అముద్రిత రచన, మయూఖ-14.7.2021
“ఓయ్! ఏం చేస్తున్నావ్? ఓమాటు ఇటు రా! నా కళ్ళద్దాలు తీసుకు రా!”
“…”
“ఇలా వచ్చి అలా వెళ్ళిపోయావా? ఒక్క నిముషం ఆగలేవూ? పేపర్ ఇచ్చి వెళ్ళు… అలాగే కాస్త కాఫీ కూడా కావాలి”
“…”
“కాఫీ తెచ్చినదానికి మంచినీళ్ళు ఇవ్వాలని తెలీదా?”
“…”
“అస్తమానూ లోపల కూర్చుని ఏం చేస్తావు? ఇక్కడ ఒక్కడినీ అఘోరిస్తున్నానని ఏమైనా వుందా? రా. వచ్చి ఎదురుగా కూర్చో”
“…”
“మొక్కలకి పాదులు పెడుతున్నావా? తరువాత చేసుకోవచ్చు. ఇలా రా. మాడుకి నూనె పెట్టి మర్దనా చెయ్యి…అలాగే అదే చేత్తో అరికాళ్ళకి కూడా”
“…”
“ఇప్పుడేం వంట? పొద్దుట కోడలు చెయ్యలేదూ? మళ్ళీ నువ్వు వండి వుద్ధరించేదేమిటి?… పిల్లలకి పూస చేస్తున్నావా? ఏదీ కొంచెం ఇలా పట్టుకు రా!”
“…”
“ఇలా రా. కాళ్ళు లాగుతున్నాయి… కాస్తంత నొక్కు… గట్టిగా… చేతులేం అరిగిపోవు”
“…”
“ఆ పుస్తకమేమిటి? ఇప్పుడది చదివి నువ్వేం వుద్ధరించాలి? మొత్తానికి బలేమనిషిని అంటగట్టాడు మీ నాన్న… ఆ చదివేదేదో పైకి చదువు… నేనూ వింటాను…”
“…”
“సిరిపాకవాళ్ళ పిల్లాడు దేనికి వచ్చాడు? వాళ్ళమ్మ జాకెట్టుకోసమా? ఇప్పుడు నువ్వా జాకెట్లు కుట్టి సంపాదించకపోతే ఇల్లు నడవదా? … సర్లె… నీ ఖర్చులకేదో నువ్వు సంపాదించుకుంటున్నావు… లేకపోతే నీ దూబరా ఖర్చులు ఎవరు భరించాలి…”
“నాన్న పోయాక అమ్మలో చాలా మార్పు వచ్చింది కద శశీ? ఇద్దరూ అలా మాట్లాడుకుంటూనో కొట్లాడుకుంటూనో ఉండేవారు. నాకైతే ఇద్దరు చిన్నపిల్లల్ని చూసినట్టు అనిపించేది” అన్నాడు తేజ. “ఒక్క నిముషంకూడా ఆవిడని తీరికగా వుండనిచ్చేవారు కాదు. అలా చిన్నపిల్లాడిలా పిలుస్తునే వుండేవారు… అమ్మ విసుక్కున్నా కూడా”
ఆగిపోయాడు… ఒక విషయమేదో గుర్తొచ్చి.
“అనారోగ్యం మనిషికి ఇష్టమో కష్టమో చేస్తాంగానీ ఆరోగ్యంగా వుండి ఇరవైనాలుగ్గంటలూ కూర్చుని సేవలు చేయించుకుంటానంటే ఎంతకని చచ్చేది?” తల్లి చిరాకుపడింది ఒకసారి. తను వినేలా. మళ్ళీ తండ్రికి వినపడకూడదు. మామూలు విసుగే అనుకున్నాడు కానీ దాని వెనక ఏదో వుంది.
అప్పటికి నాలుగు నెలలైంది అతని తండ్రి పోయి. తిరుగుతూ తిరుగుతూనే పోయాడు. గవర్నమెంటు వుద్యోగం చేస్తూ పదేళ్ళక్రితం రిటైరయ్యాడు. ఆయనది నలుగుర్లో తిరిగే మనస్తత్వం కాదు. పొద్దుట ఏదో కొద్దిసేపు నడక… అదీ అయిష్టంగా. తర్వాతనుంచీ ఇంట్లోనే. ఎలా తోస్తుందో అనుకునేవాడు తను. భార్య, టీవీ, పేపరు… అంతే వ్యాపకం. కార్డియాక్ అరెస్ట్ అన్నాడు డాక్టరు. పోయే వయసు కాదు. కనీసం ఇంకో పదేళ్ళు బతకచ్చు.
ఆయన పోయాక అన్ని విషయాలలోనూ ఆసక్తి ఒక్కసారి చచ్చిపోయినట్టు స్తబ్దుగా మారిపోయింది అతని తల్లి. ఒక్కతే గదిలో ముడుచుకుని పడుక్కుంటోంది. జన్మజన్మల అలసట అంతా తీర్చుకుంటున్నట్టు నిస్త్రాణగా.
ఆవిడ భర్తృవియోగం తట్టుకోలేకపోతోందేమోనని ఓదార్చే ప్రయత్నం చేసాడు.
“నాకే విషయంలోనూ ఆసక్తి లేదు. నన్నిలా వదిలిపెట్టు. మీ నాన్న చెప్పింది విని విని అలసిపోయాను” అంది ఆవిడ. అతనికి ఆశ్చర్యం కలిగింది.
“అమ్మా! ఎంతకాలం ఇలా వుంటావు? నాన్న పోయిన దు:ఖం నీ ఒక్కదానికేనా? నాకు లేదా? శశికి లేదా? నువ్విలా గదిలో ఒక్కదానివీ కూర్చుంటే బాధ ఎలా తగ్గుతుంది? నాన్న వున్నప్పుడెలా వుండేదానివి? ఎన్ని చేసేదానివి?” అన్నాడు, ఆవిడ చేతుల్ని తన చేతిలోకి తీసుకుని.
“నన్ను విసిగించకురా! నేను బాగానే వున్నాను. తిరుగుతూ తిరుగుతూ వున్న మనిషి పోతే బాధలేకుండా వుండదుగా? జీవితంలో మార్పు రాదా? అలాంటి మార్పే వచ్చిందనుకో. ఐనా మీ నాన్న వుండగా అవన్నీ అవసరమయ్యాయిగానీ ఇంక ఇప్పుడెందుకు?” అంది కొంచెం విసుగూ, కాస్త కోపం మిళితం చేసి.
అతను తెల్లబోయాడు
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.