బంగారుపంజరం by S Sridevi

  1. వంటింటి కిటికీ by S Sridevi
  2. పగుళ్ళు by S Sridevi
  3. స౦దిగ్ధపు రహదారులు by S Sridevi
  4. కోడలొచ్చింది by S Sridevi
  5. అతనిష్టం by S Sridevi
  6. ఆమె విజేత కాదు by S Sridevi
  7. యుద్ధదృశ్యం by S Sridevi
  8. బేబీ ఆఫ్ అర్చన by S Sridevi
  9. తరంగనాట్యం by S Sridevi
  10. చిట్టికి క్షమార్పణలతో by S Sridevi
  11. ఇంకో మజిలీకి by S Sridevi
  12. అధిరోహణం by S Sridevi
  13. లివింగ్ టుగెదర్ by S Sridevi
  14. గుమ్మడి గింజలు by S Sridevi
  15. బంగారుపంజరం by S Sridevi
  16. చీకట్లో పూసిన పూలు by S Sridevi
  17. గినీ పిగ్స్ by S Sridevi
  18. మలయమారుతం by S Sridevi
  19. సార్వభౌముడు by S Sridevi
  20. అమ్మానాన్నలు by S Sridevi

“కరుణ రాలేదా ?” ” మత్తుతో కూరుకుపోతున్న కనురెప్పల్ని బలవంతంగా విడదీసి చుట్టూ చూస్తూ నిరాశగా అడిగింది సుభద్ర . భార్యనలా చూస్తుంటే రావుకి ప్రాణం కొట్టుకుపోయింది . చావు బతుకుల మధ్య ఊగిసలాడుతూ కూతురికోసం … అదీ ఒక్కగానొక్క కూతురికోసం కలవరిస్తోంది. కానీ కూతురిది వచ్చే పరిస్థితి కాదు. ఆమె డాక్టరు. క్షణం తీరిక లేనంత బిజీ.
“అది రాదే ! రోజుకి పాతికవేల ఆదాయం వదులుకుని నీ దగ్గిరొచ్చి ఎందుకు కూర్చుంటుంది ? అదో డబ్బు యంత్రం . దాన్నలా తయారు చేసింది సగం నువ్వూ , మిగిలిన సగం అతనూ. యంత్రాలకి నిర్దేశించబడిన పనులు చేయటమే తప్ప మమతలూ మమకారాలనే స్పందనలు వుండవు . ఒక్క పిల్లతో సరిపెట్టుకుని , దాన్ని కూడా చూసుకునే తీరిక లేక హాస్టల్లో పడేసింది . అలాంటిది నీకోసం వస్తుందనుకోవడం భ్రమ!”
ప్రశ్న అడిగి ఆ వెంటనే మత్తులోకి జారిపోయిన సుభద్రకి తన మాటలు వినిపించవని తెలిసినా ఉద్రేకాన్ని ఆపుకోలేక అనేసాడు రావు. సుభద్రకి యుటిరస్ కేన్సర్ . ఆ సంబంధంగా శరీరంలో వచ్చిన మార్పుల్ని మనోపాజ్‍కి సంబంధించినవనుకుని అశ్రద్ధచేసింది. కాదని తెలుసుకునేసరికి కేన్సరు ముదిరిపోయింది . ఆమెకి టెస్టులూ, ఆపరేషన్ అన్నీ తనే దగ్గరుంచుకుని చేయించింది కరుణ. తగ్గదని తెలిసాక, స్వంత యింట్లో కన్నుముయ్యాలని వచ్చేసింది సుభద్ర .
కాలం కర్పూరంలా హరించుకుపోతోంది . ఆయువు నెలల్లోంచీ రోజుల్లోకి దిగిపోయింది . ఈవేళో రేపో తెలీదు . ట్రాంక్విలైజర్స్‌మీద బతుకుతోంది . పగటికీ రాత్రికి బేధం లేదు . ఆమెలో మిగిలి వున్న స్పందనంటూ ఒక్కటే . ఒక్కసారి … ఒకే ఒక్కసారి , కూతుర్ని చూసి కన్నుముయ్యాలని …
రావు కళ్లల్లో నీరు తిరిగింది . ఎన్ని జ్ఞాపకాలని పంచుకున్నాడు ఈమెతో. ఎన్ని అనుభూతుల్ని పంచిచ్చింది ! నవవధువుగా తన గుండెల్ని దోచుకుని , దాంపత్యపు మాధురిమల్లో ఓలలాడించి చివరిదాకా తోడుంటానని మాటిచ్చి తనకన్నా ముందే ప్రయాణమై తిరిగిరాని తీరాలకి వెళ్ళిపోతుంటే తను నిమిత్తమాత్రుడిలా వుండిపోవటం మినహా మరేమీ చేయలేని అశక్తత. దానికి తోడు ఆమె కోరిన అతి చిన్న , అత్యంత సహజమైన కోరికని తీర్చలేకపోవటం. అంత బాధలో కూడా ఆలోచనలు అంతదాకా వచ్చి ఆగిపోయాక రావులో ఒక విధమైన విరక్తి … ఇందులో తనదేముంది ? చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా … అని.
ఏ విత్తు నాటితే ఆ మొక్కే మొలుస్తుంది. డబ్బు విత్తనం మెదళ్ళో నాటితే మమకారాల మొక్కలు మొలుస్తాయా ? కళ్ళముందు ఏవో జ్ఞాపకాలు ….

“అమ్మా ! నాకు లిప్‍స్టిక్ కొనివ్వవూ?””ఏడేళ్ళ కరుణ అడిగినప్పుడు సుభద్ర చాలా బాధపడింది . ఆపాటి చిన్న కోరికకూడా తీర్చే శక్తి తనకి లేదని. అసలు కూతురు లిప్‍స్టిక్ అడిగిందంటే ముందు తననే కోప్పడతాడు భర్త. తాహతెరిగి పిల్లని పెంచటం లేదని . చిన్నపిల్లలకి అవన్నీ ఏం తెలుస్తాయి ? చుట్టూ వున్న ప్రపంచంలో ఎన్నో ప్రలోభాలు. రోజూ బడికొచ్చే తోటిపిల్లల్లో రకరకాల పోకడలు. వీటికి దూరంగా వుండమని కరుణని ఒక్కదాన్నే ఎలా శాసించగలదు? అందులో ఎంత సంఘర్షణ? ప్రవాహంలో యిమిడిపోయి పరుగు తియ్యాలిగానీ, ఏటికి ఎదురీది ఏం సాధించగలం?
ఇంటి ఖర్చులు కుదించి కూతురు అడిగినవి కొనివ్వటం, ఆపైన భర్తకి సర్దిచెప్పడం మొదలుపెట్టింది సుభద్ర. తనకి ఇవన్నీ ఇష్టం లేకపోయినా భార్య ఇష్టాలని మన్నించే వ్యక్తి కావటంతో చూసీచూడనట్టు వదిలేసాడు రావు.
“అమ్మా ! మనకి కారెందుకు లేదు ? ఎప్పుడు కొంటావు?” ఇంటి ముందునించి పోతున్న చాక్లెట్‍రంగు మారుతీకారుని ఆశగా చూస్తూ అడిగింది కరుణ . అప్పుడామెకి పదేళ్ళు.
“నువ్వు బాగా చదువుకుని పెద్ద డాక్టరువయ్యి కొనుక్కో”” జవాబిచ్చింది సుభద్ర .
“డాక్టరైతే కారు కొనుక్కోవచ్చా ?” ” ఆరాటంగా అడిగింది కరుణ ,
“ఊ< పెద్ద బంగళా , కారు… అన్నీ”” వూరించింది సుభద్ర . డాక్టరవడం . .. జబ్బు చేసిన అమ్మనో , నాన్ననో చూసిన స్ఫూర్తితో కాదు –
డాక్టరు కోర్సు చదవడం … సహజసిద్ధంగా ఉండాల్సిన ఆర్తితో కాదు –
ఫస్టు రేంకొస్తోందిగాబట్టి అదో యాంబిషన్‌గా కూడా కాదు . డబ్బు సంపాదించుకుని , బంగళాలు , కార్లు కొనుక్కోవడం కోసం . సరదాలు తీర్చుకోవడం కోసం … అప్పుడు తీవ్రంగా స్పందించాడు రావు . భార్య ఆలోచనలు తప్పుదార్లో నడుస్తున్నాయని గ్రహించాడు .
“నువ్వు దాన్ని తప్పుదారిలోకి మళ్ళిస్తున్నావు . అది లిప్‍స్టిక్ అడిగిన రోజునే నువ్వు చెప్పాల్సింది – పెద్దయ్యాక సంపాదించుకుని కొనుక్కోమ్మా ! అని . అంటే నువ్వు సంపాదించుకుని తగలేసుకోమ్మా అని చెప్పడం … డబ్బు విలువెంతో దానికి తెలిసేది . కారడిగినప్పుడు మన తాహతేంటో చెప్పాల్సింది” అని మందలించాడు .
రావు చాలా సామాన్యమైన కుటుంబంలోంచి వచ్చాడు . కష్టపడి చదువుకుని స్వశక్తితోనే ఉద్యోగం సంపాదించుకున్నాడు . ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగిన నిండైన మనిషని పరిచయమున్న ప్రతీవాళ్లకి తెలుసు . ఆడో మగో ఒక్క పిల్లయితే చాలని సరి పెట్టుకున్నాడు. ఆ ఒక్కపిల్లా వడిదుడుకుల్లేని జీవితం గడపాలని ఆశపడ్డాడు . అంతకుమించి మరేదీ కోరుకోని సాదా మనిషి . అలాంటివాడికి సుభద్ర ఆశలూ , కోరికలూ అంతుపట్టకుండా వున్నాయి . అందులో అపశృతి కూడా వినిపిస్తోందతనికి . అతనిలాగే మామూలు కుటుంబంలోంచి వచ్చింది సుభద్రకూడా . కరుణ ఒక్కర్తితోటీ సరిపెట్టుకున్నారుగాబట్టి ఆ ఒక్కరూ డాక్టరో ఇంజనీరో అయ్యి వుద్ధరించాలని ఆమె ఆకాంక్ష .
భార్యాభర్తలిద్దరి దృక్పథాలూ వేరు . దారులు వేరు . ఆశయాలు వేరు . ఆకాంక్షలు వేరు .
“మీదంతా చాదస్తంలెద్దురూ!”” అనేసింది సుభద్ర తేలిగ్గా. అప్పటికే కరుణ మెదళ్ళో డబ్బు విత్తనం పడనే పడింది . కష్టపడి చదివి డాక్టరైంది కరుణ. ఆపైన డీజీవో చేసింది . మేల్ డాక్టర్స్ కాంపిటిషన్లో తట్టుకోవాలంటే ఎమ్మెస్, ఎమ్డీ కావాలిగానీ లేడీడాక్టర్స్‌కి డీజీవో అంత పెద్ద క్వాలిఫికేషన్ మరోటి వుండదు.
కరుణలో వున్న డబ్బు దాహం చూసే, ఆమె డాక్టరుగా బాగా షైనవుతుందని గ్రహించే ఆనందమోహన్ ఆమెని కట్నం లేకుండా చేసుకున్నాడు .
ఇద్దరూ ఆరేళ్ళు ఫారిన్ వెళ్ళొచ్చారు. సిటీసెంటర్లో పెద్ద హాస్పిటల్ కట్టించుకున్నారు. ఆనందమోహన్ చెల్లెలికి పెద్దసంబంధం చేసాడు , తమ్ముడ్ని డొనేషన్ కట్టి మెడిసిన్లో చేర్పించాడు. తండ్రికి బైపాస్ సర్జరీ చేయించాడు.
మూడు సిజేరియన్లూ ఆరు కన్సల్టేషన్లుగా కరుణ నర్సింగ్ హోమ్ నడుస్తోంది . కాలు కింద పెట్టక్కర్లేకుండా కార్లు , రోజువారీ వాడకానికి రెండేసివేల రూపాయల చీరలు … లగ్జరీ ….. లగ్జరీ … కూతురికి పట్టిన అదృష్టానికి సుభద్ర మురిసిపోయింది . రావు తొణకలేదు . ఆమెలా మురిసిపోలేదు . అతడికి అర్ధమైంది – అల్లుడు తయారుచేసిన బంగారుపంజరంలో చిలక తన కూతురు . ఆమెకి కొనే చీరలూ , నగలూ ఒక హోదాని మెయింటెయిన్ చేసేందుకు. ధనవంతులైన, పరపతిగల పేషంట్ల దృష్టిలో ఆమె గొప్ప డాక్టర్ అని , తమది గొప్ప హాస్పిటల్ అని పేరు తెచ్చుకోవాలన్నదే అతడి ఆలోచన.
హాస్పిటల్ … ఇల్లు , ఇంట్లోనూ క్లినిక్కు ….. పూర్తిగా డబ్బు యంత్రమైంది కరుణ . ఆమె ప్రోగ్రామ్సన్నీ ఆనందమోహన్ ఫిక్స్ చేస్తాడు . కేసుల తాలూకు ఫీజులు కూడా అతనికే వెళ్ళిపోతాయి . ఎందులోనూ ఆమె ప్రమేయం లేదు .
తల్లికి సీరియస్‍గా వుందని కరుణకి తెలుసు. కానీ వెళ్లే తీరిక తనకెక్కడిది? ఒక్కరోజు ఈ రొటీన్లోంచీ బైటపడగలిగితే … తన పాపతో గడిపేది కాదా? పాపని చూసి ఎన్ని రోజులైంది?

అల్లుడికి ఫోన్ చేశాడు రావు . “ఎలా వుంది ఆంటీకి ?” ” రొటీన్ ప్రశ్న .
“ఆవెంటనే ”మరేం ఫర్వాలేదు . ఇంకా టైముంది. మీరేం టెన్షన్ పడకండి”” జనాంతికమైన వోదార్పు.
తన జవాబు వినకుండానే, “అసలు మాదగ్గరే వుండుంటే బావుండేది. ఏమిటో, మీ చాదస్తాలు” అంటూ కరుణని పంపించే ప్రస్తావనే లేకుండా ఫోన్ పెట్టేసాడు. హతాశుడైపోయాడు రావు. అతనికో విషయం అర్ధమైంది . తల్లిని చూడటానికి రావాలన్న కోరిక కరుణలోనే వుండాల్సినంత బలంగా లేదని, ఆమె ప్రాథమ్యాలలో అదెక్కడో చివరికి చేరుకుందని. మొదట్నుంచీ తెలిసిందే అయినా మరీ విస్పష్టంగా … గుండెని గునపంతో పెకిలించినట్టు అనిపించింది. కళ్ళు చెమర్చాయి.
రాత్రి పన్నెండిటికి రావుకి ఫోనొచ్చింది – కరుణ దగ్గర్నుంచీ .
“అమ్మకెలా వుంది నాన్నా ? కనీసం ఫైటు సర్వీసుంటే ఒకటి రెండుసార్లు వచ్చి చూసేదాన్ని …. రావటానికి ఎక్కడా వీలవటం లేదు . మూడు సిజేరియన్లు చేతిమీదున్నాయి . అవికాక నిన్న చేసిన ఆపరేషన్లు … వూబిలో దిగబడుతున్నట్టుంది”” ఆమె గొంతులో అస్పష్టమైన జీర .
అది తల్లికోసం దు:ఖంవల్లనో, అపరాథభావనచేతనో అర్థం కాలేదు రావుకి. దాన్ని అతను పట్టించుకోదల్చుకోలేదు. వ్యక్తిత్వాన్ని డబ్బుకో, భర్తనే బంధానికో, పిల్లలనే మమకారానికో అమ్ముకునే ఆడవాళ్ళను అతను క్షమించలేడు.
“పర్వాలేదమ్మా… నువ్వు రాలేకపోయినంతమాత్రాన ఇక్కడ పోయే ప్రాణం ఆగదు. ఏదేనా జరిగితే సింగపూర్‍నుండి మీరు మాకోసం తీసుకువచ్చిన వీసీఆర్ వుందికదా? అందులో తీయించి కేసెట్ పంపిస్తాను. నీకు వీలుచిక్కితే చూద్దువుగాని”” అనేసి పెట్టేసాడు.
భార్య దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆమె ఇంకా మత్తులోనే ఉంది. తను కని పెంచిన కుమార్తె తన కోసం వస్తుందన్న భ్రమలోనే ఉంది. పోయే క్షణం వచ్చినప్పుడు ఎటువంటి భ్రమలూ ప్రాణాన్ని ఆపలేవు. ఆ క్షణం కోసం విరాగిగా ఎదురు చూడటమే!

(Before 2000 story)