సంగమం 17 by S Sridevi

  1. సంగమం 12 by S Sridevi
  2. సంగమం 13 by S Sridevi
  3. సంగమం 14 by S Sridevi
  4. సంగమం 15 by S Sridevi
  5. సంగమం 16 by S Sridev
  6. సంగమం 17 by S Sridevi
  7. సంగమం 18 by S Sridevi
  8. సంగమం 20 by S Sridevi
  9. సంగమం 21 by S Sridevi
  10. సంగమం 22 by S Sridevi

“మా అమ్మని నేను చూడలేదు కిరణ్! నువ్వెప్పుడూ నా గురించి అడగలేదు. నీకు ఆసక్తి లేదనుకున్నాను. అందుకే చెప్పలేదు. కానీ మా అమ్మ గురించిన బాధ ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తుంది. జ్యోతి… అంటే నా మొదటి భార్య గురించి ఒక అద్భుతమైన ప్రేమకథలా చెప్పాలని ఉంటుంది. విని నువ్వు బాధపడవు కదా?”
” అలాంటిదేం లేదు. చెప్పండి. ఒకరి గురించి ఒకరికి తెలియాలి కదా?” అంది వినటానికి కుతూహలం వ్యక్తపరుస్తూ.
అతను చెప్పసాగాడు.

మా నాన్నకి నలభై దాటినా పిల్లలు లేరు. పది ఊళ్లలో పౌరోహిత్యం ఉంది. చాలా సంపాదించాడు. పిత్రార్జితమైన ఆస్తి కొంత ఉంది. రెండోపెళ్లి చేసుకోవాలన్న కోరిక పుట్టింది. దానికి కొన్ని పర్యవసానాలు ఉంటాయని ఆయన ఊహించలేదు. అవి బాధాకరంగా ఉంటాయని కూడా అనుకొని ఉండడు. మూర్ఖత్వానికి నిలువెత్తు రూపం ఆయన.
పౌరోహిత్యకుటుంబం మాది. సంకల్పం, మంత్రపుష్పం, సత్యనారాయణ వ్రతకల్పం, విష్ణు సహస్రనామం ఇలాంటివి పదిరవై నేర్చేసుకుని పాండిత్యం అంటే అదేనన్న నమ్మకంలో తనుండి మిగిలిన అందర్నీ అలాగే నమ్మించేవాడు. ఈ మిడిమిడి జ్ఞానంతోటే ఆయన ఆస్తులని సంపాదించుకున్నాడు. తనంతటివాడు లేడు, తనేం చేసినా చెల్లుతుందనుకున్నాడు. ఆయన చనిపోతే కర్మ చేసి సంతరించి ఆయన్ని స్వర్గానికి పంపాల్సిన బాధ్యత నాది. కానీ నేను ఆయనకి కర్మ చెయ్యను. దానికి కారణాలు రెండు. మొదటిది నాకు అలాంటివాటిల్లో నమ్మకం లేదు. అలాంటివి నమ్మేవాళ్లకి పాపపుణ్యాల వితరణ ఉండాలి. ఆయనకి అలాంటిది లేదు.
మా తాతతో ఆయనకి బంధుత్వం ఉంది. ఆయన వేదం చదివాడు. గొప్ప పాండిత్యం వుండేది. కదిలే విజ్ఞానఖని. నాన్న ఎక్కడైతే లౌక్యంతో లోకాన్ని గెలిచి డబ్బు చేసుకున్నాడో అక్కడే తాత విఫలమయ్యాడు. ఫలితంగా పేదరికం… కటికదరిద్రం. తినడానికి తిండి లేక జీవచ్ఛవాల్లా ఉండీ లేని వెలుతురులోని నీడల్లా ఉండేవాళ్లు. ఒక్కసారి చూశాను వాళ్ళని. అది కూడా జ్యోతి పోయాక. డబ్బుకోసం నన్ను వాడుకుంటారనే భయంతో నాన్న నన్ను వాళ్లకి దూరంగా పెంచాడు. నాకెందుకో వాళ్లమీదకూడా ప్రేమ కలగలేదు. పిల్లల్ని కనడానికి మనిషికి ఉండవలసిన అర్హతలు ఏమిటన్న విషయాన్ని తెలుసుకోకుండా ఒకరిద్దరు ఆడపిల్లల్ని కని వాళ్లని గుండెలమీద కుంపట్లనో, మెడకుపడ్డ గుదిబండలనో తిట్టుకునే అసమర్థులపట్ల నాకు ఎన్నటికీ ప్రేమ కలగదు. మంచిసమాజాన్ని ఏర్పరచుకోవడంలో వైఫల్యం, మనకిగల హక్కులని వినియోగించుకోవటంలో వైఫల్యం, బ్రతుకు ప్రమాణాలని పెంచుకోవడంలో వైఫల్యం… ఇవన్నీ కలిపితే ఆ మనిషికే కాదు, ఆ కుటుంబానికే కాదు, ఆ సమాజానికీ, జాతికే పెద్ద వైకల్యం ఉందనిపిస్తుంది.
తాతకి ఇద్దరు ఆడపిల్లలు. అమ్మకంటే పెద్దావిడని మూగతనికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇక అమ్మని మా నాన్నకి. పెళ్లైన వెంటనే అమ్మ గర్భవతి అయిందట. నాన్న ఆనందడోలికల్లో తేలిపోతే నా మారుటితల్లి నరసమ్మగారు అధోలోకానికి కుంగిపోయింది. తన లోపాన్ని ఎత్తి చూపించినట్టై అవమానంతో రగిలిపోయింది. ఇదికాక నాన్నలో వచ్చిన మార్పు. అమ్మమీద ప్రత్యేకమైన ప్రేమ ఏదీ లేకపోయినా తనని తండ్రిని చేయబోతోందన్న సంతోషం. చాలా అపురూపంగా చూసేవారట. అది నర్సమ్మగారిలో మరింత ద్వేషాన్ని పెంచింది. అంత తెగింపు ఆవిడకి ఎలా వచ్చిందో… పరిస్థితులు మనుషుల్ని అంతగా దిగజారుస్తాయేమో… ఒక జంతువుకి గాయం చేస్తే అదెలా తిరగబడుతుందో… అటువంటి తిరుగుబాటు ఆవిడ చేసింది. వయసులో తనకు సగం ఉండి ప్రసవ సమయంలో తనమీద నిస్సహాయంగా ఆధారపడిన మా అమ్మని ప్రసూతిగదిలోంచీ పాడెమీదికి పంపించింది. నాకు తను అమ్మై మురిసింది. అందుకు మంత్రసాని సాయం తీసుకుంది.
నాన్న దుఃఖం అంతా ఇంతా కాదు. పదీతలు ఈని నాలుగు కాలాలపాటు ఉండాల్సిన పాడిగేదె అకాలంగా చనిపోతే కలిగే దుఃఖం ఎలా ఉంటుందో అలాంటిది దుఃఖం ఆయనది. తమకు ఇంతే ప్రాప్తం. ఏజన్మ రుణాన్ని తీర్చుకోవడానికో వచ్చి ఆ రుణం తీర్చుకుని వెళ్ళిపోయిందని తనని తను ఓదార్చుకున్నాడు. ఆయన మాటల్లో ఆ ఓదార్పు ఎప్పుడూ ప్రకటితమయేది. పాపభారంతో గుండె బరువెక్కి నర్సమ్మగారుకూడా ఏడ్చి ఉంటుంది. ఆవిడది ఎంత పెద్దమనసో అనుకుని ఉంటారు చుట్టూ ఉన్నవాళ్ళు.
మా అమ్మ జ్ఞాపకాల అడుక్కి చేరుకుంది. నన్ను నర్సమ్మగారు పెంచుతోంది. ఆవిడ వళ్ళో పారాడుతున్నాను. ఆమె తను యశోదై పరవశించింది. నన్ను ప్రేమించడానికి ఆమెకి ఎలాంటి ఆటంకం లేదు. తన భర్త రక్తం. తమ భార్యాభర్తల మధ్యని ఇంకెవరూ లేరు. తాత్కాలికంగా వచ్చిన చీలిక మళ్లీ కలిసిపోయిందనుకుంది.
మంగమ్మ… అంటే అమ్మకి పురుడు పోసిన మంత్రసాని… అడపాదడపా వచ్చి పోతోంది. ఒకసారి చీర… ఇంకొకసారి కొంచెం డబ్బులు… మరొకసారి గిన్నెలు… ఇలా వచ్చినప్పుడల్లా కానుకలు అడుగుతూనే ఉంది. నర్సమగారు లేదనకుండా ఇస్తోంది. నాకు కొంచెం ఊహ తెలిసేసరికి ఇది తరచుగా కనిపించే దృశ్యం.
” ఇంకా ఎందుకే అది వస్తోంది?” అడిగారు నాన్న ఒకసారి. అప్పటి నుంచి జరిగినవన్నీ నాకు కచ్చితంగా గుర్తు.
అంతకుముందు జరిగినవి మాత్రం కొన్ని ఇలా జరిగి ఉండొచ్చని వూహించుకున్నవి, మరికొన్ని లీలామాత్రంగా గుర్తున్నవి.
“ఆ< పసిపిల్లవాడి పెంపకం నాకేం తెలుసు? అందుకే మధ్యమధ్యలో వచ్చి చూసి వెళ్లమంటున్నాను” అని జవాబిచ్చింది. ఆయన మరి తర్కించలేదు.
నాకు ఇంకొంత వయసు వచ్చేదాకా అలాగే సాగింది. మనిషి ఆశకి అంతులేదు. తనకి ప్రాప్తం లేనిదానికి ఆశపడ్డాడు నాన్న. తనది కాని ఫలానికి ఆశపడింది నర్సమ్మగారు. మంగమ్మలాంటి మనిషి చేతిలో ఇరుక్కుంది.
” ఇంకా ఎంతకాలం నన్నిలా వేధిస్తావు?” ఒకరోజు నర్సమ్మగారు కన్నీళ్లతో అడిగింది. మొదట్లో అది అడిగినవన్నీ కృతజ్ఞతతో ఇచ్చింది. తర్వాత గుట్టు రట్టౌవుతుందన్న భయంతో ఇచ్చింది. ఆ భయంతోటే ఇంకాఇంకా ఇస్తూ ఉంది. ఇచ్చినవి నాన్న దృష్టికి పోకుండా ఉండాలని కిందమీద అవుతోంది.
“ఏటమ్మో! మాలావు సెప్తన్నావు. నాకేటిచ్చేసినావేటి? నాలుగు సింకికోకలు… టీలు చిప్పలు… అప్పుడో పదీ, ఇప్పుడో పరకా అంతే కదా?” అని నోరుసుకుంది.
దాన్ని శాంతింపచేసేసరికి ఆవిడ తల ప్రాణం తోకకొచ్చింది.
” నా కొడుక్కి పట్నంలో నౌకరైంది. నన్ను తోలుకపోతాడు. ఇగో… ఇలా ఎల్లనా?” తన బోసి మెడ చూపిస్తూ అడిగింది. నర్సమ్మగారికి పై ప్రాణం పైనే పోయింది.
“వంటెడు నగలు చేయించినా ఆయనకి ప్రతి అణాయెత్తు నగా గుర్తే. ఇప్పుడేం చేయడం? దేవుడా? దీనికి భయపడుతూ ఇలా ఎంతకాలం? ఇంతకన్నా ఆ శ్రీలక్ష్మికీ దాని పిల్లలకీ సేవలు చేస్తేనేనా ఇహం పరం దక్కేవి. ఎంత పాపిష్టి పని చేశాను! ఏది దారి?” అని తనలో తను అనుకోవడం విన్నాను. ఇలా అనుకుందనిగానీ వాటిభావం ఇదనిగానీ అప్పుడు నాకు అర్ధమవలేదు. ఇప్పుడు ఆ ముఖం గుర్తొస్తే అందులో పలికిన భావాలు ఇవి అనిపిస్తుంది. ఆవిడలో పశ్చాత్తాపం మొదలైంది. తప్పు చేసినందుకు కాదు, తప్పుచేసి పట్టుబడి శిక్ష అనుభవించవలసిన పరిస్థితి ఎదురైనందుకు.
అమాయకమైన అమ్మ లేతవదనం కళ్ళముందు కదిలి కంటతడి పెట్టింది.
” ఎందుకమ్మా ఏడుస్తున్నావు?” అమాయకంగా అడిగాను. నన్ను దగ్గరికి తీసుకుని కన్నీళ్లు పెట్టింది.
” ఏటి, మాటాడవు?” గదిమింది మంగమ్మ.
” బంగారపు గొలుసిస్తే పంతులుగారు ఊరుకుంటారటే? రెండు మంచిమంచి చీరలివ్వనా? అమ్ముకున్నా డబ్బులు వస్తాయి” నర్సమ్మగారు బతిమాలింది.
” నీకంటే ఆయన పెనిమిటి. బయం. నాకేం బయం? నానెల్లి ఆయన్నే అడుగుతా” అని బయలుదేరింది మంగమ్మ.
దాన్ని వెనక్కి లాక్కొచ్చి రెండు కాసుల గుళ్లపేరు చేతిలో పెట్టి మళ్లీ అలాంటి కోరిక కోరనని దాని కొడుకులమీద మనవడిమీద వొట్టేయించుకుంది నర్సమ్మగారు. అది వెళ్ళిపోయింది. గండం గడిచినట్టనిపించింది ఆవిడకి. ఇక నాన్నకి సమాధానం చెప్పుకోవాలి. ఆయనకు ఏమని చెప్పాలి? పోయిందంటే ఎక్కడ పోయింది, ఎలా పోయింది, అన్నీ ఉండగా ఇదే ఎలా పోయిందని యక్ష ప్రశ్నలు వేస్తాడు. ఎటూ తోచలేదు ఆవిడకి.
రాత్రి రాగానే అడగనే అడిగాడు నాన్న. ఆయనది చాలా నిశితదృష్టి. ఆవిడ ఒంటిమీద ఉండే ప్రతిదీ గుర్తే. పుట్టింటివారికి ఇచ్చేస్తుందనే భయంతో కందులూ పెసల మూటలతోసహా అన్నీ లెక్కలు చూసుకుంటాడు. ఏవో చిన్నచిన్న నగలు తప్పించి అన్నీ ఒంటిమీదే ఉండాలంటాడు. అందరూ భార్యని సాక్షాత్తు లక్ష్మీదేవి అనుకోవాలని ఆయన ఆకాంక్ష.
నర్సమ్మగారు తడబడిపోయింది. అంత వెంటనే పట్టుబడిపోతాననుకోలేదు ఆవిడ. జవాబు ఇంకా ఆలోచిస్తూనే ఉంది. ఆలోచనలు ఇంకా తెగనేలేదు. బయటికి చెప్పే చేప్పేయాల్సిన తరుణం వచ్చేసింది.” అదీ. .. అదీ. ..” తడబడిపోయింది.
నాన్నలాగా ఎదుటివాళ్ళ తెలివితక్కువతనాన్ని డబ్బు చేసుకుని చలామణి అయ్యేవాళ్లు తక్కువ మంది ఉంటారు. నరసమ్మగారి పుట్టింటివాళ్ళుకూడా లేనివాళ్లే. చాటుగామాటుగా ఆవిడ వాళ్లకి సర్దుతుంది. నాన్న ప్రసన్నంగా ఉన్నప్పుడు చూసీ చూడనట్టు ఊరుకుంటాడు. లేనప్పుడు మాత్రం పెద్ద రభసే. చేటడు బియ్యమో, పది రూపాయలోనైతే పరవాలేదు. ఏకంగా రెండు కాసుల నగే? ఇంతకాలం ఉపేక్ష వహించడం తనదే తప్పు. రచ్చకెక్కకుండా తెచ్చుకోవాలని ఆలోచించి కట్టలు తెంచుకు రాబోతున్న ఆగ్రహాన్ని నిగ్రహించుకున్నాడు. కానీ నర్సమ్మగారి దుర్బలమైన మనస్థితి నిభాయించుకోలేకపోతుంది. ఆయన తన రహస్యం కనిపెట్టేశాడని భ్రాంతి పడింది. అంతే! పూనకం వచ్చింది ఆవిడకి. నిలువునా ఊగిపోయింది. జుట్టు పీక్కుంది. ఒళ్ళు రక్కుకుంది. బట్టలు చెప్పుకుంది.
చివరికి ” శ్రీలక్ష్మీ! నిన్ను నేను చంపలేదు!” అని పెద్ద కేకవేసి విరుచుకు పడిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. భూతవైద్యుడు వచ్చి వైద్యం చేశాడు. ఈ తంతు అంతా నేను చూశాను.