అనుభూతులు పదిలం…పదిలం by S Sridevi

  1. కాగితం మీది జలపాతం by S Sridevi
  2. తేడా వుంది by S Sridevi
  3. అన్ హోనీ by S Sridevi
  4. గూడు by S Sridevi
  5. కోడలి యిల్లు by S Sridevi
  6. విముక్తి by S Sridevi
  7. వారసత్వం by S Sridevi
  8. మళ్ళీ అదే తీరానికి by S Sridevi
  9. యుద్ధం ముగిశాక by S Sridevi
  10. గతజలం, సేతుబంధనం by S Sridevi
  11. తనువు, మనసు, ఆత్మ by S Sridevi
  12. లిఫ్ట్ ప్లీజ్ by S Sridevi
  13. కుటుంబదృశ్యం by S Sridevi
  14. అనుభూతులు పదిలం…పదిలం by S Sridevi
  15. స్నేహితుడు by S Sridevi

Youtubers please WhatsApp to 7382342850

“అమ్మా! నిన్ను చూడాలనుంది. వెంటనే బయల్దేరి రా!” జమ్‍‍షెడ్‍పూర్లో ఇంజనీరింగ్ చదువుతున్న బాబీ వేడ్కోలు. ఎక్కడో వరంగల్లో వున్న నేను అంతదూరం వంటరిగా ప్రయాణం చేసి వెళ్ళటమంటే ప్రయాసే అయినా వాడి మాటల్లోని దిగులు నన్నటు అయస్కాంతంలా లాగేసింది.
ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటుంటే మరొక కాల్.. యూయస్‍నుంచీ.
“అమ్మా! అర్జెంటుగా వెబ్‍కామ్ ఆన్ చేసుకుని కూర్చో. నిన్ను చూడాలనుంది” సముద్రాల అవతల్నుంచి ఉష. చేస్తున్న పనులాపి వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చున్నాను.
“నిన్నటినుంచీ ప్రయత్నిస్తున్నాను నీతో మాట్లాడాలని. ఇప్పటికి తీరింది” ఉష కళ్ళనిండా సంతోషం. అంతలోనే దిగులు.
“ఎంత డబ్బు సంపాదించుకున్నా మన వూళ్ళో మనింట్లో వున్నట్టు వుండదు. తిరిగి యిండియా వెళ్ళిపోదామని నేనంటే… మళ్ళీమళ్ళీ వస్తామా అని పీయూష్ అంటాడు. అమ్మా! నిన్ను చూస్తే యింత సంతోషంగా అనిపిస్తుంది కానీ, నేను చూసింది నీ బొమ్మని.. నిజంగా నిన్ను కాదని కాసేపటికే అర్ధమై నీ స్పర్శకోసం తపించిపోతాను”
“పెద్దదానివయ్యావు కదమ్మా?”
“నీకంటే చిన్నదాన్నేగా?”
“పిల్లల తల్లివి”
“ఐనా నీ కూతుర్ని”
“ఎలా ఉషా? ఇంటిమీద బెంగ తగ్గించుకోవాలి. నీకేం తక్కువ చెప్పు? చక్కటి చదువు, వుద్యోగం, మంచి భర్త, చురుకైన పిల్లలు… అందరూ అమెరికా వెళ్ళాలని కలగంటారు. నువ్వేంటిలా? అతనొకలా. నువ్వందుకు వ్యతిరేకంగా ఆలోచిస్తే ఎలా చెప్పు? మీయిద్దరిదీ ఒకటే మాట కావాలి. మీ యిద్దర్లో హార్మోనీ లేకపోతే పిల్లల ఆలోచనావ్యవస్థ దెబ్బతింటుంది” నచ్చజెప్పాను.
“మగవారి డాలర్ డ్రీమ్స్ వెనక కూడా ఆడవాళ్ళ త్యాగమేనా? మనం అనుబంధాలన్నీ తెంచుకోవల్సిందేనా?”
ఆపైన ఇంకొన్ని ప్రశ్నలు.
“అలా ఎందుకాలోచిస్తున్నావు ఉషా?”
“నీది ఆరుద్రపురుగు రంగు వెంకటగిరి చీర నేను తెచ్చుకున్నాను చూడు, ఎందుకే నేను కట్టే చీర? అన్నావు గుర్తుందా? ఆ చీరని నీ స్పర్శ యింకా అంటే వుందమ్మా! నిన్ను చూడాలని మరీమరీ అనిపించినప్పుడు దాన్ని దిండుమీద పరుచుకుని పడుకుంటాను. అమ్మా… దిండుమీద ఈచీర … అంటారు నా పిల్లలు ఆశ్చర్యంగా. మా అమ్మది… అని జవాబిస్తాను గుసగుసగా. పీయూష్ వినకూడదుగా? తనకిలాంటివి నచ్చవు. సెంటిమెంటల్ ట్రాష్ అనేస్తాడు సింపుల్‍గా”
” నీకక్కడ బాగానే వుంది కదూ?”
“బాగా లేక? అప్పుడప్పుడు బెంగగా ఉంటుంది. సరేగానీ తమ్ముడెలా వున్నాడు? ఎలా చదువుతున్నాడు? వాడినొకసారి మాట్లాడమను”
“వాడికీ బెంగే, యిల్లొదిలి అంతదూరాన్న చదవటం” అన్నాను.
“కానీ తప్పదు కదూ? అన్నీ మనకి నచ్చనివే చేస్తూ మన మంచికోసమే, ఎప్పుడో మనం సుఖంగా వుండటంకోసమే అని నచ్చజెప్పుకుంటూ, ఆ ఎప్పుడో వచ్చాక అప్పుడంత కష్టపడ్డాను కాబట్టే యిప్పుడింత సుఖంగా వున్నానని సుఖానికి నిర్వచనం యిస్తూ బతికెయ్యటం”
కొన్ని సంవత్సరాలక్రితందాకా నేను పాతిక ముప్పై సంవత్సరాల సుదూర భవిష్యత్తు వూహించేదాన్ని. దాని చిత్రం యిలా వుండేది కాదు. ఒక చక్కటి యిల్లు. అందులో నేను, అతుల్…ఉష బాబీల కుటుంబాలు… ‘నేను’ అనే మానవవిత్తనం శాఖోపశాఖలుగా పెరగటాన్ని వూహించుకునేదాన్ని. వాస్తవంలో జరుగుతున్నది వేరు. విత్తనాలు ఎక్కడో విసిరేయబడ్డట్టు మొలకెత్తడం, ఎవరికి ఎవరు ఎవరో… ఎక్కడెక్కడో!
ఉషతో మాట్లాడ్డం పూర్తయ్యేసరికి అతుల్ ట్రెయిన్ రిజర్వేషన్తో వచ్చాడు! బాబీ తనకికూడా ఫోన్ చేసాడట. వెళ్ళటానికి తనకి లీవ్ దొరకదట. ఎప్పుడూ వున్నదే. నాకోసం రిజర్వేషన్ చేయించుకొచ్చాడు.
ఉష గురించి చెప్పాను. “అదెందుకో బాగా దిగులుపడుతోంది” అన్నాను నేను కూడా దిగులుగానే. అతుల్ బాధపడ్డాడు. “దగ్గిరైనా దూరమైనా యిండియాలోనైతే వెళ్ళి చూసేవాళ్ళం. అక్కడికి మనం వెళ్ళాలన్నా అది రావాలన్నా బోల్డన్ని ఫార్మాలిటీస్. నేనుకూడా దానితో మాట్లాడతాలే లీజర్‍గా ” అన్నాడు.


వరంగల్లో కోణార్క ఎక్స్‌ప్రెస్ ఎక్కాను. కంప్యూటర్ ముందు కూర్చుంటే కాలం గంటలు, నిముషాలు, క్షణాలుగా విభజించబడిన అంకెల గారడీగా మారిపోతుంది. ఆఫీసు టేబుల్‍ముందు అదే కాలం కేలండరు పేజీల్లోకి లుప్తమౌతుందని అతుల్ చెప్తాడు. ఇప్పుడీ రైల్లో ఏమీ చేయాలనిపించక కిటికీలోంచి బైటికి చూస్తూ కూర్చుని కిటికీలోంచీ వేగంగా పరిగెడుతున్న కొండల్నీ, చెట్లనీ, చిన్నాపెద్దా స్టేషన్లనీ చూస్తుంటే దూరం అనేది కాలంగా మారటం తెలుస్తోంది. మొత్తం మీద ఇరవై తొమ్మిది గంటల ప్రయాణం.
పిల్లలు చిన్నవాళ్ళుగా వుండి ఇంటిపనితో సతమతమౌతూ వున్నప్పుడు ఒక్క క్షణం తీరిక దొరికితే చాలు, ఎన్నో చెయ్యాలనుకునేదాన్ని. ఎన్నో పుస్తకాలు చదవాలని వూహించుకునేదాన్ని. పిల్లలు పెద్దవాళ్ళై కావాల్సినంత తీరిక దొరికాక చదివే అలవాటు తప్పిపోయింది. బేగ్‍లో పుస్తకాలున్నా అవి హస్తాలంకారానికే. ఇప్పుడూ అంతే. ఏమీ చేయాలనిపించలేదు. కిటికీలోంచీ బైటికి చూస్తూ కూర్చున్నాను. ఎదురుగా ఒక సిక్కు, పక్కని తెలుగతను. మేం ముగ్గురమే వున్నాము. వాళ్ళు మధ్య మధ్యలో నన్ను చూసీ చూడనట్టు చూస్తూ ఏవో మాట్లాడుకుంటున్నారు. నాకు పరిచయం చేసుకోవాలనిపించలేదు. అలాగే కిటికీలోంచీ చూస్తూ కూర్చున్నాను. ఖమ్మం స్టేషన్ వచ్చింది. ఎవరో ముసలమ్మ. అడుక్కోవడానికి వచ్చింది.
సిక్కు ఆమెని చూసి కదిలిపోయాడు. “నీకు కొడుకుల్లేరా?” అడిగాడు వెంటనే.
“ఉన్నారు. ఇద్దరు” జవాబిచ్చింది.
“ఇద్దరు కొడుకులుండి నిన్నిలా వదిలి పెట్టడమేంటి?” సిక్కతని ప్రశ్న.
రెండు అరటిపళ్ళు తీసిచ్చాడు. రైలు కూత కూసి, కదిలింది. అతనింకా బాధపడుతూనే వున్నాడు.
“మా రాష్ట్రంలో తల్లిని యిలా వదిలిపెట్టం. అమ్మకదా!” అంటున్నాడు. తెలుగుతను యిక్కడి పరిస్థితులను వివరిస్తున్నాడు. ఎదిగీ ఎదగని పిల్లలు వుద్యమాల్లోకి వెళ్ళటాన్నిగురించీ, రైతుల ఆత్మహత్యల గురించీ, పాలమూరు కూలీల వలసల గురించి ఎన్నో చెప్తున్నాడు.
“అమ్మని మన నుంచి వేరుగా ఎలా చూడగలుగుతున్నారు? మన యింట్లోనూ మన సంస్కృతిలోనూ భాగం కదా?”
తెలుగతను నవ్వి వూరుకున్నాడు. వాళ్ళ సంభాషణ ఆగిపోయింది. తెలుగుతను నాతో పరిచయం చేసుకున్నాడు.
“ఎక్కడి దాకా వెళ్తున్నారు?” అడిగాడు. చెప్పాను.
“అక్కడ ఎవరున్నారు?”
దానికీ చెప్పాను.
“అంతదూరం మీ అబ్బాయిని పంపించాలంటే బాధనిపించలేదా?” అడిగాడు.
నేను చిన్నగా నవ్వి “మా బాధలూ, వుద్వేగాలూ మీ జీవితాలనీ కెరీర్నీ ప్రభావం చెయ్యకూడదు కదా?” అన్నాను.
“అందరు తల్లిదండ్రులూ అలా ఆలోచించరు. మా పేరెంట్సు నన్ను దూరం పంపించి చదివించడం యిష్టంలేక లోకల్లోనే వుంచి చదివించారు. మాది శ్రీకాకుళం. అక్కడే చదివాను. కానీ ఈ రోజుల్లో ఏం చదివావు అనేదానికన్నా ఎక్కడ, ఏ యిన్‍స్టిట్యూట్‍లో చదివారనేది ముఖ్యం. డిగ్రీ పూర్తై రెండేళ్ళైంది. కంప్యూటర్ కోర్సులు కూడా చేసాను. జాబ్ లేదు. ఎప్పుడొస్తుందో తెలీదు. ఇంట్లో గొడవ ఇంత ఖర్చుపెట్టి చదివించాం, ఇంకా జాబ్ రాలేదని” అన్నాడు. అతని కళ్ళలో నైరాశ్యం నీడలా పరుచుకుంది. అతనికి ఓదార్పు అక్కర్లేదు. తను చెప్పినదాంట్లోని వాస్తవాన్ని గుర్తిస్తేచాలన్న తపన వుంది. గుర్తించినట్టు తలూపాను.
తర్వాత మా సంభాషణ ఆగిపోయింది. రాత్రికి యింటి నుంచీ తెచ్చుకున్న చపాతీలు తిన్నాను.
వైజాగ్‍లో సముద్రపు గవ్వల్తో చేసిన రకరకాల బొమ్మల్తో ఎక్కాడొక వ్యక్తి, అద్భుతమైన సృష్టి. ఫ్లవర్‍‍వేజ్‍లు, పూలగుత్తులు అన్నీ గవ్వల్తోటే. షాపులో షోకేసులో పెడితే వందలూ వేలూ పలికే బొమ్మల్ని పాతిక్కీ యాభైకీ యిస్తున్నాడు. రెండు బొమ్మలు కొని జాగ్రత్తగా చీరల మడతల మధ్య కదలకుండా పెట్టాను. ట్రెయిన్ దిగగానే ఒకటి యింటికీ ఒకటి ఉషకీ పార్సెల్ చెయ్యాలని మననం చేసుకుంటూ నిద్రపోయాను.
పలాసా దగ్గరపడ్తుంటే ఎవరో తట్టిలేపినట్టు మెలకువ వచ్చింది. బెర్త్‌మీంచీ దిగాను. స్టేషన్ వచ్చేసింది. ప్లాట్‍ఫామ్, లైట్లు, హడావిడిగా తిరుగుతున్న జనం. ఒక్కసారి దిగాలనిపించింది. రైల్లోంచి దిగి, ప్లాట్‍ఫామ్‍మీద నిల్చున్నాను. మనసంతా వుద్వేగం.
నా జీవన ప్రస్థానం ఈ వూరికి దగ్గర్లోని ఒక పల్లెటూర్లో మొదలైంది. ఎక్కడికెళ్ళాలన్నా యిదే రైల్వే స్టేషను. కొన్ని పదులసార్లు ఈ ప్లాట్‍ఫాంమీద నడిచి, ఆ బెంచీలమీద కూర్చుని, రైలు కోసం ఎదురుచూసి, నా వుచ్చ్వాసనిశ్వాసాలతో యిక్కడి గాలిలో విలీనమై వుంటాను. మళ్ళీ యిక్కడికి రావాలని ఎన్నిసార్లనుకున్నా రాలేకపోయాను.
ఆస్తులున్నవారికి అనుబంధాలుంటాయి. నా యిల్లు, నా వూరు, నావాళ్ళూ అనే మనుకారాలుంటాయి.
“స్వంతిల్లున్నవాడికి ఒకటే యిల్లు. అది లేనివాడికి అన్నీ యిళ్ళే”? అనేవారు నాన్న. సంపాదిస్తూ, ఖర్చుపెడ్తూ విలాసంగా గడిపేసాడాయన. ఒక్క అన్నయ్య నాకు. వాడు జీవితంలో నిలదొక్కుకోవడానికి చాలా స్ట్రగుల్ చేసాడు. ఇప్పటికీ చేస్తున్నాడు. ప్రైవేటు ఉద్యోగం. చాలీచాలని జీతం.
పెద్దతనంలో అమ్మానాన్నా చాలాకాలం వృద్ధాశ్రమంలో వున్నారు. వాళ్ళని తీసుకెళ్ళి తన దగ్గరుంచుకోలేదు అన్నయ్య. నేను రమ్మన్నా రాలేదు. తమమధ్య బాంధవ్యాలు ఎందుకిలాంటి టర్న్ తీసుకున్నాయనే విశ్లేషణ మొదలైంది వాళ్ళలో. స్వంతిల్లు ఏర్పరుచుకోకపోవటంలో, వున్న యిద్దరు పిల్లల జీవితాలనీ అందంగా మలచకపోవటంలో తమ వైఫల్యంకన్నా ఎక్కువగా బాధ్యతారాహిత్యం కనిపించింది. సమాజానికి అనుగుణంగా తాము ప్రవర్తించలేదనే , పర్యవసానంగా పిల్లలూ ప్రవర్తించలేదనే నిర్ణయానికి వచ్చాక, వాళ్ళకింక తమ జీవితం సౌందర్యరహితంగానూ అర్ధవిహీనంగానూ కనిపించింది. దిగులుతో ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు.
రైలు కూత కూసింది. చప్పుని ఎక్కేసాను. డోర్ వేసేసి నా బెర్త్ దగ్గరకెళ్ళాను. సిక్కు నేను దిగటం చూసినట్టున్నాడు.
“ఎందుకు దిగారు?” స్వచ్ఛమైన యింగ్లీషులో అడిగాడు.
నా భావోద్వేగాన్ని వ్యక్తపరచాలనిపించింది. “నా చిన్నప్పటి వూరు. నేను తిరిగిన వూరు” చెప్పాను.
“అమ్మ కూడా అలాంటిదే కదూ? కన్నతల్లీ, స్వంతవూరు”
నేను అవాక్కయ్యాను. నా తండ్రి బాధ్యతారాహిత్యం, వోఖాపురి ఎక్స్ ప్రెస్‍లో క్రిక్కిరిసిపోయి ఒరిస్సానుంచీ గుజరాత్‍కి వలస వెళ్ళే కూలీలు, ఎన్నో కట్నం చావుల వెనక దన్ను నిలబడే మగవాడి అమ్మలు. వీళ్ళంతాకూడా యీ సంస్కృతిలో భాగమే. కానీ ఏవీ కూడా అతన్తో చర్చించలేదు. అతనే నా మనసు చదివినట్టు అన్నాడు. “ఏ సమస్యేనా వ్యక్తిగతం. అమ్మ అనేది మన సంస్కృతి నాగరీకతలకి సంకేతం. ఆమె పెంచితేనేగా మనం యిలాగో, మరొకలాగో, అసలెలాగో ఒకలా తయారయేది? ఆమె వంటరిగా మిగిలేప్పటికే ఎంతోకొంత నాన్న పురుషాధిక్యతకీ మన బాల్యానికి ఖర్చైపోయి వుంటుంది. మిగిలిన కొద్దిభాగం కోరేది మన దయ, కరుణ, అవి కూడా లేనివాళ్ళమైతే ఎలా?”
తెలుగు యువకుడిలా నేనూ నిస్సహాయంగా నవ్వి వూరుకున్నాను.
బెర్త్ మీదికి చేరాను. మళ్ళీ ఏవో జ్ఞాపకాలు.
నాకప్పుడు ఇరవైనాలుగేళ్ళు, బియ్యెస్సీ పూర్తైంది. ఉద్యోగంలో చేరాలనుకుంటున్నాను. నా పెళ్ళి ప్రస్తావన యింట్లో యింకా రాలేదు. అన్నయ్య అప్పటికే బియ్యే చదివి ఏదో చిన్న వుద్యోగం చేస్తున్నాడు. ప్రైవేట్‍గా పీజీ కూడా చేసాడు.
“అమ్మావాళ్ళూ నీపెళ్ళి చేస్తారనే ఆశ నీకుందేమోగానీ అలాంటి నమ్మకం నాకేమీ లేదు. నా ఫ్రెండు అతుల్. బెంగాలీ. తల్లీతండ్రీ చిన్నప్పుడే చనిపోతే తాతగారి దగ్గర పెరిగాడు. నువ్వంటే యిష్టం. మన కుటుంబపరిస్థితులు తెలుసు. నిన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడు. చదువు, మంచి వుద్యోగం. ఇంతకన్నా మంచి మేచ్ నీకు రాదు” అన్నాడు.
నేను తెల్లబోయాను. అతుల్‍ని అన్నయ్యతో రెండుమూడుసార్లు చూసాను.
“అమ్మా, నాన్నా?” అన్నాను.
“వాళ్ళకలాంటి పట్టింపులుంటాయని నేననుకోను. ఉన్నా బాధ్యత తప్పుతుందని వప్పుకుంటారు”
“అన్యాయంగా మాట్లాడుతున్నావు”
“నాన్నగారి బాధ్యతారాహిత్యంవల్ల మనం ఎంత అన్యాయమౌతున్నామో యింకొన్నాళ్ళు పోయాక నీకే తెలుస్తుంది”
“నీకు తెలిసిందా?”
“తెలిసింది. నాకూ అతుల్‍కీ గల తేడా చూడు. తల్లితండ్రీ లేకపోయినా వాడికి తాతగారు అన్నీ అమర్చారు. ఏం చెయ్యచ్చో, ఎలా వుండాలో అన్నీ దగ్గరుండి గైడ్ చేసారు. ఆ తర్వాత వాడికి నచ్చిన అమ్మాయిని చేసుకునే స్వేచ్ఛనిచ్చారు. నేను? పర్సనల్‍రూమ్ కూడా లేని యింట్లో మామూలు గవర్నమెంటు కాలేజీలో చదువుకున్నాను. ఇంటినిండా ఎప్పుడూ బంధువులు, ఫ్రెండ్సు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎలా రాయగలనో ఆలోచించు. వీధిదీపాల ముందు కూర్చుని చదువుకున్న వాళ్ళు లేరా అని వాదించకు. మొండిగా చెప్పాలంటే అది వాళ్ళ కర్మ. గత్యంతరం లేక. అంతే తప్ప అవకాశం వుండీ అదో అభినివేశం కాదు. సున్నితంగా చెప్పాలంటే నేనంత తెలివైనవాడిని కాను. అన్నీ అనుకూలంగా వుంటేనే ప్రతిభని చూపించగలను. అదీ సామాన్యమైన ప్రతిభని. ఈ పెళ్ళిళ్ళూ, పార్టీలూ, వూళ్ళెళ్ళడాలూ, ఎవరెవరో మనింటికి రావడాలూ యివన్నీ తగ్గించి నాన్నగారు నామీదా నీమీదా కొంత శ్రద్ధ కనబరిస్తే బావుంటుందనిపిస్తుంది”
నిజమే! నాన్నగారు యిల్లు పట్టించుకోరు. అమ్మ ఆయన నీడ. డబ్బు అంతంత మాత్రమే.
“నేనిప్పుడేం చెయ్యను?”
“అతుల్‍ని పెళ్ళి చేసుకో. నేను దగ్గరుండి జరిపిస్తాను”
“భయంగా వుంది”
“ఐతే జీవితాంతం అమ్మానాన్నలకి సేవ చేసుకుని తరించు పెళ్ళి మానేసి”
ఆ తర్వాత అతుల్ నాతో మాట్లాడాడు. మూడు యింగ్లీషు పదాల్లో కాకుండా హావభావాల్లో తన ప్రేమని వ్యక్తపరిచాడు. తనకి నేనంటే చాలా యిష్టమట. నాకూ అలాంటి యిస్టం వుంటే పెళ్ళి చేసుకుందామన్నాడు. వయసులో వున్న అమ్మాయితో అన్ని అర్హతలూ గల యువకుడు అలా అంటే కాదనగల శక్తి ఎవరికీ వుండదేమో!
అన్నయ్య అమ్మానాన్నలతో మాట్లాడాడు.
“ఇప్పుడు దాని పెళ్ళికి తొందరేంటి? బియ్యెస్సీ చదివింది. ఏదో వుద్యోగం చూసుకుంటుంది. అప్పుడాలోచిద్దాం” అన్నారు నాన్న ఏమాత్రం వుత్సాహం చూపించకుండా.
“అప్పుడేనా మీరో లక్షో యాభైవేలో ఖర్చుపెట్టగలరా? “సూటిగా అడిగాడు అన్నయ్య. ఆ ప్రశ్నకి నాన్న దగ్గర జవాబు లేదు.
“తన ఫ్రెండ్సందరికీ పెళ్ళిళ్ళైపోయాయి. ఇదొక్కర్తే మిగిలివుంది. తోటివాళ్ళంతా భర్తలవెంట పిల్లల్ని ఎత్తుకుని తిరుగుతుంటే యిది వుద్యోగం చెయ్యాలా? ఏం వుద్యోగం? డిగ్రీకి ఏం వుద్యోగం వస్తుంది? ఐనా నాలుగేళ్ళనుంచీ ప్రయత్నిస్తుంటే నాకే రాని వుద్యోగం దీనికొస్తుందా? ఏ ప్రైవేటు కంపెనీలోనో చెయ్యాలి. అదంత అవసరమా? ఎందుకు నాన్నా, మీరు లోకం పోకడననుసరించి వెళ్ళరు?” తనే మళ్ళీ అడిగాడు.
నాన్న లేచి వెళ్ళిపోయారు.
అన్నయ్యే నిర్ణయం తీసుకుని పెళ్ళి తేదీ ప్రకటించాడు. “నువ్వింకా చదివి లేదా పుద్యోగం సంపాదించుకుని ఏదో సాధించాలనేది నాన్న ఆకాంక్ష కావచ్చు. అవన్నీ పెళ్ళయ్యాక కూడా చెయ్యచ్చు. అతుల్ ఈ క్షణాన మాత్రమే నువ్వందుకోగలిగే అవకాశం” అన్నాడు.
సివిల్ మేరేజికి అప్లై చేసాము నేనూ, అతుల్. అమ్మ, నాన్న నాతో మాట్లాడటం మానేసారు. అంతకన్నా వాళ్ళు నువ్విలా చెయ్యటం మాకిష్టం లేదు, నీ పద్ధతి మార్చుకో అని కోప్పడి వుంటే మామధ్యనున్న బాంధవ్యాలకి విలువ వుండేదేమో! కానీ నాన్న స్వప్నాల్లో బ్రతికే వ్యక్తి.
పెళ్ళిరోజు నన్ను కేజువల్‍గా బైటికి తీసుకెళ్తున్నట్టు రిజిస్ట్రారాఫీసుకి తీసుకెళ్ళాడు అన్నయ్య. దండలు మార్చుకుని సంతకాలు పెట్టడంతో పెళ్ళైంది. అన్నయ్య, అతుల్ తాతగారు సాక్షిసంతకాలు చేసారు. మన మంగళసూత్రాలకి వాళ్ళ సాంప్రదాయంలో సమానమయే దంతపుగాజులు అతుల్ నాకిచ్చాడు. ఇంటికి తీసుకురావద్దని నాన్న చెప్పారట. పెళ్ళవగానే ఫ్రెండ్స్‌‌కి చిన్న ట్రీట్ యిచ్చి, అట్నుంచీ అటే రైలెక్కాము. అదే పలాసా స్టేషన్తో నా ఆఖరి అనుబంధం. రైలెక్కిస్తూ అన్నయ్య నా చేతుల్ని పట్టుకుని ఏడ్చేసాడు. అతుల్ అన్నయ్య భుజం తట్టి ఓదార్చాడు. నేను చేసింది తప్పే కావచ్చు, కానీ అదొక్కటీ తప్ప విచారించవలసిన సందర్భాలేవీ అతుల్ సృష్టించలేదు.


ఆలోచనల్లో ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానోగానీ భువనేశ్వర్లో ప్లాట్‍ఫారమ్ మీద హడావుడికి మెలకువ వచ్చింది. తెలుగు యువకుడు ఎప్పుడో దిగిపోయాడు. సిక్కు బేగ్ సర్దుకుని దిగటానికి రెడీగా వున్నాడు. నన్ను చూసి గౌరవంగా విష్ చేసి, దిగిపోయాడు. షాల్ మడతపెట్టి హేండ్‍బేగ్‍లో పెట్టుకుని, సూట్‍కేసు తోసుకుంటూ దిగాను. పెద్ద వర్షం పడుతోంది. రిటైరింగ్ రూమ్ తీసుకున్నాను. కొద్దిసేపు విశ్రాంతి స్నానం చేసి, కేంటిన్‍లో టిఫెన్ తిని, వైజాగ్‍లో కొన్న బొమ్మలు బేగ్‍లో పెట్టుకుని స్టేషన్ బైటికొచ్చాను. వర్షం పూర్తిగా తగ్గింది. చెట్ల ఆకుల మీద నిలిచిన నీటి బిందువులమీద సూర్యకిరణాలు పడి పరావర్తనం చెందుతున్నాయి.
దార్లో ఒక పెద్దచెట్టు. దానికి ఒకేఒక్క లేత నీలిరంగు పువ్వు. వంటరితనంతో దిగులుగా వున్నట్టనిపించింది. కోసి బేగ్‍లో వేసుకున్నాను. మళ్ళీ నాకే అనిపించింది. నా బేగ్‍లో వున్న అసంఖ్యాకమైన ప్రాధాన్యత లేని వస్తువుల మధ్య దాన్నలా వేస్తే యింకా బాధపడ్తుందని…వక్కపొడి వేసుకునే జువెల్రీ బాక్స్ ఖాళీ చేసి అందులో పెట్టి కొంత ప్రాధాన్యత కల్పించాను. ముదురు నీలిరంగు వెల్వెట్ మీద లేత నీలిరంగుతో అది సోయగాలు పోయింది. మనిషిని పట్టి వుంచే ఫ్రేమ్… కుటుంబం అనేది అందంగా వుంటే అందులోని ఆ మనిషికీ అందం వస్తుంది. అదే సోషల్ యీస్టటిక్స్.. సామాజిక సౌందర్యం.
చాలాదూరం నడిచాక కొరియర్ ఆఫీసు కనిపించింది. విదేశాలకి కూడా వాళ్ళు పంపుతారట. అక్కడే బొమ్మల్ని పొందిగ్గా పేక్ చేయించి పంపేసాను. ఒకటి ఉషకి, రెండోది ఇంటికి . బొమ్మ అందగానే వుష సంతోషపడుతుంది. కానీ పీయూష్?
తిరిగి స్టేషనుకొచ్చాను. రాత్రి పదిన్నరకి రైలు. సుదీర్ఘ విరామం. మనిషిని బాధపెట్టే విషయాల్లో నిర్వ్యాపారత్వం ఒకటి. ఒరిస్సా టూరిజం బస్సు కోణార్క, పూరీ వెళ్తోందని తెలిసింది. టికెట్ కొనుక్కుని బస్‍లో కూర్చున్నాను. మళ్ళీ వర్షం. బస్సు నిండా జనం. జంటలుగా గుంపులుగా నేనొక్కదాన్నే వాళ్ళమధ్య వంటరిగా. వాక్‍మెన్ చెవులకి తగిలించుకున్నాను.
బస్సు కదిలింది. అరవై కిలోమీటర్ల ప్రయాణం. రెండు గంటలు పట్టింది కోణార్క చేరేసరికి. అతుల్‍తో అప్పుడెప్పుడో అల్లరల్లరిగా తిరిగిన ప్రదేశాలు. ఆకాశాన్నంటే గుడి.. గుడి వెనుక సముద్రపుహోరు. ఆ శిథిలాలయాన్ని చూస్తుంటే, గుండెల్నిండా చెమ్మలా పాకుతున్న బాధ. వెళ్ళి సముద్రపువడ్డుని నిలబడ్డాను. కాసేపటికి మళ్ళీ ప్రయాణం. ఈమాటు పూరీకి. అవే చెట్లు, అవే ఆకులు, అదే వంటరితనపు బాధ. పూరీలో కూడా సముద్రాన్ని చూసాను. మహానది కలుస్తుండటం చేత నీళ్ళు నల్లగా వున్నాయి.
తిరిగి రిటైరింగ్ రూమ్ చేరేసరికి ఆరున్నర. ఒక్కదాన్నీ గదిలో వుండలేక సామాన్లు తీసుకుని జనరల్ వెయిటింగ్ రూమ్‍లోకి వచ్చి కూర్చున్నాను. ఫైనార్ట్స్ పిల్లలు కూర్చున్నవాళ్ళని కూర్చున్నట్టు బొమ్మలు గీస్తున్నారు. వాళ్ళ కాగితాలమీద స్కెచ్చిగా కాసేపు మారిపోయాను.
రాత్రి పదీనలభైయైదుకి పురుషోత్తం ఎక్స్‌‌ప్రెస్‍లో టాటానగర్‍కి ప్రయాణం. చేరేసరికి వుదయం ఆరుంబావు. బాబీ స్టేషనుకొచ్చాడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి. తన వెంట ఏడెనిమిదిమంది ఫ్రెండ్స్. నన్ను చూడగానే వాళ్ళందరి కళ్ళల్లో సంతోషపు మెరుపు. కొందరైతే నాకు తెలీనే తెలీదు. ఇంకొందరు ఫోన్లో పరిచయం. ఒక్కొక్కరూ ఎంతోకాలంనుంచీ పరిచయం వున్నట్టు ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. అందరూ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వంగి నా పాదాలని స్పృశించారు.
“దగ్గర్లోనే హోటల్లో రూమ్ తీసుకున్నానమ్మా! నువ్వెన్ని రోజులుంటే అన్నిరోజులూ నీతోటే వుంటాను” అన్నాడు బాబీ చిన్నపిల్లవాడిలా.
హోటల్‍కి వెళ్ళాము. ఇంటి దగ్గర్నుంచి తెచ్చిన కారప్పూస, లడ్డూలు పేపర్ ప్లేట్లలో పెట్టి అందరికీ యిచ్చాను. ప్రీతిగా తిన్నారు.
మూడురోజులున్నాను టాటానగర్లో. అదే జమ్‍షెడ్‍పూర్. టాటాలని దేశానికి అందించిన ఆ వూరు పెద్దగా డెవలపవలేదు. అంతా లేబర్ కల్చర్. ఇండస్ట్రియల్ లేబర్ బాగా ఎక్కువలాగుంది. శని, ఆదివారాలు కావటంతో బాబీ పూర్తిగా నాతోనే వుండిపోయాడు. క్షణం కూడా విడవకుండా ఒకటే కబుర్లు. తల్లిదండ్రులపట్ల యింత ఎటాచిమెంటుతో వుండే పిల్లల్ని మనమే చదువుల పేరిట, వుద్యోగాల పేరిట దూరం చేసుకుంటున్నాం అనిపించింది. బాబీ ఎంత బెంగటిల్లాడో చూస్తుంటేనే అర్థమైంది. ఊరు కాని వూరు, భాష తెలియని మనుషులు.
“ఇంకో రెండేళ్ళు కష్టపడ్డావంటే సెటిలౌతావు” నచ్చజెప్పాను.
“అప్పుడే ఎక్కడమ్మా? జీజాజీ స్టేట్స్ రమ్మంటున్నారా? ఉషక్క కూడా అంది” అన్నాడు. హతాశురాలినయ్యాను. ఈ బెంగ ఒక పార్శ్వం, కెరీర్ పట్ల ఆశ మరో పార్శ్వం.
సోమవారం బాబీ ముఖ్యమైన క్లాసులున్నాయని కాలేజీకి వెళ్ళిపోయాడు. హోటల్ రూమ్‍లో నాకు మళ్ళీ వంటరితనమే. మంగళవారం తిరుగు ప్రయాణమయాను. ఉదయాన్నే స్టీల్‍ఎక్స్‌ప్రెస్‍కి ఎక్కించాడు బాబీ. రైలు కదుల్తుంటే వాడి కళ్ళలో పల్చటి కన్నీటిపొర. నా గుండెల్లో ఎక్కడో కలుక్కుమంది. కనుమరుగయేదాకా యిద్దరం చెయ్యూపుతూనే వున్నాం.
ఖరగ్‍పూర్ చేరేసరికి తొమ్మిదిన్నర. అక్కడినుంచీ నన్ను గమ్యం చేర్చడానికి ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ వుంది, అక్కడి నేలమీద అడుగుపెట్టగానే వళ్ళు ఝల్లుమంది అతుల్‍ని తాకిన మొదటిసారిలాగే. రవీంద్రుడినీ, శరత్‍నీ, యిద్దరు బోసుల్నీ అందించిన బెంగాలీ నేల.
ఏకంగా ఒక ఐఐటీయే వున్నా, చాలా చిన్నవూరు ఖరగ్‍పూర్. పొడవైనదిగా ప్రపంచం ప్రసిద్ధి చెందిన ప్లాట్‍ఫామ్. దాన్నే మూడుగా విభజించారు. వెయిటింగ్‍రూమ్ పాతకాలపు కట్టడంలా వుంది. పైనమాత్రం రేకులు.
ఇంతలో ఆకలిగా అనిపించింది. కేంటిన్‍కి దారితీసాయి నా కాళ్ళు. థాలీ ఆర్డరిచ్చానుగానీ ఒక్క ముక్క కూడా తినలేకపోయాను. స్టేషన్లో బాబీ కంటితడి ఒక్కసారిగా గుర్తొచ్చి నన్ను వుక్కిరిబిక్కిరి చేసింది. పదార్థాలన్నీ వదిలిపెట్టి కొద్దిగా పెరుగన్నం తిని లేవబోతుంటే నన్నే గమనిస్తూ నిలబడ్డ ముసలి వెయిటరు-
“ఏమైంది కూతురా?” అనడిగాడు బెంగాలీని వీలైనంత హిందీగా మార్చి. బాబుని వదిలిపెట్టి వచ్చిన విషయం మనసు కలతబారిన సంగతి చెప్పాను. అతడు తాత్వికంగా నన్వాడు.
“పిల్లలు మనమీద ఆధారపడి వున్నంతవరకే ఈ ఆరాటాలు, తాపత్రయాలు. ఉద్యోగాలొచ్చి, పెళ్ళిళ్ళైపోయాక వాళ్ళెవరో మనం ఎవరో” అన్నాడు.
అతడికి ఎనిమిదిమంది పిల్లలట. ఐదుగురు ఆడ, ముగ్గురు మగ. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయని చెప్పాడు. దుర్గాపూజకి పిల్లలందర్నీ పిలిచి, బట్టలు పెట్టి వేడుగ్గా పండుగ జరుపుతాడట. జీవనసాఫల్యం కనిపించింది అతని మాటల్లో. అంతలోనే-
“పండుగవగానే ఎక్కడివాళ్ళక్కడికి వెళ్ళిపోతారు. మిగిలేది నేనూ నా భార్యే” అన్నాడు వైరాగ్యం ధ్వనించేలా.
అతుల్ గురించి, పిల్లల గురించి అడిగాడు. బాబీ యింతదూరం వచ్చి చదువుతున్నాడనీ, వాడిని చూడటానికి నేను రాష్ట్రాల అవతల్నుంచీ వంటరిగా వచ్చాననీ విని ఆశ్చర్యపోయాడు. ఉష అమెరికాలో వుందన్న విషయం విని యింకా ఆశ్చర్యపోయాడు. నాకూ తనకీగల స్థాయీభేదాన్ని అప్పుడే గుర్తించినట్టు ముడుచుకుపోయాడు. కానీ-
“ఏమైంది కూతురా?” అన్న అతని పలకరింపులోని ఆర్తి నా మనసునిండా మలయపవనంలా తాకుతూనే వుంది. అతనితో మాట్లాడుతూ వదిలిపెట్టినవన్నీ తిన్నాను. కడుపు నిండింది. లోపలి అలజడి చల్లారింది. నా హృదయం అతని యింటిని వెతుక్కుంటూ వెళ్ళింది. ఎనిమిదిమంది పిల్లల కుటుంబాల మధ్య దుర్గాపూజ జరుపుకుంటున్న దృశ్యాన్ని రమ్యంగా చిత్రించుకుంది. అలాంటి కుటుంబంలో నాకు భాగం లేనందుకు సన్నటి అసంతృప్తిరేఖతో తిరిగి నన్ను చేరుకుంది.
దార్లో తిందామని జమ్‍షెడ్‍పూర్లో కొన్న రసగుల్లాలు తీసి, అతనికిచ్చాను.
“ఎందుకు కూతురా?” మొహమాటపడ్డాడు.
“కూతుర్నన్నారుగా? ” నవ్వాను. అతను తీసుకుని కృతజ్ఞతలు తెలిపాడు.
ఈస్ట్‌కోస్ట్ ఎక్కాను. కిటికీ పక్క సీటు. ఎక్కిన దగ్గర్నుంచీ గమనించాను… వంటిమీద చిన్న ఆచ్చాదన మాత్రమే వున్న బెస్తవాళ్ళు రైలాగినప్పుడల్లా కేన్లూ, ప్లాస్టిక్‍బిందెల్తో దిగి, ట్రాక్ పక్కనున్న కుంటల్లోంచీ నీళ్ళు ముంచుకుని ఎక్కుతున్నారు. హడావిడి, తోపులాట, రైలెళ్ళిపోతుందేమోనన్న కంగారు. పడుతున్నారు, లేస్తున్నారు. ఎక్కుతున్నారు. వింతగా చూసాను.
తర్వాత తెలిసింది. ఈ రైల్లో ఏలూరుదాకా చేపల రవాణా జరుగుతుందనీ, ఎప్పటికప్పుడూ నీళ్ళు మారుస్తూ చేపలు చనిపోకుండా చూసుకోవలసిన బాధ్యత వాళ్ళదేనని. బ్రతుకు పోరాటంలో వాళ్ళ మనసులు నిద్రాణంగా వున్నాయి. ఉన్నదల్లా ఐదారడుగుల శరీరం. దాన్ని నియంత్రించే జానెడు పొట్ట. ఆ పొట్టకోసం తిప్పలు. నిట్టూర్చాను.
భువనేశ్వర్ చేరేసరికి చీకటిపడింది. మహానదికి ఎన్ని వంతెనలో! ఒరిస్సా ప్రభుత్వ ఆదాయమంతా ఈ వంతెనలు కట్టడానికీ వాటి నిర్వహణకే సరిపోతుందేమో!
వైజాగ్ స్టేషన్లో నా సెల్ మోగింది. అతుల్.
“నీకోసం ప్లాట్‍ఫామ్ మీద వున్నాను. ఎదురుచూస్తున్నాను. అసలు భువనేశ్వర్లోనే యింటర్‍సెప్ట్ చెయ్యాల్సింది. అంత టైం లేకపోయింది. ఈవేళ, రేపు ఆఫ్ అని వుదయమే తెలిసింది. వెంటనే రైలెక్కేసాను”
నా గుండె గువ్వపిట్టలా కువకువలాడింది. రైలాగీ ఆగగానే దిగేసాను. అతని రెండు బలమైన చేతులూ ఆర్తిగా నన్నల్లుకున్నాయి.
“హౌ ఆర్యూ?” చెవుల్లో గుస గుస.
రాత్రికి హోటల్లో వుండి పొద్దున్నే బీచికి పరిగెత్తాము. ఎంత అందమైన వుదయం! రాత్రంతా అలలు విసిరిన గవ్వలేరుకోవడానికి బెస్తపిల్లలు అప్పటికే వచ్చేసి వున్నారు. వాకింగ్ కి వచ్చినవాళ్ళు, సూర్యోదయాన్ని చూడటానికి వచ్చినవాళ్ళు, నీరవనిశ్శబ్దంలో చిరు సందడి.
అతుల్ తన జేబులోంచీ ఒక బాక్స్ తీసాడు. నాకు ప్రియాతి ప్రియమైనది. చిన్న మంచి గంధం పెట్టె. దాంట్లో ఒకే ఒక సంపెంగపువ్వు, ఎండిపోయి, ఐనా సువాసన వదలక. మా పెళ్ళిరోజున అతుల్ నా జడలో పెట్టినది.
“మన ప్రేమజ్ఞాపికని ఈ అనంతసాగరంలో కలుపుదాం. ప్రకృతిలో కలిసిపోయి అజరామరంగా వుంటుంది మనం వున్నా లేకున్నా” అంటూ ఆ పెట్టెని నీళ్ళలోకి వదిలాడు. తనని ఆనుకుని కైదండ పట్టుకుని నిలబడి దాని గమనాన్ని చూసాను. అరుణోదయవేళ ఎర్రటి వెలుతుర్లో అదొక అద్భుతశ్యం.
ఎండెక్కాక బట్టలు వంటిమీదే ఆరబెట్టుకుని, యిసుక దులుపుకుని హోటల్ రూముకెళ్ళాం. స్నానం చేసాక అతుల్ మంచి రెస్టారెంటుకి తీసుకెళ్ళాడు. వరంగల్లోలాగే యిక్కడా ఒక వంటరి టేబుల్. దానికి ఒకవైపు రెండు కుర్చీలు. మరోవైపు బిగించబడ్డ అద్దం. మేమిద్దరం ఎప్పుడు వెళ్ళినా యిలాంటి సీటే వెతుక్కుంటాడు అతుల్.
ఎందుకని అడిగాను పెళ్ళైన కొత్తలో.
అతని జనాబు “టేబుల్ అటంచుని వున్న శూన్యం కనిపించదు”
నిజమే! ఉన్నది మేమిద్దరమే అయినా ఎంతో నిండుగా వుంది టేబుల్.
“బెంగాల్‍దాకా వెళ్ళొచ్చానుకదా అతుల్, కొద్దిగా కవిత్వదోషం అంటుకుంది. పిసరంత వాత్సల్యాన్ని వెతుక్కుంటూ ఎక్కడెక్కడో తిరిగిన నా హృదయం ఆ తిరిగిన చోటల్లా కొంతకొంత తనని కోల్పోతూ వచ్చింది” అన్నాను.
అతుల్ నవ్వి “ఆ దోషం మా ప్రాంతపు రక్తంలోనే వుంది. నీవెనకే నా హృదయం కూడా వెళ్ళి నువ్వు పోగొట్టుకున్న భాగమంతా పోగుచేసుకుని తనలో కలుపుకుంది. అందుకే దాని వైశాల్యం పెరిగిపోయింది. నిన్నందులో బంధించి వుంచుతాను యింకెక్కడికీ వెళ్ళకుండా” అన్నాడు.
నేను నవ్వాను. మా చుట్టూ మనుషులు లేకపోయినా మనసునిండా అనుభూతులున్నాయి. అందరూ ఆప్తులు కారు. కానీ అంతరంగంలోకి వచ్చి ఒక్కొక్క అనుభూతిని మిగిల్చి వెళ్తున్నారు. పుట్టుక సత్యం. మరణం తథ్యం. మధ్యలో వున్న జీవితం అనుభూతుల పొరలని చుట్టుకున్న కాలగతి.
రైల్లో సిక్కు, ఖరగ్‍పూర్లో ముసలి వెయిటరు.. తిరిగొస్తుంటే బెస్తవాళ్ళు.. నేను కప్పుకున్న కొత్తపొరలు.