ఆధునిక కవితోపాఖ్యానం by Savitri Ramanarao

  1. నీల by Nandu Kusinerla
  2. ఫ్రిజ్ లోకి ఏం వండనూ!!! by Savitri Ramanarao
  3. ఆధునిక కవితోపాఖ్యానం by Savitri Ramanarao
  4. దానం కొద్దీ…! by Nandu Kusinerla
  5. కర్మణ్యేవాధికారస్తే!!!… by Savitri Ramanarao
  6. బలిపశువు by Pathy Muralidhara Sharma
  7. వైద్యంలో వేద్యం by Savitri Ramanarao
  8. నేనూ మనిషినే by Pathy Muralidhara Sharma
  9. చిన్న కుటుంబ చిత్రం by Savitri Ramanarao
  10. ఒక్క క్షణం by Pathy Muralidhara Sharma
  11. ఎందుకు రాదూ!! By Savitri Ramanarao
  12. యద్భావం తద్భవతి by Pathy Muralidhara Sharma
  13. అలా అర్థమైందా? by Pathy Muralidhara Sharma
  14. మనసు మూయకు!!! by Savitri Ramanarao
  15. ఎవరికెవరు ఏమవుతారో! by Pathy Muralidhara Sharma
  16. కాస్త సహనం వహిస్తే by Savitri Ramanarao
  17. అమ్మ దయ ఉంటే… by Savitri Ramanarao
  18. మై హుం నా బెహన్! by Savitri Ramanarao

ఈ మధ్య నా రూమ్‍మేటు రామంగాడు వ్రాసిన 

“ఇక్కడ ఇది వుంది

అక్కడ అది వుంది

ఎక్కడ చూసినా 

ఏదో  ఉంటుంది”–అనే ఓ మినీకవిత ఇదీ విశ్వం అనే   పేరుతొ ఓ పత్రికలో అచ్చవటంతో వాడిని పట్టుకోలేక పోతున్నాం.

ఇక దివారాత్రాలు లైటేసుకుని గదిలో ఓ మూల కూర్చుని కాగితాలు తెగ ఖరాబు చేసేయటం రాసిన ప్రతీది  చావ చంపి చెవులు మూసి మరీ నాకు వినిపించెయ్యటం నిత్యకృత్యం అయిపోయింది-

ఆ  కార్యక్రమంలో భాగంగానే మరో తాజా కవితతో తయారయ్యాడు నిద్ర మంచంమీంచి నేనింకా  పూర్తిగా  లేవకుండానే–

“పొద్దున్నే ఎందుకురా! ఈరోజు ఆదివారమేగా ! తరవాత వింటాలే-“అంటూ న్యూస్‍పేపర్ తియ్యబోతుంటే–

“ఇది లేటెస్ట్  మోడల్‍లో రాసారా!నువు విని తీరాల్సిందే”అన్నాడు.

“సరే! అఘోరించు! “అన్నాను పేపర్ హెడ్ లైన్స్ చూస్తూ.

వాడు ఉత్సాహంగా మొదలెట్టాడు.

“నిరంకుశంగా పరుచుకున్న వెన్నెల్లో

ఎక్కడో అంకురించిన మెదడు కణంలో జీవం నిండింది-“

“చంపేస్తానోరే! ఒళ్ళు పిచ్చిపిచ్చిగా  ఉందా! వెన్నెల నిరంకుశంగా పరుచుకోవటం ఏమిటి?మెదడు కణం మెదడులోకాక ఎక్కడో అంకురించటం ఏమిటి?పళ్ళూ, గిళ్లూ రాలగలవ్. పొద్దున్నే వెర్రెక్కించకు” అంటూ పేపర్ విసిరేసి లేవబోతుంటే రెక్కుచ్చుకు ఆపి- 

“ఓరే! ఒరే! ప్లీజ్! వింటే బాహుబలి సిన్మా కి తీసుకెళ్తాను”అని ఆశ పెట్టాడు.

మంచి ఆఫర్. పైగా ఆ మూడు గంటలయినా వీడు రచనలు  చెయ్యటం మానుతాడు కదా! అని ” సరే  కానీ” అన్నాను.

“నీలాకాశం నిప్పులు కక్కుతోంది–“మళ్లీ మొదలెట్టాడు.

“నీలాకాశం నిప్పులు కక్కటమేవిటి రా !..”అన్నాను ఆశ్చర్యం గా.

“అదే ఆకాశంలో నక్షత్రాలు నిప్పుకణాల్లా మెరుస్తున్నాయన్నమాట” జవాఁబు.

“నీలాకాశంలో నక్షత్రాలుంటాయా?..”మళ్ళీ నా సందేహం.

“సర్లే !తప్పయింది. నల్లని ఆకాశం నిప్పులు కక్కుతూ–“

“మరి వెన్నెల్లో ఆకాశం నక్షత్రాలు కనబడేంత నల్లగా ఉంటుందా?”మళ్లీ నే అనుమానంగా–

వాడికి చిర్రెత్తుకొచ్చినట్టుంది,”ఒరే! నోర్మూసుకు వింటేనే సిన్మా!లేపోతేలేదు! ఫో”అన్నాడు-

కాసేపు నోరు మూసుకుంటే ఆదివారం కాలక్షేపం అయిపోయే దానికి అనవసరంగా సిన్మాప్రోగ్రాంకి ఎసరెందుకు పెట్టుకోవటం అని   “ఊం కానీ!” అన్నాను.

వాడు మళ్లీ మొదటి నుంచి మొదలెట్టి

“నిరంకుశం గా పరుచుకున్న వెన్నెల్లో

ఎక్కడో అంకురించిన మెదడుకణంలో జీవం   నిండింది

నల్లని ఆకాశం నిప్పులు కక్కుతూ పాముల్నీ, పక్షుల్నీ

భయపెడుతోంది

ఎక్కడో దిగంతాల్లో కాంతిరేఖ 

తల్లి ఒడిలో పసివాడి గుండెమీద పరుచుకుంది

నిశీధి శ్మశానంలో సమాధులు  చీల్చుకుని

శవాలు రోడ్డు మీద ఏడుస్తున్నాయి

చెత్త కుండీ పక్క కుక్కపిల్ల ఎంగిలాకుల్లో విందు భోజనం

కాలం ఎవరి కోసం ఆగదు.”

అంటూ అక్కడికేదో కాలం విలువ తెలిసిన మహాజ్ఞానిలా ఫోజు  పెట్టి గంభీరంగా “ఎలా వుంది రా? “అన్నాడు.

ఏడిసినట్టుంది అని అనబోయి, సిన్మా గుర్తొచ్చి  “బాగానే వుంది కానీ నేను ట్యూబ్‍లైట్‍నికదా, అంతవేగంగా వెలగలేను. దీనర్థం ఏమిటో నువ్వే చెప్పు “అన్నాను.

“ఏమోరా! నాకూ తెలీదు. మొన్నో కవితాప్రత్యేకసంచిక చూసాను. అందులో కవితలన్నీ దాదాపు ఇదేమాదిరిగా వున్నాయి. సర్లే అని అదే మోడల్లో ఒకటి రాసేసాను. లాగితే, పీకితేఏఎదో అర్ధం దొరక్క పోతుందంటావా? ” అనుమానంగా అడిగాడు.

ఉండదంటే మరేం మొదలెడతాడో ముందు సిన్మా అఫర్  చెడుతుందని-

“అవునవును. ఏదో దొరుకుతుందిలే”అన్నాను నీరసంగా కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే.

దానికి వాడు తెగ ఆనందపడిపోయి, “లేరా! తొమ్మిదవుతోంది. తయారవు. మళ్లీ మార్కింగ్‍షోకి టిక్కెట్లు దొరకవు. ముందుగా అక్కడ           పాన్‍షాప్‍వాడికి ఫోన్ చేస్తాను” అంటూ సెల్ కనబడక వెతుక్కుందికి వెళ్లిపోయాడు.

                                              **********

సిన్మా చూసి హోటల్లో భోంచేసి రూముకొస్తుంటే తోవలో రామంగాడి ఫ్రెండొకడు కనబడి సాయంత్రం అసెంబ్లీహాల్లో ఒక కవిసమ్మేళనం ఉందని చెప్పి ఇద్దరు రావచ్చని చెప్పి ఓ ఫ్రీ పాసుకూడా ఇచ్చి  పుణ్యంకట్టుకున్నాడు.

ఇహ వీడి ఆనందం ఇంతా అంతా కాదు-“ఒరే పడుకుని లేచి సాయంత్రం వెళ్దాం “అన్నాడు.

మళ్లీ ఇదొకటా? నా గుండెల్లో రాయిపడింది. అయినా మావాడి పోరు  పడలేక కవిసమ్మేళనంకదా కాస్త సత్తా ఉన్న కవులే వస్తార్లే అని ధైర్యం చెప్పుకుని వెళ్ళాను. మావాడు పట్టుకుంటే జిడ్డులా వదిలేరకం కాడన్నది నా గతానుభవం.

                                              **************

సాయంత్రం అనుకున్న సమయానికి ఓ గంట లేటుగా కవిసమ్మేళనం మొదలయింది. కవులందరూ ఒకరిమీద ఒకరు పోటీపడి మరీ కవితలు చదివేస్తున్నారు. జనాలకి ఏమి అర్ధం అవుతోందో  ఆ పరమాత్ముడికి ఎరుక. చప్పట్లు బాదేస్తున్నారు. నాకేమీ అర్ధంకావటం లేదు. అసలు కవేం చెబుతున్నాడో పూర్తికాకముందే స్టేజిమీద వున్నవాళ్ళు చాలా బావుంది, అద్భుతం, బ్రహ్మాండం ఆహా,ఓహో అంటుంటే ఈ జనాలకి ఏమిటి అర్ధం అవుతోంది చెప్మా అని  ఆశ్చర్యం కమ్మేసింది నన్ను.

తప్పీ దారీ చెవిలో పడ్డ ఒకటి  రెండు కవితలకన్నా చెప్పొద్దూ మారామం గాడి కవితే బెటర్ ఏమో  అనికూడా అనిపించింది నా మటుకు నాకు.

కుర్చీలో నేను అసహనంగా కదలటం గమనించిన కుడిపక్కసీట్లో వృద్ధుడొకాయన, సుమారు ఎనభై సంవత్సరాలుంటాయేమో, నాకేసి తిరిగి, అడిగాడు-

“అబ్బాయ్!వాళ్ళేమిటంటున్నారో నీకేమయినా అర్ధం అవుతోందా?” అని.

“లేదు తాతగారు! “టక్కున చెప్పేసాను.

“అవునులే నాయనా కుర్రకుంకవి నీకేమి అర్ధం అవుతుంది?” అంటూ తనకి రెండవవైపు సీట్లో కూచుని అదేపనిగా ఆపకుండా చప్పట్లు బాదేస్తున్న మధ్య  వయస్కుడిని ఉద్దేశించి- 

“అబ్బాయ్! మీరేం అనుకోకండి కానీ వాళ్ళు చదువుతున్న కవితలు మీకేమయినా అర్ధం అవుతున్నాయా? “అని అడిగాడు-

అతడు మూసిలాయనని ఓ పురుగుని చూసినట్టు చూసి, “అదంతా ఆధునికకవిత్వం తాతగారూ! ఈరోజుల్లో జనజీవితంలాగే సంక్లిష్టంగా ఉంటుంది. అర్ధంచేసుకుందికి చాలా పదునైన మేధా, మంచి విశ్లేషణాశక్తీ కావాలి” అనేసి  ఇంకా అక్కడుంటే మరేమి అడుగుతాడో అన్నట్లు హడావుడిగా అక్కడినుండి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ ఉడాయించాడు.

“ఏమిట్ట వీడికున్న మేధా, విశ్లేషణ శక్తీ !అర్ధం అయితే చెప్పి  చావొచ్చుకదా! అయినా ప్రపంచంలో అంతా మహా మేధావులే ఉంటారా? కవన్నవాడు ప్రజలకు అందాలిగాని, అర్ధం కాకపొతే ఎలా రాణించగలడు? పొందికలేని నాలుగు మాటలు పేరిస్తే కవిత్వం అవుతుందా? అది ఎవరికయినా అర్ధం అయి చస్తుందా? అంతా పిదపకాలం , పిదపబుద్ధులూను” అని  తిట్టుకుంటూ లేచి తన చేతికర్రసాయంతో బయటకి నడిచాడు.

కవుల పరిచయాలు, ఆటోగ్రాఫులకోసం సీట్లోంచి ప్రోగ్రాం మొదట్లోనే జారిపోయిన మా రామం “పదరా వెళ్దాం” అంటూ రావడంతో బతుకు జీవుడా!అంటూ బయటపడి ఆటోలో రూమ్ చేరేసరికి రాత్రి పదకొండు గంటలు అయింది.

తోవంతా మావాడు ఏయే కవులతో ఏమి మాట్లాడింది, ఎవరెవరి ఆటోగ్రాఫులు తీసుకున్నదీ విరామం లేకుండా వాయించేస్తూనే వున్నాడు. విసుగెత్తినా వినక తప్పలేదు ప్రాణ స్నేహితుడినాయిరి. ఫ్రెండ్ ఇన్  నీడ్ అయితీరాలి మరి.

అయితే అన్నింట్లోకి  నాకు అత్యంత ఆందోళన కలిగించిన అంశం ఏమిటి అంటే ఆ వచ్చిన కవుల్లో ఓ పేరున్న కవి మా రామంగాడి మేనమామ బాల్యస్నేహితుడట. మాటల సందర్భంలో మనోడు కవితలు రాస్తాడాని తెలిసి  చాలా ఆనందించాడట. వీడు పొద్దుటి కవిత చదివి ఆయన అభిప్రాయం అడిగాడట. ఆయన ఇప్పుడుకాదు బాబు, రేపు  దగ్గర్లో గెస్ట్‌హౌస్లో వుంటాను-   పదిగంటలనుండి సాయంత్రంవరకు- వచ్చి  కలువు- చూద్దాం- అన్నాడట. రేపు కాలేజి ఎగ్గొట్టి అయినా కవిగారి దర్శనం చేఁసుకు తీరాల్సిందే అని డిక్లేర్ చేసాడు.

“నేనెందుకు రా? క్లాసులు పోతాయి ,నువ్వెళ్లు” అంటే నీ ప్రాణస్నేహితుడిని ఓ మహాకవి మెచ్చుకోవటం నీకెంత గర్వకారణం?రేపు నువ్వొచ్చి నా గొప్పతనం కళ్ళారా చూడాల్సిందే “అని తీర్మానించాడు.

                                       —————-…———…….

మర్నాడు పదిగంటలకి నేనూ, మా రామంగాడూ పదింటికల్లా ఠంచనుగా కవిగారి దగ్గర ప్రత్యక్షం. ఆయన కాసేపు మా రామంగాడి మేనమామగురించి అవీ ,ఇవీ అడగటాలయాక మా  జిడ్డుగాడు తన కవితల కట్ట విప్పి చూపించేడు.

ఆయన ఓచేత్తో సెల్ మాట్లాడుతూ రెండోచేత్తో రెండు కవితలున్న కాయితం ఓసారి ఎగాదిగా చూసి, ” బావున్నాయోయ్, రాస్తూ వుండు” అన్నాడు. మావాడికి భుజాలు గజాలయిపోయాయి.

పట్టు వదలని విక్రమార్కుడి లెవెల్లో “సర్, ఇది నిన్నే రాసాను సర్. రాత్రి మీముందు చదివాను. అభిప్రాయం చెప్పమంటే రేపు రా అన్నారు.ఇప్పుడు చదువుతాను మళ్ళీ. మీ అభిప్రాయం చెప్పండి సర్ ” అన్నాడు.

తప్పనిసరి అయి చేసేదిలేక ఆయన ఇలా  తే అని దాన్నో సారి చదివి “దీన్ని కొద్దిపాటి మార్పులతో ఇంకా ఆధునికంగా చెయ్యవచ్చోయ్” అన్నాడు గంభీరంగా తలపంకిస్తూ.

మావాడు వెంటనే పెన్ను తీసి “మార్చండి సర్ ” అని భక్తిగా ఆయన  చేతికి అందించాడు.

ఆయన దాన్ని ఇలా మార్చాడు.

“ఎక్కడో అంకురించిన మెదడు కణం పరుచుకున్న

నిరంకుశపు వెన్నెల్లో జీవం నిండింది

పాముల్నీ ,పక్షుల్నీ నిప్పులు కక్కుతూ

భయపెడుతోంది నల్లని ఆకాశం

పసివాడి గుండెమీద దిగంతాల్లో

కాంతిరేఖయి తల్లి ఒడిలో పరుచుకుంది

రోదిస్తున్నాయి స్మశానాల్లో శవాలు నిశీధి

రోడ్డుమీద చీల్చుకొని సమాధులు

కుక్కపిల్ల చేస్తోంది చెత్తకుండీ పక్కన 

విందుభోజనం ఆకుల ఎంగిళ్లలో

ఆగదు ఎవరికోసం కాలం”

చెప్పొద్దూ రామంగాడి  వెర్షనే బావున్నట్టనిపించింది ఆ పొంతనలేని వాక్యాలు  అర్ధవంతంగా ఎలా మారుస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూసిన నాకు.

మావాడుమాత్రం “సింప్ల్య్ సూపర్బ్ సార్” అని అభినందించి ఆ ప్రతిని తీసుకుని మళ్లీ చదవటం ప్రారంభించాడు మహాదానందంగా.

ఎలాగైనా ఈ కవితకర్ధం ఏమిటో తెలుసుకోవాలన్న పట్టుదలతో

“సార్ ! ఈ కవిత కర్ధం నాకు తెలియటం లేదు -మీరు కొంచెం వివరిస్తారా” అన్నాను నసుగుతూ.

దానికి అతడు భళ్ళున సీసా బద్దలయినట్టు నవ్వి “అదేంటోయ్! చాలా సింపుల్. ఏది ఆ ప్రతి ఇలా ఇయ్యి” అని  రామం చేతినుండి లాక్కుని దాన్ని కిందనుండి పైకి పైనుండి కిందకి చదివి ఏమి అంతుపట్టక చివరికి ఇలా అన్నాడు.

“ఏమిటో అనుకున్నానుగాని ఆధునిక కవిత్వం అర్ధంకావటం కష్టమేనోయ్! అయినా నేనెప్పుడూ రాయటమేగానీ అర్ధాలగురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. అయినా అర్ధం చేసుకోవలసింది పాఠకులుకదా .ఏదో అర్ధం స్ఫురించకపొతే మమ్మల్ని అలా ఆకాశానికెందుకు ఎత్తుతారు? ఒకవేళ అర్ధంకాకపోయినా మా మేధాశక్తి ,కవిత్వసామర్ధ్యంమీద వాళ్ కున్న అపారనమ్మకం మమ్మల్ని ఎన్నడూ  ప్రశ్నించనీదు. అందికే నాకేనాడూ అర్ధాలగురించి ఆలోచించాల్సిన అవసరం, అవకాశం రాలేదు ఇంతవరకూ” అంటూ మధ్యాహ్నం తనకి ఏదో సాహితీ సమావేశం ఉందంటూ లేచాడా కవిపుంగవుడు.

“హైలీ కన్విన్సింగ్ రిప్లై. నిజంగా ఈయన మేధావిరా! క్షణంలో కవితని ఎలా మార్చీసేడో చూడు” అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్న మా రామంగాడిని నాలుగు వుతకాలనిపించింది నాకు.

ఆ కోపంతో “వెధవా! ఆకుల ఎంగిలేమిటి? శ్రాద్ధం. పిండాకూడు. ఆయన రాతలు. నీ  సమర్ధింపులూ తగలడ్డట్టే వున్నాయి. రూముకి పద చెప్తాను. ఈ పిచ్చిరాతలు చదివి ఎవడైనా పిచ్చెక్కితే వాళ్ళ వాళ్లు కోర్టుకెక్కితే మీ బాబు ఇలా  నీ టైము తగలేసి చదువు చట్టబండలు చేసుకున్నందుకు నీకూ, నీకూడా ఉంటూ ఈ  భాగోతాన్ని ఇంతవరకూ రానిచ్చినందుకు  నాకూ   డొక్క చింపి డోలు కడతాడు” ఆంటూ రెక్కుచ్చుకు తెచ్చి ఆటోలో కుదేశాను.

రూమ్‍కొచ్చినా ఆయన మార్చి ఇచ్చిన కవితని తన్మయత్వంతో చూసుకుంటూ ” గొప్ప జీనియస్ రా!నిజంగా ఆయన్ను కన్న తలితండ్రులు ధన్యులు” అంటూ సంధివాగుడు వాగుతున్న వాడి నోటికి ఎలాగైనా తాళం వేయాలని పట్టుదలతో-

 “షటప్! నువ్వు రాసిన  కవితకి అతను పాఠకుడే కదా! పాఠకులకి అర్ధాలు స్ఫురిస్తాయనే అనుకున్నా అతనెందుకు నీ కవితకి అర్ధం చెప్పలేకపోయడు? “అన్నాను కసిగా.

“బావుందిరా! పాఠకుడయితే మాత్రం? దాన్ని  మార్చి రాయటంలో అతనికీ కొంత పాత్ర వుంది కదా! అందుచేత అర్ధం తెలియకపోవటం సమంజసమే “అని ఆధునిక రచనా ప్రక్రియలన్నీ ఆకళింపు చేసుకున్న లెవెల్లో కవిగారిని సమర్ధించాడు.

ఆ సమాధానానికి అవాక్కవటం నా వంతు అయింది.