“నిన్న ఆవేశంలో అమ్మని ఏవేవో అనేసాను. నన్ను క్షమించండి. ఆమె ఏదో తప్పు చేసిందనీ దానికి తనని నిందించాలనీ కాదు. నా ఉనికి ఎక్కడికెళ్తే అక్కడే సమస్యాత్మకంగా తయారవుతోంది. నా పుట్టుకలోనే ఈ సంక్లిష్టత ఉందనుకుంటాను. పుట్టకుండానే మా నాన్న చనిపోయాడు. పెళ్లవగానే పెద్దనాన్న చనిపోయాడు. ఇక్కడికి వచ్చాను. ఇతనిలా నన్ను వేధిస్తున్నాడు. దేవుడి రాతని ధిక్కరించి మీరూ అమ్మా నిర్మించుకున్న ఈ అందమైన పొదరిల్లు చెదిరిపోతోందన్న భయాన్ని నిలువరించలేకపోయాను” వణుకుతున్న గొంతుతో అంది. ఆమె మనోగతభావం అతనికి అర్థమైంది. ఎప్పుడూ తన ఎదురుపడి మాట్లాడని పిల్ల ఇన్ని మాటలు మాట్లాడిందంటే దాని వెనక ఉన్న తపన అర్థమైంది.
“శాంతీ! ఇలా రా!” దగ్గరికి పిలిచాడు. ఆమె సంకోచంగా వచ్చింది.
“ఇలా కూర్చో” డబల్సోఫాలో తను జరిగి ఆమెని కూర్చోబెట్టుకున్నాడు. బెరుగ్గా కూర్చుంది.
“నన్ను చూస్తే ఎందుకు అంత భయం? మీ పెద్దనాన్నలు, మామయ్యలు వాళ్లలాగే నేనూను. అంకుల్ అని పిలువు. ఫ్రీగా ఉంటుంది. తప్పించుకు తిరగకు…. నువ్వేం తప్పు చేశావని అలా భయపడుతున్నావు? అమ్మని మధు, మానస అనరా? అలాగే నువ్వూను. అమ్మకి కాకపోతే పిల్లలు వాళ్ళ బాధలు ఇంకెవరికి చెప్పుకుంటారు?” మెత్తగా అడిగాడు. శాంతి తలవంచుకుంది.
“కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా నిలబడాలి. అప్పుడు… మీ అమ్మదికూడా ఇంచుమించుగా ఇదే వయసు. చాలా ధైర్యంగా తట్టుకుని నిలబడింది. కానీ దురదృష్టం. నిన్ను మాదగ్గిరే ఉంచుకుందామనుకున్నాం. మీ తాతావాళ్ళు తీసుకెళ్లిపోయారు. అమ్మ ఏమీ చెయ్యలేక పోయింది. కానీ ఆశ… ఎప్పటికైనా నువ్వు తిరిగొస్తావని. ఇంకో ముగ్గురు పిల్లలు ఉన్నా ఆ ఆశే ప్రాణంగా నిలుపుకుని బతికింది. ఎవరో ఏదో అన్నారని అలాంటి అమ్మని ఏడిపించి నువ్వు ఏడుస్తావా?”
“…”
“పెద్దవాళ్ళం, మేమున్నాము. నిన్ను ఎవరైనా ఏదైనా అంటే మేము ఊరుకుంటామా? అతనెవరో ఎలాంటివాడో మాకు తెలియదు. మీమధ్యని ఇంత బాడ్ టర్మ్స్ ఉన్నాయని కూడా తెలియదు. అంతా మాకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు. మేము చూసుకుంటాము” భుజంమీద తడుతూ అన్నాడు.
…
కిరణ్మయీ గోపాలకృష్ణా భాస్కర్ని కలవడానికి వెళ్ళారు. ఉరమని మేఘంలా వచ్చిన ఈ అతిథుల్ని చూసి అతను కంగుతిన్నాడు.
“శాంతి మా అమ్మాయి” ఒకే ఒక్క వాక్యంలో మొత్తం పరిస్థితిని సమీక్షించింది కిరణ్మయి.
శాంతిముందు నోరుపారేసుకున్నంత తేలికగా వీళ్ళనేమీ అనలేకపోయాడు. అయిష్టంగా వాళ్లని ఆహ్వానించాడు. అంతా గోపాలకృష్ణే మాట్లాడాడు.
“మీపెళ్లి ఏ ప్రాతిపదికన జరిగిందో, మీమధ్యనున్న గొడవలేంటో మాకు తెలియవు. మేము ఆ సంఘటనలకి… ఆఖరికి నిన్న జరిగినదానికికూడా శ్రోతలమేగాని సాక్షులం కాదు. మీ పెళ్లి జరిగినప్పుడు శాంతిని అమ్మానాన్నలు లేని అనాథగా చూపించి ఉంటారు. తనుకూడా ఉండీ నిరుపయోగమైన తల్లిగురించి ఎలా చెప్పుకుంటేనేమని ఉదాసీనతతో ఊరుకుంది. ఈశ్వర్రావుగారు చనిపోయాక ఆమెని మాదగ్గరికి పంపించేశారు. శాశ్వతంగా అక్కడినుంచి వచ్చేసింది. మాకు దూరమైన పద్ధెనిమిదేళ్ల తర్వాత” అని శ్వాస తీసుకోవడానికి ఆగాడు.
ఈశ్వర్రావు చనిపోయాడంటే భాస్కర్‌కి దిగ్భ్రాంతిగా అనిపించింది. ముందురోజు శాంతి చెప్తే తను వినకపోవడం గుర్తొచ్చి తప్పుచేసినట్టు అర్థమైంది.
“మీ ఇద్దరికీ ఇష్టమైతే కలిసి ఉండండి. కావల్సిన ఏర్పాట్లన్నీ మేం చేస్తాము. అలాకాక విడిపోదామనుకుంటే ఎవరిదారిన వాళ్ళు హాయిగా బతకండి. శాంతి చదువుకుంటానంటోంది. ఎంతదాకా చదువుకుంటే అంతదాకా చదివిస్తాం. అర్థం చేసుకుని ముందుకు వచ్చినవాడితో మళ్ళీ పెళ్లి జరిపిస్తాం. మీకూ మరో అమ్మాయి దొరుకుతుంది. అంతేగానీ గొడవలు ఎందుకు? ” సూటిగా అడిగాడు గోపాలకృష్ణ.
భాస్కర్ జవాబు ఇవ్వలేదు ఈశ్వరరావుకీ గోపాలకృష్ణకీ చాలా తేడా ఉంది. ఆయన తన పురుషాహంకారాన్ని పెంచి పోషిస్తే ఇతను దాన్ని అణిచేస్తున్నాడు. తనకు ఏమీ కాని వ్యక్తి గురించి సొంతకూతురిగురించి తాపత్రయపడినట్టు తాపత్రయపడుతున్నాడు.
స్వంత… కూతురు… మళ్లీ అతని బుర్రలో పురుగు తొలచడం మొదలైంది.
“ఇదివరకంటే శాంతి పక్షాన ఎవరూ లేరు. ఆమెని మీరేమన్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు తనకి మేమిద్దరం ఉన్నాము. మాకు పరువు మర్యాదలు ఉన్నాయి. ఇలాంటివి మరోసారి జరిగితే నేను వదిలిపెట్టను” ఈ మాటలు అంటున్నప్పుడు గోపాలకృష్ణ గొంతులో కోపం ధ్వనించింది.
తర్వాత కిరణ్మయికేసి తిరిగి, “”నువ్వు బయట వెయిట్ చెయ్యి. నేను వస్తాను”” అని చెప్పి ఆమె వెళ్లగానే, “మీకు శాంతి తండ్రి ఎవరనే విషయంమీద సందేహం ఉన్నట్టుకూడా అర్థమయింది. శాంతి నా కూతురు కాదు. నాకు పుట్టలేదు. నాకూతురైతే వాళ్లు తీసుకెళ్లేవాళ్ళు కాదు. నేనుకూడా చేతులు ముడుచుకుని కూర్చునేవాడిని కాదు. ఇది వాళ్ల కుటుంబవ్యవహారం కాబట్టి నేను తలదూర్చలేదు. మీ నాన్నగారిని చూపించి మీ అమ్మగారు చెప్తే మీరు నమ్మారు. మీచుట్టూ ఉన్న లోకంకూడా అంతే. శాంతి విషయంలోకూడా అంతే. మీరు, తను అనే కాదు. ఎవరి విషయంలోనేనా అంతే. నాన్నని నిర్ధారించుకోవడంకోసం డీఎన్ఏ టెస్ట్‌లు చేయించుకునే పరిస్థితి మన సమాజంలోనే కాదు, పాశ్చాత్యసమాజంలోకూడా లేదు. స్త్రీ చెప్తుంది, సమాజం నమ్ముతుంది. నమ్మటం నమ్మకపోవటం అనేది మన సంస్కారం పై ఆధారపడి ఉంటుంది. అన్నీ ఆలోచించుకుని ఏం చెయ్యాలనుకుంటున్నారో చెప్పండి. అంతదాకా శాంతి జోలికి రావద్దు” అనేసి మరో మాటకి ఆస్కారం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు.
భాస్కర్‌కి తలతిరిగిపోయింది. అక్కడ చాలా సమంజసంగా అనిపించిన తన ప్రవర్తన ఇక్కడ అనుచితంగా కనిపించడంతో పరిసరాలు, పరిస్థితులనేవి సంఘటనలని ఎలా ప్రభావితం చేస్తాయనేది అర్థమైంది. జరిగిందేదో జరిగిపోయింది. అపరిచితుల్లా మిగిలిపోక ఈ గొడవని తవ్వి మళ్లీ తలకెత్తుకున్నాడెందుకు? శాంతిని చూడగానే ఎందుకంత సంయమనం కోల్పోయాడు? ఆమె తనకు ఏమవుతుంది? అబద్ధాల ఆధారంగా జరిగిన పెళ్లి పెళ్లి కాదని తనే తీర్పు ఇచ్చి మళ్లీ ఎందుకు వెంటపడుతున్నాడు? ఈశ్వర్రావుగారు ఎప్పుడు పోయారు? ఎలా పోయారు? వాళ్లు శాంతిని ఇక్కడికి ఎందుకు పంపించారు? ఇక్కడ ఆమె స్థానం ఏమిటి?
అతని ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. తండ్రి దగ్గరనుంచి ఫోన్ వచ్చింది.” సింధు పెళ్లి క్యాన్సిల్ అయింది. నువ్వు వెంటనే బయలుదేరి రా!” అన్నాడాయన. ఆ రెండు వాక్యాలూ చెప్పేసి” ఇక్కడికొచ్చాక మాట్లాడుకుందాం” అని పెట్టేశాడు.
భాస్కర్‌కి ఇది మరో షాకు. సింధు పెళ్లి తన పెళ్లికన్నా ముందే సెటిలయింది. ఎప్పటినుంచో అనుకుంటున్న సంబంధం. తమకి అతని కుటుంబం బాగా తెలుసు. నిశ్చయతాంబూలాలు తీసుకోలేదు కానీ కట్నకానుకల ఒప్పందాలు అయ్యాయి. సింధు, అతను కాబోయే భార్యాభర్తలుగా గుర్తింపబడ్డారు. తన పెళ్లికి కూడా వచ్చాడతను. అతని నాయనమ్మ చనిపోవడంచేత వాళ్ల పెళ్లి ఏడాది వాయిదా వేశారు. ఇంతదాకా వచ్చాక ఇలా ఎందుకు జరిగిందో అర్థమవలేదు.
వెంటనే కాలేజీకి సెలవుపెట్టి రైలెక్కాడు. ఇల్లు చేరేసరికి పన్నెండయింది. తల్లి ఒక్కర్తే ఇంట్లో ఉంది. ఏడ్చి ఏడ్చి ఆవిడ ముఖం బాగా ఉబ్బి ఉంది. భాస్కర్‌కి మంచినీళ్లు తెచ్చి ఇచ్చి, చేతిలో బ్యాగ్ అందుకుంటూ,” నాన్న ఫోన్ చేశారా?” అని అడిగింది. అతను తలూపాడు.
” సింధు ఏది?” చెల్లెలి గురించి అడిగాడు.
” ఆఫీసుకి వెళ్ళింది” అంది రాజేశ్వరి.
” అసలు గొడవేమిటి?” ఆతృతగా అడిగాడు.
” దీన్ని అడిగితే ఏమీ చెప్పడం లేదు. విషయం ఏమిటో తెలుసుకోకుండా వాళ్లనేమని అడుగుతాం?”
భాస్కర్‌కి అంతా అయోమయంగా అనిపించింది.”వాళ్లే చేసుకోమని కబురుపెట్టారా?” అడిగాడు.
“నిన్న ఆఫ్ కదా, ఇది ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం అతను వచ్చి సినిమాకి వెళ్దామంటే వెళ్ళింది. తిరిగి వచ్చాక ఈ పాట మొదలు పెట్టింది. అతనేమైనా అన్నాడా అంటే చెప్పదు. కాబోయే భార్యవికదా, చనువు తీసుకున్నాడా అంటే మాట్లాడదు. అసలు ఇంటికి ఏదో శని పట్టింది” అందామె విసుగ్గా. ఆ విసుగు క్రమంగా ఏడుపులోకి దిగింది.
“నువ్వు చూస్తే ఇలా ఉన్నావు. పోనీ జరిగిందేదో జరిగింది, విడాకులిచ్చి మళ్లీ పెళ్లి చేసుకుంటావా అంటే అదీ లేదు. వాళ్ళకి పంపించిన కాయితాలు తిరిగి రాలేదు… అన్నట్టు భాస్కర్! నీకీ విషయం తెలుసునటరా?” హఠాత్తుగా గుర్తొచ్చి అడిగింది.
“ఏంటి?” తల్లి గాలి తనమీదికి మళ్ళేసరికి గాయాన్ని కెలికినట్లయింది”
“ఈశ్వర్రావుగారు పోయేడట. కనీసం మనకి కార్డేనా రాయలేదు. ఆ పిల్లని ఏం చేశారో ఎక్కడికి పంపించారో తెలీదు. మనదగ్గరికి పంపించామని అందరికీ చెప్పుకుంటున్నారట… తండ్రి పోయినప్పటికి శాంతి ఇంకా పుట్టనేలేదట. తల్లికూడా వయసులో చాల చిన్నదట. చదువుకున్న కుటుంబం. పిల్ల పుట్టిన రెండేళ్లకో మూడేళ్ళకో పెద్దవాళ్లు నిలబడి ద్వితీయం చేశారట” గబగబా అంది.
భాస్కర్ తెల్లబోయాడు. ” నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు?” కొద్దిసేపటికి కుతూహలంగా అడిగాడు.
“మన ఊరి శాస్త్రిగారి బంధువొకాయన ఈమధ్యని ఇక్కడికి వచ్చాడు. నాన్నతో పని ఉండి మన ఇంటికి వచ్చాడు. ఆయనకి వాళ్లూ వీళ్లూకూడా బంధువులేనట. తిరిగేస్తే మనతోటీ చుట్టరికం కలిసింది. భాస్కర్! పీటలమీద పెళ్లిచెడగొట్టుకుని నలుగురిలో మనం చెడ్డవాళ్లమయాము. తల్లిది ద్వితీయం అంతే నాకూ ఎబ్బెట్టుగానే అనిపించిందనుకో… నలుగురిలో ఇలాంటి ప్రస్తావన వచ్చినప్పుడు అదేమీ పెద్దసమస్య కాదన్నట్టే అందరూ మాట్లాడుతున్నారు. కాలం మారిందేమో!”
భాస్కర్ తల్లికేసి ఆశ్చర్యంగా చూసాడు.” అడిగినంత కట్నం ఇచ్చారు. ఇంకా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కోర్టులో వేస్తే ఆ పిల్ల ఆస్తి ఆ పిల్లకు వచ్చేదేమో! ప్రథమకోపంలో లేచి వచ్చేసినా తర్వాత వాళ్లు వచ్చి బతిమాలేకేనా తగ్గాల్సింది… ఇంతకీ అంత డబ్బుండీ ఎక్కడ దిక్కులేకుండా అఘోరిస్తోందో! మనకి పడి ఎలా ఏడుస్తుందో!” అంది బాధపడుతూ. ఆవిడ బాధ శాంతి గురించో లేదా ఆమెద్వారా రాకుండా పోయిన డబ్బు గురించో అర్థమవలేదు భాస్కర్‌కి. అదే అడిగాడు.
“రెండూను. నిన్నటిదాకా ఆస్తిగురించే అనుకున్నాను. సింధు విషయంలో ఇలా అయ్యేసరికి చాలా బాధనిపిస్తోందిరా! ఆ పిల్ల వుసురే తగిలిందేమో! పెద్దవాళ్ళు మోసం చేస్తే పాపం… తనేం చేస్తుంది?” జాలిగా అంది. ఆవిడ మాటల్లో పశ్చాత్తాపం కొట్టొచ్చినట్టు ధ్వనిస్తోంది.
భాస్కర్ చాలాసేపు మాట్లాడలేదు. ముందురోజు సాయంత్రంనుంచి జరిగిన సంఘటనలన్నీ వరుసగా కళ్ళముందు కదిలాయి.
” పద, భోజనం చేద్దువుగాని” అని లేచింది. అతను బట్టలు మార్చుకుని, కాళ్లు చేతులు కడుక్కుని వంటింట్లోకి నడిచాడు. ఆవిడ వడ్డిస్తుంటే తింటూ అన్నాడు. “”నేను ఎందుకో సమాధానపడలేకపోతున్నానమ్మా! కట్నం తీసుకోకూడదనీ, ట్యూషన్లు చెప్పకూడదనీ… అలాంటి ఆశయాలు నాకేం లేవు. ఏటికి ఎదురీత లేని సాధారణమైన జీవితం కోరుకున్నాను. చదువుకుని ఉద్యోగం చేసే అమ్మాయికన్నా ఇంట్లో ఉండే అమ్మాయివల్ల జీవితం హాయిగా సాగుతుందని ఎంచి శాంతిని చేసుకున్నాను. కానీ ఎవరూ సృష్టించనంత పెద్దతుఫాను తను సృష్టించింది. ఇందులో తన తప్పేం లేకపోవచ్చు. జరిగినవాటిలో తన ప్రమేయం ఉండకపోవచ్చు. అయినా తనని చూస్తే నాకు చాలా కోపం వస్తోంది. జాలిగానీ, ప్రేమగానీ కలగటంలేదు”
“నిజమేరా! పీటల మీద పెళ్లి చెడగొట్టుకున్న అపఖ్యాతిమాత్రం చిన్నదా? నలుగురికీ సమాధానం చెప్పుకోలేకపోతున్నాం. ఆ అమ్మాయి ఏ పరువుతక్కువ పనేనా చేస్తే అది మనకీ అవమానమే”
“నువ్వు తన గురించి అంత భయపడక్కర్లేదమ్మా! నిన్న నాకు కనిపించింది. ఈ వేళ ఉదయం ఆమె తల్లి… ఆయనేమన్నాలో… సవతితండ్రా?” నవ్వాడు.” ఆయనతో కలిసి వచ్చింది. వాళ్ల దగ్గరే ఉంటోంది శాంతి” ఒక్కొక్క విషయం చెప్పాడు.
“వాళ్లు నీదగ్గరకు వచ్చారా?” అపనమ్మకంగా అడిగిందావిడ. “ఏం చేస్తున్నాడు ఆయన? ఎలా ఉన్నారు వాళ్ళిద్దరూ? అందరిలాగే ఉన్నారా? ఎబ్బెట్టుగా ఉన్నారా? వచ్చి ఏం మాట్లాడారు?” అడిగింది.
“ఇద్దరూ లెక్చరర్లు. మా కాలేజీలోనే చేస్తున్నారు. శాంతి తల్లిదండ్రులుగా కాక, ముందునుంచే పరిచయం. మా విషయం మాట్లాడారు. శాంతి చదువుకుంటానందట. చదివిద్దామని వాళ్ల అభిప్రాయం కూడా” కొంచెమే చెప్పాడు.
“అదేంటి? దాన్ని తీసుకెళ్ళమని, ఇద్దరూ కలిసి ఉండమని నిన్ను అడగలేదా?” రాజేశ్వరి తెల్లబోయి అడిగింది.
“అవన్నీ నీలాంటి తల్లిదండ్రులు చేసే పని. కాళ్లావేళ్లా పడటం, మా అమ్మాయి చావైనా బతుకైనా నీ చేతుల్లోనే ఉందనటం, ఇంకాస్త డబ్బు పడేస్తామని బేరమాడటం… చదువూ సంస్కారం ఉన్నవాళ్ళెవరూ చెయ్యరు” గుమ్మంలోంచీ మాటలు వినిపించి తల్లీకొడుకులు తలతిప్పారు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.