“నువ్వూ, నేనూ పుట్టని క్రితం కక్షలివన్నీ. తీర్చుకోనీ. మళ్లీ మళ్లీ ఎప్పుడు కలుసుకుంటారు కనుక? ఇదిగో… మీ మామయ్య కూడా రణరంగానికి సిద్ధమవుతున్నారు” అంది రాధ పరిహాసంగా.
” నీకు తెలుసా, మామయ్యకి నన్నివ్వాలనుకున్నారని?” ఉద్వేగంగా అడిగింది శాంతి.
” నీకు తెలియదా?” మామూలుగా అంది రాధ.” పెళ్లికి ముందు పెద్దవాళ్లు ఎన్నో అనుకుంటారు. ఎన్నో సంబంధాలు చూస్తారు. నా వరకు నాకు రెండుమూడు చూశారు. అలాగే మీ మామయ్యకీను”
” అక్కడ మా పెద్దనాన్నల దగ్గిర ఆ ఇంటా ఈ ఇంటా చాకిరీ చేసుకుంటూ గడిపేసిన రోజులే బావున్నాయి నాకు. ఇక్కడికి రావడంకాదుగానీ ముళ్ళ కంప మీద పడ్డట్టుంది” శాంతికి ఏడుపు వచ్చేసింది.
ఇంతలో కిరణ్మయీ గోపాలకృష్ణల పిల్లలు లోపలికి వచ్చారు. చప్పుని కళ్ళు తుడుచుకుంది.
” శాంతీ! ఇదిగో మధు. పెద్దది. ఇంటర్ చదువుతోంది. ఇది మానస. టెన్త్. వీడు శ్రీను. ఫిఫ్త్” అని వాళ్ళనీ,” మీ అక్కయ్య. శాంతి” అని ఆమెనీ ఒకరికొకరికి పరిచయం చేసింది రాధ.
వాళ్లు శాంతిని కుతూహలంగా చూశారు. శాంతి మనసులో కుతూహలాన్ని మించింది ఇంకేదో ఉంది. మధు పూర్తిగా కిరణ్మయి పోలిక. మానస గోపాలకృష్ణ నోట్లోంచి ఊడిపడ్డట్టుంది. శ్రీను మొహంలో శ్రీకాంత్ పోలికలు కనిపిస్తున్నాయి. మరి తను? సన్నగా శలాకలా తండ్రిలా ఉంటుందట. తల్లంత తెలుపు కాదు. చామనఛాయ. తను వాళ్ళలో ఎలా కలవగలుగుతుంది? ఒక పరాయి భావన. మరొక ఆత్మన్యూనత… అత్తిపత్తిలా ముడుచుకుపోయింది.
మధు అంది-” చిన్నప్పట్నుంచీ అమ్మ చెప్పేది శాంతీ! ఒక రాకుమార్తె ఉండేదట. ఆమెను ఒక మంత్రగత్తె ఎత్తుకుపోయి ఎక్కడో దాచేసిందట. ఎప్పుడో ఒకప్పుడు ఆ మంత్రగత్తె బారినుంచీ పారిపోయి వచ్చేస్తుందని చెప్పేది. మేమంతా నీకోసం ఎంత ఎదురుచూసేవాళ్ళమో!
వెన్నెల్లో డాబామీద అన్నం తింటున్నప్పుడు చందమామ తలుపులు తెరుచుకుని వస్తావని…
అమావాస్య రాత్రి నక్షత్రాల రథంలో దిగి వస్తావని…
వర్షాకాలపు మేఘాలలో తేలి వస్తావని…
రకరకాలుగా ఊహించుకునేవాళ్ళం. వీడు- శ్రీనైతే ఇంకా ఇంకా ఎప్పుడు వస్తావని గొడవచేసేవాడు. ఇప్పటికీ అడుగుతాడు”
ముడుచుకుపోయిన శాంతి మనసు మధు మాటలతో మళ్లీ విడుచుకోవడం ప్రారంభించింది. తనతో ఇంత అభిమానంగా ఎవరూ మాట్లాడలేదు. అక్కడి పిల్లల్లో రాజుకి తప్ప ఇంకెవరికీ తనంటే ఇష్టం లేదు. చులకన భావం. అమ్మానాన్నలు లేనిదని అగౌరవం… అవన్నీ గుర్తొచ్చి ఆమె కళ్ళల్లో మళ్లీ నీళ్ళు తిరిగాయి. ఒక చేత్తో మధు చెయ్యి పట్టుకుని మరో చేత్తో మానసని దగ్గరికి తీసుకుంది.
” అక్కయ్యా! నీకు మ్యారేజ్ అయిందా?” శ్రీను కుతూహలంగా ఆమె అలంకరణని చూస్తూ అడిగాడు. క్షణం ఆగి తలూపింది.
” మరి బావగారు రాలేదా?” వెంటనే మానస అడిగింది.
” రాలేదు” క్లుప్తంగా అంది శాంతి.
” పెద్ద కబుర్లు మీకెందుకే?” రాధ వాళ్లను కోప్పడింది.
“వంటైపోయిందా, అత్తయ్యా?” శాంతి మాట మార్చింది.
” వంటైతే అయ్యింది. వచ్చినవాళ్లకి కాఫీలూ టిఫిన్లూ కూడా చేశాను. మనకేమైనా దూరడానికి సందిస్తే ఓ రౌండు ఇచ్చి వద్దామని చూస్తున్నాను” అంది రాధ జవాబుగా.
ఈలోగా కిరణ్మయే అక్కడికి వచ్చింది.
” వాళ్లేరి?” మగవాళ్ళని ఉద్దేశించి అడిగింది రాధ.
” బజార్లోకెళ్లారు” జవాబిచ్చింది కిరణ్మయి.
” పొద్దుననగా బయలుదేరారట. శాంతినీ ఆవిడనీ భోజనం చేయమనండి. శాంతి కాస్త ఉప్మాయేనా తింది. ఆవిడ పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు” అంది రాధ.
“వాళ్ల మొండితనాలంతే” అంది కిరణ్మయి అచ్చం శ్రీకాంత్ లాగే. ఆమె ముఖం ఎరుపెక్కింది.
” నువ్వు వెళ్లి పిలు. వస్తుందేమో!” అంది రాధ శాంతితో.
శాంతి వెళ్లి పిలిచినా ఆవిడ రాలేదు.” వద్దమ్మా! మీ నాన్నకి ద్రోహం జరిగిన ఈ ఇంట్లో నేను మంచినీళ్లు కూడా తాగను. గత్యంతరం లేక ఇలా రావలసి వచ్చింది గాని…” అంది రుద్ధస్వరంతో. తల్లి వింటే ఏం గొడవౌతుందోనని భయం వేసింది శాంతికి. ఆవిడలా అనకుండా ఉండాల్సిందని కూడా అనిపించింది అదే క్షణాన. చిన్నప్పటినుంచి పెంచిందన్న మమకారంతో ఆవిడపట్ల జాలి కూడా కలిగింది.
” ఇంటికి వెళ్ళేదాకా ఇలాగే ఉంటావా? ఎక్కడైనా కళ్లు తిరిగి పడిపోతావు” అంది మృదువుగా. ఆవిడ మాట్లాడలేదు. అలాగే కదలకుండా కూర్చుంది.
” నువ్వు రామ్మా!” కిరణ్మయి లోపలినుంచీ కేకేసింది. శాంతి వెళ్లి కంచం ముందు కూర్చుంది. శ్రీను, మానస చెరోపక్కనీ కూర్చున్నారు.
” నువ్వుకూడా తినేయకూడదే రాధా? తమ్ముడు వచ్చేసరికి ఏ వేళౌతుందో ఏమో!” అంది కిరణ్మయి.
” మీరూ నేనూ తిందాం” అంది రాధ.
” నేను అత్తయ్యతో కలిసి తింటాను” అంది మధు.
” నేనూ ఉండిపోతే అయ్యేది” అంది శాంతి బిడియంగా.
” అలా మొహమాటపడతావేంటే? ఇది మనిల్లు. అడిగి పెట్టించుకుని తినాలి. అమ్మ దగ్గర సిగ్గైతే ఎలా? ఎప్పుడో పొద్దున్ననగా తిన్న తిండి. మొహం చూడు, ఎలా వాడి పోయిందో! తినేసి హాయిగా నిద్రపోతే పొద్దున్నకల్లా ఫ్రెష్ గా ఉంటుంది” ప్రేమగా మందలించింది కిరణ్మయి.
శాంతి ఇంకేం మాట్లాడలేదు. అక్కడికీ ఇక్కడికీ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకళ్ళనొకళ్ళు అభిమానించుకోవడం, ఆ అభిమానాన్ని మాటల్లోనూ చేతల్లోనూ ప్రకటించుకోవడం చూస్తుంటే గమ్మత్తనిపిస్తోంది. ఇలాంటివేవీ ఈశ్వర్రావు ఇంట్లో కనిపించేవి కాదు. పిల్లలు పెద్దవాళ్లయ్యేదాకా ఆయన భార్యను కొట్టేవాడు. పెద్దకొడుకు ఆయన మీద తిరగబడేసరికి అప్పటినుంచీ మానేశాడు. ఆ కోపాన్ని సావిత్రి ,పిల్లలమీదా తన మీదా తీర్చుకునేది. ఈశ్వర్రావుకి బయటి తిరుగుళ్ళు కూడా ఉన్నాయనుకునేవారు. భర్త ప్రవర్తనతో విసిగిపోయింది ఆవిడ. కమలాకర్ ఇంట్లో అంతా అతని భార్యదే పెత్తనం. ఆవిడ నిలబడిమంటే నిలబడాలి, కూర్చోమంటే కూర్చోవాలి. మగపిల్లలు అదుపులేకుండా తయారయ్యారు. ఆడపిల్లకి ఎంతసేపూ సినిమాల పిచ్చి. మూడో అతనింట్లో అంతా అత్తగారి పెత్తనం. ఇక్కడ తల్లి? అన్ని కష్టాలు పడికూడా పువ్వులా సుకుమారంగా ఉంది.
” తినమ్మా! ఏమిటాలోచన?” కిరణ్మయి హెచ్చరించింది. గబగబా తినసాగింది శాంతి. తల్లి చేతి భోజనం. ఆమె తనకి గోరుముద్దలు తినిపించిందో లేదో తెలీదు. ఇప్పుడు కొసరి కొసరి వడ్డిస్తుంటే అపురూపంగా అనిపించింది. మాటల్లో ఏమీ అడక్కపోయినా ఆమె చూపుల్లోనూ చేతల్లోనూ వర్షించే అవ్యాజానురాగం చెమ్మగా గుండెల్లోకి పాకి నిలువునా ముంచెత్తింది.
తిన్న కంచం తీయబోతుంటే వారించి తనే తీసింది కిరణ్మయి.
” ఏమ్మా! కడుపు నిండిందా? దార్లో స్వీట్స్ కొనుక్కొద్దామనుకున్నానుగానీ నిన్ను చూడాలన్న ఆత్రం నన్ను నిలువనివ్వలేదు” అంది.
“పెద్దగా ఆకలి కూడా లేదు. నువ్వు పెడుతుంటే ఎక్కువే తిన్నాను” మొహమాటంగా అంది శాంతి.
“పడుకుంటావా?” అని అడిగి ఆమె తలూపడంతో గెస్ట్ రూంలోకి తీసుకెళ్లి పక్క ఏర్పాటు చేసింది కిరణ్మయి.
” అమ్మా!” సందిగ్ధంగా పిలిచింది శాంతి. ఏమిటన్నట్టు చూసింది కిరణ్మయి.
” నేను… నేనెవర్ని అక్కడికి రాను?” తనని పట్టి కుదిపేస్తున్న ప్రశ్న అడిగేసింది. అలా అడిగాక చాలా రిలీఫ్ గా అనిపించింది. కిరణ్మయికి ఆ పిల్ల పరిస్థితి అర్థమైంది. మొదటినుంచీ తన దగ్గరే ఉంటే ఈ పరాయితనం ఉండేది కాదు. బరువుగా నిట్టూర్చింది.
” మనసులో ఏ సందేహాలూ పెట్టుకోక హాయిగా నిద్రపో శాంతీ! మనింటికి నువ్వొస్తున్నావు అంతే. నిన్ను వద్దనుకునేవాళ్ళు ఎవరూ అక్కడ లేరు. తను కూడా నిన్ను ఎత్తుకుని ఆడించిన వ్యక్తే. తన గుండెల మీద నువ్వు పెరిగావు. ఆ విషయం నీకు అర్థం కావడానికే మేమందరం కలిసి వచ్చాము. భాస్కర్ విషయం కూడా ఆలోచిద్దాం. దేవుడు సమస్యతోపాటే పరిష్కారాన్ని కూడా సృష్టిస్తాడు. తీరిగ్గా ఆలోచిద్దాం. పడుకో తల్లీ!” అంది.
శాంతి ప్రశాంతంగా కళ్ళుమూసుకుంది. తల్లి పక్కనుంటే కొండంత ధైర్యం వచ్చినట్టుంది. ఇన్నాళ్లూ ఎంతగా ద్వేషించింది ఈమెని! ఎన్నెన్ని అనాలనుకుంది! ఆమె కళ్ళు తడయ్యాయి. ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది. ఆమె పూర్తి నిద్రలోకి వెళ్లేదాకా అక్కడే ఉండి తర్వాత లేచి వర్ధనమ్మ దగ్గరికి వెళ్ళింది కిరణ్మయి. సోఫాలో అలాగే పడుకుని ఉందావిడ. మరుసటి రోజు పొద్దున్నే గాని తిరుగు ప్రయాణానికి రైలు లేదు.
ఏళ్లనాటి జ్ఞాపకాలు పిల్లగాలి తెమ్మెరలా కదిలి సుడిగాలిలా మారి కిరణ్మయిని చుట్టుముట్టాయి.
అప్పటి ఆ పెళ్లి, కొడుకు ఇష్టపడ్డ పిల్ల అని తనని పెళ్లి జరుగుతున్నంతసేపూ ఆవిడ ఎంతో అపురూపంగా ఎంతో ప్రేమగా చూసుకోవడం గుర్తొచ్చింది. శ్రీధర్ గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.