“ఎప్పుడొచ్చావే? ఎంతసేపైంది?” అడిగింది రాజేశ్వరి.
“ఇప్పుడే…” అని తల్లికి జవాబిచ్చి,” నువ్వెప్పుడొచ్చావన్నయ్యా? వార్త నీక్కూడా చేరిపోయిందా?” భాస్కర్‍ని అడిగింది. జవాబివ్వకుండా మౌనంగా భోజనం ముగించి బెడ్‍రూమ్‍లోకి నడిచాడు భాస్కర్. తల్లి ఇచ్చిన కాఫీ కప్పు పట్టుకుని సింధుకూడా అతని వెనకే వెళ్ళింది.
“నాన్న ఫోన్ చేసేసరికి నాకు చాలా కంగారనిపించింది. ఎప్పటినుంచో అనుకుంటున్న సంబంధం. ఇలా కాదనడం ఏమిటి? అసలేం జరిగింది మీమధ్య?” నేరుగా అడిగాడు.
“పిక్చర్‍కి వెళ్దామన్నాడు. వెళ్ళాము. నీకెన్ని పెళ్లి సంబంధాలు చూశారు? అని అసంబద్ధంగా అడిగాడు. ఇదే మొదటిదని నేను అబద్ధం చెప్పవచ్చు. కానీ ఆ క్షణాన్న నాకు అలా అబద్ధం ఆడొచ్చని తట్టలేదు. రెండోమూడో చూశారని వేగ్‍గా చెప్పాను. వాళ్లందరితో ఇలాగే షికార్లకీ సినిమాలకీ తిరిగావా? మీద చెయ్యెసారా? అని మరోరెండు ప్రశ్నలు వేశాడు. అప్పుడు అర్థమైంది, అతనేమీ అసంబద్ధంగా మాట్లాడటంలేదని. మనసులో ఏదో ఉందని గ్రహించాను”
“సంబంధం అనుకున్నాక ఇంత వ్యవధి ఇవ్వడమే మనం చేసిన పెద్ద తప్పు”
“ఇందులో మన తప్పేముంది? వాళ్ళ నాయనమ్మ చనిపోయి, ఏడాది ఆగమని వాళ్లే అడిగారు”
“ఏటి సూతకం తీరాక మాట్లాడుకుందామని వాళ్లని దూరం పెట్టాల్సింది”
“అతను అలా అడగడం తప్పుకాదా అన్నయ్యా? “
“అడిగే అవకాశం మనమే ఇచ్చామని అంటాను”
“అయితే?”
” అతను అలా అడిగాడు, నువ్వు బాధపడ్డావు. అదేనా గొడవ?”
“కాదు. అతనలా అడగడానికి దారితీసిన పరిస్థితులు.”
“అంటే?”
“ఖర్చులన్నీ పెట్టుకుని ఎమ్మెస్ చదివించడానికి అమెరికా పంపించగలిగే సంబంధం వచ్చింది అతనికి. మనతో కమిట్ అయినందుకు బాధపడుతున్నాడు. ఎలాగైనా వదిలించుకోవాలని ఓమాట విసిరాడు”
“సింధూ!! ఆ విషయం నీకెలా తెలుసు?”
“అతనే చెప్పాడు, అంత మంచి సంబంధం వస్తే చేసుకోవడానికి వీలులేకుండా నాలాంటి తిరుగుబోతుతో కమిట్ అయినందుకు బాధపడుతున్నానని. గుడ్ బై చెప్పి వచ్చేసాను”
“అంతా నీ నిర్ణయమేనా? ఆ ఖర్చేదో మనమే పెట్టుకుందాం. ఇంతదాకా వచ్చాక సంబంధం వదులుకుంటామా?”
“అన్నయ్యా!! నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? అతను ఆ విషయాన్ని సూటిగా నాతో చర్చించి ఉంటే నేను ఇంతగా బాధపడేదాన్ని కాదు. నన్ను వదిలించుకోవడంకోసం నోటికొచ్చినట్టు మాట్లాడాడు చూడు, అది నన్ను బాధపెడుతోంది”
“మరోసారి చెబుతున్నాను విను, అతనికి అనే అవకాశాన్ని మనమే ఇచ్చాము”
“మగవాళ్ళంతా ఒకలాగే ఆలోచిస్తారా? వదిన తల్లి ఏదో చేసిందని నువ్వు వదినని అవమానించి వదిలేసావు”
“శాంతి విషయానికి దీంతో పోలికేంటి?”
“పోలిక ఎందుకు లేదు? సూత్రధారణ కూడా చేశాక వదిన విషయంలో నీకేదో తేడా కనిపించింది. అక్కర్లేదని లేచి వెళ్లిపోయావు. అతనికి నాకన్నా లాభదాయకమైన సంబంధం దొరికిందికాబట్టి నన్ను వద్దనుకున్నాడు. మీ ఆలోచనలు, అవసరాలు, ప్రలోభాలు తప్ప మేము పడే బాధ మీకు అర్థం “అవ్వదా? అవసరం లేదా? అయినా మీరంత కష్టపడి మా పెళ్లి చేస్తే ఆ తర్వాత అతనికి ఇంకేదైనా ప్రలోభం కనిపిస్తే ? అందుకే అతన్ని నేను చేసుకోను”
“అంతా నీ ఇష్టమేనా? పెద్దవాళ్ళం మేమున్నది దేనికి? శాంతి విషయాన్ని దీనితో ముడి పెట్టకు.” కోపంగా అన్నాడు.
“సారీ! నీకో న్యాయం, నాకో న్యాయం ఉండవు” తగ్గకుండా అంది సింధు.
“సింధూ! ఇవి వాదనతో తేల్చుకునే విషయాలు కాదు. ప్రాక్టికల్‍గా ఆలోచించు. ఇప్పుడు ఈ సంబంధాన్ని కాదనుకుంటే నష్టపోయేది మనం”
“అని నువ్వంటున్నావు. అతని నైజం తెలిశాకకూడా చేసుకుంటే నష్టపోతానని నేను భయపడుతున్నాను. ఎలాంటివాడైనా సర్దుకుపొమ్మని నాకు చెప్తున్నావు. మరి నీకది వర్తించదా?”
మళ్లీ మళ్లీ అదే ప్రశ్న… భాస్కర్‍కి చాలా నిస్సహాయంగా అనిపించింది. తనది నిజంగా తప్పేనా? ఈ పెళ్లి వద్దేవద్దని ఏడ్చిన అమ్మ మారిపోయింది. పరిస్థితులు మారిపోయాయి. శాంతి స్థితిగతులు మారాయి. తను మారక తప్పదా? సింధు దగ్గర జస్టిఫై చేసుకోవడానికేనా మారక తప్పదేమో! ఈ సంబంధం వదులుకుంటే సింధుకి చెడ్డపేరు వస్తుంది. మరో సంబంధం కుదరడం అంత తేలిక కాకపోవచ్చు. ఆ కుదిరినవాడేనా ఎలాంటివాడు అవుతాడో!
“ఓకే… అమ్మకీ నాకూ మధ్యన జరిగిన సంభాషణ కొంతైనా నువ్వు విన్నావు కదా? వాళ్లు వచ్చి శాంతిని తీసుకెళ్ళమని అడిగారు. నేను తనని తీసుకొస్తాను. అప్పుడు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టేగా?” అన్నాడు ఆఖరికి.
అతనిలాంటి ప్రతిపాదన చేస్తాడని ముందే ఊహించిందేమో, సింధు ఫక్కుమని నవ్వేసింది. అందులో వ్యంగ్యానికి భాస్కర్‍కి తల తిరిగిపోయింది. తెల్లబోయి ఆమెను చూశాడు.
“నీకేం కావాలో నీకే తెలియదు. నీకు భార్య అక్కర్లేదు. ఆమెమీద ప్రేమ లేకపోయినా అసహ్యించుకుంటూనైనా ఏదో ఒకలా సర్దుకుపోగలవు. రేప్పొద్దున్న ఏదైనా జరిగి నువ్వు చనిపోతే నీకు తను నమ్మకమైన వితంతువుగా ఉంటానన్న హామీ దొరికితే చాలు. ఆ హామీ నీకు వదిననుంచి దొరకలేదు. కాబట్టి నువ్వు ఆమెని వదిలేసావు. మీ మగవాళ్ళకి దయాదాక్షిణ్యాలు లేవు. బతికుండీ సాధిస్తారు, చచ్చిపోయాకా సాధిస్తారు. నేను అతన్ని చేసుకోవాలని నీకెందుకంత పంతం? నీ భార్య. .. నీకు కావాలో అక్కర్లేదో నిర్ణయించుకోవలసింది నువ్వు. నా పెళ్లి కాదు”
చెల్లెలి మాటలకి భాస్కర్ మస్తిష్కంలో పెద్ద విస్ఫోటనంలాంటిది జరిగింది. శాంతిని చూడగానే తనకి తొలప్పటి ప్రేమ ఎందుకు పుట్టడంలేదో, కోపం ఎందుకొస్తోందో ఒక్కసారి గ్రహింపుకొచ్చింది. వివాహవ్యవస్థ మగవారికి బతికుండగానూ చనిపోయాకాకూడా ఇచ్చిన భద్రతని పునాదులతోసహా కదిలించింది శాంతి తల్లి చేసుకున్న పునర్వివాహం. సింధు అన్నట్టు… రేపు తనకు ఏదైనా జరిగితే శాంతి కూడా అలాగే చేస్తే?… తనకి తండ్రినుంచి లభించిన వారసత్వం, తన పిల్లలు ఏమవుతారనే అంతర్గత… అప్రకటిత… లీలామాత్రపు భయంతోనే తను శాంతిని తిరస్కరించాడు. ఆ భయాన్ని జయించగలిగితే ఆమెని స్వీకరించగలుగుతాడు.
కానీ, ఇప్పటికిప్పుడు పరిష్కరించాల్సింది తన సమస్య కాదు. సింధుది. తండ్రి గొంతు వినిపించడంతో గదిలోంచీ ఇవతలకి వచ్చాడు.
“ఎప్పుడొచ్చావురా?” కొడుకుని చూసి అడిగాడు మాధవరావు.
“హౌరాకి” జవాబు ఇచ్చాడు భాస్కర్.
“ఏమంటోంది సింధు? నీతో ఏమైనా చెప్పిందా? ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తున్నాను. ఏవేవో మాట్లాడారు. కాస్త దబాయించి అడిగేసరికి మనసులో విషయం బయటపెట్టారు. ఆశలు అందనంత ఎత్తులో ఉన్నాయి. అతడికి అమెరికాలో చదువుకోవాలని ఉంది. ఆ ఖర్చంతా మనం పెట్టుకుని ఇద్దరినీ పంపించే ఏర్పాట్లు చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు”
“మీరేం చెప్పారు?” భాస్కర్ ఆతృతగా అడిగాడు.
“ఆలోచించుకుని చెప్తానన్నాను. అంతకి మనం తూగలేము. నీకు తీసుకున్న కట్నం అటిచ్చి చేతులు దులుపుకుందామనుకున్నాను. నువ్వొక తెలివితక్కువవాడివి. ప్రపంచజ్ఞానం లేదసలు. ఎలా బతుకుతార్రా మీరు? ఆ ఈశ్వరరావు మీ మామ ఆస్తంతా వేసుకుని దిగమింగాడు. నీ భార్యకో లక్ష ఇచ్చి వదిలించుకుందామని చూశాడు . మీ అమ్మ గొడవ సరే, పీటలమీంచీ లేచి వెడితే ఇంకాస్త రాలుస్తాడని నేను చూశాను. అనుకున్నట్టే తమ్ముడిని తీసుకుని వచ్చాడు. ఇంకో పదో పాతికో తీసుకుని పిల్లను కాపురానికి తెచ్చుకుంటే సరిపోయేది. తల్లి చచ్చిపోతే మనకేం? లేచిపోతే మనకేం? వాళ్ళు చెప్పినట్టే మనమూ చెప్పేవాళ్లం. ఇవన్నీ పెళ్లికి ముందు చూసుకోవలసిన విషయాలు. అప్పుడేమో ప్రేమమత్తులో నీకు కిందామీదా తెలియలేదు. తర్వాత ఎంత చెప్పినా తలకెక్కలేదు. ఆ పిల్ల వద్దని కూర్చున్నావు. వాళ్ల డబ్బు వాళ్లకి తిరిగిచ్చేసావు. ఇప్పుడేం పెట్టి దీనికి పెళ్లి చేస్తాననుకున్నావు?” కొడుకుమీద విరుచుకుపడ్డాడు.
విలువలు… తను గుడ్డిగా నమ్ముతూ వచ్చిన విలువలు ఎంత అర్ధరహితమైనవో భాస్కర్‍కి గ్రహింపుకి వచ్చింది. తల్లికి ఆదర్శం అర్థమైంది. తండ్రి ప్రాథమ్యం డబ్బు. చెల్లెలికి సమానత్వం. వీళ్లే కాదు, కిరణ్మయి, గోపాలకృష్ణ, “ఈశ్వర్రావు అందరూ అన్ని విలువల్నీ తమకి అనుకూలంగా మార్చుకున్నారు. వాటినే పాటించారు. తను మాత్రం సాపేక్షతని మర్చిపోయి నిరపేక్షమైన విలువల్ని ప్రేమిస్తూ, ఆధారంలేని నమ్మకాలతోటీ, భయాలతోటీ అందరికీ చెడ్డవాడయ్యాడు. కిరణ్మయిని చేసుకోడానికి గోపాలకృష్ణకి లేని ఆక్షేపణ శాంతిని చేసుకోవడానికి తనకి ఎందుకుండాలి? సింధు అన్న భయమే కారణం కావచ్చు. శాంతి తల్లిలాగే ప్రవర్తిస్తుందని ఎందుకనుకోవాలి? శాంతి తల్లి ఏం చేస్తే తనకేం? అయినా ఆవిడకి ఎదురైన పరిస్థితులు శాంతికీ ఎదురవుతాయని ఎందుకనుకుంటున్నాడు? ఆమె అలా చెయ్యకుండా చూసుకుంటే సరిపోయేది. ఎంతో నిరాదరణ తర్వాత లభ్యమైన ప్రేమకి ఆమె కట్టుబడే ఉండేది. రెండోపెళ్లి చేసుకున్న స్త్రీ సంతానంగా తను ఎదుర్కొన్న అనుభవాల దృష్ట్యా ఆమె మళ్లీ తనుగా అలాంటి పని చేసేది కాదేమో! ఒకవేళ చేస్తే… ప్రపంచం తలకిందులౌతుందా? ఎవరిది? ప్రపంచం స్థిరంగానే వుంది. ఏవీ తలకిందులవలేదు. చదువులు, వుద్యోగాలు అన్నీ సవ్యంగానే సాగిపోతున్నాయి… అతని ఆలోచనలు ముందుకు సాగలేదు.
“లోకం గొడ్డుపోయిందా? వీళ్ళు కాకపోతే ఇంకో సంబంధం” నిర్లక్ష్యంగా అన్నాడు మాధవరావు. అందులో కొంచెం ఆవేదనకూడా ఉంది. అది ఆ పెళ్లికొడుకుతో ఏర్పడిన చిన్నపాటి అనుబంధాన్ని తుంచుకోవడంవల్ల ఏర్పడినది. అయితే ఆ ఆవేదనని భాస్కర్ గుర్తించలేదు. నిర్లక్ష్యాన్నే గమనించాడు.
“ఇంత జరిగాక?” ఆగిపోయాడు భాస్కర్ సందిగ్ధంగా.
“ఎంత జరిగాక? ఏం జరిగాక? ఇద్దరూ వెళ్ళినది పబ్లిక్‍ప్లేసెస్‍కేగానీ, ఊళ్లకీ లాడ్జిలకీ కాదు. ఎవరైనా నా కూతుర్ని ఏదైనా అంటే నాలుక చీరేస్తాను”
తండ్రి అంతర్యం బోధపడింది భాస్కర్‍కి. సింధుకి ఉద్యోగం ఉంది. ముందుముందు ఇంకా మంచి ఉద్యోగం రాగలదన్న నమ్మకం ఉంది. ఆ ఉద్యోగాన్ని చూసేనా ఇంకొకరు చేసుకుంటారన్న ఆశ వుంది. భాస్కర్‍కి ఆశ్చర్యంలాంటిది కలిగింది. శాంతి విషయంలో గోపాలకృష్ణ, కిరణ్మయి అలాగే మాట్లాడారు. అలా అనే బెదిరించారు.
“అంతా మీరూ చెల్లే నిర్ణయించుకున్నట్టైతే నన్నెందుకు రమ్మన్నారు?” కోపంగా అడిగాడు. అది నిస్సహాయతనుంచి, శాంతి విషయం అర్థమవ్వడంనుంచి పుట్టిన కోపం.
“ఒకటి రెండు లక్షల కోరిక అతను కోరి ఉంటే నేను ఏదో ఒకలా సర్దుబాటు చేసేవాడిని. ఇప్పుడీ కోరిక ఖరీదు పాతిక లక్షలు… కనీసం. ఉద్యోగం వదిలేసి అమెరికా వెళ్లి అతను దీన్నేం పెట్టి పోషిస్తాడు? అంటే అంత ఖర్చుపెట్టాక మనకి దొరికేది అనిశ్చితి. తనని అతను అవమానించాడని సింధు అనుకుంటోంది. మంచిదే. ఇక నీ విషయం. నీకు సంబంధాలు వస్తున్నాయి. మనం పంపిన కాగితాలు వాళ్లు తిప్పి పంపలేదు. ఆ విషయం తేల్చచుకుంటే ఇంకో సంబంధం కుదుర్చుకోవచ్చును”
భాస్కర్‍కి జవాబేమివ్వాలో తెలియలేదు. ఈ విషయం మొదటినుంచీ ఇంట్లో అనుకుంటున్నదే, తన మనసులో ఉన్నదే కానీ మారిన పరిస్థితులు ఆ ఆలోచనని మార్చినట్టుగా అనిపిస్తోంది.
“నేనలా ఫ్రెండ్స్‌ని కలిసి వస్తాను” తండ్రికి జవాబు ఇవ్వకుండా బయటపడ్డాడు. ఎక్కడికి వెళ్లాలో, ఎవరిని కలవాలో తెలియలేదు. తల్లిదండ్రుల మెటీరియలిస్టిక్ దృక్పథం మొదటినుంచీ ఉన్నదే కానీ తను ప్రత్యేకించి గుర్తించలేదు. పైసాపైసాకీ లెక్కచూసుకోవడం వాళ్లకి అలవాటు. శాంతిని చేసుకుంటానన్నప్పుడు కట్నం రాదేమోనన్న భయంతో జరిగిన గొడవ కూడా మర్చిపోలేదు. ఇప్పుడదంతా కొత్తరూపంతో కనిపిస్తోంది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.