సింధూరి by S Sridevi

  1. పాతకాలపు మనిషి by S Sridevi
  2. ఒలీవియా by S Sridevi
  3. నాకొద్దీ అభ్యుదయం by S Sridevi
  4. అర్హత by S Sridevi
  5. సింధూరి by S Sridevi
  6. మలుపు by S Sridevi
  7. యంత్రసేవ by S Sridevi
  8. ప్లాస్మా జీవులు by S Sridevi
  9. మనుషులిచ్చిన శాపం by S Sridevi
  10. వంకరగీత by S Sridevi
  11. బంధీ by S Sridevi
  12. లాటరీ by S Sridevi
  13. ముల్లు by S Sridevi
  14. లే ఆఫ్ by S Sridevi
  15. నేను విసిరిన బంతి by S Sridevi
  16. మలివసంతం by S Sridevi
  17. తప్పనిసరిగా by S Sridevi
  18. ప్రేమరాహిత్యం by S Sridevi
  19. పార్థివం by S Sridevi
  20. ఖైదీ by S Sridevi

Youtubers please WhatsApp to 7382342850

మనుషుల్లో కృత్రిమత పెరిగిపోయిందనేది వాస్తవం. తమకేం కావాలో తెలుసు. ఏం అక్కర్లేదో కూడా తెలుసు. ఏది కావాలో దాన్ని వదిలిపెట్టి, లేని అవసరాన్ని సృష్టించుకుని దానికోసం అవస్థపడటం జీవనశైలిగా మారిన నేపథ్యంలో-
ముందురాత్రి క్రిస్టల్ ప్యాలస్‍లో జరిగిన పార్టీగురించి రావు అడిగిన ప్రశ్న- ” బాగా ఎంజాయ్ చేసాం కదూ?” అని. అది గుర్తొచ్చింది నరేంద్రకి. వెంటనే పార్టీనేమాత్రం ఎంజాయ్ చెయ్యలేకపోయిన సింధూరి కూడా గుర్తొచ్చింది.
ఇద్దరూ అలా వెంటవెంటనే గుర్తొచ్చారంటే వాళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉందనికాదు, ఒకే విషయంమీద ఇద్దరి స్పందనలో గల వైరుధ్యం.
సింధూరి నరేంద్రని చూసీచూడనట్టు చూసింది . ఆమె కళ్ళలో అదే నిర్లిప్తత. భావరాహిత్యం. హోరెత్తిపోతున్న సంగీతం మధ్య ఇమడలేక సుదూరతీరాల్లో ఎక్కడో ఏదో వెతుక్కుంటూ వలసపోయిన మనసు. అది లేక ప్రాణమున్నా జీవంలేని శరీరం. దాన్ని లయబద్ధంగా ఆడిస్తున్న ఆమె భర్త- దిలీప్. నరేంద్రని చూసి ఎవరో తెలియనట్లు ముఖం తిప్పుకున్నాడు. అతనో పెద్ద క్యారికేచర్.
” ఎంజాయ్డ్ ఏ లాట్… కదూ?” రావు ప్రశ్న మళ్ళీ గుర్తొచ్చింది నరేంద్రకి.
ఇద్దరూ కో ప్రొఫెషనల్స్. సైకియాట్రీ లైన్లో ఉంటూ ఒకరికొకరు పోటీ కాకుండా స్నేహాన్ని దాదాపు పదేళ్లనుంచి నెరుపుకుంటున్నారు. డాక్టర్లకి వృత్తిపరంగా పోటీపడాల్సిన అవసరం ఎప్పుడో తప్పిపోయింది, వాళ్ళ వృత్తిలోకి వ్యాపార దృక్పథం ప్రవేశించడంతో. ఎవరి సర్కిల్ వాళ్లకు ఉంటుంది. ఆ సర్కిల్లో కొందరు పేషెంట్లు, వాళ్ల సర్కిల్స్… అన్నీ ఆవృతవృత్తాలు. ఒక్కోసారి ఈ పేషెంట్లు ఒక డాక్టర్‍నుంచి ఇంకో డాక్టర్‍కి మారతారు. అలా ఎందరో డాక్టర్లని మార్చి వచ్చిందే సింధూరి.
సింధూరి! పదహారేళ్ల వయసులో అందరూ అందంగానే కనిపిస్తారు. అది అందం కాదు, ఆ వయసు తెచ్చే ఆకర్షణ. ఆ తర్వాత కూడా నిలిచి ఉండేదే అందం. అలాంటి అందం సింధూరిది.
ఆమెని మొదటిసారి చూడగానే నరేంద్ర మనసు పగ్గాలు తెంచుకుని ఎక్కడికో ఎగిరి పోయింది. సుతారంగా విచ్చుకునే మొగ్గలు, నిశ్శబ్దగీతాలు గుర్తొచ్చాయి. కాలేజీ రోజులప్పటి అసంపూర్ణ ప్రేమచిత్రాలు, వాటి పరిపూర్ణతని పెళ్లిలో వెతుక్కోవడం, అది దొరికిందో లేదో తెలియని సందిగ్ధత… అన్నీ మెరుపుల్లా మెరిసాయి. అలాంటి సింధూరిని నరేంద్ర దగ్గరికి ట్రీట్‍మెంట్‍కోసం తీసుకొచ్చాడు ఆమె భర్త.
” నా పేరు దిలీప్. ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ని” అని తనని తను పరిచయం చేసుకుని ఆమెనికూడా తనే పరిచయం చేసాడు. ఆమె తన దగ్గరకు వచ్చిందంటే అదొక అపశృతిలా అనిపించింది నరేంద్రకి. పరిశీలనగా చూసాడు. మొహంలో ఒకలాంటి నిరాసక్తత కనిపిస్తోంది. రోగలక్షణాలకోసం వెతికాడు. అలాంటివేం కనిపించలేదు.
భర్తే ఆమె సమస్యా? చాలామంది గుర్తించరుగానీ మనసులు కలవనప్పుడు భార్యాభర్తలే ఒకరికొకరు పెద్ద తలనొప్పవుతారు. మనసులు కలవడమంటే ప్రేమ పుట్టడంలాంటి నైరూప్యవిషయమేం కాదు. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి అభిరుచులూ మనోగతభావాలూ మరొకరికి అర్థమై సంఘర్షణేం లేకుండానే వాటిని మననిస్తారు. లేకపోతే ఏముంది? వ్యక్తిగత అస్తిత్వంకోసం ఇద్దరూ సంఘర్షిస్తారు . సంసారం సాగాలంటే ఎవరో ఒకరు తగ్గాలి. ఈ తగ్గటమనేది ఎప్పుడూ ఎవరో ఒకరివంతే అయితే ఆ అసంతృప్తి నిత్యకాష్ఠమే.
తన పదేళ్ల అనుభవంలో ఎన్నో కేసులు చూశాడు నరేంద్ర. హిస్టీరియా, డిప్రెషన్… ఎన్ని కేసులని? వచ్చాక వైద్యం చేయించుకోవడం సరే! రాకుండానే ఎందుకు చూసుకోరని? మారుతున్న జీవనశైలి. పెరిగిపోతున్న స్వార్థం. మనిషికీ మనిషికీ మధ్యనగల అవగాహనలేమి. ఒత్తిడి. మెదడు విడుదల చేసే ఎండార్ఫిన్స్. క్యాన్సర్‍కేనా, గుండెజబ్బులకేనా, మానసికసమస్యలకైనా కారణాలివే.
పగలూ రాత్రీ తేడా లేకుండా ట్రాన్క్విలైజర్స్ మత్తులో కొట్టుకునే క్యాన్సర్ పేషెంట్లు… పగలూ రాత్రీ తేడాని గుర్తించలేనంత నిరాసక్తతలో కూరుకుపోయే డిప్రెషన్ పేషంట్లు… ఇదేనా, ఇరవర్యవ శతాబ్దాంతపు ప్రగతి? గుండెల్లో గుచ్చుకున్నట్లయింది నరేంద్రకి. సింధూరి అతన్నంతగా కదిలించింది.
దిలీప్ పాత రిపోర్ట్స్ చూపించాడు. వాటిని చదివాక –
“ఆమెని పరీక్షించాలి. మీరు కొద్దిసేపు బయట ఉండండి” అని సున్నితంగా సూచించాడు నరేంద్ర. వెళ్తూ దిలీప్ చూసిన చూపుల్లో అన్నీ నేనే చెప్పాను, ఇంకా మీరు అడిగేదేంటనే భావం వ్యక్తమైంది.
అతను వెళ్ళగానే చెప్పింది సింధూరి,” నాకెలాంటి జబ్బూ లేదు. మీరనవసరంగా శ్రమపడకండి డాక్టర్! రాయాలనుకున్న మందులేవో రాయండి. లేని రోగానికి మందుండదుకాబట్టి తగ్గలేదని మరో డాక్టర్ దగ్గరికి వెళ్తాం” ఆ చెప్పడంలో ఎంతో స్పష్టత ఉంది.
ఆమె చెప్పిన విషయం నరేంద్ర ఊహించినదే అయినా అంత బాహాటంగా చెప్తుందననుకోలేదేమో, షాకయ్యాడు. అయినా వెంటనే తేరుకుని” ఎందుకని ఇలా?” అని అడిగాడు.
” మీ దగ్గరకొచ్చిన వాళ్ళందర్నీ ఇలాగే అడుగుతారా?”
” అడిగి చెప్పించుకోకపోతే సమస్య ఎలా తెలుస్తుంది? అది తెలుసుకోకుండా నేను వైద్యం ఎలా చేస్తాను?” నరేంద్ర మెత్తగా నవ్వాడు. ఆమె లోతుగా చూసింది. ఆ చూపులో పరిపూర్ణత కనిపించిందతనికి.
” వినండయితే . కొంత వ్యక్తిగతం. కొంత సామాజికం”
” వివరంగా చెప్పండి . సైన్స్‌లో ప్రతిదానికీ నిర్దిష్టమైన పేరుంది. అలా పేరు పెట్టగలిగితే వైద్యం తేలిక. ఉదాహరణకి . దేన్నైనా చూసి అనవసరంగా అతిగా భయపడితే ఫోబియా అంటారు అలాగే దేన్నైనా అతిగా ఇష్టపడితే మానియా అంటారు. అలా…”
సింధూరి కొద్దిసేపు మౌనంగా ఉంది. తలవంచుకుని గోళ్లు చూసుకుంది. తలెత్తితే ఎదురుగా నరేంద్ర కనిపించాడు. అతనిమీంచి పైకి చూస్తే గోడకి చక్కటి సీనరీ కనిపించింది. దానిమీద దృష్టి నిలిపింది. మళ్లీ మామూలుగా కూర్చుని అడిగింది,” గుండెమార్పిడి చాలాకాలంగా చేస్తున్నారు. ముఖాన్నికూడా మారుస్తున్నారని ఈమధ్య చదివాను. అలాగే పెళ్లయీ అవగానే ఆడపిల్లకి మనసు మార్పిడి చేసే ప్రక్రియ ఏదైనా లేదా?”
ఇదీ నరేంద్ర ఊహించినదే. ఆమె చాలా సన్నిహితంగా అనిపించింది. తమ మధ్య సంభాషణ వృత్తిపరమైనదిగా కాకుండా ఆంతరంగికమైన ఇంటరాక్షన్‍గా మారటం గుర్తించాడు.
చాలా క్లుప్తంగా తన గురించి చెప్పింది.” ఎంటెక్ చదివి అతను, ఎమ్మే చదివి నేనూ పెళ్లి చూపుల్లో ఒకరినొకరు చూసుకుని ఇష్టపడి చేసుకున్నాం. మౌలికంగా మా ఇద్దరి ప్రవృత్తులు వేర్వేరు అనే విషయం పెళ్లయ్యాకే అర్థమయింది. అతను చాలా సందడి మనిషి. రాక్ మ్యూజిక్, స్టీరియో, డాన్స్, ఫ్రెండ్స్, పార్టీలు అతనికిష్టం. తక్కువ స్థాయిలో కర్ణాటక సంగీతం వింటూ ఏ పుస్తకమో చదువుకోవడం నాకిష్టం. అతని అభిరుచుల్ని నేనూ ఇష్టపడాలని కొంత ప్రయత్నించాను. కనీసం అలా నటించాలని చూశాను. ఉహూ<… నటన అనేది ఎల్లవేళలా సాధ్యపడే విషయం కాదు. ఆధునిక జీవితంలో ఉండే కృత్రిమత, నాటకీయత నాకు నచ్చవు. కానీ అతను వాటిలో పూర్తిగా కూరుకుపోయి ఉన్నాడు. నేను మౌనంగా ఉంటే డిప్రెషనేమోనని అతనికి భయం. ఒంటరితనానికీ, ఏకాంతానికీ తేడా తెలియని మనిషి. భావుకతకీ, బహిర్వర్తనానికీగల సునిశితమైన బేధం తెలియని వ్యక్తి. నన్నిలా డాక్టర్ల చుట్టూ తిప్పుతున్నాడు” ఆమె గొంతు వణికింది. ఎవరూ ఆమెనింత వివరంగా అడగలేదు. ఎవరికీ తనూ చెప్పలేదు. ఎవరికి చెప్పినా ఎంత చెప్పినా అర్థమవదనే నిర్లిప్తత.
నువ్వే మారాలి. నీ పద్ధతులు మార్చుకోవాలి. అతనికి అనుగుణంగా ఉండాలి. ఆమె చుట్టూ ఎన్నో గొంతుల ఘోష. ఆ ఘోష ముందు ఆమె గొంతు వినిపించదు. కానీ దానికి భిన్నంగా తను పడే తపనంతా నరేంద్ర ముఖంలో కనిపించింది. అందుకే ఆమె గొంతిప్పింది.
పెద్దగా మందులేం రాయలేదు నరేంద్ర. ఆ రాసిన కొంచమైనా దిలీప్ సంతృప్తి కోసం. సింధూరిని మళ్ళీ వెంటనే మరో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఉంచేందుకు. అతన్ని విడిగా పిలిచి చెప్పాడు.
” కొంతమంది నిశ్శబ్దాన్ని ప్రేమిస్తారు. అలాంటివారిలో మీ భార్య ఒకరు. ఆమె చుట్టూ ప్రశాంతమైన వాతావరణాన్ని ఉంచండి” అని మనుషుల్లో ఉండే తేడాలు- వైవిధ్యంనుంచి వైరుధ్యందాకా చెప్పాడు.
వెళ్తూ వెళ్తూ దిలీప్ చూసిన చూపు… దానికర్థం ఏమిటో తొందర్లోనే తెలిసింది నరేంద్రకి.
రావు ఫోన్ చేసి చెప్పాడు, నీ కేసొకటి నా దగ్గరకు వచ్చిందని. అంతే! నిన్నటి పార్టీలో మళ్లీ చూశాడామెని.
” ఎంజాయ్డ్ ఏ లాట్… కదూ?” అని కదా, రావు ప్రశ్న. నరేంద్ర ఆలోచనలు స్మృతిపథంలో విశ్వభ్రమణంలాంటిది చేసి, మళ్లీ అక్కడికొచ్చి ఆగేయి. అలసిపోయిన మెదడు ఇంక ఆలోచించనని మొరాయించింది.
చిన్న మళ్లింపు.
ఫోన్ మోగింది. నరేంద్ర భార్య. నీరజ. గైనకాలజిస్టు. ఇంట్లో మాట్లాడుకోవడానికి తీరిక లేక వదిలేసిన విషయాలని క్లినిక్‍లో కూర్చుని సమయం దొరికినప్పుడు మాట్లాడుతుంది. రావు ప్రశ్నని ఆమెకి బదలాయించి జవాబు రాబట్టాలనిపించింది నరేంద్రకి.
“నీరజా! నిన్నటి పార్టీ బావుందా? ఎంజాయ్ చేసావా?” అడిగాడు. అడిగాక అనిపించింది, అలా అడగకుండా ఉండాల్సిందని. అడగటం అసంబద్ధంగా ఉందని.
” కొత్తగా అడుగుతున్నావేంటి నరేన్? నాకీ పార్టీలవి నచ్చవని నీకు తెలుసుగా? కృష్ణమోహన్‍గారు ఇస్తున్నప్పుడు, రమ్మని మరీ మరీ చెప్పాక బావుండదని వచ్చాను. ఆయన కంపెనీల్లో మనకి వాటాలున్నాయి. వ్యవహారాలు సజావుగా జరగాలని….” అతనలా ఎందుకడిగాడో ఆమెకి అర్ధమవలేదు.” ఏంటి నరేన్, వింతగా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది?” నీరజ గొంతులో ఆతృత. భర్త చాలా సున్నితమనస్కుడని ఆమెకి తెలుసు. ఎప్పుడు, దేనికి ఎలా స్పందిస్తాడో మాత్రం తెలుసుకోలేకపోతోంది. అర్థమైనట్టే ఉంటాడు. అంతలోనే అందనంత దూరానికి వెళ్లిపోతాడు.
” నిన్న… సింధూరి కూడా వచ్చింది”.
” సింధూరి… అంటే??! ఆ ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్ భార్యా? ఆమెంటే నీకెందుకు అంత ఇంట్రెస్ట్?” చివర్లో ప్రశ్నించినప్పుడు ఆమె గొంతు తీవ్రంగా ఉంది. అందులో కొద్దిగా అసూయ ధ్వనించింది. సింధూరి నీరజకి తెలుసు. విమెన్స్ లిబ్ మీటింగ్స్‌లో కలుస్తుంటారు. ఆపైన నరేంద్ర కూడా చెప్పాడు.
నరేంద్ర, భార్య గొంతులో ఒక్కసారిగా వచ్చిన మార్పుని గుర్తించాడు. నవ్వుకున్నాడు. గుండెల్లోంచి ఎగదన్నుకొచ్చిన ఆర్తి దాన్ని ధ్వనింపనివ్వలేదు. ” ఆమెను చూసినప్పుడల్లా నేను బాగా డిస్టర్బ్ అవుతున్నాను నీరజా! ఎందుకో తెలీదు. నా చిన్నతనం, యాంత్రికతతో పరిచయం లేని నా బాల్యపు పల్లె జీవితం గుర్తొస్తుంది. అప్పుడు భావాలు చాలా స్వచ్ఛంగా ఉండేవి. అవి అచ్చంగా మనదే. ఎవరో కరిగించి బలవంతంగా మన చెవుల్లో పోసినవీ, మనమీద రుద్దినవీ కాదు. మన వికాసం కోసం మన మనసులు సృష్టించినవి. అవన్నీ ఏ కాలగర్భంలో కలిసిపోయాయోననే వెతుకులాట నాలో మొదలవుతుంది.” అతని గొంతు వణికింది.
అతని గురించి తెలిసే అలా మాట్లాడినందుకు ఆమెకి చిన్నతనం వేసింది.
సుదీర్ఘంగా నిశ్వసించింది. అతనేమిటో? ఈ వృత్తికి సరిపోడు. రోగులకు బదులు తనే రోగం తెచ్చుకునేలా ఉన్నాడు.” రోజులు మారలేదా నరేన్? ఈ మార్పు మనం కోరి తెచ్చుకున్నదేగా? ఇందులో ఇమడక తప్పదు. సమాజానికి అనుగుణంగానే మన కదలికలూ ఉండాలి. గతి మార్చుకుని సంఘర్షించడం దేనికి? అందరూ పొందే దాంట్లో ఒకప్పుడు మనం ఆనందం పొందలేదా? ఇప్పుడెందుకు మనని మనం మినహాయించుకోవాలి? ఒకప్పుడు సోల్‍తో ఎంజాయ్ చేసేవాళ్లం అనుకుంటా. ఇప్పుడు సెన్సెస్‍తో చేస్తున్నాం. ఎందుకీ ఆలోచనలన్నీ? ఉంటాను. ఎవరో వచ్చారు. బై…” అని తనెందుకు చేసిందో మర్చిపోయి ఫోన్ పెట్టేసింది.
నీరజ కట్ చేసిన వెంటనే రావు చేశాడు. “చాలాసేపటినుంచి ప్రయత్నిస్తున్నాను. ఎంగేజ్ వస్తోంది ” అన్నాడు. వెంటనే, “సాయంత్రం నువ్వు ఫ్రీయా?” అని అడిగాడు.
” ఎందుకు?”
” అమృతాలోకి మీనాకుమారి పిక్చర్ వచ్చింది. నువ్వు కంపెనీ ఇస్తావని”
” వెరోనిక?” నరేంద్ర అడిగాడు. వెరోనిక రావు భార్య.
” తనని తీసుకెళ్లడానికి నాకేం అభ్యంతరం లేదుగానీ తనకే నాతో రావడానికి అహం అడ్డుపడుతుంది” రావు నవ్వాడు. వాళ్ళిద్దరి మధ్యా సత్సంబంధాలు లేవని నరేంద్రకి తెలుసు. వాళ్ళిద్దరి మధ్యాగల ఆ గ్యాప్‍ని పూరించాలని ప్రయత్నిస్తాడు. మంచి సినిమా, మంచి పుస్తకం, చిన్న ఔటింగ్ కలిసి పంచుకున్న అనుభూతి, అగాధానికి అటూ ఇటూ ఉన్న మనుషుల మధ్య వారధి అవుతుంది. కానీ రావు రావే.. మరి వెరోనిక? ఆమె గురించి నరేంద్రకి సందిగ్ధం.
” ఈ ఆడవాళ్ళు మననెప్పుడర్థం చేసుకుంటారో? వాళ్లకి కావాల్సిందల్లా సోషల్ సెక్యూరిటీ, స్థిరమైన జీవితం, భర్తాపిల్లలు. ఇవుంటేచాలు,వాటికి మూలకారణమైన సెక్స్‌పట్ల అనాసక్తి. కానీ మగవాడిలో వుండే తృష్ణ? ” రావు తనే అన్నాడు మళ్ళీ.
“ఇవన్నీ మనక్కూడా కావాలిగా? కొన్ని కావాలనుకున్నప్పుడు ఇంకొన్నిటిపట్ల ఆసక్తి తగ్గించుకోవాలి”
“పురాణాలే బెటర్ నన్నడిగితే. కృష్ణుడికి ఎనిమిదిమంది, అర్జునుడికి నలుగురు, ధర్మరాజుకి ఇద్దరు. ఆ మాటకొస్తే ఒకరితో సర్దుకున్నది ఎవరంట? రాముడి కూడా తక్కువెందుకు చేయాలని క్లైమాక్స్‌లో వేదవతిని తగిలించారు. మగవాడిలో వుండే తృష్ణకి ఒక్క స్త్రీయేం చాలుతుంది?”
నరేంద్ర నిట్టూర్చాడు. రావు రావే. అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు. అప్పుడు ప్లే బాయ్. ఇప్పుడు వుమనైజరు. పెళ్లయ్యాక ఈ కొత్త స్టేటస్ వచ్చింది.
” సరేగానీ నిన్నటి పార్టీ నువ్వెంజాయ్ చేశావా? సోల్‍ తోటా, సెన్సెస్‍తోటా?” కొద్దిగా తటపటాయిస్తూ అడిగాడు.
రావు బిగ్గరగా నవ్వేసాడు, అది ఫోన్లోననికూడా చూడకుండా. క్రమంగా అతని నవ్వు సన్నగిల్లింది.
” చాలా లోతైన ప్రశ్న నరేన్. ఎందుకు ప్రతిదీ నువ్వింత లోతుగా ఆలోచిస్తావు? నీక్కూడా ట్రీట్‍మెంట్ కావాలి. నా దగ్గరకోసారి రాకూడదూ?” మళ్లీ నవ్వు.
కొద్దిపాటి నిశ్శబ్దం. ఆపైన తుఫాన్ వెలిశాక చల్లటి గాలి మంద్రంగా వీచినట్టు వినిపించింది రావు గొంతు.” మనం దేన్నీ సోల్‍తో ఎంజాయ్ చేయడం మానేశాం. కనీసం మనసుతో కూడా. అందుకే ఇంత అసంతృప్తి. దాన్ని చల్లార్చాలన్న ఆరాటం. షాంపేన్ కిక్స్‌లాంటి పార్టీలు. .. తర్వాతి హేంగోవర్లు… మళ్లీ కిక్స్‌కోసం వెతుకులాట. అంతా బిజీ బిజీ. ఏదీ ఆలోచించకూడదు. ఆలోచిస్తే ఏముంది? ఇంకేదో కావాలనిపిస్తుంది. మనకి దొరుకుతున్నదిదే. దీంతోనే సంతృప్తి చెందాలి” అని ఆగి, “పెరుగుతున్న మన ప్రాక్టీస్ చెప్పటంలేదా నరేన్, ప్రస్తుతపు సమాజ పరిస్థితి?” అనడిగాడు.
“నువ్వు సింధూరి కేసు స్టడీ చేసావా?” నరేంద్ర ప్రశ్న – ఏదో శోధించాలని.
“ఆమెకు ఏమీ లేదు. పెర్ఫెక్ట్‌లీ ఓకే. భార్యాభర్తలు ఉత్తర దక్షిణ ధృవాలు. బలం అతనిది కాబట్టి ఆమె వంగుతోంది. అతను ఇనుప చువ్వ. ఆమె గాలి తెమ్మెర. అతను నాకు ముందే పరిచయం. ఆమె ఇప్పుడు పరిచయమైంది” రావు నవ్వు.
నరేంద్ర కోపంగా ఫోన్ పెట్టేసాడు. రావు దృష్టిలో ఏ స్త్రీ పడకూడదు. పడితే మాత్రం ఆమూలాగ్రం చదివేస్తాడు.

తర్వాత రావు కార్లో సింధూరి కనిపించింది నరేంద్రకి నాలుగైదుసార్లు. ఆఖరిసారి వాళ్ళిద్దర్నీ సిటీ అవుట్‍స్కర్ట్స్‌లోని గెస్ట్‌హౌస్ దగ్గర చూసాడు. ఈ మధ్యలో నరేంద్ర ఆమెను గురించి ఇంకొంత తెలుసుకున్నాడు. ఈ మాటు రావు అనే మాధ్యమం ద్వారా.
బెల్లీ క్వీన్స్, బస్ట్ ప్రిన్సెస్‍లూ అంటుందట సింధూరి మోడల్స్‌ని, సినిమాతారల్ని . ఆమెకి సంపంగి పువ్వులు అంటే ఇష్టమంట. రావు వాటిని విజయవాడ నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తే తెలిసింది. బాలసరస్వతి గొంతన్నా, మల్లీశ్వరి పాత సినిమాలోని పాటలన్నా ప్రాణమట ఆమెకి. రావుదగ్గర ఆ కలెక్షన్ కొత్తగా చూశాక అర్థమైంది.
ఇంతలో- సింధూరి ఆత్మహత్య చేసుకుందని రావే హఠాత్తుగా ఫోన్ చేసి చెప్పాడు.
నరేంద్ర షాకయ్యాడు. గుండెల్నిండా దుఃఖం నిండిపోయింది. పేషంట్‍లా అనిపించలేదు ఆమె అతనికి. తనలోని అంతర్గత సంఘర్షణే ఆమెగా రూపుదిద్దుకుని పరామర్శించడానికి వచ్చిందనిపించింది మొదటిసారి చూసినప్పుడు. ఎందుకు చనిపోయిందామె. రావుతో కలిసి ఔచిత్యపు హద్దు దాటినందుకా? అందుకు అంతరాత్మ ఒప్పుకోలేదు? రాజీపడలేకపోయిందా?
నరేంద్ర ఈ అన్వేషణలోంచి ఇంకా బయటపడనేలేదు. ఇంతలో మరో కాల్, రావు దగ్గర్నుంచి.
” నేను ప్రాక్టీస్ ఎత్తేసి యూకే వెళ్ళిపోదామనుకుంటున్నా”.
నరేంద్ర విస్మయ చకితుడయ్యాడు.” రావ్!” అప్రయత్నంగా అన్నాడు.
“మనం డబ్బు సంపాదిస్తుంటాం అవసరానికి. ఒక్కోసారి అవసరాన్నిమించి కూడా. భార్యాపిల్లలకోసం అనే కారణాన్ని దానికి ఆపాదిస్తాం. అఫ్‍కోర్స్. నాకు పిల్లల్లేరనుకో. నువ్వు వెరోనికాని చూసావుగా? ఒంటిమీద వీసమెత్తు అలంకారంకూడా చేసుకోని ఆ ప్యూర్ రోమన్‍కేథలిక్ కోసం నేను సంపాదిస్తున్నానడం ఎంత రిడిక్యులస్ గా ఉంటుంది! జస్ట్ రిడిక్యులస్…” రావు విషాదగీతంలా పలుకుతున్నాడు.
“…”
“ఇన్ఫాంట్ జీసస్ అనే ఆర్ఫనేజ్‍లో ట్యూటర్‍గా అప్లై చేసింది తను. ఆర్డర్సొచ్చాయి. నాకోసం తన తల్లిదండ్రులకీ, దేశాన్నీ వదులుకొని వచ్చేసిన వెరోనికా ఉద్యోగం వచ్చేదాకా నాకీ విషయాన్ని చెప్పలేదు. అన్ని ఏర్పాట్లూ చేసేసుకుని ఆఖర్లో చెప్పింది. నేనొట్టి డబ్బు మనిషిననుకుంది. తనపట్ల ప్రేమ చచ్చిపోయిందనో, తనకన్నా నాకు నా అఫేర్స్ ముఖ్యమనో అనుకుంది. నేను ప్రాక్టీస్ ఎత్తేసి తనతో వస్తాననేసరికి ఆశ్చర్యపోయింది. నరేన్… మనం డబ్బు సంపాదించేది మన అహాన్ని తృప్తి పరచడం కోసం. ఆస్తులు సంపాదించినా, భార్యకి నగలు చేయించినా, సొసైటీలో మనని మనం గొప్పగా చూపించుకుందుకే. కానీ చాలామంది ఆడవాళ్ళు ఆత్మలతో మాట్లాడుతుంటారు. అంతరంగాలతో అల్లుకుపోతుంటారు. మనసుల్తో పరితపిస్తుంటారు. భర్త ఇచ్చే నిలువెత్తు ధనంకన్నా అతని కొనగోటి ప్రేమస్పర్శకోసం కలవరించిపోతుంటారు.”
“….”
“నాకు సింధూరి దుఃఖం అర్థమైంది. అందుకే వెరోనికాని కాస్త ఆలస్యంగానేనా అర్థం చేసుకున్నాను. యూకే వెళ్ళిపోతున్నాను ఆమెననుసరించి. అక్కడికెళ్ళాక ఆలోచిస్తాను, తర్వాతేం చెయ్యాలో”.
ఎవర్‍గ్రీన్‍హీరోలా ఉండే రావు అస్త్రసన్యాసం చేసిన అర్జునుడిలా వైరాగ్యంగా అనిపించాడు నరేంద్రకి. అయినా ఒక విషయాన్ని మరిచిపోలేదు. అది సింధూరి గురించి. నరేంద్ర మనసు చదివినట్టు చెప్పాడు రావు.
” సింధూరిలో కొన్ని భావతరంగాలు అణిచివేయబడి వున్నాయి. వాటిని నేను తాకాను. అవి వువ్వెత్తున లేచాయి. వాటి తాకిడికి ఆమె తట్టుకోలేకపోయింది. నరేన్… ఇందులో పెద్ద ఐరనీ ఏమిటంటే వెడ్‍లాక్‍ని ఛేదించుకుని ఆమె బయటికి రాలేదు. నేను వెరోనికాని విడిచిపెట్టలేను. ఆమెకి దిలీప్, నాకు వెరోనికా ఉండగా మా మధ్య ఏర్పడిన బంధానికి నైతికత లేదు. అనైతికబంధాన్ని తట్టుకోవడం సింధూరిలాంటివాళ్ళకి సాధ్యం కాదు. అందుకు చాలా ధైర్యం కావాలి. అయితే ఆమె చాలా సున్నితమనస్కురాలు” అన్నాడు. అతని గొంతులో దుఖపు తడి తగిలింది నరేంద్రకి.
అదేనా, సింధూరి చావుకి కారణం? నరేంద్రకి ఇంకా పూర్తిగా కారణం అందనేలేదు, రావు బాంబులా బ్లాస్టయ్యాడు.
“ఆ మూర్ఖుడు సింధూరికి బెల్లీడిజైన్స్ కొని ప్రజెంట్ చేశాడట. చాలా గాయపడింది. తనిష్టపడే తెల్ల సంపెంగలూ కావు, ఇష్టంగా వినే దేవగాంధారాలూ కావు. ఎలా భరిస్తున్నారు నరేన్, ఆడవాళ్ళు ఈ అవమానాల్ని? కన్స్యూమరిజం వరదలా ఇవి? బ్యూటీ మేకింగ్ బిజినెసా? స్త్రీని కొన్ని వంపుసొంపులుగా , కొన్ని స్పాట్స్‌గా ,వినియోగవస్తువుగా , ఒక శరీరంగా మాత్రమే గుర్తించే సంస్కృతిలోంచీ ఎప్పటికి బయటపడతాం? వాళ్లని భార్యలుగా, తల్లులుగా, మనుషులుగా కాక ఇంకా ఎలా చూడాలనుకుంటున్నాం? చాలా బాధపడింది తను. అవమానంతో దహించుకుపోయింది. కసితోటీ, ఉక్రోషంతోటీ నాకు దగ్గరైంది. ఆ తర్వాత చనిపోయింది. ఆ కలయిక ఇద్దరిలో ఎవరికీ సంతోషాన్నివ్వలేదు. ఇద్దరిలోనూ అపరాధభావన నింపింది. నాకు పరిచయమైన ఏ అమ్మాయితోనూ ఇలా జరగలేదు” రావు ఇంక చెప్పలేక కట్ చేసాడు.
సింధూరి చావుకి అసలైన కారణమేదో అర్థమవ్వక నరేంద్ర మరింత అయోమయంలో పడ్డాడు.

రావు యూకే వెళ్లిపోయాడు. వెళ్లేముందు నరేంద్ర ఇంట్లో భార్యతో కలిసి డిన్నర్ తీసుకున్నాడు. వెరోనికాలో సాత్వికత ఉంది. అది స్వభావసిద్ధంగా వచ్చింది. రావులో వైరాగ్యం అలాంటిది కాదు. ఒకప్పుడతను దక్షిణనాయకుడు. అమ్మాయిలతన్ని ప్రేమించి వచ్చేవారు . వాళ్లందర్నీ కాదని వేరోనికాని వలచీ , వలపించీ చేసుకున్నాడు. తర్వాతకూడా తన జీవనశైలి మార్చుకోలేదు. దేనికీ ఎప్పుడూ చలించలేదు. వెరోనికా నిర్ణయం అతన్ని భయపెట్టింది. సింధూరి చావు అతన్ని మార్చింది . తిన్న ఆటుపోట్లకు వచ్చిన వైరాగ్యం. అన్నీ అనుభవించాక వచ్చిన వైరాగ్యం అంతే .
అతని నిర్ణయాన్ని- కారణం ఏదైనా ప్రశంసించింది నీరజ.
వెరోనికా నరేంద్రతో ఏకాంతం కల్పించుకుని మాట్లాడింది.
“రావు సింధూరిని సెడ్యూస్ చేసాడు. ఆమెని ఆత్మహత్యవైపు డ్రైవ్ చేశాడు. తన వృత్తిని ఇలాంటి వ్యవహారాల్తో అతనెప్పుడూ కలపలేదు. సింధూరి చావు అతని వ్యక్తిత్వం మీద మొదటి మరక. అతన్ని మారమని ఎంతోకాలం సంఘర్షించాను.. మారడని అర్థమయ్యాక అతని వ్యవహారాలు అతనివని వదిలేసాను. కానీ అతను ఒక స్త్రీ చావుకి కారణమయ్యాడు. అది నేను వుపేక్షించడంవల్లేనేమో!” అంది.
“కానీ నువ్వు వాడిని వదిలేసి యూకె వెళ్ళిపోవాలనుకున్నావు” నరేంద్ర గుర్తు చేశాడు. మెత్తగా నవ్విందామె. అందులో ఎన్నో అర్థాలు…
” నాకతని ప్రేమలోని తీవ్రత తగ్గిందేమోనని అనుమానం కలిగిందికానీ అలాంటిదేమీ లేదు. ప్రపంచంలోని దేనికీ లొంగని అతను నా ప్రేమకి లొంగాడు.”
” వాడినసలు డబ్బు యంత్రంగా ఎప్పుడో మార్చాల్సిందిగా. ఇలాంటి మెటీరియలిస్టులు చివరికి అయ్యేదంతే”.
” లేదు. అతనిలోని మానవీయతను చంపను, అతన్ని క్రిస్టియన్‍గా మారుస్తాను”
నరేంద్ర నవ్వాడు.” మతం మారితే మంచివాడౌతాడా?” అతని గొంతులో వ్యంగ్యం.
” మతం అంటే నమ్మకం. చేసిన పాపాలన్నీ చేయనిచ్చి ఎప్పుడో చనిపోయాక నరకంలో శిక్షిస్తానంటుంది మీ మతం. చేసిన పాపానికి పశ్చాత్తాపపడి, పరివర్తన పొందమంటుంది మా మతం. రావుకి స్వర్గనరకాలకన్నా పునర్జన్మలకన్నా మనిషిగా బ్రతకడం మీద నమ్మకం ఉంది” జవాబిచ్చింది వేరోనికా.
నరేంద్ర తర్కించలేదు. రావుని పీటర్‍గానో, రాబర్ట్‍గానో తెల్లటి దుస్తుల్లో మెళ్ళో సిలువతో ఊహించడం అతనికి సాధ్యపడలేదు.
రావు వెళ్ళిపోయాడు. అతను వెళ్లిపోవడం ఎంతగా బాధించినా నరేంద్ర దినచర్యలో మార్పులేదు. రోజులు గడిచిపోతూనే ఉన్నాయి.

ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్‍లో కనిపించాడు రావు, నరేంద్రకి- ఒక ఎగ్జిబిట్‍లో. డస్క్ టైం దాని పేరు. గోధూళి వేళ. ఎర్రటి సంధ్య వెలుతురులో సిల్‍హౌట్‍లో ఒక యువతి ముఖం. దాన్ని కప్పేస్తూ గాలికెగురుతున్న వెంట్రుకలు. క్రిందని రావు పేరు చూడగానే అర్థమైంది ఆ బొమ్మ సింధూరిదని. ఉద్విగ్నతని తట్టుకోలేకపోయాడు. వెంటనే రావుకి ఫోన్ చేశాడు.
” నువ్వింకా ఆమెని మర్చిపోలేదా?”
“ఎందుకు మర్చిపోవాలి?” ఎదురు ప్రశ్న వేసి” ఆర్ట్ ఎగ్జిబిషన్‍కి వెళ్ళావా?” అని అడిగాడు.
“వెళ్లకపోతే ఎలా తెలుస్తుంది?”
ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. రావులో వెనకటి చురుకుదనం లేదు. మాటల్లో చైతన్యం లోపించింది. నరేంద్రకి తీవ్రమైన బాధ కలిగింది. వెరోనికా అతన్నుండీ విడిపోయి మళ్లీ పెళ్లి చేసుకుందని తెలిసింది.
” ఎలా భరిస్తున్నావు నువ్, ఇంత బాధని ఎవర్‍గ్రీన్ రావ్? ” అడిగాడు నరేంద్ర.
రావు విషాదంగా నవ్వాడు. ” సింధూరికి తన సుఖం నాతోనేనని తెలిసింది. కానీ మా ఇద్దరి దారులూ కలవ్వని ఊహించుకుని చనిపోయింది. వెరోనికాకి నాతో సుఖం లేదని తెలిసిన మరుక్షణాన నా ఇల్లు పరాయిదనిపించింది. విడాకులిచ్చేసి బయటపడింది. ఏ సంతోషం సోల్‍తోటీ మరేది సెన్సెస్‌తోటీ అనే సందేహానికిక్కడ చోటులేదు. సుఖసంతోషాలకి నిర్వచనం ఆత్మ, మనసులే కాదు, దేశకాల పరిస్థితులు కూడా ఇవ్వగలుగుతాయి” అన్నాడు.
” ఇంకా నువ్వక్కడెందుకు?”
” ఎక్కడ మాత్రం ఏముంది?”
” అంతగా డిప్రెసవకు. నేను, నీరజ ఉన్నాం . తిరిగొచ్చెయ్. మళ్లీ కొత్త జీవితం ప్రారంభించు” అన్నాడు నరేంద్ర అర్థింపుగా.
” నాకేం కాలేదు. బాగానే ఉన్నాను” అన్నాడు రావు నవ్వేస్తూ.
వెరోనికా నెంబర్ అడిగి తీసుకున్నాడు నరేంద్ర. ఆమెతో మాట్లాడకుండా ఉండలేకపోయాడు.
“ఇలా ఎలా చెయ్యగలిగావు?”
“పెళ్లి నన్ను చేసుకుని, బాధ మరొక స్త్రీకోసం పడుతుంటే ఏం చెయ్యను ? అంతకన్నా ధైర్యంగా ఇద్దరూ విడాకులు తీసుకుని పెళ్లి చేసుకునుంటే సంతోషిచేదాన్ని. రావు హిపోక్రిసీని భరించగలిగే ఓపిక పోయింది నాకు. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. ఐనా ఎందరో అమ్మాయిలు మామధ్య. నన్నేమో ప్రేమించానంటాడు. వదిలి వుండలేనంటాడు. ఇదేనా, ఇండియన్ కల్చర్ అనిపించిన క్షణాన అతనిలోని ఛార్మ్ పోయింది. ఇప్పుడీ జీవితం చాలా బావుంది. సెంటిమెంట్స్, ఎమోషన్స్ లేవు. ఒకరితో ఒకరం మంచిగా ఉండాల్సిన నైతికబాధ్యత ఇద్దరికీ సమానంగా ఉంది. ఎవరిలో తేడా కనిపించినా ఎవరి దారి వాళ్లది” అంది.

“ఈ సమాజంలోని ఒక వ్యక్తికి ఆత్మహత్యకో డిప్రెషన్‍కో దారితీసే పరిస్థితులు వచ్చాయంటే ఆ లోపం అతనిది కాదు. అతని చుట్టూ ఉన్నవాళ్ళది. సింధూరి చావుకైనా,పతనానికైనా మొదటి కారణం ఆమె భర్త. తర్వాత ఆమె కుటుంబం. ఆపైన చుట్టూ ఉన్న సమాజం. తామివ్వగలిగిందే ఇచ్చారు తప్ప ఆమేం కోరుకుందో ఎవరూ పట్టించుకోలేదు. అసలీ సమాజమే పెద్ద ఎసైలంలా మారుతోంది. బలహీనులు దానినుంచీ తప్పించుకోవడానికి మెంటల్ హాస్పిటల్స్‌లో తలదాచుకుంటున్నారు. మనమేం సంస్కర్తలంకాదు, సమాజాన్ని వుద్ధరించడానికి. నువ్వీ సత్యాన్వేషణ మానేసి ప్రాక్టీస్‍మీద శ్రద్ధపెట్టకూడదా నరేన్? పిల్లలు పెద్దౌతున్నారు. ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రొఫెషన్లో పోటీ బాగా వుంది. ఇదివరకులా నేను అంతంతసేపు నిలబడి అన్నేసి గంటలు ఆపరేషన్లు చెయ్యలేకపోతున్నాను.” అంది నీరజ కొంత విసుగుని ప్రదర్శిస్తూ.
ఈ మధ్య తరచుగా అదే మాటంటోందామె. నువ్వు సంపాదించడం లేదు. ఖర్చులూ, అవసరాలూ పెరిగాయి. నువ్వు సంపాదించకపోవడం నాకు అదనపు బాధ్యతౌతోందని. అలా అంటేనన్నా మారతాడని ఆశ.
” మనకున్నది చాలదా, ఇంకా ఎందుకు సంపాదించాలి?” అడిగాడు నరేంద్ర.
” సంపాదించక ఏం చేస్తావు? ఆలోచించి ఆలోచించి గడ్డాలూ మీసాలూ పెంచుకుని సన్యాసుల్లో కలిసిపోతావా?” చిరాగ్గా అడిగింది. అలా అడిగాక ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
” డబ్బు సంపాదించకపోతే సోషల్‍సర్వీస్ చెయ్యి. ఉచితంగా వైద్యం చెయ్యి నరేన్! మనిషన్నాక ఒక ఖచ్చితమైన గమ్యం ఉండాలి. అది సాధించాలనే ఆకాంక్ష ఉండాలి. నిన్నిలా వదిలేస్తే ఏమైపోతావో తెలీదు” అంది రుద్ధస్వరంతో. నరేంద్ర చలించిపోయాడు. సింధూరి మరణంకన్నా రావు నిర్వేదంకన్నా నీరజ కన్నీరు అతన్ని బలంగా కదిల్చింది.
….
సిటీ సెంటర్‍లో పెద్ద హాస్పిటల్ కట్టే ప్రయత్నంలో పడ్డాడు నరేంద్ర. అతను, నీరజ ప్రేమించుకోలేదు. పెళ్లి మాత్రం చేసుకున్నారు. వాళ్ళిద్దరి అభిప్రాయాలు, మనస్తత్వాలు కలవ్వు. ఐనా , ఒకరిపట్ల ఒకరికి పూర్తి అవగాహన ఉంది. ఇద్దరూ మంచివాళ్లు. ఇద్దరు మంచి వ్యక్తులు గొప్ప ప్రేమికులు కాకపోవచ్చుగానీ భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, సామాజికులుగా సఫలమవుతారు. హాస్పిటల్ నిర్మాణం పూర్తవుతుంటే నరేంద్ర గుండె ఆనందంతో నిండిపోతోంది. ఎదుగుదల అనునిత్యంగా ఉంటూ ప్రస్ఫుటంగా కళ్ళకి కనిపిస్తూ ఉంటే మనిషికి చాలా తృప్తి ఉంటుంది. మానసికంగా ఎదగడానికి ఇప్పటి సమాజంలో చాలా అవరోధాలు ఉన్నాయి. అదొక గమ్యం లేని ప్రయాణం. తుదీ మొదలూ లేని వెతుకులాట. అందుకే చాలామంది ఇంటలెక్చువల్స్‌లో పర్వర్షన్ వస్తోంది. ఇంకా చాలామంది మెటీరియలిస్టులుగా మారిపోతున్నారు. నరేంద్ర రెండోదారి పట్టాడు. అలాంటిదేమీ దొరక్క సింధూరి ఆత్మహత్య చేసుకుంది.
రావు యూకే నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళాడు. అక్కడినుంచి ఆస్ట్రేలియా… కెనడా… సింధూరి జ్ఞాపకం అతన్ని వెంటాడుతోంది. అన్వేషణలో పడ్డాడు. మనిషిలో స్థిరత్వం తప్పింది.
దిలీప్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఈసారికూడా పెళ్లిచూపుల్లో వెతుక్కునే. ఆ అమ్మాయి నీరజకి బంధువు. పెళ్లికి నరేంద్ర, నీరజ వెళ్లారు.
దిలీప్ కొత్త భార్యతో కలిసి పార్టీలకి వస్తున్నాడు. ఆ అమ్మాయి చీర జాకెట్‍లే వేసుకుంటోంది. కాకపోతే చుడీదార్లు. హిప్‍హేంగర్ జీన్స్ వేసుకుని టాప్‍లెస్‍గా ఎప్పుడూ, ఎక్కడా కనిపించలేదు నరేంద్రకి. దిలీప్ ఆమెకి కూడా బెల్లీ డిజైన్స్ కొనిచ్చాడేమో నరేంద్రకి తెలీలేదు. ఎందుకంటే ఆమె నుంచి వారధిగా మరో రావు లేడు. ఆమె సింధూరి కాదు.
సింధూరి వాజ్ యూనిక్.