సంగమం 35 by S Sridevi

  1. సంగమం 23 by S Sridevi
  2. సంగమం 25 by S Sridevi
  3. సంగమం 26 by S Sridevi
  4. సంగమం27 by S Sridevi
  5. సంగమం 28 by S Sridevi
  6. సంగమం 29 – by S Sridevi
  7. సంగమం 31 by S Sridevi
  8. సంగమం 32 by S Sridevi
  9. సంగమం 33 by S Sridevi
  10. సంగమం 34 by S Sridevi
  11. సంగమం 35 by S Sridevi

“నేను ఒక్కదాన్నే వస్తాలే కిరణ్! అన్నయ్య పక్కని నిలబడతాను. పిల్లలెందుకు? అందరిలో తేలికపడతారు” అంది ఉదయ అయిష్టంగా. కాదనలేక.
“వాళ్లని చులకనచేసే వాళ్ళెవరు? వాళ్ళేమైనా పై పిల్లలా?… అన్నట్టు కరుణా, చేతూ వాళ్ల పిల్లలుకూడా వచ్చారు. నువ్వొస్తావని ఎంతో ఎదురుచూస్తోందది. టికెట్స్ బుక్ చేసేస్తున్నాను… ఇంకేం చెప్పద్దు” అంది కిరణ్మయి.
మరీ పంతంగా ఉండలేకపోయింది ఉదయ. సరేనని ఫోన్ పెట్టేసింది.
“వెళ్లకపోతే బావుందమ్మా! అసూయ పడుతున్నామనుకుంటారు” అంది ఆమె పెద్దకూతురు శశి. అవునంది రెండోది జ్యోత్స్న.
అప్పటికప్పుడు అన్నీ సర్దుకుని బయల్దేరారు. వాళ్లని పికప్ చేసుకోవడానికి భాస్కర్‍తో కలిసి వెళ్ళాడు గోపాలకృష్ణ. ఎదురెళ్లి లోపలికి తీసుకెళ్ళింది కిరణ్మయి. లోపల అడుగుపెట్టగానే ఉదయని హత్తుకుపోయింది కరుణ. ఆ ప్రేమకి చలించిపోయింది ఉదయ. ఏళ్లుగా గడ్డకట్టుకుపోయిన మౌఢ్యం కరగడం మొదలైంది. చందూ తేలిగ్గా నిశ్వసించాడు.

“ఇలాంటి రోజు మళ్లీ చూస్తాననుకోలేదు. అందరం ఒకచోట కలిశాము”” అంది కిరణ్మయి. పెద్దవాళ్ళంతా ఒకచోట చేరారు. పెళ్లిపనులు తలా ఒకరు పంచుకున్నారు. ఒకవైపు చైతన్య, గోపాలకృష్ణ మరోవైపు ఇద్దరల్లుళ్లు… కిరణ్మయికి మనసంతా నిండిపోతున్నట్టుంది
అక్కడ హాల్లో శాంతి కొడుకు అమ్మతో మహా గొడవపడుతున్నాడు అన్నం తినడానికి. ముద్ద నోటిదాకా వచ్చాక తల తిప్పేసుకుంటున్నాడు. అమ్మ చేతిని నెట్టేస్తున్నాడు. లేచి ఒంగుని రెండుకాళ్లమధ్యనుంచి అమ్మను చూస్తున్నాడు. వాడిని కూర్చోబెట్టి రెండుచేతుల్నీ మణికట్టు దగ్గర కలిపి పట్టుకుని అతికష్టంమీద ఒక్క ముద్ద తినిపించగలిగింది శాంతి.
“పిల్లలకి అన్నం పెట్టడం శాంతిని చూసి నేర్చుకోవాల్సిందే. ఎంత ఓపిగ్గా పెడుతుందో! దానికి అసలు విసుగే రాదు” అంది మధు వాళ్ళిద్దర్నీ చూసి నవ్వుతూ.
భాస్కర్‍కి కొంచెం దూరంగా కూర్చుని ఉన్నారు వాళ్ళిద్దరూ. శాంతి ముఖం పక్కనుంచి కనిపిస్తోంది. చెవి జూకా వూగుతోంది. చిన్నపాయ జుట్టు చెంపమీదికి జారుతోంది. ముఖంలో వింత కాంతి. కార్తికేయంటే చాలా ప్రేమ శాంతికి. అమ్మకి కొడుకుమీద ప్రేమ లేకుండా ఉండదు. కానీ ఆమెది అసాధారణమైన ప్రేమ. చిన్నప్పటినుంచి తన గుండెల్లో నింపుకున్న ఒంటరితనాన్ని వాడితో పంచుకుంటోందనిపిస్తుంది భాస్కర్‍కైతే. తల్లీకొడుకుల మధ్య అతనుకూడా దూరమే.
తల్లిని బాధ పెట్టకూడదనో, ఆ ఇంట్లో ఒక సమస్యగా మిగలకూడదనో తనతో రాజీపడిందనిపిస్తుంది.
నిజమే! తను ఆమెని చాలా బాధపెట్టాడు. అంత కోపాన్నీ తిరస్కారాన్నీ తననుంచి చూశాక ఆమె మనసులో ప్రేమనేది ఎక్కడినుంచి పుడుతుంది? ఇప్పుడు మాత్రం తనకి ఆమే పంచప్రాణాలు. ఆ విషయం ఎప్పటికి గుర్తిస్తుందో!
“బావా! అక్కంత ముద్దొస్తోందా?” అతను తదేకంగా శాంతిని చూడటం గమనించి అల్లరిగా అడిగింది మానస.
“తనని అలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది మనో! తను కోల్పోయిన బాల్యాన్ని వాడితోపాటు అనుభవిస్తోందనిపిస్తుంది” తన మనసులో ఉన్న మాటని ఆమెకు చెప్పాడు. మానస కొంచెం లోతుగా చూసింది.
“అక్క అకారణంగా చాలా కష్టాలు పడింది బావా! ఇక్కడ అమ్మ కూడా సంతోషంగా లేదు. శాంతిని తలుచుకుని ఏడ్చేది. అన్నం తింటున్నా, మమ్మల్ని ముద్దుచేస్తున్నా ఏం చేస్తున్నా సగం మనసు వెతుకులాటలోనే వుండేది ఆవిడకి. ఒక్కొక్కరోజు తినే తినే కంచం ముందు నుంచి లేచి వెళ్లిపోయేది. నాన్నకి ఎవరైనా ఏడిస్తే ఓదార్చటం అసలే రాదు. పైగా శాంతికి అలా జరిగిందనే అపరాధభావనకూడా వుండేదనుకుంటాను. అమ్మనే కోప్పడేవారు. ఇద్దరిమధ్యా మాటలు ఆగిపోయేవి. ఎవరి గదుల్లో వాళ్ళు నిశ్శబ్దంగా ఉండిపోయి రెండు మూడు రోజుల తర్వాత చీకటిగుహల్లోంచీ ఆదిమానవుల్లా ఇవతలికి వచ్చేవారు. ఎవరం సంతోషంగా లేము. అంటే ఏడుస్తూ గడిపామని కాదు… ఏదో వెలితి. చుట్టూ ఉన్నవాళ్లుకూడా మమ్మల్ని కొంచెం వేరుగా చూసేవారు. అమ్మని నోములకీ వ్రతాలకీ పిలిచేవారు కాదు. అసలు తనే వాటికి వ్యతిరేకం అనుకో. అయినా మనం వద్దనుకోవడం వేరు, అవతలివాళ్ళు మనని వద్దనడం వేరు” చెప్పింది.
“మా పెళ్లి ఆగిపోయినరోజు రాత్రి శాంతి నన్ను రమ్మని కబురుచేసింది. ఈ అమ్మాయికి ఎంత తెగింపో అనుకున్నానుగానీ, ఆ రోజుని అటువంటి పరిస్థితుల్లో అంత రాత్రివేళ నాకోసం గంటసేపు ఎదురు చూస్తూ డాబా మీద ఒంటరిగా ఉండిపోయినా… అంత జరిగినప్పుడుకూడా ఎవరూ తనని పట్టించుకోలేదన్న విషయం నాకు తోచలేదు. ఇప్పుడు తలుచుకుంటే గుండె ఝల్లుమంటుంది. నిజంగా నేను తెలివితక్కువవాడిని. అర్థంలేని కోపంతో తనతో తగవుపడ్డాను” బాధపడ్డాడు.
“పోనీ బావా! అవన్నీ గడిచిపోయిన రోజులు. అందరం వడ్డున పడ్డాం. ఎలాంటి స్పర్థా లేకుండా పుట్టే ప్రేమ తాటాకుమంటలాంటిదట” అని నవ్వింది.
“నీకెలా తెలిసింది? ఎంటెక్‍లో సబ్జెక్టుగానీ ఉందా?” అతను పరిహాసం చేశాడు.
ఇద్దరూ ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు, బయట ఆటో ఆగిన శబ్దం అయింది. ఎవరా అని చూస్తే సింధు, భర్త. వాళ్లతోపాటుగా శ్రీను.
“వీడెక్కడ కలిచాడు మీకు?” తమ్ముని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఆడపడుచుని పలకరించింది శాంతి. ఆమె భర్తనుకూడా పలకరించి అత్తమామల క్షేమసమాచారాలు అడిగింది. వాళ్లు రానందుకు ఆమె మనసులో ఎక్కడో చిన్నగా గుచ్చినట్టు అనిపించింది. పైకి వ్యక్తం చెయ్యకుండా నవ్వుతో దాన్ని కప్పేసింది.
“స్టేషన్లో కలుసుకున్నాం. ఒకే ట్రైన్ దిగాము” శ్రీను చెప్పాడు. అతను హాస్టల్లో ఉండి బీటెక్ చదువుతున్నాడు.
“నీకన్నా పొడుగే, నేను” అన్నాడు శాంతి భుజానికి తన భుజం ఆనించి చూసుకుంటూ.
“పోరా! ఇప్పటికి నా అంత అయ్యావు” అంది శాంతి వెక్కిరింతగా.
వాళ్ళిద్దరికీ ఎప్పుడు అదే గొడవ.
వాళ్ళు ముగ్గురూకూడా రావడంతో ముఖ్య అతిథుల జాబితా పూర్తయింది. కిరణ్మయి నిర్మిమ్చుకున్న చిన్న కుటుంబం అది.

ఇంచుమించు ఒక వయసువాళ్ళైన ఏడుగురు ఆడపిల్లలు ఒకచోట చేరడంతో ఒకటే సందడిగా ఉంది. మగపిల్లలు పనిలో పనిగా క్రికెట్ ఆడేసుకుంటున్నారు.
పెళ్లిలో రకరకాల సందర్భాల్లో కట్టుకోవడానికి పట్టుచీరలు, వర్క్‌చీరలు, లెహంగాలు చాలా కొంది కిరణ్మయి. సింధుని కూడా పరాయిగా చూడలేదు. చందూ పిల్లలు మొదట కొంచెం న్యూనతపడ్డారు. సరిగ్గా కలవలేకపోయారు. కానీ చుట్టూ ఉన్న కోలాహలం, సందడి వాళ్లని కలిపేసుకున్నాయి.
మెహేందీ, సంగీత్ ఫంక్షన్లు… పెళ్లికూతుర్ని చేయడం… పెళ్లి… ఆకాశంలో ఉన్న తారకలన్నీ దిగివచ్చి పెళ్లి వేదికని అలంకరించినట్టుంది. ఆ అందరి మధ్యనీ పెళ్లి అలంకరణలో ప్రత్యేకంగా ఉన్న తన తారకని ఆరాధనగా చూసాడు సుధీర్. అదే సమయానికి కళ్ళెత్తి చూసిన మానస పెదాల మీద చిరునవ్వు మెరిసింది. అది పలచటి వెన్నెలలా అతని మనసంతా నిండిపోయింది.

పెళ్లయ్యాక ఇంకొక మూడురోజులే వుంది మానస ఇండియాలో. పెళ్లికి ముందే సెలవు పెట్టింది కాబట్టి ఇంకా ఉండే వీలులేకపోయింది. మొదటిసారి అమెరికా వెళుతున్నప్పుడు బబ్లూతో బంధాన్ని తెంచుకునేందుకు బాధ. ఇప్పుడున్నది సుధీర్‍తో ప్రేమను పంచుకుని తనవాళ్లకి దూరంగా వెళుతున్నందుకు.
పెళ్లవగానే వెళ్తానని బయలుదేరిన ఉదయని బలవంతంగా ఆపింది కిరణ్మయి. సెలవు లేదని చందూ వెళ్లిపోయాడు.
“మనం తీరిగ్గా కలుసుకుని ఎంత కాలం అయింది? మాట్లాడుకున్నట్టే లేదు. నాలుగురోజులు ఉండు వదినా! ” అని బలవంతపెట్టింది. కరుణ మళ్ళీ వస్తానని వెళ్ళింది.
మానసని పంపించాక మిగిలినవాళ్ళందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. శీను కూడా వెంటనే వెళ్ళిపోయాడు. శాంతికి ఇంకా సెలవు మిగిలి ఉండడంతో శశినీ జ్యోత్స్ననీ తన ఇంటికి తీసుకెళ్లింది. అప్పుడు చిక్కింది వదినామరదళ్ళకి మాట్లాడుకునే తీరిక.
“వీళ్లిద్దరూ శాంతికన్నా పెద్దవాళ్లు. శాంతికి పెళ్లి చేసి వాళ్ళు పంపించారు. తర్వాతి పెళ్లి పిలుపు అన్నయ్య దగ్గరనుంచి వస్తుందనుకున్నాను. రాలేదు. ఆరేళ్లు గడిచాయి. మధు చదువయింది. ఉద్యోగం వచ్చింది. సంబంధమూ వచ్చింది. ఆ అబ్బాయి అసలు ఆగలేదు. పెళ్లి చేస్తారా చేయరా అన్నట్టు కూర్చున్నాడు. అన్నీ నప్పిన సంబంధం, ఆగడమెందుకని చేసేసాము. ఇంకో రెండేళ్లు… మనో పెళ్లి…. మీ అన్నయ్య పిల్లలకికూడా దాదాపుగా అయిపోయాయి…. ఏమైంది వదినా? ఎందుకు మీ పిల్లలకి కుదరడం లేదు?” సూటిగా అడిగింది కిరణ్మయి.
ఉదయ మాట్లాడలేదు.
“మరో పెళ్లివైపు నన్ను డ్రైవ్ చేసిన ఆ స్పిరిట్ ఏమైంది నీలో?”
“…”
” ఆరోజు జరిగింది తప్పని ఇప్పుడు నీకనిపిస్తోందా?”
“ఎప్పుడో జరిగినది ఇప్పుడు దేనికిలే, కిరణ్?” ఉదయ మాట దాటేసే ప్రయత్నం చేసింది. అందులో ఆమె అప్రసన్నత కనీ కనిపించకుండా ఉంది.
“నేను చెప్పనా పోనీ? మా ఇల్లు చూస్తే సరైనదనిపిస్తోంది. మీ ఇంటిని చూసుకుంటే అలాంటి పొరపాటు ఎందుకు చేశానా అనిపిస్తోంది. అంతేనా, వదినా? నన్నూ నిన్నూ ఇలా వేరుచేసి ఎప్పటినుంచీ చూస్తున్నావు? మనమధ్య ఇంత దూరం ఎందుకు పెరిగింది?”
“తప్పో ఒప్పో నేను చెప్పలేకపోతున్నాను కిరణ్! మీ పెళ్లి నేను ఒక్కదాన్నే చేసింది కాదు. పెద్దవాళ్ళందరూ నిలబడి ప్రోత్సహించారు. నువ్వు సంతోషంగా ఉన్నావంటే నాకూ సంతోషమే. ..”
“నేను సంతోషంగా ఉండడం అంటే నేనొక్కదాన్నీ బావుండి, మీరు బాధపడటం మాత్రంకాదు”
ఉదయ తలదించుకుంది. ఎక్కడో అసంబద్ధత ఉంది. అదెక్కడో అర్థం కావట్లేదు. కిరణ్ రెండోపెళ్లి చేసుకోవడాన్ని తన పుట్టింట్లో ఎవరూ సమర్ధించలేదు. పైగా చందూని వెనక్కి లాగి ఆపనందుకు తనని చాలా నిందించారు.
“మీ చిన్నాడబిడ్డకికూడా పెళ్లి చేసేసారు మీ అత్తవారు. మీ ఖర్మ మీదని వదిలేశారు. కిరణ్మయి వయస్సులో ఉన్నది… తొందరపడిందేమో! పెద్దవాళ్లు బుద్ధి చెప్పక్కర్లేదా? పెళ్లి చేసినంత మాత్రాన తప్పు వప్పైపోతుందా? నీకు ఇద్దరు ఆడపిల్లలు… మేనత్త ఇలా అంటే వాళ్లనెవరు పెళ్లి చేసుకుంటారు?” అని చాలా భయపెట్టారు.
ఆ ప్రశ్న మామగారుకూడా అడిగారు. కానీ అప్పుడు భయం అనిపించలేదు. వీళ్లంతా ఉన్నారుకదా అనే ధైర్యం ఉండింది. తల్లీవాళ్లూ తలో మాటా అనేసరికి ఆ ధైర్యం సడలిపోయింది. వెన్నెముక లేని జీవిలాగ ఊగిసలాడి చివరికి వాళ్లమీద వాలిపోయింది. తన తల్లిదీ అన్నదమ్ములదీ ప్రేమే. అది కాదనలేని సత్యం. పోతే కిరణ్మయి పెళ్లి అనే సంఘటనని వాళ్ళు చూసిన కోణం వేరు. అందులో ఆదర్శం లుప్తమైంది.
“అందరం కలిసి ఈ పని చేశాము. ఫలితాన్ని అందరం కలిసి అనుభవించాలి… మంచైనా చెడైనా. నువ్వెందుకు దూరం జరిగావు?” సూటిగా అడిగింది కిరణ్మయి.
ఉదయదగ్గిర జవాబు లేదు.
“ఇలా అంటున్నానని మరోలా అనుకోకు. మీ అమ్మావాళ్లు పెద్దవాళ్లు. పల్లెటూరివాళ్ళు. మనలా ఆలోచించలేరు”
మళ్ళీ మౌనమే శరణ్యమైంది ఉదయకి.
“మా అమ్మాయి ఆడపడుచు… భర్తపోయాడు… మళ్ళీ పెళ్లి చేసుకుందని అందరికీ చెప్పుకున్నారు. పిల్ల నిచ్చుకున్నాం కదా, ఇష్టం లేకపోయినా మాకు తప్పదు. ఆవిడ మా ఇంటికి రాదు- అంటారు మీ అన్నయ్యల పిల్లలకి సంబంధాలు చూసేటప్పుడు. అవే మాటల్ని వీళ్ళ విషయంలోనూ అంటారు. అక్కడ నేను వాళ్లకి దూరం. ఇక్కడ వీళ్ళకి మేనత్తని. నేను కనిపించను. ఎలాంటిదాన్నో తెలీదు. నా పెళ్ళికి దారితీసిన పరిస్థితులు ఏమిటో తెలీదు. నా పోలికలు వస్తాయిమోనని భయపడతారు. వదినా! నేను మీ వాళ్లని తప్పుపట్టను.”
ఉదయకితేడా స్పష్టమైంది.
“పిల్లలకి సంబంధాలు నా సమక్షంలో వెతకండి. మమ్మల్ని పరిచయం చెయ్యండి. అవతలవాళ్ళ మనసులో అనుమానాలకి అవకాశం ఇవ్వండి. వ్యవహారాలు పారదర్శకంగా లేనప్పుడే సమస్యలు తలెత్తుతాయి” చాలా స్పష్టంగా చెప్పింది కిరణ్మయి.
ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. చాలామంది పిల్లలు ఆలస్యంగానే చేసుకుంటున్నారు. మాకు చాలామంది పరిచయస్తులు. ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే వుండి కుటుంబాన్ని చూసుకుంటే చాలని వెతుక్కుంటున్నవాళ్ళుకూడా వున్నారు. పిల్లలిద్దరూ చక్కని చుక్కలు. వాళ్ళకేం తక్కువ? ఏడాదిలోపల ఇద్దరికీ కలిపి ఒకేసారి చేసేద్దాం” అంది కిరణ్మయి.
“ఒక్కొక్కసారి ఏది మంచో ఏది చెడో తెలియకుండా అయిపోతుంది కిరణ్! నువ్వన్నట్టు మా అమ్మవాళ్ళు చూసే కోణం వేరు, మనం ఉన్న పరిస్థితి వేరు. రెండిటికీ సమన్వయం కుదరలేదు. నేను వాళ్లు చెప్పిందల్లా విన్నాను. నేనేవో కష్టాల్లో పడిపోయాననే నమ్మాను. అక్కడికీ మీ అన్నయ్యనేవారు, కిరణ్‍ని అడుగు, తన సలహా తీసుకో అని. భయం నాలో. అభ్యుదయం అన్నది నీ ఒక్కదగ్గరా ఆగదు కదా అని. నీ పిల్లల్ని చూశాక నా కళ్ళు తెరుచుకున్నాయి… శశి జ్యోత్స్నలని నీ చేతుల్లో పెడుతున్నాను . ఇక నీదే భారం” అంది ఉదయ. ఆమె గొంతు జీరవోయింది.
“అంత పెద్దమాటలు వద్దు వదినా! వాళ్ళిద్దరూ నా మేనకోడళ్ళు… ఇంతకాలం పట్టించుకోకపోవడం నాదీ తప్పే” అంది కిరణ్మయి. తర్వాత ఇద్దరూ ఏవేవో విషయాలు మాట్లాడుకున్నారు. అరమరికలన్నీ తొలగిపోయి, మనసులు ప్రసన్నంగా మారాయి.
పిల్లల జాతకాలూ, నక్షత్రాలూ మిగిలిన వివరాలన్నీ పంపిస్తానని చెప్పి వెళ్ళింది ఉదయ.
….
సోషల్ మీడియాలో బబ్లూని అన్‍ఫ్రెండ్ చెయ్యలేదు మానస. పెళ్లి ఫోటోలు కొన్ని నెట్‍లో పెట్టినప్పుడు చూసి అతను షాక్ అయ్యాడు. వెంటనే శాంతికి ఫోన్ చేసాడు.
“మానస పెళ్లి అయిపోయిందా?” ఆతృతగా అడిగాడు.
“అవును” శాంతి క్లుప్తంగా అంది. అతను వెళ్లి అల్లరి పెడతాడేమోనని మనసులో ఎక్కడో లీలగా భయం ఉందేమో వివరాలేవీ చెప్పలేదు. తెలుసుకోవడం అతనికి పెద్ద కష్టమేం కాదని ఆమెకి తెలుసు. అతని సంస్కారానికి వదిలేసింది.
“నీ చిన్నతనమంతా నిన్ను మోసిన పడవ నాకోసం ఎదురుచూస్తోంది” అన్నాడు ఆవేదనగా.
“అదేంటి?”
“మీ అమ్మ మరో పెళ్లి చేసుకుందన్న నెపం”
“బాధపడకురా! మీ ఇద్దరికీ రాసిపెట్టి లేదు. నీకు ఇంకో చక్కటి అమ్మాయి దొరుకుతుంది. చక్కగా చేసుకో. హాయిగా ఉండు. అత్త కూడా సంతోషపడుతుంది”
“సంతోషం… ఆ పడవలో నీ ప్రయాణం పూర్తయింది. నాది ఇప్పుడే మొదలైంది” అన్నాడు. అతని గుండెల నిండా దుఃఖం నిండింది. గొంతు వణికింది.
శాంతి సుదీర్ఘంగా నిశ్వసించింది.
“కాలం గడుస్తున్నకొద్దీ అనుభవం జ్ఞాపకంగానూ బాధగానూ విడిపోయి, బాధ కాలంలో కరిగిపోతుంది. జ్ఞాపకం మాత్రమే మిగులుతుంది. ఆ విషయం ఎవరికి వాళ్లకే తెలుస్తుంది. నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నాను. బాధని కరిగిపోనీ. నీ మనసు పొరల్లో ఉండే ఎన్నో జ్ఞాపకాలలో మానసని కూడా చేర్చుకో” అని పెట్టేసింది.
వెంటనే బబ్లూకి తల్లి దగ్గర నుంచి ఫోన్.
“మానసకి పెళ్లి అయిపోయిందట. నేను చెప్పలేదా? వాళ్లు ఒక మగవాడికి కట్టుబడి ఉండే మనుషులు కాదని” అంది. ఆమె గొంతులో అహం తృప్తి పడిన భావన వ్యక్తమైంది.
“మరేం చేయమంటావమ్మా? చేసుకోక? మనం చేసుకోమన్నాము. ఇంకో సంబంధం తెచ్చి చేశారు. అలా వదిలెయ్యరుకదా?” అన్నాడు కొంచెం కటువుగా.
అతని ప్రశ్నకి వేదవతి దగ్గర జవాబు లేదు. కొందరుంటారు. వాళ్లకి ప్రేమించడానికి ఆర్తజనం కావాలి. ద్వేషించడానికీ, పోటీపడటానికి ప్రత్యర్థులు కావాలి. పోరాడి ఓడిపోవడానికి బలహీనులు కావాలి. దయ చూపించటానికి దీనులు కావాలి. ఇవేవీ లేని సమాజంలో వాళ్లు బతకలేరు. అలాంటి వ్యక్తి వేదవతి.
“మరి నీకు సంబంధాలు చూడాలా? దాన్ని తలదన్నిన సంబంధం చూస్తాను” అంది.
సరేననకపోతే అందుకు కారణం మానసేనని ఆమెతో దెబ్బలాటకు వెళ్లినా వెళ్ళగలదు తన తల్లి. అది దృష్టిలో ఉంచుకుని సరేనన్నాడు.

తండ్రిపట్ల ఎంతో ఉదాసీనంగా ఉండిపోయిన గోపాలకృష్ణ నరసమ్మగారి అవసానదశలో మాత్రం ఆమెను తీసుకొచ్చి దగ్గర ఉంచుకున్నాడు. ప్రశ్నార్థకంగా చూసిన కిరణ్మయితో-
“ఆవిడ చాలా దుర్బలురాలు. తనమీద ఒక బలవంతుడు చేసిన దాడిని తిప్పి కొట్టలేక తనకన్నా బలహీనురాలిమీదికి దాన్ని మళ్లించింది. ఆవిడమీద నాకు మొదట్లో కోపం అసహ్యం ఉండేవి. ఎప్పుడైతే మా నాన్న జ్యోతి విషయంలో ఒక పెళ్ళాం పోతే ఇంకొకర్తి వస్తుంది, ఇప్పుడా రోగిష్టిది బతికేం వుద్ధరించాలని అన్నాడో అలాంటి మాటలే ఈవిడ గురించికూడా అని ఉంటాడనిపించి అప్పట్నుంచీ జాలి మొదలైంది” అన్నాడు.
కిరణ్మయి నిట్టూర్చింది.
గోపాలకృష్ణ తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్న తర్వాత నరసమ్మ గారు రెండు నెలలు బతికింది. గోపాలకృష్ణ ఆవిడకి సమస్త సేవలూ చేశాడు కానీ అమ్మా అని మాత్రం పిలవలేదు. ఆ పిలుపు కోసం తపిస్తూనే ఆమె అతని చేతుల్లో పోయింది. కిరణ్మయిని ఆవిడ దగ్గిరకికూడా రానివ్వలేదు. ఇప్పుడూ కర్మ చెయ్యలేదు గోపాలకృష్ణ. తండ్రి ఆస్తంతా డబ్బుగా మార్చి పేదపిల్లల చదువుకి ట్రస్టు ఏర్పాటు చేశాడు ఆవిడ పేరుమీద. చనిపోయాక కూడా అతను కేశవశర్మని క్షమించలేకపోయాడు.

శాంతి కొడుక్కి ఇప్పుడు అమ్మతో కొత్త పేచీ. వాడు స్కూలుకు వెళ్ళనని ఏడుస్తుంటాడు. ఇంతకాలం తల్లి ఒడిలో తండ్రి వెనక బైక్‍మీద కూర్చుని బ్యాంకుకి వెళ్లేవాడు. అక్కడ టైం అయ్యేదాకా తన దగ్గర ఉంచుకుని బ్యాంకువాళ్ళే నడుపుతున్న క్రెష్‍కి పంపించేది శాంతి. మధ్యలో వెళ్లి చూసి వచ్చేది. అలా అలవాటయింది వాడికి.
ఇప్పుడు ఇల్లు దాటాక అమ్మ కనిపించదు. అది వాడికి నచ్చడం లేదు. ఇక్కడ బ్యాంకులో ఉన్న శాంతికి తనలోని ఒక భాగాన్ని ఎక్కడో మర్చిపోయినట్టు అనిపించి దిగులు పడుతోంది.
అవే మమకారాలు… అవే కోరుకోవడాలు… వద్దనుకోవడాలు… ఎవరికి వారికే మొదలవుతాయి. దాన్ని అన్వయించుకోవడాన్నిబట్టి జీవన గమనం ఉంటుంది.
….
“హిందూధర్మాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోము. చేసుకుంటే ఇన్ని సమస్యలూ బాధలూ ఉండవు. వ్యక్తిస్వేచ్ఛకీ వ్యక్తిసంక్షేమానికీ ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. స్వేచ్ఛ అంటే విశృంఖలత కాదు, సంక్షేమం అంటే స్వార్థం కాదు” అన్నాడు గోపాలకృష్ణ.
నిజమేననిపించింది కిరణ్మయికి. మూడు జీవితాలు ఆ సిద్ధాంతానికి లోబడే ఆ ఇంట్లో సంగమించాయి. ఎన్నో వ్యక్తిత్వాలు వికసించాయి. ఎవరి అనుభవాలూ, అనుభూతులూ వాళ్ళవి. ఎవరి సుఖాలూ, సౌఖ్యాలూ వాళ్లవి. ఒకరికోసం ఒకరు త్యాగాలు చేసిందేమీ లేదు. పరిధుల్ని అతిక్రమించకుండా కర్తవ్యాన్ని పూర్తి చేసుకున్నారు. కర్తవ్యం… పుట్టినందుకు సంతోషంగా బతకడానికి అవసరం అయ్యే అవకాశాలని అందుకునే దిశగా ప్రస్థానించడం.
“పెళ్లి అవ్వకముందు మనకే బాధ్యతలూ లేవు. శాంతి పుట్టాకకూడా అందరిమధ్యనా దాని భారం నాకు తెలిసేది కాదు. పెళ్లి చేసుకున్నాం. పిల్లల్ని కన్నాం. పెళ్లి చేసుకున్నందుకూ, పిల్లల్ని కన్నందుకూ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నాం. ఎన్నో తిరస్కారాలు రుచిచూసాం. జీవితమంటే ఇదేనా? ఇంతేనా?” అంది కిరణ్మయి. ఆమెలో ఏదో అసంతృప్తి. అలాంటి చింతన మొదలైందంటే జీవితంలోని తర్వాతి దశకి ప్రయాణం మొదలైనట్టే.
గోపాలకృష్ణ నవ్వాడు” నిజమే నువ్వు చెప్పింది. వీటన్నిటికోసం పెళ్లి చేసుకున్నామా లేక పెళ్లి చేసుకున్నందుకు ఇవన్నీ బోనస్‍గా వచ్చాయా అనేది ఆలోచించాల్సిన విషయం” అన్నాడు.
“దీనికి ఇప్పటివరకు ఎవరూ జవాబు చెప్పలేదు” తాత్వికంగా అంది ఆమె.
( ముగిసింది)