వంకరగీత by S Sridevi

  1. పాతకాలపు మనిషి by S Sridevi
  2. ఒలీవియా by S Sridevi
  3. నాకొద్దీ అభ్యుదయం by S Sridevi
  4. అర్హత by S Sridevi
  5. సింధూరి by S Sridevi
  6. మలుపు by S Sridevi
  7. యంత్రసేవ by S Sridevi
  8. ప్లాస్మా జీవులు by S Sridevi
  9. మనుషులిచ్చిన శాపం by S Sridevi
  10. వంకరగీత by S Sridevi
  11. బంధీ by S Sridevi
  12. లాటరీ by S Sridevi
  13. ముల్లు by S Sridevi
  14. లే ఆఫ్ by S Sridevi
  15. నేను విసిరిన బంతి by S Sridevi
  16. మలివసంతం by S Sridevi
  17. తప్పనిసరిగా by S Sridevi
  18. ప్రేమరాహిత్యం by S Sridevi
  19. పార్థివం by S Sridevi
  20. ఖైదీ by S Sridevi

Youtubers please WhatsApp to 7382342850

చాలాకాలం తర్వాత యీ వూరొచ్చాను . ఈ ఊరంటే … నేను పుట్టి పెరిగిన ఊరు … డబులెమ్మే చదివి కూడా జాబ్ దొరక్క ఖాళీగా వుండలేక ప్రైవేట్ స్కూల్స్ చుట్టూ తిరిగిన ఊరు. దాదాపు పదేళ్ళైంది . ఈ ఊరితో ఆఖరి అనుబంధం తెగిపోయి . ముఖ్యంగా సుమతితో. పదేళ్ళలో ఊరేం మారలేదు . అదే గతుకులరోడ్డు , స్టేజీమీద ఆగని బస్సులు , ఎక్కడ ఎప్పుడాగుతాయో తెలీని ఆటోలు , బస్తాల్లాంటి బేగులు మోస్తూ బడిపిల్లలు … యధాతథంగానే ఉంది . మెయిన్‍రోడ్డు మీద నడుస్తున్నాను . పదేపదే గుర్తొచ్చింది.
“మిరపకాయ బజ్జీలు తినాలని ఎప్పట్నించో అనిపిస్తోంది మూర్తీ ! ” అనేసి …
నేను తీసుకొస్తాననగానే , ” అమ్మో వద్దు . ఈ రోడ్డు మీదా ? ఎవరైనా చూస్తే బావోదు ” అని మాట దాటేసి , అంత చిన్న కోరికని కూడా మనస్థాపితం చేసేసే కదిలే నిర్జీవప్రతిమలాంటి సుమతి గుర్తొచ్చాక తనని చూడకుండా వుండటం నాకు సాధ్యపడలేదు . అడుగులు ముందుకి సాగుతుంటే మనసు వెనక్కి జరుగుతూ భూతవర్తమానకాలాలని అనుసంధానిస్తోంది .


ప్రగతీ స్కూల్లో నాకు సుమతి పరిచయమైంది . సన్నటి దేహం , బెరుగ్గా చూసే కళ్ళూ ముందు చూశాక ఆ తర్వాత పల్చటి పమిటలోంచీ మెరుస్తున్న మంగళసూత్రాల్నీ , పచ్చటి పాదాల ముందు వెలవెలబోతున్న మట్టెల్నీ చూశాను . మొదటి రోజునే ఆమెని చాలా స్టడీ చేశాను . ఎవరితోటీ మాట్లాడదు. తనలోకి తను కుదించుకుపోతూ ఉంటుంది . ఏదో తప్పు చేసినట్టో ఎవరికో జవాబుదారీ అన్నట్టో వుంది ఆమె ప్రవర్తన గమ్మత్తనిపించింది .

ఆకర్షణ దీవశిఖ లాంటిది . మనిషిని తనవేపుకి లాక్కుంటుంది . అందులో ఉచితానుచితాలకిగానీ సాధ్యాసాధ్యాలకిగానీ చింతనకి చోటుండదు . అలాంటి ఆకర్షణ నాకు కలిగింది సుమతిపట్ల . క్రమంగా ఆమె గురించి నాకు కొన్ని విషయాలు తెలిసాయి . భర్త వదిలి పెట్టేశాడట . ఇద్దరు పిల్లలు . అలాంటి స్త్రీలపట్ల ప్రేమేమిటని అనిపించచ్చు. కానీ మనసు నిర్మలంగా వుంటే శారీరకమైన మార్పులు ప్రేమకి ఆటంకం కావు . సుమతి మనసులోని నైర్మల్యం ఆమె మొహంలో ప్రతిబింబించేది .

“ఎందుకొదిలేశాడతను ? ” కొంత పరియం పెరిగాక అడిగాను . ఆమె దెబ్బతిన్నట్టు చూసింది . నేనంత సూటిగా అడుగుతానని ఊహించి ఉండకపోవచ్చు . లేదా తన ప్రైవపీని అతిక్రమిస్తున్నాననిపించవచ్చు . వెంటనే నాకు జవాబివ్వలేదు . రెండు రోజులు నన్ను తప్పించుకు తిరిగింది. ఇంతలోనే మరో టీచర్ కల్పనతో స్టాఫ్‍రూములో గొడవపడ్డాను . సుమతి గురించి. తనక్కడ లేదు.

” మొగుడొదిలేశాడు …..” వెక్కిరింపుగా ఎవరితోటో చెప్తోందామె సుమతి గురించి.

అక్కడ లేని మనిషి గురించి వెనక చెప్పుకోవడం… అదికూడా చెడ్డగా … ఏం కల్చరది ? వీళ్ళం టీచర్లు ? పిల్లలకి వీళ్ళేం పాఠాలు చెప్పగలరు ?

“ఆమెని మొగుడొదిలేస్తే అతన్ని వెక్కిరించండి . అంతేగానీ అమెనెందుకలా అంటారు ? ” చిరాగ్గా అడిగాను.

“ఆడవాళ్ళం ఏదో మాట్లాడుకుంటాం . మీకేంటి అంత ఇంట్రెస్టు ? ” కల్పన కోపంగా అడిగింది .

“ఆమె తప్పేమీ లేకుండానే వదిలేశాడా ? ” అంది మరో టీచర్ .

“మీరామె తరపున వకాల్తా తీసుకున్నారా ? ” అని ఆమెకి వత్తాసు పలుకుతూ ఫిజికల్ ఇన్స్ట్రకటర్. చిలికి చిలికి గాలివానైంది .

“వాళ్ళతో మీకెందుకు గొడవ ? ” సుమతి నన్నే కోప్పడిగింది .

” నీ వెనక వాళ్ళలా మాట్లాడచ్చునా ? నువ్వనే కాదు, ఎవర్నలా మాట్లాడినా వూరుకోను ” విసురుగా అన్నాను .

” నువ్వూ ఆడిగావుగా , ఆయనెందుకు వదిలేశాడని ? ”

” అదీ ఇదీ ఒకటేనా ? ‘ దెబ్బతిన్నట్టు అన్నాను .

“నీ ప్రాబ్లమ్ ఏమిటో తెలుసుకోవాలని అడిగాను . అంతేగానీ నిన్ను కించపరచాలని కాదు ” కోపంగా జవాబిచ్చాను .

“తెలుసుకుని ఏం చేస్తావ్ ? ”

“పరిష్కారం కోసం వెతుకుతాను ”

“ఆ పని నేను చెయ్యలేదనా ? ఇప్పుడింక ఆ ఆశ కూడా లేదు . అన్ని దారులూ మూసుకుపోయాయి . మిగిలిందల్లా పిల్లలకి నేనూ , నాకు వాళ్ళూ అంతే” అంది .

పెళ్ళప్పుడు సుమతికి కట్నం డబ్బుల్లో పదివేలు తక్కువ పడిందట . తండ్రి మగపెళ్ళివారి కాళ్ళావేళ్ళాపడి ఎలాగో పెళ్ళైందనిపించి , కూతుర్ని అంపకం పెట్టాడట . అప్పట్నుంచి సాధింపులతో మూడేళ్ళు గడిచాయట.

” అతనికి మరో అమ్మాయితో పరిచయమైంది మూర్తీ ! పెళ్ళనే పడవలో ఇద్దరికే చోటుంటుందిగా ! కాబట్టి నన్ను నడిసంద్రంలో తోసేశాడు ” నిర్లిప్తంగా చెప్పింది. నేను చాలా సేపు మాట్లాడలేకపోయాను .

“విడాకుల్వికుండానేనా ? ” అడిగాను.

“అదొక్కటే అదృష్టం … ఈ పాటేనా పరువుగా బతుకుతున్నాను”

“అతన్నొదిలేస్తే పోని పరువు డైవోర్పిస్తే పోతుందా ? ” పదునుగా అడిగాను .

“ఎందుకులే మూర్తీ! అదో గొడవ. నాప్రవర్తన మీద ముద్ర వెయ్యటానికి వాళ్ళకొక అవకాశం దొరుకుతుంది. నలుగుర్లో అల్లరి. కోర్టు చుట్టూ తిరగాలి. అతనే వద్దనుకున్నాక … ఇదంతా ఎందుకు ?” అనేసింది .

మెయింటెనెన్స్ మాట తననలేదు . అభిమానం గలదే ! కానీ మూడొందల రూపాయల జీతంతో ఇద్దరు పిల్లల్లో ఎలా నెట్టుకొస్తోందో నాకర్థం కాలేదు . నాకే కాదు , ఇండియాకి ఎకనామిక్స్‌లో నోబుల్‍ప్రైజు తెచ్చి పెట్టిన అమర్త్యసేన్‍కి కూడా అర్థమవదేమో తన ఆర్థికసూత్రం. కొన్నాళ్ళు పుట్టింట్లో వుందట . తమ్ముడూ మరదలూ చేసిన గొడవకి అక్కణ్ణించి వచ్చేసి విడిగా వుంటోందట .

“ఆడపిల్ల గుండెల మీద కుంపటి . ఒకసారి దాన్ని దింపుకున్నాక మళ్ళీ ఎవరూ ఎత్తుకోరు ” నిర్లిప్తంగా అంది సుమతి, సమాజానికీ, కన్నవాళ్ళకి కూడా స్త్రీపట్ల వున్న దృక్పథాన్ని ఒక్క మాటలో వ్యక్తపరుస్తూ. నాకు బాధ కలిగింది . తనలా నిరాదరణకి గురౌతున్నందుకు కాదు. అంతగా నిరాదరిస్తున్నా ఆమెలో తిరగబడే మనస్తత్వం తలెత్తనందుకు.

***

మొదట్లో ఆకర్షణే ప్రేమగా భ్రమింపజేస్తుంది . తరువాత క్రమంగా ప్రేమగా రూపొందుతుంది . రెండో స్టేజి చేరుకున్నాను నేను .

“మనం పెళ్ళి చేసుకుందాం ” అన్నాను .

సుమతి తెల్లబోయింది . ” నువ్వు … నువ్వేమంటున్నావు ? ” దిగ్ర్భాంతితో తనని మాటలు తడబడ్డాయి .

“నిజంగానే అంటున్నాను . అంత ఆశ్చర్యానికేముంది ? డైవోర్స్‌కప్లై చెయ్యి”

“నాకు … నాకలాంటి ఉద్దేశం ఎప్పుడూ లేదు . నువ్వేదో ఫ్రెండ్లీగా వస్తున్నావనుకున్నాను . ఇప్పటికే నలుగురూ నాలుగువిధాలుగా అనుకుంటున్నారు . ఇది వరకూ నా వెనక హేళన చేసేవారు . ఇప్పుడంతా మోహమ్మీదే అంటున్నారు . మూర్తీ , ప్లీజ్ ! నా జోలికి రాకు . నన్నిలా వదిలెయ్ ‘ అంది పాలిపోయిన మొహంతో .. వణుకుతున్న గొంతుతో .
“ఎందుకంత భయపడటం ? ఎవరికి భయపడటం ? తప్పుచేస్తే భయపడాలి . అది కూడా ఎవరికి ? మనం తప్పుచేసేలా పరిస్థితుల్ని సృష్టించిన మనుషులకి కాదు , మన అంతరాత్మకి ! .. మనం పెళ్ళి చేసుకుందాం . ఈపాటి ఉద్యోగాలు ఇంకోచోట దొరక్కపోవు . అదీగాక నేను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను ఏదో ఒకటి తగలకపోదు . హాయిగా బతకచ్చు ” నచ్చజెప్తున్నట్టుగా అన్నాను .
“నీకు తెలీదు . సమాజం మనని బతకనివ్వదు” తల అడ్డంగా వూపుతూ అంది . తను చాలా ఎమోషనల్ గా ఉంది . ముఖ్యంగా భయపడ్తోంది . తనకి జీవితాన్ని పునర్నిర్మించుకోవాలనే కోరిక వుందో లేదో నాకు అర్ధం కావటం లేదు .
మా అక్కయ్యుంది . బావగారు తననసలు లక్ష్యపెట్టరని బాధపడ్తుంది . అమ్మకీ నాకూ చెప్పుకుని ఏడుస్తుంది .
“ఒక్క పదిరోజులు ఆయన్నీ పిల్లల్నీ అక్కడి బాదరబందీలనీ వదిలేసి వచ్చి ఇక్కడుండిపోవే. నీ విలువేంటో ఆయనకి తెలిసొస్తుంది ” అంటాను నేను .
“అలా ఎలా కుదుర్తుందిగా ? నేను లేకపోతే ఒక్క నిముషం కూడా కదలక్కడ ” అనేసి తిరుగు ప్రయాణం హడావిడిలో పడిపోతుంది .
చిన్నాన్న కూతురు – భర్త స్థిరుడు కాదు . ఉద్యోగం సద్యోగం లేకుండా రికామీగ తిరుగుతూ భార్య సంపాదన మీద బతికేస్తుంటాడు . వారమేసి రోజులు ఊరొదిలేసి వెళ్ళిపోతుంటాడు . నాన్నా , చిన్నాన్నా వంతులవారీగా వెళ్ళి వాళ్ళ కాపురాన్ని సరిచేసి వస్తుంటారు .
” అలాంటివాడికి భార్యగా ముద్రవేసుకుని , అతనికి పిల్లల్ని కంటూ అక్కర్లేని గుదిబండలని మెడకి తగిలించుకోవడమేమిటి ? విడాకులిచ్చి పారేసి , ఇంకో పెళ్ళి చేసుకోకూడదూ ? బతుకంతా ఏడుస్తూ గడపడం దేనికి ? ” అంటాను నేను .
“పోరా ! నీ కబుర్లూ నువ్వూను ” అని తడికళ్ళతో నవ్వేస్తుంది. వీళ్ళకి సమస్యలుంటాయి . వాటికి పరిష్కారాలూ ఉంటాయి . కానీ శాశ్వతమైన పరిష్కారాలక్కర్లేదు . తాత్కాలికంగా ఎవరేనా ఓ పిసరు సానుభూతి చూపిస్తే దాన్ని ఆసరా చేసుకుని గడ్డిపరక పట్టుకుని గోదావరి ఈదినట్టు జీవనసాగరం ఈదేద్దామనుకుంటారు . ఈ పరంపరలో నాకు తారసపడిన మూడోవ్యక్తి సుమతి .
నన్ను పెళ్ళి చేసుకోనని చెప్పేసింది . నాకు కోపం రాలేదు . జాలేసింది. “అతను మారతాడనీ మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వస్తాడని నమ్మకం ఉందా ?” అడిగాను .
“లేదు “
నేనింకేమీ అడగలేదు . ఆమె మనసేమిటో గ్రహించాను . సమాజానికి భయపడ్తోంది . తనని కన్నవాళ్ళకి, తను కన్నవాళ్ళకి భయపడ్తోంది . కోరికల్ని వ్యక్తపరచడానికి ,స్వేచ్చని ప్రకటించడానికి భయపస్తోంది . చీకటికి అలవాటుపడిపోయి వెలుతురు చూడటానికి భయపడ్తోంది . భయాన్ని పదార్థకరించి తయారుచేసిన బొమ్మ తను .
ఉద్యోగం వదిలేసి తనకి దూరంగా వచ్చేశాను . వెంటనే గవర్నమెంటు జాబొచ్చి వేరే ఊరు వెళ్ళిపోయాను . తర్వాత ఇదే రావటం . రిటైరయ్యాక నాన్నా , అమ్మ మా స్వగ్రామం వెళ్ళిపోవటంతో ఈ ఊరికి మళ్ళీ రావాల్సిన అవసరం కలగలేదు .

***

పదేళ్ళ క్రితం ఏ ఇంట్లో వుండేదో అదే ఇంట్లో ఉంది సుమతి . వాకిట్లోనే సుమతి పెద్దకొడుకు ఎదురయ్యాడు . నన్ను చూసి సుమతి చాలా ఆశ్చర్యపోయింది .

” నేనింకా గుర్తున్నానా ? ” అనడిగింది . ఈ పదేళ్ళలో తను మరింత శుష్కించింది . తలలో వెండి తీగలు మెరుస్తున్నాయి . సూత్రాల గొలుసు లేదు . సూత్రాలు పసుపు తాడుకి గుచ్చుకుని వేసుకుంది . చేతులకి మట్టి గాజులున్నాయి . నాకు భోరుమని ఏడవాలనిపించింది . ఎవరి కోసం ఇదంతా ? ఏ సంస్కృతిని నిలబెట్టాలని ? ఏ పురుషాభిజాత్యానికి ఇంకాస్త ఆజ్యం పోయాలని ?

“అక్కడే చేస్తున్నావా ?” అడిగాను .

“లేదు . జీతం ఎక్కువవ్వాల్సొస్తుందని ఆ స్కూల్లోంచి తీసేశారు . తర్వాత చాలా స్కూళ్ళు మారాను . ట్రయిన్డ్ పర్సన్ని కాదుకదా ? ” అంది.

“పిల్లలేం చదువుతున్నారు?”

“పెద్దాడు సెవెన్త్ , చిన్నాడు సిక్స్త్ ” చెప్పి , “పెళ్ళైందా ?” అనడిగింది. అడుగుతున్నప్పుడు తన గొంతులో వినీ విన్పించనట్టు నన్నగా వొణుకు.

“అయింది” పొడిగా అన్నాను .

“పిల్లలా?”

“ఇద్దరు . బాబు , పాప . పాప ఫస్ట్‌క్లాస్ . బాబు నర్సరీ చదువుతున్నారు”

“అందరూ కలిసి రావాల్సింది”

తన మాటల్లో నా భార్యని చూడాలనే కోరిక వ్యక్తమైంది . ఆమె గురించి తెలుసుకోవాలనే తపన కనిపించింది . అది నేను గుర్తించానేమోనని . వెంటనే సర్దుకుని, “ఐనా ఎవరింటికని తీసుకొస్తావులే ? మనకి బంధుత్వాలు లేవుగా ? ” అంది.

“స్నేహితురాలి ఇంటికని తీసుకొస్తాను . తనకి మెదడూ, దాంతోపాటు తెలివీ వున్నాయి . అర్థం చేసుకుంటుంది . అపార్థం చేసుకోదు ” అన్నాను .

“నువ్వేం మారలేదు” ఎందుకు మారాలి?”

“నామీద కోపంగా పోనట్టుంది?”

“నీమీద నాకెందుకు కోపం సుమతీ? ప్రవాహంలో మునిగిపోతున్నవాడికి చెయ్యందిస్తాం. అందుకోకపోతే వాడి కర్మని వదిలేస్తాం. నాకు నువ్వంటే ఎందుకో తెలియని అనురాగం పుట్టింది. నా జీవితంలోకి పిలిచి నీకు కష్టాలు లేకుండా చెయ్యాలనుకున్నాను. కావాలనుకోవటం, వద్దనుకోవటం నీ యిష్టం”

నాకు టీ తీసుకురావాలనే నెపంతో ఆమె అక్కడినుంచీ లోపలికి వెళ్ళింది. టీ తాగుతుంటే తన విషయాలు చెప్పింది. భర్త మళ్ళీ తిరిగి చూడలేదట. తల్లీ, తండ్రీ చనిపోయారట. పిల్లలు అసలు చెప్పినమాట వినట్లేదట.

“పిల్లలని నాతో పంపించు. కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండి చదువుకుంటారు. నువ్వుకూడా కూడా అక్కడికి వచ్చెయ్. ఏదైనా ఉద్యోగం చూస్తాను” అన్నాను. తను నాకేమీ కాదనుకోలెకపోతున్నాను. అక్కయ్య… చిన్నాన్న కూతురు వాళ్ళలాగే అనిపిస్తోంది.

“నీ భార్య ఏమీ అనుకోదా?”

“తనగురించి చెప్పానుగా? నా బలహీనతలని, కోరికలని తను మన్నించగలదు. అటువంటి వ్యక్తికి ద్రోహం చేసే మనస్తత్వం కాదు నాదని కూడా తనకి తెలుసు.”

“కానీ….ఎలా కుదుర్తుంది మూర్తీ? నలుగురూ ఏమనుకుంటారు? పెరిగి పెద్దయ్యాక పిల్లలు నన్ను నిలదియ్యరా?”

ఈసారి నాకు కోపంవచ్చింది. మూర్ఖత్వంతో తన బతుకు పాదుచేసుకుంది. ఎడారిలో ఒక పాంథుడిలా బతుకుతోంది. ప్రేమాప్యాయతలకోసం అల్లల్లాడిపోయి, అవి దొరక్క దారి తప్పుతున్న పిల్లల్ని కూడా అదే ఎడారిలోకి లాకెళ్తోంది. లేచి నిలబడ్డాను.

“దేవుడు మనిషిని సృష్టిస్తాడు సుమతీ! మనిషి జీవితాన్ని సృష్టించుకుంటాడు. నీ జీవితాన్ని ఒక వంకరగీతలా సృష్టించారు నీ తల్లిదండ్రులు. ఆడపిల్లననే ఆత్మన్యూనత, నలుగురికీ భయపడాలనే ఆత్మవంచన రంగరించి నీ వ్యక్తిత్వాన్ని క్రిపుల్‍చేసారు. దానికితోడు పెళ్ళి పేరుతో నీకు జరిగిన సంఘటనలు నీలో సెల్ఫ్ పిటీని పెంచాయి. అయాం టెర్రిబ్లీ సారీ. నిన్ను మార్చడంకానీ… నీకు సాయం చెయ్యడంగానీ నావల్లకాదు. మర్చిపోవటానికి ప్రయత్నిస్తాను. కనీసం అదేనా నేను చెయ్యగలననుకుంటాను. గుడ్‍బై… ఫరెవర్” అనేసి వచ్చేసాను. ఈ వూరితో నా ఆఖరి అనుబంధాన్ని పదేళ్ళక్రితం తెంపుకున్నది భౌతికంగా. ఇప్పుడింక మానసికంగా కూడా.

(ఆంధ్రభూమి , 29 ఆగస్టు 1999 )