గుమ్మడి గింజలు by S Sridevi

  1. వంటింటి కిటికీ by S Sridevi
  2. పగుళ్ళు by S Sridevi
  3. స౦దిగ్ధపు రహదారులు by S Sridevi
  4. కోడలొచ్చింది by S Sridevi
  5. అతనిష్టం by S Sridevi
  6. ఆమె విజేత కాదు by S Sridevi
  7. యుద్ధదృశ్యం by S Sridevi
  8. బేబీ ఆఫ్ అర్చన by S Sridevi
  9. తరంగనాట్యం by S Sridevi
  10. చిట్టికి క్షమార్పణలతో by S Sridevi
  11. ఇంకో మజిలీకి by S Sridevi
  12. అధిరోహణం by S Sridevi
  13. లివింగ్ టుగెదర్ by S Sridevi
  14. గుమ్మడి గింజలు by S Sridevi
  15. బంగారుపంజరం by S Sridevi
  16. చీకట్లో పూసిన పూలు by S Sridevi
  17. గినీ పిగ్స్ by S Sridevi
  18. మలయమారుతం by S Sridevi
  19. సార్వభౌముడు by S Sridevi
  20. అమ్మానాన్నలు by S Sridevi

ఉన్నట్టుండి ఏదో ఒక జ్ఞాపకం జాగృతమవుతుంది. అది మరి దేనికో సంకేతం అవుతుంది. సృష్టిలో జరిగే ఏ సంఘటనా స్వతంత్రమైనది కానట్టే మనిషి జీవితంలో జరిగే ఏ ఒక్కటీ స్వతంత్రమైనది కాదు. అవన్నీ కీలుబొమ్మలయితే వాటిని ఆడించే దారాలు ఇంకెక్కడో ముడివేయబడి ఉంటాయి.

ఒక చిన్న సంఘటన. చాలా సామాన్యమైనది అందరిళ్ళలో జరిగేదే. అదిప్పుడు గుర్తొచ్చి శ్రీపతి కళ్ళముందు కదులుతోంది. జీవితసారం మొత్తాన్నీ కాచి వడకట్టే ప్రయత్నం చేస్తోంది.
ఆ దృశ్యం…
తల్లి కుంపటి ముందు కూర్చుని వంట చేస్తూ పులుసులోకి గుమ్మడికాయ ముక్కలు తరుగుతోంది. పిల్లలు నలుగురూ వచ్చేసి ఆమె చుట్టూ కూర్చుని ఉత్కంఠగా చూస్తున్నారు. తరగడం అవ్వగానే గింజలని జొజ్జుతోసహా ఎత్తుకెళ్లిపోయి పంచుకుని తిన్నారు. నలుగురిలోనూ అనిర్వచనీయమైన ఆనందం.
ఇక్కడ మూడు ప్రశ్నలు. ఆ ఆనందం ఎక్కడినుంచి పుట్టింది? గింజల రుచిలోంచా? తిన్న గింజలేమీ అపురూపమైనవి కాదనే విషయం తెలియని బాల్యపు అమాయకత్వంలోంచా? నలుగురూ పంచుకుని తినడంలోంచా?

“అప్పుడెప్పుడో గజం వందల్లో కొన్న స్థలాలకి ఈరోజున కోట్లలో పలికింది ధర. ఉన్న మూడు స్థలాలూ అమ్మేస్తే కేపిటల్ గెయిన్స్ పోను అచ్చంగా వైట్‍లో మిగిలింది ఆరున్నర కోట్లు. బేంకులో వేస్తే వడ్డీ ఇన్‍కమ్ టాక్స్ ముప్పై శాతం మినహాయించుకుని ఏడాదికి ముప్పైలక్షల పైమాటే. మధ్యతరగతివాడెవరికేనా కళ్ళు చెదిరిపోయే అంకెలు”” అన్నాడు శ్రీపతి.
“ఇప్పుడా విషయాలన్నీ ఎందుకు? ఎన్ని కోట్లు, లక్షలు ఉన్నా తినేది పట్టెడన్నం మాత్రమే. అదికూడా తినడం మానేశారు మీరు”” అంది లక్ష్మి.
“నీకో నూటయాభై తులాల బంగారం ఉండదూ?””
“సుబ్బరంగా. కోడళ్ళిద్దరికీ ఎవ్వరికిచ్చేది వాళ్లకి వేరు చేసి చెరో లాకర్లోనూ పడేసాను. ఇంక మిగిలిందల్లా వాళ్లకి అప్పజెప్పడమే. నేను అడిగిందానికి చెప్పండి ముందు. ఇవేవీ కడుపు నింపవు”
“నలభయ్యేళ్లు ఉద్యోగం చేస్తే వచ్చింది నలభైలక్షలు. అందులో నేను ప్రావిడెంట్ ఫండ్‍లో దాచుకున్నదీ, పెన్షను, సెలవు అమ్ముకున్నదే ఎక్కువ”
“ఉద్యోగం మనం నిలబడడానికి ఆసరా ఇచ్చింది. అది ఉండబట్టే కదా స్థలాలు కొనగలిగాం?… సర్లేండిగానీ కాకరకాయలు వేయించనా? సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయిస్తే మీకిష్టం కదా?””
“వద్దు. నాకు ఏమీ తినాలని లేదు. గ్లాసుడు మజ్జిగ ఇవ్వు చాలు””
“కొంచెం… ఎంత ఆకలి వేస్తే అంతే… ఏదో ఒకటి తినండి. నాలుగు రోజులైంది మీరు కడుపునిండా తిని. కంచం ముందు కూర్చుని కెలికి లేచి వెళ్లిపోతున్నారు. పోనీ బయటినుంచి ఏదైనా తెప్పించనా?””
అదే జవాబు. “వద్దు. ఏమీ తినాలనిపించటం లేదు””
“ఇలా ఎంతకాలం? డాక్టర్ రమేష్‍గారిని రమ్మననా? ఆకలి పుట్టడానికి ఏదేనా మందు ఇస్తాడు”
ఇష్టం లేదన్నట్టు సోఫాలో వెనక్కి వొరిగి కళ్ళుమూసుకున్నాడు. లక్ష్మి నాలుగురోజులు అందిగానీ గత కొంతకాలంగా ఇలాగే జరుగుతోంది. జీవితం ముగింపుకి వచ్చేసినట్టనిపించి ఆ ముగింపేదో తొందరగా వచ్చెయ్యాలని ఎదురుచూస్తున్నట్టుంది.
గుమస్తా ఉద్యోగంలో చేరి చాలా కష్టపడి పైకొచ్చాడు శ్రీపతి. పిల్లల్ని మంచి చదువులు చదివించాడు. వాళ్లు పెద్ద జీతాలతో విదేశాల్లో స్థిరపడ్డారు. వాళ్లు తమ దగ్గర లేరనిగానీ, దగ్గరుండి మంచిచెడ్డలు చూసుకోవటం లేదనిగానీ అతనికి ఆక్షేపణేం లేదు. ఏడాదికోమారు కుటుంబాలతో వాళ్ళు వచ్చి పది పదిహేను రోజులు ఉండి వెళ్తారు. ఆ సంతోషం చాలతనికి.
ఉద్యోగంలో ఉన్నప్పుడు కొన్న స్థలాలకు మంచి ధరలు పలికి ఇప్పుడు కోట్లలో చేతికి వచ్చాయి. క్రమం తప్పకుండా నెలకింతని భార్యకి కొన్న బంగారం తన చుట్టూ ఉన్న సమాజంలో అతని విలువను చాలా పెంచింది. ఇంకేం కావాలి? ఒక మధ్యతరగతి వ్యక్తి ఇంతకన్నా ఏం కోరుకుంటాడు? అనే ప్రశ్న అతనిలో అప్పుడెప్పుడో మొదలై క్రమంగా ఇంకేదీ అక్కర్లేదనిపించే స్థితికి అతన్ని తీసుకెళ్లింది. ప్రతి నిముషం అదే చర్వితచర్వణం. ఒక వింతలా… ఒక అద్భుతంలా…
లక్ష్మికిమాత్రం అతన్ని చూస్తే బెంగగా ఉంది. గవర్నమెంట్ సర్వీస్‍నుంచి రిటైర్ అయ్యి పదిహేనేళ్లయింది. రిటైర్మెంట్ తర్వాత కూడా ఐదారేళ్లు ప్రైవేటుగా చేసాడు. అదీ వదిలిపెట్టేశాక-
“పిల్లలు అమెరికాలో ఉన్నారు. వాళ్లీ స్థలాలు, ఆస్తులు ఏం చేసుకుంటారు?”” అంటూ అన్ని అమ్మేసి డబ్బుచేయటం మొదలుపెట్టాక –
అనూహ్యంగా అతనిలో ఈ మార్పు.
“ఏం చేసుకుంటాం ఇదంతా?””అన్న ప్రశ్న అతను మొదటిసారి అడిగినప్పుడు అర్థరహితంగా అనిపించింది. డబ్బుకి చాలడం ఎక్కడనుకుందిగానీ క్రమంగా అర్థమైంది.
ఉన్నది ఇద్దరు మనుషులు. మందులు, దుబారాలతో కలిపి పాతికవేలు దాటదు నెలవారీ ఖర్చు. అది అవగాహనకి వచ్చాక అతను వేసిన ప్రశ్న ఆమెనీ కుదిపింది. ఆకలిని మించి తినలేము. ఒంటినిండా బంగారం వేసుకుని తిరిగే రోజులు కావు. లంకంత ఇల్లు కట్టుకుంటే తోడుగా ఉండేవాళ్ళూ లేరు, చేసేవాళ్ళూ దొరకరు. అవే మాటల్ని కొడుకులతో అంటే వాళ్లు నవ్వేసి, “భలేవాళ్లమ్మా! డబ్బుకి చాలడం, ఎక్కువవ్వడం ఏమిటి? అన్ని అమ్మేసి బ్యాంకులో దాచుకున్నారు కాబట్టిగానీ స్థలాల రూపంలో ఉంటే ఈ ప్రశ్నే తలెత్తేది కాదు. మేము మాత్రం ఒకళ్ళకింద ఎంతకాలం చేస్తాము? స్టార్ట్ అప్ మొదలు పెడదామనే ఆలోచనలో ఉన్నాము. అప్పుడు ఎంతున్నా చాలదు”” అన్నారు.
వాళ్లలో కనిపించిన ఉత్సాహం తమలో ఎందుకు లేదు? చేతిలో డబ్బుంటే ఎన్నో చెయ్యాలనిపించేది ఒకప్పుడు. చాలా కొనుక్కోవాలనిపించేది. పుట్టుకొచ్చే కోరికలకీ, పొంగిపొర్లే ఉత్సాహానికీ డబ్బు లేకపోవటమే ఆటంకంగా ఉండేది. రకరకాల డిజైనర్ చీరలు కట్టుకుని తిరగాలనిపించిన తనకి ఇప్పుడు మెత్తబడిన నూలుచీర చాలనిపిస్తోంది. ఇది దేనికి సంకేతం? సాధించినది చాలన్న సంతృప్తికా? భర్త అన్నట్టు మధ్యతరగతి జీవితాలకి ఎక్కువనిపించేంత డబ్బు చేరినందుకా? కోరుకున్నవన్నీ అందుబాటులోకి వచ్చినందుకా?
మనసులోని ఆలోచనలు ఎవరికి వాళ్లకే సాగుతున్నాయి. శ్రీపతి ఆరోజు కూడా ఏమి తినలేదు. అతను వద్దన్నాడని ఊరుకోకుండా కాకరకాయ వేపుడుతోపాటు ఇంకో నాలుగైదు రకాలు చేసింది లక్ష్మి. బయటనుంచికూడా తెప్పించింది. వేలేసి ముట్టుకోలేదతను.
గ్లాసు మజ్జిగ అడిగినవాడు అరగ్లాసు తాగి పక్కన పెట్టేశాడు. గ్లాసు టీపాయ్‍మీద పెడుతున్నప్పుడు హాల్లో ఒక మూలకి ఉన్న తియ్య గుమ్మడికాయమీద అతని దృష్టి పడింది. “దేనికి అది?”” అడిగాడు.
“సంక్రాంతి వస్తోందిగా, మకర సంక్రమణంలో బ్రాహ్మడికి దానం ఇవ్వడానికని తెప్పించి ఉంచాను””
“ఒకటేనా?””
“లేదు. మరోటి కూడా కొన్నాను, ముక్కలు కోసి పులుసులో వేయడానికి””
“గింజలున్నాయా?””
“నాలుగు వలిచి నోట్లో వేసుకుందామని పక్కన పెట్టాను””
“తెస్తావా?””
అదేం భాగ్యం అన్నట్టో, అదే భాగ్యం అన్నట్టో ఆమె వెంటనే వెళ్లి తెచ్చి అతని ముందు పెట్టింది. అతను ఆప్యాయంగా రెండు గింజలు వలిచి నోట్లో వేడుకున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది అతనికి తన చిన్నప్పటి జ్ఞాపకం.
“మా అమ్మ గుమ్మడికాయ తరుగుతుంటే నలుగురు అన్నదమ్ములం చుట్టూ చేరిపోయేవాళ్ళం. గింజల్ని పంచుకుని తినేవాళ్ళం. పట్టుమని పదిగింజలు కూడా దొరికేవి కాదు”” అన్నాడు.
“ఇప్పుడు సూపర్‍మార్కెట్లలో ఒలిచిన గింజలే దొరుకుతున్నాయి”” అంది లక్ష్మి.
“అయినా…” అతను తినడం ఆపేసాడు. ఆమె గుండె అవిసిపోయింది.
సాయంత్రం అతను వినకుండా అతని తమ్ముడికి ఫోనుచేసింది.
వాళ్ళదీ ఆ ఊరే. వీళ్లంత ఉన్నవాళ్ళు కావటానికి అతనికి ఇంకో పదేళ్లు పడుతుంది. అయినా అంతరం అలాగే ఉంటుంది.
“చిన్నబాబూ! ఆఫీస్ అయ్యాక ఓసారి ఇటు వస్తావా? నాలుగు రోజులైంది, మీ అన్నయ్య అన్నం తిని. పిల్లల మీద బెంగా అంటే కాదంటున్నారు. ఏవో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు. మధ్యతరగతివాళ్ళం. పది రూపాయలు చేతిలో ఉంటే అప్పో సప్పో చేసి ఇంకో రూపాయి కలిపి బంగారం కొంటాం. వందుంటే మరో వంద ఎలాగో చేర్చి భూమి కొంటాం. అప్పుడు కడుపు కట్టుకుని కొన్నవి ఇప్పుడు కలిసొచ్చాయికదాని లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే కడుపు నిండదు కదా?”” ఆమె గొంతు రుద్ధమైంది.
“నువ్వేం బెంగపడకు వదినా! స్థలాల ధరలు చూసి అందరం ఇలాగే బిత్తరపోతున్నాం. ఇంకో అరగంటలో అక్కడ ఉంటాను”” అన్నాడతను. అలాగే వచ్చాడు. తనకోసం ఆతృతగా వచ్చిన తమ్ముడిని ప్రేమగా చూశాడు శ్రీపతి.
“అన్నం తినకపోవడమేమిటి అన్నయ్యా ? వదిన ఎంత కంగారుపడుతోందో తెలుసా?”” ఆప్యాయంగా మందలించాడు.
“ఏదీ తినాలనిపించలేదురా”” విరక్తిగా అన్నాడు శ్రీపతి. “అసలు ఏదీ వద్దనిపిస్తోంది. ఈ డబ్బు సంపాదించడంకోసం అప్పట్లో మేము కన్నకలలు… వేసిన ప్లానింగ్… ఆస్తులు కూడబెట్టడంకోసం పడ్డ తపన… అన్ని అర్థరహితంగా అనిపిస్తున్నాయి””
చిన్నబాబు అన్న చెప్పిన మాటల్ని శ్రద్ధగా విన్నాడు. తర్వాత అతని దృష్టి టీపాయ్‍మీద వున్న గుమ్మడిగింజలమీద పడింది. తనో రెండు వొల్చుకుని నోట్లో వేసుకున్నాక శ్రీపతి గుర్తు చేసుకున్నట్టే తనుకూడా చిన్నప్పటి జ్ఞాపకాన్ని గుర్తుతెచ్చుకున్నాడు.
“అప్పట్లో నేను చిన్నపిల్లాడిని కదా అన్నాయ్ , గింజలు వొలుచుకోవడం వచ్చేది కాదు. మీరేమో చకచకా తినేసేవారు. నేను నా గింజలు గట్టిగా గుప్పెట్లో పెట్టుకుని అమ్మ దగ్గరికి పరిగెత్తేవాడిని”” అంటూ నవ్వేడు.
“అదేరా ఆశ్చర్యం. అంత చిన్న వయస్సులో పొందిన అతి చిన్న ఆనందం కూడా ఇప్పుడు గుర్తొస్తే మనసులో నిండిపోతోంది. చిన్నప్పటి గుమ్మడిగింజల రుచి మళ్ళీ దొరకలేదు”” అన్నాడు శ్రీపతి.
“అప్పుడంటే అమ్మానాన్నల ప్రపంచంలో మనం వుండేవాళ్ళం. చిన్న చిన్న సంతోషాలు మనవీ, పెద్దవి వాళ్లవి. పెరిగి పెద్దై మన ప్రపంచాలు మనం నిర్మించుకున్నాక ప్రతిసంతోషం ఒక అనుభవంతో ముడిపడి వుంటుందని అర్థమయాక రసాస్వాదన తగ్గింది. ఇప్పుడింక అనుభవాలూ లేవు, సంతోషాలూ లేవు, రసానుభూతీ లేదు. మనం పెరిగి పెద్దవుతుంటే అమ్మావాళ్ళూ ఎలా వంటరివాళ్ళయారో మన పిల్లలు పెద్దయాక మనంకూడా వంటరిగా మిగిలాం. అందరూ చుట్టూనే వుంటారు, ఏదో కనిపించని దూరం. అన్నీ అందుబాటులోనే వుంటాయి, ఏదీ చేతికి అందదు”” అన్నాడు చిన్నబాబు.
“చిన్నవాడివైనా ఎంత బాగా చెప్పావురా? నా మనసు తెరిచి చూసి చదివినట్టే చెప్పావు”” అన్నాడు శ్రీపతి.
“భోజనానికి ఉండిపో”” అంది లక్ష్మి చిన్నబాబుతో. అతను తలూపాడు.
“విశాలని కూడా రమ్మనకూడదూ? తనకి డ్రైవింగ్ వచ్చుగా? ఎంతలో వచ్చేస్తుంది?””తోడికోడలి గురించి అంది.
“తను ఊర్లో లేదొదినా! అమ్మాయి దగ్గరికి వెళ్ళింది””
“చూడ్డానికేనా?””
“అంతే అంతే””
కొద్దిసేపు ముగ్గురూ ఏవో కబుర్లు చెప్పుకున్నారు. ఆ కాసేపూ శ్రీపతి కొంచెం ఉత్సాహంగా ఉన్నాడు. తర్వాత భోజనానికి లేచారు. పడక్కుర్చీలోంచీ లేవటానికి ఇబ్బందిపడుతుంటే తన చెయ్యి అందించాడు చిన్నబాబు. కొద్దిగా వడిలి చర్మం మెత్తబడిన ఆ చేతిని చూస్తుంటే కళ్ళు కొద్దిగా చెమ్మగిలాయి అతనికి.
నలుగురన్నదమ్ముల్లో శ్రీపతి పెద్దవాడు. అతనెలా చేస్తే మిగిలినవాళ్ళు అలా చేసారు. అతనే అడుగు వేస్తే వాళ్ళూ అలానే వేసారు. అందరూ పైకొచ్చారు. ఇదింకో అడుగు. అంతేకదా ? అతనికి అర్థమైంది.
నెమ్మదిగా అన్నాడు. “దీన్నే వృద్ధాప్యం అంటారన్నయ్యా! అన్నీ అమరివుంటాయి. దేనికీ లోటుండదు. దేనిమీదా ఆసక్తి వుండదు. అలాగని దేన్నీ వదులుకోలేము. ముందు పుట్టినవాడివి కాబట్టి ఈదారికి నువ్వు ముందు చేరుకున్నావు. మేమూ నీ వెనకే వస్తున్నాము”” అన్నాడు.
జీవితసూక్ష్మం తెలిసింది శ్రీపతికి. మనసుకి నిమ్మళం చిక్కింది.

4 thoughts on “గుమ్మడి గింజలు by S Sridevi”

  1. గోవిందరాజు సత్యనారాయణ

    అనుకోకుండా ఈ కధ నాకంట పడింది. చదివేను. ఎలా ఎంత మంచి కధో చెప్పే భాషా పటిమ నాకు లేదు కానీ గొప్పగా ఉంది.

Comments are closed.