చీకట్లో పూసిన పూలు by S Sridevi

  1. వంటింటి కిటికీ by S Sridevi
  2. పగుళ్ళు by S Sridevi
  3. స౦దిగ్ధపు రహదారులు by S Sridevi
  4. కోడలొచ్చింది by S Sridevi
  5. అతనిష్టం by S Sridevi
  6. ఆమె విజేత కాదు by S Sridevi
  7. యుద్ధదృశ్యం by S Sridevi
  8. బేబీ ఆఫ్ అర్చన by S Sridevi
  9. తరంగనాట్యం by S Sridevi
  10. చిట్టికి క్షమార్పణలతో by S Sridevi
  11. ఇంకో మజిలీకి by S Sridevi
  12. అధిరోహణం by S Sridevi
  13. లివింగ్ టుగెదర్ by S Sridevi
  14. గుమ్మడి గింజలు by S Sridevi
  15. బంగారుపంజరం by S Sridevi
  16. చీకట్లో పూసిన పూలు by S Sridevi
  17. గినీ పిగ్స్ by S Sridevi
  18. మలయమారుతం by S Sridevi
  19. సార్వభౌముడు by S Sridevi
  20. అమ్మానాన్నలు by S Sridevi

“ఆ కారు మోడల్ పాతబడిపోయింది. కొత్తది కొనాల్సిందే. ఏం? ఆపాటి లేదా మన దగ్గర ? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తీరతాయి సరదాలు?””తీవ్రంగా వుంది హిమజ గొంతు.
కండిషన్లో ఉన్న కారు తీసేసి కొత్తది కొనటం దేనికని రామ్మోహన్ ఆమెకి నచ్చజెప్పాలని ప్రయత్నించి అది ఇద్దరి మధ్య వాగ్వివాదానికి దారితియ్యటంతో హాల్లోకి వచ్చేసాడు. హాల్లోనే ఒక మూలవున్న అద్దాలగదిలో కంప్యూటర్లో గేమ్స్ ఆడుతున్నాడు చిన్నకొడుకు. మరోమూల టీవీ చూస్తున్నాడు పెద్దకొడుకు. నాలుగు బెడ్రూమ్స్, గెస్ట్ రూమ్, హాలు, గార్డెన్‍తో ఇల్లు. మార్బుల్ ఫ్లోరింగ్. ఇంట్లో లేనిదంటూ లేదు. లక్షల్లో జీతం రామ్మోహన్‍కి. కంపెనీ వాళ్ళిచ్చిన కారొకటి, తను స్వంతంగా కొనుక్కున్నదొకటి.
నిరుపయోగంగా ఖర్చు పెట్టడం ఎక్కువైంది ఇంట్లో. హిమజ రెండుమూడేసివేలు పెట్టి చీరలు కొని రఫ్‍గా వాడేస్తుంది. సామాన్లవీ కూడా అంతే. కొత్త వెరైటీ రాగానే పాతవి పక్కని పారేసి, అవి కొంటుంది. ఎంత డబ్బుంటే మాత్రం దాన్నలా ఖర్చు చేసి తగలెయ్యాలా అనేది అతనికెంతమాత్రం అర్థమవదు.
తన చిన్నతనం గుర్తొచ్చింది. తండ్రి స్కూలు టీచరు. జీతం వందల్లో ఉండేది. అక్క, తను, తమ్ముడు. చాలా కష్టపడి ఆయన ముగ్గుర్నీ చదివించాడు. ఎప్పుడూ ఏవో సర్దుబాట్లు, టీవీ, కంప్యూటర్ అలాంటివేమీ తెలీదు. చిన్న ట్రాన్సిస్టరుండేది. ఇంటరుదాకా స్కాలర్‍షిప్‍మీద చదువుకున్నాడు తను. ఇంజనీరింగ్ కాలేజీలో సీటొచ్చింది. తండ్రి ఖర్చుకి భయపడితే తల్లి ఆవిడకి పసుపుకుంకాలకింద యిచ్చిన పొలంలో సగం అమ్మమంది.
చదువు, అదవ్వగానే గవర్నమెంటు ఉద్యోగం. ఈమధ్యలో ఒక ప్రభంజనంలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలపైంది. దాంతో జస్ట్… సరదాకి తనందులో ఒక కోర్సు చేసాడు. అంతే… ఆ ప్రభంజనం ఇండియాని చుట్టెయ్యడానికి కాస్తెక్కువే వ్యవధి పట్టినా, అది తన జీవితాన్ని కూడా చుట్టేసి కొత్తరూపు దిద్దింది. సాఫ్ట్‌వేర్ రంగంలోకి వచ్చేసాడు.
డబ్బు…. డబ్బు…. డబ్బు…..
అదిచ్చే సుఖాలు ఎన్నున్నా యింకా ఏదో కావాలనే కోరిక. మామూలు అవసరాలన్నీ తీరాక అది తన విలువని కోల్పోవటం ప్రారంభించి, తనలో ఒక అసంతృప్తి జ్వాలని వెలిగించింది.
“నాన్నా! కొత్త కారు కొంటున్నావా?”” ఆట ఆపి వచ్చి వళ్ళో కూర్చుని అజయ్.
“దేనికిరా ఇప్పుడు?”” చిరాగ్గా అన్నాడు రామ్మోహన్.
“అమ్మ కొనమందిగా? కొనవా మరి?”” అదేదో కేడ్బరీ చాక్లెట్లా అడుగుతుంటే మరీ చిరాకేసింది. వీళ్ళకి డబ్బంటే ఏమిటో తెలుసా అసలు?
“మీ నాన్న కొత్తగా పొదుపు సిద్ధాంతాలు నేర్చుకుంటున్నారు. ఏ స్కూల్లో నేర్చుకుంటున్నారో అడుగు””లోపల్నుంచీ హిమజ విసురు.
“ఇది పొదుపు కాదు”” రామ్మోహన్ నచ్చజెప్పబోయాడు. ఐటీ వేలల్లో జీతాలు ఇస్తోందిగానీ ఆ జీతాలతో కొనుక్కు తినాల్సిన తిండిలో ఆవగింజంత కూడా సృష్టించదు.
అక్కడెక్కడో మహారాష్ట్రలో వానలు పడితే కోస్తా ఆంధ్రలో గోదావరికి వరదలు వచ్చినట్టు ఎక్కువ జీతాలవాళ్ళు చేసే దుబారా దేశంలో మిగిలివున్న జనాభా జీవితాలతో ఆడుకుంటుందని ఎలా చెప్పడం?
“పొదుపు కాకపోతే మరేంటట? మనకిప్పుడేమంత అవసరాలున్నాయి. పిల్లల్నికూడా స్కూల్లో వేసేసాం. ఇంకేం కావాలి? డబ్బులేనప్పుడు ఎలాగా సర్దుకున్నాం. ఇప్పుడూనా?”” హిమజ గొంతు పదునుగా ఉంది.
రామ్మోహన్‍కి నవ్వొచ్చింది, దాదాపు ఏడెనిమిదివేల జీతంతో సౌఖ్యంగా బతికినప్పటి రోజుల్ని ఆమె డబ్బులేని రోజులనటం విని.
“హిమా! అనవసరంగా డబ్బు ఖర్చు చెయ్యటం దేనికి?”” మెత్తగానే అడిగాడు.
“అనవసరమా? నేనింతగా అడిగాక కూడా మీకు అనవసరమే అనిపిస్తోందా? నాకా మోడల్ ఎంత నచ్చిందో తెలుసా?”” ఆమె గొంతు రుద్దమైంది.
ఏదైనా చీర నచ్చితే నచ్చిందని చెప్పటానికి తల్లి ఎంతో సంకోచించేది. తండ్రి కొనలేడనేకాదు, మనసుని అదుపులో ఉంచుకోవటం.
“మనం బైటకెళ్ళాలనుకున్నాం నాన్నా ! ఈ వేళ గురువారం, బేల్‍పూరీ తినాలి”” విజయ్ టీవీ ముందునించీ లేచి వచ్చి అన్నాడు. రామ్మోహన్‍కి ఇంట్లోంచి బైటపడటమే మంచిదనిపించింది. భార్యతో వాదించాలని లేదు. కారు మార్చటం పెద్ద సమస్య కాదు. కండిషనల్లో ఉంది. సెకండ్‍హేండులో మంచిధరకే పోతుంది. అటుపైన కొత్తది కొనటానికి లోనివ్వడానికి బేంకులు వున్నాయి. అవసరం లేనిదే ఎందుకని…..
“పదండి వెళ్దాం””అని లేచాడు. పిలలు హుషారుగా లేచారు. హిమజ విసురుగా బెడ్రూమ్‍లోకెళ్ళి ధడేల్మని తలుపేసుకుంది.
“అమ్మకి కోపం వచ్చింది”” అన్నాడు విజయ్. రామ్మోహన్ మాట్లాడలేదు. పిల్లలిద్దరూ అతనికంటే ముందే కార్లో ఎక్కి కూర్చున్నారు. అతను డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టార్ట్ చెయ్యగానే విజయ్ అడిగాడు.
“నాన్నా నీకు అక్క, తమ్ముడు ఉన్నారా? ఉన్నారటగా? బామ్మ చెప్పింది” పెద్దకొడుకుని చూస్తుంటే రామ్మోహన్‍కి అంతరంగాన్ని ఎక్కడో తడుతున్నట్టు అనిపిస్తుంది. ఆ పదేళ్ళ కుర్రాడిలో ఆర్తి. దేనికోసమో వెతుకులాట. నువ్విచ్చే అన్నిటినీ మించినది ఇంకేదో ఉంది, దాన్ని నాకు అందనివ్వటంలేదనే అస్పష్టమైన సూచన. మానవసంబంధాలపట్ల ఆసక్తి. ఇవన్నీ ఎప్పుడో ఒక్క క్షణంపాటు కదలాడుతుంటాయి. ఆ తర్వాత అతను పాలబుగ్గల పసివాడే. ఆ కదలికలున్న క్షణాలు మాత్రం రామ్మోహన్‍కి దొరికిపోతాయి.
“చెప్పు నాన్నా!”” విజయ్ రెట్టించాడు.
“బామ్మేం చెప్పింది?”” రామ్మోహన్ అడిగాడు.
“నీకొక అక్క తమ్ముడు ఉన్నారటగా? మరి వాళ్ళెప్పుడూ మనింటికెందుకు రారు?”” విజయ్ అడిగాడు.
“వాళ్ళకెలాంటి కారుంది? డాబర్‍మేన్ ఉందా? మనిల్లంత పెద్దిల్లుందా? స్విమ్మింగ్ పూల్ ఉందా?”” అజయ్ ప్రశ్నల పరంపర.
రామ్మోహన్‍కి ఏం జవాబివ్వాలో తెలీలేదు. తల్లి వాళ్ళని గురించి వీళ్ళకి ఏమి చెప్పిందో? బావ క్లర్కు. తమ్ముడు టీచరు. అటు అక్క, ఇటు మరదలు కూడా గృహిణులే. తండ్రి తను ముగ్గురి చదువుల విషయంలో సమానమైన కృషి చేసినా అక్కకీ తమ్ముడికీ పెద్దగా చదువు రాలేదు. దాంతో స్థాయి మారిపోయింది. వాళ్ళు తనింటికి రారు. తనూ ఎప్పుడో తప్పించి వెళ్ళడు. ఆటో ఎక్కడం అనవసరం ఖర్చు అనుకునే అక్క. అడుగు కదపాలంటే కారు తీసే హిమజ. తెల్లారిన దగ్గర్నుంచి అన్ని పనులూ తనే చేసుకుని నాజూకు తేలిన మరదలు, నాజూకుదనం కోసం జిమ్‍కి వెళ్లే హిమజ… ఉత్తర దక్షిణ దృవాలు. తనతో హిమజ వాళ్ల దగ్గరకు రాదు. ఆమె కూడా అక్కడ ఇమడలేదు. విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని సైన్సు చెప్తుంది. వికర్షించుకుంటాయని బ్రతుకు చెప్తుంది.
“ఏంటి నాన్నా మాట్లాడవు?”” విజయ్ రెట్టించాడు. “
“మనం మాత్రం వెళ్ళామేమిటి?”” అజయ్ ఎదురు ప్రశ్నించాడు.
ఇంతలో ఫాస్ట్‌ఫుడ్ కార్నరొచ్చింది. పిల్లలింక బంధువుల విషయం వదిలేసారు. ముగ్గురూ తిని యివతలికొచ్చి నిలబడ్డారు. సాయంత్రం వేళ… చౌరస్తాలో చాలా రద్దీగా ఉంది. హడావిడిగా తిరుగుతున్న జనాన్ని విస్మయంగా చూసాడు రామ్మోహన్. అతనికంత తీరికెప్పుడూ ఉండదు. హిమజ వెంట రాకపోవటంతో ఈ తీరిక. ఆమెతో వస్తే షాపింగ్‍లో బిజీగా ఉంటుంది. ఉంచుతుంది. ఈ జనాన్ని చూస్తుంటే రోజూ పేపర్లో చదివే వార్తలు మనసులో కదిలాయి. ఆకలి చావులు, హత్యలు, అమ్మాయిలనీ, పిల్లలనీ అమ్ముకోవటాలు… అసంబద్ధత. అర్థమయ్యా కానట్టు.
కారు హారన్ మోగితే ఉలిక్కిపడ్డాడు. “”పద నాన్నా! వెళ్ళిపోదాం”” అన్నారు పిల్లలు. తల్లి ఉంటే ఎంతో బిజీగా ఉండేవారు. ఆమె తమతో లేకపోటంలోని తేడాని సెన్స్ చేస్తున్నారు. తిరిగి ఇల్లు చేరుకునే సరికి హిమజ చెల్లెల్తో ఫోన్లో మాట్లాడుతోంది. అదే విషయం. కారుగురించి.
పిల్లలు నిద్రపోయాక ఆమె మళ్ళీ దాడి మొదలు పెడుతుందనుకున్నాడు. కానీ ఆమె వాళ్ళతో కలిసి బెడ్‍రూమ్‍లోకి వెళ్ళి తలుపేసుకుంది.
రామ్మోహన్ చాలాసేపటిదాకా టీవీ చూసాడు. ఒక్కడూ కూర్చుని విసుగేసి కారిడార్లో నిల్చున్నాడు. కారిడార్ మరో చివర తల్లి గది. లైటు వెలుగుతోందింకా. ఇంత రాత్రి దాకా అమ్మేం చేస్తోంది? అనుకుంటూ ఆవిడ దగ్గరకి వెళ్ళాడు.
ఏదో పుస్తకం చదువుతోంది. తండ్రి చనిపోయి మూడేళ్ళైంది. అప్పటినుంచీ మానసికంగా చాలా వంటరిదైపోయింది. తను బాధపడతాడనో, చిన్నకొడుక్కి భారమౌతాననో ఆలోచించుకుని ఇక్కడ ఉంటోందిగానీ ఆవిడ మనసంతా చిన్న కొడుకుమీద, కూతురిమీదే ఉంటుంది. కొడుకుని చూసి పుస్తకం మూసి పక్కని పెట్టింది.
“సందర్భం చూసి నేనే నీతో మాట్లాడాలని అకుంటున్నాను” అంది కొంచెం సంకోచిస్తూ.
“చెప్పమ్మా!”” అన్నాడు రామ్మోహన్ ఆవిడ పక్కని కూర్చుంటూ.
“మధ్యాహ్నం అక్క ఫోన్ చేసింది”
“ఏమిటట విశేషాలు?””
“శీనుకి ఎమ్‍సెట్‍లో ఏడువేలమీద రేంకొచ్చిందట. పేమెంటు కోటాలో సీటొస్తుందనుకుంటున్నారు. నాన్‍పేమెంటైతేనే చదివిస్తానని బావన్నాడట””
“పిల్లల చదువు విషయంలో అలా అనుకుంటే ఎలా కుదుర్తుంది?””
“కానీ డబ్బు కావద్దూ?””
కొద్దిసేపటి మౌనం.
ఆ తర్వాత అంది. “మన కుటుంబంలో నువ్వొక్కడివీ ఊహించనంత ఎత్తుకి ఎదిగావు. సంపాదించినది ఒక రకంగా చెప్పాలంటే తగలేస్తున్నారు. ఇలా అంటున్నానని మరోలా అనుకోకు. ఇంట్లో ఉండేదానికి ఎందుకన్ని చీరలు? ఎందుకన్ని నగలు? పిల్లల బొమ్మలమీదా బట్టలమీదా ఎందుకంత ఖర్చు? అవసరాలకి మించిపోయి వస్తోందనే కదా?””
తల్లి ఎత్తి చూపుతోందని కోపం తెచ్చుకోవాలిగానీ ఆవిడ చెప్పినదాంట్లో ఎంతమాత్రం తప్పు కనిపించలేదతనకి. ఆవిడ చెప్తున్నవి తన మనసులోని భావాలే.
“మారోజుల్లో మనుషుల మధ్యని ఇంతగా తారతమ్యాలుండేవి కాదు. బీదా గొప్పా అప్పుడూ ఉండేవారు. ఇప్పుడూ ఉన్నారు. వాళ్ళవీళ్ళకీ నడుమ మధ్యతరగతి ఉండేది. అందులో మళ్ళీ మూడు స్థాయిలు. ఏ ఒకరిద్దరు దొరలో, జమిందార్లో తప్పించి అంతా ఇంచుమించు ఒకేలా బతికేవారు. స్థాయీభేదం పెద్దగా కనిపించేది కాదు”” ఆవిడ గొంతు వణికింది. ఆవిడ గుండెల్లో ఇంత ఆవేదన ఉందని రామ్మోహన్ ఎప్పుడూ అనుకోలేదు. ఆవిడే మళ్ళీ అంది. “”సమాజంలో పెద్ద చీలిక వచ్చింది. ఆ చీలిక నా పిల్లల్లోనే రావటాన్ని నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను””
ఆవిడ సరిగానే అంది. సమాజం రెండుగా చీలిపోతోంది. కష్టజీవులు, మేథావులు. కష్టపడేవాళ్ళు అలానే మిగిలిపోతూ క్రమంగా పేదరికంలోకి కూరుకుపోతున్నారు. ఒకప్పుడు తిండి పెట్టి, సమాజంలో గౌరవాన్ని ఇచ్చిన వృత్తులేవీ ఈరోజున వారి ఆ స్థానాన్ని పట్టి నిలపలేక పోతున్నాయి. మేధస్సుకి పెద్దపీట వేస్తోంది సమాజం. తమ తెలివికి గుర్తింపు దొరికినవాళ్ళు ఉన్నతస్థాయిని చేరుకుంటున్నారు. కొత్త వృత్తులు తలెత్తాయి. మనుషులు మానవనరులుగా మారిపోయారు. అవకాశం అనేది ఒక్కటే సమాజాన్ని శాశిస్తోంది. దానికోసం వెతుకులాట, తోపులాట. ఉన్నదాంతో సంతృప్తిగా బతకడం అనేది అసమర్ధతగా రూపాంతరం చెందింది.
ఈ మార్పు తన ఇంట్లోనే జరిగింది. తన మితృల్లో, సహోద్యోగుల్లో జరిగింది. తనతో బియ్యీ చేసి, వుద్యోగాల్లో చేరినవాళ్ళు ఇప్పటికింకా పది పన్నెండు వేలకి మించి డ్రా చెయ్యటం లేదు. తమ్ముడుగానీ, బావగానీ అలాగే ఉండిపోయారు.
“అక్క నిన్నడగడానికి భయపడ్తోంది. వెయ్యో రెండువేలో కాదుకదా, సర్దమనటానికి?””అని ఆగిందావిడ. “”వాడికి ఫీజులు కట్టి చదివించడం నీకంత భారం కాదనుకుంటాను. చదువయ్యి ఉద్యోగం వచ్చాక తిరిగి ఇచ్చేస్తాడు. హిమజతో కలిసి ఆలోచించి, దానికిష్టమైతే చెప్పు”” అంది.
రామ్మోహన్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. తనవాళ్ళకి సాయం చెయ్యాలని ఎప్పుడూ అనిపించలేదు. ఎవరి బ్రతుకులు వాళ్ళవనుకున్నాడు. ఇవ్వాలనుకుంటే శీను తిరిగి ఇవ్వటం, ఇవ్వకపోవటం అసలు సమస్యే కాదు. ఇంతలోనే అతని తల్లి మళ్ళీ అంది.
“డబ్బు ఎక్కువగా వస్తున్నప్పుడు ఒక ప్రయోజనానికి ఉపయోగిస్తే మంచిదిగా? నువ్వు వాడిని ప్రయోజకుడిని చేస్తే వాడు ఇంకొకడిని చేస్తాడు. నీకు గుర్తుందా? చిన్నప్పుడు దీపావళికి ప్రమిదలు పెట్టేవాళ్ళం, ఒక ప్రమిద వెలిగించి దాంతో ఇంకొకటి…. అలా వెలిగించుకుంటూ వెళ్ళవాళ్ళం””
ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు రామ్మోహన్. ఎన్నోరోజుల్నించీ మనసుని పట్టి వేధిస్తున్న అసంబద్ధతలాంటిదేదో చెదిరిపోయి మబ్బులు విడిచిన ఆకాశంలా తేజోవంతమైంది. “హిమ కాదనదమ్మా”” అన్నాడు.
“ఐనా చెప్పి చెయ్యటం నీ బాధ్యత”” తలూపి వచ్చేసాడు. చాలారోజులతర్వాత అతను ప్రయాణించడానికో గమ్యం దొరికింది. డబ్బుని ఏదో ఒకలా కాకుండా ఒక ప్రయోజనానికి ఖర్చు పెట్టబోతున్నాడు. అలా ఖర్చు పెట్టడంలోని ఆనందాన్ని పొందబోతున్నాడు. మనిషి జీవితం తాత్కాలిక గమ్యాలతో కూడుకున్న సుదీర్ఘ ప్రయాణం. ఎప్పటికప్పుడు గమ్యాన్నిచేరుకుంటూనే ఉన్నా మళ్ళీ కొత్తకొత్త అన్వేషణలు చేస్తూ కొత్తకొత్త గమ్యాలని ఏర్పరచుకోవాలి. లేకపోతే నిస్సారంగా ఉంటుంది. ఆ ప్రయాణంలో కొన్ని ఆటంకాలూ తప్పవు.
అతనింకా లోతుగా ఆలోచించదలుచుకోలేదు. బ్లాంక్ చెక్ మీద సంతకం చేసి, హిమజ లేవగానే కనిపించేలా పెట్టి వచ్చాడు. హిమజ కోరిక తీర్చితే ఇంక తన జోలికి రాదు. తనేం చేసినా పట్టించుకోదు. సరిగ్గా అక్కడే ఎడ్వాంటేజి తీసుకోవాలనుకున్నాడు రామ్మోహన్.
అక్కకి ఫోన్ చేసాడు. ఆమె మాట్లాడి భర్తకిచ్చింది. “”శీనేం చేస్తున్నాడు బావా?”” అడిగాడు.
“పేమెంటైతే చదివించనన్నానని అలిగి పడుకున్నాడు”” దాపరికం లేకుండా చెప్పాడు ఆయన.
“అమ్మ నాకంతా చెప్పింది. కాంపిటిషన్ తీవ్రంగా ఉన్న ఈ రోజుల్లో ఏ చిన్న అవకాశమూ వదులుకోకూడదు. ఫీజులు నేను కడతాను. మీరింకేం ఆలోచించకండి”
ఆయన స్థబ్దుడయాడు.
“నేను నిన్ను తప్పుగా అంచనా వేసుకున్నాను”” కొద్దిసేపటి మౌనం తర్వాత అక్షరం అక్షరం పేర్చుకుంటూ అన్నాడు. ఆయన గొంతులో అదోలాంటి భావం. అదేమిటో గ్రహించగలిగాడు రామ్మోహన్. ఒకే మధ్య తరగతి స్థాయిలో జీవితాలని మొదలు పెట్టిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు చేతికి వచ్చిన అవకాశాలనికూడా అందుకోలేని స్థితిలో ఉంటే మరొకరికి అందిరావటంపట్ల నిరసన. దానికి రామ్మోహనేం బాధపడలేదు. ఎవరో వచ్చి మనకి అవకాశాలని అందిస్తారని ఎదురుచూడటం అది కుదరకపోతే ఉన్నదాంతోటే సర్దుకు బతకటం నరనరానా జీర్ణించుకుపోయింది మనుషులకి.
బావ క్లర్కుగా చేరి అంతటితో సరిపెట్టేసుకున్నాడు. ఆర్నెల్లకోసారి పెంచే డియ్యే గురించీ, ఏడాదికోసారి యిచ్చే బోనస్ గురించి ఎదురుచూస్తూ సర్వీసంతా గడిపాడు. తను సాయం చెయ్యకపోతే శీనుని ఆయనకి ప్రతిబింబంలా తయారు చేస్తాడు. శీను భవిష్యత్తు బాగుచేసే మంత్రదండం తన దగ్గరుంది. లేకపోతే?
“ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకు బావా! మీకూ ప్రమోషన్సవీ ఉంటాయి కదా, ఏ టెస్టులూ రాయకుండా ఉండిపోయావెందుకని?”
ఆయన చిన్నగా నవ్వి,“”అనుకోవడానికేం లేదు. ఆర్నెల్లు గడిచాకైతే పూర్తిగా జవాబు చెప్పగలుగుతాను”” అన్నాడు.
రామ్మోహన్ తర్కించలేదు. ఏదో ఒకటి చెప్పేసి ఊరుకోకుండా ఎప్పుడో చెప్తానని ఎందుకన్నాడో అప్పటికప్పుడు అర్ధం కాకపోయినా త్వరలోనే తెలిసింది. ఈలోపు అనేక మార్పులు.

హిమజ కొత్తకారు కొని ఫ్రెండ్సందరికీ పార్టీ ఇచ్చింది. ఆ పార్టీలో రామ్మోహన్ తనతో ముభావంగా ఉండడాన్ని గుర్తించింది. పంతం నెగ్గించుకున్నందుకు కోపం వచ్చిందేమోననుకుందిగానీ అది విముఖత అని అర్ధమై చిన్న జెర్క్…
అప్పుడు చెప్పాడు రామ్మోహన్ తను శీనుకి ఫీజులు కట్టి చదివిస్తున్న సంగతి. ఈ రెండురకాల ఖర్చులకీ మధ్యవున్న తేడా అర్థమైంది ఆమెకి. ఉన్న కారు అమ్మేసి ఒక బ్రోకరుకీ, కొత్తకారు కొని ఓ కార్ల కంపెనీకీ ఆమె లాభం చేకూర్చితే, అతను తనింట్లో మనిషికి లాభం చేసాడు. ఆ మనిషి కుటుంబం మొత్తం లాభపడుతుంది. ఆమె ఆలోచనలో పడింది.
ఈమధ్య తను డబ్బు విపరీతంగా ఖర్చు పెడుతోంది. ఏవేవో కొంటోంది. ఖర్చు పెట్టడంలోనూ, కోరినదల్లా కొనుక్కోవడంలోనూగల థ్రిల్‍ని
పొందుతోంది. కానీ అతనితో దాన్ని పంచుకోలేకపోతోంది. అంటే? తామిద్దరి దృక్పథాలూ వేరయ్యాయా?
ఇంకా లోతుగా ఆలోచించడానికి భయం వేసింది. తను చేస్తున్న ఖర్చులగురించి తనకే ఓ అవగాహన లేదు. పగలూ రాత్రీ కష్టపడి అతను సంపాదిస్తుంటే తను పోటీగా ఖర్చు పెట్తోంది. తప్పుగా అనిపించింది.

రామ్మోహన్ బావ చేస్తున్న పీయస్‍యూని ప్రైవేటైజ్ చేసారు. యాభై దాటినవాళ్ళందర్నీ రిటైర్ చెయ్యబోతున్నట్టు పేపర్లో వచ్చింది. రిటైరవ్వబోతున్నవారిలో ఆయనకూడా ఉన్నాడు. ఆరోజుని తనంతట తనే ఫోన్ చేసి మాట్లాడాడాయన.
“నేను చదువుకున్న మెకాలే విద్యావిధానం నన్నొక క్లర్కుగా మాత్రమే మలచగలిగింది. ఆ పైన నేను పైకెదగాలంటే నాలుగు అంశాలు దోహదం చెయ్యాల్సి ఉంది- ఆసక్తి, ప్రోత్సాహం, అవకాశం, డబ్బు. నాకు చదవాలనే కోరిక వున్నా డబ్బులేక చదువుకోలేకపోయాను. ఉద్యోగం వచ్చాక కూడా బాధ్యతలు”
ఇవేవీ రామ్మోహన్‍కి తెలియనివి కాదు. వీటన్నిటిగురించీ ఎంతో తర్జనభర్జన పడ్డాకే, గవర్నమెంట్ వుద్యోగం అని సమాధానపడి అక్కని ఇచ్చారు.
“ఐనా నాలో ఆసక్తి చావలేదు. డిపార్టుమెంటు పరీక్షలు రాయాలనుకున్నాను. ఇంతలో నా చుట్టూ ఉన్న మనుషుల్లో మార్పు . సామర్థ్యం లేనంతమాత్రాన అలాగే వుండిపోవాలా అని ప్రశ్నించుకున్నారు. ఏదో ఒక దారిలో పైకి రావాలనుకుని పదేళ్ళకీ ఇరవయ్యేళ్ళకీ ఒక్కొక్క ప్రమోషన్ సాధించుకుని తెచ్చుకున్నారు. పెద్దగా పనిరానివాళ్ళూ, చేసే పనిపట్ల నిబద్ధత లేనివాళ్ళూ ఎన్నో కారణాలవల్ల అధికారులయారు. వాళ్లు తీసుకున్న నిర్ణయాలు సంస్థని ఈ పరిస్థితికి తెచ్చాయి””
ఆయన చెప్పిన మార్పులు రామ్మోహన్‍కి తెలియవు. అవి రాకముందే అతను ప్రైవేట్ రంగంలోకి వచ్చేసాడు. ఒకప్పుడు తను నడిచినదారి ఇప్పుడు ముళ్ళదారిగా మారిందంటే అతనికి నిశ్చేష్ఠత కలిగింది.
“చదువుకుని ఉద్యోగం చెయ్యడం ఒక్కటే మనిషికి మనుగడ అనే గందరగోళంలో ఉండడంచేత ఏర్పడిన సమస్య ఇదంతా. ఉద్యోగం భుక్తిని ఇవ్వటమే కాక వుద్యోగిలో వున్న నైపుణ్యాలని వుపయోగించుకోవాలి. అప్పుడు సంస్థతోపాటుగా వుద్యోగికూడా బాగుపడతాడు. ఇష్టంగా చేసే పనిలో సంతృప్తి దొరుకుతుంది. జీవనసాఫల్యం కనిపిస్తుంది. కానీ మన మనోభావాలు ఎవరికి కావాలి? మారుతున్న అవసరాలతో మారకుండా మూసపని చేసి ఈ స్థితికి వచ్చాం”
“మరిప్పుడేం చేద్దామనుకుంటున్నావు బావా?” “ఆందోళనగా అడిగాడు రామ్మోహన్
“ఏడు లక్షలు వస్తుందనుకుంటాను. పెన్షను వుండదు. కానీ దాంతో ఏమౌతుంది? ఇద్దరుఆడపిల్లలు. వాళ్ళ చదువులు, పెళ్లిళ్ళు జరగాలి. ఇల్లు గడవాలి. మాకు ముందు జీవితం వెళ్ళాలి. తలుచుకుంటే అంతా అగమ్య గోచరంగా ఉంది. ఎవరో ఒకరి దగ్గర లక్షలుంటే వాటికి విలువుంటుంది. ఈరోజుని అందరి దగ్గరా లక్షలున్నాయి. ఈ ప్రభంజనంలో నేనెక్కడికి కొట్టుకుపోతానో తెలీడంలేదు””
“ఇప్పుడేం చేద్దామని?””
“మా ఊరెళ్ళిపోతాను. రెండెకరాలు పొలం వుందిగా, ఇంకొంత కౌలుకి తీసుకుని చేస్తాను. ఈ సిటీలో బజార్లో నిలబడడితే డబ్బు అవసరంగానీ అక్కడంతగా ఉండకపోవచ్చు”“
“వ్యవసాయం…. ఈ వయసులోనా?””
“చిన్నప్పుడు అరకపట్టినవాడినేగా, ఆ అనుభవం ఇప్పుడిలా ఉపయోగపడుతుంది. మరో దారి లేదు”“
కొద్దిసేపు ఇద్దరిమధ్యా నిశబ్దం చోటుచేసుకుంది. ఎస్టీడిలో మాట్లాడుకుంటున్నామన్న స్పృహ కూడా లేకుండా అలాగే ఉండిపోయారు. మైక్రోసాఫ్ట్ సంస్థ విడిపోవటం, ఐటీ వేల్యూ తగ్గటం…. నాస్ డాక్ కుప్పకూలటం…. ఎన్రాన్ లాంటి కంపెనీలు మూతపడటం….. సెప్టెంబరు పదకొండునాటి డబ్ల్యూటిసీ మీద దాడులు….. అమెరికానుంచీ ఐటీ ప్రొఫెషనల్స్ తిరిగిరావటం… అన్నీ మదిలో కదిలాయి రామ్మోహన్‍కి.
వ్యవస్థలో ఏవో మార్పులొస్తున్నాయి. బావా! ఈ మార్పులన్నీ చీకట్లో పూసిన పూలు. వెలుతురొచ్చేదాకా ఉండవు. రాలిపోతాయి. తాత్కాలికమైనవి. శతాబ్దాల పరాయిపాలన అనే చీకట్లోంచి వెలుతుర్లోకి అడుగు పెట్టే సంధి దశలో ఉన్నాము. వెలుతురొచ్చేదాకా వెతుకులాట తప్పదు” గుండెల్లో ఏదో భయం లీలగా కదుల్తుంటే అన్నాడు.
“రామ్మోహన్, వడ్డుని ఉన్నవాడివి, నీ గొంతులో విచారం ఉందేమిటి?” “అతని బావ దాన్ని గుర్తించి ఆశ్చర్యంగా అడిగాడు.
“ఒడ్డున ఉన్నా వరద భయం ఎక్కడికి పోతుంది? ఈ వినిమయ సంస్కృతి ఎప్పుడు నన్ను ముంచెత్తుతుందోనని భయంగా ఉంది. ప్రపంచంలో నేను, నువ్వు అనే ఇద్దరు వ్యక్తులున్నప్పుడే నీకు లేనిదీ నాకున్నదీ అర్థమయ్యేది. దురదృష్టవశాత్తూ ఇప్పుడు మనం నిర్మించుకుంటున్న వ్యక్తిగత ప్రపంచంలోకి “నువ్వు” అనే వ్యక్తికి ప్రవేశం ఉండట్లేదు. అందుకే ఎంతున్నా ఏమీ లేనట్టే ఉంటోంది””
“నువ్వు మరీ సినిగ్గా ఆలోచిస్తున్నావేమోరా!””
“లేదు బావా! భార్యాభర్తల మధ్య కూడా దూరాన్ని నిర్దేశిస్తున్న ఈ కృత్రిమ లేమి నన్ను చాలా బాధ పెడుతోంది” అని, “”ఉంటాను బావా!”” అంటూ ఫోన్ పెట్టేసి తల తిప్పేసరికి గుమ్మంలో నిలబడి ఉంది హిమజ. ఆమె కళ్ళనిండా నీళ్ళు.
“మీరింతగా బాధపడుతున్నారని నేనెప్పుడూ అనుకోలేదు. పైసా పైసా లెక్క చూసుకుంటూ గడిపి, ఒక్కసారి ఇంత డబ్బులోకి వచ్చిపడేసరికి కళ్ళు మిరుమిట్లు గొలిపినట్లైంది”” అంది.
నిజమే! ఆమెకూడా తనకేం కావాలో తెలీక చీకట్లో వెతుకులాడుతునే ఉంది. ఆ వెతుకులాడే ప్రక్రియలోనే ఇద్దరూ దూరం జరిగి మళ్ళీ దగ్గరయ్యారు. రామ్మోహన్‍కి గుండెలమీంచీ పెద్ద బరువేదో దిగిపోయినట్లైంది.

ఆరోజు రామ్మోహన్‍కి పోస్టులో పెద్ద ఉత్తరం వచ్చింది. అది శీను దగ్గర్నుంచీ.
కుశల సమాచారాలు, కృతజ్ఞతా నివేదనలు అయ్యాక అతను ప్రకటించిన భావాలు తొలివెలుగు కిరణాల్లా అనిపించాయి. తన ఆలోచనలకి సానుకూలమైన కొనసాగింపులా అనిపించాయి.
“నాన్న తన జాబ్ పోతోందని బాధపడ్తున్నాడు. కానీ వ్యక్తిగా ఎదగటానికి ఇదొక అవకాశమని గుర్తించడంలేదు. పొలాన్ని తన ప్రయోగశాలగా మార్చుకోవచ్చు. నిర్మొహమాటంగా మాట్లాడుకుంటే మామా, ఈ దేశం బరువుమోసేదీ, దాన్ని అభ్యుదయపథంలోకి నడిపించేది ఎవరో కొద్దిమంది మేధావులు. నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకునేదీ వాళ్ళే. మనకి ఎన్ని ఆలోచనలున్నా వాటినెవరూ వినరు, పట్టించుకోరు. వాళ్ళకోసం కొన్ని లక్షలమంది గుమాస్తాలు తమ మేధస్సు నాలుగు గోడల మధ్య, ఆఫీసు టేబుళ్ళముందు ఫైళ్ళ గుట్టలకింద సమాధైపోయి ఉన్నారు. వీళ్ళెవరికీ అంత పెద్ద నిర్ణయాలతో సంబంధం వుండదు. ప్రభావితం చెయ్యలేరు. వృత్తికీ ప్రవృత్తికీ పొంతనలేని మూస జీవితంలో ఇరుక్కుపోయి, కావలిసినదానికీ దొరికినదానికీ పొంతన కుదరక, బతుకుతున్నారు. మీరు కంప్యూటరీకరణ అంటున్నారుగానీ అది మానవీకరణ కాదూ? ఈ మూసబొమ్మలందరికీ విముక్తి దొరకుతుంది. వాళ్ళు చేసే పని కంప్యూటర్లు చేస్తాయి. పదిమందికి బదులుగా ఒక కంప్యూటరు. వందల కంప్యూటర్లని అనుసంధానించుకుని కొద్దిమంది నిపుణులు. ఈ విముక్తి పొందినవారంతా తమ ప్రవృత్తి అనుసరించి ఎథ్లెట్స్‌గా, సృజనకారులుగా, చైతన్యవంతులుగా ఎదుగుతారు. మా నాన్న మనసారా నవ్వి, విసుక్కోకుండా పని చేసి ఎంతకాలం అయిందో తెలుసా? ఆయన నవ్వులో ఎప్పుడూ ఏదో వెల్తి. ఇప్పుడు ఇంక సమాజం మానవీకరణవైపు దూసుకెళ్తోందికదా, మామా! అప్పుడు దేశం ఎంత అందంగా వుంటుందో!”
వుత్తరం చదివాక రామ్మోహన్ గుండెలనిండా ఆనందం నిండింది.
కొడుకు అత్యుత్సాహాన్ని గురించి రామ్మోహన్ బావ అన్నాడు, “వడ్డున నిలబడి మామ మాట్లాడుతున్నాడు. మునకయీతేనా వెయ్యకుండా నువ్వు కలలు కంటున్నావు. నడిమధ్యని మునగానాం తేలానాంగా నేను వున్నాను. నువ్వు అంటున్న మానవీకరణ జరిగి మనుషులంతా విముక్తులయాకకూడా వారికి తిండి తినాల్సిన అవసరం వుంటుంది. దానికోసం పెద్ద పోరాటం జరుగుతుంది. ఒక అవ్యవస్థ మొదలౌతుంది. దానికి మొదలు మామ చెప్పిన చీకటిపూలు. అవి విరిసి, రాలి, వేకువ వచ్చి వ్యవస్థగా స్థిరపడేసరికి మరో మార్పు సిద్ధంగా వుంటుంది. ఏ సిస్టంలోనేనా మారనిది ఆకలికోసం, వునికికోసం జరిగే పోరాటం మాత్రమే. అది అప్పుడు ఎవరికి వారు చెయ్యాల్సి వుంటుంది” “
ఆ మాటలు ఆ పిల్లవాడికి అనుభవంలోకి రావటానికి తండ్రి వుద్యోగం పోయాక ఎంతోకాలం పట్టలేదు.