వేదవతి ఆలోచనల్లో ద్వంద్వప్రవృత్తి కనిపించింది బబ్లూకి. ఆవిడకి సమాజం, సాంప్రదాయాలు మారాలి… ఆవిడకి బాధ కలిగించనంతవరకుమాత్రమే. పదోరోజుగురించీ కర్మకాండలగురించీ విమర్శించిన ఆవిడ వితంతువివాహాన్ని సమర్ధించలేకపోతోంది. అలా సమర్థించకుండా ఉండేందుకు నెపాలు వెతికి కిరణ్మయిగారి ప్రవర్తనమీద బురదజల్లుతోంది. అవి చాలా స్థిరమైన అభిప్రాయాలు. నమ్మకాలు. వాటిలోంచి ఆవిడని బయటికి తీసుకురావడం బహుశా సాధ్యపడకపోవచ్చు. తల్లిని కావాలనుకోవాలా వద్దనుకోవాలా అనేది అతని ప్రస్తుతసమస్యగా మారింది.
“శ్రీధర్ మామయ్య పోయిన తర్వాత జరిగిన విషయాలలో మా అమ్మకి కొంత క్లారిటీ కావాలి” అన్నాడు బబ్లూ మానసతో, పూర్తిగా విషయం చెప్పకుండా. ఎవరి అంతరంగాలలో ఉన్న భావోద్వేగాలని వాళ్లు వ్యక్తపరచకుండా అలాగే ఉంచుకుని జరిగిన సంఘటనలని యథాతథంగా మాట్లాడుకుంటే మంచిదని అతని ఆలోచన.
“ఇప్పటిదాకా ఈ విషయాలని నేను ఎవరితోటీ చర్చించలేదు. ఎవరికీ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. నా అంత:సాక్షికి అనుగుణంగా మసులుకున్నాను. వేదవతితో మాట్లాడటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు”” మానస అతని మాటల్ని తనదాకా తీసుకొస్తే చెప్పింది కిరణ్మయి.
“నువ్వు ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా! నేను ఎవర్నో తెలియకముందే మేము ఒకరినొకరం ఇష్టపడ్డాం. తర్వాత జరిగిన సంఘటనలు ఆ ఇష్టాన్ని ప్రభావితం చేయకూడదు. తనపట్ల నా ప్రవర్తనలో ఎలాంటి తేడా లేనప్పుడు అతను నన్ను నన్నుగా స్వీకరించాలిగానీ ఈ విషయాలన్నీ ముడిపెట్టడం సమంజసం కాదు” అంది మానస.
కానీ కిరణ్మయికి తెలుసు, ఒక బంధం అంటూ ఏర్పడ్డ తర్వాత దాన్నుంచి బయటపడడం ఎంత కష్టమో! కొన్నినెలలుమాత్రమే కలిసి ఉన్న శ్రీధర్‍ని మర్చిపోలేక, గోపాలకృష్ణతో అయీ కాని పెళ్లిని కాదనుకోలేక తను, భాస్కర్‍తో ఏర్పడిన సంబంధాన్ని తెంచుకోలేక శాంతి, ప్రహ్లాదకి మూడేళ్లు దూరంగా ఉండికూడా తిరిగివెళ్ళిన మధు, ఇప్పటికీ జ్యోతినీ, పాపనీ గుర్తుతెచ్చుకుని బాధపడే గోపాలకృష్ణ… ఇవన్నీ తమ కుటుంబంలోనే సంభవించిన ఉదాహరణలు. కిరణ్మయి వేదవతిని కలవటానికి నిశ్చయించుకుంది. ముందుగా ఫోన్‍చేసి చెప్పింది కలవాలనుకుంటున్నట్టు.
“మనమధ్య ఇంకా కలుసుకోవాల్సిన చుట్టరికాలు మిగిలివున్నాయా? మా అన్నయ్యతోటే అన్నీ తెగిపోయాయి. నువ్వు నన్నెందుకు కలుసుకోవాలనుకుంటున్నావో అర్థమైంది. నీ కూతుర్ని బబ్లూకి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నీ ప్రయత్నాలు అనవసరం” అంది వేదవతి నిర్మొహమాటంగా.
“ఎదుటివారు చెప్పింది వినకుండా నీకు నువ్వే అన్నీ అనేసుకుంటే ఎలా? ఇద్దరం ఒకసారి కూర్చుని ఓపెన్‍గా మాట్లాడుకుంటే బావుంటుంది. నీ మాటలు బబ్లూద్వారా మానస వింటోంది. అది బాధపడుతోంది. వాళ్ల అనుబంధం బాగా దెబ్బతింటోంది”
“చెప్పాను కదా, మానసని వాడు చేసుకోడని”
“అది నిర్ణయించుకోవలసింది వాళ్ళిద్దరూ”
“నువ్వు అన్నిటికీ తెగించినదానివని పెద్దన్నయ్య అంటే ఏదో అనుకున్నాను. నిజమే!”
“శ్రీధర్ చెల్లెలివి కావటమే నీకు నాతో ఇలా మాట్లాడే అధికారం ఇచ్చిందనుకుంటా” కిరణ్మయి ఫోన్ పెట్టేసింది.
“వాళ్లు ఒక మగవాడికి కట్టుబడి ఉండే రకాలు కాదు. నేనెందుకు చెప్తున్నానో విను. సాంప్రదాయంపట్ల గౌరవం లేని ఇంట్లోంచి పిల్లని తెచ్చుకుంటే ఏదైనా తేడా వస్తే ఆ బంధాన్ని తెంచుకునే దిశగా ప్రయత్నిస్తారు తప్పిస్తే రాజీపడరు. నిలుపుకోరు. ఆ పిల్లని చేసుకుని నువ్వు సుఖపడవు” కచ్చితంగా అంది వేదవతి కొడుకుతో అతనింకా ఆశపడుతూ ఉండడం చూసి.
“వేదత్తతో నేను మాట్లాడనా?” అడిగింది శాంతి.
“వద్దక్కా! దయచేసి నా స్పేస్ నాకు వదలండి. సిఫార్సులతోటీ సంజాయిషీలతోటీ నింపకండి” అంది మానస.
అయినాకూడా బ్యాంక్ స్టేట్మెంట్‍కోసం తన దగ్గరికి వచ్చినప్పుడు బబ్లూతో మాట్లాడింది శాంతి. అలా మాట్లాడకుండా ఉండడం అనివార్యమైంది అతనే ఆ ప్రస్తావన తేవడంతో. సెక్షన్‍హెడ్ అనుమతి తీసుకుని అతనితో కలిసి క్యాంటీన్లో వెళ్లి కూర్చుంది.
“మా అమ్మ సంతానంలో మనోకి ఉన్నంత సాత్వికత ఇంకెవరిలోనూ లేదు. అటువంటి అమ్మాయిని కాదనుకుంటున్నావు” అంది ఆరోపణగా.
అతను తలదించుకున్నాడు.
“ఆవిడ చేసినది తప్పని అప్పటి కాలాన్నిబట్టి వాళ్లనుకోవచ్చు. కానీ మనంకూడా అదే మూసలో కూర్చుంటే ఎలా?” సూటిగా అడిగింది.
” అలాంటిదేమీ లేదు శాంతీ! అమ్మ దగ్గరే వస్తోంది సమస్యంతా” నిస్సహాయంగా అన్నాడు.
“ఈశ్వరరావు పెదనాన్న గురించి నీకు మిమ్మల్ని ప్రేమగా చూసే మేనమామగానే తెలుసు. అలాగే కమలాకర్ పెదనాన్న గురించి. వాళ్ల గురించి మీకన్నా నాకు ఎక్కువ తెలుసు. అదే ఇంట్లో నేను పెరిగాను. పెద్దపెద్దనాన్న ఉమనైజర్. రెండోపెదనాన్నకి మరో కుటుంబం ఉంది. అలాంటివాళ్లు ఉన్న ఇంట్లో మా అమ్మకి రక్షణ ఉంటుందా? సమాజంలో అలాంటివాళ్ళు చాలామంది. స్త్రీని ఒంటరిగా ఆమె బతుకు ఆమెదని వదిలేస్తారా? లేదు. అన్ క్లెయిమ్‍డ్ ప్రాపర్టీలాంటిది వంటరి స్త్రీ. ఆమెమీద అందరికీ హక్కు ఉన్నట్టే అనిపిస్తుంది. ఇటువంటి విషయాలు ఎవరూ పైకి వివరించి చెప్పుకోరు. అలా తనని చూడకూడదని పోరాడుతున్నది స్త్రీలుగానీ మగవారి దృక్పథంలో ఎలాంటి మార్పూ లేదు. ఆడవారుకూడా రెండుగా విడిపోయారు… కష్టాలు పడేవాళ్లు, కష్టం అంటే తెలియనివాళ్ళు… “
బబ్లూకి కూడా మేనమామల గురించి చూచాయగా తెలుసు. ఆ లోపాలతో సహితంగా అతను వాళ్లని ప్రేమించాడు. తనవాళ్ళనుకున్నాడు. శాంతి చెప్పిన కోణంలోకి అతను ఎప్పుడూ వెళ్ళలేదు. ఆ అవసరం రాలేదు. బయట ఎలాంటి వేషాలు వేసినా ఆ ఇంటి ఆడవాళ్ళకి ఎటువంటి మర్యాదాలోపం జరగలేదు. అది కొన్ని వాస్తవాలని మరుగుపరిచింది.
“ఇరవయ్యేళ్ళకో పాతికేళ్ళకో… అసలే వయసుకో ఒక వయసుకి భర్త పోతే ఒక స్త్రీ వంటరిగా ఉండద్దనుకుంటే అది ఆమె నిర్ణయం. దాన్ని వప్పుకోకుండా ఎందుకలా విపరీతంగా కోరుకుంటున్నాం మనం? మరో వ్యక్తి మనకళ్ళముందు దిగులుగా తిరుగుతూ వుంటే ఎలా సంతోషంగా వుండగలుగుతున్నాం? మా నాన్న పోయాక మనింట్లో ఏ శుభకార్యాలూ మానలేదు. పెళ్ళిళ్ళూ, పండుగలూ, వేడుకలూ, విందులూ ఏవీ ఆగలేదు. కన్నతల్లికదా బామ్మ, ఆవిడకి కొడుకుపోయినందుకు ఎలాంటి దు:ఖం లేదా? అలా ఎలా అన్నిటినీ చేసుకోగలిగింది? ఆవిడది ప్రేమకాదా? కుటుంబంలోని ఒక వ్యక్తి… చిన్నప్పట్నుంచీ తమతో కలిసి పెరిగిన వ్యక్తి చనిపోతే మీ అమ్మ అలంకారాలన్నీ చేసుకుని ఏడాదికల్లా పెళ్ళిపీటలమీద ఎలా కూర్చుంది? ఆమెకి ప్రేమ లేదా? మా నాన్న మరణం వీళ్ళెవరి జీవితాల్లోనూ తేని మార్పు మా అమ్మ జీవితంలో ఎందుకు తేవాలి? చేసిన పాపాలన్నీ చేసి గొర్రెపోతుని బలిస్తే అన్నీ కొట్టుకుపోయాయనుకున్నట్టు అందరి దు:ఖం మా అమ్మమీద రుద్దేస్తే సరిపోతుందనుకున్నారా? ఒక పిల్లని నేను పుట్టాను. మా అమ్మకి ప్రతిబంధకంగామాత్రమే నేను బతకాలని ఎందుకు అనుకున్నారు? ఎలాంటి కుటుంబంలో బతుకుతున్నాంరా, మనం? ఒక మనిషికి కష్టమో, సమస్యో వస్తే తలో చెయ్యీవేసి, అందులోంచీ బైటికి లాగాలని చూస్తారు, మనింట్లో అది లేదు. పెద్దనాన్న పోయినప్పుడు నా విషయంలో చూడలేదా? మీ అమ్మనుంచీ అంతకన్నా గొప్ప సంస్కారాన్ని ఎలా ఆశిస్తాలే?” అంది నిరసనగా.
“అనవే. నీకోపమంతా తీర్చుకో” అన్నాడతను.
“ఒడ్డుని పడ్డదాన్ని, నాకెందుకు కోపం? నీమీద జాలిగానీ. ఇప్పుడు మనోని నువ్వు కాదన్నావు. కొంతకాలం బాధపడుతుంది. అయితే దాన్నలా వదిలేయం. నచ్చజెప్పి ఇంకో మంచిసంబంధం తెచ్చి చేస్తాము. లేదా తనకే ఒంటరితనంనుంచి తప్పించుకుందుకని చేసుకోవాలనిపించవచ్చు. మరొకరిపట్ల మనసు రాగరంజితం కావచ్చు. అప్పుడు మీలాంటివాళ్లు దాన్నీ అంటారు, పెళ్లికిముందు ఎవరితోనో తిరిగింది, గ్రంథం నడిపిందని. అందుకని దాని సరదాలూ, సంతోషాలూ అక్కడితో ఆగిపోవాలా? ఏదైనా మన ఆలోచనా దృక్పథం మీద ఉంటుంది. నీకన్నా పెద్దదాన్ని, కష్టసుఖాలు తెలిసినదాన్ని. అర్థం చేసుకుంటావని చెప్తున్నాను” అంది శాంతి.
“సమస్య మా ఇద్దరి మధ్యనా కాదు ఉన్నది ” అన్నాడు.
“మొదటిసారి నన్ను చేసుకుంటానని పంతం పట్టినప్పుడూ, రెండోసారి తిరిగి నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకెళ్ళినప్పుడూకూడా భాస్కర్ తల్లి కొడుకు అభిప్రాయాన్ని ఇష్టమో కష్టమో గౌరవించింది. ఆవిడ పెద్దగా చదువుకోలేదు. ఆదర్శాలు, అభ్యుదయాలు అర్థమవుతాయని అనుకోను. మరి వేదత్త చదువుకుంది. తను ఇలా ప్రవర్తించడం నాకు ఆశ్చర్యంగా ఉంది”
“భాస్కర్‍గారి తల్లికి ఈ విషయంలో ఉన్నది సాంప్రదాయక వైరం. మా అమ్మది వ్యక్తిగత వైరం”
“అదే ఎందుకు? మా అమ్మ మీ అందరికీ చేసిన ద్రోహం ఏమిటి? పోరా! అవకతవక మనుషులు మీరంతా. నిన్ను చేసుకోకపోవడమే మనోకి మంచిది” అంది విసుగ్గా.
అతను వెళ్ళిపోయాడు. శాంతి ఈ సంఘటన మానసకి చెప్పింది.
“ఎలా భరించావక్కా, ఇలాంటి మనుషుల్ని ఇన్నేళ్లపాటు?” బాధతో మానస కళ్ళు తడయ్యాయి. “బబ్లూ ఎవరో తెలిసిన ఉత్తరక్షణమే నేను అతన్ని వద్దనుకున్నాను. అతనితో పెళ్లంటే అతను ఒక్కడి దగ్గరా ఆగదు. అతని తల్లిదండ్రులు… ముఖ్యంగా తల్లి… ఆవిడ బంధువులు… వీళ్లందరిమధ్యా అమ్మ దోషిలా నిలబడాలి. మా పెళ్లి జరిగినా జరగకపోయినా అమ్మని రీచ్ అవ్వడానికి వాళ్లకి దారి దొరుకుతుంది. అది అవసరమా? కాదు. అందుకే నేను వద్దనుకున్నాను. అతను దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. వదిలేసేయ్” అంది.
శాంతి మానసని దగ్గరికి తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టుకుంది.
“రామచంద్రరావుతో నేను మాట్లాడాను. నాకు తెలుసతను. కొడుకు ఇష్టానికే అంతా వదిలేశాడు. అతని భార్యకే అభ్యంతరాలు” అన్నాడు గోపాలకృష్ణ.
“నాన్నా! దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టండి. నేను కావాలో వద్దో తేల్చుకోవలసింది బబ్లూ. తన తల్లిని ఒప్పించి, చేసుకోబోయే అమ్మాయి తల్లిదండ్రుల్ని గౌరవించేలా సంస్కరించుకోవడం అతని బాధ్యత. మేము పుట్టని క్రితం ఏవేవో జరిగాయి. వాటికి బాధ్యత మాది కాదు. అయినాకూడా శాంతికీ కరుణ పిన్నికీ శిక్షలు పడ్డాయి. ఇంకా ఏం కావాలి వాళ్లకి?” అంది మానస.
ఆమె ఒంటరిగానే స్టేట్స్ వెళ్లిపోయింది. బబ్లూకూడా వెళ్ళాడు. కలిసి వెళ్లాలనుకుని కలలుగన్న ఆ ఇద్దరూ వాళ్ల కలల్ని కరిగించుకుని విడివిడిగా వెళ్లారు. కిరణ్మయి బాధపడింది. గోపాలకృష్ణ పైకి తేలలేదు.
ఆ ఇద్దరూ మళ్ళీ కలుసుకోలేదు.
….
శాంతికి పనిపట్ల గల నిబద్ధతా, భేషజాలు ఎరుగని పల్లెటూరి ప్రవర్తనా వాళ్ల మేనేజరుకి బాగా నచ్చాయి.
“మీవారిని తీసుకుని మా ఇంటికి రామ్మా!” అని ఆహ్వానించాడు అభిమానంగా. అతను చైతన్య. కరుణ భర్త. ఇద్దరూ ఎవరు ఎవరో చైతన్య ఇంటికి వెళ్లేకగానీ తెలియలేదు. అక్కడ కిరణ్మయి పోలికలతో గాజుబొమ్మలా ఉన్న కరుణని చూసింది శాంతి. గుర్తుపట్టింది.
“ఎవరనుకుంటున్నారు బాబాయ్ నేను? శాంతిని. కిరణ్మయీ శ్రీధర్‍గార్ల కూతుర్ని” చెప్పింది వాళ్లు ఆశ్చర్యంగా చూస్తుంటే. కరుణ ఆమెని కిరణ్మయినే చూసినంత ప్రేమగా చూసుకుంది.
వాళ్లకి ఇద్దరు మగపిల్లలు. ఇద్దరూ హాస్టల్స్‌లో ఉండి ఇంజనీరింగ్ చదువుతున్నారు. పెళ్లయిన చాలాకాలానికి పుట్టారు. చక్కటి కుటుంబం, బాగా చదువుకుంటున్న పిల్లలూ ఉన్నా కరుణలో వెలితి. ఎవరైనా బలంగా పాతుకుపోయిన, పుట్టిననాటి మమకారాలని ఎలా చంపుకోగలరు? అంత కర్కశంగా ఎలా శాసించగలరీ మగవాళ్లు? అమ్మనీ నాన్ననీ తోబుట్టువులనీ పుట్టి పెరిగిన ఇంటినీ చూడాలన్న తపనని చంపుకోవడానికి ఎంత కష్టపడిందో పిన్ని! ఆమె మనసు ఆర్ద్రమైంది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.