వేదంనుండి ఖేదంవైపు… Translation by Savitri Ramanarao

ఆంగ్లమూలం – ప్రభాకర్ ధూపాటి గారి ” Vedic Wisdom And Global Ignorance “

నేను అనాధాశ్రమంనుండి చిన్నకారులో వస్తున్నాను. స్టేట్‍బాంక్‍లో చీఫ్‍మేనేజర్‍గా పని చేస్తున్నప్పుడు నా భర్త నాకీ కారు కొన్నారు. నేను స్కూల్ అసిస్టెంట్‍గా చేసి రిటైర్ అయాను. మేమిద్దరం కలసి కరీంనగర్ శివారు ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాం.
మాకొక అబ్బాయి. మన దేశజనాభా చాలా ఎక్కువ కనక మన దేశంలో ఏ జంటా ఒకరికన్నా ఎక్కువమందిని కనకూడదనేవారు ఆయన. అందికే ఒక బిడ్డకే పరిమితం అయాము. ఒక బిడ్డ తరవాత మేమిద్దరం ఒకమాట అనుకున్నమీదటే ఆయన వేసెక్టమీ ఆపరేషన్ చేయించేసుకున్నారు.
గత సంవత్సరం నా భర్త పోయాక మా అబ్బాయి కరీంనగర్‍కి ముప్ఫయి కిలోమీటర్ల దూరంలో ఒక అనాథాశ్రమం ఏర్పాటు చేశాడు. నిజానికి నా భర్త పోయే టైంకి తను అమెరికాలో వున్నాడు. నేను నా బిడ్డ చదువుమీద వాడి చిన్నతనంనుండి శ్రద్ధపెట్టాను. వాడు ఏ విషయం అయినా ఇట్టే పట్టేసే వాడు. చదువుల్లో, ఆటల్లో ఇలా ఒకటేమిటి అన్నింటా చాలా చురుకుగా వుండేవాడు.
నా భర్త స్వయంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు కాకపోయినా తన ఆసక్తికొద్దీ రకరకాల కొత్తకొత్త బోధనాపద్ధతులు ముఖ్యంగా లెక్కలు చెప్పటానికి సాధన చేసేవారు. అలా మా అబ్బాయి రోహన్‍కి లెఖ్ఖలపట్ల బాగా ఇష్టం పెంపొందించారు. వాడు ఏడవక్లాస్‍లో వుండగానే పదోక్లాస్ లెఖ్ఖలు అవలీలగా చేసేసేవాడు. చదువులో ఎప్పుడూ వాడు ముందు ఉండేవాడు. ఎన్నో పేరున్న విద్యాసంస్థలు పెద్దమొత్తం ఇస్తాము, రోహన్ని తమ విద్యార్థి గా చూపడానికి ప్రచారం చేసుకుందికి ఒప్పుకుంటే అని వచ్చేవారు. మొదట్లో కాదన్నా చివరికి అలాటి ఒక సంస్థ రోహన్ పేరు వాడుకుందికి ఒప్పుకున్నాం. వాడు ఇంటర్మీడియట్ స్టేట్‍ఫస్ట్ వచ్చి తరవాత ఐఐటిలో ఇంజినీరింగ్ చేసి ఐఐఎంలో ఎంబీఏ చేసాడు. తరవాత స్టాన్ఫోర్డ్‌లో పిహెచ్‍డీ చేసి తనదైన సాఫ్ట్‌వేర్ కంపెనీ అమెరికాలో పెట్టి చాలా సంపాదించడం మొదలుపెట్టాడు.
వాడు అమెరికాలోనే ఉండిపోవటం నాకన్నా నా భర్తని ఎక్కువగా బాధించింది. ఒక్కడే బిడ్డ అవటంవల్ల, వాడే లోకంగా ఉండి మేము వాడిని అతిగా ప్రేమించడంవల్ల వాడు దూరంగా వెళ్ళిపోవటంతో మా జీవితాల్లో పెద్ద శూన్యం ఏర్పడినట్లు అయింది. వాడు వెళ్లేరోజు నా భర్త చంటిపిల్లాడిలా ఏడ్చారు.
“వాడు ఇండియాలో వుండేటపుడు కనీసం పదిహేను రోజులకు ఓసారి వాడెక్కడుంటే అక్కడికి వెళ్లి చూసి వచ్చేవారం. ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతున్నాడు. అంత తరచుగా వెళ్లి చూడడం అవదు ” అంటూ వాడు వెళుతున్నపుడు ఆయన వెక్కుతూ ఉంటే నేనే సముదాయించవలసి వచ్చింది. బహుశా ఒకే బిడ్డ అవటంవలన, వాడు తప్ప వేరే లోకం లేకుండా బతికిన మా వెర్రితనంవలన నేడు ఈ పరిస్థితి వచ్చింది. పిల్లలని ప్రేమించవచ్చు. కానీ వాళ్ళు ఎదిగాక మనకి దూరం అవుతారు అనే స్పృహ ఎప్పుడూ కలిగి ఉండాలి అనిపించింది నాకా క్షణంలో.
రోహన్ బాగా సంపాదించడం మొదలు పెట్టాక హైదరాబాద్ శివార్లలో అన్ని వసతులతో మాకో పెద్ద బంగ్లా కట్టాడు. మా జీవనవిధానమే పూర్తిగా మారిపోయింది వాడి సంపాదనవలన. అలాగే తన వ్యాపారకార్యకలాపాలకోసం ఒక పెద్ద బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మించాడు. వాడి కంపెనీకి అన్ని పెద్దపట్టణాల్లో ఆఫీసులు ఉన్నాయి. వాడి ఫ్రెండ్ రవీంద్రనాథ్‍రావుని ఇండియాలో కార్యక్రమాలను చూడటానికి సీఈఓగా నియమించుకున్నాడు. ఇండియాలో వ్యవహారాలు అన్నీ అతనే చూసుకుంటాడు.
ఇక మావాడు నేను కార్ డ్రైవ్ చేయటానికి ఒప్పుకోడు. వాడు మాకోసం కొన్ని లగ్జరీ కార్లు మెర్సీడిస్, జాగ్వార్, ఆడి కొన్నాడు. వాడి కంపెనీలో చాలామంది డ్రైవర్లు వున్నారు . అందుకు ఇద్దరిని మాకోసం 24 గంటలు ఇంట్లో ఉండేట్లు ఏర్పాటుచేశాడు. ఇన్ని కొత్తకార్లు ఉండగా ఇంకెందుకు ఆ పాతకారు అంటూ నా చిన్నకారు అమ్మేయమన్నాడు. నేను ఒప్పుకోలేదు. ఆ చిన్నకారు మేము బాంక్‍లోన్ తీసుకుని ఎంతో కష్టబడి కట్టుకున్న మా కరీంనగర్ ఇంట్లో వున్నపుడు వాయిదాల పద్ధతిలో కొనుక్కున్నాం. దాని చివరి వాయిదా కట్టినపుడు నేనూ, ఆయనా ఆరోజు సంతోషంతో ఒక పండగలా చేసుకున్నాం. నాకు ఇప్పటికీ గుర్తే ఆ సంఘటన.
ఇప్పుడు నేను వున్న బంగ్లా ఇటాలియన్ మార్బుల్స్‌తో కట్టబడింది. ఇంట్లో ఇంపోర్టెడ్ ఫర్నిచర్, ఒక పెద్ద లిఫ్ట్ , పెద్దపెద్ద విశ్రాంతిగదులు ఉన్నాయి. అన్ని ఆధునిక వసతులతోపాటు ఓ అరడజనుమంది నౌకర్లు ఉండటానికి వీలుగా సర్వెంట్ క్వార్టర్స్ కట్టాడు మా వాడు. వాటిలో మా వాచ్‍మాన్, ఇతరమైన పనులు చేసే పనివాళ్ళు, డ్రైవర్లు వుంటారు. ఈ ఆడంబరాలు, అవసరానికి మించిన అతిని నేను ఎంత వ్యతిరేకించినా మావాడు వినేవాడు కాడు. “సంపాదిస్తున్నప్పుడు మనకి నచ్చినది ఎంత వీలు అయితే అంతా ఎంత ఖర్చు అయినా చేసేయాలి” అనేవాడు. నేను మళ్ళీ మళ్ళీ “ఎందుకురా ఇవన్నీ ?” అంటే .
ఏమున్నా, ఎన్ని ఉన్నా మా కష్టార్జితంతో కట్టుకున్న మా కరీంనగర్ ఇల్లు, చాలా చిన్నదే అయినాకానీ దానితో ముడివడి ఉన్న మధురానుభూతులు ఒకటా రెండా? వాటి విలువ దేని సాటీ రాదు. నాకు ఆ ఇంట్లో ఉండే తృప్తి ఎక్కడా ఉండదు.
“నేను ఒక్కదాన్ని ఉంటాను ఇక్కడ, నువ్వా ఎప్పుడో కానీ రావు. ఇంతింత ఖర్చుపెట్టి ఈ బంగ్లాలు , కార్లు , నౌకర్లు , చాకర్లు దేనికి చెప్పు . వద్దు ! “అని పోరుతుంటే “నువ్వు అమెరికా వచ్చేస్తే ఇక్కడ ఈ ఖర్చులన్నీ మానేస్తాను మమ్మీ!”అన్నాడు.
ముప్పయిరెండేళ్ళకి వాడు సాధించిన విజయాలు చూస్తే గర్వంగా ఉంటుంది కానీ వాడు పెళ్లి మాటే ఎత్తడు . ప్రతి ఏటా వాడి పెళ్లిని గురించి నేను అడగడం వాడు తరవాత చూదాం అని వాయిదా వేయడం. ఇదే తంతు గత నాలుగేళ్లుగా. నేను మాత్రం ఏమి చేయగలను?
“ఏమిటో అడ్డాల్లో బిడ్డలు కానీ గడ్డాలు, మీసాలు వచ్చాకా కాదు కదా!”, అని నిట్టూర్చి ఊరుకుంటాను.
నేను వారానికి ఒకసారి కరీంనగర్ వెళ్ళి వస్తుంటాను. రోహన్ కొన్న ఒక లగ్జరీ కారులో కరీంనగర్ వెళతాను. కానీ ఆ కార్లో అనాథాశ్రమానికి వెళ్లటానికి నాకు మనస్కరించదు. పైపెచ్చు సిగ్గు, అపరాధభావంతో నిండుతుంది మనసు. మెతుక్కు గతి లేక ఎందరో మగ్గుతుంటే కొందరు మాత్రమే ఇంత విలాసవంతమైన జీవితాలు గడపటం, అవసరానికి మించి సంపదలు పోగేయటానికి నేనూ, నా భర్తా వ్యతిరేకం.ఈమధ్యలో వచ్చిన అపారసంపదలు నాదీ, నా భర్తదీ ఆలోచనావిధానాన్ని ఏ కొంచెం మార్చలేకపోయాయి. నేనూ, నా భర్తా మా జీవితాల్లో శ్రమించి ఇల్లు, కారు కొనడం, మా బిడ్డను నాణ్యమైన మానేజిమెంట్ విద్యకు పంపడం చేసాము. ఇవన్నీ మా స్వశక్తితో చేసామన్న తృప్తి పొందాము.
ఈరోజు రోహన్ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా , మా కంపెనీకి సీఈఓ వాడి స్నేహితుడే అయి వాడి కంపెనీ దినదినం వృద్ధి పొందుతూ వున్నా, వాడి బాంక్ అకౌంట్స్ అన్నిటికీ నేనూ, వాడి మిత్రుడూ సిగ్నిటరీస్ అయినా నాకు ఏదో వెలితిగా అనిపిస్తుంది. నా భర్త సిగ్నిటరీగా ఉండటానికి మృదువుగా నిరాకరించారు కానీ నాకు తప్ప లేదు,
నేను జీతాలకి, మిగిలిన కార్యనిర్వహణ ఖర్చులకు పెద్దమొత్తాలలో చెక్కులు సంతకం పెట్టేటప్పుడు నాకు ఈ ప్రపంచీకరణ నేపధ్యంలో కొందరు వ్యక్తులు బాగా ధనవంతులు కావటం మరి కొందరు పూటకి గతి లేక నిలవడం, ప్రపంచంలో మొత్తం సంపదలో అత్యధికభాగం అతికొద్దిమంది చేతుల్లోకి చేరిపోతుండటం అనేది గుర్తుకు వస్తూ బాధ కలిగిస్తూ ఉంటుంది.
ఎప్పటిలాగే ఈసారీ నా కరీంనగర్ ప్రయాణం తరవాత అనాధాశ్రమం నుండి వస్తూ వున్నాను. అది ఉదయం వేళ. రోడ్డుమీద మార్నింగ్‍వాక్ చేస్తున్నవాళ్ళు తప్ప పెద్దగా ట్రాఫిక్ లేదు. ఉదయపు గాలిని ఆస్వాదించడానికి కారు అద్దాలు తీసేసి ఉంచాను. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. కారు సెంట్రల్‍లాక్‍కి చిన్న రిపేర్ ఉంది. హైద్రాబాద్ వెళ్ళాక చేయించాలి అనుకున్నాను.
ఇంతలో సడన్‍గా ఒక ట్రక్ నా కారును ఎడమవైపునుండి దాటేసి కుడివైపుకు తిరిగింది . ఆ ట్రక్ వెనకభాగం నా కారు ఎడమవైపు గట్టిగా తాకడం, వెంటనే నా కారు ఆ దెబ్బ తగిలిన భాగం పూర్తిగా క్రష్ అయిపోయి రూపు లేకుండా ఛిద్రమైపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ట్రక్ గుద్దిన తాకిడికి నా కార్ తలుపులు లాక్స్ ఊడి తెరుచుకుపోయి నేను సీట్లోంచి రోడ్డుమీద పడిపోయాను. దెబ్బలు తగిలి రక్తంకారటం మొదలయింది. ట్రక్ ఆగకుండా వేగంగా వెళిపోయింది. రోడ్డుమీద నడుస్తున్న వాళ్ళు కొందరు నాకు సహాయం చేయడానికి వచ్చారు.
నన్ను దగ్గరలో నర్సింగ్‍హోమ్‍కి తీసుకువెళ్లారు. అదృష్టవశాత్తు ఆ నర్సింగ్‍హోమ్‍లో డాక్టర్ నాకు గతంలో విద్యార్థి. నన్ను గుర్తుపట్టాడు. తను రోహన్‍తో ఎప్పుడూ టచ్‍లో ఉంటాడు . అతను నాకు వెంటనే చేయాల్సింది చేసి , రోహన్‍కు ఫోన్ చేసి జరిగింది అంతా చెప్పాడు.
రోహన్ తరవాత నాకు ఫోన్ చేసి ఏడ్చాడు,మాట్లాడాడు. నేను కళ్ళు మూసుకుని కాసేపు వాడి ఏడుపు, మాటలు మౌనంగా విన్నాను. అక్కడి డ్యూటీ డాక్టర్ రోహన్‍తో ఫోన్లోనే “మీరు బాధపడితే మీ అమ్మగారు మానసికంగా బాధపడతారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఆమెకు అది మంచిది కాదు. మీరు మిమ్మల్ని సంబాళించుకోండి , ఆమెకు విశ్రాంతి కావాలి ” అని చెప్పింది.
కొన్నిగంటల్లోనే మా కంపెనీ సీఈఓ రావు హడావుడిగా వచ్చేశాడు. నాకిలా జరిగినందుకు, ఈ జరిగిన విషయం నేపధ్యంలో రోహన్ అతనిపట్ల కాస్త అసహనం ప్రదర్శించినందుకు అతను విచారిస్తూ కనబడ్డాడు. అతని బాధ్యత ఆఫీస్ వ్యవహారాలు చూడటంతోపాటు నన్ను జాగర్తగా చూసుకోవడం కూడా అవటంవలన.
అతను ఓ పెద్ద లగ్జరీ అంబులెన్స్ తెప్పించి నన్ను అటెండ్ అయిన డాక్టరుతో వచ్చి నన్ను కేర్ హాస్పిటల్లో సింగిల్‍రూమ్‍లో చేర్పించాడు. ఇదంతా జరుగుతూ వున్నా నేను చాలావరకు కళ్ళుమూసుకుని మౌనంగా ఉండి రిలాక్స్ అయాను.
రెండురోజుల తరవాత నేను కాస్త కోలుకున్నాక రావుని పిలిచి మా అనాథాశ్రమంలో వుండే కమల్‍ని తీసుకు రమ్మని చెప్పాను. కమల్‍కి మంచి గాత్రం భగవంతుడు ఇచ్చిన వరం. సంస్కృతపదాలు కూడా ఉచ్ఛారణాదోషాలు లేకుండా పలుకుతాడు. అతనికి పదకొండు ఏళ్ల వయసులో రైల్లో పాడుతూ అడుక్కుంటూ నాకు కనబడ్డాడు. అతనిని తీసుకువచ్చి మా ఆశ్రమంలో చేర్పించి స్కూలికి పంపిస్తున్నాను. అతను స్కూల్లో కూడా చురుకుగా వుంటూ చదువులోనే కాక ఎన్నో పాటల పోటీలలో పాల్గొంటూ బహుమతులు గెల్చుకుంటున్నాడు.
అతనికి, మిగిలిన పిల్లలకి సంస్కృతశ్లోకాలు, వాటి అర్ధాలు ఆశ్రమానికి వెళ్లినపుడల్లా చెబుతూ ఉంటాను. కమల్ అవన్నీ ఎంతో ఆసక్తితో నేర్చుకుని రాగయుక్తంగా పాడుతూ ఉంటాడు. ఇంగ్లీష్‍లో వున్న శ్లోకాలు చదివెయ్యటం కూడా నేర్చేసుకున్నాడు. కమల్ నా గదిలోనే నేలమీద పడుకునేవాడు. నాకోసం నియమించిన లేడీనర్స్ అటెండెంట్‍కోసం రూమ్‍లో ఏర్పరచిన బెడ్‍మీద పడుక్కునేది.

ప్రతి ఉదయం నేను భగవద్గీత శ్లోకాలు, వేదమంత్రాలు, ఉపనిషత్ వాక్యాలు వింటూ ఉంటాను. కమల్ అర్ధాలు తెలియకపోయినా ఎప్పటిలాగే విని పాడటం నేర్చేసుకుంటున్నాడు. ఆ నేర్చుకోవడంలో వాడు తమాషాగా ఎన్నో తప్పులు చేస్తుండేవాడు. నాకు భలే నవ్వు వచ్చేది. వాడి తప్పులు దిద్దటం టీచర్ని అయిన నాకు అలవాటు అయిన పని. ఈజీగా చేసేదాన్ని . అలా వాడితో నాకు కాస్త కాలక్షేపం కూడా అయేది.
నా సన్నిహితమిత్రురాలు శారద ఆక్సిడెంట్ సంగతి తెలిసి నన్ను చూడటానికి వచ్చింది. తన భర్తకి అమెరికాలో వ్యాపారం. వాళ్ళు అక్కడే స్థిరపడి పోయారు. ఆస్తుల అమ్మకాలకి ఇండియా వచ్చింది. ఎప్పుడు ఇండియా వచ్చినా నాదగ్గర ఓ రెండు రోజులు ఉండి వెళుతుంది.
నేను, నా భర్తా, శారదా, శారద భర్త ఉస్మానియా యూనివర్సిటీలో చదివేటప్పుడు PDSU ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ యూనియన్ సభ్యులం. వారి కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాళ్ళం. మేమంతా కుల, మత, ప్రాంత వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం చేసేవాళ్ళం. విద్యార్థులుగా ఉన్నపుడు మామధ్య కులప్రసక్తే వుండే కాదు. శారదది కులాంతర వివాహం. శారద పద్మశాలి, వరంగల్ ప్రాంతం కానీ తన భర్త చౌదరీ విజయవాడ ప్రాంతంకు చెందిన వ్యక్తి.
మేము ఎపుడూ సాంఘిక అసమానతలు పోగొట్టటానికి ఏమి చేయాలి, సమాజానికి సేవ ఎలా చేయాలి అని తీవ్రంగా ఆలోచించేవాళ్ళం. అప్పుడు జార్జ్‌రెడ్డి, చాలా ప్రతిభావంతుడైన విద్యార్థి, మంచివక్త. అలాంటి లీడర్ల ప్రభావం మామీద ఉండేది.అప్పట్లో అమెరికా సామ్రాజ్యవాద పోకడలు మేము నిరసించే వాళ్ళం. మేమంతా ఇండియాలోనే ఉండి ఇక్కడి అసంఖ్యాక నిస్సహాయుల, నిరుపేదల ఉన్నతికి పాటుపడదాం అనే ఆదర్శాలు బాగా వంటపట్టించుకున్నాం. చదువుకుంటూనే ఆ దిశలో వీలు అయినది చేసేవాళ్ళం కూడా. కొందరు అతిచురుకుమిత్రులు తీవ్ర నిరసన విధానాల కారణంగా అప్పట్లో అజ్ఞాతంలోకి వెళిపోయి అనేక సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. వారికోసం, వారి త్యాగాలు తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాం. అలా ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్ళలో మా సన్నిహితురాలు రంగవల్లి కూడా ఉంది. ఆమె మరణం మమ్మల్ని బాగా కదిలించింది. మేము ఆ చావులతో బాగా మానసికంగా చెదిరిపోయాం . ఈ ఘటనల తరవాత శారదా, ఆమె భర్తా అమెరికా వెళిపోయారు. ఆ గతస్మృతులు కొన్ని తోడుకున్నాక నేను, శారద అమెరికాలో నేటి జీవనవిధానాల చర్చవైపు దారిపట్టింది మా సంభాషణ.
రోహన్ విజయపరంపర శారదను ఆశ్చర్యచకితురాల్ని చేసింది.
“ఈ విజయం అసాధారణం విజయా! ఈతరం అద్భుతాలు చేస్తున్నారు కానీ రోహన్ స్థాయిలో విజయం సాధించటం అతి తక్కువమంది మాత్రమే చెయ్యగలరు. ఇది నిజంగా ఊహకందని అద్భుతం !” అంది.
“ఏమిటో వాడు ఆ వ్యాపారం, వ్యవహారం తప్ప పెళ్లి ఊసు ఎత్తడు, నన్ను ఎత్తనీడు. అక్కడ ఎవరయినా మంచి సంబంధాలు ఉంటే చెప్పు” అన్నాను.
దానికి శారద ” నీది విశాల దృక్పథం. రోహన్ తన ఫార్మేటివ్ ఇయర్స్‌లోనుండి మీ దగ్గర కాక దూరంగా వున్నాడు. ముందు చదువుకోసం, తరవాత వృత్తిపరంగా కదా. అతనితో, నీతో కలిసిపోయే అమ్మాయి దొరకాలి. కానీ నిజానికి ఇవాళ అమెరికాలో జనంకూడా బాగా స్వార్ధపరులు, డబ్బుమనుషులు అయిపోయారు. ఎక్కడ చూడు మనుషుల్లో తమగురించి తప్ప రెండోమాట తలవనే తలవని సంకుచితధోరణులు పెరిగిపోతున్నాయి ఈరోజుల్లో. అసలా అమెరికాదేశమే వాళ్ళనీ , వీళ్ళనీ చంపి ఏర్పడింది. నేటితరాలు మరీను. తోటిమనుషులమీద కనీస దయాదక్షిణ్యాలు చూపించటం లేదు. ఎంతసేపు ఎవడి గోల వాడిది. ఎవరికి వారే యమునా తీరే. బయటినుండి చూసేవాళ్ళు ఏదో అమెరికా అద్భుతం, భూతలస్వర్గం అనుకుంటారు కానీ నిజానికి అక్కడి సమాజంలో ఉన్నంత వివక్ష మరెక్కడా ఉండదేమో అనిపిస్తుంటుంది ఒకోసారి నాకు. ఇక ఈరోజు అమెరికాకు వచ్చే యువతరంలో ఎంత కులవివక్ష భావాలో చూస్తే ఆశ్చర్యం, మనం ఎటు పోతున్నాం అనే ఆందోళన కలుగుతుంది. చెబితే నమ్మవు కానీ ఈ కులపిచ్చి అక్కడ ఏ స్థాయికి చేరిందంటే అక్కడ కూడా రకరకాలు కులాలకి , ప్రాంతాలకు చెందిన గ్రూప్‍లు తయారయ్యాయి. మన రోజుల్లో ఇంటి పేర్లు మన పేర్లకి కలిపి అంతలా బయటికి తెలిసేవి కాదు. ఒకవేళ తెలిసి నా ఎమ్వీస్, జీవీఆర్ ఇలాటి పొడి ఇంగ్లీష్ అక్షరాలలో దేనికీ సంబంధంలేకుండా ఉండేవి. ఇప్పుడు అలా కాదు ప్రతివాడు ఇంటిపేరు పూర్తిగా తగిలించుకుంటున్నాడు ప్రతిచోట. ఇండియానుండి వస్తున్న ఈ కొత్తతరంకి ఉన్న కుల, ప్రాంతతత్వాలు అమెరికాలో పుట్టి పెరిగిన మా పిల్లలకి మనస్కరించక వారినుండి దూరంగా వుంటున్నారు. అసలందుకే మా పిల్లలు నేటివ్ అమెరికన్స్‌నే పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్ళిళ్ళకి నేనూ, మావారూ కూడా అభ్యంతర పెట్టలేదు. మాది కులాంతరవివాహం కావటం కూడా మా పిల్లల పెళ్ళిళ్ళకి మేమేమీ అభ్యంతరపెట్టకపోవటానికి ఒక కారణం”
“…”
“నేను పెళ్లయి వెళ్లిన కొత్తలో బాబోయ్, మా అత్తవారింట్లో నన్ను నా కులం కారణంగా ఎంత తక్కువగా చూసేవారో తలుచుకుంటే ఇప్పటికీ బాధని పిస్తుంది . అలాటిది ఈరోజుల్లో అలాటి పరిస్థితులు అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాలకి కూడా వచ్చి పడుతున్నాయి అంటే ఎంత రోతగా వుంటోందో. ప్రపంచంలో రోజుకి రోజుకి వేర్పాటు భావనలు బలపడేట్లు మనుషులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే చాలా దిగులుగా అనిపిస్తుంది” అని శారద ముగించింది తన దీర్ఘ వివరణ.
అదంతా విన్నాక నన్ను ఎంతో నిరాశ, నిస్పృహలు ఆవరించాయి. ఏమిటీ మనుషుల్లో ఈ సంకుచిత మనస్తత్వాలు, గుంపునుండి ఒంటరితనంవైపు ప్రయాణాలు అని ఇద్దరం బాధపడ్డాం . తను మరి కాసేపు ఉన్నాక నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయింది.
నాకు చాలా అలసటగా అనిపించి కళ్ళు మూసుకున్నాను. కానీ తలలో గింగిరాలు తిరుగుతూ తలపులు. 2020నాటికి ప్రపంచం ఎలా వుంటుంది అనుకున్నాము, ఎలా వున్నాది, ఎటు పోతున్నాది, ఇదా మనం ఆశించినది అని నా మనసులో అంతర్మధనం మొదలయింది.
నిజానికి సంపద పోగు చేయటం మా ఉద్దేశ్యమే కాదు. మా PDSU నేపథ్యంవలనో ఏమో ఒక నెల జీతం, కనీస అవసరాలతో ఒక సామాన్యమైన తృప్తికరమైన జీవితం ఆశించేము. అలాగే బతికాము. రోహన్ సంపాదించేవరకు. నేను, నా భర్త ఇద్దరం సంపాదించేవాళ్ళం కాబట్టి చాలామందికన్నా మా ఆర్థికస్థితి కాస్త మెరుగ్గా ఉండేది. మాకొచ్చేదానితో సంతోషంగా గడుపుతూ మాలాటి ఆసక్తులు ఉన్న మితృలతో కలసి చక్కని మేధోపరమైన చర్చలలో పాల్గొంటూ ఎంతో సంతృప్తిగా వుండేవాళ్ళం. మా చర్చలలో రాని అంశం లేదు. రాజకీయాలు, ఆర్ధిక అంశాలు, తాత్వికశాస్త్ర సంబంధ విషయాలు , మతం, సాహిత్యం, సైన్స్ ఇలా ఎన్నెన్నో దొర్లేవి మా సంభాషణలలో. ఈ చర్చలవలన మాలో వ్యక్తికీ, సమాజానికీ సంబంధించిన విషయాలపై చక్కని అవగాహన వ్యక్తిగత, సామాజిక అవసరాలకు తగిన రీతిలో మానవీయతతో స్పందించాలి అనే స్పృహ పెంపొందాయి.
కానీ ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో నేటితరం ఆశయం కేవలం ఏదోవిధంగా డబ్బు సంపాదన మాత్రమే. బ్రాండెడ్ వస్తువుల, సేవల మితిమీరిన ప్రభావాలలో కొట్టుకుపోతున్న నేటితరానికి ఎవరేమనుకున్నా మాకు లెఖ్ఖ లేదు, మాకు తోచింది చేస్తాం, మాకు తోచినట్లు బతుకుతాం అనే విపరీత పోకడలు ప్రబలిపోతూ ఉండటం చాలా విచారకరమైన అంశం. అలా సాగుతున్న నా ఆలోచనలకి రోహన్ పిలుపుతో బ్రేక్ పడింది.
“ఎలా ఉన్నావు?”, మమ్మీ అంటూ రోహన్ వచ్చాడు. వాడు నన్ను చూసి ఏడ్చేసాడు. వాడి తలమీద చేయి వేసి నిమిరి ఓ చిన్న నవ్వు నవ్వాను.
చిన్నప్పుడు నేను కనబడక వాడు ఏడ్చినపుడు దగ్గరకి తీసుకుని ఊరుకోబెట్టిన రోజులు గుర్తువచ్చాయి.
“ఏమిటో, ఎంత ఎదిగినా పిల్లలు చిన్నవాళ్ళలాగే కనిపిస్తారు కదా! వెర్రిపిల్లడు! నాకు ఆక్సిడెంట్ అయిందంటే ఎంత చెదిరిపోయాడో మానసికంగా పాపం!” అనుకున్నాను మనసులో.
మామధ్య కుశల ప్రశ్నలు , మాటామంతీ అయి కాస్త రోహన్ సర్దుకున్నాక “ఈ రోజు ఏ వారం నాన్నా!” అని అడిగాను రోహన్‍ని.
“శుక్రవారం మమ్మీ “అన్నాడు రోహన్.
“సంగచ్ఛద్వం సంవదద్వం సంవో మనాంసి జానతాం” అని స్పీకర్లో వస్తున్న రుగ్వేద మంత్రంతో గొంతు కలిపి పాడుతున్న కమల్ వైపు చూసి “కమల్, నువ్వు ఇక ఈరోజు నీ ప్రార్ధనకి వెళ్లమ్మా!” అని చెప్పి,
“రోహన్, కమల్‍ని శుక్రవారం ప్రార్థనకోసం మసీదుకి పంపించు ఎవరినయినా తోడిచ్చి” అన్నాను.
రోహన్ ఆశ్చర్యంగా “మమ్మీ! కమల్ ముస్లిమా !!!” అన్నాడు ఆశ్చర్యంగా
“అవును! కమల్ పేరు అర్ధం తామరపువ్వు కాదు. అది నిజానికి కమాల్ అనే ముస్లిం పేరు. పేరులో ఏముంది? నేను కమల్ అంటాను, అంతే” అన్నాను.
“మమ్మీ, నువ్వు ఇలా ఎలా…”
నేను మధ్యలోనే అందుకుని “మీరు ప్రపంచాన్ని ఎంత ఎక్కువగా చూస్తుంటే అంత ఎక్కువగా మీ మెదడు కుడివైపు కుంచించుకుపోతోంది నాన్నా!! కమల్ పాడుతూ ఉన్న ఆ రుగ్వేద మంత్రం అర్ధం తెలుసుకో కనీసం. వేదవిచారానికి నేడు మీకు అద్భుత ఆర్ధికవిజయాలు అందిస్తున్న మీ అపారమేధస్సుకి , ఆ ఆలోచనా విధానానికి మౌలికంగా ఉన్న తేడా తెలుస్తుంది” అన్నాను అంతవరకు అలాటి విషయాలపట్ల మధనపడుతున్న నేను నిర్వేదంగా.

1 thought on “వేదంనుండి ఖేదంవైపు… Translation by Savitri Ramanarao”

Comments are closed.