సంగమం 30 by S Sridevi

  1. సంగమం 24 by S Sridevi
  2. సంగమం 30 by S Sridevi

“ఆ పాఠాలు చెప్పే మీ అమ్మ కొంపముంచాడు” అంది సావిత్రి.
తల్లి ఉండే వాతావరణానికి భిన్నమైన వాతావరణాన్ని చూస్తోంది శాంతి ఇక్కడ. తండ్రి బతికి ఉంటే ఆమెకూడా ఈ కుటుంబ సంస్కృతిలో భాగంగా ఉండేదేమో! శాంతికి ఎందుకో తల్లినలా ఊహించుకోవడం నచ్చలేదు. నెమ్మదిగా మాట మార్చేసింది.
ఆ తెల్లవారి మూడింటికి వర్ధనమ్మ పోయింది. పోయేముందు శాంతిని మరోమాటు తనదగ్గర కూర్చోబెట్టుకుంది. ఆమె కొడుకు బుగ్గల్ని వడిలిపోయిన చేతులతో తడిమి ముద్దుపెట్టుకుంది.
“శ్రీధర్… నా చిట్టితండ్రి మళ్లీ పుట్టాడు” అంటుండగానే గొంతుకి ఏదో అడ్డుపడ్డట్టై కళ్లు తేలవేసింది. అంతే… ప్రాణం పోయింది.
ఒక్కసారి అంతా గొల్లుమన్నారు. చావు మనిషికి దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అంత దగ్గరగా చావుని చూడటం శాంతికి కొత్త. తనతో మాట్లాడుతూ ఉన్న వ్యక్తి హఠాత్తుగా చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. వాలిపోయిన ఆ చెయ్యి, చల్లబడుతున్న ఆ స్పర్శ… ఒకప్పుడు సజీవంగా ఉండి ఇంతమంది పిల్లల్ని కని ఇంత పెద్ద కుటుంబానికి ఆధారమైన స్త్రీవేనా అన్న అపనమ్మకం…
“శాంతీ! నువ్వు అక్కడ లే! చంటిపిల్లాడిని పెట్టుకుని అక్కడెందుకు?” దూరంగా తీసుకెళ్లింది సావిత్రి.
“బామ్మ ఇంక లేదా?” కలలోలా అడిగింది శాంతి. జవాబుగా ఏడ్చింది సావిత్రి. పదహారేళ్ళ వయసులో పెళ్లై ఈ ఇంటికి కోడలిగా వచ్చిందామె. పెద్దకోడలు. అత్తగారి రాజసాన్ని చూసింది. ఆవిడ యవ్వనాన్నీ శక్తి సంపన్నతనీ చూసింది. ఇప్పుడిలా నిస్సహాయంగా మృత్యువు ఒడిలోకి జారిపోవటాన్ని.
తెల్లవారేసరికి బంధువులందరికీ ఫోన్లు వెళ్లాయి. దగ్గరలో ఉన్నవాళ్లు అప్పటికే రావడం మొదలుపెట్టారు. శాంతి భాస్కర్‍కి ఫోన్ చేసి చెప్పింది.
” నువ్వెందుకక్కడ? దహనం అయాక వచ్చెయ్. మళ్లీ కావాలంటే పదోరోజున వెళుదువుగాని” అన్నాడు.
ఆమె అలాగే వెళ్లి వచ్చింది. ఈమాటు కార్తికేయని పంపలేదు కిరణ్మయి. తను చూసుకుంటానని వుంచేసింది. కూతురికి ఎన్నో విషయాలూ, జాగ్రత్తలూ, తీసుకోవలసిన నిర్ణయాలూ చెప్పింది. కర్మంతా అయింది. వయసుమీరి చనిపోయిందికాబట్టి పెద్దగా ఎవరూ బాధపడలేదు. ఒక వేడుకలా అట్టహాసంగా జరిపించారు. వచ్చినవాళ్లు తిరిగి వెళ్లి పోతున్నారు. శాంతి కూడా ప్రయాణం అవుతుంటే సావిత్రి అంది.
” రేపు ఆశీర్వచనం అయ్యాక వెళ్ళు”
“వాడు గొడవ చేస్తుంటాడు. అమ్మకి లొంగడు” అంది శాంతి.
“ఒక్కరోజుకే?”
“ఎప్పుడూ వదిలిపెట్టి ఉండలేదు”
నిట్టూర్చింది సావిత్రి. తీసుకు వచ్చిన కొత్తలో తల్లికోసం శాంతి ఎంత బెంగపెట్టుకుందో గుర్తొచ్చింది. ఇప్పుడు అదే బెంగ కొడుక్కోసం ఆమె కళ్ళల్లో కనిపిస్తోంది.
అవతలి గదిలో కమలాకర్‍తో మాట్లాడుతున్నారు ఆవిడ కొడుకులు.
“అది వెళ్తున్నట్టుంది. ఏదో ఒకటి సెటిల్ చేసుకుంటే బావుంటుంది చిన్నాన్నా! ఎప్పటికైనా మన పిలక తన చేతిలో ఉన్నట్లేగా?” అంటున్నారు. దేని గురించైతే శాంతిని అక్కడికి పంపడానికి కిరణ్మయి భయపడిందో అదే విషయం.
“నేను సెటిల్ చేస్తాను” అంటూ శాంతి ఉన్న దగ్గరికి వచ్చాడు కమలాకర్. అతని వెనకాలే మగపిల్లలంతా వచ్చారు. వాళ్లమధ్య జరుగుతున్న చర్చలు సావిత్రికి తెలుసు. అందుకే గొడవపడద్దన్నట్టు చూచాయగా అందర్నీ కళ్లతో హెచ్చరించి ఏదో పనున్నట్టు అక్కడినుంచీ వెళ్ళిపోయింది.
“శాంతీ! నీకూ మీ ఆయనకీ కలిపి ఎంత వస్తుందే నెలకి?” అడిగాడు కమలాకర్ ఉపోద్ఘాతంగా. అదిప్పుడు ఎందుకో అర్థంకాకపోయినా శాంతి జవాబిచ్చింది
“అందరికీ ఎలా వస్తాయో మాకూ అంతే పెదనాన్నా! ” అంది.
“ఉద్యోగాలు మనకి ఆధారంగానీ పెద్దలు వదిలి వెళ్లిన ఆస్తులు కాదు”
“…”
“అంతా మనని ఆస్తిపరులంటారు. పెద్దింటివాళ్ళంటారు. ఆ పేరు తెచ్చుకోవడంకోసం, తెచ్చుకున్నదాన్ని నిలబెట్టుకోవడంకోసం మా నాన్న అంతా తగలేసాడు. శ్రీధర్‍గాడి చదువు… ఆరోజుల్లో మెడిసిన్ అంటే చాలా ఖర్చుతో కూడిన చదువు. ఉమ్మడిలో సాగింది. తర్వాత వాడి వైద్యం, చావు…”
శాంతికి చూచాయగా అర్థమైంది, అతను దేని గురించి మాట్లాడబోతున్నాడో.
“అప్పట్లో భూమికి పెద్దగా విలువ లేదు. డబ్బు కావాలంటే ఎకరాలకు ఎకరాలు అమ్ముకోవడమే. ఇప్పటికీ పల్లెటూర్లలో భూమికి విలువ లేదు. పంటలు పండవు. ఏడాదంతా కష్టపడి వ్యవసాయం చేస్తే లాభం మాట అటుంచి పెట్టిన పెట్టుబడి తిరిగొస్తే గొప్పమాట. మా తాత వదిలిన వందెకరాలూ మా నాన్న చేతిలోనుంచి దాటి మా చేతికి వచ్చేసరికి నలభయ్యకరాలైంది. మీ నాన్న చదువుకైంది పోను మా అందరితో సమంగా నీకూ వాటా వేసామనుకున్నా నీ పెళ్ళికి మూడెకరాలు అమ్మాడు అన్నయ్య. ఆ డబ్బు నీ దగ్గరే ఉంది. ఇంక మిగిలింది… ఇంతప్పటినుంచి నువ్వు ఇక్కడే పెరిగావు. ఏ ఖర్చూ లేకుండా ఇంతదానివవ్వవుకదా?” అని ఇంకా ఏదో చెప్పబోతుంటే ఆపి,
“నా ఖర్చుతోనే నేనీ ఇంట్లో పెరిగానన్న ఒక్కమాట చాలు పెద్దనాన్నా, నాకు” అంది చిరునవ్వుతో. అందరి ముఖాలూ మాడిపోయాయి.
“నాకు పెద్దనాన్న ఇచ్చింది చాలు. ఇంక ఎందులోనూ భాగం అక్కర్లేదు. స్టాంప్ పేపర్ తెచ్చిస్తే సంతకం చేస్తాను” అంది. ”
కమలాకర్ స్టాంపు కాగితంమీద రాయించి తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ వూరి సర్పంచి, మరికొందరి సమక్షంలో తనకి తండ్రి వాటా ఆస్తి ముట్టిందని రాసి ఇచ్చింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆమె తిరుగు ప్రయాణమైంది. గుండె బరువెక్కింది. ఎలాంటి మమకారాలూ మిగిలిలేవు.
ఆ ఇంటితో తనకి రుణం తీరిపోయింది. తన తండ్రి పుట్టి పెరిగిన ఇల్లు. ఆ ఇంటి వాసాలమీద మగపిల్లలు వాళ్ల పేర్లు సుద్దముక్కలతో రాసుకున్నారు. అవింకా అలానే ఉన్నాయి. అందులో శ్రీధర్ పేరూ ఉంది. తన తల్లి ఆ ఇంట్లో కొన్ని సంతోషపు రోజులని గడిపింది. కొన్ని అందమైన కలలు కంది. ఆ కలలు కొలువున్న ఆమె కళ్ళ వైభవాన్ని ఆ ఇంటిగోడలు చూసి ఉంటాయి. ఆమె కుమిలికుమిలి ఏడ్చీ ఉంటుంది. ఆ దుఃఖం నాలుగుగోడలమధ్య నిక్షిప్తమై ఉంటుంది. రేపెప్పుడో కమలాకర్ పెద్దనాన్న ఇంటిని కూలగొట్టించి మళ్లీ కట్టిస్తాడు. అప్పుడు ఈ జ్ఞాపకాలు మిగలవు.
తను… తన బాల్యం అంతా ఇక్కడే గడిచింది. తనూ ఆడింది, పాడింది. తనున్నంతవరకు జ్ఞాపకాలు తన గుండెల్లో కదులుతూనే ఉంటాయి.
ఒక సన్నివేశం గుర్తు వచ్చింది. ఎండాకాలం సెలవుల్లో అత్తయ్యలు, వాళ్ల పిల్లలు అంతా వచ్చేవారు. ఆడపిల్లలంతా కూర్చుని చింతపిక్కలు, గచ్చకాయలు, తొక్కుడుబిళ్ళలాంటి ఆటలన్నీ ఆడేవారు. పొద్దుటినుంచి సాయంత్రంవరకు అదే పని. సాయంత్రం కాగానే అత్తలు పెద్దమ్మలు ఎవరి పిల్లలని వాళ్లు పిలుచుకునేవారు. స్నానం చేయించి తినడానికి ఏవైనా పెట్టి జడలేసి తలలనిండా మల్లెపూలు పెట్టి,” రోజంతా ఆటలేనా? కాసేపు చదువుకోవాలి. లేకపోతే వచ్చిందంతా మర్చిపోతారు” అని కూర్చోబెట్టి చదివించేవారు. తనుమాత్రం ఒక్కర్తీ రాత్రైనా అలాగే ఆడుకుంటూ కూర్చుని ఆఖరికి అక్కడే నిద్రపోయేది. ఎవరైనా లేపి అన్నం తినమంటే తినేది. లేకపోతే లేదు.
ఆరోజులు గుర్తురాగానే వికలమైంది శాంతి మనసు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గుండె చిక్కబట్టినట్టయింది. తను ఈ ఇంటికి పరాయిది. తనని ఎవరూ ప్రేమగా చూడరు. తనని చూడగానే తల్లి చేసిన పనికి జవాబు చెప్పవలసిన బాధ్యత నెత్తిమీద పెట్టాలనిపిస్తుంది. తన తండ్రి వాటాగా రావలసిన ఆస్తికి చెల్లు చెప్పి అన్ని మమకారాలనీ తుంచేయాలనిపిస్తుంది.
ఇంటికి రాగానే తల్లి ఒడిలో పడి ఏడ్చేసింది. ఆమెను చూసి తల్లడిల్లిపోయింది కిరణ్మయి.
” వద్దంటుంటే వినకుండా వెళ్లావు. ఇప్పుడిలా బాధపడుతున్నావు. వాళ్లకి నువ్వు ఏమవుతావని? ఎప్పుడో చచ్చిపోయిన తమ్ముడికి కూతురివి. బామ్మ కూడా పోయింది. బంధం పలచబడలేదూ? నీవైపు నిలబడి మాట్లాడడానికి నేను కూడా లేను. పోతే పోనీవే! అంతా వాళ్ళనే కట్టుకుని ఊరేగనివ్వు. అక్కడో గదో, చారెడు భూమో వాళ్ళు ఇస్తే మాత్రం ఏం చేసుకుంటావు? దానికోసం వెళ్ళి వాళ్లతో గొడవపడుతుంటావా? పడ్డమాటలూ, అనుభవించిన హింసా చాలవా? ఐనా ఇక్కడ నీకేం తక్కువ?” అని కోప్పడింది.
” కాదమ్మా! అన్నేళ్లు నేను ఆ ఇంట్లో పెరిగాను. నేనెప్పుడూ నోరుతెరిచి మా నాన్న డబ్బు ఏదని అడగలేదు. వాళ్లంతట వాళ్లు ఎందుకు లెక్క చెప్పాలి? అది కూడా దొంగ లెక్కలు ఎందుకు చెప్పాలి? ఒక్కళ్ళకికూడా అనిపించలేదా, నేనూ ఆ ఇంట్లోని మనిషినే అని? వాళ్ల పిల్లల్లాంటిదాన్నే అని. వాళ్ళెవరికీ అవసరం లేని లెక్కలు నాకెందుకు చెప్పాలి?” రోషంగా అంది. అవి బయటికి వినిపించే మాటలు మాత్రమే. దాన్నిమించి అవ్యక్తంగా ఒక దిగులు ఉంది. అది ఆమెని తినేస్తోంది. తను ఈ కుటుంబానికి చెందదు. ఆ కుటుంబం తనతో ఉన్న నామమాత్రపు అనుబంధాన్ని కూడా తుంచివేసింది. ఇంక తన వునికి ఎక్కడ? తన మూలాలు ఎక్కడ? గాల్లో వేలాడుతున్న మనిషా తను? ఎడతెగని ఆలోచనలతో సతమతమైపోతోంది.
ఎంతో బలమైన పునాదులమీద ఏర్పడిన కుటుంబాలుకుకూడా ఒక్కొక్కసారి ఎండపొడ సోకిన మంచుబిందువులా కరిగి గాల్లో కలిసి అదృశ్యమైపోతాయి. వాటి వునికి ఆనవాలుకికూడా వుండదు. ఆ కుటుంబాలకి చెందిన వ్యక్తుల జ్ఞాపకాలలో ఏ అట్టడుక్కో జారిపోయి అప్రధానంగా వుండిపోతాయి. ఒక్కోసారి అలాంటి కుటుంబాలలో శాంతిలాంటి పిల్లలు వుంటారు. తల్లికుటుంబంలోనో తండ్రికుటుంబంలోనో భాగం కావటమే తప్ప వారికంటూ స్వంత కుటుంబం, కాళ్ళు ఆన్చుకుందుకు స్వంతనేలా వుండవు. అదొక పోరాటం. దాన్ని యిప్పుడు శాంతి ముమ్మరంగా చేస్తోంది.
“కొన్ని రోజులు సెలవు పెట్టి ఎటైనా తిరిగి రండి భాస్కర్! మార్పుగా ఉంటుంది” అని సూచించింది. అతను సరే అనగానే కులుమనాలికి టికెట్స్ తెప్పించింది. హాలిడే రిసార్ట్‌లో గెస్ట్‌హౌస్‍కూడా బుక్ చేసింది. ఆమెకి శాంతిపట్ల ఉన్న ఈ కన్సర్న్ చూసి భాస్కర్ చలించిపోయాడు. తననికూడా ఎంతో ప్రేమగా కొడుకుని చూసినట్టు చూస్తుందనే విషయం మొదటిసారిగా అనిపించింది. ఆమెపట్ల గౌరవం పెరిగింది. ఇదివరకు అంతా అంటీముట్టనట్టు ఉండేవాడు. ఇప్పుడు పూర్తిగా వాళ్ల కుటుంబంలో కలిసిపోయాడు.
….
మధు చదువు పూర్తయింది. ఉద్యోగం కూడా వచ్చింది. గోపాలకృష్ణ స్టూడెంటు, ప్రహ్లాద ఇష్టపడి చేసుకున్నాడు. మూడేళ్లు హాయిగానే ఉన్నారు. తర్వాత గొడవలు… కొన్ని అసహజమైన పరిస్థితులు ఉన్నప్పుడు మామూలుగా అనుకునే విషయాలుకూడా గొడవలకు దారితీస్తాయి.
ప్రహ్లాద స్నేహితుడు రఘు. అతనికి పెళ్లి అయింది, ఇద్దరు పిల్లలు. కేన్సర్తో పోయాడు. అతడి భార్యకి ఉత్తరోత్తరా పాతికలక్షలకు పైగా బెనిఫిట్స్ వచ్చాయి. అవి తీసుకుని పిల్లల్ని తీసుకుని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. మళ్లీ పెళ్లి చేసుకుంటుందేమోనని ప్రహ్లాదకి అనుమానం. పిల్లలు ఏమైపోతారు? తన స్నేహితుడి తల్లిదండ్రులేమవుతారు? ఇవి అతన్ని భయపెట్టి, బాధపెట్టిన విషయాలు.
“చిన్నవయసులోనే భర్తని కోల్పోవటం అన్నిటికన్నా పెద్ద బాధ. ఆమె తల్లి. పిల్లల బాధ్యత ఆమెకి తెలియదా?” అంది మధు.
అప్పుడు నోరు జారాడతను. శాంతి జీవితాన్ని ఎత్తి చూపాడు. దానిమీద ఇద్దరూ దెబ్బలాడుకుని రెండేళ్లు విడివిడిగా ఉన్నారు. ఆ తర్వాత కాంప్రమైజ్ అయ్యారు వాళ్లంతట వాళ్లే.

మానస బీటెక్ చదువుతున్నప్పుడే ప్రేమలో పడింది. కానీ ఎమ్‍టెక్ పూర్తయ్యేదాకా ఎవరికీ చెప్పలేదు. ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ల ప్రాజెక్టుల ద్వారా అమెరికా అవకాశం ఒక్కసారే వచ్చింది. అప్పుడు అతన్ని పరిచయం చెయ్యాలని ఇంటికి తీసుకువచ్చింది. ఆ సమయంలో శాంతి అక్కడే ఉంది. కిరణ్మయి లోపల్నుంచి వచ్చేలోపు వాళ్ళిద్దరి పరిచయాలూ అయిపోయాయి.