటూ అతని తల్లిదండ్రులు వచ్చారు. తన జీవితంలో వాళ్ళ పాత్రని అప్పటిదాకా ఆమె ఊహించలేదు. మెడలో రుద్రాక్షమాలలు, నుదుటిన గంధపు రేఖలు, తిరుచూర్ణం బొట్టు, పిలక! ఈ వేషంలో ఉన్న కేశవశర్మని చూసి కిరణ్మయి వణికిపోయింది. వాళ్లు ఆమెనిగురించి పూర్తిగా తెలుసుకునే వచ్చారు.
” నువ్వెంత సలక్షణంగా అలంకరించుకున్నా నీ ముఖాన్న వైధవ్యం తాండవిస్తూనే ఉంది. నా కొడుకుని నాకు కాకుండా చేశావు. ఏ జన్మలో చేసుకున్న పాపానికో వితంతువు అయ్యావు. నీ సుఖాలకోసం ఒక పసిదాని ఉసురు పోసుకుంటున్నావు. వయోభారంతో మగ్గిపోయిన మాకు గర్భశోకాన్ని కలిగిస్తున్నావు. ఇంతకు ఇంతా అనుభవిస్తావు” శపిస్తున్నట్లుగా అన్నాడు.
” ఇదిగో, నీకెంత డబ్బు కావాలో అంతా ఇస్తాను. నా కొడుకుని వదిలిపెట్టి వెళ్ళిపో” గోపాలకృష్ణ తల్లి తన ఒంటి మీద ఉన్న బంగారమంతా తీసేసి కిరణ్మయి వడిలో పోసింది.
“మాకు ఉన్నది ఒక్కడే కొడుకు. ఆ ఒక్కడినీ మాకు దూరం చేయకు. మాకు తల కొరివి పెట్టాల్సింది వాడే!” అని ఏడుస్తూ ఆమె కాళ్లు పట్టుకోబోయింది.
ఓయి భగవంతుడా! ఇందరిని ఇన్ని విధాల బాధపెట్టి తను సుఖపడేది ఏమిటి? ఆ పెద్దాయన అన్నట్టు తన సుఖం కోసం శాంతిని ఉసురుపెడుతోంది. ఈ పెళ్లి, తద్వారా వచ్చే సుఖభోగాల కోరికేకదూ, దాన్ని తనకి దూరం చేసింది? కిరణ్మయికి లోపల్లోపల ఎక్కడో తగలకూడని చోట గట్టి దెబ్బ తగిలింది.
గోపాలకృష్ణ కాలేజీనుంచీ వచ్చేదాకా ఆయన తిడుతూనే ఉన్నాడు, ఆవిడ బతిమాలుతూనే ఉంది.
అతను తల్లిదండ్రుల్ని చూసి తడబడ్డాడు.
” దాన్ని వదిలేయరా! నీకు ప్రాయశ్చిత్తం చేస్తాను. సలక్షణమైన వివాహం చేస్తాను” కేశవశర్మ ఒకటే ఘోష.
తండ్రీకొడుకులు ఘర్షణపడ్డారు. ఎక్కడెక్కడి చరిత్రలో తవ్వుకున్నారు. ఎప్పటెప్పటి విషయాలో ఎత్తి తెలుగు సినిమాల్లోలా దూషించుకున్నారు.
ఇది గోపాలకృష్ణలో కిరణ్మయి ఎప్పుడూ దర్శించని కోణం. అతను ఒక వ్యక్తిని తిట్టడంగానీ, ఇంతగా ఆవేశపడటంగానీ చూడలేదు.
” నామీద ఇంత మమకారాన్ని పెంచుకునే బదులు ఆ భగవంతుడిమీద పెంచుకోండి. సంతోషిస్తాను. అర్థంపర్థంలేని మీ ఆపేక్షలతో నా జీవితాన్ని నరకం చెయ్యకండి. ఆ బంధాలన్నీ తెంచుకుని విముక్తుడినయాను. మళ్లీ నాతో తోలుబొమ్మలాట మొదలుపెట్టకండి” విసుగ్గా అన్నాడు.
” జ్యోతి చావప్పుడు నువ్వడిగినంతా ఇవ్వలేదనికదా ఈ కోపం? నా ఆస్తంతా ఇప్పుడే నీకు రాసిచ్చేస్తాను. ఎవరైనా ప్లీడర్ని పిలు” అన్నాడు కేశవశర్మ.
” అలాగైతే ఇప్పుడే పిలుచుకు వస్తాను. నాకక్కర్లేదు మీ ఆస్తి. అనాధాశ్రమాలు చాలా ఉన్నాయి. వాటికి రాయండి” తగ్గకుండా జవాబిచ్చాడు గోపాలకృష్ణ. అతని మనోఫలకంమీద ఏ జ్ఞాపకాలు కదలాడాయో గొంతు గద్గదమైంది. కళ్ళు చెమర్చాయి.
” ఒరేయ్, దరిద్రుడా! ఇదేనా నీ ఆఖరిమాట? అయితే నేను చెప్పేది కూడా విను. నేను చెప్పినట్లు నువ్వు దీన్ని వదిలేసి ప్రాయశ్చిత్తం చేయించుకోకపోతే నీ ముఖం కూడా చూడను. నాకు కొడుకే లేడనుకుంటాను. తల్లితోపాటే చచ్చాడనుకుంటాను. ఇన్నాళ్లూ అనాధ వెధవని చేరదీశానని చెంపలేసుకుంటాను” ముసలివాళ్ళిద్దరూ రుసరుసలాడుతూ వెళ్లిపోయారు.
కిరణ్మయి నిస్త్రాణగా నిలుచున్న చోటే కూలబడింది. గోపాలకృష్ణ విసుగ్గా లేచి వెళ్లిపోయాడు. ఆరోజు రాత్రి అతను మామూలుగా తిరిగిరాలేదు. బాగా తాగి వచ్చాడు. వళ్లెరగని స్థితిలోమంచానికి అడ్డంపడి నిద్రలోకి జారిపోయాడు. తాగినవారిని చూడ్డం అదే మొదటిసారి కిరణ్మయికి. సుడిగాలిలో చిక్కుకున్న గాలిపటంలా గిజగిజలాడింది. వరుసగా మరో రెండు రోజులుకూడా అలాగే జరిగింది.
కిరణ్మయితో మాట్లాడడంలేదు. ఆమె వండినది తినడం. కాలేజికి వెళ్లడం, అట్నుంచి అటే బార్కి వెళ్లి తాగేసి ఏ పన్నెండింటికో రావడం…
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.