ఏం జరిగింది? ఎందుకు జరిగింది?
కొన్ని ప్రశ్నలకి జవాబులుండవు. ఈ భూమి మనిషిది కాదు. ఆకాశం మనిషిది కాదు. ఎవరో సృష్టించినవి. లేదా ఎలాగో సృష్టించబడినవి. మనచేతుల్లో ఏదీ లేకుండా అంతా ఉన్నట్టుండి హఠాత్తుగా జరిగిపోతుంది. అప్పటిదాకా సాఫీగా వున్నదంతా తలకిందులైపోతుంది.
అతని పరిస్థితి సరిగ్గా అదే.
ఎప్పటిలాగే ఆరోజు వుదయం తెల్లవారింది. చిన్న వూరు, చిన్న యిల్లు. ఒక పాతిక లేదా యాభై గడపలు కలిస్తే ఒక వూరు. అలాంటివే కొన్ని వందల గ్రామాలు వుండి వుంటాయి ఆ కాలంలో, నాలుగు సముద్రాల మధ్యనున్న ఆ విశాల భూభాగంలో.
మనుషులు అరుస్తూ పరుగులు పెడుతున్న శబ్దాలు విని లేచి పాకలోంచీ ఇవతలికి వచ్చాడు. ఊళ్ళోవాళ్ళంతా పెద్దగా కేకలు వేస్తూ తలోదిక్కూ పరిగెడుతున్నారు. ఇంటిముందు ఒక కుక్క చచ్చిపడి వుంది. దాన్ని వింతగా చూసాడు. కనుచూపుమేరంతా చిన్నచిన్న పొలాలు, వాటిని చుట్టుకుని దట్టంగా పెరిగిన అడవులు. ఏదో తేడా కనిపిస్తోంది. చెట్లు, చేలు వాడిపోయి వున్నాయి. అతనికేమీ అర్థమవలేదు. ఉన్నట్టుండి వూపిరి కొద్ది బరువుగా అనిపించింది. దూరంగా పారిపోవాలని బలంగా అనిపించింది. తనూ గుంపులో చేరాడు.
పరుగు మొదలు పెట్టాడు. బూడిద కుప్పలుకుప్పలుగా రాలుతోంది. నడుస్తూనడుస్తూ మనుషులు కుప్పగా కూలిపోతున్నారు. అతను వూరిచివరి కొండలవైపుకి పరిగెత్తాడు.
బలమైన మనిషే. ఒక కొండవాలులో చిన్న గూడులాంటిచోట ముడుచుకుని కూర్చున్నాడు. నెమ్మదిగా పాకుతూ చుట్టు తిరిగితే గుహ వుంది. అందులో దూరాడు. గుహలో అప్పటికే ఒక ఆడమనిషి. ఆయాసంతో రొప్పుతోంది.
“చంద్రుణ్ణి మింగావా?” అడిగాడు ఎత్తుగా వున్న ఆమె మధ్య శరీరాన్ని చూసి. ఆమె తలూపింది.
ఆ ప్రాంతపు వాళ్ళకి ఒక సాంప్రదాయం వుంది. స్త్రీపురుషులు జతకట్టాక, సోన్ నది దగ్గరకి వెళ్తారు. నిండుచంద్రుడు కనిపించిన ప్రతిసారీ చిన్న మట్టిపాత్రలో నీళ్ళు పట్టి అందులో చంద్రుడి బింబం పడేలా చూసుకుని స్త్రీచేత తాగిస్తారు. అలా చంద్రుడిని మింగాక స్త్రీ కడుపు వుబ్బెత్తుగా మారటం మొదలౌతుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి శిశూత్పత్తి జరుగుతుంది.
అతను చిన్నగా నవ్వాడు. అది నవ్వులా లేదు. లోపలున్న సంతోషాన్ని బయటికి తెలియజేసే సంకేతం. ఆమెకి చెయ్యందించి గుహ గోడకి చేర్చాడు. బయటికి చూసాడు. బూడిద రాలుతునే వుంది. అంతా చీకటిచీకటిగా వుంది. గాలికి కొంత లోపలికికూడా తోసుకుని వస్తోంది. గాలిపీల్చినప్పుడల్లా ఇద్దరికీ అవస్థగానే వుంది. లోపలికిలోపలికి జరుగుతున్నారు.
ప్రాణశక్తి ఆకలిదప్పులకన్నా బలమైనది. ఏ కొద్ది ఆహారం దొరికినా ప్రాణం నిలబడుతుంది. ఆ బూడిదవానలోనే గుహ చుట్టూ వున్న ఆకులూ అలములూ తెచ్చుకుంటున్నారు. అవే తింటున్నారు. గుహలో ఒకమూల చిన్న సన్నటి నీటిధార. అది ప్రాణం నిలబెట్టింది.
దాదాపు రెండునెలలతర్వాత మొదటి సూర్యోదయాన్ని చూసారు. సూర్యోదయమని ఎండా అదీ లేదు. మబ్బులు తొలిగాయి. కొద్దిపాటి వెలుతురు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు. గుహలోంచీ అడుగు ఇవతలికి పెట్టారు. కొత్తచందమామ పుట్టినందుకు గుర్తుగా చిన్న పదునైన రాతికత్తి వుంది అక్కడ. రక్తం కలిసిన మట్టి వుంది.
అవతల ఎముకలు కొరికేసే చలి.
ఎక్కడికి వెళ్ళాలి? ఇద్దరికీ అర్థమవలేదు. గమ్యం లేకుండా నెమ్మదిగా నడుస్తున్నారు. దారంతా బూడిదకుప్పలు, వాటికింద చచ్చిపడిన మనుషులు, జంతువులు, ఎండిపోయిన చెట్లు… ఇద్దరూ నెమ్మదిగా నడుస్తూ వెళ్ళి నది సోన్ వొడ్డుకి వెళ్ళి కూర్చున్నారు. నీళ్ళు బురదగా వున్నాయి. అవే తేర్చుకుని తాగారు. బిడ్డని కడిగారు.
ఒకరూ ఇద్దరూ మనుషులు అక్కడికి చేరుకుంటున్నారు. తిండికోసం వెతుకులాట… బతుకుకోసం ఆరాటం మొదలయ్యాయి.
“టోబా అగ్నిపర్వత విస్ఫోటనం. సోన్ లోయ. మధ్యప్రదేశ్‍లో సీధీ దగ్గర. దాభా అనే సైటు. పైరోక్లాస్టిక్ ఫ్లో… గంటకి 700 కిలోమీటర్ల వేగం, 800 డిగ్రీల సెల్సియస్ వేడి. టోబా అగ్నిపర్వతందగ్గర మొదలై, బంగాళాఖాతాన్ని దాటుకుని దాదాపు 9000 కిలోమీటర్లు ప్రయాణించేసరికి చల్లబడి, తనతో తెచ్చినవన్నీ పడిపోయి కేవలం బూడిద మాత్రమే మిగిలి వుంటుంది. అది భూభాగాన్ని కప్పేసింది. టెఫ్రా ఫాల్… పదిమందిలో ఒకరుగా మిగిలిన ఆ యిద్దరి గురించిగానీ, ఆ ముందూ తర్వాతా చేసిన వ్యవసాయాన్ని గురించిగానీ, అంత ప్రతికూల పరిస్థితుల్లోకూడా పుట్టి బట్టకట్టిన ఆ పసికూన గురించిగానీ ఏ చరిత్రా లేదు. వీళ్ళే మన పూర్వీకులేమో! మైటోకాండ్రియల్ డీఎన్‍ఏ, వైక్రోమోజోమ్ ఇచ్చింది వీళ్ళే కావచ్చు” అన్నాడు ఆర్కియాలజిస్టు.
“అడుక్కీ అడుక్కీ మధ్య అగాథాలు కనిపిస్తుంటే చరిత్ర రాయటం కష్టమే. అలా రాయకుండా వదిలేసినా , ప్రతి అడుగూ చరిత్రే” అన్నాడు పథికుడు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.