లివింగ్ టుగెదర్ by S Sridevi

  1. వంటింటి కిటికీ by S Sridevi
  2. పగుళ్ళు by S Sridevi
  3. స౦దిగ్ధపు రహదారులు by S Sridevi
  4. కోడలొచ్చింది by S Sridevi
  5. అతనిష్టం by S Sridevi
  6. ఆమె విజేత కాదు by S Sridevi
  7. యుద్ధదృశ్యం by S Sridevi
  8. బేబీ ఆఫ్ అర్చన by S Sridevi
  9. తరంగనాట్యం by S Sridevi
  10. చిట్టికి క్షమార్పణలతో by S Sridevi
  11. ఇంకో మజిలీకి by S Sridevi
  12. అధిరోహణం by S Sridevi
  13. లివింగ్ టుగెదర్ by S Sridevi
  14. గుమ్మడి గింజలు by S Sridevi
  15. బంగారుపంజరం by S Sridevi
  16. చీకట్లో పూసిన పూలు by S Sridevi
  17. గినీ పిగ్స్ by S Sridevi
  18. మలయమారుతం by S Sridevi
  19. సార్వభౌముడు by S Sridevi
  20. అమ్మానాన్నలు by S Sridevi

టప్‍మని వానచినుకు మీద పడటంతో మెలకువ వచ్చింది మహతికి. నిద్రపోవటానికి ముందున్న వాతావరణం ఇప్పుడు లేదు. ఆకాశంనిండా దట్టంగా మబ్బులు కమ్మేసి వున్నాయి. ఈ క్షణాన్నో మరుక్షణాన్నో కురవనున్న కుంభవృష్టికి స్వాగతం పలుకుతూ ఎవరో విసుర్తున్న పూరెక్కల్లా రాలిపడుతున్నాయి ఒకటి రెండు చినుకులు. అలాంటి చినుకే ఒకటి మొహమ్మీద పడటంతో కొద్దిగా కదిలాడు నిశాంత్.
“లేవండి, లోపలికి వెళ్దాం. వానొచ్చేలా వుంది”” అనబోతున్న మహతి ఆగిపోయింది. అస్పష్టంగా కలవరిస్తున్నాడతను. వినాలని ప్రయత్నించింది.
“ఐ…లవ్..యూ…””
విస్మయం కలిగిందామెకి. పెళ్ళైన ఎనిమిదేళ్ళకి ఇప్పుడే కొత్తగా ప్రేమలో పడ్డట్టు ఎవరితో అంటున్నాడామాట? ఆ ప్రశ్నకి వెంటనే జవాబుకూడా దొరికింది.
“నిన్ను చాలా మిస్ చేసాను ప్రసన్నా!””
ఆమె నివ్వెరబోయింది.
ప్రసన్న… ప్రసన్న… ఎవరీ ప్రసన్న? సమ్మెటపోటులా వచ్చి తాకుతున్న ప్రశ్న. వాన గురించి మర్చిపోయింది.
దడదడమని ఒక్కసారి వాన మొదలవ్వటంతో చప్పుని లేచికూర్చున్నాడు నిశాంత్. హడావిడిగా పాపనీ బాబునీ చెరో భుజంమీదా వేసుకుని బెడ్^రూంలో పడుక్కోబెట్టి వచ్చాడు. తనతోపాటే లేచివుంటుందనుకున్న మహతి లోపలికి రాకుండా వానలో తడుస్తూ అలాగే కూర్చోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
“ప్రసన్న ఎవరు?”” అతను దగ్గిరకి రాగానే సూటిగా ప్రశ్నించింది.
షాకయాడతను. పట్టుబడ్డ దొంగలా తలొంచుకోలేదు. ఇరుకునపడ్డట్టు వుక్కిరిబిక్కిరవలేదు. ఆమెకెలా తెలిసి౦ది, అదీ అంత హఠాత్తుగా అని షాకయాడు. అంతే.
“మీరిందాకా కలవరించారు. ప్రసన్న ఎవరు?”” మళ్ళీ అడిగింది.
“లోపలికెళ్ళి మాట్లాడుకుందాం” అదేదో మామూలు విషయంలా అన్నాడు. అతనివెంట లోపలికి నడిచింది.
“ప్రసన్న విషయం నేనే చెప్పాలనుకున్నాను. గ్రాడ్యుయేషన్లో తను నా క్లాస్^మేట్. ప్రేమించుకున్నాం. చదువులయ్యి, వుద్యోగాలొచ్చాక పెళ్ళిచేసుకోవాలనుకున్నాం. కానీ ఈలోగా వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫరయ్యి వేరే వూరు వెళ్ళిపోయింది. క్రిందటి నెలలో యూనియన్ కాన్ఫరెన్సులో కలిసింది. తను…తనింకా పెళ్ళి చేసుకోలేదు”” ఆగాడతను. అతని గొంతులో అపరాధభావన వుంది.
“మీరింకా ఆమెని ప్రేమిస్తున్నారా?”” తీవ్రంగా వుంది మహతి స్వరం.
“ఎందుకు ప్రేమించకూడదు?”” ఎదురు ప్రశ్నించాడతను.
నివ్వెరబోయింది మహతి. తప్పు చేసి సమర్ధించుకుంటున్నట్టు లేదతని ధోరణి. అంటే ప్రేమించడం తప్పని కాదు. మనిషి నిరంతర ప్రేమి. ఎవరో ఒకర్ని, దేన్నో ఒకదాన్ని ప్రేమించకుండా బతకలేడు. పెళ్ళికిముందు… ఎలాంటి కమిట్‍మెంట్సూ లేనప్పుడు అతను ప్రసన్నని ప్రేమించి వుండవచ్చు. అది విఫలమవచ్చు. కానీ పెళ్ళైన ఎనిమిదేళ్ళకి ఇంత ధైర్యంగా అప్పటెప్పటి ప్రేమనో ప్రకటిస్తూ వుంటే అమెకి ఆశ్చర్యం కలుగుతోంది.
“మరి నన్నెందుకు పెళ్ళి చేసుకున్నారు? మీరూ తనలాగే పెళ్ళి చేసుకోకుండా వుండిపోవల్సింది”” అంది వుక్రోషం తన్నుకొస్తూ వుంటే.
“నిజమే!”” వప్పుకున్నాడు. “”తనూ నాలాగే సర్దుకుపోయి వుంటుందనుకున్నాను” అతనంత నిస్సంకోచంగా చెప్తుంటే ఏం చెయ్యాలో తెలీడంలేదు మహతికి. అవమానంగా అనిపిస్తోంది. అతను పడాల్సిన ఇబ్బందిని తను పడుతోంది.
“మేమొక నిర్ణయానికొచ్చాం””
మహతి మాట్లాడలేదు. అతను చెప్పింది వినడం మినహా తనకి మరో దారి లేదని అర్థమైంది. నిజమే. కాన్ఫరెన్సునుంచీ తిరిగొచ్చాక అతన్లో సునిశితమైన మార్పు కనిపించింది. దాన్ని తను గుర్తించింది. కానీ పని వత్తిడివల్ల పెద్దగా పట్టించుకోలేదు. అదీకాక అప్పుడప్పుడతను మూడీగా వుంటాడు. అదికూడా ఒక కారణమనుకుంది. కానీ అతని లోలోపల లావాలా కుతకుత వుడుకుతోందనీ అదెప్పుడో బహిర్గతమౌతుందనీ వూహించలేదు.
“నీకూ పిల్లలకీ నేను అన్యాయం చెయ్యను”” అతను చెప్పబోతున్నదేమిటో అర్థమైంది మహతికి. ముఖం ఎర్రబడింది.
“నిజానికి నువ్వూ పిల్లలూ నా జీవితంలో భాగమైపోయారు. మనని ఎవరూ విడదియ్యలేరు. అందుకే“మేం కలిసి వుడాలనుకుంటున్నాం. జస్ట్ బీ లివింగ్ టుగెదర్””
“అంటే?!””
“తనకి పెళ్ళీ పిల్లలూ ఏవీ అవసరం లేదు. నా తోడు చాలు. నువ్వొప్పుకుంటే నిశబ్దంగా జరిగిపోతుంది ఆ విషయం. లేకపోతే నేనే తన దగ్గిరకి వెళ్ళిపోతాను. ఆలోచించుకుని ఏం చేస్తే బావుంటుందో నువ్వే చెప్పు” ” అతను బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. అతనున్నచోటికి వెళ్ళడానికి మొదటిసారి సంకోచం కలిగింది మహతికి.
సోఫాలో అలాగే పడుకుంది. చాలా నిస్త్రాణగా వుంది. పొద్దున్న తొమ్మిదిన్నరనుండీ సాయంత్రం ఐదున్నరదాకా ఆఫీసులో ఎకౌంట్స్ చూసి ఇంటా బయటా ఎన్నో సమస్యల్ని ఎంతో తెలివిగా పరిష్కరించే ఆమె మెదడు ప్రస్తుతపు ఈ సమస్య విషయానికొచ్చేసరికి నియంత్రణ కోల్పోయింది. ఆలోచనలు గడ్డకట్టుకుపోయినట్టై సీలింగ్‍కేసి చూస్తూ వుండిపోయింది. ఏ తెల్లవారుఝామునో నిద్రలోకి జారుకుంది. ఎంతో విరక్తిగా అనిపించింది లేచాక. అప్పటికే నిశాంత్, పిల్లలూ లేచారు. వంట రెడీ, పిల్లలూ రెడీ. నిరాసక్తంగా తన పనులు చేసుకుపోయింది.
పిల్లల్ని స్కూల్లో దింపి వచ్చాడు నిశాంత్. మహతి మొహంలో పరుచుకున్న వుదాశీనత చూస్తూ ఆమెని మాట్లాడించే సాహసం చెయ్యలేకపోయాడు. ఆఫీసుకి వెళ్ళిపోయాడు.


“గతించిన ఏవో జన్మల్లో మనం ప్రేమికులం. మన ఆత్మలు ఆ శరీరాలనుంచీ విడిపోయాక కూడా మనం ప్రేమికులమే. ఒకరికోసం ఒకరం తపించిపోతూ జన్మాంతరాలనుంచీ వెతుక్కుంటూ తిరుగుతున్నాం. ఇప్పటికిలా కలుసుకున్నాం””
“నీకివ్వగలిగిన కానుక ఏముందాని ప్రపంచమంతా గాలించాను కానీ దొరకలేదు. నిరాశ నిండిన మనసుతో నా ఖాళీచేతుల్ని చూసుకుంటే అప్పుడర్థమైంది- నా హృదయంతప్ప అంత అద్భుతమైనది మరొకటి లేదనీ, అదిప్పటికే నిన్ను చేరుకుందని””
“ప్రేమకోసం చరిత్రలో యుద్ధాలెన్నో జరిగాయి. నిన్ను గెలుచుకోవాలంటే నేనెవరితో యుద్ధం చెయ్యాలి?”
“ప్రేమ అనే కీకారణ్యంలో ఇరుక్కుపోయి దారి దొరక్క కొట్టుకుంటున్నాను, నీ చెయ్యందించి దారి చూపవూ?””
కాలేజిరోజులప్పటి ప్రేమలేఖల్ని చదువుతోంది ప్రసన్న. ఆమె మనసు సముద్రకెరటంలా వువ్వెత్తుని ఎగిసిపడుతోంది. ఎంత భావుకుడతను!కాలేజిరోజుల్లో ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్ళిచేసుకోవాలనుకున్నారు. ఇంతలో తండ్రికి ట్రాన్స్ఫరైపోయి వేరే వూరు వెళ్ళారు. ఇద్దరూ ఒకర్నొకరు మర్చిపోలేదు. క్రమం తప్పకుండా ఉత్తరాలు రాసుకునేవారు. తను క్లుప్తంగా రాస్తే అతను మాత్రం అందమైన ప్రేమలేఖల్ని రాసేవాడు. అతని వుత్తరాలని చదువుతూ తండ్రికి దొరికిపోయింది.
అందరు తండ్రుల్లా ఆయన తనని తిట్టలేదు. తప్పుపట్టలేదు. అలాగని సరేననీ అనలేదు. ఇంతలో ఒక అనూహ్యమైన సంఘటన జరిగిపోయింది.
మేనత్త చనిపోయిందని టెలిగ్రాం వచ్చింది. వరకట్నపు చావు. ఏడేళ్ళపాటు అత్తింట్లో నరకం అనుభవించి ఆఖరికి వంటిమీద కిరసనాయిలు పోసుకుని కాల్చుకుని చచ్చిపోయింది. చావాలంటే తేలికైన మార్గాలు ఎన్నో వుంటాయి. కానీ అనుభవాలు అలాంటి చావునే కోరుకుంటాయేమో!
వళ్ళంతా కాలి మసిబొగ్గులాగైపోయిన అమె తన తండ్రికి ఆఖరి చెల్లెలు. ప్రాణప్రదంగా ప్రేమించేవాడు. ఆమెకి అత్తవారింట్లో అన్ని కష్టాలున్నాయని ఎవరికీ తెలియదు. ఆడపిల్లలు పెళ్ళీ అనేదాన్ని ఎంత పొసెసివ్‍గా తీసుకుంటారంటే పుట్టింట మరణించి అత్తింట పునర్జన్మించామన్నంత బలమైన విశ్వాసం ఏర్పడి భర్త కొట్టినా బైటపెడితే పోయేది తమ పరువేననుకుంటారు. ఆమె భర్తగురించీ ఏమీ చెప్పకుండా దాచిపెట్టింది.
“నాకు… నాకెందుకు చెప్పలేదు, శైల గురించి? ఇంతదాకా ఎలా రానిచ్చారు?”” తన తండ్రి ఆవేదనతో తాతగారినడిగితే-
“నాకుమాత్రం ఏం తెలుసురా? పిల్ల నవ్వుతూ తిరుగుతుంటే అది సుఖంగానే వుందనుకున్నాను. ఆఖరిపిల్లని అందరికన్నా దానికే ఎక్కువ పెట్టాను” అని తాతగారు ఏడ్చారు. బామ్మ సరేసరి. పోలీసుకేసు పెట్టారు మేనత్త అత్తవారిమీద.
“ఎందుకురా, నలుగుర్లో అల్లరవడం తప్పించి నా కూతురు తిరిగొస్తుందా? వాడి పాపానికి వాడే పోతాడు” అంది బామ్మ.
“తప్పుని దాస్తే దాగదమ్మా! నిప్పులా నిశ్శబ్దంగా కాలుస్తుంది. వాడి తప్పుని నలుగురికీ తెలిసేలా చెయ్యకపోతే శైలజలా మరో ఆడపిల్ల బలైపోతుంది”” అన్నాడు తండ్రి కఠినంగా.
తనలో పెళ్ళంటే ఏమిటనే విశ్లేషణ మొదలైంది. మగవాడు శారీరికంగానూ, సామాజికంగానూ బలవంతుడు. ఆ బలం అతన్లో ఒక పాశవిక ప్రవృత్తిని సృష్టించింది. అతని మృగప్రవృత్తిని ప్రకటించుకోవటానికి ఒక టార్గెట్ స్త్రీ. పెళ్ళి అనే ట్రాప్‍లోకి లాగి, ఆమెని మానసికంగానూ, సామాజికంగానూ బలహీనపరుస్తూ ఆనందాన్ని పొందుతాడు. ఆ రకమైన ఆలోచనలు తనలో పెళ్ళిపట్ల విముఖతని పెంచాయి. నిశాంత్ ఫేడౌటయ్యి సబ్‍కాన్షస్‍మైండ్‍లోకి వెళ్ళిపోయాడు.
తను పెళ్ళి చేసుకోదు. మగవాడికి టార్గెట్ కాదు. పిల్లల్నికూడా కనదు. పిల్లల్ని కంటే అక్కడ సెంటిమెంట్స్ వర్కౌట్ ఔతాయేమో! చుట్టూ ఎన్నో జీవితాలు. వాటితో ముడిపడిన ఎన్నో సమస్యలు. తనింటిని కేంద్రంగా తీసుకుంటే ఎంతో దూరందాకా ప్రకంపనాలు.
తండ్రి, మేనత్త భర్తని చాలా డీఫేమ్ చేసాడు. అందలం ఎక్కించి చెల్లెలి పక్కని కూర్చోబెట్టిన చేత్తోటే కిందికి తోసేసాడు. తామిచ్చినదంతా వెనక్కి తీసుకుని ఛారిటీహోమ్స్‌కి ఇచ్చేసాడు. అతని వుద్యోగం పోయింది. జైలుకెళ్ళాడు. అంతా జరిగాక మిగిలింది ఒకటే ప్రశ్న – వాళ్ళకి పిల్లలుంటే ఇదంతా జరిగేదాని. అప్పుడొక దోషిని శిక్షించడంకన్నా ఆ పిల్లలు అనాథలవ్వకుండా చూడటం ముఖ్యవిషయమయేది. స్త్రీల అణచివేత ఒక్క భారతదేశంలోనే వుందా? అమెరికా, ఇంగ్లాండ్ ఏదీ మినహాయింపు కాదు. ఒక శతాబ్దం క్రితందాకా ఇంగ్లాండ్‍లో ఆడవారికి ఓటు హక్కులేదు. అమెరికాలో ఎన్నో వివాహాలు విఫలమయ్యి స్త్రీపురుష సమానతావాదానికీ, స్త్రీస్వేచ్ఛకీ పెట్టుకున్న దరఖాస్తుల్లా ఎన్నో జీవితాలు…
కాలింగ్ బెల్ మోగేసరికి ఉలిక్కిపడింది ప్రసన్న. లెటర్సన్నీ సర్దేసి వెళ్ళి తలుపు తీసింది.
ఎదురుగా మహతి.
నిశాంత్ దగ్గిర ఆమె ఫోటో చూసింది ప్రసన్న. ఎందుకొచ్చింది? నేరుగా తనదగ్గిరకి? అని ఆలోచిస్తునే-
“రండి”” అని ఆహ్వానించింది.
“నాపేరు మహతి. కమర్షియల్ టేక్స్‌లో చేస్తున్నాను. నిశాంత్ భార్యని”” క్లుప్తంగా పరిచయం చేసుకుంది.
“తెలుసు”” చిరునవ్వుతో చెప్పింది ప్రసన్న. “నా గురించి నిశాంత్ చెప్పాడా?”” అడిగింది.
అన్నీ తెలుసుకుని ఆమె వచ్చిన పనేమిటి? తనని వప్పించి వారిమధ్యనుంచీ తప్పించడమా?
నిశ్శబ్దంగా లేచి వెళ్ళి ఫ్రిజిలోంచీ రెండు కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఒకటి ఆమెకిచ్చి, మరొకటి తను తీసుకుంది. ఇద్దరూ తాగుతున్నారు.
సడెన్‍గా బరస్టయింది మహతి.
“నిశాంత్‍ని ట్రాప్ చెయ్యటంలో నీ వుద్దేశ్యమేమిటి? చదువులో పడి నిర్లక్ష్యం చెయ్యటంచేతనో, కట్నాలు ఇవ్వలేకనో, సంపాదించే ఆడపిల్లలైతే తల్లిదండ్రుల స్వార్థంచేతనో ఈరోజుల్లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవటం కష్టమౌతోందనే విషయం నాకు తెలుసు. భార్యాపిల్లలుగల మగవాడిని పట్టుకోవడమనేది ఆ సమస్యకి పరిష్కారం కాదు. హైసొసైటీ క్లబ్సేవో వుంటాయట. అక్కడికి వెళ్ళి నచ్చినవాడితో గడిపిరావటం బెటరు. నేనేం చెప్తున్నానో నీకర్థమైందనుకుంటాను”” కఠినంగా అనేసి, చేతిలోని గ్లాసుని టక్కుమని శబ్దం వచ్చేలా టీపాయ్‍మీద పెట్టేసి లేచి నిలబడింది.
ప్రసన్న ముఖంలోకి వెచ్చటి రక్తం జరజర పాకింది. ఏమనుకుంటోందీమె తనగురించి? తనకీ నిశాంత్‍కీ మధ్య జరుగుతున్నదాన్ని? ఏమన్నాడు నిశాంత్ తనతో?
“నువ్వో దగ్ధమౌతున్న పూలతోటవి. శైలజగారి చావు నీలోని భావసౌకుమార్యాన్ని దహించివేస్తోంది. నిన్నిలాగే వదిలేస్తే ఏమైపోతావో తెలీదు”” అంటూ వానజల్లులా అల్లుకుని చల్లబరిచాడు. అప్పటిదాకా మగవాళ్ళని ద్వేషిస్తూ వున్న తనకి హఠాత్తుగా గుర్తొచ్చింది, సమాజంలో వుండేది తన మేనత్త భర్త ఒక్కడేకాదు, తండ్రి, తాత, నిశాంత్ వీళ్ళంతాకూడా మగవాళ్ళేనని. నిశాంత్‍కి దూరమై ఎంత పొరపాటు చేసి౦దో అర్థమై, ఆ వుద్వేగం తనని వూపేస్తున్న క్షణంలోనే మరొకటికూడా అర్థమైంది, తామిద్దరూ కలుసుకోలేనంత దూరంలో వున్నారని.
ఎలా? అతను లేకుండా బతకడమెలా? అనే ప్రశ్న జీవన్మరణ సమస్యలా కుదిపేస్తుంటే తోచిన ప్రత్యామ్నాయం లివింగ్ టుగెదర్. పెళ్ళీ, పిల్లల్లాంటి బాధ్యతలేవీ లేకుండా కలిసుండటం. ఇమోషనల్ షేరింగ్. దానివలన అతని భార్యాపిల్లలకేం నష్టం వుండదు. తనకి లీగల్ స్టేటస్ అక్కర్లేదు. అలాంటప్పుడు ఆమెకేంటి సమస్య? ఆమె హక్కుల్ని తనేం అడగనప్పుడు? మనిషి ప్రేమించడానికేం? ఎందర్నేనా ప్రేమించవచ్చు, ప్రేమకి హద్దులేం వుంటాయి?
“గుడ్ బై… గుడ్ బై ఫరెవర్”” ఆమెనలాగే ఆలోచనకి వదిలేసి విసురుగా ఇంటికొచ్చేసింది మహతి. నిన్నటిదాకా తనవేననిపించిన ఆ యిల్లూ, వాతావరణం ఎంతో అప్రియంగా తోచాయి.
మరోగంటకి నిశాంత్ వచ్చాడు. మహతి తనింటికి వచ్చి వెళ్ళినట్టు అతనికి ప్రసన్న ఫోన్ చేసి చెప్పింది. “”నాగురించి చాలా నీచంగా మాట్లాడింది. నేనసలు నీనుంచీ ఏమి ఆశించాను? స్నేహం… స్నేహపూరితమైన వోదార్పు… అంతేకదా?”” ఫోన్లో చెప్తునే ఆమె కళ్ళనీళ్ళపర్యంతమైంది. నిశాంత్ ముందు అక్కడికే వెళ్ళాడు. ఆమెని వోదార్చాడు.
“మొదట్లో అలాగే అనిపిస్తుంది. తనకెలాంటి అన్యాయం జరగదనే విషయం అర్థమయ్యాక అప్పుడు మారుతుంది”” అని చెప్పి మహతి దగ్గిరకి వచ్చాడు.
అతనికి ఇద్దరూ ముఖ్యమేకానీ ప్రసన్న పరిస్థితి కొంచెం సున్నితంగా వుంది. ఆమెనలాంటి పరిస్థితిలోకి నెట్టేసిన తనమీద తనకే కోపం వస్తోంది. వాళ్ళకి ట్రాన్స్ఫరై వెళ్ళిపోయాక దాదాపు సంవత్సరంపాటు క్రమం తప్పకుండా లెటర్స్ రాసుకున్నారు. ఆ తర్వాత హఠాత్తుగా ఆమె రాయడం మానేసింది. పెద్దవాళ్ళుగానీ బలవంతంగా పెళ్ళి చేసారేమోననుకున్నాడు తను. అంతకన్నా వేరే కారణం కనిపించలేదు. వెళ్ళి కలుద్దామనుకున్నాడు. అలా చెయ్యడం ఆమెని డిస్ట్రబ్ చేసినట్టౌతుందని భావి౦చి వూరుకున్నాడు. ఎంత ఫూల్ తను! ఒక్కసారి వెళ్ళి కలిసివుంటే ఈరోజున ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదనిపించింది.
అతనొచ్చేసరికి మహతి సోఫాలో వెనక్కి తలానించి కాళ్ళు టీపాయ్‍మీద వుంచి సుదీర్ఘమైన ఆలోచనలో వుంది. అతనిలో అపరాథభావన చోటుచేసుకుంది. దగ్గరగా వేళ్ళి భుజంమీద చెయ్యివేసాడు. ఆ స్పర్శకి ఉలిక్కిపడి తలతిప్పిన ఆమె నెమ్మదిగా అతని చేతిని తొలగించింది.
“ప్రసన్న దగ్గిరకి ఎందుకెళ్ళావు?”” మృదువుగానే అడిగాడు. అతనికి ఆమెతో దెబ్బలాడాలని లేదు. సామరస్యంగా చెప్పి వప్పించాలనే వుంది.
“నేనొచ్చానని చెప్పిన వ్యక్తి, ఎందుకెళ్ళానో, ఏమన్నానో చెప్పలేదా?””
“అలా మాట్లాడవచ్చా? తను చాలా హర్టైంది.””
“చేసే పనులు అలాంటివైనప్పుడు. అలాగే మాట్లాడతారు. ఈరోజుని నేనన్నాను. రేపట్నుంచీ చుట్టూ వున్నవాళ్ళు అంటారు. పడాలి. తప్పదు.”
“అందరికీ నీలా అమరిన జీవితం వుంటుందా?””
“అలా అమరకపోవడంలో నా తప్పేదైనా వుందా?””
“మూర్ఖంగా వాదించకు. అవతలి వ్యక్తి సమస్యని అర్థం చేసుకోవెందుకు? నువ్వేం చిన్నపిల్లవు కాదు”” చిరాగ్గా అన్నాడు.
“నాకా అవసరం లేదు””
“ఆమె నాకోసం పెళ్ళి మానేసింది”
“దానికి నా బాధ్యత లేదు””
“నువ్వింత మొండిగా మాట్లాడుతున్నావుకాబట్టే నేనూ కఠినంగా చెప్పాల్సొస్తోంది మహతీ! విను. నీకిష్టమైనా లేకపోయినా నేను ప్రసన్నని దూరం చేసుకునే ప్రసక్తి లేదు. నీ లిమిట్స్‌లో నువ్వుంటే మంచిది. మరోసారి తనని కలిసినా ఇలా మాట్లాడినా నేనూరుకోను. అర్థమైందా? నీకేదైనా కోపం వుంటే నన్నను. అంతే”
అతనికేసి నిశితంగా చూసింది మహతి. మగవాడు ఎంతలో రంగులు మార్చగలడు? తనే ప్రాణమన్నట్టు ఎనిమిదేళ్ళు గడిపిన వ్యక్తి. ఇంతలో ఎంత మారిపోయాడు! తల్లి, చెల్లి, ఆఫీసులోని సహోద్యోగి, పెళ్ళికి పూర్వపు స్నేహితురాలు… అందరూ ముఖ్యమైనవాళ్ళే. భార్య తప్ప. ఐనా ఆమె తనకి నమ్మకంగానే వుండాలనుకుంటాడు. అది తెలివితక్కువతనం అనాలో అహంభావమనాలో అర్థమవలేదు.
“అదే మీ ఆఖరినిర్ణయమా?””
అతను జవాబివ్వలేదు. సుదీర్ఘంగా నిశ్వసించిది మహతి.
“మనం విడిపోదాం”” తనే జవాబు చెప్పింది. అదే ఆమె అంతిమ నిర్ణయం కూడా.
“అంటే?!!”” అతని భృకుటి ముడిపడింది.
“పెళ్ళి అనే పంజరాన్ని పగలగొట్టుకుని ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోదాం”
“పిల్లలు?””
“హాస్టల్లో వేస్తే వాళ్ళే చదువుకుంటారు””
“నువ్వు మళ్ళీ పెళ్ళిచేసుకుంటావా?””
“ఆలోచిస్తాను”
“ఇద్దరు పిల్లల తల్లివి”
“అదే ఇద్దరుపిల్లల తండ్రినైవుంటే కచ్చితంగా చేసుకుంటానని చెప్పేవాడిని”
“ఆ పెళ్ళిలో నీకు సంతోషం వుంటుందనే అనుకుంటున్నావా?””
“చేసుకుంటానని అనలేదే? ముందు నాకు స్వేచ్ఛకావాలి. నువ్వు ఎగిరిపోయాక ఇంకా నేను పంజరంలోనే వుండాలనుకోవడంలేదు””
అతనికి మహతి మానసిక స్థితిమిద అనుమానం వచ్చింది. జాలేసింది. ఉక్రోషంలో అలా మాట్లాడుతోందనుకున్నాడు. అది తగ్గితే వివేచన అదే మేల్కొంటుందనిపించింది.
“అన్నం తిందామా? నేనూ తినలేదు”” మాట మార్చాడు.
“నాకు తినాలని లేదు””
“అన్నంమీద అలిగితే సమస్యలు పరిష్కారమౌతాయా? నువ్వు సమస్య అనుకుంటున్నది అసలు లేనే లేదు. చిన్న సర్దుబాటు. నేను ప్రసన్నని పెళ్ళిచేసుకోను. తనకి హక్కులేమీ అక్కర్లేదు. జస్ట్… నా తోడు ఆశిస్తోంది. అంతే. నీ తర్వాతే ఎవరేనా నాకు”” మెత్తగా అన్న్నడు.
“ఉంచుకున్నదానికి హక్కులేవీ వుండవనేదొక గొప్ప విషయంలా చెప్పక్కర్లేదు. మీరిద్దరూ పెళ్ళిచేసుకుంటే పర్యవసానం ఎలా వుంటుందో తెలీని మూర్ఖురాలు తననీ నేను అనుకోవటంలేదు”” ఠపీమని అనేసి అక్కణ్ణుంచీ లేచి వెళ్ళిపోయింది మహతి.
అదతని సహనానికి ఆఖరి హద్దైంది.
“స్టుపిడ్ వుమన్!”” బైటిగా కసిగా అని విసురుగా బైటికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళటం ప్రసన్న ఇంటికి.

రెండురోజులైంది నిశాంత్ ఇంటికొచ్చి. మహతి తనమీద ఎంతగా ఆధారపడి వుందో తెలుసునతనికి. పొద్దున్నే కూరగాయలు కోసివ్వటం, పిల్లలచేత చదివించడం, వాళ్ళని తయారుచెయ్యటం, స్కూల్లో దించటం, మళ్ళీ వచ్చి ఆమెని తీసుకుని ఆఫీసులో దింపటం…కనీసం ఆ టైంలోనేనా, ఆ పనులు చేసుకుంటున్నప్పుడేనా ఆమెకి తను గుర్తొస్తాడని ఆశించే వెళ్ళలేదు.ఈలోగా ఇద్దరూ ఫోన్లో మరో రెండుసార్లు దెబ్బలాడుకున్నారు. “”ప్రసన్నని నా ఫ్రెండని ఎందుకనుకోవు? ఎవరి వ్యక్తిగతజీవితం వాళ్ళదిగానే వుంచుతాను. కలగాపులగంచెయ్యను”” అన్నాడు నిశాంత్.
“ఆమెపట్ల నీకున్నది స్నేహభావమే అయితే చెప్పు. నీవెనుక నిలబడి ఆమెకెలాంటి సాయం కావాలన్నా చేస్తాను. అంతేగానీ నన్ను బ్లఫ్ చెయ్యద్దు” తెగేసి చెప్పింది మహతి.
“ఆమెకి నాపట్ల చాలా చులకనభావం వుంది. మనని అర్థంచేసుకోనంతవరకూ అది సజీవంగా వున్నట్టే లెక్క. దయచేసి ఆమె అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చెయ్యి నిశాంత్. నేనసలు నిన్నెందుకు దూరం చేసుకున్నానో నాకే అర్థమవటం లేదు. ఇప్పుడింత దగ్గిరయ్యాక మళ్ళీ ఎలా దూరమవను?” అంది ప్రసన్న బాధపడుతూ.
ఇద్దరిమధ్యా నలిగాడు నిశాంత్. కొంత సంఘర్షణ… కొంత ఒరిపిడి. పిల్లలు గుర్తొచ్చారు. ఇంక ఆగలేకపోయాడు. అతను వెళ్ళేసరికి మహతి ఇంట్లోనేవుంది. హాల్లో కూర్చుని ఏదో చదువుతోంది. చుట్టూ ఏవో పుస్తకాలు చిందరవందరగా వున్నాయి. ఆరోజుదాకా ఆఫీసుకి వెళ్ళనట్టుంది.
అతని రాకని గుర్తించనట్టే వూరుకుంది. అతనికది తనిల్లో పరాయిల్లో అర్థమవనంత ఇబ్బందిగా అనిపించింది. దాన్ని దిగమింగి సోఫాలో కూర్చుని షూ ఇప్పుకున్నాడు. వాటిని స్టాండుమీద పెట్టేటప్పుడు చిన్నగా శబ్దం చేసాడు. మహతి చిరాగ్గా కళ్ళెత్తి చూసి మళ్ళీ పుస్తకంలో లీనమైపోయింది. అతనికి అవమానంగా అనిపించింది.
విసురుగా తమ గదిలోకి వెళ్ళాడు. తమ గది అంటే ఈ సంఘటనలు జరగకముందుదాకా తనూ మహతీ వాడుకున్న గది. రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకటే సింగిల్ కాట్ వుంది. వార్డ్‌రోబ్‍లో చూసాడు. తన బట్టలుగానీ వస్తువులుగానీ లేవు. అన్నీ మహతివీ పిల్లలవే వున్నాయి. శలవు పెట్టి చేసినపని ఇదన్నమాట అనుకుంటుంటే గది అవతల అడుగుల చప్పుడు వినిపించింది.
“మీ బట్టలవీ పిల్లల బెడ్‍రూంలోకి మార్చాను. ఇది నాది. ఇందులోకి మీరు రాకండి”” బైట నిల్చునే చెప్పింది. అతనికి ఆమెదంతా చిన్నపిల్లల వుక్రోషంలా అనిపించి అప్పటిదాకా ఆమెపట్ల ఏర్పడిన కోపం కొంత చల్లారింది.
“సారీ!”” చిన్నగా నవ్వి, ““పిల్లలేరి?”” అడిగాడు.
“హాస్టల్లో వేసాను” చెప్పింది.
అతను తెల్లబోయాడు. కోపం కట్టలు తెంచుకుని వచ్చింది. “”హాస్టల్లోనా? ఎందుకు? మనిద్దరం బతికే వున్నాం. రేప్పొద్దున్నే వెళ్ళి తీసుకొచ్చెయ్”” అన్నాడు. అతని గొంతు కఠినంగా మారింది.
“నేను ఎంఫిల్‍కి అప్లై చేసాను. పిల్లల్తో నా చదువు కుదరదు””
అతను కోపంతో వూగిపోయాడు. “”నువ్వసలు ఆడదానివేనా?”” అరిచాడు.
“మీరసలు ఒక మగవాడిగా, ఒక స్త్రీకి భర్తలా ప్రవర్తిస్తున్నారా? కట్టుకున్నదాన్నొదిలేసి ఎవర్నో వుద్ధరిస్తానంటున్నారు. ఇంతటి అనైతికచర్యని నేను సహించలేను. దీన్ని నేను సమర్ధిస్తే నా తర్వాతి తరానికి అలవాటైపోతుంది. నా కొడుకుగానీ కూతురుగానీ మిమ్మల్ని ఉదాహరణగా తీసుకోవడం నేను సహించలేను. ఒక తల్లిగా వప్పుకోను”” చాలా కటువుగా వుంది మహతి గొంతు.
తల గిర్రుమని తిరిగింది నిశాంత్‍కి. కాస్త తగ్గాడు.
“పిల్లల్ని హాస్టల్లో వేసి ఏం చేద్దామని?””
“ఎమ్మెస్సీ చేసి ఎమ్ ఫిల్ చెయ్యాలనుకున్నాను పెళ్ళవకముందు. మా నాన్న వద్దన్నారు. పెళ్ళయ్యాక ఇల్లూ సంసారం బాధ్యతల్తో ఆ కోరికని పక్కకి నెట్టేసాన”.”
“ఇప్పుడు చేస్తావా?”” దిగ్భ్రమగా అడిగాడు.
“ఏం, చెయ్యకూడదా?””
“మధ్యలో వాళ్ళేం చేసారు?”
“వాళ్ళుంటే వండి పెట్టడం, అన్నీ పద్ధతిగా చెయ్యటం నాకెలా కుదురుతుంది?””
అతను వెర్రిగా చూసాడామెని. ఏం మాట్లాడాలో అర్థమవలేదు. తను చేసినదానికి ఆమె ఇవ్వజూపిన కౌంటర్ ఇంత గట్టిగా వుంటుందనుకోలేదు. మళ్ళీ అతనికే అనిపించింది. మగవాడు తనకే పిల్లలమీదికి మనసు పోతుంటే కన్నతల్లి ఆమెకి వుండదా? ఎన్నాళ్ళు వదిలిపెట్టి వంటరిగా వుండగలదు? అనుకుని,
“సర్లే, అన్నం పెట్టు. నేను వెళ్ళి వాళ్ళని చూసి వస్తాను”” అన్నాడు.
“మీకోసం వండలేదు. నాకోసమే వండుకున్నాను. నా భోజనం కూడా అయిపోయింది”” చాచిపెట్టి చెంపమీద కొట్టినట్టుంది మహతి జవాబు.
“మ..హ..తీ..”” దిగ్భ్రమగా, కొత్తగా ఆమెని చూసినట్టు చూసాడు. “నేను రాననుకున్నావా? రావద్దనుకున్నావా?””
“జరిగిన పెళ్ళే వద్దనుకుని తెగతెంపులు చేసుకున్నాక మీకూ నాకూ ఏమిటి సంబంధం? నేను మీకోసం ఎందుకొండాలి? వండి ఎందుకు ఎదురుచూడాలి? ఆస్థివ్యవహారాలు ఇంకా మనం సెటిల్ చేసుకోలేదుకాబట్టి మీరు రావాలనుకున్నప్పుడు రండి. మీ ఏర్పాట్లు మీరు చూసుకోండి””
నిశాంత్‍కి తల గిర్రుమని తిరుగుతున్నట్టైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏడ్చి గొడవచేసే ఆడవాళ్ళగురించి తెలుసును. ఆత్మహత్యకి ప్రయత్నించేవాళ్ళని చూసాడు. కానీ ఇంత ప్రతీకారాత్మకంగా ఆలోచించి ఏటికి ఎదురీదే మనస్తత్వాన్ని చూడటం ఇదే మొదటిసారి. మహతి సహజంగానే చాలా ధైర్యంగా, స్థైర్యంగా వుంటుంది. ఇప్పుడు ఆమె ధైర్యస్థైర్యాల కడపటి అంచుని చూస్తున్నాడు. పూర్తిగా అపరిచితురాలిలా అనిపించింది. ఇంక ఆ ఇంట్లో వుండలేకపోయాడు.
పిల్లలదగ్గిరకి వెళ్ళాలనిపించింది. మనసెంతగానో ఆరాటపడింది. ప్రీతీ , వంశీ ఎప్పుడేనా తమిద్దరినీ వదిలిపెట్టి వున్నారా? ఎందుకు మహతి వాళ్ళని దూరంచేసుకుంది? ఎవరిమీద కోపం ఇది? అతనికి అంతదాకా ఎంతో సొఫిస్టికేటెడ్‍గా కనిపించిన మానవసంబంధాలు, వివాహవ్యవస్థ పైపై పొరలన్నీ చిరిగిపోయి లోపల వున్నదేదో ముతగ్గా కనిపిస్తున్నట్టనిపించింది.
టైము చూసుకోలేదు. హాస్టల్‍కి వెళ్ళాడు. లైట్లన్నీ ఆఫ్ చేసి వున్నాయి. అప్పుడు చూసాడు వాచీలోకి. రేడియం డయలు పదకొండు చూపిస్తోంది. నిరాశగా స్కూటర్ని ప్రసన్న ఇంటివైపు మళ్ళించాడు.
“ఏమైంది? మళ్ళీ ఏదైనా గొడవా?”” అడిగింది ప్రసన్న వాడిపోయి వున్న అతని ముఖం చూసి.
“పిల్లల్ని హాస్టల్లో వేసింది మహతి” “
అతను తీసుకున్నంత సీరియస్‍గా ఆ విషయాన్ని తీసుకోలేదు ప్రసన్న. “సో వాట్? ఆమెకలా నచ్చింది. చేసింది. దానికి నువ్వెందుకింత కిందామీదా అవటం?”“అడిగింది వింతగా చూస్తూ.
“ఎందుకేమిటి? వాళ్ళు నాకూ పిల్లలే. నాతో ఒక్కమాటేనా చెప్పకుండానా?”
“ఎందరు పిల్లలు హాస్టల్స్‌లో లేరు?””
“వాళ్ళూ నా పిల్లలూ ఒకటేనా? ఆమె ఒక ఫూల్. ఆమె ఒక ఇడియట్. షీ ఈజ్ ఎవ్వెరి నాన్సెన్స్…”” కుర్చీలో కూలబడి అశాంతిగా చేతుల్లో ముఖం దాచుకున్నాడు. ప్రసన్న మనసు ఆర్ద్రమైంది. అతని దగ్గిరగా వెళ్ళి జుత్తులో వేళ్ళు జొనిపి తలని పొట్టకి ఆనించుకుంది.
“అక్కడేమైనా తిన్నావా, నిశాంత్?”” అడిగింది రెండు నిముషాలాగి.
“ఆకలి లేదు””
“నేనూ వండుకోలేదు. రెండు యాపిల్సు లాగించి పాలు తాగాను. నీకూ ఇవ్వనా? ఎటేనా వెళ్దాం”” అంది.
“ఇంత రాత్రా?”
“పబ్ కెళ్దాం. లేకపోతే రాత్రంతా మూడాఫ్‍గానే వుంటావు. దాన్ని భరించే ఓపిక నాకు లేదు”” అంది ప్రసన్న. అనటమేమిటి, అతన్ని వదిలేసి వెళ్ళి, పళ్ళు కోసి తెచ్చి ముందు పెట్టింది. నాలుగు ముక్కలు తిని లేచాడు.
ఇద్దరూ బైటికొచ్చారు. వస్తూ ప్రసన్న అంది,””ఒకమాట చెప్పనా నిశాంత్?””
ఏమిటన్నట్టు చూసాడతను.
“నీ జీవితం నీదని వదిలేసి వచ్చేసావు. ఆమె జీవితం ఆమెదని వదిలెయ్. లేకపోతే మనశ్శాంతి వుండదు””
“మామధ్యని పిల్లలు నలిగిపోతున్నారు ప్రసన్నా! అసలు తనకింత మూర్ఖత్వమేమిటి?””
“ఇందులో పిల్లలకి ఇబ్బందేముంటుంది? మనం ఇబ్బంది, ఇబ్బందని పదేపదే అంటుంటే వాళ్ళకి ఇబ్బందనిపిస్తుంది. లేకపోతే సర్దుకుపోతారు. ఒకవేళ ఆమె మళ్ళీపెళ్ళి చేసుకున్నా వాళ్ళకో ప్రత్యేకమైన లైఫ్‍స్టైల్ ఏర్పడుతుంది. ఆమె నువ్వనుకున్నదానికన్నా తెలివైనది”
చేదు తిన్నట్టైందతనికి. మహతి మళ్ళీ పెళ్ళి చేసుకోబోతోందా? అందుకే పిల్లల్ని దూరం చేసిందా? మళ్ళీ పెళ్ళి చేసుకుని మళ్ళీ పిల్లల్ని కని… అసహ్యంగా అనిపించింది. ఆమె మళ్ళీ పెళ్ళిచేసుకోబోవటం కాదు, మళ్ళీ పిల్లల్ని కనబోవటమూ కాదు. ఉన్న పిల్లల్ని బాధ్యతారహితంగా వదిలెయ్యటం.
తెల్లారి మూడింటిదాకా పబ్ లోనే వున్నారు. శరీరం, మనసూ సమన్వయం లేకుండా దేనిపని అవి చేసుకుపోయాయి.

రాత్రంతా దాదాపు నిద్రలేకుండా గడిపినా పొద్దున్నే లేచి తయారై ఎనిమిదింటికల్లా పిల్లల హాస్టల్లో విజిటర్స్ లాంజిలో వున్నాడు నిశాంత్. ప్రీతీ, వంశీ వచ్చారు. అతను భయపడ్డట్టు వాళ్ళేం తల్లడిల్లిపోవటంలేదు. ఉల్లాసంగానే వున్నారు.
“ఎలా వున్నావు నాన్నా?”” అని అడిగారు.
ఇద్దర్నీ ఒకేసారి దగ్గిరకి తీసుకున్నాడు నిశాంత్. కళ్ళలో నీళ్ళొచ్చాయి.
“మీకిక్కడ బావుందా?”” అడగలేక అడిగాడు.
“చాలా బావుంది నాన్నా! కానీ నువ్వూ, అమ్మా గుర్తుకొస్తున్నారు”” అంది ప్రీతి ఆరిందాలా.
“అమ్మ మీతో ఏం చెప్పింది?””
“నువ్వు ఇంకో ఆంటీ ఇంట్లో వుంటున్నావటకదా? పొద్దున్నే మమ్మల్ని వదిలిపెట్టడం, మళ్ళీ సాయంత్రం తీసుకెళ్ళడం అదీ తనకి ఇబ్బందిగా వుంటుందని హాస్టల్లో చేర్చానంది”
నిశాంత్ మరొక్కమాట కూడా మాట్లాడలేదు. పిల్లలదగ్గిర కూడా స్పష్టంగా చెప్పేసింది మహతి. ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపల్ తోటీ చెప్పే వుంటుంది. చాలా సున్నితమైన విషయాన్ని బట్టబయలు చేసింది. ఏం చెయ్యాలామెని? ఏం చెయ్యగలడసలు? ఒక స్త్రీ తెగబడితే మగవాడు ఏమైనా చెయ్యగలడా? తనేనా చావాలి, ఆమెనేనా చంపాలి. అంటే ఇంకో మెట్టు దిగజారాలి. చాలా నిస్సహాయంగా అనిపించింది.
ఇంతలో బెల్ మోగి౦ది.
“మాకిప్పుడు బ్రేక్ ఫాస్ట్ అవర్ నాన్నా!”” అంటూ పిల్లలు తూనీగల్లా పరిగెత్తారు. వాళ్ళ సంతోషం చూసాక అతని మనసు కొంత తేలికపడింది. కానీ ఇది లోకం తెలియని సంతోషం. వీళ్ళు పెద్దవాళ్ళయాక తమకి జరిగిన అన్యాయాన్ని గురించి నిలదీసి అడగరా? అంటే తను ప్రసన్నని వదిలేసి మామూలు జీవితంలోకి వెళ్ళిపోవటం ఒక్కటేనా దారి? ఆ దార్లోకి తనని మళ్ళించడానికే మహతి ఇదంతా చేస్తోందా? ఇంత జరిగాక ఇదివరకట్లా ఆమెతో కలిసి వుండగలడా? తన భావాలు, సమస్యలు, ఇబ్బందులు పట్టని మనిషితో? ఐనా తను ప్రసన్నని ఎందుకు వదిలిపెట్టాలి? ఆమెకి పెళ్ళికిముందు స్నేహితులు లేరా? ఆ అమ్మాయిల్తో ఇప్పటికీ తిరుగుతుంది, స్నేహాన్ని నిలబెట్టుకుంటుంది. ప్రసన్న, తను స్త్రీపురుషులు కాబట్టి స్నేహాన్ని అధిగమించిన ఆకర్షణ ఏర్పడింది. దానికింత గొడవా? మహతి ప్రవర్తన చాలా తక్కువగా అనిపించింది. చాలాసేపు అక్కడే కూర్చున్నాడు ప్రీతీ, వంశీ మళ్ళీ వస్తారేమోనని. వాళ్ళింక రారని ఆయా చెప్పింది. వచ్చేసాడు.


మహతి విడాకులడిగింది. నిశాంత్ వప్పుకోలేదు.
“పరస్పర అంగీకారంమీదైతే తేలిగ్గా వస్తుందని అడిగాను. నువ్వొప్పుకోకపోతే ఎడల్టరీ కేసు వేస్తాను. నా దగ్గిర అన్ని ఆధారాలూ వున్నాయి”” నిర్మొహమాటంగా చెప్పి౦ది.
అతనికి చిమ్మచీకట్లో వూపిరాడనిచోట ఇరుక్కుపోయిన భావన కలిగింది. ముందుకి వెళ్ళలేడు, వెనక్కి తిరిగి రాలేడు. అసలెటు వెళ్తున్నాడో తెలీని పరిస్థితి. “ఏమాశించి ఇదంతా చేస్తున్నావు మహతీ?”” అసహాయత వలన ముంచుకొస్తున్న కోపంతో అడిగాడు.
“కెరీర్”” తొణక్కుండా జవాబిచ్చింది. “”నేను పెళ్ళికీ కెరీర్‍కీ సమానమైన ప్రాధాన్యత ఇచ్చాను. పెళ్ళి విఫలమైంది. ఇంక మిగిలింది కెరీరొక్కటే”
“పిల్లలకన్నా కెరీర్ ముఖ్యమా?””
మహతి విసుగ్గా చూసింది. “వాళ్ళకి నేనేదో అన్యాయం చేస్తున్నట్టు మాట్లాడతావేమిటి? ఈ సమస్యల వలయంలోకి వాళ్ళనికూడా లాగాలా? నీకోసం మేమంతా ఏడుస్తూ ఎదురుచూస్తుంటే నీకు బావుంటుందా?””
“మహతీ! ఇప్పటికీ నేనదే చెప్తున్నాను. గోరంతదాన్ని కొండంతగా చేస్తున్నావు. ఏ మగవాడూ మడికట్టుకుని కూర్చోడు. అలా వున్నాడంటే అదొక మధ్యతరగతి సర్దుబాటు. అంతే! దయచేసి నన్నర్థం చేసుకో. నామాట విను. ఇదివరకట్లా వుందాం”” ఆమె దానికి బదులుగా ఏమంటుందో తెలిసీ అన్నాడు. ఆమె అదే అడిగింది. పదేపదే ప్రసన్నని తమ మధ్యనుంచీ తప్పించమంటుంటే అతనికి కోపం వస్తోంది. అదుపు తప్పిపోయాడు.
“నేను ప్రసన్నని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కావాలంటే నీకు నచ్చినవాడితో నువ్వూ తిరుగు. అదేకదా, నువ్వు కోరుకునేది?”” అన్నాడు.
అసహ్యంగా చూసింది మహతి. “”నువ్వు గడ్డి తిన్నావని నేనూ తిని నా సమానత్వాన్ని నిరూపించుకోనక్కర్లేదు. నిశాంత్! నీకు తోచింది నువ్వు చేసావు. నేనేం చెయ్యాలోకూడా నువ్వే నిర్దేశించక్కర్లేదు. నాకు నచ్చిన మంచి నేను చేస్తాను. అది నీకు నచ్చకపోతే వాళ్ళని నువ్వు తీసుకెళ్ళి పెంచి పెద్ద చెయ్యి. నాతో సమానంగా నీకూ బాధ్యత వుంది”” అంది కటువుగా.
నిశాంత్ వెనక్కి తగ్గాడు. పిల్లల్ని తీసుకుని ఆమెని ఏడిపించాలని ఎంతగా అనిపించినా వాళ్ళ బాధ్యత ప్రసన్న తీసుకుంటుందనే ఆశ ఎంతమాత్రం లేదు. నిస్సహాయంగా మహతికేసి చూడటం మినహా తనకి మరే అవకాశం లేదని చాలా స్పష్టంగా అర్థమైంది.
ఒక స్త్రీ ఎలాంటి సెంటిమెంట్సుకీ లోబడకుండా నిలకడగా నిలబడి ఆలోచిస్తే, ఆమెకి అన్యాయం జరిగినప్పుడు ప్రతిఘటిస్తే అలాంటి ప్రతిఘటన జీవితాలని తలక్రిందులు చెయ్యగలదన్న స్పృహ చాలా ఆలస్యంగా కలిగిందతనికి.


మహతి తల్లీతండ్రీ ఆమెకి నైతికంగా చాలా సపోర్టునిచ్చారు. అక్కడికీ మహతి నాయనమ్మ, “విడాకులెందుకు? అదేం మళ్ళీ పెళ్ళి చేసుకోబోతోందా? ఇద్దరు పిల్లల తల్లి. మగదక్షత లేకుండా వాళ్ళని పెంచి పెద్ద చెయ్యటం సాధ్యపడేనా? తెగేదాకా తెంచుకోవడం దేనికి? ఎప్పటికో ఒకప్పటికి అతను మనసు మార్చుకుని తిరిగి రాడా?”” అంటునే వుంది.
“ఎదిగిన పిల్లల వ్యక్తిగత జీవితాల్లోకి మనం తలదూర్చకూడదు. వాళ్ళకి మన సహకారం ఎంతవరకూ అవసరమో అంతవరకూ ఇస్తే సరిపోతుంది” అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచేరు వాళ్ళు.
వాళ్ళకి మహతికాక ఒక కొడుకు. బెంగుళూర్లో సిస్టమ్స్ అనలిస్టు. చెల్లెల్ని పూర్తిగా సమర్థించాడు.
“మహతి మాట్లాడకుండా వూరుకుంటే బావ చేసిన పనిని సమర్థించినట్టే. తప్పు ఒప్పైపోతుంది. వంశీ రేప్పొద్దున్న ఆయన దార్లోనే నడిస్తే ? ఆ ప్రసన్నలాగే ప్రీతికూడా పెళ్ళీగిళ్ళీ అక్కర్లేదనేస్తే? వీళ్ళు తప్పు చేస్తూ పిల్లల్ని తప్పు చెయ్యద్దంటే వూరుకుంటారా?”” అన్నాడు మహతి మనసు చదివినట్టే.

ఒక సంఘటన జరిగేటప్పుడు ఆ సంఘటన యొక్క బిల్డింగ్ ఫేక్టరుగా ఏ క్షణం విలువ దానిదే. అదే ఆ సంఘటన జరిగాక రోజులు, సంవత్సరాలు దానిమీద దుమ్ముకణాల్లా పేరుకుపోతాయి. మహతి ఎమ్ ఫిల్ చేసి, వున్న వుద్యోగాన్ని వదిలేసి, ముంబైలోని ఒక మల్టీనేషనల్ ఫార్మాస్యుటికల్ కంపెనీలో బయోకెమిస్ట్‌గా చేరటం, పిల్లల్ని ల౦డన్ చేర్చి తను కొన్ని ఫారిన్ అసైన్‍మెంట్స్ టేకప్ చెయ్యటం, లండన్ బేస్‍గా చేసుకుని తను జర్మనీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో తిరగటం… ఒక కొత్త ప్రపంచంలో పడిపోయింది. బయోకంప్యూటర్ల శకం మొదలౌతున్న రోజులు. ఆమె ఆ లైన్లో బిజీ అయింది.
ఆమె లండన్లో మొదటిసారి అడుగుపెట్టినప్పుడు కంపెనీ తరపుని రిసీవ్ చేసుకోవడానికి వచ్చి పరిచయమైనవాడు ఆండ్రూ ఆండర్సన్.
పాతషర్టు విడిచి, కొత్త షర్టు తొడుక్కున్నంత తేలిగ్గా ప్రసన్న జీవితంలో ఇమిడిపోయాడు నిశాంత్. మనసులో అపరాథభావం ఏదైనా వుందంటే మహతిని తప్పుపట్టడంలో అది కొట్టుకుపోయింది. ఇల్లూ బేంకుబేలన్సూ ఆమెకే వదిలేసి తనని మరికొంత సమర్ధించుకున్నాడు.
ఏమగవాడేనా కోరుకునేలాంటి జీవితం. బాధ్యతల్లేవు. కావాలనిపిస్తే వండుకోవటం, లేకపోతే బైట తినేసి రావటం, స్నేహితులు, పార్టీలు, డ్రింక్సు, పబ్స్… రంగులరాట్నంలో గిర్రుమని తిరుగుతున్నంత వుత్సాహంతో వుక్కిరిబిక్కిరౌతున్నాడు.
మహతి, తను భార్యాభర్తలుగా వున్నప్పటిరోజులు గుర్తొచ్చాయి. పొద్దున్నే హడావిడిగా లేవటం, అదో బాధ్యతగా మహతి వండటం, తను సాయంచెయ్యటం, పిల్లల్ని తయారుచెయ్యటం, సినిమాకి వెళ్ళాలంటే అదో వార్షిక ప్రణాళిక. ఉత్తి రొటీన్. మధ్యమధ్య విసుగులు… అలకలు… కోపాలు… చికాకులు… జీవితమంటే ఇంతేనా అనిపించేంత నిరాసక్తత!
అదే తను… ఇప్పుడెంత ఉత్సాహంగా వున్నాడు! మహతికి జీవితాన్ని అనుభవించడం రాదు. ప్రసన్నకి వచ్చును. అందుకే ఈ మార్పు! అనుకున్నాడు.
కాలం రంగులరాట్నమే. బాల్యంలో మెల్లగా మొదలుపెట్టి యౌవనంలో వూపందుకుని, పెద్దతనం వచ్చేసరికి వడి తగ్గి ఆగిపోయే రంగులరాట్నం. దాని వేగం తగ్గుతుండటాన్ని నిశాంత్‍గానీ ప్రసన్నగానీ ఇంకా గుర్తించలేదు. చుట్టూ వున్న సమాజంలో ఒక నిర్దుష్టమైన మార్పు. ఒక్కసారిగా వచ్చినదికాదు. క్రమేపీ వచ్చినది.
కొన్నాళ్ళదాకా మహతి విషయాలు పట్టించుకున్నాడు నిశాంత్. ఇంకొంతకాలం యథాలాపంగా తెలిసాయి. నాకేంటి అనుకున్నాడు. స్థిరమైన జీవితంలోంచీ సుడిగుండంలో పడి, మళ్ళీ దారి వెతుక్కుంటున్న తరుణాన ఆమె దగ్గిర్నుంచీ వుత్తరం-పదేళ్ళు గడిచాక.
“పిల్లలు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. ప్రసన్నగారికీ అభ్యంతరం లేదంటే, మీకు వీలౌతుందంటే పంపిస్తాను” క్లుప్తంగా చాలా చిన్న వుత్తరం.
జ్ఞాపకాలమీద పేరుకున్న దుమ్ము మేఘంలా లేచింది. ఏం జరిగింది? ఉన్నట్టుండి పిల్లల్ని ఇక్కడికి పంపించాలన్న నిర్ణయం ఎందుకు తీసుకుంది? అతని భృకుటి ముడిపడింది. ఉత్తరాన్ని ప్రసన్నకి చూపించాడు.
“మధ్యలో నాకెందుకు అభ్యంతరం? రమ్మని రాయి. వద్దనెందుకనాలి?”” అంది. అతనలాగే రాసాడు.
ప్రీతీ, వంశీ వచ్చారు. ముంబై విమానాశ్రయంలో వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు నిశాంత్, ప్రసన్న. నిశాంత్ వూహించలేనంత మార్పు వాళ్ళలో. తెల్లగా, పొడుగ్గా ఆరోగ్యంతో మిసమిసలాడుతున్నారు. కళ్ళలో వుత్సాహం తొణికిసలాడుతోంది. వాళ్ళెలా వున్నారో, ఎలాంటి స్థితిలో తను చూడబోతున్నాడోనని ఆదుర్దాపడిన అతని మనసు మూగవోయింది. ఇద్దర్నీ చెరోచేత్తోనూ దగ్గిరకి తీసుకున్నాడు. మహతిగురించి అడగలేదు నిశాంత్. వాళ్ళూ చెప్పలేదు. కానీ వాళ్ళని చూస్తుంటే మాత్రం ఆమెని లోపల్లోపలేనా ప్రశంసించకుండా వుండలేకపోయాడు.
నలుగురూ హైద్రాబాదు వచ్చారు. ప్రసన్నతో నిశాంత్ కలిసుండే ఇంటికి. పిల్లల మనసుల్లో ఏముందో నిశాంత్ పట్టుకోలేకపోయాడు. ఇంత వున్నపళంగా ఎందుకొచ్చారోకూడా వూహించలేకపోయాడు. అసలంత లోతుగా ఆలోచించడానికి అతనికి వ్యవధెక్కడ? వాళ్ళ కబుర్లు, చిన్నచిన్న ఔటింగ్స్… కాలం కళ్ళెం తెంచుకుని పరిగెడుతున్నట్టనిపించింది.
లండన్‍లోని వాళ్ళ ఫోటోలు చూపిస్తున్నారు అక్కాతమ్ముళ్ళిద్దరూ. స్నేహితుల్తో తీయించుకున్నవీ, వీళ్ళిద్దరే కలిసి తీయించుకున్నవీ… హఠాత్తుగా ఆగిపోయాడు నిశాంత్.
రెండేళ్ళ చిన్నపాప… రబ్బరుబొమ్మలా వుంది. ప్రీతీ, వంశీ చెరో చెయ్యీ పట్టుకుని నడిపిస్తున్నారు.
“ఇది బెట్టీ నాన్నా! బెట్టీ నిరుపమా యాండర్సన్. మాకు చెల్లెలౌతుంది. ఒకటే అల్లరి చేసి విసిగిస్తుంది. అమ్మని వూపిరి పీల్చుకోనివ్వదు. మిస్టర్ ఆండ్రూ యాండర్సన్ మొదట్లో చాలా భయపడేవాడు, మేము జెలసీతో దీన్నెమైనా చేస్తామేమోనని”” ప్రీతి చెప్తుంటే నిశాంత్ ముఖంలో రంగులు మారసాగాయి. వంశీ, ప్రసన్న ఫోటోలు చూడటంలో బిజీగా వున్నారు. వాళ్ళతని ఫీలింగ్స్ పట్టుకోలేదు.
ప్రీతి గమనించినా గమనించనట్టే చెప్పుకుపోయింది. “”అతనికిప్పుడు మామీద నమ్మకం ఏర్పడిపోయింది. మమ్మల్ని ఇంటికొచ్చేసి వాళ్ళతోనే స్టే చెయ్యమని అడుగుతున్నాడు. అమ్మ అతన్ని అంకుల్ అనాలని చెప్పింది. ఎదురుగా అలా పిలిచినా పేరు పెట్టే చెప్తాం ఎవరికేనా. మిస్టర్ ఆండ్రూ చాలా నైస్ పర్సన్. అసలు అతన్ని మేరేజి చేసుకున్నాకే అమ్మ మళ్ళీ నవ్వడం మొదలుపెట్టింది. బెట్టీగాళ్ పుట్టాకైతే మామూలుగా ఐపోయింది. మా చిన్నప్పుడెలా వుండేదో అలాగే వుంటోంది. వియార్ థేంక్ ఫుల్ టు దట్ అంకుల్… వియ్ గాట్ అవర్ మామ్ బేక్”” ప్రీతి మాటల్లోనూ గొంతులోనూ సంతోషం.
మహతి మళ్ళీ పెళ్ళి చేసుకున్న విషయాన్ని ప్రసన్న సీరియస్‍గా తీసుకోలేదు. ఇలా జరుగుతుందని మొదటే అనుకుంది. అలాగే జరిగింది.
“బెట్టీ అచ్చం బ్రిటిషర్లాగే వుంటుంది. పేల్ వైట్, కర్లీ హేర్, బ్లూ ఐస్… చాలా గమ్మత్తుగా వుంటుందిగానీ బాగా అల్లరిది””
నిశాంత్ అక్కడినుంచీ లేచి వెళ్ళిపోయాడు.
“తన విషయాలేం చెప్పద్దని అమ్మ చెప్పలా నీకు?”” వంశీ ప్రీతిని కోప్పడ్డాడు.
“అమ్మగురించి నాన్నకి కాకపోతే ఇంకెవరికి చెప్తాం?”” అడిగింది ప్రీతి.
ప్రసన్న ఇద్దర్నీ ఒకసారి చూసి నిశాంత్‍ని వెతుక్కుంటూ వెళ్ళింది. అతను టెరెస్ మీద వున్నాడు. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ వుద్వేగాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వెనగ్గా వెళ్ళి అతని భుజంమీద చెయ్యేసింది.
“పిల్లలు… చాలా బావున్నారు నిశాంత్! నువ్వొచ్చేసాక వంశీ ప్రీతిని కోప్పడ్డాడు అక్కడి విషయాలు ఇక్కడెందుకు చెప్తున్నావని. దానికా పిల్ల ఏమందో తెలుసా? అమ్మగురించి నాన్నకి కాక ఇంకెవరికి చెప్తాం అంది. నిశూ! వాళ్ళని చూస్తుంటే నేనేం పోగొట్టుకున్నానో అర్థమౌతోంది… అలా నా గురించి ఎవరూ ఎవరికీ చెప్పరుకదా?”” అంటూ అతని భుజంమీద తలానించి ఏడ్చేసింది.
సగం కాలిన సిగరెట్ ని విసిరేసాడు నిశాంత్. “”ఏమిటిది ప్రసన్నా! నువ్వింత డిస్ట్రబౌతావంటే రావొద్దని రాసేసేవాడిని. ప్లీజ్, ఏడవకు… పద కిందికెళ్దాం. వాళ్ళుగానీ ఇక్కడికొస్తే బాగుండదు”” అంటూ ఆమెని ఓదార్చి తీసుకెళ్ళాడు.
ఆ సాయంత్రం రవీంద్రభారతిలో డాన్స్ ప్రోగ్రాంకి తీసుకెళ్ళాడు నిశాంత్ అందర్నీ!
ఆ రాత్రంతా నిశాంత్‍కి కలతనిద్రే అయింది. బెట్టీ ఆండర్సన్ కల్లోనే వుంది. నీలికళ్ళ ఆ తెల్లవొంటి ఇండో-ఆంగ్లియన్ పిల్ల తన గుండెలమీద పరుగులు పెడుతూ వుంటే మహతి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టే వుంది. మహతి ముఖం కనిపించటంలేదు. లీలగా ఆమె ఆకృతిమాత్రమే కలలో కదిలింది. ఆమెని ఒక్కసారి చూడాలనే ఆరాటం అతన్ని నిలవనివ్వలేదు.
అన్నీ మర్చిపోయి ఎలా పెళ్ళి చేసుకోగలిగింది? ఆమె చాలా మూర్ఖంగా ప్రవర్తించిందనే తను ఇన్నాళ్ళూ అనుకున్నాడు. కానీ తనని తృణీకరించి ఎంత తెలివైన అడుగేసింది? లేకపోతే అసహనంతో, అశాంతితో రగులుతూ ఆమె, ఆమెకీ ప్రసన్నకీ మధ్య నలుగుతూ తను, తమ ముగ్గురిమధ్యా నలుగుతూ పిల్లలు… అంతా బాగానే వుందిగానీ ఈ పెళ్ళి? మళ్ళీ ఎప్పటికీ కలుసుకోలేనంతగా తమ దారులు చీలిపోయాయనిపించి అతని గుండె పిండినట్టైంది. ఒక మమకారాన్ని తెంచుకోవడంలో ఎంత బాధ వుంటుందో అతనికి అనుభవంలోకి వచ్చింది. ప్రసన్నని మొదటిసారి వదులుకున్నప్పుడుకూడా ఇంత బాధ కలగలేదు.
అటు నిద్రా, ఇటు మెలకువా కాని స్థితిలో వున్న అతన్ని ప్రసన్న గమనిస్తునే వుంది. మనసులో ఎంతో అపరాథభావన!
“మన ప్రేమని నిలబెట్టడానికి చాలా మూల్యం చెల్లించావు నిశాంత్!”” అతని దగ్గిరగా జరిగి తలదాచుకుంటూ.
ప్రీతీ, వంశీ పదిరోజులున్నారు నిశాంత్ దగ్గిర. బెంగుళూర్లో వుండే మేనమామ దగ్గిరకి బయల్దేరారు. వాళ్ళు సామాన్లు సర్దుకుంటుంటే ఏదో పోగొట్టుకుంటున్నట్టే అనిపించింది నిశాంత్‍కి.
“అక్కడేముందని మీరు తిరిగి లండన్ వెళ్ళడం? ఆమె తనదారి తను ఏర్పరుచుకుంది. పరాయివాళ్ళలాగా ఎందుకక్కడ? ఇక్కడ వుండిపొండి”” అన్నాడు.
“అదెలా కుదుర్తుంది? మేం తిరిగొచ్చేస్తామని మిస్టర్ ఆండ్రూకి ప్రామిస్ చేసాం. అమ్మకి అసలలాంటి అనుమానమే రాలేదు. రిటర్న్ టికెట్ కూడా కన్ఫాం చేసి పంపింది. మేమక్కడ చాలా హేపీగా వున్నాం నాన్నా! నువ్వక్కడ మాతో లేకపోవడం బాధనిపించినా, ఎక్కడో ఒకచోట వుండి మాగురించి ఆలోచిస్తావనే భావన చాలా సంతోషాన్ని కలిగిస్తుంది”” అంది ప్రీతి.
“నువ్వంటే అమ్మకి గౌరవమే నాన్నా! ఇండియన్ హజ్బెండ్సందరిలా కాకుండా నువ్వు తనని హెరాస్ చెయ్యలేదనీ, అడగ్గానే డైవోర్స్ ఇచ్చావనీ, మమ్మల్నికూడా క్లెయిమ్ చెయ్యలేదనీ చెప్తుంది నాన్నా!”” అనికూడా అంది.
నిజమే! మహతి మనుషుల్ని ద్వేషించడం నేర్పించలేదు తన పిల్లలకి. సమస్య ఎదురైనప్పుడో లేదా అన్యాయం జరిగినప్పుడో దానికి కారణమైనవాళ్ళని ద్వేషించడంకన్నా వీలైన పరిష్కారాన్ని వెతుక్కోవడం, లేకపోతే తప్పుకుపోవడాన్నీ నేర్పింది. తన మనసునిండా పరుచుకున్న దు:ఖపునీడల్ని వాళ్ళదాకా సాగనివ్వకుండా దూరంగా వుంచి పెంచింది.
నిశాంత్ ప్రీతి మాటల్ని విని నిర్వేదంగా నవ్వుకున్నాడు.
“ఆడవారిని వారి పోరాటం వారిని చెయ్యనిస్తే ఓడిపోరట. అది చెప్పటానికే మమ్మల్ని ఇక్కడికి పంపించానని చెప్పమంది”” చెకిన్‍కి ముందు ఆఖరిగా అంది.
ప్రీతినీ, వంశీనీ బెంగుళూరు ఫ్లయిటెక్కించి వచ్చి బిర్లాటెంపుల్లో ఆరుబయట కూర్చున్నారు నిశాంత్, ప్రసన్నా ఇద్దరూను. దీపాలవెలుతుర్లో నౌబత్‍పహాడ్ కింద వూరంతా కరుగుతోంది. వెన్నెల పల్చగా పరుచుకుని వుంది. ఇంటికెళ్ళాలని ఇద్దరికీ అనిపించటంలేదు. గత కొద్దికాలంగా తమ మనసుల్లో గూడు కట్టుకుని వున్న వంటరితనం ప్రీతీ, వంశీలొచ్చి వెళ్ళిన ఈ రాత్రి బహిర్గతమైంది.
“ఇల్లంటే నాలుగ్గోడలు. గోడలని ప్రేమించరెవరూ. వాటిని అనుసంధానించుకుని వుండే అనుబంధాలని ప్రేమిస్తారు. పెళ్ళీ అలాంటిదే. గోడల్ని ప్రేమించనట్టే పెళ్ళినీ ఎవరూ ప్రేమించరు. సగటు మగవాడిలాగా మహతి అలా ప్రేమిస్తూ వుండాలని ఆశించాను. వాస్తవం ఏమిటో ఆమెకి తెలుసుకాబట్టి వెళ్ళిపోయింది”” అన్నాడు నిశాంత్, మహతినుంచీ విడిపోయిన ఇన్నాళ్ళకి ఆమె మనసేమిటో అర్థమయ్యి.
“మనం ఇప్పుడేం చేద్దాం?”” ఉన్నట్టుండి అడిగింది ప్రసన్న.
ఆ ప్రశ్న మొదట అసంబద్ధంగా అనిపించినా తర్వాత లోతు తెలిసి గుండె ఝల్లుమంది. పెళ్ళి లేదు. పిల్లల్లేరు. ఎత్తుకున్న బాధ్యతల్లేవు. దింపుకోవలసిన బరువుల్లేవు. వయసులో వున్నప్పుడు కళ్ళెం లేని గుర్రంలా పరిగెత్తిన కాలం ఇప్పుడు ఆగాగి నత్తనడక నడుస్తోంది. పబ్స్‍కీ, పార్టీలకీ తిరిగిన స్నేహితులంతా పిల్లల పెళ్ళిళ్ళూ, వాళ్ళ కెరేర్ బిల్డింగ్‍లో తలమునకలుగా వున్నారు. తామిద్దరూ ఎక్కడికి వెళ్ళినా అక్కడంతా యువత ఆక్రమించుకుని వున్నారు. తమకి ఆంటీ అంకుల్ ప్రమోషన్ ఇచ్చేసారు. వాళ్ళతోనేనా కలవాలని తామనుకున్నా కలుపుకోవాలని వాళ్ళకి వుండదు.
అందుకే వుత్పన్నమైందా ప్రశ్న.
“వీ షల్ బీ లివింగ్ టుగెదర్ అన్ టూ డెత్… మనం చనిపోయేదాకా కలిసే వుంటాం” అన్నాడు నిశాంత్ లేచి నిలబడి ఆమె చెయ్యందుకుంటూ. అందులోని విషాదం అర్థమై కళ్ళలో నీళ్ళు తిరిగాయి ప్రసన్నకి. లేచి అతన్ననుసరించింది. వాళ్ళ వెనుకే వంటరితనంకూడా.