సంగమం 16 by S Sridev

  1. సంగమం 12 by S Sridevi
  2. సంగమం 13 by S Sridevi
  3. సంగమం 14 by S Sridevi
  4. సంగమం 15 by S Sridevi
  5. సంగమం 16 by S Sridev
  6. సంగమం 17 by S Sridevi
  7. సంగమం 18 by S Sridevi
  8. సంగమం 20 by S Sridevi
  9. సంగమం 21 by S Sridevi
  10. సంగమం 22 by S Sridevi

కిరణ్మయికి పరిస్థితి అంతా అగమ్యగోచరంగా ఉంది. ఏం చేయాలి తను, ఇప్పుడు? తండ్రికేనా చందూకేనా చెప్పాలా? ఎందుకిలా చేస్తున్నాడు ఇతను? మొదటినుంచీ ఇతనికి ఈ అలవాటు ఉందా? ఇతన్ని చేసుకుని తను మోసపోయిందా? అసలు ఇతనెవరు? ఇతని తల్లిదండ్రులు ఎవరు? ఇతని భార్య ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయింది? ఇవేవీ తనకి తెలియదు. అనాసక్తితో తెలుసుకోలేదు. కనీసం చందూకేనా తెలుసా? ఏదో… చేసుకుంటానన్నాడని సరేనని అనేసాడా? అంత బరువా తను వాళ్లకి? అనేక సందేహాలు తలెత్తాయి.
” ఈవేళ కూడా అటు వెళ్తారా?” నాలుగోరోజుని తెగించి అడిగేసింది.
అతను తాడెత్తుని లేచాడు. ” వెళ్తాను. నా ఇష్టం. వెన్నెముకలేనిదానిలా నువ్వు జావకారిపోతూ ఉంటే ఎంతసేపని నిన్ను నిటారుగా నిలబెట్టను? నేను చాలా అలసిపోయాను. ఇంక నావల్ల కాదు. నాకు మనశ్శాంతి కావాలి”
” నేను మా ఇంటికి వెళ్లిపోతాను”
” వెళ్ళు. వద్దని నేనేం ఆపను. ఇకమీదట ప్రతివాళ్లూ అడుగుతారు, భర్తను వదిలేసి వచ్చావా అని. అప్పుడే అక్కడికి పారిపోతావు?”
కిరణ్మయి రోషంగా చూసింది. “నేను పారిపోవటం లేదు. పారిపోవాల్సిన కర్మ నాకేం లేదు. నాకు మీ ప్రవర్తన నచ్చలేదు. అందుకే వెళ్ళిపోతున్నాను” అంది.
” నీకు తారసపడే ప్రతివారి ప్రవర్తనా బాగుండదు. నిన్ను వింతగా చూస్తారు. మా అమ్మావాళ్లలాగే. అప్పుడు?”
” వింతగా చూస్తారు, విపరీతంగా మాట్లాడతారు… ఎందుకు? ఎందుకని? నా తప్పేంటి? నేను ఏ నేరం చేశానని?” ఉక్రోషంగా అరిచింది.
” నువ్వు అలా అడగలేవు కాబట్టి” వ్యంగ్యంగా అన్నాడతను.” నీకు వ్యక్తిత్వం లేదు కిరణ్మయీ! ఉందని భ్రమపడి చేసుకున్నాను. చెప్పు. నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నావు? మనం పెళ్లికిముందు ఒక్కసారైనా ఈ విషయం అనుకోలేదు. నేను ఎవర్నో, ఎలాంటివాడినో తెలుసుకోకుండానే సరేనన్నావు. వచ్చిన ఈ ఒక్క అవకాశం వదులుకుంటే తిరిగి రాకపోవచ్చునని చేసుకున్నావు. అంతేనా?”
కిరణ్మయి పిడికిళ్లు ఆవేశంతో బిగుసుకున్నాయి. అతికష్టం మీద కోపం నిగ్రహించుకుంది.
” మీరు నన్ను ఎప్పుడూ కించపరచనని మాటిచ్చారు” గుర్తు చేసింది.
” నీ గురించి చాలా ఉన్నతంగా ఊహించుకుని ఇచ్చానలా. కానీ నిన్ను నువ్వే కించపరుచుకుంటున్నప్పుడు నేను ఇచ్చిన మాటకి విలువేం ఉంటుంది?”
” నన్ను నేను కించపరుచుకుంటున్నానా?” ఆ అభియోగానికి తెల్లబోయింది.
” కాక?” అతను ఎదురు ప్రశ్నించాడు.” మా నాన్న అన్ని మాటలన్నప్పుడు నువ్వు తిరిగి ఒక్కమాట కూడా అనలేకపోయావు. ఆయన పూజించే దేవుళ్ళలో ఎంతమంది ఒక్క భార్యతో సరిపెట్టుకున్నారు? రాముడు ఒక్కడూ మినహాయింపుగా కనిపిస్తాడు. ఆ పురుషాహంకారాన్ని నువ్వు నిలదియలేకపోయావు. వీళ్లేకాదు, అయిదుగురు భర్తలు కల ద్రౌపది… సూర్యుడితోటీ, ఇంద్రుడితోటీ అహల్య… కృష్ణుడితో రాధ, చంద్రుడికి బుధుడిని కన్న తార… ఏ వివాహబంధం పవిత్రంగా ఉంది? ఇవే కదా ఆయన నిత్యం పారాయణం చేసే విషయాలు? వీళ్ళెవరిదీ తప్పు లేనప్పుడు నీ తక్కువ ఏంటో అడగ్గలిగావా? ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఇలా ప్రవర్తించారో… అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనచుట్టూ ఉన్నవాళ్లు ఎలా ప్రవర్తిస్తారో, దాన్ని ఎంతవరకూ ఆమోదించాలో తెలియని ఆ చదువులెందుకు? నీలోని న్యూనతాభావం నిన్నలా ఆలోచించనివ్వలేదు. ఆయన ముందు తలెత్తుకుని నిలబడలేకపోయావు. కుంచించుకుపోయావు. దాన్ని జయించు కిరణ్… తప్పో, ఒప్పో సగం దారిలో ఉన్నాము. వెనక్కి తిరిగి పోలేము. విడిపోయి ఇంకా నవ్వులపాలౌదామా?”
“”…””
“మాట్లాడవేంటి? నేను ఎలాగైనా బ్రతికేయగలను. తాగుతాను, తిరుగుతాను. నన్ను ఒక్కటంటే పది అంటాను. నువ్వలా ఉండగలవా?”
“…”
” నన్ను వదిలిపెట్టాక ఎదురుతిరిగేదేదో ఇప్పుడే చెయ్యి. ధైర్యంగా తలెత్తుకు తిరుగు. మనం ఏమీ తప్పు తెలియలేదు. జీవితంలో దొర్లిపోయిన అపశృతులని సరిచేసుకుంటున్నాం. అలాంటప్పుడు ఎందుకు ఈ సిగ్గు? నేను… నేను కూడా చాలా కోల్పోయాను. పోరాడే ఓపిక లేనంతగా అలిసిపోయాను. నిన్నేదో ఉద్ధరించాలని పెళ్లిచేసుకోలేదు. ఇద్దరిమధ్యా అవగాహన ఉంటుందని చేసుకున్నాను.”
” శాంతిని వాళ్లు లాక్కున్నారు, నేను మళ్లీ పెళ్లి చేసుకున్నానన్న మిషమీద. అది నాకెంత రంపపుకోతగా ఉందో మీకు తెలియదు”
” మనం విడిపోతే శాంతిని తిరిగి ఇచ్చేస్తారా?”
” ఇవ్వరు”
” పోనీ ఈ పెళ్లి జరగకుండా ఉంటే నువ్వు పాపతో వెళ్లి అక్కడ ఉండేదానివా?”
ఆ ప్రశ్నతో ఈశ్వర్రావు తనతో అన్న మాటలూ, తల్లి అతని గురించి అన్నవీ గుర్తొచ్చి ముఖం పాలిపోయింది.
” తెలియక నేను వెళ్తానన్నా అమ్మావాళ్లు పంపించేవారుకాదు”
” చెప్పు కిరణ్. ఏం చేద్దామనుకుంటున్నావు?”
“అదే తెలియటంలేదు. నా మనసుని సమాధానపరచుకోలేకపోతున్నాను” కిరణ్మయి కళ్ళలో నీరు అలల్లా కదిలింది. గోపాలకృష్ణ చలించిపోయాడు. ఆమె దగ్గరగా వెళ్లి భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకున్నాడు.
” కనీసం మనం స్నేహితుల్లానేనా ఉండలేమా?” ఆర్తిగా అడిగాడు. ” జీవితభాగస్వామిని, కన్నబిడ్డని పోగొట్టుకోవడంలో ఉన్న దుఃఖాన్ని నేను సంపూర్ణంగా అనుభవించాను. ఇంకా అనుభవిస్తూనే ఉన్నాను. నాకు నీ బాధ తెలుసు. కానీ బాధనే శ్వాసిస్తూ ఎంతకాలం బతకగలం? చందూ నాకు చిన్నప్పటినుంచి తెలుసు. తనకి నా జీవితంలోని ప్రతిఅంశమూ తెలుసు. నన్ను ఇదే ప్రశ్న అడిగాడు. కొడిగట్టిన దీపంలా ఆరిపోయే బదులు మరో దీపాన్ని వెలిగించవచ్చుకదా? అది నీకుకూడా వెలుగునిస్తుందేమో అన్నాడు నీగురించి చెప్తూ. నువ్వలా వితంతువుగా ఉండడం తనకు ఇష్టంలేదని అన్నాడు. వితంతువు అనే పదానికి వాడు ఇచ్చిన నిర్వచనం ఏమిటో తెలుసా? తంతువు తెగి ఉండటం. .. అంటే తెగిన వీణలా…కిరణ్! బాధ మన ఆలోచననీ, విచక్షణనీ చంపేస్తుంది. మనలోని స్పందనకి అదే కేంద్రకం అవుతుంది. మనం అలా బతకవద్దు. శాంతిని వెనక్కి తెచ్చుకోవడానికి ఏదైనా మార్గం ఉందేమో ఆలోచిస్తూ బతుకుదాం” అన్నాడు.
” వాళ్లు చాలా మూర్ఖులు. ఏం చేయాలో నాకే అర్థం అవడంలేదు. మీకేం చెప్పను? కానీ మీరు తొందరపడి ఏదీ చెయ్యకండి” అంది కిరణ్మయి.
గుండె రాయి చేసుకుంది. శాంతి తనకు ఒక్కదానికే కాదు, వాళ్లకికూడా ముఖ్యమైనదే. కొడుకు జ్ఞాపకంగా వాళ్లు తీసుకెళ్లారు. పెంచుతారు. పెరిగాక తమ్ముడిని పంపించి పిలిపించుకుంది. తన పుట్టింటికే కోడలిగా వస్తుంది. జీవితాంతం తన కళ్లెదుటే ఉంటుంది. ఆమెలో ఉప్పెనలా చెలరేగుతున్న అలజడి క్రమంగా చల్లారి గుండె ఏ మూలకో చేరుకుని చీకటి లోతుల్లోకి జారుకుంది. ఆ లోతుల్లో మినుకు మినుకుమనే దీపంలా చిన్న ఆశ. అది అణగారకుండా అలాగే ఉంది.


” మీ అమ్మ , నాన్నగారు… పాపం ఆరోజున చాలా కష్టపెట్టుకున్నారు. పురాణాల్లోనూ కథల్లోనూ ఎన్నో చదువుతాం. అవన్నీ నిజజీవితానికి అన్వయించుకోవాలంటే చాలా పరిపక్వత కావాలి. అదీకాక పురాణాల్లో విషయాలన్నీ అధిభౌతికతతో ముడిపెట్టి చెప్తారు. అప్పుడు ఈ విషయాలన్నీ అర్ధాలు మారిపోతాయి. కాబట్టి వాళ్ల ఆనాటి కోపం సహజమైనదే. మీరు ఒకమాటు వెళ్లి రాకూడదా?” గోపాలకృష్ణ అన్యమనస్కంగా ఉండటం చూసి, వాళ్ల గురించే ఆలోచిస్తున్నాడనుకుని అంది కిరణ్మయి.
” మా అమ్మ చనిపోయింది” జవాబిచ్చాడు.
” ఛ… అవేం మాటలు?” అని ఆమె మందలించబోతే-
” నేను నిజమే చెప్తున్నాను” అన్నాడతను.
“అంటే ఈవిడ మీ సవిత్తల్లా?” ఆశ్చర్యంగా అడిగింది. కొడుకుకోసం ఆవిడ హృదయవిదారకంగా ఏడవటం కళ్ళముందు కదిలింది. ఒంటిమీద ఉండే బంగారం అంతా తన వళ్లో తీసి పొయ్యడం గుర్తొచ్చింది.
” ఆ మాట అనిపించుకునే అర్హత కూడా లేదు”
” ఛ.. తప్పు. అదేంటి? ఆవిడ మీకోసం అంత ఏడిస్తే?” గోపాలకృష్ణ పెద్దగా నవ్వాడు. తర్వాత నవ్వి నవ్వి అతని కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. అయోమయంగా చూసింది కిరణ్మయి.
” లోకం గురించి నీకేం తెలుసు? మనుషులు ఎంతెంత దుర్మార్గాలు చేస్తారో, తమకి ప్రాప్తం లేనివాటిమీద, తమవి కానివాటిమీద మమకారం పెంచుకుని ఎన్నెన్ని అవకతవకలు చేస్తారో నన్నడుగు చెప్తాను. బయటపడకుండా గుండెల్లోనే దాచుకుంటూ తిరుగుతున్నావే, అంతకన్నా పెద్ద దుఃఖాన్ని నేను దాదాపు నా తొమ్మిదేళ్ల వయసునుంచి మోస్తున్నాను… ఆ దుఃఖం నా కన్నతల్లి చావు”
” మీ చిన్నప్పుడే అమ్మగారు పోతే ఈవిడని చేసుకున్నారా మీ నాన్నగారు?”
” అవన్నీ లోకసహజంగా జరిగే విషయాలు. మా ఇంట్లో జరిగినవన్నీ లోకవిరుద్ధమైనవి. ఈవిడకి పిల్లలు లేరని మా నాన్న రెండోపెళ్లి చేసుకున్నాడు”
” ఏమిటి?… భార్య బతికుండగానే?” ఒళ్ళు జలదరించింది కిరణ్మయికి.
ఈశ్వర్రావు మరోసారి గుర్తొచ్చాడు. అతన్నీ, అతని మాటల్నీ ఆమె మర్చిపోలేదు. అవి నిరంతరం ఆమెని వెంటాడుతూనే ఉంటాయి.
గోపాలకృష్ణ ఎప్పుడూ అతని గురించిగానీ అతనివాళ్ల గురించిగానీ ఎత్తడు. అతను ఏదో ఆలోచనలో ఉన్నప్పుడు తనే అనుకుంటుంది, వాళ్లు కానీ గుర్తొచ్చామోనని. వాళ్లంటే? అతని తల్లిదండ్రులా? దగ్గర కూర్చుని ఓదార్చాలనిపిస్తుంది. భార్యాపిల్లలా? అలాంటప్పుడు అతని ఒడిలో తల పెట్టుకుని తనుకూడా ఏడవాలనుకుంటుంది. ఏం చేయాలో తెలియక రెండూ చెయ్యదు.
ఇంకెప్పుడూ తాగనని మాత్రం ఒట్టు వేయించుకుంది. అతను మాటిస్తూ, “శాంతి మన పెద్దకూతురు కిరణ్! బాధ్యతతో చెప్తున్నాను. నాకు పెద్దగా బాధపడటాలూ, బాధపడేవాడిని ఓదార్చటాలూ రావు. మమతలు, మమకారాలు తెలియవు. తల్లిదండ్రులమని చెప్పుకుంటున్న ఈ ఇద్దరినీ నేనెప్పుడూ ప్రేమించలేదు. ప్రేమించలేకపోయాను. చేతిలో డబ్బులేక భార్యనీ, తల్లి ప్రేమను తెచ్చి ఇవ్వలేక కూతుర్నీ పోగొట్టుకున్నాను. నానుంచి ఎక్కువగా ఆశించకు. నీ కాళ్ళమీద నువ్వు నిలబడ్డం నేర్చుకో. నేను చెడ్డవాడిని కాను. పరిస్థితుల్ని ఎదుర్కోలేక… ఎదుర్కొనేందుకు మార్గం కనిపించక… వాటిని మార్చలేక తాగుడిని ఆశ్రయించాను. నువ్వు తారసపడేదాకా తాడూ బొంగరం లేని జీవితాన్ని గడిపాను. అలాంటి జీవితంలోకి మళ్లీ వెళ్లాలని లేదు. నువ్వుకూడా నన్ను అటు తొయ్యకు”
కిరణ్మయికి అర్థమైంది, అన్నీ తెలిసే చందూ అతన్ని తన జీవితంలోకి పంపాడని. గోపాలకృష్ణ మాటలని మంత్రాక్షరాల్లా మనం చేసుకుంది.
ఈ పెళ్లి విఫలమైతే నలుగురిలో నవ్వులపాలు తప్పదు. అతనితోటే ఉంటే బతుకు నందనవనం కాకపోవచ్చు కానీ ఒంటరి బాటసారిలా గడిపే అవసరం ఉండదు.
” చెప్పండి. మీకు మీ అమ్మగారంటే ఇష్టమా? ఎలా ఉండేవారు ఆవిడ?” కుతూహలంగా అడిగింది.