సంగమం 18 by S Sridevi

  1. సంగమం 12 by S Sridevi
  2. సంగమం 13 by S Sridevi
  3. సంగమం 14 by S Sridevi
  4. సంగమం 15 by S Sridevi
  5. సంగమం 16 by S Sridev
  6. సంగమం 17 by S Sridevi
  7. సంగమం 18 by S Sridevi
  8. సంగమం 20 by S Sridevi
  9. సంగమం 21 by S Sridevi
  10. సంగమం 22 by S Sridevi

నాన్నలో అనుమానం మొదలైంది. ఆవిడ కలవరానికీ పూనకానికీ గల కారణం ఊహించాడు. ఆయనవి అఖండమైన తెలివితేటలు. తీగలాగితే డొంకంతా కదిలింది. అయితే ఆయన ఆవిడని అసహ్యించుకోలేదు.
అంతా వెళ్లిపోయాక ఇంతే అన్నాడు,” వెర్రిదానా! ఎందుకే ఇంత తొందర పడ్డావు? నిన్ను వదిలేస్తాననే? నన్ను నమ్మలేకపోయావుటే? నీ తర్వాతే ఎవరైనా. అది పిల్లలని కంటూ పడుండేది”
ఆవిడ ఏడుస్తూ ఆయన కాళ్ళమీద పడింది. ఆయన ఆవిడ్ని క్షమించేశాడు.” ఆ మంగమ్మని నేను బెదిరిస్తాను. ఎప్పుడైనా వస్తే ఏ పాతబట్టనో పడేసి నోరు మూయించు. ఏదో ఒకటి ఆలోచిద్దాం. నలుగురిలో అల్లరిపెడితే మన పరువే పోతుంది” అన్నాడు.
ఆమె స్త్రీ హృదయాన్ని గాయపరచి ఆయన ఒక తప్పు చేశాడు . తన స్థానాన్ని పదిలపరచుకోవడానికి ఆవిడ మరో తప్పు చేసింది. ఇద్దరూ రాజీకొచ్చారు. నా మనసు నలగడం బహుశా అక్కడే మొదలై వుంటుంది.
….
మరో నాలుగేళ్లు గడిచాయి. మంగమ్మని కొడుకు తీసుకెళ్లలేదు. గొలుసు మాత్రం లాక్కుపోయాడు. అది ఇంకా ముసలిదైంది. మా ఇంటికి వచ్చిపోతూనే ఉంది. వస్తే ఏదో ఒకటి అని నర్సమ్మగారి కంటతడి చూడకుండా వెళ్లదు. దానికో విషయం అర్థమైంది. ఆవిడ చేసిన తప్పిదాన్ని నాన్న క్షమించివేసినా, భార్యాభర్తలిద్దరూ కలిసి లోకానికి భయపడుతున్నారని. అయితే ఇద్దరూ ఒకటయ్యాక ఇదివరకటంతలా దాని ఆటలు సాగటం లేదు.

నాకప్పుడు పదేళ్ళు ఉంటాయేమో! మంగమ్మ రావటం, నర్సమ్మగారిని ఏడిపించి వెళ్లడం చూస్తున్నాను. మొదటిసారి ఆవిడకి పూనకం రావడం నా మనసులో ముద్రించుకుపోయింది.
ఒకరోజు మంగమ్మ దగ్గరికి వెళ్లి అడిగేసాను,” ఎందుకే మామ్మా, మా అమ్మని అలా ఏడిపిస్తావు?” అని.
” నేనెందుకు ఏడిపించానయ్యా? చేతులారా చేసుకున్నదానికి ఏడుస్తోంది” నిర్లక్ష్యంగా అంది.
” ఏం చేసింది?” నాలో కుతూహలం. ఈమధ్య తన ఆటలు సాగడంలేదని మంగమ్మకి కచ్చగా ఉంది. విషయం చెప్పేసింది. అంత చిన్న వయసులో తెలిసిన ఆ వాస్తవం నాకు పెద్దగా ఆకళింపవకపోయినా, దాని ప్రభావం పెద్దగా లేకపోయినా, ఏదో జరిగిందని నేను గ్రహించినంతమేరకి అది దుష్ప్రభావాన్నే చూపింది.
స్తబ్దుగా అయ్యాను.
ఒకరోజు పూజగదిలో నిలబడి చూస్తుంటే ఒక స్త్రీ ఫోటో కనిపించింది, గోడకి అలంకరించబడి ఉన్న ఎన్నో దేవుళ్ళఫోటోల మధ్యని. ఆ ఫొటోకి పెట్టిన బొట్లు, పూలు చూసి అది కూడా దేవుడిదేనని అనుకుంటూ వచ్చాను ఇన్నాళ్లూ. కానీ కిరీటం, నాలుగుచేతులు లేని ఆ ఫోటోని మనిషిదిగా గుర్తించాను మొదటిసారి.
” అది ఎవరి ఫోటో?” నర్సమ్మగారిని అడిగాను. ఆవిడ ఏదీ దాచలేదు. ఆవిడ కోణంలోంచీ వివరించి చెప్పింది. తను ఎంత ప్రేమగా పెంచినాగానీ సవతితల్లి. ఆసంగతి ఈరోజున కాకపోతే రేపేనా తెలుస్తుంది. ఎప్పుడో ఎవరో చెప్తే విని నేను తల్లడిల్లిపోయినకన్నా ఆవిడే చెప్పేస్తే మంచిదని అనుకుంది. అందులో మరోస్వార్థంకూడా ఉంది. సవితితల్లి అయినా నన్ను ఆవిడ ఎంత ప్రేమగా చూస్తోందో చెప్పాలనే కోరిక. నన్ను చాలా ప్రేమతో దగ్గరికి తీసుకుంది. అదే ఆఖరిసారి. ఎందుకో తెలీదు, నాకు అందులో అంత:స్పర్శ దొరకలేదు. ఆవిడ కౌగిలీ, భౌతికస్పర్శా ఇబ్బందిని కలుగజేశాయి. ఇలా మొదటిసారి. ఆవిడ దాన్ని గుర్తించలేదు.
” ఆ ఫోటో మీ అమ్మది నాన్నా! ఆ బాలకృష్ణుడికిమల్లే ఈ గోపాలకృష్ణుడికీ ఇద్దరు అమ్మలు. ఇంకో అమ్మని దేవుడెత్తుకెళ్లాడు” అంది. నేను ఆవిడ మొహంలోకి తీక్షణంగా చూశాను… అలాంటి నిలదీసే చూపుని… తట్టుకోలేకపోయింది. ఆవేళ ఆవిడకి మళ్లీ పూనకం వచ్చింది.
” శ్రీలక్ష్మమ్మ దెయ్యమై తిరుగుతోంది” అన్నారు ఎవరో.
” కాదు. కొడుకుని చూసుకోవడానికి వస్తోంది” అన్నారు మరెవరో.
” లక్ష్మీ! ఈ అమాయకురాలిని మన్నించు. నీ కొడుక్కి ఏ లోటూ జరగదు. ఈ ఆస్తంతా వాడిదేగా!” అని లోపల్లోపల అమ్మకి నమస్కరించాడు నాన్న.
అప్పటినుంచి అమ్మ ఆ ఇంటికి ఇలవేల్పు అయింది. బహిరంగంగా పూజలవీ అందుకోసాగింది.

నాలో ప్రస్ఫుటమైన మార్పు… నాకే తెలుస్తోంది. వయసు వస్తోందిగానీ ఆ వయసువాళ్లలో ఉండే చలాకీతనం నాలో లేదు. తోటివాళ్లతో కలవలేకపోతున్నాను. చదువులో వెనకపడ్డాను. నిరంతరం చింతన. చాలా పసివయసులో గ్రహించిన సత్యాల తాలూకు నీడలు ఇప్పుడు నా వ్యక్తిత్వంమీద పరచుకోవడం మొదలుపెట్టాయి. నర్సమ్మగారినిగానీ నాన్ననుగానీ సమర్ధించలేకపోతున్నాను. నాకు నిజమేమిటో తెలియదనే వాళ్ళు అనుకుంటున్నారు.
వాళ్లకి సిరీసంపదా ఉంది. అది అనుభవించడానికి ఒక మనిషి కావాలి. అది నేను. వాళ్లు ప్రేమించడానికి ఒక ఆలంబన కావాలి. అది నేను. నన్ను పొందడానికి ఇద్దరు స్త్రీల హృదయాలని గాయపరిచాడు నాన్న . అంత కోరి చేసుకుని అమ్మకి రక్షణ కల్పించలేకపోయాడు. నన్ను మరొక స్త్రీనుంచి లాక్కుని ప్రేమ ఒలకబోస్తోంది నర్సమ్మగారు. వీళ్ళిద్దరికీ నన్ను ప్రేమించే అర్హత ఉందా అసలు?
వాళ్లలో ఇంత మోహాన్ని నింపిన నేనెవరు? ఈ ప్రేమకి కారణమైన శరీరం ఏమిటి? ఇదొక నవరంధ్రాల తోలుతిత్తి. అందులో వాయువు ఉన్నంతవరకే నేను అనే ఉనికి. ఆ తర్వాత? ఈ ఆపేక్షలు, ప్రేమలు ఉండవు. ఈ జన్మలో ఈ నేను. మళ్ళీ జన్మలో? ఇలాంటి ఆలోచనలు నాలో నిర్వేదాన్ని నింపాయి.
పూజగదిలోని అమ్మ ఫోటోలోకి తదేకంగా చూస్తూ గంటల తరబడి గడిపేవాడిని. అందులోంచి ఏదో సందేశం అందీ అందనట్టు నన్ను తాకేది. దానికోసం నేను తపనపడేవాడిని. అందుకోలేక సతమతమయ్యేవాడిని.
ఎవరు మా అమ్మ? ఎలా ఉండేది? తెల్లగా పొడుగ్గా నాలాగే ఉండేదా? ఎప్పుడూ నవ్వుతూ తిరిగేదా? లేక దుఃఖాన్ని దాచుకుని గంభీరంగా ఉండేదా? ఆమెకి ఎవరూ లేరా? ఇంత అన్యాయం జరిగితే ఎవరూ ఎందుకు పట్టించుకోలేదు? నాన్న ఆవిడ్ని కేవలం పిల్లలకోసమే చేసుకున్నాడా? ఒక మనిషిగా చూశాడా? అభిమానించాడా? ఆయన కుటుంబంలో అమ్మ పాత్ర ఏమిటి? ఎలా క్షమించగలిగాడు నర్సమ్మగారిని? ఎన్నో ప్రశ్నలు నిరంతరం నన్ను బాధపెట్టేవి.
అమ్మ ఫోటో ఉన్న ఆ పూజ గది నాకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశంలా అనిపించేది. రోజులో చాలాభాగం అందులో గడిపేవాడిని. నన్ను అలా చూసి, వాళ్లు మరో విధంగా కంగారుపడ్డారు . చిన్నవయసులోనే వైరాగ్యం పెంచుకుని ఇల్లు వదిలిపెట్టి వెళ్లి సన్యాసుల్లో కలిసిన చరిత్రలున్నాయి మా కుటుంబంలో. నేనూ అలా చేస్తానేమోనని భయపడ్డారు. పెళ్లి చేస్తే దారిలో పడతానని ఆలోచించి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అలా జ్యోతి నా యిరవయ్యవయేట నా జీవితంలోకి అడుగుపెట్టింది. తనకప్పుడు పదిహేడు.
అప్పటిదాకా అల్లుకోవడానికి ఒక ఆలంబనంటూ లేక గాల్లో వూగిసలాడుతున్న నాకు, నా ప్రేమనీ, భావాలనీ పంచుకోవడానికి దొరికిన అవకాశంలా అనిపించింది. తనని చాలా ప్రేమించాను. తను నాకన్నా తెలివైనది. తల్లిదండ్రులిద్దరి ప్రేమనీ, రక్షణనీ ఎలాంటి ద్వైదీభావం లేకుండా సంపూర్ణంగా అనుభవించింది. అలాంటి ప్రేమనే నాకు పంచింది, నానుంచీ ఆశించింది.
మా ఇద్దరిమధ్యా అంతటి అనురాగం పెరగటాన్ని నర్సమ్మగారు జీర్ణించుకోలేకపోయింది. తల్లీకొడుకులమధ్యకి జ్యోతి వచ్చిందనుకుంది. అత్తగారిని అనే ఆధిక్యభావనతో నా వెనుక జ్యోతిని సూటిపోటి మాటలు అనేది. ఆ సంవత్సరం నా పరీక్ష తప్పింది. దాంతో ఆవిడ నా ఎదురుగానే మాటలు విసరడం మొదలుపెట్టింది.
” ఆడపిల్లవి, కాస్త హద్దుల్లో ఉండక్కర్లేదా? ఏం ఉంటాయి, పొద్దస్తమానం వాడితో కబుర్లు? వాడిని చదువుకోనివ్వవా?” అని సన్నసన్నగా కోప్పడేది. పరీక్ష తప్పి ఉన్నాను కాబట్టి నాకూ ఏమీ అనడానికి ఉండేది కాదు. జ్యోతిపట్ల ప్రేమనీ, చదువునీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకి సాగాను.
అప్పటికి పెళ్లై రెండేళ్లు గడిచాయి. నేను బాగానే చదువుతున్నానుకాబట్టి జ్యోతికి ఇంక ఇంట్లో ఆరళ్లేం ఉండవనుకున్నాను. చదువు నిర్లక్ష్యం చేసినందుకు మందలించి దారిలో పెట్టిందని నర్సమ్మగారిపట్ల స్వల్పంగా అభిమానంకూడా పుట్టింది. కానీ ద్వేషాన్ని మనసులో నింపుకున్నవాళ్ళు దాన్ని వ్యక్తపరచడానికి సాకులు వెతుక్కుంటారు తప్ప మారరు. ఆవిడ మనసునిండా జ్యోతిపట్ల ద్వేషం ఉంది. దాన్ని నా చదువు మిషతో కొంత వలికించింది. నా చదువు దారిలో పడింది. ఇప్పుడు ఇంక మరో కారణం కావాలి.
” పెళ్లై రెండేళ్లయింది. ఇప్పటికింకా పిల్లలు లేరు. మగరాయుడిలా వాడితో కబుర్లూ నువ్వూను. నావెంట తిరిగి ఏ దేవుడికో దండం పెట్టుకోకూడదూ?” అని నేను వెళ్ళాక మొదలై ఒక రోజుని కాలేజీనుంచి వచ్చేసరికి-
” నిన్ను పుట్టింటికి పంపేసి నా కొడుక్కి మళ్లీ పెళ్లిచేస్తాను” వరకు సాగింది. అప్పటిదాకా నాకు తెలీదు, వాళ్లమధ్య ఈ గొడవొకటి మొదలైందని. నేను ఇంట్లోంచి కదలగానే మొదలవుతుందట, తిరిగి వచ్చేదాకా సాగుతుందట. నా మనసు పాడుచేయడం ఎందుకని, చదువునుంచి మళ్లిపోతానని జ్యోతి నాకు చెప్పడం లేదు. ఆరోజు కాలేజిలో స్ట్రైక్ ఉండడంచేత వెళ్లినవాడిని వెంటనే తిరిగి వచ్చేసాను. జ్యోతిని సినిమాకి తీసుకెళ్లాలనుకున్నాను. నేను వచ్చేసరికి ఇద్దరూ బాగానే గొడవపడుతున్నారు.
” ఆవిడిలా అంటోందని నాకెందుకు చెప్పలేదు?” జ్యోతిని కోపంగా అడిగాను.
” ఏం? తప్పా, నేనన్నమాట? ఇన్నేళ్లయినా పిల్లలు లేరంటే ఏమనుకోవాలి? మనింట్లో పద్ధతే అంత. రెండోపెళ్లి భార్యకిగానీ పుట్టరు. మీ తాతకీ అలాగే జరిగింది. మీ నాన్నకి అలాగే అయింది. నువ్వూ అంతే. మాకు మనవల్ని ఎత్తుకోవాలని ఉండదా?” అంది నర్సమ్మగారు.
అది మూర్ఖత్వమా? తెలియనితనమా? నాన్నవల్ల మా అమ్మతోపాటు తనుకూడా నష్టపోయింది. మళ్లీ అలాగే చేస్తానంటుందేమిటి? అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? మాకేమైనా వయసు మించిపోయిందా? ఏ కారణం చేతనైనా పిల్లలు పుట్టకపోతే వేరే బతుకులేదా? అసహ్యం అనిపించింది. మా అమ్మ గుర్తొచ్చి కోపంకూడా కలిగింది.