అమ్మ దయ ఉంటే… by Savitri Ramanarao

  1. నీల by Nandu Kusinerla
  2. ఫ్రిజ్ లోకి ఏం వండనూ!!! by Savitri Ramanarao
  3. ఆధునిక కవితోపాఖ్యానం by Savitri Ramanarao
  4. దానం కొద్దీ…! by Nandu Kusinerla
  5. కర్మణ్యేవాధికారస్తే!!!… by Savitri Ramanarao
  6. బలిపశువు by Pathy Muralidhara Sharma
  7. వైద్యంలో వేద్యం by Savitri Ramanarao
  8. నేనూ మనిషినే by Pathy Muralidhara Sharma
  9. చిన్న కుటుంబ చిత్రం by Savitri Ramanarao
  10. ఒక్క క్షణం by Pathy Muralidhara Sharma
  11. ఎందుకు రాదూ!! By Savitri Ramanarao
  12. యద్భావం తద్భవతి by Pathy Muralidhara Sharma
  13. అలా అర్థమైందా? by Pathy Muralidhara Sharma
  14. మనసు మూయకు!!! by Savitri Ramanarao
  15. ఎవరికెవరు ఏమవుతారో! by Pathy Muralidhara Sharma
  16. కాస్త సహనం వహిస్తే by Savitri Ramanarao
  17. అమ్మ దయ ఉంటే… by Savitri Ramanarao
  18. మై హుం నా బెహన్! by Savitri Ramanarao

సౌందర్యలహరిలో తొంభైతొమ్మిదో శ్లోకం పాడుకోవటం పూర్తి చేసిన శారద …
“హే అమ్మామ్మా !!సక్సెస్!!!..” అని అరుస్తూ వచ్చి చుట్టేసిన కల్యాణ్‍‍తో
“అమ్మ దయ ఉంటే విజయం కాక మరేమిటి. నాకు తెలుసు ఆ శ్రీమాత దయవల్ల నువు సాధిస్తావని. ఇంతకూ సంగతి ఏమిటో చెప్పు. అయినా ఇలా అయినదానికీ, కానిదానికీ వచ్చి వాటేసుకుని నా పారాయణ పూర్తి కానియ్యవు. అందికే ఏకాసనస్థిత పారాయణాలూ, మడులూ, తడులూలాటి నియమాలు పెట్టుకోలేదు నేను. అయినా మరీ రాత్రి పడుకున్న బట్టలతో అంటుకుంటే ఎలారా నాన్నా? ఎప్పటికి నేర్చుకుంటావో తీరుతెన్నూ నువ్వు… సరే పద. మళ్ళీ తరవాత స్నానం చేసి ఈరోజు 10 శ్లోకాలు చదువుకుంటాలే” అంటున్న అమ్మమ్మ తో …
“అబ్బ! చెప్పావుగా …ఏది ముట్టుకున్నా
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోsపి వా
య:స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః
అనే శ్లోకం చదివి మూడుసార్లు పుండరీకాక్ష పునాతు అనుకుంటే లోపల, బయట శుభ్ర పడతామని. ఇప్పుడా పని చేసేయ్ నేను వెళ్ళాక. అయినా నా చిన్నప్పటినుండీ చూస్తున్నా, రోజూ చదువుతున్నావు సౌందర్యలహరి శ్లోకాలు. దానికి మళ్ళీ పారాయణమనో, పండగనో ఎక్స్ట్రా కలరింగెందుకు చెప్పు. అదేమయినా కొత్త విషయమా? ఈరోజు నేను ఏం సాధించానో తెలిస్తే నీ కళ్ళు తిరిగిపోతాయి తెలుసా!! చెబుదామని వస్తే ముట్టుకున్నాను అని నస పెడుతున్నావు. నీకేం చెప్పను పో! ” అని అలక ప్రదర్శించిన కల్యాణ్‍తో
“సరే లే బాబూ! తప్పయిపోయింది. ఇక అలక మాని సంగతి ఏమిటో చెప్పు. అయినా సమయం, సందర్భం వచ్చినప్పుడే మంచీ, చెడూ చెబుతూ ఉంటే రేపు నేనున్నా, లేకపోయినా ఏదోనాటికి నా మాటలు నీ తలకెక్కుతాయని నా ఆశ ” అంటూ మనవడిని బుజ్జగించి లాలనగా అడిగింది.
“అలా రా దారికి. ముందు నాలో ఉన్న అమ్మవారికి వేడి కాఫీ ఇయ్యి. తాగుతూ చెబుతాను” కొంటెగా అంటూ డైనింగ్‍టేబుల్ దగ్గరికి నడిచాడు కల్యాణ్.
“చాల్లే భడవా! నీ వేళాకోళాలు. అమ్మవారి విషయంలో ఎలా పడితే అలా మాట్లాడకూడదు”అని మందలించి కిచెన్‍లోకి వెళ్ళి వేడి ఫిల్టర్ కాఫీ కప్పులు రెండు తెచ్చి కల్యాణ్‍కొకటిచ్చి తనోటి సిప్ చేస్తూ చెప్పమన్నట్లు చూసింది.
” అంతటా వుండేది అమ్మే అని అస్తమానూ అంటావుగా మరి, నాలో అమ్మవారికి కాఫీ ఇయ్యి అంటే అమ్మవారి విషయంలో వేళాకోళం ఆడకు అంటావేమిటి. నువ్వన్నదే నేను అన్నాను” అన్న కల్యాణ్‍తో
“అబ్బ నీతో వేగలేక పోతున్నాను. అన్నిటికీ వ్యాఖ్యానాలే. అసలు విషయం చెప్పకుండా ఆటలాడుకుంటూ అల్లరిచేస్తే నేను వెళిపోతాను.
నాకవతల బోల్డు పని ఉంది” అంది కాస్త అసహనంగా శారద.
ఆమె గొంతులో మార్పు గమనించి వాతావరణం తేలిక చేయాల్సిన అవసరం గుర్తించి, “నీ మనవడు అంతర్జాలంలో ఓ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ధార్మిక సంస్థ నిర్వహించిన వ్యాసరచన పోటీకి పంపిన వ్యాసానికి ప్రధమ బహుమతి వచ్చింది. దానికి యుఎస్ డాలర్లు వెయ్యి, ఒక సర్టిఫికెట్ ఇస్తారు. అంటే భారత కరెన్సీలో సుమారు డెబ్భయ్‍వేలు పైనే. హే!హే! ఇది నా తొలి సంపాదన. నామీద విసుగు చూపిస్తున్నావుగానీ, ఇది ఎంత సంతోషించాల్సిన విషయం? నీకేమీ తెలియదు అసలు” అన్నాడు బీటెక్ సెకండ్ ఇయర్ మెకానికల్ చదువుతున్న కల్యాణ్ శారద అసహనానికి నొచ్చుకున్నట్లు మొహంపెట్టి.
అదేం గమనించనట్లు శారద, “నా బాబే. ఎంత మంచిమాట చెప్పావురా! ఆ తల్లి కృపాకటాక్షం ఇదంతా. నీకు డబ్బు చేతిలో పడగానే కొంత గాయత్రీ మాత ఆలయంలో వెయ్యి. ముందు వెళ్ళి శాస్త్రి బాబాయ్ ఆశీర్వాదం తీసుకో. ఇంతకీ దేనిమీద రాసావు వ్యాసం, చెప్పు” అంది ఆనందం, కుతూహలం నిండిన స్వరంతో.
“ఆధునిక శాస్త్రవిజ్ఞానం సనాతన ధర్మవిరుద్ధమా అన్న అంశం. ఈ వ్యాసం రాయటానికి శాస్త్రి బాబాయ్ చాలా సాయం చేశారు. ఆయనకి చెబుతాను తప్పక. సంతోషిస్తారు” అంటూ కాఫీ కప్పు కడిగి బోర్లించి స్నానానికి వెళ్ళాడు.
శారద ఏదయినా క్షమిస్తుంది కానీ తిన్న కంచాలు, ఎంగిలి కప్పులు వంట గది సింక్‍లో పడేసినా, డైనింగ్‍టేబుల్‍మీద వదిలేసినా, ఇల్లు రిమ్మినా, తీసిన వస్తువు తీసినచోట పెట్టకపోయినా తోలుతీస్తుంది. అందుకే ఎంత ఆకతాయితనం వున్నా శారదకి కోపం కలిగించే విషయాలపట్ల కాస్త జాగర్తగా ఉంటాడు కల్యాణ్.

కల్యాణ్ శారద ఒక్కగా నొక్క కూతురు కొడుకు. ఓ స్కూటర్ ఆక్సిడెంట్‍లో తలితండ్రులిద్దరూ పోతే మూడేళ్ళ కల్యాణ్‍ని తీసుకుని శారదా, ఆమె భర్తా పుట్టెడు దుఃఖంతో విశాఖపట్నంలో తమ ఇల్లు చేరారు. లారీ గుద్దేయటంవలన ఆక్సిడెంట్ అయింది కాబట్టి కొంత నష్టపరిహారం ఇచ్చారు. అది కాక అల్లుడు చేస్తున్న ప్రైవేట్ కంపెనీ అతనికి రావలసిన పీఎఫ్, ఇన్సూరెన్స్ సొమ్ము ఇచ్చేరు. అల్లుడి తల్లి అదంతా మనవడి పేరుమీద ఎఫ్‍డీ వేసి దానిమీద వచ్చే వడ్డీ పిల్లడి పోషణకు వాడుకోమని చెప్పి , తన ఇల్లు అద్దెకిచ్చేసి ఏలూరులో
వుండే కూతురు దగ్గరికి వెళిపోయింది. ఆవిడకి ఫామిలీ పెన్షన్ వస్తుంది. అప్పుడప్పుడు ఫోన్ చేసి మనవడితో మాట్లాడుతుంది. కల్యాణ్‍కి తన అమ్మమ్మతో, శాస్త్రి కుటుంబంతో తప్ప తండ్రివంకవారితో సాన్నిహిత్యం ఏర్పడలేదు.
కల్యాణ్ ఇంటర్లో ఉండగా శారద భర్త కాలం చేసాడు. ప్రైమరీ స్కూల్ టీచర్‍గా చేసి రిటైర్ అయిన భర్త పోయాక శారదకి ఫామిలీ పెన్షన్ వస్తోంది. ఎంవీపీ కోలనీలో తమ గ్రామంలో తమ వాటాకొచ్చిన పాత ఇల్లు ,రెండెకరాల పొలం అమ్మి భర్త కట్టిన రెండుపోర్షన్ల ఇంట్లో ఒకదాంట్లో శారద కుటుంబం వుంటూ రెండోది శాస్త్రి కుటుంబానికి చాలా తక్కువ అద్దెకి ఇచ్చారు.
శారద భర్తా, శాస్త్రి ప్రాణస్నేహితులు. వారి మధ్య చాలా ప్రగాఢమైన అనుబంధం. ఒకే స్కూల్లో చదువు కున్నారు. తండ్రి పోవటంతో,శాస్త్రి టెన్త్‌క్లాస్‍తో చదువు మానేసి వాళ్ళ తండ్రి వారసత్వంగా వచ్చిన అర్చకవృత్తి చేపట్టాడు. దానితోనే పడుతూ లేస్తూ ఇద్దరు అప్పచెల్లెళ్ళ పెళ్ళి చేసి తాను అదే గ్రామంలో మరో గుడిపూజారి కూతురుని పెళ్ళి చేసుకున్నాడు. శాస్త్రికి పిల్లలు లేరు.
ఇంతలో అతను అర్చకత్వం చేస్తున్న గుడి ధర్మకర్తలు విశాఖ ఎంవీపీ కాలనీలో గుడి కట్టించటం, శాస్త్రిని ఆ గుడి చూసుకోమని కోరడంతో గ్రామంలో గుడి వేరొకరి కి అప్పచెప్పి విశాఖ వచ్చేసి తన బాల్యమిత్రుడి ఇంట్లో పోర్షన్లో దిగిపోయాడు. అప్పటినుండీ ఇద్దరూ ఒకే కుటుంబంలా కలిసిపోయి కష్టం, సుఖం పంచుకుంటూ వుంటున్నారు.
శాస్త్రి, శారద భర్తా గుడిలో ధార్మికకార్యక్రమాలు నిర్వహిస్తారు. దానితోపాటు శారద భర్త రిటైర్ అయిపోయాక మరో ధార్మికసంస్థ సహకారంతో గుడిలోనే బీదపిల్లలకి ఆసక్తి ఉన్నవారికి వేదపరమైన అంశాలు, పురాణాలు, సనాతనధర్మం గురించి ఇవన్నీ నేర్పించేవారు.
కల్యాణ్‍కూడా అక్కడికి వెళ్ళి పిల్లలతో కలిసి ఎన్నో నేర్చుకునేవాడు. శారద లలితా ఉపాసనపరురాలు. నోరిప్పితే “అమ్మ దయ” తప్ప మరోమాట అనదు.
ఆ వాతావరణంలో కల్యాణ్‍కు సనాతనధర్మం, ఆర్షసంస్కృతిపట్ల సదభిప్రాయం, ఆధ్యాత్మికవిషయాలపట్ల కొంత అవగాహన ఏర్పడ్డాయి.
తగ్గట్లే కళ్యాణ్ సత్యసాయి స్కూల్లో చేర్చారు. అక్కడే చదువుకున్నాడు టెన్త్‌క్లాస్‍వరకూ. తరవాత ఇంటర్ చైతన్య. ఇప్పుడు బీటెక్ ఐఐటీ కాన్పూర్‍లో చేరాడు. అందువల్ల బాల్యంలో పడిన సనాతన ధర్మభావాలు కళ్యాణ్‍లో బలంగా నాటుకుపోయాయి. అయినా ఇంకా కొంచెం చిలిపితనం పోలేదు. అమ్మమ్మ దగ్గర అల్లరి చేస్తూ అక్షింతలు వేయించుకుంటుంటాడు.
ఎదుగుతున్నకొద్దీ సహజంగా తెలివైనవాడు, సైన్సు స్టూడెంట్‍కూడా కావటం వలన సైన్స్‌కి సనాతనధర్మములో భావాలకు సమన్వయం సాధ్యమా అనే సందేహం అడుగడుగునా కలగేది. తన తాతయ్యను ,అమ్మమ్మను ఎన్నో ప్రశ్నలు వేసేవాడు. అవకాశం ఉన్న ప్రతిమార్గంలో అన్వేషించేవాడు. అతని జిజ్ఞాస చూసి ముచ్చటపడి శాస్త్రి గుడికి వచ్చే గురువుల దగ్గరికి తీసుకువెళ్ళి కల్యాణ్ సందేహాలు నివృత్తి చేయించేవాడు.
ఇక బీటెక్‍లో చేరాక చక్కని లైబ్రరీ, ఇంటర్నెట్ సౌకర్యం, క్యాంపస్ వాతావరణం కళ్యాణ్ అవగాహనాపరిధిని విస్తృత పరిచాయి. కొత్త ఆలోచనలు రూపు దిద్దుకున్నాయి. శోధనకు, సాధనకు అనువైన నవ్యమార్గాలు ఎన్నో తెలిసాయి.
ఇంతలో కరోనా కారణంగా ఇల్లు చేరటంతో కళ్యాణ్ తన చదువుతోపాటు అదనంగా దొరికిన ఖాళీ టైంలో మరింతగా తన ఆసక్తి ఉన్న అంశాలపై అధ్యయనం కొనసాగించాడు. అందులో భాగంగా అతని వెతుకులాటకి తగిలింది ఈ ఆన్‍లైన్ వ్యాసరచన పోటీ. అందులో పాల్గొనటం, బహుమతి గెలుచుకోవటం జరిగింది.


శాస్త్రి దగ్గరికి వచ్చి కళ్యాణ్ తనకి బహుమతి రావటం గూర్చి చెప్పి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆరోజు గుడిలో ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సనాతనధర్మ వైశిష్యముమీద ప్రవచనం ఇవ్వటంకోసం వచ్చి వున్నారు. శాస్త్రి కల్యాణ్‍ని ఆయనకి పరిచయం చేసి మాట్లాడుతూ ఉండమని చెప్పి వేరే పనిపడి వెళ్ళాడు.
ఆయన కళ్యాణ్‍ని ఆశీర్వదించి కళ్యాణ్ గురించి అడిగి అన్ని విషయాలు తెలుసుకున్నారు. ప్రవచనం తరవాత కూడా కల్యాణ్ ఆయనతో కలిసి ఆయన రూమ్‍కి వెళ్ళాడు. వారితో ఉండి వారి రాత్రి ఫలహారం అయాకకూడా వారితో చర్చించి సందేహనివృత్తి చేసుకునే కల్యాణ్ జిజ్ఞాసని చూసి, అతని వ్యక్తీకరణలవల్ల అతని అవగాహనాస్థాయిమీద నమ్మకం కలిగి సరళమైన భాషలో సులభంగా అర్ధమయేలాగ
విద్యార్థులకు సనాతనధర్మాన్ని, విజ్ఞానాన్ని సమన్వయం చేస్తూ వీక్లీ ఆన్‍లైన్ లెక్చర్లు ఇయ్యమని అడిగారు. దానికి క్లాస్‍కింత అని ఇస్తామని చెప్పారు. ఇస్తానని ఒప్పుకుని వారి దగ్గర సెలవు తీసుకుని వస్తున్నపుడు ఆనందంతో కల్యాణ్‍కి తను మేఘాల్లో తేలిపోతున్నట్లు అనిపించింది. తను సంపాదనాపరుడవుతున్నాడంటే ఒకింత గర్వంగా కూడా అనిపించింది. వచ్చే డబ్బుతో ఏమి చెయ్యాలి అనేది అర్ధం కాని అయోమయం ఆవరించింది. నాకీ డబ్బుతో పనేమి ఉంది, అన్నిటికీ అమ్మమ్మ ఇస్తుంది. చదువుకు కూడా స్కాలర్‍షిప్ వస్తుంది. రూపాయి కట్టక్కర లేదు. మెరిటోరియోస్ స్టూడెంట్స్ లిస్ట్‌లో ఎప్పుడూ ఉంటే మనం ఖర్చు పెట్టాల్సింది పెద్దగా ఉండదు కదా!” అనుకుంటూ పరిపరివిధాల ఆలోచిస్తూ ఇల్లు చేరేసరికి తెల్లారుఝామున నాలుగుగంటలయింది.

మర్నాడు ఉదయం ఎప్పటిలా శారద దేముడి స్తోత్రాలు పాడుతూ ఉంటే “అమ్మామ్మా కాఫీ ఇయ్యి!” అని వచ్చాడు కళ్యాణ్.
“ఏరా, ఈరోజు పొద్దున్నే లేచి పోయావ్? స్నానం కూడా చేసేసినట్లున్నావ్. ఏమిటి విశేషం? ఒక్క ప్రైజ్ వచ్చేసరికి నీలో ఇంత మార్పా? ఇంజినీరింగ్ చదువు‍కి వెళ్ళాక నీ అలవాట్లు మారిపోయాయని బెంగపడ్డాను. ఇవాళ నువ్విలా పొద్దున్నే లేచిపోయి స్నానం చేసేసి నా బెంగ తీరిపోయింది” అని నవ్వుతూ కాఫీ కప్పు చేతికిచ్చి,
“రాత్రి వేళ దాటిపోయి నిద్దరపట్టలేదు అమ్మమ్మా !” అన్న కల్యాణ్ మాటలు పూర్తిగా వినకుండానే,
“ఆహఁ !” అన్నట్లు తలాడిస్తూ తనకెంతో ఇష్టమైన సౌందర్యలహరిలో ఫలశృతిగా తాను భావించే శ్లోకం అందుకుంది.
సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో
రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా
చిరం జీవన్నేవ క్షపిత పశు పాశవ్యతికరః
పరానందభిఖ్యం రసయతి రసం త్వద్భ జనవాన్
కాఫీ సిప్ చేస్తూ మౌనంగా శ్రావ్యమైన గొంతుతో రాగయుక్తంగా పడుతున్న ఆ శ్లోకం వింటుంటే మనసును కప్పేసిన పొరలు ఒకొటొకటిగా తొలగిపోతున్న భావం కలిగింది. తన కర్తవ్యమేమిటో అర్ధం అవుతున్నట్లుగా తోచింది కల్యాణ్‍కి.
నిదానంగా కాఫీ కప్పు టేబుల్‍మీద పెడుతూ, “అమ్మామ్మా! నేనేమి చెయ్యాలో నాకు ఇప్పుడే అర్ధం అయింది” అన్నాడు దృఢనిశ్చయం ధ్వనిస్తున్న గొంతుతో.
ఆ గొంతులో గాంభీర్యానికి ఒకింత చకితురాలయి కళ్యాణ్‍వంక చూస్తూ బయట కనబరిచే పరిణితి ఇంట్లో తన దగ్గర చూపడు. బొత్తిగా చిన్నపిల్లడిలా ప్రవర్తిస్తాడు. అలాటిది ఇలా సీరియస్‍గా మాట్లాడటం శారదని విస్మయానికి గురిచేసింది.
“ఏ విషయంలోరా?” అడిగింది శారద.
ఇంతలో శాస్త్రి వచ్చాడు “వదినా! వీడు చెప్పాడా, నిన్న గుడిలో జరిగిన విషయం?” అంటూ.
“ఇంకా చెప్పలేదు బాబాయ్. సమయానికి మీరూ వచ్చారు. కూర్చోండి. మీ ఎదుటే అన్నీ చెప్పటం మరీ మంచిది కదా!” అని, ముందురోజు గుడిలో జరిగినది అంతా చెప్పి,
“అమ్మామ్మా! నువు ఇప్పుడు పాడిన శ్లోకం అర్థం నువ్వే నాకు గతంలో చెప్పావు. విన్నానుకానీ పెద్ద సీరియస్‍గా ఎప్పుడూ తీసుకోలేదు. నువు శ్రీవిద్య, ఆత్మవిద్య, అమ్మ అంటూ ఆ లలితానామాలు, శ్రీచక్రం, తల్లి కటాక్షం ఇవే మాట్లాడుతూ ఉండటం వల్లనేమో నాకు కాస్త ఆ అంశాలపట్ల శ్రద్ధ కలగటం జరిగింది. కానీ వాటిని పెద్దగా పట్టించుకోవటం, లోతుగా విశ్లేషించటంలాటివి చెయ్యలేదు. పైకెపుడూ అనకపోయినా అదంతా ఏదో నీ చాదస్తంధోరణిలాగే భావించాను. లాక్‍డౌన్‍లో నీతోనే ఉండటంవలన ఈ సౌందర్యలహరి శ్లోకాలు, పదేపదే వినటం జరిగింది. అవి నన్ను వాటిగురించి మరింత ఆలోచనకు పురికొల్పాయి. సరే, అవన్నీ ఇపుడు మాట్లాడలేను. తరవాత వివరంగా చెబుతా కానీ… ఇప్పుడు కాఫీ తాగుతూ నువు పాడుతున్న ఈ శ్లోకం వింటుంటే అడగకపోయినా ఇచ్చేది అమ్మ , అలాటిది నువు చేతులు జోడించి శ్రద్ధగా అడిగితే ఇవ్వదా అమ్మ, అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే అనే నీ మాటలు నా చెవుల్లో రింగు మంటూ ఉంటే…నిజమే అడగకుండా నే ఇచ్చింది అమ్మ అనిపించింది”
“…”
“అవును… అసలు నేను ఆ వ్యాసంకోసం ఏదో కాస్త శోధించాను. తోచింది రాసి పంపాను. నాకు అసలు ప్రైజ్ వస్తుందని ఊహించలేదు. వచ్చాకా తెగ సంతోషపడ్డాను. అది చెప్పటానికి బాబాయ్ దగ్గరికి వెళితే అదృష్టవశాత్తు అంత పెద్ద ఆశ్రమానికి చెందిన ఆధ్యాత్మక గురువుగారు, నాతో దాదాపు రెండుగంటలు ఎన్నో విషయాలు చర్చించి, లెక్చర్స్ ఇయ్యమనటం దానికి నాకు ‘పే చేస్తాను’ అనటం నాకో అద్భుతమైన అనుభూతి. ఉబ్బితబ్బిబయాను. సంపాదనపరుడు అవుతున్నాను అని గర్వపడ్డాను. ఆ డబ్బు ఏమి చేసుకో వాలో తెలియని అయోమయం. నాకే అర్ధం కానీ ఏదో ఉద్విగ్నత రాత్రంతా ఆవరించింది. దానివల్ల నాకు నిద్రకూడా సరిగా పట్టలేదు. ఇప్పుడీ శ్లోకం విన్నాక నా అయోమయం తొలగిపోయింది”
“…”
“ఆదిశంకరులు మనుషుల భావోద్వేగాలు ఎంత బాగా అర్థం చేసుకు మార్గాలు సూచిస్తారో కదా! వారి ‘భజ గోవిందం’ స్తోత్రం ఒక్కటి చాలు
మనిషి జీవితం లో డొల్ల తనం చెప్పటానికి. సరే లే, అసలు విషయానికి వస్తాను. అమ్మని సేవిస్తే సరస్వతీ, లక్ష్మీకటాక్షం కలుగుతుంది. అది ఎంతగా అంటే సాక్షాత్ వారి భర్తలైన బ్రహ్మ, విష్ణువుకు అసూయ కలిగేంత. అంటే వారికి కలిగిన జ్ఞానం, ధనంకన్నా కూడా శ్రద్ధతో అమ్మని సేవించేవాడికి జ్ఞానం, సంపదలు సిద్ధిస్తాయి. వారికి అందం, వర్చసు చేకూరి రతీదేవి కూడా ఎంత సుందరుడు ఇతడు అని అతనివైపు చూస్తుందట. దానివల్ల ఆమె పాతివ్రత్యభంగం అవుతుందట. అంటే మన్మధుని మించిన అందంతో తల్లి భక్తులు సుందరంగా వుంటారు.
జనాకర్షకులవుతారు. సరే ఇవన్నీ ఉన్నవాడికి ఆయువు లేకపోతే ఎలా? అందువల్ల ఆ తల్లి ఉపాసకులకు పూర్ణ ఆయురారోగ్యాలు అనుగ్రహిస్తుంది. తెలివి, అందం, ఆయుర్ధాయం, ధనం అన్నీ ఉన్నవారికి ఉండవలసిన అతి ముఖ్యమైన భావన సంతృప్తి. ఇంకా కావాలి అనే తాపత్రయం వదులుకోవాలి. వైరాగ్యభావం రావాలి అంటే సంసారమనే గుంజకి రాగమనే పాశంతో కట్టబడి ఉండే జీవుడే పశువు. ఆ పాశం తెంపుకుని ముక్తసంగుడు కావాలి. అంటే జీవసంబంధ విషయాలు అంటే సంసారలంపటం, అవిద్యకు దూరం కావాలి. అలాటి ముక్త సంగస్థితే మనిషిని జీవన్ముక్తుడిని చేస్తుంది”
“…”
“చింతకాయ పై పెచ్చు చింత గుల్లగా మారితే లోపల గుజ్జుతో అంటి ఉండదు కదా? అపుడే లోపల వగరు, పులుపు అన్నీ పోయి తీపిదనం వస్తుంది. అలాగే జీవన్ముక్తుడైనవాడికి అంతరంగంలో అరిషడ్వర్గములు నశించి, అవిద్య తొలగినపుడే ప్రేమ అనే మాధుర్యంతో నిండుతుంది. ఆ స్థితే పరానందం. అదే మోక్షం. అమ్మని అంటే ప్రకృతిని, ఆ శుద్ధచైతన్యాన్ని, ఆ విశ్వవ్యాపకత్వాన్ని, ఆ జగత్చోదకశక్తిని అకుంఠితదీక్షతో సేవిస్తే, అర్ధం చేసుకుని అనుసరిస్తే జన్మసాఫల్యం, మోక్షం సిద్ధిస్తుంది. ఆ పరానంద స్థితి ప్రాప్తిస్తుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేరా,
అని నువ్వు ఎన్నో సార్లు చెప్పావు అమ్మామ్మా. ఇలాటి మాటలు అప్పుడప్పుడు గుడి లో కూడా విన్నాను. కానీ అవేవీ ఎప్పుడూ నా వంటబట్టించుకోలేదు నేను. అయితే నిన్న నాకు సుమారు 70వేలు పైన ప్రైజ్ రావటం, రాత్రి గుడిలో గురువుగారి మాటలు, నా లెక్చర్స్‌కి డబ్బిస్తానని అంత పెద్ద ఆధ్యాత్మికవేత్త అనటం, ఆ డబ్బు ఏమి చేసుకోవాలా? అని నాలో కలిగిన ఉద్వేగం, అంతర్మధనం నేపధ్యంలో తరచి చూస్తే… నేను చేసిన అత్యల్పసాధన, శోధనలకు ఇంత కృపావర్షం కురిపించిన తల్లి, నాకు ఈ చిన్నవిజయం నీకు ఇచ్చిన ఈ సంపదపట్ల మోహం పెంచుకోకు. ముక్తసంగుడివి కమ్మని చెప్పినట్లు అనిపించింది. ఈ శ్లోక తాత్పర్యస్ఫురణతో నా మనసు నిమ్మళించి నా కర్తవ్యం ఏమిటో నాకు బోధ పడింది. నాకు నిర్దేశింపబడిన కార్యనిర్వహణకు సరికొత్త సౌందర్యభరితమార్గం, సుక్షేత్రం గోచరించాయి”
“…”
“బాబాయ్ నిన్న మనం మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చిన వేదపాఠశాలకి సంబంధించిన వ్యక్తులు అక్కడి బీదపిల్లలకి భోజన ఏర్పాట్లకి ఇబ్బందిగా ఉంది అని నీతో అంటే నువు రేపు ఆలోచిద్దాం దీని గురించి. ఇప్పుడు బిజీగా వున్నాను, అందాకా ఈ రెండువేలు పట్టుకు వెళ్ళి వాళ్ళ భోజనాల సంగతి చూడు అని పంపేసావు. ఈరోజు వాళ్ళు వస్తే వాళ్ళకి నాదగ్గర నేను దాచుకున్నవి ఎనిమిదివేలు ఉన్నాయి. లాక్‍డౌన్ కదా. ఇంట్లోనే ఉండటంవలన ఏమీ ఖర్చు అవలేదు. అవి యిస్తాను. వాళ్ళకి ఇయ్యి. అమ్మామ్మా! నా ప్రైజ్‍మనీ నేను ఆ పాఠశాలకిచ్చేస్తాను. నా లెక్చర్స్‌కి ఏమిచ్చినా అదికూడా ఆ పాఠశాలకి యిచ్చేస్తాను. ఇది ఆ విశ్వవ్యాపక, శుద్ధచైతన్యశక్తిపట్ల వివేచనతో, శ్రద్ధతో చేసిన కృషివలన నాకు కలిగిన సంపద. దీనిపై మోహం వీడి సద్వినియోగం చేయటమే సముచితం. తల్లి దయతో కటాక్షించి ఇచ్చినదాన్ని ఆ తల్లిబిడ్డల ఉన్నతికి వినియోగించుటమే ఆ తల్లికి నిజమైన ఉపాసన కదా? ఏమంటావ్ అమ్మమ్మా?” అని ఆగి …
శారద కళ్ళనుండి ధారగా స్రవిస్తున్న కన్నీటిని లేచి వెళ్ళి వేలితో తుడిచి…
“నీకు నా చదువు అయిపోయాక ఉద్యోగం చేసి సంపాదించి బోలెడు డబ్బు ఇస్తాను. ఇకపై కూడా ఇలా జ్ఞాన, ధర్మ, ఆధ్యాత్మిక సంబంధిత విషయాల అధ్యయనం చేస్తూ, ఆ జ్ఞానాన్ని భావితరానికి అందించే నా ప్రయత్నం కొనసాగిస్తాను. ఆ మార్గంలో నాకు వచ్చిన ప్రతి పైసా ధర్మకార్యాలకే వినియోగిస్తాను అమ్మామ్మా!” అంటున్న కళ్యాణ్‍ని దగ్గరగా తీసుకుని..
“నాకు నీ సంపాదన ఎందుకురా? ఎంతగా ఎదిగి పోయావురా! ఎంత ధర్మమైన ఆలోచన. నీ సంస్కారానికి, నీ తత్వ విచారవిధానానికి, నీ విచక్షణాశక్తికి ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలిగి ఆనందభాష్పాలు ఇవి. ఆ ఆదిశంకరులే నీ రూపంలో వచ్చి మాట్లాడుతున్నారా అనిపించింది. మీ అమ్మా, నాన్నా ఉంటే ఎంత పొంగిపోయేవారో! ఇక పరవాలేదురా. నేనెప్పుడు పోయినా నీగురించి నాకు బెంగ లేదు. ఆ తల్లే నిన్ను నడిపిస్తుందని ఆవిడే స్వయంగా ఈరోజు నీమాటలద్వారా, చేతలద్వారా నాకు తేటతెల్లం చేసింది. నా రెండుచేతులు జోడించి ఆ అమ్మల గన్న యమ్మకు నమస్కరిస్తూ, నిన్ను అభీష్ట సిద్ధిరస్తూ అని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను నాన్నా!” అంటూ ఎంతో భావోద్వేగంతో కళ్యాణ్ తల పై తన చేతిని ఉంచింది.
“మంచి ఆలోచన రా. అలాగే కానిద్దాం. వస్తాను వదినా!” అని లేచి శాస్త్రి “ధన్యజీవులు. శ్రీమాత కృపాపాత్రులు వీళ్ళు” అని మనసులో అనుకుంటూ బయటికి నడిచాడు.