సంగమం 9 by S Sridevi

తండ్రిని మింగిన రాక్షసి” అని తిట్టేవారు ఆ పసిదాన్ని. అలాగని తీసుకెళ్లకపోతే ఎందుకు తీసుకురాలేదని దెబ్బలాడేవారు.
కిరణ్మయి అనేక విధాల నలిగిపోయింది. వడ్డూ, దరీ కనిపించని ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్టుండేది. అలంకరణే కాదు, అభిమానగౌరవాలే కాదు, అన్నీ సందిగ్ధంలో పడ్డాయి. బొట్టు పెట్టుకోవాలా, గాజులు వుంచుకోవాలా, అలంకరించుకోవాలా వద్దా అనేది కాదు ఆమె సమస్య. ఎవరికోసమైతే ఈ అలంకరణంతా నిర్దేశించబడిందో అతనే లేకపోయాక ఆమెకి వాటిమీద ఆసక్తి చచ్చిపోయింది. తిండి, నిద్రలపట్ల ధ్యాసే పోయింది. నాయనమ్మ కంచంలో అన్నం పెట్టుకుని వచ్చి తినిపిస్తే తినేది, లేకపోతే లేదు. తల్లి బలవంతంగా బాత్రూంలోకి నెట్టితేనే స్నానం. వదిన వేస్తేనే జడ. అలాంటిదానికి శ్రీధర్ పోయిన తిథి లెక్క చూసుకుని వాళ్లు చెప్పినా చెప్పకపోయినా వెళ్లక తప్పని పరిస్థితి.
ఇది చాలక ఈ వార్త తెలిసి పరామర్శించడానికి వచ్చే చుట్టాలు. వాళ్లు పాటించే సాంప్రదాయాలు. మొదట్లో వాళ్లతోపాటు కిరణ్మయి కూడా ఏడ్చేది. తర్వాత తర్వాత ఏడుపు రావడం మానేసింది. ఒకవిధమైన నిర్వేదం, నిస్తేజం, విరక్తివంటివి ఆమెలో చోటుచేసుకున్నాయి.
ఏడాది గడిచింది. శ్రీధర్ కర్మకాండలు ముగిశాయి. కిరణ్మయి వాళ్ళింటికి వెళ్ళడాలు తగ్గాయి. ఈ ఏడాదిలోనూ వాళ్లతో ఆమెకి ఎలాంటి అనుబంధం పెరగలేదు.
చాలా మార్పులు వచ్చాయి. ఒక మూల మంచంలో వేస్తేనూ, విసుక్కుని వుయ్యాల్లో పడేసి వూపితేనూ వూరుకునే పిల్ల కాదిప్పుడు శాంతి.
శాంతి! ఆ పేరు శ్రీధర్ తల్లిదండ్రులే నిర్ధారించారు. శ్రీధర్ అమ్మమ్మ పేరు శాంతమ్మ. ఆవిడ పేరు ఆ పిల్లకి పెట్టింది వర్ధనమ్మ. మోటుగా వుందని శాంతిగా మార్చింది కరుణ. తిట్టుకోవడానికి అనువుగా వుంటుందని ఆవిడ వూరుకుంది.
ఇల్లంతా పాకుతోంది శాంతి. తప్పటడుగులు వేస్తోంది. వంటింట్లోకి వెళ్లి అమ్మమ్మమీద పెత్తనం చలాయించి వస్తుంది. చంద్రశేఖర్ కొంచెం పరాకుగా వుంటే చాలు, అతని పుస్తకాలు చింపేస్తుంది. తాతని ఎత్తుకోమని చేతులు అందిస్తుంది. శ్రీకాంత్ ఎత్తుకుంటే రెండు గుప్పెళ్ళతోటీ జుత్తు పీకుతుంది.
“అమ్మో! రాక్షసి” శ్రీకాంత్ భయంతో గుండెలమీద చెయ్యి వేసుకుని.
శాంతి బోసినవ్వులు, ముద్దుమాటలు, అల్లరి, ఆటలు అందరి దృకపథంలోనూ మార్పులు తెచ్చాయి. కిరణ్మయిలో కూడా. శాంతి చర్యలేకాకుండా కాలంకూడా.
“బొట్టు పెట్టుకోవాలి కిరణ్! నీ మొహాన్ని అలా చూడలేకపోతున్నాం” అని స్టిక్కర్ తెచ్చి అంటించింది చందూ భార్య. ఎవరూ వద్దనలేదు.
“ఇప్పుడు మా పిల్లలా వున్నావు. ఈరోజుల్లో అందరూ పెట్టుకుంటున్నారు “తడికళ్ళతో కూతుర్ని చూసుకుంటూ అంది లక్ష్మీదేవి.
కిరణ్మయి బొట్టు పెట్టుకునేది. పెరట్లోకి వెళ్లినప్పుడో, శాంతిని ఆడిస్తున్నప్పుడో అక్కడ ఏదేనా పువ్వు కనిపిస్తే చప్పున తెంపి తలలో పెట్టుకునేది. మళ్ళీ వెంటనే గుర్తొచ్చి తీసిపడేసేది . బొట్టు పెట్టుకోవడం, అలంకరించుకోవడం … ఇవన్నీ ఆమెలో వికసిస్తున్న యౌవనానికి బాహ్యసంకేతాలు.ఎంతటి వైరాగ్యమైనా కాలంతో కడిగేస్తే కొట్టుకుపోతుంది. ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే మునిపుంగవులకే సాంసారిక వైరాగ్యం సాధ్యపడలేదు. జనజీవన చైతన్యానికి దూరంగా బ్రతికే సన్యాసులకే సాధ్యపడలేదు బాదరబందీలు వదిలించుకోవడం. ఇక కిరణ్మయి ఎంతటిది? శరీరం ఉన్నంతకాలం పోషణ తప్పదు. పోషణ జరుగుతున్నంతకాలం వికాసం తప్పదు. ఇదొక నిరంతర ప్రక్రియ. అది ఆగిపోవడం అంటే ఆ శరీరంలోని జీవి ఇంకొక శరీరాన్ని వెతుక్కుంటూ ఉన్నట్టే.
ఆమెలో అంతర్గతంగా ఒక జ్వాల రగులుతుండేది. అది ఖచ్చితంగా కామజ్వాల మాత్రం కాదు. తోడు కోసం తపన… జోడు కోసం ఆర్తి. అలా ఆమె అంటే అది వంచనగా కొందరికి అనిపించవచ్చు.
ఆమె కర్మయోగి కాదు. కాలు మోపకుండానే సంసారసౌధం కూలిపోయింది. ఆమె అణువణువు లో ఎంతో వ్యథ. ఏదో కావాలనిపించేది. ఆ వయసులోని అందరూ ఆడపిల్లల్లా ఆమె కూడా కలలు కనేది. అవి అద్యంతమూ అయ్యాక శ్రీధర్ నిష్క్రమణం గుర్తొచ్చి నిలువునా దుఃఖంతో పరితపించిపోయేది. ఒక గొప్ప నిస్పృహ ఆవరించి కళ్ళనుంచి ధారాపాతంగా కన్నీరు కారిపోయేది.
ప్రతి మనిషి జీవితం ఒక పెద్ద గ్రంథం. కూలంకషంగా దాన్ని చదవాలని ఎంత గట్టిగా నిర్ణయించుకున్నా అందులో మనకి ఇష్టమైన పేజీలూ ఉంటాయి , విసుగు పుట్టించేవీ ఉంటాయి. శ్రీధర్ నిష్క్రమణం దాకా లిఖించబడిన ప్రతీ అక్షరమూ కిరణ్మయికి అత్యంత మధురమైనవి. మరీ మరీ చదవాలనిపించేవి. ఇప్పుడు మాత్రం నిరాసక్తంగా పేజీలు తిరిగేస్తోంది. ఎంత కాలం గడపాలి- అనేది అగాధమంత లోతైన, ఎడారంత విస్తృతమైన ప్రశ్న.
ఏ పనిలోనూ మనసు నిమగ్నమయ్యేది కాదు. ఆఖరికి శాంతి పనులు కూడా అంతే. స్నానం చేయించి గదిలోకి తీసుకెళ్లి తుడిచి పౌడర్ రాస్తూ ఆ పిల్లని గుండెలకు హత్తుకుని ఏడ్చేది. దాన్నే మమకారం అంటారని ఆ క్షణాన ఆమెకి తెలీదు. బొట్టూ కాటుకా పెట్టి పాపని వళ్లో వేసుకుని తదేకంగా చూసేది. తన బోసినవ్వుల్లో అవ్యక్త ఆవేదన గోచరించేది ఆమె అంతర్నేత్రానికి. ఇది అంతరంగాలకి మాత్రమే అర్థమయ్యే విషయం. తండ్రిలేకపోవటం తనకి తెలుసనిపించేది కిరణ్మయికి.
అమ్మ, అత్త, పిన్ని… ఇలా అన్ని పదాలూ నేర్చుకుంది శాంతి. నాన్న అన్న పదం దానంతట అదే వచ్చింది. తను ఏ మాటన్నా ఎవరో ఒకరు జవాబిచ్చేవారు. ‘నాన్న’ అనేసరికి అందరి మౌనమే జవాబయ్యేది. పదే పదే ఆ మాట అని ఉక్రోషంతో ఏడ్చేది శాంతి. కూతుర్ని చూసి తనూ ఏడ్చేది కిరణ్మయి. తను ఏడుస్తూ అందర్నీ ఏడిపిస్తూ రోజులు నెట్టేసేది.
” పోయినవాళ్లతో మనము కూడా పోలేము కదా కిరణ్? ఎంతకాలమని ఇలా ఏడుస్తూ కూర్చుంటావు? మళ్లీ కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేయొచ్చు కదా?” అన్నాడు చందూ ఒకరోజు.
కిరణ్మయిలో పెద్ద సంచలనం. తను మళ్లీ కాలేజీలో చేరటమా? రాణివాసం అనుభవించిన పాంచాలి విరాటుని కొలువులో దాసిగా చేరిన ఘట్టం గుర్తొచ్చింది. తనకేసి ఈర్ష్యగా చూసిన కళ్ళు ఇప్పుడు తనమీద సానుభూతి, హేళన ఒలకబోస్తాయేమో! మనసులో ఎన్నో భయాలు! ఎన్నో సందేహాలు! అసలు సంగతి ఆమె మనసు చీకట్లోంచీ వెలుతురులోకి రావటానికి ఇష్టపడటంలేదు
” నలుగురిలో తిరిగితే బాధ తగ్గుతుంది” అన్నాడు గోపాలరావు.
“…”
” పోనీ ట్యూటర్ని పెట్టిస్తే ఇంట్లోనే చదువుతావా?”
“…”
అన్నిటికీ కిరణ్మయి మౌనమే జవాబైంది.
” అప్పుడే నలుగురిలోకీ ఎందుకు? ఏమిటి, ఎలా జరిగిందని ప్రశ్నలతో వేధిస్తారు. ఇది తట్టుకోలేదు”” అంది కిరణ్మయి నాయనమ్మ. వాళ్లే ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. అసలు ఏ విషయాన్ని గురించేనా ఆలోచించే స్థితిలో ఆమె ఉంటే కదా!
చందూ ఫ్రెండ్ గోపాలకృష్ణ. అతను వీళ్ళ ఇంట్లోనే గెస్ట్‌రూమ్‍లో ఉండి కిరణ్మయిని పరీక్షలకి చదివించేందుకు ఒప్పుకున్నాడు. అతన్ని గురించి విన్నాక కిరణ్మయికి కలిగిన బాధ… ఓహ్! వర్ణణాతీతమైనది. దెబ్బతిన్న ఇద్దరూ ఒకే చోటికి చేరారనిపించింది. కారణం అతని భార్య పోయింది. కూతుర్ని కూడా కోల్పోయాడు. అటువంటి స్థితిని అనుభవించి వచ్చిన అతనికి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవరి మనసేనా ఏం కోరుకుంటుందో బాగా తెలుసు. సాంత్వన… అది వట్టి ఓదార్పు కాదు. గాయానికి మందు పూస్తూ డాక్టరు అభిమానంగా మాట్లాడటంలాంటిది. అది కావాలి కిరణ్మయికి.
కిరణ్మయి ఇంట్లోకి గోపాలకృష్ణ రాక ఏ ఆర్భాటమూ లేకుండా జరిగిపోయింది. ఆమె జీవితంలోకి కూడా అతను అంతే నిరాడంబరంగా అడుగుపెడతాడని ఎవరూ ఊహించలేదు.
గోపాలకృష్ణ కిరణ్మయికి ఇంగ్లీషు, లెక్కలు చెప్పేవాడు. చందూ స్టాటస్టిక్స్ చెప్పేవాడు. అతని భార్య ఉదయ హిందీ చెప్పేది. చరిత్ర తనకి తనే చదువుకునేది కిరణ్మయి. అన్నీ కూడా క్షణం తీరిక లేకుండా ఆమెని పట్టి ఉంచేవి.
గోపాలకృష్ణ చెప్పే విధానం కిరణ్మయికి బాగా నచ్చింది. సరళమైన భాషలో మనసుకు హత్తుకునేలా చెప్పేవాడు.