మలుపు by S Sridevi

  1. పాతకాలపు మనిషి by S Sridevi
  2. ఒలీవియా by S Sridevi
  3. నాకొద్దీ అభ్యుదయం by S Sridevi
  4. అర్హత by S Sridevi
  5. సింధూరి by S Sridevi
  6. మలుపు by S Sridevi
  7. యంత్రసేవ by S Sridevi
  8. ప్లాస్మా జీవులు by S Sridevi
  9. మనుషులిచ్చిన శాపం by S Sridevi
  10. వంకరగీత by S Sridevi
  11. బంధీ by S Sridevi
  12. లాటరీ by S Sridevi
  13. ముల్లు by S Sridevi
  14. లే ఆఫ్ by S Sridevi
  15. నేను విసిరిన బంతి by S Sridevi
  16. మలివసంతం by S Sridevi
  17. తప్పనిసరిగా by S Sridevi
  18. ప్రేమరాహిత్యం by S Sridevi
  19. పార్థివం by S Sridevi
  20. ఖైదీ by S Sridevi

Youtubers please WhatsApp to 7382342850

“సార్! మిమ్మల్ని కలవాలట” విజిటింగ్ కార్డు తెచ్చి టేబుల్ మీద ఉంచాడు పిఏ.
క్యాజువల్‍గా దాన్ని చేతిలోకి తీసుకుని చూశాడు శ్రీపాద. కొంత కుతూహలం లేకపోలేదు. అతనికి చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్లలో ఎక్కువ భాగం కాలేజ్ విద్యార్థులు. బయట ఎదురు చూసి చూసి తను కనిపించగానే ఎగబడి ఆటోగ్రాఫులు తీసుకుంటారు. ఎంతో దూరం నుంచి వచ్చి తనని దూరంనుంచేనా చూసి సంతృప్తితో వెళ్లిపోయేవారు ఇంకొందరు ఉంటారు. ఇలా విజిటింగ్ కార్డ్ పంపించి వచ్చేవారు చాలా అరుదు. కారణం ఇప్పటి సినిమాలని సినిమాలుగానూ, నటులని నటులుగానూ గుర్తించి గౌరవించే చదువుకున్నవారు చాలా తక్కువ. అతని దృష్టి కార్డుమీది అక్షరాల వెంబడి పరుగెత్తింది.
కే. స్వరూప, ఎమ్ టెక్.
పేరు దగ్గరే ఆగిపోయింది అతని ఆలోచన. స్వరూప… చాలా పరిచితమైన పేరు. ఎక్కడ విన్నాడు? ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు.
“రమ్మను” పియ్యేకి చెప్పాడు. అతను వెళ్లిన కొద్దిసేపటికి స్ప్రింగ్ డోర్ తెరుచుకుంది. వచ్చిన యువతి ఎంతో పరిచయం వున్నట్టు నవ్వుతోంది. అస్పష్టమైన పోలికలు. ఎక్కడ చూసాడామెని?
“మీరు నన్ను గుర్తుపట్టలేదు””నవ్వుతునే ఆరోపించింది.
“సారీ! ఏమీ అనుకోవద్దు. ముందు కూర్చోండి” కుర్చీ చూపిస్తూ చెప్పాడు కాస్త ఇబ్బందిపడుతూ.
ఆమె కుర్చీలో పొందికగా కూర్చుంది. “ఇంకా మీకు నేను గుర్తు రాలేదనుకుంటాను. రోజుకి కొన్ని వందలమందిని చూస్తారు కాబట్టి అది సహజమే అనుకోండి. అదీకాక పదేళ్ల పైమాటే అయ్యింది ఆ సంఘటన జరిగి”
పదేళ్లు… ఆమె మాటల్లో అంత చదువుకున్నా గుంటూరు జిల్లా యాస… యస్…
“స్వ…రూ…ప !”ఉత్కంఠతో లేచి నిలబడి మళ్ళీ కూర్చున్నాడు.
“నేనే!” నెమ్మదిగా అంది.
“నమ్మలేకపోతున్నాను” అన్నాడు అప్పటి ఆ పదహారేళ్ళ పిల్ల రూపం కళ్ళముందు కదిలి.
నటుడిగా స్థిరపడక ముందు శ్రీపాదది గుంటూరు దగ్గర ఒక పల్లెటూరు. చాలాకాలందాకా అతనికి తన ఊరితో అనుబంధం ఉండేది. తండ్రి పోయాక తన వాటాకి వచ్చిన పొలంగట్రా అమ్మేసుకుని హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పరచుకోవాలని తిరిగి వెళుతున్నాడు. గుంటూరు స్టేషన్లో రైలు ఆగింది. టాయిలెట్‍కి వెళ్లి వస్తున్న శ్రీపాద బోగీ తలుపు తీయాలని ప్రయత్నిస్తున్న ఆ అమ్మాయిని చూశాడు.
“ఇది ఫస్ట్ క్లాస్. వేరే బోగీలో ఎక్కమ్మా!” అన్నాడు. రైలు కూత కూసింది.
“రైలు కదిలిపోతుందేమోనండీ!” అందామె భయంగా.
నిజమే! తలుపు తీసి లోపల కూర్చోమని తర్వాతి స్టేషన్‍లో దిగి బోగీ మారమంటే సరిపోతుంది! అనుకున్నాడు.
అంతలోనే అతని విచక్షణ మేలుకుంది. అర్ధరాత్రి! ఒంటరిగా ఈ పిల్ల ఎక్కడికి వెళ్తున్నట్టు? పెద్దవాళ్ళకి తెలిసే వెళ్తోందా? తెలిస్తే ఇలా ఒక్కదాన్నే ఎందుకు పంపిస్తారు ?తప్పనిసరైతే పగలు పంపిస్తారు. యస్…ఈ అమ్మాయి ప్రేమించినవాడికోసమో , సినిమాలకోసమో ఇంట్లోంచీ పారిపోతోంది. అతడికి బాధేసింది.
రైలు నెమ్మదిగా కదిలింది. ఆ అమ్మాయి ఒక్క అడుగు వెనక్కి వేసి ఉక్రోషంగా చూస్తూ నిస్సహాయంగా నిలబడింది.
రైలు దాటిపోయిందని తిరిగి వెళ్లి పోతుందా? లేక ఇంకో ప్రయత్నం చేస్తుందా? ఆ అమ్మాయి అక్కడే సిమెంట్ బెంచీమీద కూర్చోవడం చూసి శ్రీపాద మరి ఇంకా ఆలస్యం చెయ్యలేదు. తన బ్రీఫ్‍కేస్ తీసుకుని గబుక్కున కదులుతున్న రైలులోనుంచి దిగేసాడు. అతనిలోని నటుడు మేల్కొన్నాడు. తెరమీద లభించని నాయకుడి అవకాశాన్ని ఇప్పుడు వాడుకున్నాడు. అతను ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పాత్రలు వేస్తున్న నటుడు.
ఆ అమ్మాయి కూర్చున్న దగ్గరికి వెళ్లాడు.
“నువ్వు… శోభన్‍బాబు కూతురువి కదూ? మీ నాన్న ఇక్కడే ఉంటున్నాడా?”” చీకట్లోకి రాయి విసిరాడు.
ఆ అమ్మాయి ముందు బిత్తరపోయింది, రైల్లో ఉండాల్సిన వ్యక్తి ఇక్కడున్నాడేంటా అని. తర్వాత ? అతని ప్రశ్నకి తెల్లబోయింది. “
“శోభన్‍బాబుగారు ఇక్కడెందుకుంటారు?” అమాయకంగా అడిగింది.
శ్రీపాద నవ్వేడు. “”మీ నాన్న శోభన్‍బాబులా ఉండేవాడు. చదువుకునే రోజుల్లో తననంతా అలాగే పిలిచేవాళ్ళం. నిన్ను చూడగానే అనుమానం వచ్చింది. అవునో కాదో అనుకున్నాను. నువ్వు కచ్చితంగా తన కూతురివే. సర్లేగాని రామాంజనేయులు ఏం చేస్తున్నాడిప్పుడు? ఏదైనా ఉద్యోగంలో చేరాడా?”” ఎంతో చనువున్నట్టు అడిగాడు.
“రామాంజనేయులు ఎవరండీ?”
“మీ నాన్న”
“మా నాన్నగారి పేరు వెంకట అప్పారావుగారండీ!” శ్రీపాద ఆశించిన సమాచారాన్ని చెప్పిందా అమ్మాయి.
“సర్లేమ్మా! మీ నాన్న పేరేంటో నాకు తెలియదా? నువ్వు చెప్పాలా? చదువుకునేరోజుల్లో హనుమంతుడి భక్తి వీరలెవెల్లో ఉండేది. అందుకని తననలా పిలిచేవాళ్ళం” జవాబిచ్చాడు శ్రీపాద. “పద. మీ ఇంటికి వెళ్దాం” అన్నాడు.
ఆ అమ్మాయి తటపటాయించి, నెమ్మదిగా అంది. “నేను వూరెళ్లాలండీ! ఈ రైలు తప్పిపోయింది. మరో గంటాగితే ఇంకోటి వుందట.”
“ఏ వూరు? ఇంతకీ నీ పేరేంటి?”
ఏ ఊరో చెప్పలేదు. తన పేరు మాత్రం చెప్పి వూరుకుంది. “స్వరూప “
“నేను మీ అందర్నీ చూడాలని కదులుతున్న రైల్లోంచి దిగేసాను. ఇంతకీ ఏ వూరేంటి? హైదరాబాదా? రేప్పొద్దున్న నాతో వద్దువుగానిలే. మాది ఆ ఊరే. నేను దగ్గరుండి తీసుకెళ్తాను. ముందైతే ఇంటికి వెళ్దాం పద ” అని రెండోచేత్తో స్వరూప సూట్‍కేస్ కూడా పట్టుకుని గబగబా అడుగులేశాడు. చేసేదేంలేక ఆమె అతన్ని అనుసరించింది.
శ్రీపాద ఆటో మాట్లాడాడు. స్వరూప చెప్పిన గుర్తుల ప్రకారం ఆటో పరిగెడుతోంది .ఇంటి ముందు దిగాక వణుకుతున్న గొంతుతో స్వరూప చెప్పింది స్వరూప,” మా నాన్న చంపేస్తాడండీ!” అంటుంటేనే ఆ అమ్మాయి కళ్ళలోంచి జలజలా కన్నీళ్ళు రాలిపడ్డాయి.
“పారిపోదామనుకున్నావా?” మెత్తగా అడిగాడు శ్రీపాద. స్వరూప తలదించుకుంది.
“ఎవరితో?””
“ఎవరూ లేరు””
“ఒక్కదానివేనా? ఎక్కడికి?””
“హైదరాబాద్””
“ఎందుకు?””
“సినిమాల్లో చేరాలని””
సుదీర్ఘంగా నిశ్వసించాడు శ్రీపాద. ““అనుకున్నాను. అందుకే నిన్ను వెనక్కి తీసుకువచ్చాను”
“మీకు మా నాన్న తెలీదా?”
“ఉ<హు<! చూడు, నేను చిన్న నాటకం ఆడేసరికి నువ్వు నమ్మేసి నావెంట వచ్చావు. నేను నిన్ను మోసం చేస్తే? నీకు అలాంటి అనుభవం ఇంకా తటస్థపడి ఉండకపోవచ్చు. ఎందుకంటే నువ్వు మీ నాన్న రక్షణలో జాగ్రత్తగా ఉన్నావు. రక్షణ వదిలిపెట్టి వచ్చాక నీలాంటి ఆడపిల్లల్ని వేటాడటమే ధ్యేయంగా పెట్టుకున్నవాళ్లు చాలామంది ఎదురవుతారు. వాళ్ల ఉచ్చులో పడితే సినిమాల మాట దేవుడెరుగు, బతుకే దుర్భరమవుతుంది. అమాయకుల్ని మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు…“ప్రతిపనికీ ఒక పద్ధతి ఉంటుంది. ఉద్యోగం చెయ్యాలంటే అప్లికేషన్ పెట్టుకోవాలి. వ్యాపారం చేయాలంటే మదుపు పెట్టి నలుగుర్ని ఆకట్టుకోవాలి. అలాగే సినిమాలకి కూడా. పద. ఇంట్లోకి వెళ్దాం””
“మా నాన్న…”” భయంతో వెక్కుతూ అంది.
“నేనంతా సర్దిచెప్తాలే”” ఆమె భుజం తట్టి ధైర్యం చెప్పాడు.
అర్ధరాత్రి తలుపు తట్టిన శబ్దానికి మెలకువ వచ్చి లేచాడు వెంకటప్పారావు. లైట్ వేసి తలుపు తీసి చూసేసరికి గుమ్మంలో ఒక అపరిచితుడు, అతని వెనక తలొంచుకుని నిలబడ్డ కూతురు! అతని నిద్ర మత్తంతా ఎగిరిపోయింది. స్థాణువయ్యాడు. కూతురు… ఎంత పని చేసింది!జరిగినదేమిటో స్పష్టాస్పష్టంగా అర్థమై అనుకున్నాడు. మధ్యలో ఈ కొత్త మనిషి ఎవరు? ఎక్కడో చూసినట్టు, తెలిసిన మనిషైనట్టు అనిపించిందిగానీ గుర్తు రాలేదు.
శ్రీపాదకూడా తన గురించి చెప్పుకోలేదు. తనేం ఫ్రేం ఫ్రేంలో కనిపించే నటుడు కాదు. వేషాలకోసం స్టూడియోలచుట్టూ తిరుగుతున్నానని ఎలా చెప్పుకుంటాడు? ఆ విషయం తెలిస్తే స్వరూపమీద తను చెప్పబోయే మాటల ప్రభావం వుండకపోవచ్చు.
“ఎంతపని చేసావే, నీ సినిమా పిచ్చి దొంగల్దోలా!”” అన్నాడు వెంకటప్పారావు.
“ఏమీ జరగలేదు. అరిచి గొడవ చేసుకోకండి. అమ్మాయిని లోపలికి తీసుకెళ్లండి”” శ్రీపాద మృదువుగా అన్నాడు.
వెంకటప్పారావు మరేం మాట్లాడలేదులేదు. స్వరూప తలొంచుకుని తండ్రిని దాటుకుని గబగబా లోపలికి వెళ్ళిపోయింది.
“ఎంతపని చేసావే తెలివితక్కువదానా!””లోపల్నించి ఆడగొంతు వినిపించింది. బహుశా స్వరూప తల్లిది కావచ్చుననుకున్నాడు శ్రీపాద. “దయచేసి ఇప్పుడామెని ఏమీ అనకండి” స్వరూప తండ్రిని అర్థించాడు.
అతను నియంత్రించినట్టు “దాన్ని ఇప్పుడేం అనకు “అని లోపలికి కేకేశాడు వెంకటప్పారావు. లోపల సద్దుమణిగింది.
“లోపలికి రండి. మీరెవరు? సమయానికి దేవుడిలా వచ్చి ఆదుకున్నారు” అప్పటికి తెలివి వచ్చి శ్రీపాదని లోపలికి తీసుకెళ్లాడు. అతని గొంతు రుద్ధమైంది. షాక్‍లోంచి ఇంకా తేరుకోలేకపోతున్నాడు. లోపలికొచ్చి కూర్చుని జరిగిన సంగతి క్లుప్తంగా చెప్పాడు శ్రీపాద. “మీ అమ్మాయి
సూట్‍కేస్” అని అందించాడు.
వెంకటప్పారావు ఏమాత్రం సంకోచించకుండా అతని ముందే దాన్ని తెరిచి చూశాడు. కళ్ళు జిగేల్ మనిపోయాయి. వడ్డాణం, కంటే , కాసులపేరు, గొలుసులు, నెక్లెస్లులు, గాజులు…
“నా కూతురు నాకు దక్కింది. నా కూతురు నాకు దక్కింది… ” పెట్టి మూసేస్తూ హిస్టీరిక్‍గా ఏడవసాగాడు. ఇంత డబ్బుతో ఇల్లు వదిలిన పిల్ల క్షేమంగా తిరిగి రావటం నమ్మశక్యంగా లేదు అతనికి.
“మీరు నిజంగా దేవుడు” రెండు చేతులూ ఎత్తి శ్రీపాదకి దణ్ణం పెట్టాడు. అతని భార్య వచ్చి శ్రీపాద కాళ్ళంటుకుంది.
“రిలాక్స్ అవ్వండి. ఏమీ కాలేదు కదా!” ”ఓదార్చాడు శ్రీపాద. తెల్లారేదాకా ఉండి బయలుదేరాడు.
వెళ్లేముందు స్వరూపని పిలిచి చాలాసేపు మాట్లాడాడు. “”నిన్ను బాగా చదివించాలని మీ నాన్నకు చెప్పాను. కనీసం గ్రాడ్యుయేటవ్వు. తర్వాత పూనాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ చేరు. నటన, దర్శకత్వం ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు. అప్పుడు దర్జాగా సినిమాల్లో చేరొచ్చు. సరేనా?”” అన్నాడు. అంతేకాదు, సినిమా వాళ్ళ విజయాపజయ కథలు కూడా చెప్పాడు. పెద్దగా చదువుకోకపోవడంచేత కోట్లు సంపాదించి కూడా సావిత్రి నిలబెట్టుకోలేకపోయిందని, కాంచనమాల కోర్టు కేసులో ఇరుక్కుని పిచ్చిది అయిందని చెప్పాడు. చిరంజీవి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‍లో నేర్చుకుని వచ్చాడని, రాజేంద్ర ప్రసాద్, రాజశేఖర్, శోభన్ బాబు ఇంకా చాలామంది పెద్ద చదువులు చదివి ఈ రంగంలోకి వచ్చారు, వాళ్లంతా మంచి విజయాలు సాధించారని ఎన్నో విషయాలు వివరించాడు. పెద్ద చదువులు లేక ఎందరో నటీమణులు మరొకరి మీద ఆధారపడుతూ మోసపోతున్నారని వివరించి విపులంగా చెప్పాడు.
ఆమెకి ఎంతవరకు అర్థం అయిందో తెలియదు కానీ మౌనంగా వింది. రెప్పలార్చుకుని మరీ వింది.
“ఆమెని చదివించండి. వ్యక్తిత్వాన్ని ప్రకటించుకోవాలన్న కోరిక అందరిలో ఉంటుంది. కొంతమందిలో అది చాలా బలంగా ఉంటుంది.స్వరూపలో కూడా. అలాంటివాళ్లు ఒక చట్రంలో ఇమడరు. వాళ్లు ఇమిడే చట్రాన్ని మనమే తయారుచేయాలి. చదువుకుంటే లోకజ్ఞానం వస్తుంది. ప్రపంచం అంటే ఏమిటో తెలుస్తుంది. కొత్త గమ్యాలు ఏర్పడతాయి. సినిమా మోజునుంచి దృష్టి మళ్ళుతుంది. అలా కాకపోయినా ఏది ఏమిటో తెలుసుకునే తెలివి వస్తుంది”” అని స్టేషన్ దాకా వచ్చిన వెంకటప్పారావుకి చెప్పాడు… ఒక పాఠంలా. పిల్లలు తప్పు చేస్తే పాఠాలూ, గుణపాఠాలూ పెద్దవాళ్ళకే వుంటాయి.
ఆ తర్వాత ఆ విషయం శ్రీపాద జ్ఞాపకాల సరళిలో వెనక్కి పడిపోయింది.ఈలోపు అతను సహాయనటుడిగా, ప్రతినాయకుడిగా ఎన్నోమెట్లెక్కి చివరికి నాయకుడిగా విజయకేతనం ఎగరేసాడు.
“బావున్నావా స్వరూపా! అదే ఊళ్లో ఉంటున్నారా, మీరిప్పుడు?”” అభిమానంగా అడిగాడు.
“అమ్మానాన్న అక్కడే ఉంటున్నారు. నేను బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాను. ఎప్పటినుంచో మిమ్మల్ని ఓసారి కలవాలని అనుకుంటూనే ఉన్నాను. మా కంపెనీవాళ్ళు ఒక పనిమీద కెనడా పంపిస్తున్నారు. మళ్లీ తిరిగి వస్తానో రానో ! జీవితంలో ఒక్కసారేనా మిమ్మల్ని చూడాలనిపించింది. వచ్చాను”” అంది.
“స్వరూపా! ఇదంతా నిజమేనా?”” వుక్కిరిబిక్కిరౌతూ అడిగాడు.
“అంతా మీ చలవే. దారితప్పబోతున్న నన్నూ, నా జీవితాన్నీ మార్చారు. నన్నింతదాన్ని చేశారు. ఆరోజు మీరుగానీ తటస్థపడకపోతే…”” దుఃఖంతో స్వరూప గొంతు పూడుకుపోయింది.
“మీ అమ్మ, నాన్న కులాసాయా?”” శ్రీపాద మాట మార్చాడు.
“ఆ వెంకటేశ్వరుడే మీ రూపంలో వచ్చాడని నాన్న నమ్మకం. రోజూ పూజలో మీ పేరు కూడా చెప్పిస్తాడు” అని నవ్వింది.
శ్రీపాద ఇబ్బందిపడ్డాడు. “”అసలు నన్ను నువ్వు ఎలా గుర్తు పెట్టుకున్నావు? అప్పట్లో నాకేం పెద్ద పాత్రలు లేవు కదా?””
“నాన్న మిమ్మల్ని తరవాతి రోజు పోల్చుకున్నాడు. మీ ఫోటో ఎక్కడ పడ్డా నాకు చెప్పేవాడు”” అంది.
కావచ్చు. ఆ రోజున్న మన:స్థితిలో తనని గుర్తుపట్టినట్టు చెప్పడం మర్చిపోయాడేమో.
“మీరు వెళ్ళాక చాలా గొడవైంది. నాకు మేనరికం ఉండేది. వెంటనే మా అత్తయ్యని పిలిచి ముహూర్తం పెట్టించమని అమ్మ గోలచేసింది. మీరే మంత్రం వేశారో కానీ నాన్న ఆవిడ మాట వినలేదు. నన్ను కాలేజీలో చేర్చారు. అప్పటికి మా బావ బి ఏ డింకీలు కొడుతున్నాడు. నన్ను ఇంటర్లో చేర్చారనేసరికి అతనికి చాలా కోపం వచ్చింది. ఆ వేసవుల్లోనే వాళ్లు మరో సంబంధం చూసి చేసుకున్నారు. నేను చదువులో పడిపోయాను. మార్కులు, ర్యాంకులు అనే ప్రభంజనంలో కొట్టుకుపోయాను. క్లాస్‍టాపర్‍గా ఉండటం, చాలా అందంగా ఉండటం … ఈ రెండింటివల్లా నన్ను నా ఫ్రెండ్స్ అంతా బాగా పొగిడేవారు. నేను గుర్తింపు కోసం , పొగడ్తలకోసం పడే ఆరాటం చల్లబడిందనుకుంటా. సినిమాల్లో నటించి గొప్పదాన్ననిపించుకోవాలన్న వ్యామోహం కరిగిపోయింది” కాలేజి చదువుతోపాటు తనని తను ఎంతగా చదివిందో చక్కగా విశ్లేషించింది.
శ్రీపాద చాలా కుతూహలంగా విన్నాడు ఆమె మాటల్ని. ఆమె గొంతులో ఎక్కడో కించిత్తు దుఃఖం.
“నువ్వు పెళ్లి చేసుకోలేదా!”” అడిగాడు
“ఎన్నో సినిమాల్లో చేశారు. ఎన్నో హీరోయిన్ పాత్రలని చూశారు. ఆడపిల్ల మనసు మీకర్థంకాదా?”” నవ్వుతూనే అడిగింది. కానీ ఆమె కళ్ళలో పల్చటి కన్నీటి పొర కదలాడింది. చప్పుని కళ్లద్దాలు తీసి మళ్లీ పెట్టుకుంది. ఎర్రబడ్డ ముక్కు కొన ఆమెను పట్టిస్తూనే ఉంది.
“స్వరూపా! నేను మేలు చేశానా? కీడు చేశానా?”” సుదీర్ఘంగా నిశ్వసించి అడిగాడు శ్రీపాద.
ఆమె నవ్వేసింది. దుఃఖాన్ని దాచుకోవడానికి తెచ్చిపెట్టుకున్న ఆ నవ్వు వెలవెలబోయింది.
“అప్పుడంటే మా ఇద్దరివీ చిన్నతనాలు. బావకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. పెద్దయ్యీ, ఆకర్షణలు కరిగి వ్యక్తిత్వంగా గడ్డకట్టాక… ఏది ఏమిటో తెలిశాక, ఇద్దరం ఒకరినొకరం మిస్ అవుతున్నాము. బాధపడుతున్నాము. మేనరికంకదండీ! చిన్నప్పట్నుంచి ఒకరికొకరం అన్నట్టు పెరిగాము. ఇప్పుడు ఏమీ కామనుకుంటే కొంచెం బాధ. అంతే!”” దాపరికం లేకుండా చెప్పింది.
“నువ్వు పెళ్లెందుకు చేసుకోకూడదు? అతని దారిని అతను భార్యాపిల్లలతో బాగానే వున్నాడుకదా? నువ్వెందుకిలా?”
“నేను మాత్రం హాయిగా లేనా? అతన్ని తలుచుకుంటూ గడిపేస్తున్నాను. మనసు ఒకచోట పెట్టుకుని పెళ్లి మరొకర్ని చేసుకోవటం నావల్ల కాదు”
“అతనేమంటాడు? “
“ఏమనగలడు? ఇద్దరం కలిసి ఆమెకీ పిల్లలకీ అన్యాయం చెయ్యలేంకదా? తనూ మీలాగే చెప్తాడు, పెళ్లి చేసుకొమ్మని. కెనడానుంచీ వచ్చాక చేసుకుంటానని దాటేసాను. కులాంతరం, మతాంతరం చేసుకోనని వట్టేయించుకుంది అమ్మ. ఎవరేనా పర్వాలేదు, పెళ్లంటూ చేసుకుంటే తను సర్దిచెప్తానన్నాడు బావ”
“అమ్మానాన్నలు శాశ్వతం కాదు.నీ జీవితం చివరిదాకా రారు. నీ మార్గంలో నువ్వు ముందుకి వెళ్లాల్సినప్పుడు ఒంటరిగా కాకుండా ఒక తోడుతో వెళ్లడం మంచిది “
“ప్రయత్నిస్తాను”” చెప్పింది స్వరూప.
“సరేగానీ బెంగుళూరునుంచేనా రావడం? లేక మీ వూరినుంచా?” అడిగాడు. స్వరూప చెప్పింది.
“పద. మాయింటికెళ్దాం. ఇప్పటిదాకా నేను పనికొచ్చే పనేదీ చెయ్యలేదని నా భార్య నన్ను తిడుతుంటుంది. నిన్ను చూపించి మంచి సర్టిఫికెట్టొకటి కొట్టేస్తాను” సీట్లోంచీ లేస్తూ అన్నాడు.
“మీరడిగిన సర్టిఫికెట్ ఇప్పుడే ఇవ్వను. స్వరూప పెళ్లి చేసుకుని భర్తని తీసుకొచ్చి చూపిస్తే ఇస్తాను””అంతా విన్నాక అంది శ్రీపాద భార్య స్వరూపని అభిమానంగా చూస్తూ.
ఆ అమ్మాయి బిడియంగా తలొంచుకుంది. ఇప్పటివరకూ తన భవిష్యత్తు ఏమిటన్నది ఆలోచించలేదు. ఇప్పుడు మళ్లీ ఇతని మాటల వల్లే తన జీవితం మరో మలుపు తిరగనుందా? అన్న ఆలోచన ఆమె మదిలో మెదిలింది.

And read

1 thought on “మలుపు by S Sridevi”

Comments are closed.