సార్వభౌముడు by S Sridevi

  1. వంటింటి కిటికీ by S Sridevi
  2. పగుళ్ళు by S Sridevi
  3. స౦దిగ్ధపు రహదారులు by S Sridevi
  4. కోడలొచ్చింది by S Sridevi
  5. అతనిష్టం by S Sridevi
  6. ఆమె విజేత కాదు by S Sridevi
  7. యుద్ధదృశ్యం by S Sridevi
  8. బేబీ ఆఫ్ అర్చన by S Sridevi
  9. తరంగనాట్యం by S Sridevi
  10. చిట్టికి క్షమార్పణలతో by S Sridevi
  11. ఇంకో మజిలీకి by S Sridevi
  12. అధిరోహణం by S Sridevi
  13. లివింగ్ టుగెదర్ by S Sridevi
  14. గుమ్మడి గింజలు by S Sridevi
  15. బంగారుపంజరం by S Sridevi
  16. చీకట్లో పూసిన పూలు by S Sridevi
  17. గినీ పిగ్స్ by S Sridevi
  18. మలయమారుతం by S Sridevi
  19. సార్వభౌముడు by S Sridevi
  20. అమ్మానాన్నలు by S Sridevi

ప్రపంచం చాలా అందమైనది. ప్రేమలూ, అనుబంధాలూ ఒకరి మనసులోంచీ ఇంకొకరి మనసులోకి పూలతీగల్లా అల్లుకుపోయి వుంటాయి. నీకోసం నేనున్నాననే భావన మనసుని బలపరిచి నైతికతని అలవరుస్తుంది.
ప్రపంచం చాలా చాలా అందమైనది. కానీ అందులో వుండే మనిషే దాన్ని ధ్వంసం చేస్తున్నాడు. నీకోసం ఎవరూ లేరనే భావనని సృజించి, పూలతీగల్లా అల్లిబిల్లిగా ఒకరినుంచీ ఇంకొకరికి అల్లుకోవలసిన అనుబంధాలని తుంచేసి, ఎడారిగా మారుస్తున్నాడు.
పై రెండూ నిజాలే.

నాన్నెక్కడ?
ఈ ప్రశ్న నాలుగేళ్ళ సిద్ధూని గత కొద్దిరోజులుగా బాధపెడుతోంది. వాడిలో ఒక వెతుకులాట మొదలైంది.
పిల్లిలాంటి మెత్తటి అడుగుల చప్పుడు విని ఫైల్లోంచి తలెత్తాడు రాఘవరావు. అప్పటికే లోపలిదాకా వచ్చి, టేబుల్ అంచు పట్టుకుని కుర్చీలోకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు మనవడు సిద్ధూ.
“ఏంట్రా నాన్నా?” ఫైలు పక్కనపెట్టి ఆప్యాయంగా అడిగాడు రాఘవరావు.
“డాడీకి ఫోన్ చెయ్యాలి” అన్నాడు సిద్ధూ సీరియస్‍గా. చిన్న నిట్టూర్పొకటి రాఘవరావు గొంతులోంచి వెలువడింది.
అతనికి ఇద్దరు కూతుళ్ళు. చిన్నకూతురూ, అల్లుడూ ముంబైలో వుంటారు. పెద్దల్లుడు ఈమధ్యే అమెరికా వెళ్ళాడు. కూతురొచ్చి ఇక్కడ వుంటోంది, తనకీ సిద్ధూకీ వీసా వచ్చేదాకా విడిగా ఎందుకని.
సిద్ధూ తండ్రి వుదయ్. అతను ఇండియాలో వున్నప్పుడు బెంగుళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేసేవాడు.
పల్చటి ఎర్రటి పెదాలు, చురుకైన కళ్ళు, ప్రస్ఫుటంగా కనిపించే చెవులు… చాలా ముద్దొస్తుంటాడు సిద్ధూ. తండ్రి ఇండియాలో వున్నప్పుడు రెండుసార్లు ఐక్యూ టెస్టుల్లో పాల్గొని సూపర్‍కిడ్ ప్రైజులు తెచ్చుకున్నాడు. ఒక యాడ్‍ఫిల్మ్‌లో కూడా నటించాడు. కంప్యూటర్ని ఆన్ చెయ్యటం, ఆఫ్ చెయ్యటం రెండేళ్ళవయసునుంచే వాడికి తెలుసు. తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నీ నేర్పేవాడు. ఎక్కడికెళ్ళినా ఏం చేసినా ఇద్దరూ కలిసే చేసేవారు.
రెండున్నరేళ్ళకి సిద్ధూని ప్రీనర్సరీలో వేసారు. తెల్లగా బొద్దుగా చురుగ్గా వుండేవాడేమో స్కూల్లో ఆకర్షణ వీడే. అలాంటి పిల్లవాడు తండ్రి అమెరికా వెళ్ళడంతో తల్లితో ఇక్కడికొచ్చాడు. అప్పటిదాకా తండ్రికి నీడలా వుండేవాడు, ఇప్పుడు తండ్రి కనిపించకపో వటంతో సర్వం కోల్పోయినట్టు అతనికోసం వెతుకులాడుతూ తన ఆఫీసులోనూ ఇంట్లోనూ తిరుగుతూంటే రాఘవరావుకి గుండెకోతగా వుంటోంది.
కిలకిలా నవ్వుతూ అల్లరిచేస్తున్నవాడల్లా హఠాత్తుగా గుర్తొచ్చినట్టు “నాన్నేడి?” అనడిగి, “అమెరికా వెళ్ళాడు” అనే జవాబు విని నిరాశగా చూస్తుంటే కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుతుర్లోంచీ చిమ్మచీకట్లోకి నెట్టివెయ్యబడినవాడిలా కనిపిస్తాడు వాడతని కళ్ళకి.
ఎస్టీడీ లాక్ చేసి, ఫోను సిద్ధూ ముందుకి తోసాడు రాఘవరావు. వాడు ఏవేవో నెంబర్లు నొక్కి అవతల్నుంచీ వచ్చిన ఎక్స్ఛేంజివాళ్ళ మెసేజీ విని అర్ధంకాక పెట్టేసాడు. రెండు నిముషాలాగి రీడయల్ బటన్ నొక్కి, మళ్ళీ అదే రావడంతో పెట్టేసాడు. నాలుగైదుసార్లలా చేసాక నిరుత్సాహంగా ఫోన్ దూరంగా నెట్టేసి, లేచాడు. రాఘవరావు చిన్నగా నిట్టూర్చాడు. సిద్ధూ డయల్ చేసిన నెంబరు బెంగుళూర్లోని వాళ్ళింటిదే. వాడికి తండ్రి అమెరికాలో వుండటానికీ, అతను బెంగుళూర్లో వున్నప్పుడు తల్లితో కలిసి తనిక్కడికి రావడానికీగల తేడా పెద్దగా అర్థమవలేదు. ఆ ఎడబాటుని మాత్రమే గుర్తిస్తున్నాడు. సీట్లోంచీ లేచి వాడినెత్తుకుని ఇవతలికొచ్చాడు రాఘవరావు.
“తాతా!” అన్నాడు రోడ్డుమీదికొచ్చాక.
“ఏంట్రా తాతా?”
“చాక్లెట్”
కొంచెం రొంపగా వున్నాడు. దగ్గుకూడా వస్తుందేమోననిపించినా, కాదంటే ఏడుస్తాడేమోనని కొనిచ్చాడు.
ఆఫీసునుంచీ ఐదునిముషాల నడక ఇంటికి. ఇల్లు చేరగానే సిద్ధూ తాత చేతుల్లోంచీ జారి లోపలికి పరిగెత్తాడు. వాడి అలికిడికి లోపల్నుంచీ రాఘవరావు భార్య వచ్చింది.
“పద్మేది?” కూతురి గురించి అడిగాడు.
“తలనొప్పని పడుకుంది” రాజ్యలక్ష్మి జవాబిచ్చింది.
“ఈవేళప్పుడు పడుకోవడమేమిటి? తలనొప్పి ఇంకా ఎక్కువవుతుంది. ఏదేనా సినిమాకి వెళ్ళకపోయారా?” అన్నాడు.
“ఎన్ని సినిమాలని చూస్తాం? టీవీలో వచ్చేవే ఎక్కువ. ఇంకా థియేటర్‍కి వెళ్ళేం చూస్తాం?”
“పోనీ అలా శివరావుగారింటికో, చంద్రసేన్‍గారింటికో వెళ్ళాల్సింది. పద్మ ఫ్రెండ్స్ కూడా వుండాలిగా ఈవూళ్ళో? నలుగురితో కలిస్తే కొంత దిగులు తగ్గి సరదాగా వుంటుంది”
కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు రాజ్యలక్ష్మి. తర్వాత నెమ్మదిగా అంది “అందరికీ ఈ అమెరికా పిచ్చి బాగా పట్టుకుంది. ఎక్కడికెళ్ళినా ఇదే గొడవ. మా వాడికి ముప్ఫైకే ఇస్తారు.. మావాడు అక్కడ సిస్టమ్స్‌ఎనలిస్ట్.. వెళ్ళగానే జాబ్ దొరికింది.. అని వాళ్ళగురించైనా చెప్పుకుంటారు. లేకపోతే మీ ఉదయ్‍కి ఇంకా ప్లేస్‍మెంట్ దొరకలేదా? మరక్కడేం చేస్తున్నాడు? ఎందుకట అక్కడుండటం? తిరిగొచ్చేస్తాడటనా? అని గుచ్చిగుచ్చి మనగురించైనా అడుగుతారు. ప్రస్తుతం మనం వున్న పరిస్థితిలో రెండింటిలో దేన్నీ తట్టుకోలేం”
రాఘవరావు సుదీర్ఘంగా నిశ్వసించాడు.
“పద్మనీ, సిద్ధూనీ చూస్తుంటే బాధేస్తోందండీ! ఇద్దరికిద్దరూ అతనికోసం బెంగపెట్టుకున్నారు” అంది రాజ్యలక్ష్మి తనే మళ్ళీ.
తన ఆలోచనలకి బలం చేకూరినట్టైంది రాఘవరావుకి.
“నువ్వు చెప్పు లక్ష్మీ, ఇప్పుడతనికి అమెరికా వెళ్ళి సంపాదించుకు రావాల్సిన అవసరమేంటో? మనకి పాతికలక్షలకి పైగా వుంది. ఫైనాన్స్ కంపెనీ మంచిస్థితిలో వుంది. మన తర్వాత అదంతా పిల్లలకేనా? అటు అతని తండ్రింకా సర్వీసులో వున్నాడు. సంపాదించిపెడ్తున్నాడు. చేస్తున్న ఉద్యోగం వదులుకుని ఎందుకెళ్ళినట్టు? ఇక్కడ లేనిదేమిటి? అక్కడున్నదేమిటి? అంతగా చూడాలనుకుంటే విజిటింగ్ వీసా తీసుకుని వెళ్ళొస్తే సరిపోయేది!!” తన ఆవేదనంతా వ్యక్తపరిచాడు.
“గట్టిగా అనకండి. పద్మ వింటే బాధపడుతుంది” అంది రాజ్యలక్ష్మి.
ఆమెకీ అలాగే వుంది. అందర్నీ ఒకేలా బాధపెడుతున్న విషయం, ఉదయ్‍ని తీసుకెళ్ళిన కన్సల్టెన్సీ మూతపడింది. ఇక్కడి జాబ్ వదిలేసి స్వంతపూచీమీద వెళ్ళాడు. అతనికిప్పుడు వుద్యోగం లేదు. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలీదు. ఫ్రెండ్స్ దగ్గరుంటున్నానని చెప్పాడుగానీ వివరాలు తెలీవు. ఫోన్ చేసినా అతనే చెయ్యాలి.
ఇంతలో పద్మ గదిలోంచి వచ్చింది. ఎర్రగా వుబ్బి వున్న ఆమె ముఖం చూస్తుంటేనే ఇద్దరికీ అర్థ మైంది… చాలాసేపు ఏడ్చిందని. “ఏంటి పద్మా ఇది? అతనేమైనా అడవులుపట్టిపోయాడా? చూద్దాం. ఫ్రెండ్స్ దగ్గరున్నానని చెప్పాడా? తిరిగొచ్చెయ్యమని చెప్పాం. వచ్చేస్తాడేమో! అక్కడ అతని ప్రయత్నాలేమిటో? నువ్వే ఇలా దిగులు పడితే సిద్ధుగాడికెలా వుంటుంది? ఎప్పుడూ తండ్రిని వదిలిపెట్టి వున్నవాడు కాదు. వాడిని బుజ్జగించాల్సినదిపోయి?!!” అని కోప్పడి, “పోనీ, ముంబై టికెట్స్ బుక్ చెయ్యనా? అక్కడో నాలుగురోజులుండి వద్దురుగాని… మార్పుగా వుంటుంది. రమ కూతుర్ని చూస్తే వీడికీ సరదాగా వుంటుంది?” అనడిగాడు రాఘవరావు.
“ఇప్పుడెక్కడికీ వెళ్ళాలని లేదు నాన్నా! ముక్తసరిగా జవాబిచ్చింది పద్మ. భార్యాభర్తలిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. పద్మ తల దించుకుంది. తన పరిస్థితి తనకే ఆశ్చర్యంగా వుంది. ఇక్కడ తను పుట్టింది, ఇదే తనిల్లనే భావనతో ఇరవైరెండేళ్ళు పెరిగింది. అలాంటిది ఇప్పుడెందుకని ఇక్కడుండాలంటే సంకోచంగానూ, ఇబ్బందిగానూ అనిపిస్తోంది? పెళ్ళయ్యాక కూడా ఎన్నోసార్లు వచ్చిందిక్కడికి. వారమేసి రోజులు వుండి వెళ్ళేది. అప్పుడు కూడా సరదాగానే వుంది. కానీ ఈసారి మాత్రం అలా లేదంటే…? తనున్న అనిశ్చితి.. ఆశనిరాశల మధ్య ఊగిసలాట… అదే తనని బాధిస్తోందని గ్రహించాక కొద్దిగా సర్దుకుంది.
“ఉదయ్ ఫోన్ చేస్తే… నేనిక్కడ లేకపోతే బాధపడతాడు. అదీగాక మేం యూయస్ వెళ్ళాలంటే ఎలాగా ముంబైమీంచే వెళ్ళాలి. అప్పుడు ముందే వెళ్ళి వాళ్ళనికూడా కలుస్తాం” అని సర్దిచెప్పింది.
“సాయంత్రం ఎగ్జిబిషన్‍కి వెళ్దామనుకుంటున్నాం. మీరూ రాకూడదూ?” అడిగింది రాజ్యలక్ష్మి మాట మారుస్తూ. రాఘవరావు తలూపాడు. సిద్ధూ వచ్చాడక్కడికి.
“సాయంత్రం ఆచ్చి వెళ్దామా?” వాడిని దగ్గరకు తీసుకుని అడిగింది పద్మ. “మనింటికి వెళ్ళిపోదాం” సీరియస్‍గా జవాబిచ్చాడు వాడు. తన సమస్యకన్నా వాడి సమస్య పెద్దది. ఇది తను పుట్టిపెరిగిన వూరు, ఇల్లు. మనసులో ఆ కాస్త దిగులూ లేకపోతే ఇక్కడికి రావడం తనకెంతో
ఉల్లాసాన్నిస్తుంది. కానీ సిద్ధూకి ఈ ఇంటితో పెద్దగా ఎలాంటి అనుబంధం లేదు. ఇంకా ఏర్పడ లేదు. తాతగారిల్లు. కొద్దిరోజులు రావటం మాత్రమే అనుభవం. ఇక్కడ వాడికి స్నేహితులు లేరు. స్కూలు లేదు. వాడిని నవ్విస్తూ తిరిగే ప్రపంచమూ లేదు. ఇక్కడే వుండాలంటే చిరాగ్గా వుంది. అదే సమయాన వాడికి అతిముఖ్యమైన వ్యక్తి కనిప దు. ఈ రెండు సమస్యలనీ ఎదుర్కోవడం వాడికి చాలా పెద్ద బాధ.
ఎగ్జిబిషన్ గురించి వూరించి చెప్పింది పద్మ. చాలాసేపటికి వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకున్నాడు వాడు.
సాయంత్రం కార్లో బయల్దేరారు నలుగురూ. పద్మా, రాజ్యలక్ష్మి వెనక కూర్చుంటే తాత పక్కన ముందు సీట్లో కూర్చున్నాడు సిద్ధూ. క్లచ్చి నొక్కడాన్నీ, యాక్సిలేటర్ రెయిజ్ చెయ్యడాన్ని వాడు గమనిస్తుంటే రాఘవరావుకి అర్థమైంది, వాడికీ డ్రైవ్ చెయ్యాలనుందని. బెల్టు అడ్డొచ్చి ఆగాడు. నవ్వొచ్చింది. అల్లుడైతే ఈపాటికి నేర్పేవాడేనేమో!
“వేలెడు లేదు, వీడి బుర్రలో ఎన్ని ఆలోచనలో?” అన్నాడు పెద్దగా నవ్వుతూ.
“ఏంటట?” తనూ నవ్వుతూ అడిగింది రాజ్యలక్ష్మి.
“నన్ను లేవగొట్టి, ఇక్కడికి చేరదామని చూస్తున్నాడు”
“ఇప్పటి పిల్లలకి పుట్టి సగం పుట్టక సగం తెలివితేటలొస్తున్నాయి”
ఇంతలోనే ఎగ్జిబిషన్‍గ్రౌండ్‍కి చేరుకున్నారు. అంతమంది జనాన్నీ, ఆ లైట్లనీ, కోలాహలాన్నీ చూసాక సిద్ధూలో కొంత ఉత్సాహం మొదలైంది. తాత చెయ్యి పట్టుకుని చకచకా నడవడం ప్రారంభించాడు. పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తూ అందులో లీనమైపోయాడు. ప్లేన్ బొమ్మా, కోతి బొమ్మా కొనిచ్చాడు రాఘవరావు. షుగర్‍కేండీ, పాప్‍డ్ కార్న్, బిస్కెట్స్.. ఏదడిగినా కాదనలేదు. “పిల్లలు పాడయేది ఇలానేకదా!” అనిపించింది కాసేపు. తండ్రి దగ్గరకు పంపించేదాకానే! అని సర్ది చెప్పుకున్నాడు.
రంగులరాట్నంలో మనవడితోపాటు ఎక్కి కూర్చుంటే రాజ్యలక్ష్మి నవ్వింది. “పేరు వీడిది. సరదా మీకే ఎక్కువగా వుందే!” అని వెక్కి రించింది. ఆమె అలా అన్నందుకు మరోచోట వద్దంటున్నా ఆమెను ఎక్కించారు తండ్రీకూతుళ్ళు.
“పద్మా! మనం జెయింట్‍వీల్ ఎక్కుదాం పద” అన్నాడు కూతుర్తో. రాజ్యలక్ష్మికీ వాళ్ళ చిన్నకూతురికీ భయం. అందుకని ఎప్పుడూ వీళ్ళిద్దరే ఎక్కేవాళ్ళు, ఇప్పుడు పద్మతో సిద్దూ తయారు. “కళ్ళు తిరుగుతాయిరా!” రాజ్యలక్ష్మి భయపడింది. అయినా వాడు వినలేదు. ఎక్కాక కొంచెం కూడా భయపడలేదు. “వీడిదంతా నా పోలిక” గర్వంగా అన్నాడు రాఘవరావు.
పద్మ నవ్వింది. జెయింట్‍వీల్ సగంలో వుండగా సన్నగా తుంపర మొదలైంది. “అయ్యో, తడిసిపోతాడేమో!” పద్మ సిద్ధూకి తన పైటకొంగు కప్పింది.
ఆపమన్నట్టు ఆపరేటర్‍కి సౌంజ్ఞ చేసి చెప్పాడు రాఘవరావు. రెండునిముషాలకి పైనే పట్టింది అది ఆగి, వీళ్ళు దిగడానికి. ఆసరికి వాన బాగా పెద్దదైంది. ఎక్కడా షెల్టరన్నది లేదు. అక్కడా ఇక్కడా ఏవో షెడ్లున్నా జనం నిండిపోయారు. సిద్ధూనెత్తుకుని రాఘవరావు కారు దగ్గరికి పరిగెత్తాడు. వెనక పద్మా, రాజ్యలక్ష్మీ వచ్చారు. రాజ్యలక్ష్మి టవల్ తీసుకుని మనవడి తల గట్టిగా తుడిచింది. అసలే జలుబుగా వున్నాడేమో, వానలో తడిసేసరికి అది కాస్త ఎక్కువై వరసగా తుమ్ములొచ్చాయి వాడికి. దారిలో తెలిసిన పిల్లలడాక్టరుంటే ఆపి, వాడిని చూపించి, పక్కనే వున్న మందులదుకాణంలో మందులు కూడా కొనుక్కుని వచ్చాడు రాఘవరావు.

ఆరాత్రి నిద్రపోయేముందు తల్లినడిగాడు సిద్ధూ “నాన్న కావాలమ్మా!” అని. పద్మ గుండెల్లో కలుక్కుమంది. వాడిని దగ్గరకు తీసుకుంది. ముద్దుపెట్టుకుంది. గుండెలమీద పడుకోబెట్టుకుని జోకొట్టింది. అమెరికా గురించి ఎన్నో కబుర్లు చెప్పింది. అమ్మ ఈ విషయంలో ఏమీ చెయ్యలేదని, నాన్నని తెచ్చివ్వలేదని అర్థమైంది వాడికి.
తామే అక్కడికి వెళ్ళబోతున్నామని గట్టిగా అనలేకపోయింది. ఆమెకి తెలుసు, తెలివైనపిల్లల్తో చాలా కష్టమని. వాళ్ళు గాజులాగా పెళుసుగా వుంటారు. తమపట్ల జరిగిన ఏ చిన్న పొరపాటుని వాళ్ళు గుర్తించినా పరిణామాలు సంక్లిష్టంగా వుంటాయి.
మందులన్నీ వేసినా సిద్ధూకి మధ్యరాత్రికి సన్నగా జ్వరం మొదలైంది. అది వానలో తడవడంచేతనో, చాక్లెట్స్ తిన్నందుకో వచ్చిన జ్వరం కాదు. వాడి చిన్ని మనసులో వున్న గుబులు ఆ రకంగా బయటపడింది.
ఉదయాన్నే రాఘవరావు వాడిని మళ్ళీ డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళాడు. ఆయన అవే మందులు ఆరోజుకి వాడమనీ, తగ్గకపోతే మారుస్తాననీ చెప్పాడు. సాయంత్రానికి టెంపరేచరు పెరిగింది. డాక్టరు మందులు మార్చడంతోపాటు టెస్టులు రాసాడు. ఆరోజు అతికష్టమ్మీద గడిచింది. జ్వరం నూటమూడుకి చేరుకుని స్థిరంగా వుండిపోయింది.
హాస్పిటల్లో చేరిస్తే మంచిదన్నాడు డాక్టరు. ఇంటిదగ్గరైతే ఉదయ్ దగ్గర్నుంచి ఫోన్ వస్తే సిద్ధూని మాట్లాడించవచ్చంది పద్మ, మరోసారి ఫోన్ చేయడానికి అతని దగ్గర డబ్బు వుంటుందో, వుండదో … చాలా ఆలోచించాల్సిన విషయం.
ఇంట్లోనే ఉండేట్టయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, మందులు టైం తప్పకుండా వెయ్యాలనీ చెప్పి ఏ టైంలోనైనా అవసరమై ఫోన్ చేస్తే వచ్చి చూస్తానని చెప్పి వెళ్ళాడు డాక్టరు.
వియ్యంకుడికి ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు రాఘవరావు. ఆయన ఆదుర్దాపడి భార్యతో కలిసి వెంటనే వస్తున్నానని చెప్పాడు. జ్వరతీవ్రతతో ఎర్రగా కందిపోయి, తెలివి లేకుండా మంచంలో ఉన్నాడు సిద్ధూ. రాత్రివేళ వాడి పెదాలు అస్పష్టంగా కదులుతుంటే ఏమిటోనని జాగ్రత్తగా వింది పద్మ.
“నాన్న… నాన్న…”
ఆమెకి ఏడుపొచ్చింది.
రాఘవరావుకైతే బాధా, కోపం రెండూ వచ్చాయి. “అసలు పిల్లలంటే ఏమిటనుకుంటున్నారమ్మా మీరు? ఆటబొమ్మల్లా మీకు ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నారా? వాళ్ళెంత అనుబంధాన్ని పెంచుకుంటారో మీకేం తెలుసు? అమెరికా వెళ్ళే ఆలోచన అతనికి ఉన్నప్పుడు ముందునించే పిల్లవాడిని కొంచెం ఎడం చెయ్యక్కర్లేదా? ఇక్కడున్నంతకాలం వాడిని నెత్తిన పెట్టుకుని తిరిగాడు. ప్లేనెక్కే ఆఖరి నిముషందాకా వాడిని వదల్లేదు. ఒక్కసారిగా కనిపించకుండాపోతే వాడి పరిస్థితేమిటి? ఎంత బెంగ ఉంటుంది? ఇదాలోచించరేం మీరు? ఎంతసేపూ మీ సరదా, మీ సంతోషం…. అంతే! మీకు ముద్దొచ్చినప్పుడూ, తీరిక ఉన్నప్పుడూ పిల్లాడొచ్చి సంతోషాన్ని కలిగించాలి. సమస్యలొస్తే దూరంగా ఉండాలి. కనీసం పిల్లాడికోసమైనా ఫోన్ నెంబర్ ఇవ్వక్కర్లేదా?” ఆవేశంగా అనేసాడు.
” దీన్నంటారేమిటి, మధ్యలో?” రాజ్యలక్ష్మి కోప్పడింది రాఘవరావుమీద.
“అననివ్వమ్మా! నాన్నేం తప్పుగా అనడంలేదు. ఎంతసేపూ మేం ఇంకా సంపాదించుకోవాలి, సౌకర్యంగా, విలాసవంతంగా బ్రతకాలనే ఆలోచించుకున్నాంగానీ మధ్యలో వీడు నలిగిపోతున్నాడనుకోలేదు” అంది పద్మ ఏడుస్తూ.
“సారీ పద్మా! నిన్ననాలని కాదు. ఇలాంటివి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనచేతుల్లో ఏముందో చెప్పు? లక్షకాదు, రెండులక్షలు ఖర్చుపెట్టైనా ఇప్పటికిప్పుడు అతని దగ్గరికి తీసుకెళ్ళి చూపించే వీలు లేదు. అతనికేనా వచ్చే వీలులేదు” చెమ్మగిలిన కళ్ళు చేత్తో తుడుచుకుంటూ అన్నాడు రాఘవరావు.
డాక్టర్‍కి ఫోన్ చేస్తే వచ్చి చూసాడు. ఆరోజు గడిస్తేనేగానీ ఏ సంగతీ చెప్పలేనన్నాడు. ఉదయ్ తల్లిదండ్రులొచ్చారు. సిద్ధూని చూసి ఇద్దరూ బాధపడ్డారు. కోడలిని దగ్గరికి తీసుకుని కంట తడిపెట్టింది ఉదయ్ తల్లి. బల్లిలా మంచానికతుక్కుపోయిన మనవడ్ని వళ్ళోకి తీసుకుని
ఏడ్చింది.
ఉదయ్ తెల్లవారుతుంటే ఫోన్ చేసాడు. “నువ్వు పంపిన ఈ మెయిల్ ఇప్పుడే చూసాను. ఎలా ఉంది వాడికి? ఒక్కసారి ఫోన్ దగ్గరకి
తీసుకురా?” అన్నాడు పద్మతో. పద్మ సిద్ధూని ఎత్తుకుని ఫోన్ దగ్గరికి తీసికెళ్ళింది. జ్వరతీవ్రతలోనూ, మందుల ప్రభావంవల్ల మత్తులోనూ కూరుకుపోయిన వాడికేం వినిపించలేదు. తల్లి భుజమ్మీద వాలి నిద్రపోతూనే ఉండిపోయాడు. ఉదయ్‍కి అదే చెప్పిందామె.
“అరరే! అంత జ్వరం ఎలా వచ్చింది? సరైన డాక్టర్‍కి చూపిస్తున్నారా? మా అమ్మావాళ్లకి ఫోన్ చెయ్యకపోయావా?” అన్నాడు.
“వాళ్ళిక్కడే ఉన్నారు” చెప్పింది. “నువ్వొచ్చెయ్ ఉదయ్! నాకీ పరిస్థితి బాధనిపిస్తోంది. నువ్వక్కడా, మేమిక్కడా. నీకక్కడ ఉద్యోగం ఉండి ఇంకో నెలకో ఆరునెల్లకో మనం కలుసుకుంటామంటే అది వేరే విషయం. ఎంతకాలమిలా?” పొంగివస్తున్న ఏడుపుని ఆపుకుంటూ అంది.
“నీకు మీ అమ్మావాళ్ళింట్లో బాగాలేకపోతే మా ఇంటికెళ్ళు. అంతేగానీ మతిలేని మాటలు మాట్లాడకు. అంత ఖర్చుపెట్టుకుని ఇక్కడికొచ్చింది అసమర్ధుడిలా తిరిగి రావడానికా?” అని చిరాగ్గా ఫోన్ పెట్టేశాడు.
“ఏమంటాడు? మాకివ్వకుండా పెట్టేసావేం?” పద్మ మామగారు అడిగారు.
“తనే పెట్టేసారు. అతన్నొచ్చెయ్యమనండి మామయ్యా! ఉద్యోగం లేకుండా అక్కడెందుకు? ఫ్రెండ్స్ దగ్గరున్నానంటున్నారు. ఏ ఫ్రెండ్స్ మాత్రం ఎంతకాలం చూస్తారు?” అంది బ్రతిమాలుతున్నట్లు.
“అక్కడవాడికయ్యే ప్రతిడాలరు ఖర్చూ ఇక్కడ మీ మామగారు రూపాయల్లో వాడి ఫ్రెండ్ తండ్రికి లెక్కకట్టి ఇస్తున్నారు” అంది ఉదయ్ తల్లి. “మా వాటాకి వచ్చేదాంట్లోంచి తగ్గించండి” అంది పద్మ.
“ఇప్పటికే ప్రణయ్, తమ్ముడికి అమెరికా ట్రిప్ పేరు చెప్పి చాలా ఇచ్చారు, మేం ప్లాట్ కొనుక్కుంటాం, మాకూ ఇవ్వండని తెగ నసుగుతున్నాడు. ఉన్నదంతా ఇప్పుడే మీకిచ్చేసి మేమేం తినాలి?”
వాళ్లమాటలకి పద్మే కాదు, ఆమె తల్లిదండ్రులు కూడా హతాశులయ్యారు.
ఒకవైపు సిద్ధూకిలా ఉంటే ఒక్కరికీ పట్టినట్లు లేదనే బాధ. వాడికేదైనా జరిగితే అంతరాత్మకి జవాబు చెప్పుకోగలమా అని గిజగిజలాడిపోయారు. లక్షల్లో ఖర్చుచేసి పద్మకి పెళ్ళిచేసిన తను మళ్ళీ ఇంకో అంత ఖర్చుచేసి అల్లుణ్ణి వెనక్కి తీసుకురాగలడా? అని తనకున్న సాధ్యాసాధ్యాలగురించికూడా ఆలోచించాడు రాఘవరావు. అల్లుడికి అన్న ఉన్నట్టే పద్మకీ చెల్లెలుంది. చిన్నకూతురిపరంగా సమస్యలు ఉత్పన్నమౌతాయనిపించింది. ఇంక ముందుకి ఆలోచించలేదు.
మరి సిద్ధూ అంతరంగానికి పెద్దవాళ్ళ నిస్సహాయతే అర్ధమైందో మరే అద్భుతం జరిగిందోగానీ జ్వరం దిగింది.
“ఉత్తుత్తి జ్వరానికి మీరు కంగారుపడి మమ్మల్ని హడలగొట్టారు. ఈపాటిదానికి వాడిని తిరిగొచ్చేయ్యమని గొడవకూడాను. ఇక్కడ ఉద్యోగం వదిలేసి వెళ్ళాడు. తిరిగొచ్చేస్తే ఏం తింటారు?” అని విసుక్కుని తిరుగు ప్రయాణముయ్యాడు పద్మ మామగారు. ఇంకో రెండురోజులుండి వస్తానంది పద్మ అత్తగారు. అలాగే రెండురోజులుండి సిద్ధూ పథ్యం తిన్నాక వెళ్ళిపోయింది. వారంరోజులు పట్టింది సిద్ధూ లేచి తిరగడానికి.
మృత్యుముఖందాకా వెళ్ళొచ్చిన కొడుకుని చూసి పద్మలో నిర్లిప్తత పేరుకుంది. అది అనుభవించినవాళ్ళకే తెలుస్తుంది. వాడు లేచి తిరుగుతున్నాడు, అంతే చాలుననిపించింది.
ఉదయ్ మళ్ళీ ఫోన్ చేశాడు. “తగ్గిందటగా సిద్ధూకి? అనవసరంగా అందర్నీ కంగారుపెట్టేసావని నాన్న చెప్పారు” అన్నాడు.
“ఔనేమో!” అంది అదే నిర్లిప్తతతోటి. వాడు తన కొడుకు. కాబట్టి తనకి కంగారుంటుంది. తన కొడుకు కాబట్టి తన తల్లిదండ్రులకీ ఉంటుంది. ఎక్కడో దూరాన ఉన్న అతనికి వాస్తవం తెలీదు. తను చెప్పినదానికన్నా అతనివాళ్ళు చెప్పినవి చాలా నమ్మదగ్గనిగా అనిపిస్తాయి.
“ఆస్థి పంపకాల గురించి మాట్లాడావట? చాలా బాధపడుతున్నారు. పద్మా! ప్లీజ్, అర్థంచేసుకోవడానికి ప్రయత్నించు. ఇక్కడ నాకుకూడా నువ్వూ వాడూ ఎంత గుర్తొస్తున్నారో తెలుసా? మిమ్మల్ని వదిలిపెట్టి నేను సంతోషంగా ఉన్నాననా? ఫ్రెండ్స్‌కి ఇంటిపనులూ, వంటా చేస్తూ ఖర్చులకి సంపాదించుకుంటున్నాను. రాత్రులు పెట్రోల్‍బంక్‍లో చేస్తున్నాను. ఐనా చాలినంత రావడంలేదు. మిగిలినది నాన్న యిస్తున్నారు. ఇంత ఖర్చుపెట్టీ, శ్రమపడీ వెనక్కి తిరిగిరావడమంత తెలివితక్కువ పని ఇంకొకటుండదు”
ఎవరు చెప్పాలతనికి? ఎలా చెప్పాలతనికి? ఇరవైనాలుగంటల బిజీ షెడ్యూల్లో అతను తమని గుర్తుచేసుకోవటానికీ, అతనే లోకంగా పెరిగిన సిద్ధూ పైకి వ్యక్తపరచలేని లేతమనసుతో అతనికోసం బెంగపెట్టుకోవడానికీ వుండే తేడా.
“బెంగుళూర్లో ఉన్నప్పుడెంత సంతోషంగా ఉండేవాళ్ళం ఉదయ్? అక్కడేదో ఉందనుకుని వెళ్ళావు. ఎండమావి అని తెలిసింది. ఇంకా అక్కడెందుకు?”
“కాస్త తెలివిగా ఆలోచించలేవా పద్మా? ఒకసారి తిరిగొస్తే మళ్ళీ ఇక్కడికి రాగలనా? కొంత కష్టమైనా ఓర్చుకుంటే ఏదో ఒక వుద్యోగం దొరకొచ్చు. జావాకి డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్ మళ్ళీ అందుకుంది”
“మనకున్నది చాలదా? ఇక్కడికొచ్చి మళ్ళీ ఏదో ఒక జాబ్లో చేరితే? నేనూ చేస్తాను. ఇద్దరం సంపాదిస్తే సరిపోదా?”
“సరిపోవడానికెక్కడికి?” నవ్వేడతను. “ముందు ఈ ఖర్చంతా మా నాన్నకి తిరిగివ్వాలి. అయినా ఎంతకాలం ఒకళ్ళకింద చేస్తాం? మాకు పాతికా ముప్పై ఇస్తూ అక్కడి ఫర్మ్స్ ఎంత దోపిడీ చేస్తున్నాయో తెలుసా?”
“అక్కడ లేదా దోపిడీ?”
“ఉన్నాగానీ….ఎంత సంపాదించినా ఇండియాలో మిగలదు. అదే ఇక్కడ? నెలకి వెయ్యిడాలర్లు మిగుల్చుకోగలిగితే నలభైవేల పైమాటే. అంతమొత్తం అక్కడ మిగల్చడం సాధ్యమేనా? అందుకే కొంత సంపాదించుకుని స్వంతంగా బిజినెస్ చెయ్యాలని వుంది. లేదూ ఈ అనుభవంతో ఇంకా ఎక్కువ జీతం వస్తుంది. ఇక్కడే వుండిపోగలిగితే మరీ మంచిది”
“మా నాన్న చేసే ఫైనాన్స్ బిజినెస్‍లో రమ భర్తకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ముంబై వదిలిపెట్టిరారు. నువ్వూ కొంత పెట్టుబడి పెట్టి…” ఆమె మాట పూర్తి కానేలేదు, అతను తుంచేసాడు. “బియ్యీ పాసైనవాడిని, వడ్డీ వ్యాపారం చెయ్యనా? నోవే…”
పద్మకి ఇంకా అతన్తో వాదించాలనిపించలేదు. రాజ్యమేలరా రాచబిడ్డడా అంటే రాళ్ళెత్తే పనే నాకు బావుంటుందనేవాడితో ఏం చెప్పగలదు? తనని కన్నవాళ్ళనీ, కట్టుకున్నదాన్నీ, తను కన్నవాడినీ అందర్నీ వదిలేసి ఎక్కడో ఇల్లూ వాకిలీ లేకుండా ఇతరుల దయాధర్మంమీద ఆధారపడి ఉంటానంటే ఏం చెయ్యగలదు? పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటిని సరిదిద్దుకోవడంలో ఉంటుంది మనిషి విజ్ఞతంతా. డబ్బు సంపాదించాలనుకోవడం తప్పుకాదు. ఇంకా ఇంకా సంపాదించాలనుకోవడం కూడా తప్పుకాకపోవచ్చు. కానీ అందుకు దారులు మూసేసి ఉన్నప్పుడు ఉన్నదాంతో సంతృప్తిపడడమనే మరోదారిలో వెళ్ళడం కూడా తప్పుకాదు.
“సిద్ధూ లేడా అక్కడ? వాడికి పూర్తిగా తగ్గిందా? ఏం చేస్తున్నాడు?” మాట మార్చి ఉదయ్ అడిగాడు. అక్కడే ఆడుకుంటున్న కొడుకుకేసి తలతిప్పింది పద్మ. వాడు చేస్తున్నపని ఆశ్చర్యాన్ని కలిగించింది. దాన్ని భర్తకి చెప్పకుండా వుండాలనిపించలేదు.
“వాడిప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. అక్కడికెళ్ళకముందు నువ్వు కొనిచ్చిన హేపీహోం బొమ్మలోంచీ నాన్న బొమ్మని తీసి మూలకి విసిరేసాడు. తర్వాత అమ్మ బొమ్మని చేత్తో పట్టుకుని తదేకంగా చూసి పక్కన పెట్టాడు. ఇప్పుడా ఇంట్లో అబ్బాయి బొమ్మొక్కటే ఉంది. వెంటనే తన చిన్న కుర్చీ తెచ్చుకుని దానికెదురుగా కాలిమీద కాలేసుకుని కూర్చున్నాడు. ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తోందో తెలుసా?… “
“వాడలా ఎందుకు చేసాడు?”
“అదే చెప్తున్నాను. మనిషి సృష్టించిన డబ్బు మానవసంబంధాలని వూచకోత కోసేసాక మిగిలి ఉన్న ప్రపంచమనే మహాసమాధికి ఎవరికి వారే సార్వభౌములని…”
“పద్మా! నీ కవిత్వం నాకేం అర్థంకావడం లేదు” అన్న ఉదయ్‍కి జవాబుగా, “నీకోసం బెంగపెట్టుకుని వాడు ఒంటరిగా చావుదాకా వెళ్ళొచ్చాడు. తను ఒంటరిగానే వెళ్ళాడన్న విషయాన్ని గుర్తించాడు. నాన్నెక్కడో దూరంగా ఉన్నాడనీ, పక్కనే ఉన్నా అమ్మేమీ చెయ్యలేదని కూడా గ్రహించాడు. ఎక్కడో ఉన్న నాన్న, ఏమీ చెయ్యలేని అమ్మ వాడికక్కర్లేదు. వాడి ప్రపంచాన్ని వాడే నిర్మించుకుని అందులో వాడొక్కడే ఉండాలన్న నిర్ణయాన్ని అన్యాపదేశంగా ప్రకటిస్తున్నాడనుకో”
“పద్మా!”
“సాన్స్ మెచ్యూరిటీ… పరిణతి లేనితనం … మనదే!”
“ప్లీజ్”
“తల్లితండ్రీ ఉన్నా లేకపోయినా స్వతంత్రంగా బ్రతకగలిగే పిల్లల ప్రపంచాన్ని మనం సృష్టిస్తున్నాం. నాకింక వాడి విషయంలో ఎలాంటి బెంగా లేదు. నువ్వెప్పుడు తిరిగిచ్చినా… ఇంక నీ ఇష్టం” అని ఫోన్ పెట్టేసింది.
(కథా పీఠం రచన:జూలై 2004)