తప్పనిసరిగా by S Sridevi

  1. పాతకాలపు మనిషి by S Sridevi
  2. ఒలీవియా by S Sridevi
  3. నాకొద్దీ అభ్యుదయం by S Sridevi
  4. అర్హత by S Sridevi
  5. సింధూరి by S Sridevi
  6. మలుపు by S Sridevi
  7. యంత్రసేవ by S Sridevi
  8. ప్లాస్మా జీవులు by S Sridevi
  9. మనుషులిచ్చిన శాపం by S Sridevi
  10. వంకరగీత by S Sridevi
  11. బంధీ by S Sridevi
  12. లాటరీ by S Sridevi
  13. ముల్లు by S Sridevi
  14. లే ఆఫ్ by S Sridevi
  15. నేను విసిరిన బంతి by S Sridevi
  16. మలివసంతం by S Sridevi
  17. తప్పనిసరిగా by S Sridevi
  18. ప్రేమరాహిత్యం by S Sridevi
  19. పార్థివం by S Sridevi
  20. ఖైదీ by S Sridevi

Youtubers please WhatsApp to 7382342850

మనుషులు వున్నలాగ స్థిరంగా వుండలేరు . నిరంతరం మార్పు కోరుతూ పరుగు పెడుతుంటారు . బలవంతుడైనవాడు ఆ పరుగు మొదలుపెడితే వాడి వెనుక మిగిలినవారు సాగుతారు . మొదటివాడిది గమ్యం వున్న పరుగైతే మిగిలినవారిది అనివార్యత్వం . అలాంటి అనివార్యత్వమే సురేష్‍ని బాధపెడుతోంది .
తిరిగి తిరిగి వచ్చి చేతిలోని ఫైలు టీపాయ్ మీద పడేసి అలసటగా సోఫాలో కూలబడ్డాడు. ముఖంలోనూ చేతల్లోనూ నిరాశానిస్పృహలు స్పష్టంగా వ్యక్తమయాయి . అలికిడికి ఆశగా లోపల్నుంచి వచ్చిన అనిత అతన్ని అలా చూసి ఇంకేం అడగలేక వూరుకుంది .
“ఏ ఒక్క ఇంటర్వ్యూ సక్సెస్ కాలేదు” ఆమె అడగని ప్రశ్నకి తనే జవాబు చెప్పాడు .
“ఇప్పుడెలా?”అంది అయోమయంగా. దీనికి మాత్రం అతని దగ్గిర జవాబు లేదు . రెండు నెలలైంది, అతని వుద్యోగం పోయి . బేంకులో వున్న బేలన్సుతో ఇల్లు నడుపుకొస్తున్నారు . ఇలా ఎన్నో రోజులు గడవదనేది సుస్పష్టం . అందుకే ఎలాగన్న ప్రశ్న.
“మీరు వెళ్ళాక చలపతిరావు బాబాయ్ వచ్చారు. మిమ్మల్ని ఒకసారి కలవమన్నారు “
“దేనికట? ” అనాసక్తిగా అడిగాడు .
పక్కగదిలోంచీ అతని తల్లి మాట్లాడింది . “ఎందుకేమీటి? కొడుకొచ్చి బెదిరించి వెళ్ళాడు ఈ స్థలం అమ్మమని . ఆయన నచ్చజెప్పి వప్పించే వంతు తీర్చుకునేందుకు వచ్చి వుంటాడు. ఏది ఏమైనా ఈ స్థలం అమ్మేది లేదురా సూరీ ! ఈ యిల్లు మీ నాన్న ఎంతో కష్టపడి కట్టించారు . నా ప్రాణం ఇక్కడే పోవాలి” అంది ధనమ్మ. అంతేకాదు, ఇల్లు తన పేర వుండటంచేతనే కొడుకూ కోడలూ తనమాట వింటున్నారన్న నమ్మకం ఆమెది. తనకీ వాళ్ళ అవసరం వుందన్న విషయాన్ని ఆవిడ గుర్తించదు . అహం వప్పదు . ఇంకో విషయం కూడా వుంది. ఇల్లు అమ్మేస్తే తన ఇంటి చేతిలోంచీ ఆధిపత్యం జారిపోయి కొడుకు చేతిలోకి వెళ్ళిపోతుందేమోననే భయం కూడా వుంది.
అనితకి విసుగేసింది . ఆవిడకి ఇంట్లో వున్న పరిస్థితులు అర్థం కావు. తలదాచుకునేందుకు చోటుంటే తినో తినకో బ్రతకవచ్చునంటుంది. అవన్నీ పాతకాలం మాటలు. ఇల్లమ్మితే కనీసం యాభైలక్షలొస్తాయి. వడ్డీమీద బతికెయ్యవచ్చు. కానీ ఆవిడ వినదు.
చలపతిరావు కొడుకు రియల్‍ఎస్టేటు వ్యాపారం చేస్తాడు . పక్కస్థలం వాళ్ళది. అందులో వున్న వాళ్ళ పాతఇల్లు పడగొట్టి అపార్టుమెంటు కట్టాలనుకుంటున్నాడు . వాస్తుకీ లాభానికీ కలిసి వస్తుందని తమని స్థలం అమ్మమని వత్తిడి చేస్తున్నారు . తమకి రెండో వైపుని వున్నదికూడా అపార్టుమెంటే. ఈరోజుకాకపోతే రేపైనా వాళ్ళో వీళ్ళో ఆక్రమించుకోక వదలరు . అలాంటిరోజు రాకుండా వుండాలంటే మార్కెట్ వున్నప్పుడే ఇచ్చేసి వచ్చినంతా తీసుకోవడం మంచిది . కానీ ధనమ్మ కొడుకుని ఎలాంటి నిర్ణయమూ తీసుకోనివ్వదు .
ఆ స్థలం మీనాన్న ఎంతో కష్టపడి కొన్నది , ఇంటిని ఇటుక ఇటుకా పేర్చి మేం కట్టినది – అంటుంది . ముందరి కాళ్ళకి బంధం వేస్తుంది . ఈ ఇంట్లోనే నీ చిన్నతనం గడిచింది . ఇక్కడే నీకు పెళ్ళై పిల్లలు పుట్టారు – అని సెంటిమెంటుతో కట్టేస్తుంది . అవన్నీ వాస్తవాలే కానీ అనుభవం మరోలా వుంది.
ధారాళంగా గాలీ వెలుతురూ వచ్చే ఇంటికి పక్కని అపార్టుమెంటు పడటంతో పగటిపూట కూడా లైట్లు వేసుకోక తప్పడం లేదు . అంతదాకా చిన్నదైనా స్వంత ఇంట్లో వుంటున్నామన్న సంతృప్తి వుండేది. ఇప్పుడలాకాదు , అపార్టుమెంట్లో వాళ్ళు కార్లలో తిరుగుతూ దర్పంగా ఉంటే తాము చిన్నబోయినట్టుగా వున్నారు . అందులోని పిల్లలు తమ పిల్లల్లో సరిగా కలవరు . ఆ అపార్టుమెంటంతా వాళ్ళది అనుకుంటారు . పిల్లలు కదా! ఇంత చిన్న ఇంట్లో మీరెలా వుంటున్నారు – అని ఆశ్చర్యపోతారు . వాళ్ళు కలుపుకోక సురేష్ పిల్లలు అపార్ట్‌మెంటు వాచ్‍మేన్ పిల్లల్తో ఆడుతున్నారు .
డబ్బుకి సంస్కారంతో సంబంధం లేదని కబుర్లెన్నేనా చెప్పవచ్చు . ఆ డబ్బులేకపోవడం వలన జరిగే విషయాలు మనసుని బాధపెడతాయి.
“ఒకమాటు వెళ్ళి ఆయనేం చెప్తాడో విని వస్తే నష్టం లేదుకదా ” అంది గొంతు తగ్గించి , భర్తకి మాత్రమే వినిపించేలా. అలా మాట్లాడానని తను అనిత అనుకుందిగానీ ధనమ్మకి వినపడనే వినపడింది .
“ఏమిటే,వెళ్ళి విని వచ్చేది? వాళ్ళ కన్ను ఈ ఇంటి మీద పడింది. అంతకన్నా మాట్లాడి విషయాలేం వుంటాయి ? వెళ్ళక్కర్లేదు” అంది. అనిత భర్తకేసీ అభ్యర్ధనగా చూసింది. అతను లేచి నిలబడ్డాడు . ధనమ్మకి కోపం వచ్చింది .
“నేను మాత్రం సంతకం పెట్టేది లేదు ” అంది.
సురేష్ జవాబు చెప్పలేదు . మౌనంగా వెళ్ళిపోయాడు . అతను వెళ్ళేసరికి చలపతిరావు ఇంట్లోనే వున్నాడు . ఒకరకంగా చూస్తే సురేష్ కోసం ఎదురుచూస్తున్నట్టే వున్నాడు. “నాకు నడకకి వేళైంది. అలా నడుస్తూ మాట్లాడుకుందాం ” అన్నాడు .
ఆయన కొడుకు ఇంట్లోనే వున్నాడనీ, అతడు వినేలా మాట్లాడుకోవడం ఇష్టంలేదనీ గ్రహించాడు సురేష్. ఆయన చెప్పులేసుకుని బయల్దేరగానే తనూ అనుసరించాడు. చాలాసేపు మౌనంగానే నడిచారు.
“లేఆఫ్ అయ్యావుటకదరా?” చిట్టచివరికి తనే సంభాషణ మొదలుపెట్టాడు చలపతిరావు.
“మా కంపెనీ బ్రాంచీలు కొన్ని ఎత్తేస్తున్నారు బాబాయ్. చాలాకాలంనుంచీ వుంటోన్నవాళ్ళని తీసేసి, లేటెస్ట్ స్కిల్స్ వున్నవాళ్ళని తీసుకుంటున్నారు . ఆ ప్రాసెస్‍లో నేను పోటీని తట్టుకోలేకపోయాను. అదే సమయంలో నాన్న అనారోగ్యంపడి హాస్పిటల్లో చేరడంవల్ల కొత్తగా ఏదేనా నేర్చుకుని, టెక్నాలజీ పరిభాషలో నన్ను నేను అప్‍డేట్ చేసుకోలేకపోయాను” అన్నాడు సురేష్ నిర్వేదంగా.
“చాలా వింతగా వుందికదూ! మారోజుల్లో అనుభవం వున్నవాళ్ళని నెత్తిన పెట్టుకుని చూసుకునేవాళ్ళు. జూనియర్లు ఎంత చదువుకున్నాసరే, మాదగ్గర పని నేర్చుకొమ్మని పంపేవారు” అన్నాడు చలపతిరావు.
“రోజులు మారిపోయాయి బాబాయ్! వాళ్ళ కలలని సాకారపరుచుకుందుకు వ్యక్తులు కంపెనీలు పెడుతున్నారు. జాబ్ ప్రొవైడర్లుగా మారుతున్నారు. అది మన శ్రేయస్సుకోసమో, దేశశ్రేయస్సుకోసమో కాదు. వాళ్ళకి వుపకరించడంకోసం. వాళ్ళ ఆలోచనలని అమలులో పెట్టేందుకు”
“ఇన్ని తెలిసినవాడిని. ఇల్లు అమ్మితే నష్టమేమిట్రా?”
తల్లి అన్నట్టే జరగడం సురేష్ ఆలోచనలకి పదును పెట్టింది. జవాబివ్వలేదు.
“మా నాన్నకి నాలుగెకరాల పొలం వుండేది. వ్యవసాయం చేసేవాడు. అతివృష్టికో అనావృష్టికో ఏనాడూ పంట చేతికొచ్చేదికాదు. షావుకారు దగ్గర అప్పులు చేసేవాడు. కొద్దోగొప్పో పండితే అది అప్పులకీ వడ్డీలకీ సరిపోయేది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన నికరవిలువ సున్నా అన్నమాట. వ్యవసాయం అనేది ఒక వ్యాపకమే కానీ వుపాధి కాదు. స్పెక్యులేషన్‍మీద బతుకులు నెట్టుకొచ్చి అప్పలు మరీ పెరిగిపోయినప్పుడు ప్రాణాలు తీసుకోవడం తప్ప మరోమార్గం వుండదన్న విషయం అర్థమయాక నేను ఆ వూబిలోంచీ బైటికి వచ్చి వుద్యోగం వెతుక్కున్నాను” తనతో ఆయన చెప్పబోయే విషయానికి అది వుపోద్ఘాతమని అర్థమైంది సురేష్‍కి. వాళ్ళ అవసరాన్నీ తన హక్కునీ ఎలా సమన్వయ పరుస్తాడో చూడాలన్న కుతూహలం కలిగింది. అది తనకెంతవరకూ ఆమోదయోగ్యంగా వుంటుందో చూడాలనికూడా.
“నా జీతం మా నాన్నకి కొంత వెసులుబాటునిచ్చింది. అప్పులు తీర్చేసాడు. కొత్తగా మళ్ళీ పంటలు వేసాడు. ఈసారి గట్టి గుణపాఠమే నేర్చుకున్నాను”
“…”
“చేతిడబ్బుతో చేసావా, అప్పుచేసి చేసావా అనేదాంతో సంబంధం లేకుండా వ్యవసాయం లాభాలని ఇవ్వదు. అలా లాభాలనిచ్చే పంటలు వేరు. ఆ నేలలు వేరు. వాటికిగల నీటివనరులు వేరు. వసతులు వేరు. ప్రోత్సాహం వేరు. వ్యవస్థ మామూలు వ్యవసాయాన్ని ప్రోత్సహించడం లేదు. ప్రోత్సాహం లేని వృత్తిలో మనం ఎందుకు వుండాలనేది నా ప్రశ్న. ఎంతోకొంత పంట పండించుకుని కడుపులు నిండితే చాలని అనుకునే రోజులు పోయాయి. ఎన్నో అవసరాలు. వాటన్నిటికీ డబ్బు కావాలి. నేనింక పెట్టుబడి పెట్టనని నాన్నకి తెగసి చెప్పాను”
“…”
“తననికూడా భూమి అమ్మి నా దగ్గిరకి రమ్మన్నాను. తరాలనాటి భూమి అమ్మనన్నాడు. ఆ విషయమ్మీద గొడవలయాయి… “
“ప్రతి ఇంట్లో వుండేనే. వాళ్ళు మమకారాలని వదులుకోరు, మనం వాళ్ళని వదులుకోలేం”
“లేదు. నేను కొన్నాళ్ళపాటు వాళ్ళని పట్టించుకోలేదు. పూర్తిగా వదిలేసాను. నా డబ్బు నేను దాచుకున్నాను. ఇక్కడ ఇంటిస్థలం కొన్నాను. ఇంతలో అమ్మకి అనారోగ్యం. వైద్యానికి కనీసం రెండులక్షలేనా కావాలి. స్థలం అమ్మేసి వైద్యం చేయించి బ్రతికించుకున్నాను. అమ్మకన్నా ఏదీ ఎక్కువ కాదు. మనిషి ప్రాణంకన్నా డబ్బు ముఖ్యంకాదు”
“…”
“అమ్మకి నాలో దేవుడు కనిపించాడు. మనం చేసే వృత్తి మనకి కడుపు నింపడంతోపాటు భద్రతనిచ్చి అవసరంలో ఆదుకోవాలనే కనీసపు విషయాలు నాన్నకి అర్థమయాయి. అలాంటి వృత్తికి నాకు అవకాశం దొరికింది, తనకి దొరక్క నష్టపోయాడన్నది తెలుసుకుని చివరిదాకా నాదగ్గరే వున్నాడు” చలపతిరావు చెప్పడం ముగించాడు. ఏం చెప్పదలుచుకున్నాడో సూటిగా అర్థమైంది సురేష్‍కి.
“నా కొడుకు మీయింటికి వచ్చి అలా బెదిరించినట్టు మాట్లాడటం తప్పే. మీరు ఇల్లు అమ్మటం అమ్మకపోవటం పూర్తిగా మీయిష్టం. మీ నాన్నకీ నాకూ వుండిన పరిచయాన్ని దృష్టిలో వుంచుకుని, ఇప్పుడు అతడు లేడుగాబట్టి పెద్దతరహాగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను”
“…”
“మీరు అమ్మకపోయినా, పెరిగిన ఆగ్నేయాన్ని కత్తిరించి గ్రీనరీకి వదిలేసి అపార్టుమెంటు కడతాడట సోము. రెండు అపార్టుమెంట్ల మధ్య ఇరుక్కున్నట్టు వందగజాల స్థలంలో వుండాలా వద్దా అనేది ఆలోచించుకోవలిసినది నువ్వు. జరిగిన నష్టాన్ని గుర్తించి రేపెప్పుడో నువ్వు అమ్మాలనుకున్నా ఇప్పుడున్నంత డిమాండు వుండదు. వీళ్ళతో పోటీపడి నువ్వూ ఒక నాలుగంతస్థులు కట్టాలనుకున్నా, ఇరుకు ఇరుకే. ప్రైవసీ వుండదు”
“…”
“నువ్వు వప్పుకుంటే ఒక ఫ్లాటు నీకిస్తాడు. ఐదులక్షలు డబ్బు ఇస్తాడు. వుద్యోగం పోయిందని చెప్పావు. నీకు మరో జాబ్ వచ్చేదాకా వాడి ఫర్మ్‌లో అకౌంట్స్ రాయవచ్చు. బైట ఇచ్చినంత కాదుగానీ నెలకి పదివేలు ఇస్తానన్నాడు. ఇవన్నీ నామాటలు కాదు. నాకొడుకే చెప్పాడు. చిన్నప్పుడు ఒకచోట కలిసి పెరిగారుకదూ, వాడికి నువ్వంటే కన్సర్నే వుంది. ఇంక ఆపైన నీయిష్టం. వాడు బలవంతుడేగానీ దుర్మార్గుడు కాదు. మీరు అమ్మవద్దనుకుంటే మిమ్మల్నేమీ చెయ్యడు. మీ జోలికి రాడు” చలపతిరావు చెప్పడం ముగించాడు.
ఇద్దరూ నడిచినడిచి మళ్ళీ బయల్దేరిన దగ్గిరకి వచ్చారు. గుడ్‍నైట్ చెప్పి తమ గేట్లో అడుగుపెట్టాడు సురేష్. చలపతిరావు చెప్పిన విషయాలమీద కొంతకాలంగా ఆలోచిస్తునేవున్నాడు. తనకీ అవన్నీ తెలుసును. తల్లి ఎన్ని చెప్పినా వినడంలేదు. తండ్రి పోయాకే అమ్మవలిసినది. తనకి ఆఫీసుకి చాలా దూరం వుండేది. అప్పుడే అమ్మేసి ఆఫీసు దగ్గర ఫ్లాటు కొనుక్కోవాలనుకున్నాడు. తల్లి వప్పుకోలేదు. ఇప్పుడింక ఆవిడ ఇష్టాయిష్టాలకి అవకాశం లేదు. నిర్ణయం తీసుకోక తప్పదు. ధనమ్మ వాకిట్లోనే ఎదురుచూస్తోంది.
“ఏం చెప్పాడు?” రాగానే అడిగింది.
“ఏముంటుంది, కొత్తగా చెప్పడానికి?” ఆమెని తప్పించుకుని లోపలికి దారితీసాడు. అనిత ప్రశ్నార్థకంగా చూసింది. ఆమెకీ ఏమీ చెప్పలేదు. “అంతగా ఐతే పోలీస్ కంప్లెయింటిస్తాం. కాదూ కోర్టుకెళ్తాం. ఇల్లు వదులుకోలేంకదా? మనకి ఇంకే ఆస్థులున్నాయని?” అంది ధనమ్మ.
“వాళ్ళ స్థలంలో వాళ్ళు కట్టుకుంటే ఎవరూ వద్దనలేరు. అదే బాబాయ్ చెప్పింది. నష్టపోవద్దని చెప్పాడు. అటో అపార్టుమెంటు, ఇటో అపార్టుమెంటు పెట్టుకుని మధ్యలో గాలీ లేకుండా ఎలా వుంటాం? ఇప్పుడు మూడొందలగజాలలో కట్టుకోవటానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. మన వెనక ఇల్లుకూడా అమ్మేసారని విన్నాను. మననీ కలుపుకుని ముందుకి వెళ్దామని సోమూ వాళ్ళనుకుంటున్నారు. కలవాలా వద్దా అనేది మనిష్టం. ఒక ఫ్లాటూ కొంత డబ్బూ ఇస్తానన్నాడు. నాకు నచ్చింది. నీకూ నచ్చితే సరే. లేకపోతే మన్వొక్కదానివీ ఇక్కడ వుండు. మేం ఇక్కడినుంచీ వెళ్ళిపోతాం” అన్నాడు.
ధనమ్మ తెల్లబోయింది. “ఏమంటున్నావురా, సూరీ?” అపనమ్మకంగా అడిగింది.
“నువ్వు సరిగ్గానే విన్నావమ్మా” అన్నాడు సురేష్.
“మీనాన్న కట్టించిన ఇల్లురా యిది”
“ఆ నాన్నే కన్న నేనమ్మా! ఉద్యోగం లేదు. రేపెలాగో అర్థమవటంలేదు. నాకు పోలీస్‌స్టేషన్లకీ కోర్టులకి వెళ్ళే శక్తీ, ఆసక్తీ లేవు. ఐనా నీ ఇష్టానికి వదిలేస్తున్నాను”అన్నాడు.
“వాళ్ళు బెదిరిస్తున్నారని ఇల్లు వదిలేసుకోవడం చేతకానితనంలా లేదూ?” కోపంగా అడిగింది.
“బెదిరింపు కాదని చెప్పానుకదా? భవిష్యత్తు గురించి మనమే ఆలోచించుకోవాలి”
“నువ్వూ వాళ్ళతో చేతులు కలిపి, మీ నాన్న నాకు మిగిల్చి ఇచ్చిన ఇంటిని లాక్కుందామనుకుంటున్నావా?”
దెబ్బతిన్నట్టు చూసాడు సురేష్. వాళ్ళ సంభాషణ వింటూ నిల్చున్న అనితకూడా గాయపడింది ఆ మాటలకి. అప్పటిదాకా ఒక కుటుంబంవాళ్ళం అనుకుంటూ బతుకుతున్నారు. ఆ ముసుగేదో తొలగిపోయినట్టైంది. ఒకప్పుడు నెల తిరిగేసరికి జీతమో పెన్షనో వచ్చేది. కొండలు కరిగిపోయినా జీవికకి లోటుండదన్న భరోసా వుండేది. ఇప్పుడలా కాదు. ఉద్యోగానికే హామీ లేదు. పెన్షను మాటే లేదు. మనిషి ప్రతిక్షణం ప్రతిపైసతో కొట్లాడుతూ బతకాల్సిన పరిస్థితి. అందుకే ఏదో ఒకలా మానవసంబంధాలనే ముసుగులు చిరిగిపోతున్నాయి.
“ఇల్లు నీ పేర్న వుందికాబట్టి ఫ్లాట్ నీకే యిస్తారు”
“డబ్బు?”
“అదీ నీకే ఇస్తారు. అన్నీ యిచ్చేకే సంతకం పెడుదువుగాని. పదివేల జీతం వచ్చే వుద్యోగం మాత్రం నాకిస్తారు. అదేనా స్నెహధర్మంగానూ, నెనుమాత్రమే చెయ్యగలనుకాబట్టి” సురేష్ మాటలు పదునుగా వున్నాయి.
అతనికి కోపం వచ్చిందని గ్రహించింది ధనమ్మ. “నాకు వుందంటే అది నా తర్వాత నీకేగదా? మరింక తప్పనప్పుడు వాళ్ళకె ఇచ్చెయ్. జాగ్రత్త” కొంత తగ్గి నచ్చజెప్తున్నట్టుగా అంది. అతని గాయం ఏమాత్రం తగ్గలేదు. తల్లి అంగీకారం ఎలాంటి నిశ్చింతనీ ఇవ్వలేదు. ఏదీ జరగనప్పుడు ఎలాంటి వుద్వేగాలూ వుండవు. శూన్యంలోంచీ విశ్వం ఆవిర్భవించినట్టు ఏమీ లేనిదాన్లోంచీ సంఘటనలు పుట్టి వుద్వేగాలకి చోటిస్తాయి.
“అమ్మ వప్పుకుంది బాబాయ్. ఫ్లాటూ డబ్బూ ఆమె పేరునే ఇవ్వండి. అది ఆమె ఇల్లు. నాన్న తనకే రాసిచ్చి పోయారు” తల్లి ఎదుటే చలపతిరావుకి ఫోన్ చేసి చెప్పాడు.
తండ్రీకొడుకులు ఇంక ఆలస్యం చెయ్యలేదు. గజం డెబ్భైవేలు వుందక్కడ. ఒక్క టవరే కాబట్టి ఏడాదిలో పూర్తిచేస్తానన్నాడు ఆయన కొడుకు సోము. ఆ ఏడాదికీ వడ్డీ కట్టారు. అక్కడ చదరపు అడుగు కన్స్ట్రక్షన్‍కీ వున్న రేటు ప్రకారం, ప్లోర్ ఏరియా ఇండెక్స్ ప్రకారం చూస్తే కొంత డబ్బుతోపాటు వెయ్యి చదరపు అడుగుల స్ట్రక్చర్ వస్తుంది. రిజిస్ట్రేషను, జీయ్స్‍టీ కట్టుకోవాలి. ఇంకా చిన్నదే ఫ్లాట్ చాలన్నాడు సురేష్. అలాగైతే ఖర్చులన్నీ పోను డబ్బు మిగుల్తుంది. వప్పందాలూ, రాతకోతలూ అయ్యాయి.
“నిన్ను నేనెందుకు మోసం చేస్తాన్రా? చిన్నప్పటి ఫ్రెండువి” అన్నాడు సోము, షేక్‍హేండిస్తూ. వాస్తు ప్రకారం అతనికి ఆ స్థలం చాలా అవసరం. అలాగని సురేష్‍లాంటివాళ్ళతో సంబంధాలు చెడకుండా వుండటంకూడా. “ఆఫీసుకి వచ్చి అకౌంట్సు చుసుకో. నీకు వేరే వుద్యోగం దొరికాక మానేద్దువు” అనికూడా చెప్పి వెళ్ళాడు.
అతనికి ఈ లావాదేవీవలన ఎంత లాభం వచ్చివుంటుందా అని అనిత లెక్కలు వేస్తోంది. విన్‍వినా కాదా అనేది తేలలేదు.
ఆ దగ్గర్లోనే చిన్న పోర్షన్ చూసుకుని అందులోకి మారిపోయారు.


అపార్టుమెంటు కట్టడం పూర్తైంది. అంతదాకా తాము నివసించిన యిల్లు కళ్ళముందే కుప్పకూలిపోవటాన్ని చూసారు ధనమ్మ, సురేష్, అనిత. భర్త జ్ఞాపకాలు తన గుండెల్లోనే వున్నాయనుకుంది ధనమ్మ. కొత్త యిల్లు, కొత్తగా చేతికి వచ్చిన డబ్బు. ఇదో కొత్త జీవితం అనిపించింది.
పక్క ఫ్లాటులోనే చలపతిరావు నివాసం. అదింకా అమ్ముడవలేదు. అతన్ని చూస్తే మాత్రం భర్త జ్ఞాపకాలు కొలువై వున్నచోటే ఎక్కడో లోతుగా గుచ్చుకున్నట్టు వుంటుంది. అతని కొడుకు తమని యిల్లు అమ్మమని దౌర్జన్యం చెయ్యడం, అతను సురేష్‍కి నచ్చజెప్పి వప్పించడం, సురేష్ పూర్తిగా వాళ్లవైపు తిరిగిపోవటం, తను తెలివిగా ఆస్తిని కాపాడుకోవటం వరసగా గుర్తొస్తాయి. మాట నెగ్గించుకున్నారనిపిస్తుంది.
నయాన్నొ భయాన్నో వాళ్లని వప్పించి యిల్లు తీసుకున్నారన్న భావన చలపతిరావుని ఇబ్బంది పెడుతుంది. ఇంత అందమైన జీవితం కళ్ళముందు కనిపిస్తుండగా వాళ్ళంత మొండికేసారేమిటని ప్రశ్నించుకుంటాడు.
సురేష్‍కి తల్లి కొత్త వ్యక్తిలా అనిపిస్తుంది. నాన్న నాకిచ్చిన యింటిని నువ్వు కాజేద్దామని చూస్తున్నావా అని నిలదీస్తున్నట్టే వుంటుంది. తల్లీకొడుకులమధ్య దూరం పెరిగింది. కానీ సర్దుకుపోక తప్పదు. ఆమెని వంటరిగా వదిలిపెట్టలేడు. ఆమె పేరిట వున్న ఆస్థితో ముడిపడి వున్న తన బతుకునీ పిల్లల భవిష్యత్తునీ విడగొట్టలేడు.
చలపతిరావు, ధనమ్మ, సురేష్, భార్యాపిల్లలు అందరూ ఒకేచోట వుంటున్నారు… మనసులకైన గాయాలని కప్పిపుచ్చుకుంటూ.